Thursday, December 28, 2017

'మేము ఏకలవ్యుని వారసులం' - Gauri Lankesh




'మేము ఏకలవ్యుని వారసులం'
( " కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి )


హుచ్చంగి ప్రసాద్‌ ఒక తిరుగుబాటుదారుడు.
       సామాజిక రాజకీయ మార్పు కోసం తిరుగుబాటు చేస్తున్న యువ కవి అతను.
       ఇరవైమూడేళ్ళ వయసుకే అతను ఎంతో దుఃఖాన్ని, అణచివేతను, పేదరికాన్ని, లేమిని, బానిసత్వాన్ని అనుభవించాడు. అవి సహజంగానే అతనిలో కోపాన్నీ, కసినీ నింపాయి. అనేకమంది యువకవులలాగా ఆ కోపాన్ని తీర్చుకోవడానికి అతను కవిత్వాన్ని మార్గంగా ఎంచుకున్నాడు.

ప్రముఖ కవయిత్రి దు. సరస్వతి అన్నట్లు ''ప్రసాద్‌ కవిత్వం నిండా బాధాతప్త హదయాల ఆగ్రహజ్వాలలు కనబడతాయి. మళ్లీ అందులోనే దయ, సహానుభూతి కూడా కనిపిస్తాయి.'' అతని కవితా సంకలనం 'ఒదలకిచ్చు' (అంతర్జ్వాల) కు కర్ణాటక బుక్‌ అథారిటీ వారిచ్చే సాహిత్య పురస్కారం లభించింది. ఆ పుస్తకాన్ని పైపైన తిరగేసినా చాలు కుల వ్యతిరేకత, హిందుత్వ వ్యతిరేకత, మూఢ నమ్మకాల పట్ల వ్యతిరేకత మనకు స్పష్టంగా కనబడతాయి. అంబేద్కర్‌ను గురువుగా భావించే ప్రసాద్‌  ప్రజలను అజ్ఞానం నుండి విముక్తి చెయ్యడానికి మళ్ళీ ఒక అంబేద్కరో, బసవడో రావాలని మనసారా కాంక్షిస్తాడు.

ప్రసాద్‌ తల్లి ఒక దేవదాసి, తండ్రి దళితుడు. బాల్యమంతా వెట్టి కార్మికుడిగా గడిచిపోతున్న తరుణంలో 'చిన్నారలోక' అనే ప్రభుత్వ పథకం అతన్ని ఆ ఊబిలో నుండి బయటికి లాగింది. బాలకార్మికులకు ఆసరా కల్పించి విద్య నేర్పే ఆ పథకం ప్రసాద్‌ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. తన రచనల గురించి చెప్తూ ''నేను చూసిన, అనుభవించిన జీవితం గురించే రాసాను. అది తప్పు ఎలా అవుతుంది'' అంటాడు.

కాని కొందరి దష్టిలో అతను చాలా తప్పులే చేసాడు. గత సంవత్సరం మార్చిలో ప్రసాద్‌ తన కవితా సంకలనాన్ని అచ్చు వేసుకోవడమే కాక దాన్ని ఆవిష్కరించడానికి ప్రొఫెసర్‌ కె.ఎస్‌. భగవాన్‌ని ఆహ్వానించాడు. హిందూమతోన్మాదులకు భగవాన్‌ అంటే అస్సలు గిట్టదు. ఇప్పటికే అతన్ని చంపుతామని అనేకసార్లు బెదిరించారు కూడా. అటువంటి భగవాన్‌, ప్రసాద్‌ల కలయికను హిందూ జాగరణ్‌ వేదికె, శ్రీరామ సేన్‌ వారు ఏమాత్రం సహించలేక పోయారు. వారు ప్రసాద్‌ను బెదిరించడమే కాక అతనిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. ఆ ఫిర్యాదులు తర్వాత ఏమయ్యాయో తెలియదు గాని ప్రసాద్‌కి బెదిరింపులు రావడం మాత్రం ఆగిపోయాయి.

ఇదంతా జరిగి చాలా కాలం అయ్యింది. ఈ లోపు మతోన్మాద శక్తులు బాగా బలం పుంజుకుని చాలా రక్తాన్నే చిందించాయి. వారి భావాలకి విరుద్ధంగా మాట్లాడినవారిపై దాడులు జరిపాయి. వారే గత వారం ప్రసాద్‌ని దావణగెేరెలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి మోసపూరితంగా రప్పించి భౌతికంగా దాడి చేసారు. అతని ముఖానికి కుంకుమ పులిమి ''హిందూ ధర్మాన్ని విమర్శించడానికి నీకెంత ధైర్యంరా లంజాకొడుకా? గత జన్మలో చేసిన పాపం వల్లే నువ్వు ఇప్పుడు మాదిగోడిగా పుట్టావు. నీలాంటివారు బ్రతికుండగూడదు. హిందూ ధర్మానికి విరుద్ధంగా రాతలు రాసినందుకు నీ వేళ్లను నరికేస్తాం'' అంటూ బ్లేడ్‌ బయటికి తీసి దాడి చేయబోయారు. వేళ్లు నరికేస్తారన్న భయంతో ప్రసాద్‌ వాళ్ళపై గట్టిగా తిరగబడి అక్కడనుండి ఎలాగైతేనేం ప్రాణాలతో బయటపడ్డాడు. అరచేతికి మాత్రం చిన్న గాయం అయ్యింది.

''హిందూ మతాన్ని నేనెందుకు విమర్శించకూడదు? అంబేద్కర్‌ కూడా విమర్శించాడు కదా! 'హిందూస్తాన్‌ అసమానతలతో నిండిన దేశం' అన్నది ఆయనే కదా! నా దష్టిలో హిందూ మతం కన్నా భయంకరమైన మతం మరొకటి లేదు'' అన్నాడు ప్రసాద్‌.
 
       ''వాళ్ళు ఏ రామరాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు? 
        రామరాజ్యంలో శంభూకుడి లాంటి శూద్రులకు ఏ గతి పట్టిందో వాళ్లకు తెలియదా? 
        రాముడి పరిపాలనలో స్త్రీలకు లభించిన స్థానమేమిటో వారికి గుర్తు లేదా? 
        సీతకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోయారా? 
       మాకు అటువంటి రామరాజ్యం అవసరం లేదు.  
       రాజ్యాంగం వాగ్దానం చేస్తున్న ప్రజా రాజ్యమే మాకు కావాలి'' అని కూడా అన్నాడు.

తన కుడి అరచేతికి గాయం అయినందువల్ల కొన్నాళ్ళు రాయలేకపోవచ్చునని చెపుతూ ''వాళ్ళు ద్రోణాచార్యుడి వారసులు అయితే మేము ఏకలవ్యుడి వారసులం'' అని ప్రసాద్‌ ధర్మాగ్రహంతో అన్నాడు. నాకు ఈ సందర్భంలో కువెంపు రాసిన 'బెరల్గే కొరళ్‌' నాటకం గుర్తుకొచ్చింది. ద్రోణాచార్యుడు తన ప్రియశిష్యుడు అర్జునుడిని మించిన విలుకాడు

      ఉండకూడదన్న దుర్బుద్ధితో ఏకలవ్యుడి కుడిచెయ్యి బొటనవేలును గురుదక్షిణగా అడిగిన కథ మనందరికీ తెలిసినదే. కువెంపు ఈ కథకు కొత్త మలుపునిస్తాడు. ఏకలవ్యుడు అడవిలో నివసించే ఆదివాసి గనక వేట అనేది అతని జీవన భృతి. అందుకే కుడిచెయ్యి పనికి రాకుండా పోయినా నిరుత్సాహపడకుండా అతను ఎడమచేత్తో విలువిద్యను సాధన చేసి నేర్చుకుంటాడని ఆ కథలో ఉంటుంది. నేను ఈ విషయాన్ని ప్రసాద్‌ దగ్గర ప్రస్తావిస్తే ''అవునా? నాకీ విషయం తెలియదు. కాని ఒకటి మాత్రం తెలుసు. వాళ్ళు నా పట్టుదలను నాశనం చెయ్యలేరు. అంబేద్కర్‌ మాకు ఆత్మగౌరవం, ఆత్మచైతన్యం అనే విలువలను నేర్పించాడు. మా హక్కుల కోసం మేము నిలబడడమెలాగో నేర్పించాడు. నేను సదా ఆ బాటలోనే నడుస్తాను'' అన్నాడు.

హిందుత్వ శక్తులు కర్రలతో, రాళ్ళతో ప్రసాద్‌లాంటి వారి ఎములను విరగ్గొట్టగలరేమోగాని వారి మనసుల్లో అంబేద్కర్‌ నింపిన చైతన్యాన్నీ, ఆలోచనలనూ మాత్రం రూపుమాపలేరు.

(బెంగుళూరు మిర్రర్‌, 26 అక్టోబర్‌ 2015)

అనువాదం : కె. అనురాధ
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌