Saturday, October 31, 2015

కుల నిర్మూలన - బి.ఆర్‌.అంబేడ్కర్‌ - అనువాదం: బోయి భీమన్న - పునర్ముద్రణ .

కుల నిర్మూలన - బి.ఆర్‌.అంబేడ్కర్‌ - అనువాదం: బోయి భీమన్న

''ఈ రోజుల్లో కూడా (1936లో) కుల వ్యవస్థను సమర్థించే వాళ్లుండడం ఒక దురుదృష్టం. సమర్థించడం ఎన్నో రకాలు. అందులో ఒకటి - కుల వ్యవస్థను శ్రమ విభజన పద్ధతితో పోల్చడం. అన్ని నాగరిక సమజాలలోనూ శ్రమ విభజన పద్ధతి అత్యావశ్యకంగా వుంటున్నది కనుక, అదే రకమైన కుల వ్యవస్థ మన సమాజంలో వుండటం తప్పుకాదని ఈ వాదాన్ని సమర్థించేవాళ్లు అంటున్నారు. ఈ వాదన వాస్తవ విరుద్ధం. కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు. అది శ్రామికుల విభజన కూడా. నాగరిక సమాజానికి శ్రమ విభజన అవసరమే. అయితే శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన జరగడం- వారి మధ్య అసహజమైన, దాటడానికి వీలులేని అడ్డుగోడలు కట్టబడటం ఏ నాగరిక సమాజంలోనూ లేదు. మరొక విషయం ఏమిటంటే - భారతదేశంలోని ఈ కార్మిక విభజన స్వచ్ఛందమైనది కాదు. వారి వారి సహజ స్వభావాలను, అభిరుచులను బట్టి చేయబడ్డ విభజన కాదు.''
....
''... ప్రప్రథమంగా మనం గుర్తించవలసింది ఏమిటంటే అసలు హిందూ సమాజమే ఒక పుక్కిటి పురాణం అని. ''హిందూ'' అనే పదమే ఒక విదేశీ పదం. మహమ్మదీయులు తమ ప్రత్యేకతను తెలియజేసుకునేందుకు ఈ దేశ ప్రజలకు ''హిందువులు'' అని పేరు పెట్టారు. మహమ్మదీయుల దండయాత్రలకు పూర్వం ఏ సంస్కృత గ్రంథంలోనూ ''హిందూ'' అనే శబ్దం కనిపించదు. ఈ దేశ ప్రజలకు తామందతా ఒక జాతి ప్రజలమనే భావమే లేదు. హిందూ సమాజం అనేది ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే. అది కొన్ని కులాల సముదాయం. ప్రతి కులానికీ తాము బ్రతకడం ఒక్కటే లక్ష్యం, పరమార్థం. ఈ కులాలు దేనికదే. అవి అన్నీ కలిసి ఒక సమాఖ్యగా అయినా ఏర్పడలేదు. ఎప్పుడైనా హిందూ- ముస్లిం కొట్లాట  వంటిది సంభవించినప్పుడు తప్ప, ఏ కులానికీ మరో కులంతో అనుబంధం వున్నట్టు కనిపించదు. ప్రతి కులం తక్కిన కులాల నుండి దూరంగా వుండడానికి, తన ప్రత్యేకతను నిలబెట్టుకోడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది.''
...
''ప్రపంచంలో అన్ని దేశాలలో సాంఘిక విప్లవాలు జరిగాయి. భారతదేశంలో ఎందుకు జరగలేదు అన్నది నన్ను నిరంతరం వేధించే ప్రశ్న. బహుశ అందుకు ఒకే ఒకటి కారణమై వుండవచ్చు. అది- హిందువులలోని దిగువ తరగతుల ప్రజలు పనికిమాలిన చాతుర్వర్ణ వ్యవస్థ కారణంగా అణిచిపెట్టబడి, ప్రత్యక్ష చర్యకు పూర్తిగా పనికిరాకుండా చేయబడటం.''
...
''భారతదేశంలో అందరూ ఈ కుల వ్యవస్థకు బానిసలే. అయితే, ఈ బానిసలందరూ ఒకే స్థాయికి చెందినవాళ్లు కాదు. ఆర్థిక విప్లవం తీసుకురావడం కోసం శ్రామిక జనాన్ని రెచ్చగొట్టేందుకు మార్క్స్‌ మహాశయుడు ''పోరాడితే మీకు పోయేదేమీ లేదు - బానిస సంకెళ్లు తప్ప'' అని ఉద్బోధించాడు. కానీ, హిందువులలోని వివిధ కులాల ప్రజలను కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రేరేపించడానికి మార్క్స్‌ మహాశయుడి నినాదం ఏవిధంగానూ పనికిరాదు. ఎందుకంటే మత సాంఘిక హోదాలు అంత చాకచక్యంతో, విచిత్రంగా ఏర్పాటు చేయబడ్డాయి.''
...
'' కుల నిర్మూలన చాలా మహత్తరమైన పని. చాలా వరకు అసాధ్యమైన పని కూడా కావచ్చు. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి దైవ ప్రాతిపదికను ఆపాదిస్తారు.  అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించబడ్డ దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి వుంది. అంటే శాస్త్రాల యొక్క, వేదాల యొక్క అధికారాన్ని, పవిత్రతను ముందు నిర్మూలించవలసి వుందన్నమాట.''
...
''అత్త పెట్టదు అడుక్కు తిననివ్వదు'' అన్న సామెతలాగా హిందూ నాయకులు కులాన్ని వదలరు. అంటరానితనాన్ని నిర్మూలించరు. దళితుల్ని మతం మారనివ్వరు. ఇంత అన్యాయం మరెక్కడైనా వుంటుందా?"
...
కుల నిర్మూలన
- డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌
తెలుగు అనువాదం: బోయి భీమన్న

మొదటి ముద్రణ: 1969
మలిముద్రణలు: 1969, 1981, 1990, 1992, 1994, 1998, 2001, 2006, 2015

103 పేజీలు, వెల: రూ.30
ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.

ఫోన్‌ : 23521849
Email ID: hyderabadbooktrust@gmail.com

.


Tuesday, October 6, 2015

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు "లతా రాజా సేవా శిరోమణి" అవార్డ్ !

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు "లతా రాజా సేవా శిరోమణి" అవార్డ్ !

తెలుగు సాహిత్యానికి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చేస్తున్న సేవకు గుర్తింపుగా లతా రాజా ఫౌండేషన్ వారు
సేవా శిరోమణి అవార్డుకు ఎంపిక చేసారు.

8 అక్టోబర్ 2015 గురువారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి లో జరిగే ఒక కార్యక్రమంలో
ఈ అవార్డు ను ప్రదానం చేస్తారు.  ప్రముఖ భరతనాట్యం డాన్సర్ శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ కు
కూడా అదేవేదికపై "లతా రాజా సాంస్కృతిక శిరోమణి" అవార్డును ప్రదానం చేయనున్నారు.

సభా కార్యక్రమ వివరాలు దిగువ ఆహ్వాన పత్రికలో చూడవచ్చు.
అందరూ ఆహ్వానితులేహైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌