Tuesday, December 24, 2013

పుస్తకాభిమానులకు విజ్ఞప్తి

పుస్తకాభిమానులకు విజ్ఞప్తి

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రధానంగా పుస్తకాభిమానులు అందించే స్వచ్ఛంద సేవలపై ఆధారపడి మనుగడ
సాగిస్తోంది. అయితే రోజురోజుకూ పనిఒత్తిళ్లు పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో అంకితభావంతో
సేవలందించేవారు లభించడం కష్టంగా మారింది. హెచ్‌బీటీకి సహాయపడేవారు సహజంగానే ఇతర అనేక
సేవాకార్యక్రమాలకోసం కూడా తమ సమయాన్ని వెచ్చిస్తుంటారు. అందువల్ల ఎంతోకాలంగా హెచ్‌బీటీని
ఆదరిస్తున్న పాఠకులలో ఎవరైనా ఈ కింది పనులలో మాకు సహకరించేందుకు ముందుకు
రావలసిందిగా కోరుతున్నాము:

1) ప్రచురణకు పంపేముందు రచనల, అనువాదాల రాతపతులను పరిశీలించి తగు సూచనలివ్వడం.
2) కంపోజ్‌ చేసిన ప్రూఫులను తప్పులు లేకుండా సరిదిద్దడం.
3) రాతపతులను ఎడిట్‌ చేయడం, నిర్దిష్టమైన మార్పులు చేర్పులు సూచించడం

పైన పేర్కొన్న పనుల్లో దేనిలోనైనా స్వచ్ఛంద సేవ అందించేందుకు వెసులుబాటు, ఆసక్తి వున్నవారు
దయచేసి ఈ కింది మెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేయగలరు.
gitaramaswamy@yahoo.com

వీలైతే మీ ఫోన్‌ నెంబర్‌ తెలియజేయండి, మేమే మిమ్మల్ని సంప్రదిస్తాము.
విదేశాలలో వున్నవారు కూడా పై పనుల్లో మాకు తమ సహకారం అందించవచ్చు. వారికి స్క్రిప్టులను
ఓపెన్‌ ఫైల్‌ లేదా పీడీఎఫ్‌ రూపంలో మెయిల్‌ ద్వారా పంపించడం జరుగుతుంది.

మీ స్పందన కోసం ఎదురుచూస్తూ
అభినందనలతో

గీతా రామస్వామి
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌: 040 2352 1849
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



A personal call for help

It is becoming increasingly difficult in the busy world of today to find volunteers for various tasks of the HBT. HBT runs largely on dedicated volunteer work. Those who spare time for HBT time are inevitably those who also give their time to other causes unsparingly. We request our readers who have supported us for so long, to help us in:

1. reviewing manuscripts and giving us their valuable opinions, so that we can select appropriate texts for publication.
2. proofing composed manuscripts
3. editing manuscripts and suggesting both broad and specific changes.

Kindly write to us at gitaramaswamy@yahoo.com, if you can volunteer for any of the above.

If it is possible, please give us your telephone number so that we can speak directly to you. We welcome help from those of you who live abroad - we can send you open or PDF files by email too.

Hoping from a response from you,
Yours in anticipation,

Gita Ramaswamy
Hyderabad Book Trust
Ph. No. 040 2352 1849

 




Tuesday, December 10, 2013

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం - గోగు శ్యామల

ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం

- గోగు శ్యామల
ముందుమాట : డా|| కేశవరెడ్డి

సూర్యగ్రహణాన్ని వర్ణించనీ,
చావడి దగ్గర చేరిన గ్రామస్తులను గురించి చెప్పనీ,
బర్రెమీద సవారీ చేసే పల్లెటూరి పిల్లను గురించి చెప్పనీ,
దళితులు కొట్టే డప్పు చప్పుడులోని వివిధ దరువులు పరిచయం చేయనీ...
గోగు శ్యామల కథనంలో వుండే మంత్ర శక్తి ఒకే స్థాయిలో వుంటుంది.

దానికి పరిమితులు లేవు. ఆమె మనకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని చూపిస్తూనే విశాల విశ్వంలోకి నడిపిస్తుంది. ఒక్కసారిగా బాల్యంలోకి పరుగు తీసి అవధులూ ఆకాంక్షలూ ఎరుగని అమాయకపు కళ్లతో దళిత జీవితాన్ని మన ముందుకు తెస్తుంది. దళితుల రోజువారీ జీవితాన్ని వివరంగా కళాత్మకంగా ఎంతో చాతుర్యంతో కళ్లకు కట్టిస్తుంది.

ఈ కథలకి నేపథ్యం ఒక తెలంగాణా గ్రామంలోని మాదిగ వాడ.
అక్కడి వివిధ సందర్భాలనూ, సనినివేశాలనూ, జనం అనుభవాలనూ చిత్రిస్తూ వాటిని అవగాహన చేసుకునే ఒక కొత్త చూపును పాఠకులకు ప్రసాదిస్తుంది.

పూర్వపు రచనలలో అటువంటి ప్రదేవాలను, ప్రజలను వర్ణించడానికి ఉపయోగించిన భాష గురించి, వాటి పట్ల ఆ చరనలలో కనబడిన భావుకత, పరిపాలనా దృక్పథం, గాంధీత్వ దృష్టి గురించి చెపుతున్నప్పుడు ఆమె చమత్కారం చాలా నవ్వు తెప్పిస్తుంది. ఈ కల పరిష్కారాలు ఊరి నుంచి, మాదిగవాడ నుంచి, ఆటువంటి ఇతర సమూహాల నుంచి మనుషుల్ని బయటికి పంపించడంలో లేదు. అక్కడి జన జీవితాన్నే భవిష్యత్‌ ఆశగా చూపించే కథలు ఆమెవి.

తన పదునైన రాజకీయ భావాలను గాఢమైన కథన సౌందర్యంతో మేళవించి, దళిత రచనంటే కేవలం పీడన గురించి వ్రాయడమేననే మూసాభిప్రాయాన్ని బద్దలు కొట్టింది గోగు శ్యామల.
.........................................................................................................



 స్పందన

The crowds were amazed at his
teaching, because he taught as
one who had authority and not
as their teachers of  the law.               Matthew 7:28 (Bible)


''మీ పుస్తకానికి ముందు మాటలు రాయలేను. " ఐ యాం ఎ పూర్ జడ్జ్ " అని ''నేనన్నప్పుడు
గోగు శ్యామలగారు, జడ్జ్  చేయవద్దు. కథలు చదివి మీ స్పందన రాస్తే చాలు'' అన్నారు. ఆ
వెసలుబాటు లభించాక ఇక కూర్చుని ఈ నాలుగు మాటలు రాస్తున్నాను.

    దళిత అస్తిత్వాన్ని పలు కోణాలలో విశ్లేషించే కథలు పన్నెండు ఇందులో ఉన్నాయి. ఈ
సంకీర్ణ సమాజంలో ఏ మనిషికి గాని ఒకే అస్తిత్వం ఉండదు. ఒకటి కన్నా ఎక్కువ అస్తిత్వాలే
ఉంటాయి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎంత మంది జనం ఉన్నారో దానికి నూరు రెట్లు అధిక సంఖ్యలో
అస్తిత్వాలున్నాయి. ఈ అస్తిత్వాలలో వెయ్యోవంతునైనా ప్రపంచ సాహిత్యం యావత్తూ కలిసి గూడా
ఇంతవరకు విశ్లేషించలేదు, విశ్లేషించ జాలదు. అందుకే  అంటారు  రాసే నేర్పు, కౌశలం ఉండాలే గాని
ఇతివృత్తాలకు ఏ కాలంలోను, ఏ దేశంలోను కొరతలేదని.

    మనిషికున్న ఎన్నో ఎన్నో అస్తిత్వాలలో ప్రధానమైనవి రెండు: ఆర్థిక అస్తిత్వం,
సాంస్కృతిక అస్తిత్వం. వీటిలో ఏది పునాది, ఏది ఉపరితలం అన్న దానిని గురించి కొందరికి ఇంకా
స్పష్టత లేదు. అయితే అవి రెండు ఒక దానినొకటి అనివార్యంగా ప్రభావితం చేసుకుంటాయన్నది
కాదనలేని సత్యం. సమాజం చలనశీలమని, మానవ సంబంధాలు చరిత్ర పొడవునా ఒకే రీతిగా
ఉండవని తెలిసిన వారికి ఈ సత్యాన్ని గుర్తించడం కష్టమేమీ కాదు. ఆర్థిక అస్తిత్వం మనుషులందరికీ
ఉమ్మడి అస్తిత్వమై ఉండగా, సాంస్కృతికం ఆయా వర్గాలకు మాత్రం ప్రత్యేకమైన అస్తిత్వంగా ఉంటుంది. రెండు అస్తిత్వాలు కలగలసిపోయి ఉంటాయి. గనక, పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి గనక గిరిగీసుకుని సాంస్కృతిక
అస్తిత్వాన్ని గురించి మాత్రమే రచన చేయటానికి వీలుపడదు. అలాగే ఆర్థిక అస్తిత్వాన్ని గురించి
మాత్రమే రాయడానికీ వీలుపడదు. ఇక్కడే మనకు ఏది దళిత సాహిత్యం? అనే ప్రశ్నకు సమాధానం
దొరకవచ్చు. రచయిత దళితుడైనంత మాత్రాన అది దళిత సాహిత్యమైపోదు. అలాగే దళితులను
గురించి రాసిందంతా దళిత సాహిత్యం కాజాలదు. దళితులకు ప్రత్యేకమైన సాంస్కృతిక అస్తిత్వం పైనా
ప్రధానంగా కేంద్రీకరించి దానిని పరిశీలించి, విశ్లేషించిన రచనను దళిత సాహిత్యమని నిర్వచించవచ్చు.

అంటే రచయితకు బలమైన సాంస్కృతిక మూలాలు, స్వానుభవం
ఉండితీరాలి. ఐతే అవి రెండు ఉన్నంత మాత్రాన ఆ రచన సాధికారతను, పరిపూర్ణతను సాధించజాలదు.
ఎందుకంటే సాహిత్యం మరీ అంత యాంత్రికమైన ప్రక్రియ కాదు గనక. సాంస్కృతిక మూలాలు,
స్వానుభవము పుష్కలంగా ఉన్న ఒక దర్శకుడు, స్క్రిఫ్టు రైటరు కలిసి తీసిన సినిమాలో బ్రాహ్మణ
పూజారికి జందెం పెట్టడం మరచిపోయిన ఉదంతం మనం విన్నాంగదా. ఇక్కడే ఇందుకు భిన్నమైన ఇంకొక ఉదాహరణ గూడా చెప్పుకోవాలి.

సాంస్కృతిక మూలాలు, స్వానుభవము ఏమాత్రం లేని ఒక పరమ నాస్తికుడైన నటుడు 'శ్రీ చైతన్య
ప్రభు' నాటకంలో ప్రధాన పాత్ర పోషించి రక్తి కట్టించాడట. రామకృష్ణ పరమ హంస ఆ నాటకం చూడడం
తటస్తించి చైతన్య ప్రభుని భక్తిరసానికి ముగ్ధుడైపోయి, నాటకం అయిపోయాక గ్రీన్‌ రూంలోకి వెళ్ళి
నటుడ్ని అభినందించి, ''నీలో కృష్ణపరమాత్మను దర్శించుకొన్నానయ్యా. దేవుని కృపాకటాక్షాలు నీకు
నిండుగా ఉన్నాయి'' అన్నాడట. అందుకా నటుడు, ''అయ్యా, నువ్వంటున్నదేమిటో నాకర్థం
కావటంలేదు. దేవుని కృపా కటాక్షాలను గురించి నాకేమీ తెలియదు. నేను నాస్తికుడిని, నేను కేవలం
నటించానంతే'' అన్నాడట. ఇక్కడ భక్తిరసాన్ని పండించింది నటుని నటనా కౌశలమే గాని సాంస్కృతిక
మూలాలు, స్వానుభవమూ కాదు. అందుకే గదా అంటారు: కళకు అసాధ్యం ఏదీలేదని. ఇక
రచయితకు సాంస్కృతిక మూలాలు, స్వానుభవాలతోబాటు రచనా కౌశలం గూడా ఉన్నప్పుడు ఆ
రచనకు మరింత సాధికారత, మరింత పరిపూర్ణత లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

    ఈ అంశాలన్నీ నిండార్లుగా ఉండడం వల్లనే గోగు శ్యామలగారి కథలు సాధికార దళిత
సాహిత్యంగా రూపుదిద్దుకున్నాయి. ఎంత బలమైన మూలాలు లేకపోతే రచయిత్రి బైండ్లామె చేత,
''దొరా, మీరు నాకు కూలి పైసలియ్యకుండ్రి. నేనే కూలి పైసలిస్త. మీ బిడ్డను గోజుకిడ్వుండ్రి. పండగల
రంగమెక్కమనుండ్రి. నేనే నీ బిడ్డకు కూలిస్త!'' అనిపించ గలదు! ఆ సమయంలో బైండ్లామె
ధర్మాగ్రహాన్ని, రౌద్రాన్ని వర్ణించడానికి రచయిత్రి ఇరవై ఏడు వాక్యాలు రాశారు. అవి ఒక్కొక్కటి వొళ్ళు
గగుర్పొడిచే వాక్యాలు. (బైండ్లామె భూమడగదా మరి).

    స్వానుభవం నుండి పుట్టిందే 'బడెయ్య' కథలోని బొక్కబండి ఉదంతం. మనం మట్టి
బండిని చూశాం. కొయ్య బండిని చూశాం. బంగారు బండిని గురించి విన్నాం. చచ్చిపోయిన దూడ
పుర్రెతో బండి తయారు చేయొచ్చునని నాకిప్పుడే తెలిసింది. ఆ బండిని తయారుచేసే విధానం రచయిత్రి
వివరిస్తుంటే వినడం ఒక అనుభవం. బడెయ్య ఆ బండితో ఆడుకోవడమే గాక దాంతో పొలానికి ఎరువు
తోలడం గూడా చేస్తాడు. అంత చిన్న వయసులోనే వాడికి అది ఆటవస్తువేగాక ఒక పనిముట్టు అని
గూడా తోచడం గమనార్హం. పని, పాట - ఇవి రెండూ వేర్వేరు కాదనే సాంస్కృతిక నేపథ్యం రచయిత్రికి
ఉండడంవల్లనే ఇది సాధ్యమయింది. ఇక 'జాడ' కథను చదవడమంటే ఒక పండగ సంబరంలో
పాలుపంచుకోవడమే.  మోర్స్‌ కోడ్‌తో నడిచే టెలిగ్రాఫ్‌ వ్యవస్థకు మనదేశం ఇటీవలే చరణగీతం
పలికింది. మోర్స్‌కోడ్‌కు దీటుగా డప్పుమీద రచయిత్రి వినిపించిన తొమ్మిది రకాల సంకేతాలను
వింటుంటే ఎంత సంబరం! ఆ కథ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చిర్ర, చిటికెన పుల్లలు డప్పుమీద వేసిన
తొమ్మిది రకాల దరువులు నా చెవుల్లో హోరెత్తుతాయి.

    మిగిలిన కథలు కలగచేసిన స్పందనలను గూడ ఏకరవు పెట్టగలను. కాని మీ
పఠనోత్సాహానికి భంగం కలిగించకూడదు కదా.

    మనిషికి ఉన్న ఎన్నెన్నో అస్తిత్వాలను విశ్లేషిస్తూ తెలుగులోను, ఇతర భాషలలోను
విస్తారమైన సాహిత్యం వస్తూ ఉంది. ఐతే ఎaఱఅర్‌తీవaఎ  సాహిత్యం అనబడే దిమ్మిసా  కొట్టిన రస్తాల
వెంబడి నడిచి నడిచి పాఠకలోకం విసుగెత్తిపోయింది. సమాజంలోని సందు గొందుల వెంబడి తిప్పగలిగే
రచయితల కోసం పాఠకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి ఆర్తిని తీర్చడానికి ఈ కథలు
ఎంతో దోహదపడతాయి. గోగు శ్యామల గారు ఈ కృషిని ఇంకింతగా, మరింతగా సాగిస్తారని
ఆశిస్తున్నాను.

18-7-2013

నిజామాబాద్‌    ......................................................................................డా|| కేశవరెడ్డి


 ఏనుగంత తండ్రికన్నా యేకులబుట్టంత తల్లి నయం

- గోగు శ్యామల


ధర : రూ. 80/-
పేజీలు  : 101
మొదటి ముద్రణ : డిసెంబర్ 2013 


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ 500006
ఫోన్‌ నెం. 040 2352 1849
Mail: hyderabadbooktrust@gmail.com


.................................................................

రచయిత గురించి...


తెలుగు దళిత సాహిత్య ప్రపంచంలో గోగు శ్యామల గొంతు ప్రత్యేకమైనది.
పది సంవత్సరాల క్రితం కథలు రాయటం మొదలుపెట్టిన శ్యామల తన రచనల్లో దళిత సమాజంలో బాల్యం, దళిత స్త్రీలు భూమి కోసం పడే తపన, దళిత కుటుంబాలలో, సమూహాలలోని ప్రజాస్వామిక తత్త్వం, దళిత సబ్బండ కుల సంబంధాలు, మాదిగ అస్తిత్వం, మాదిగ ఉపకులాల అస్తిత్వాలను కొత్త దృక్పథంలో చూపిస్తూ వచ్చారు.

ఆమె రచనల్లో దళితులు పీడిత అస్తిత్వంతోకాక, తమ జీవితం, ఇప్పటి ప్రపంచం, దానిలో రావలసిన మార్పుల గురించి తదేకంగా ఆలోచించే తాత్త్విక దృక్పథం కలవారిగా కనిపిస్తారు.

అనేక సాహితీ పురస్కారాలు అందుకున్న శ్యామల మొదటి పుస్తకం 'నల్లపొద్దు.' తరువాత, 'నల్లరేగడి సాల్లు', 'ఎల్లమ్మలు' పుస్తకాలు ఆమె సంపాదకత్వంలో వెలువడ్డాయి. 2011లో శ్యామల రాసిన ''నేనే బలాన్ని'' సదాలక్ష్మి బతుకు కథ ప్రచురించబడింది.

'ఎడ్యుసెండ్‌' అనే దళతుల విద్యపై పనిచేసే సంస్థని స్థాపించి, 'అందరికీ విద్య' అనే మాస పత్రికను కూడా నడుపుతున్నారు.

అనేక సంస్థలలోనూ, సాహితీ వేదికలలోనూ క్రియాశీలకంగా పాల్గొంటారు.
ప్రస్తుతం అన్వేషిలో సీనియర్‌ ఫెలోగా పనిచేస్తున్నారు, ఐఎఫ్‌ఎల్‌యులో పిహెచ్‌డి చేస్తున్నారు.








Sunday, November 10, 2013

ఆయన పొగరు అగ్ర వర్ణాలను గాయపర్చిందా !! అగ్ర వర్ణాల పొగరు ఆయనను గాయ పర్చిందా ??

ఆయన పొగరు అగ్ర వర్ణాలను గాయపర్చిందా !!
అగ్ర వర్ణాల పొగరు ఆయనను గాయ పర్చిందా ??


"నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా ... అయితే సంతోషం!" పుస్తక అహిష్కరణ సభ, ఖమ్మం.
" పొలిటికల్ వార్" నవంబర్ 2013 సౌజన్యం తో


Thursday, November 7, 2013

ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు: పోలీసు, కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి? - బొజ్జా తారకం


ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు
పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?


- బొజ్జా తారకం


ఈ పుస్తకానికి ఎందుకనో ముందుమాట రాయలేదు. రాయకుండానే ముద్రణకు పంపించాం. కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయి అనిపించి ఓ నాలుగు మాటలు రాస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టానికి సంబంధించిన అవగాహన బాగానే పెంచటం జరిగింది. అత్యాచారం జరిగిందని తెలిసిన వెంటనే కార్యకర్తలు అత్యాచారానికి గురైన వారు వారి బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు చేయటం, గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించటం, మృతదేహాలకు పోస్ట్‌ మార్టమ్‌ చేయించటం వంటి పనులు జరుగుతున్నాయి. గాయపడిన వారికి మృతుల బంధువులకు నష్టపరిహారం అందేలా చూడటం, పునరావాస సౌకర్యం కల్పించటం వంటి పనులు వెంట వెంటనే జరుగుతున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ముద్దాయిలను అరెస్టు చేయించి జైలుకు పంపటం మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

దీనివల్ల అత్యాచారం జరిపిన వర్గం  నుంచి తీవ్రత వస్తున్నప్పటికీ కార్యకర్తలు వెనుకాడటంలేదు. చట్టం సరిగ్గా అమలు జరిగితే సగం పని అయిపోయినట్టే! అత్యాచారాలు జరగకుండా చూడటం అనేది రాజకీయ వ్యవహారం. చట్టం అమలు పటిష్ఠంగా ఉంటే రాజకీయ శక్తులు, అగ్రకుల అహంకారులు కొంత వెనుకంజ వేస్తారు. దానితో పోలీసులు కూడా దారికి వస్తారు. ఈ చట్టాన్ని ఎంత పటిష్ఠంగా అమలు జరిపితే అంత త్వరగా అత్యాచారాలు కూడా ఆగిపోతాయి.
   
ఇప్పుడు ఒక కొత్త అత్యాచారం చాలా తీవ్ర స్థాయిలో పెరుగుతున్నది.
''పరువు హత్యలంటూ'' ఎస్‌.సి., ఎస్‌.టి.లపై కులం కులమే, గ్రామం గ్రామమే దాడిచేసి చంపేస్తున్నారు, ఇళ్ళు తగలబెడుతున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా తమిళనాడులో జరుగుతున్నాయి. ఉత్తర భారతంలో హర్యానా, యు.పి. రాజస్థాన్‌లలో ఎక్కువగా జరుగుతున్నాయి.

అన్ని హత్యలకూ కారణం ఒకటే. ఎస్‌.సి. కులానికి చెందిన అబ్బాయి, అగ్రకులానికి చెందిన అమ్మాయి ప్రేమించుకుంటారు. అది ఆ అగ్రకులానికి ఇష్టం ఉండదు. పెళ్ళి చేసుకున్న ఆ ఇద్దరూ ఊరు విడిచి వెళ్ళిపోతారు. అగ్రకులంవారు ఈ భార్యాభర్తలను వెతికి పట్టుకొని ఆ అబ్బాయిని కొట్టి అమ్మాయిని విడిచిపెట్టేయ మంటారు. ఆ అమ్మాయి వినదు. అంతే, అబ్బాయిని చంపేస్తారు.
ఒకోసారి ఇద్దర్నీ చంపేస్తున్నారు.
దీనికి ఆ కులమూ, గ్రామమూ మద్దతు ఇస్తుంది.
 పోలీసు కూడా జోక్యం చేసుకోవటానికి భయపడుతుంది.

అత్యంత దారుణమైన, హేయమైన, నీచమైన హత్యలివి. అగ్రకులం పరువు పోయిందని ఇటువంటి హత్యలు చేస్తున్నారు. ఇటువంటి కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయటంగాని, కేసు నమోదు చేయటంగాని, దోషులకు శిక్షపడేలా చూడటం కాని జరగటంలేదు.
దీనితో అగ్రకులాల వారికి ధైర్యం బాగా పెరిగిపోతున్నది.

కాని, ఒక్క విషయం మాత్రం ఈ అగ్రకులాలవారు గ్రహించటంలేదు. ఇటువంటి హత్యల ద్వారా ఈ ప్రేమ వివాహాలను ఆపటం సాధ్యపడదని, కులాల అడ్డుగోడలు లేని ఒక మానవీయ బాంధవ్యాలకు సంబంధించిన అంశమేమో, ఈ నేర ప్రవర్తన ద్వారా వీటిని అరికట్టటం అసాధ్యమనేది గ్రహించటంలేదు.

   
ఈ చట్టం కూడా ఈ పరిస్థితిని పరిగణనలోనికి తీసుకోవటంలేదు.
చట్టాన్ని పటిష్టంగా అమలు చేయటంతోపాటు, విస్తృతమైన ప్రచారం చేయటం ద్వారా ఒక సామాజికమైన మార్పును తీసుకురావటం ప్రధాన కర్తవ్యం.
అటువంటి పని దురదృష్ట వశాత్తు ఈ దేశంలో జరగటంలేదు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాంఘిక ఉద్యమాలు పూర్తిగా బలహీనమైపోయాయి.
వాటిని పునరుద్ధరించటం కూడా చాలా అవసరం. ఇటువంటి ఉద్యమాలు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయించటానికి బాగా ఉపకరిస్తాయి.



ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు : పోలీసు - కోర్టులు - ఎలా పనిచేస్తున్నాయి?

- బొజ్జా తారకం


ధర    :    రూ. 50/-

మొదటి ముద్రణ    :    జూన్‌ 2012, రిపబ్లికన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌
రెండవ ముద్రణ    :    అక్టోబర్‌ 2013
హక్కులు    :    రచయితవి

ప్రతులకు, వివరాలకు 
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,  ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌,   గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 23521849

Wednesday, November 6, 2013

అడుక్కుంటే వేసేది బిచ్చం! కొట్లాడితే వచ్చేది వాటా! - బొజ్జా తారకం


అడుక్కుంటే వేసేది బిచ్చం!
కొట్లాడితే వచ్చేది వాటా!



సాగర మధనంచేసి అమృతం పంచుకుందామని రాక్షసులను దేవతలు పిలిచారు. ఆ మాటలు నమ్మిన రాక్షసులు సాగర మధనం చేసి అమృతం తెచ్చారు. కష్టమంతా వారిదే! తీరా అమృతం పంచుకునేసరికి దేవతలు మోసంచేసి వారికి అమృతం లేకుండా చేశారు. ఆస్తి పంపకాల దగ్గర మొదలైన యుద్ధం ఈనాటికీ సాగుతూనే ఉన్నది. ఆస్తి పంపకాల దగ్గరే మొదటినుంచీ మోసం జరుగుతున్నది.
 
మాయా జూదంలో ఓడిపోలేదుగాని ఎక్కడో ఏదో మోసం మాత్రం జరిగింది. దళితులు, ఆదివాసీలు అది కానలేకపోయారు. దాని ఫలితంగా వారు ఊరవతల, అడవుల్లో ఉండిపోయారు.

   
వాళ్ళను అలా పంపి, వారి ఆస్తిని స్వాధీనం చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు అవతలి వాళ్ళు, బతకొచ్చిన వాళ్ళు మోసగాళ్ళు.  పెట్టిన గడువు ఎపుడో పూర్తయిపోయింది. దొంగ లెక్కలు చెప్పి ఇంకా వారిని  అక్కడే ఉంచుతున్నారు. 'తిరిగి వస్తాము, మా ఆస్తి మాకు ఇచ్చేయండి' అని కబురు పంపుతుంటే అసలు ఏమాత్రమూ లక్ష్యపెట్టటం లేదు. వాళ్ళు దానికోసం పోరాటం చేస్తే, అతి కష్టంమీద కొంత దగ్గరగా రానిచ్చారు. అయితే ఒక గీతగీసి దాని అవతలే ఉండాలన్నారు. 'మీరు బ్రతకటానికి మేం కొంత తిండి ఇస్తాములే, మాదగ్గరే పని చేసుకు బ్రతకండి' అని ఓ మెలికపెట్టారు.
   
పాండవులు కౌరవులకు సరిగ్గా ఇలానే జరిగింది. వనవాసం అయిపోయిన తర్వాత రాజ్యానికి తిరిగివచ్చి మా రాజ్యం మాకివ్వమంటే 'ఎక్కడిది మీ రాజ్యం?' అని ఎదురు ప్రశ్న వేశారు. ఎంతచెప్పినా మొండికేస్తుంటే కృష్ణున్ని రాయబారానికి పంపారు. 'మా రాజ్యం మాకు ఇస్తారా? లేక యుద్ధం జరుగుతుంది, దానికి సిద్ధపడతారా? అంటూ.

   
సరే, కృష్ణరాయబారం ఏమయిందో మీకందరకూ తెలుసు ! రాజ్యం ఇవ్వటానికి కౌరవులు ఒప్పుకోకపోతే కృష్ణుడు ఒక ప్రతిపాదన చేశాడు.

వాళ్ళరాజ్యం వారికి ఇవ్వకపోతే
''వాళ్ళు అయిదుగురున్నారు కదా, కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వండి పోనీ'' అన్నాడు కృష్ణుడు.  దానికీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత కథా మీకు తెలుసు !

   
దేశానికి స్వతంత్రం వచ్చి ముప్ఫై ఏళ్ళయిపోయిన తర్వాత ఊరిబయట ఉన్నవారి ఒత్తిడి తట్టుకోలేక ''అరె, వాళ్ళు అక్కడే ఉన్నారు గదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి! ఆ ప్రకారం ప్రస్తుతానికి ప్రతి ఏడూ వాళ్ళకు ఎంతోకొంత పంచుతూ ఉండండి, వాళ్ళ ఆస్తి సంగతి తర్వాత చూద్దాం'' అన్నారు పాలకులు. దాని పర్యవసానమే ఈ స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ !
   
అయిదుగురున్నారు కాబట్టి కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వండి అని అడిగినట్టు, 'ఎస్‌.సి.లు 16.2 శాతం, ఎస్‌.టి.లు 6.6 శాతం ఉన్నారని, బడ్జెటులో ఆ శాతం మేరకు వాళ్ళకు ఆస్తిలో వాటా ఇస్తున్నట్టు చూపండి' అన్నారు పాలకులు. అలా వచ్చినవే  ఈ ఎస్‌.సి.పి., టి.ఎస్‌.పి.లు!

   
దీనినిబట్టి ప్రతి వార్షిక బడ్జెటులో ఎస్‌.సి.లకు 16.2 శాతం, ఎస్‌.టి.లకు 6.6 శాతం కేటాయించాలి. వారి అభివృద్ధి కోసం పథకాలు వేసి వాటిపైన ఖర్చు పెట్టాలి. మొత్తం ఖర్చు మరుసటి సంవత్సరం బడ్జెటు వచ్చేనాటికి అయిపోవాలి. మిగలకూడదు, మిగల్చకూడదు, ఒక్కపైసా కూడా ఏ ఇతర అవసరాలకుగాని మళ్ళించ కూడదు. ఇదీ ఈ పథకాల స్వభావం.
   
అయితే దీనికి భిన్నంగా జరుగుతున్నదే రాజ్యపాలన. నిన్నటివరకూ బడ్జెటు కేటాయింపు జనాభా ప్రాతిపదికన జరగలేదు, జరిగిన తక్కువ శాతం కూడా పూర్తిగా ఖర్చుచేయలేదు. మిగిలిన మొత్తం వేరే వాటి మీద ఖర్చుపెట్టారు!

ఆస్తి, సంపద, డబ్బు లేకపోయినా వనరులు అందకపోయినా ఎవరూ బాగు పడలేరు. ఏ సమాజమూ అభివృద్ధికాలేదు. అవి వీరికి దొరకనివ్వటంలేదు కాబట్టే వీరు ఇంత అధ్వాన్నస్థితిలో ఉన్నారు. ఆనాడు పాండవులు అడిగినా అయిదు ఊళ్ళు ఇవ్వటానికి పాలకులు సిద్ధంగాలేరు. 'తప్పదు బంధు నాశనము' అంటూ పాండవులు యుద్ధానికి దిగారు. అంతే...రాజ్యం తెచ్చుకున్నారు. స్వతంత్రదేశ పాలకులు అది గ్రహించారు. ఇది కూడా ఇవ్వకపోతే యుద్ధానికి దిగుతారని తెలుసుకొని 'అయిదు ఊళ్ళు ఇస్తాములే తీసుకోండి' అన్నారు. ఇలా వచ్చినవే ఎస్‌.సి.పి; టి.ఎస్‌.సి.లు!
   
అడిగితే వేసేది బిచ్చంలాంటిది! వేసేవాళ్ళ ఇష్టం. పాచి అన్నం పెట్టినా బిచ్చగాడు ఏమీ చెయ్యలేడు. ముందుకుసాచిన మూకుడు లోకి నాలుగు మెతుకులు విదిలిస్తారు... ఏరుకోవలసిందే! బిచ్చగానికి వేరే మార్గం లేదు. తాను బిచ్చగాడు కాదని తెలుసుకొని కొట్లాటకు దిగాడనుకోండి, పరిస్థితి వేరే ఉంటుంది. తనకు రావలసిన వాటా వేరే వాళ్ళు అనుభవిస్తూంటే కొట్లాడవలసిందే గదా! కొట్లాడితే వచ్చేది వాటాయే, బిచ్చం కాదు, నాలుగు మెతుకులూ కాదు.
   
ఈ రోజు ఎస్‌.సి., ఎస్‌.టి.లు తేల్చుకోవలసింది ఇదే! మీరు బిచ్చమడుగుతారా? ఆస్తికోసం కొట్లాడతారా? బిచ్చమే అడుగుతూ ఉంటే మీ మూకుడులో నాలుగు మెతుకులు మాత్రమే రాలుతూ ఉంటాయి. యుద్ధానికి దిగారనుకోండి, మీ వాటా మీకు వస్తుంది అంతే...ఇక ఏ గొడవా ఉండదు! ఇదీ ఇపుడు ఎస్‌.సి.పి, టి.ఎస్‌.పి.ల విషయంలో జరగవలసినది! ఏంచేస్తారు? నిర్ణయించుకోండి!
   
ఎస్‌.సి.పి., టి.ఎస్‌.పి.ల వాటా కోసం ఇపుడు కొంత ఆందోళన జరుగుతున్నది. ప్రజా సంఘాల నుంచి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులవరకూ ఇది వెళ్ళింది. హైద్రాబాద్‌ నుంచి ఢిల్లీవరకూ వెళ్ళింది. విజ్ఞాపనలు, వినతి పత్రాలు, ఊరేగింపులు, చర్చలు, సదస్సులు, సభలు, ధర్నాలు, అరెస్టులు అన్నీ అయ్యాయి. ఈ విషయంలో చట్టం ఒకటి తేవాలంటూ కొన్ని సంఘాలు, వ్యక్తులు ప్రభుత్వంపై అటు ఢిల్లీలో ఇటు హైద్రాబాద్‌లో ఒత్తిడి తెస్తున్నారు. ఇంతచేస్తేనేగాని ప్రభుత్వాలు కదలలేదు. ఉప ముఖ్య మంత్రి అధ్యక్షతన కొందరు మంత్రులతో ఈ నిధుల అమలుకు ఒక ఉప సంఘాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది.
   
వీటి ఫలితంగా వార్షిక బడ్జెటులో కేటాయింపు కొంత పెరిగింది. ఇపుడు ఈ కేటాయింపును పూర్తిగా ఖర్చుపెట్టించాలి. ఆ ఖర్చుకూడా ఎస్‌.సి, ఎస్‌.టి. వారి అభివృద్ధి కోసమే జరగాలి. ఎట్టి పరిస్థితిలోనూ మళ్లింపు జరగకుండా చూసుకోవాలి. దీనికి ఏ స్థాయిలో ఆందోళన జరపాలో రాజకీయ పార్టీలు, సంఘాలు సంస్థలు ఆలోచించుకోవాలి.
   
ఈ పధకాల విషయం ప్రభుత్వానికి తెలియవనా ప్రజలు ఆందోళన చేయటం? కానేకాదు. తెలిసీ, ఈ తప్పుడు విధానాలకు వెళ్తున్నది. ప్రతి బడ్జెటును ఆమోదించే ప్లానింగ్‌ కమీషన్‌కు ఈ పథకాలలో జరుగుతున్న తప్పులు, నేరాలు, ఘోరాలు తెలియవనా సంఘాలు ఆవేదన చెందటం? కానేకాదు. తెలిసే ఇదంతా... 'మీరలా చేస్తూ ఉండండి, మేము ఇలా చెపుతూ ఉంటాము'' అని వారిద్దరూ ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు. అందుకని వీరి గూడుపుఠాణీ, వీరి నాటకాలు బద్దలుగొట్టాలంటే ఎంత గట్టిగా ఆందోళన చెయ్యాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. దానికి ఏదైనా సహాయ పడుతుందేమో అని ఈ పుస్తకం తీసుకురావటం!
   
ముందు విషయం తెలియాలి, ఆపైన లక్ష్యం గుర్తించాలి. దానిమీద కేంద్రీకరించాలి. దానిపైననే గురిపెట్టాలి, బాణం ఎక్కుపెట్టాలి, కొట్టాలి. ఫలితం చేతికందాలి. అలాచేస్తే అందుతుంది.
   
మొదట చేయవలసిన పని ఏదోముందు గుర్తించాలి. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆ తర్వాత రెండోది, మూడోది, ఆ తర్వాత చివరిది! అందుకనే ముందుగా ఎస్‌.సి., ఎస్‌.టి.లకు రావలసిన వాటా తీసుకోండి. ఆ తర్వాత వాటాలు పంచే స్థానం తీసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అవకాశాలు అందరికీ సమానంగా అందాలి. అది సమానత్వంలో భాగమే!



ఎస్సీ ఎస్టీ నిధులు ... విదిలింపు - మళ్ళింపు

- బొజ్జా తారకం



ధర    :    రూ. 40/-
మొదటి ముద్రణ    :    జూన్‌ 2012, రిపబ్లికన్‌ పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ముద్రణ    :    అక్టోబర్‌ 2013
హక్కులు    :    రచయితవి

ప్రతులకు, వివరాలకు:    
:హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,      
ప్లాట్‌ నెం. 85, బాలాజీనగర్‌,గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.
 ఫోన్‌ : 23521849

Tuesday, October 29, 2013

"కఠిన వాస్తవం" (ఈనాడు), "స్వాభిమాన సాధికార రచన" (వార్త) .... డాక్టర్ గోపీనాథ్ పుస్తకం పై సమీక్షలు

"కఠిన వాస్తవం" (ఈనాడు), "స్వాభిమాన సాధికార రచన" (వార్త) .... డాక్టర్ గోపీనాథ్  పుస్తకం పై సమీక్షలు
ఈనాడు ఆదివారం (27 10 2013)
ఆదివారం వార్థ (27 10 2013) సౌజన్యంతో





Monday, October 7, 2013

ఒక వైద్యుడి ఆత్మ గౌరవ ప్రకటన

ఒక వైద్యుడి ఆత్మ గౌరవ ప్రకటన
Courtesy: Sakshi 06-10-2013


Saturday, September 21, 2013

నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం - డా. గోపీనాథ్ పుస్తకం పై చర్చ 28-9-2013 శనివారం సాయంత్రం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు:
నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం
- డా. గోపీనాథ్ 
పుస్తకం పై చర్చ
28-9-2013 శనివారం సాయంత్రం 6 గంటలకు
హైదరాబాద్  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో.




Saturday, September 14, 2013

చిరస్మరణీయుడు సి.కె. - వరవరరావు



చిరస్మరణీయుడు సి.కె. - వరవరరావు

Andhra Jyothy September 14, 2013


మంచి కమ్యూనిస్టు, ఆదర్శ కమ్యూనిస్టు అనే మాటలు వాడితే మంచి వారు, ఆదర్శజీవి కాకుండా కమ్యూనిస్టు ఎట్లా అవుతాడు అని అంటారు గానీ కమ్యూనిస్టుగా గుర్తింపు పొందిన వాళ్లంతా మంచివాళ్లు, ఆదర్శజీవులు అయి ఉంటే మన దేశంలో విప్లవం ఇంత ఆలస్యమై ఉండేది కాదేమో.
పైగా కమ్యూనిస్టు భావజాలంలో వ్యక్తి నిజాయితీ కన్నా సమష్టి కోసం చేసే వర్గ పోరాటం మీద కేంద్రీకరణ ఎక్కువగా ఉంటుంది గనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో కూడా సుందరయ్య గారిని ఆయన నిరాడంబరత్వానికి గాంధీతోనే పోల్చారు. సి.కె. నారాయణ రెడ్డి గారిని చిత్తూరు గాంధీ అన్నారు. (చిత్తూరు కరంచంద్ అనలేదు!)

నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు ప్రారంభమయ్యాక తెలుగు నేల మీద ఏర్పడిన మార్క్సిస్టు లెనినిస్టు నిర్మాణాల్లో రాయలసీమ నుంచి నేను విన్న పేర్లలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, తర్వాత ప్రముఖంగా పేర్కొనవలసిన పేర్లు ముగ్గురివి. ఎస్.ఎ. రవూఫ్, మహదేవన్, సి.కె. నారాయణరెడ్డి.

వీరిలో మహదేవన్ నక్సల్బరీ విస్ఫోటనం నాటికి మద్రాసు సినీ రంగంలో ఉండి, విప్లవానికి దారి దొరికింది అన్నట్లుగా కొల్లిపర రామనరసింహరావు వలెనే మద్రాసు వదిలి వచ్చి చారు మజుందార్ నాయకత్వాన్ని స్వీకరించిన పార్టీలో రాయలసీమలో పనిచేస్తూ పార్వతీపురం కుట్రకేసులో అరెస్టయి 1972 నాటికే జైలు పాలయ్యాడు. బెయిల్ మీద విడుదలై అజ్ఞాత జీవితంలోకి వచ్చిన కొద్ది కాలానికే 1976లో ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు. ఎస్.ఎ. రవూఫ్ బెంగళూరులో అంపశయ్యపై ఉన్నాడు. మనుషుల్ని గుర్తుపట్టగల, గ్రహించగల స్థితిలో కూడా లేడు. ఇంక మిగిలిన సి.కె. నిక్కచ్చి, ముక్కుసూటి మనిషిగా, నిజాయితీగా, కమ్యూనిస్టుగా సార్థక జీవితం గడిపి తన 88వ ఏట కన్నుమూసాడు.

కొల్లా వెంకయ్యగారు రైతాంగ కార్యకర్త పేరుతో రాసిన అమరవీరుల జీవిత చరిత్ర ప్రచురణ సందర్భంగా డెబ్బైల ఆరంభంలోనే ఆయనతో పాటు సి.కె.తో నాకు, చెరబండరాజుకు సాన్నిహిత్యం ఏర్పడింది. సి.కె. చెరబండరాజుకు ప్రాణమిత్రుడై ఆయన కవితా సంపుటాల ప్రచురణకు సహా యం చేశాడు.

శ్రీకాకుళ ఉద్యమ సెట్‌బ్యాక్ తర్వాత బహుశా సి.కె. పుస్తక ప్రచురణా రంగంలోకి వచ్చినట్లున్నాడు. అయితే 'ఇస్క్రా' పత్రిక ఆర్గనైజర్ పనిచేయాలని లెనిన్ ఆశించినట్లుగా సి.కె. ప్రచురించిన పుస్తకాలన్నీ, ముఖ్యంగా విప్లవోద్యమం సెట్‌బ్యాక్ కాలంలోనూ, పునర్నిర్మాణ కాల ంలోనూ ఒక తరాన్ని తమ జీవితాలను మలచుకునేలా చేసినవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా విప్లవోద్యమం శ్రీకాకుళం సెట్‌బ్యాక్ నుంచి స్వీయ విమర్శ చేసుకుని ప్రజాపంథా చేపట్టాలని పునర్నిర్మాణానికి పూనుకున్న కాలంలో సి.కె. ప్రచురించిన పుస్తకాలు కరదీపికలుగా పనిచేసినవి.

చారుమజుందార్ పంథాలోనే ప్రారంభమై శ్రీకాకుళ ఉద్యమాన్ని ఉజ్వలమైన త్యాగాల చరిత్రగా ప్రేమించిన కొల్లా వెంకయ్య, సి.కె.లు 1972 నాటికే చారుమజుందార్ రాజకీయాలతో విభేదించారు. బహుశా అందుకే చైనా విప్లవ అనుభవాలను ప్రచారం చేసే పుస్తక ప్రచురణకు పూనుకున్నారు సి.కె.

1974 నాటికే ఆయన హైదరాబాదులోని ఖైరతాబాదు నుంచి జనతా ప్రచురణలు ప్రారంభించారు. 1974 సృజన సంచికలో 'జనతా ప్రచురణలు' ప్రచురించిన 'చైనాపై అరుణతార' ఎడ్గార్ స్నో అనువాద గ్రంథం ప్రకటన వెలువడింది. అదే సంచికలో 'రక్తాశ్రువులు' (స్కాల్పెల్ అండ్ స్వోర్డ్ పేరుతో డాక్టర్ నార్మన్ బెతూన్ జీవితం, కృషిపై వచ్చిన ఇంగ్లీష్ పుస్తకం అనువాదం) పుస్తక పరిచయాన్ని అప్పటికింకా కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిగా ఉన్న రావి భుజంగరావు చేసాడు. మామూలుగా కాదు, డాక్టర్ నార్మన్ బెతూన్ స్ఫూర్తితో 'వైద్యులారా రోగుల దగ్గరికి మీరే వెళ్లండి' అనే పిలుపుతో.

నాకిప్పటికీ జ్ఞాపకం, పుస్తకం ఇంకా ప్రింటింగ్ ప్రెస్ తడి ఆరక ముందే ఆసాంతం చదివి ఒక సాయంత్రం వచ్చి ఆ పుస్తకం ఎంత గొప్ప స్ఫూర్తియో, ఉత్తేజమో నాకు వివరించి, ఆ రాత్రే నన్ను చదివేలా చేసి మర్నాడు తన పరిచయం రాసి తెచ్చిచ్చాడు భుజంగరావు. కాకతీయ వైద్య కళాశాల విప్లవ విద్యార్థులు ఎం.జి.ఎం. గోడల మీద 'వైద్యులారా రోగుల దగ్గరికి మీరే వెళ్లండి' అని నినాదాలు రాశారు. ఎదురుగా ఇస్లామియా జూనియర్ కాలేజీ గోడల మీద రాశారు. నాకు తెలిసి 1974 నుంచి 1985 వరకు కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆ స్ఫూర్తితో, ఆదర్శంతో పనిచేసారు. వాళ్లలో అమరులు డాక్టర్ రామనాథం, డాక్టర్ ఆమడ నారాయణ, డాక్టర్ ఎ. రామయ్యలను మనం ఎప్పుడూ మరచిపోలేం కదా. డా. కోట్నీస్ ముఖచిత్రంతో వెలువడిన సృజనలో ఈ పరిచయం, పుస్తకంలోంచి కొన్ని పేజీలు, డాక్టర్ చాగంటి భాస్కరరావు, డాక్టర్ నార్మన్ బెతూన్ ఫోటోలు అందులో ఉన్నాయి. ఇంక రాష్ట్రవ్యాప్తంగా 'రక్తాశ్రువులు' పుస్తకం ద్వారా ముఖ్యంగా వైద్య విద్యార్థులకు నార్మన్ బెతూన్ ఆ రోజుల్లో ఒక రోల్ మోడల్ అయ్యాడు. తమ పాఠ్య గ్రంథాలతో పాటు 'రక్తాశ్రువులు' ఒక పాఠ్య గ్రంథమైంది.

ఇంక 'విముక్తి' గురించి నా స్వీయానుభవం చెప్పాలి.
1973 అక్టోబర్‌లో మొదటిసారి నేను మీసా కింద అరెస్టయినపుడు డాక్టర్ రామనాథం గారు విలియం హింటన్ రాసిన 'ఫ్యాన్‌షెన్' పుస్తకం కొని పంపారు. 'శత్రువు రక్తంలో చేతులు ముంచిన వాడే కమ్యూనిస్టు' అని, వర్గశత్రు నిర్మూలన యుద్ధమే విప్లవమని అప్పటిదాకా తీవ్రంగా ఉన్న నా భావాలను ఆ పుస్తకం కుదిపేసింది. 1974లో మళ్లీ మేం జైలుకు వెళ్లే నాటికి కె.ఎస్. రాసిన 'ఆత్మవిమర్శ' పుస్తకం ఇంగ్లీషు అనువాదం కోసం కెవిఆర్‌కు వస్తే మేమంతా ఆ పుస్తక పఠనంలో నిమగ్నమయ్యాం. 1974 అక్టోబర్‌లో ఆర్ఎస్‌యు ఏర్పడి, 1975 ఫిబ్రవరిలో మహాసభలు జరుపుకుని ప్రజాపంథా చేపట్టే మార్గాన్ని ప్రచారం చేసే సాహిత్య అవసరాన్ని వెతుక్కుంటున్న రోజుల్లో జూన్ 1975లో జనతా ప్రచురణలు ఫ్యాన్‌షెన్ సంక్షిప్త రూపం 'విముక్తి'ని ప్రచురించింది. కొద్ది రోజుల్లోనే ఎమర్జెన్సీ వచ్చింది. బయటేమో నాకు తెలియదు గానీ ఎమర్జెన్సీలో నేను వరంగల్, సికిందరాబాదు, హైదరాబాదు మూడు జైళ్లలో ఎక్కువ కాలమే ఉన్నాను. మూడు జైళ్లలోనూ విప్లవ రాజకీయ ఖైదీలు వందల సంఖ్యలో ఉన్నారు. అందరికీ ఎమర్జెన్సీ కాలమంతా 'విముక్తి' ఒక టానిక్. మూడు జైళ్ళలోను ముప్పై మందికి పైగా విరసం సభ్యులం ఉండేవాళ్లం. రాడికల్ విద్యార్థులూ ఉండేవాళ్లు. మేమంతా బోల్షివిక్ పార్టీ చరిత్రతో పాటు, 'విముక్తి' సమష్టిగా చదువుకుని చర్చించుకునే వాళ్లం.

ఆఖరుసారిగా ఆయనను జార్జ్‌రెడ్డి నలభైవ వర్ధంతి సభలో 2012 ఏప్రిల్ 14 సుందరయ్య విజ్ఞాన భవన్‌లో చూశాను. ముందు వరుసలో కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్లి పలకరించి వచ్చాను. కొల్లా వెంకయ్య గారితో 'అమరవీరుల జీవిత చరిత్రలు' ప్రచురణ సందర్భం తర్వాత మళ్లా సికిందరాబాద్ జైల్లో కలిసుండే అవకాశం వచ్చింది. కానీ సి.కె.తో ఉన్న అనుబంధమంతా ఆయన ప్రచురించిన పుస్తకాలతోనే. వాటి ప్రభావంతోనే. బహుశా 'సహవాసి'ని మూల రచయిత అని పాఠకులు భ్రమించేంత సుప్రసిద్ధ అనువాదకునిగా తీర్చిదిద్దిన కృషిలో కూడా సి.కె. నిర్వహించిన భూమిక ఉండే ఉంటుంది.

పత్రికలు, పుస్తకాలు ఏం చేయగలవో, ఎలక్ట్రానిక్ మీడియా ఇరవై నాలుగు గంటల రొదలో, ఆర్భాటంలో అర్థం చేయించడం కష్టం కావచ్చు, కానీ ఇప్పటికీ అజ్ఞాత జీవితంలోనూ, జైళ్ళలోనూ ఉన్న వాళ్ల పుస్తకాలం దాహం చూస్తే సి.కె. విప్లవోద్యమానికి చేసిన సేవ ఎంత చిరస్మరణీయమైందో అవగతమవుతుంది.

- వరవరరావు

(ఆంధ్ర జ్యోతి 14 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో)

(సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ - సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు
బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో)

.


Thursday, September 12, 2013

సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో

సి.కె. నారాయణ రెడ్డి సంస్మరణ సభ
సెప్టెంబర్ 14 శనివారం సా.6 గంటలకు
బాగ్ లింగంపల్లి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో

Saturday, September 7, 2013

అరుదైన కమ్యూనిస్టు



అరుదైన కమ్యూనిస్టు 

మీరు చెప్పేదానిని జాగ్రత్తగా వినే కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా
ఒక రిక్షావాలాకు అవసరమైన శస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేసి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేంతవరకు రోజంతా అతని వద్దనే ఉండే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా తెలుసా?  
ఒక భారతీయ పౌరునికి అర్హమైన గౌరవం ఇస్తూ రోగికి చికిత్స చేయని పక్షంలో ఏ డాక్టర్‌తోనైనా పోట్లాడేందుకు సిద్ధపడే కమ్యూనిస్టు రాజకీయవేత్త ఎవరైనా మీకు తెలుసా?
మహిళలను ఎప్పుడూ ఏ విధంగానూ అగౌరవపరచరని మీరు పరిపూర్ణ విశ్వాసంతో చెప్పగల కమ్యూనిస్టు రాజకీయ వేత్త ఎవరైనా మీకు తెలుసా?  
సదా జనసమ్మర్ధంతో, వాహనాల రాకపోకల రద్దీతో ఉండే లక్డీకపూల్ వద్ద రోడ్డు నడిమి భాగంలో నిర్లక్ష్యంగా విసరివేసిన అరటి తొక్కపై కాలు వేసి ఎవరూ జారిపడకుండా ఉండేందుకై దాన్ని ఎత్తుకు వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో పడవేసే మనిషి ఎవరైనా మీకు తెలుసా?  
అటువంటి ఉదాత్త వ్యక్తి ఒకరు నాకు తెలుసు. 
ఆయన గురువారం అర్థరాత్రి కీర్తిశేషులయ్యారు.

ఆ సజ్జనుడే, సి.కె. అని అందరూ గౌరవంగా పిలిచే సి.కె. నారాయణ రెడ్డి. 
కొన్ని వర్గాలలో చిత్తూరు జిల్లాకు చెందిన కమ్యూనిస్టు రాజకీయవేత్తగా సుప్రసిద్ధుడు; ఇతర వర్గాలలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచ్.బి.టి.) సంస్థాపకుడుగా సుపరిచితుడు. పాఠశాల, కళాశాల విద్యాభ్యాసకాలంలో తనకున్న ప్రతిదీ పేదలకు ఇచ్చివేసిన మంచివాడుగా ఆయన పేరుకెక్కారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ పేద విద్యార్థుల కోసం ఒక హాస్టల్‌ను ఆయన ప్రారంభించారు. అప్పటికి ఆయనకు నిండా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు. 

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికై చదువుకు స్వస్తి చెప్పారు. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీలో కొంతకాలం పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. 1962లో పీలేరు శాసనసభ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. అయితే భారత్-చైనాల మధ్య యుద్ధం రావడంతో ఆయనకు కారాగారవాసం ప్రాప్తించింది. 1967లో చారుమజుందార్ గ్రూపులో చేరారు. 1970లో ప్రభు త్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్బంధించింది. 1977లో విడుదలైన అనంతరం ప్రగతిశీల సాహిత్యం ప్రచురణకు సి.కె. అంకితమయ్యారు. రిచర్డ్ అలెన్, టెడ్ గోర్డన్‌ల 'ది స్కాల్‌పెల్, ది స్వోర్డ్', విలియం హింటన్ 'ఫాన్‌షెన్', మేరీ టైలర్ 'మై ఇయర్స్ ఇన్ ఏన్ ఇండియన్ ప్రిజన్', ఎడ్గార్‌స్నో రాసిన 'రెడ్ స్టార్ ఓవర్ చైనా' మొదలైన పుస్తకాలను ఆయన తెలుగులో ప్రచురించారు.

నేను ఒక నిర్దిష్ట తిరుగుబాటు దశలో ఉన్న కాలంలో సి.కె.తో నాకు తొలుత పరిచయమైంది. అప్పుడు నా వయస్సు ఇరవై ఐదేళ్ళు. ఒక నక్సలైట్ గ్రూపులో పనిచేసి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుల ధోరణికి విసిగిపోయి బయటికి వచ్చాను. తమ మాటే నెగ్గాలనే మొండి పట్టుదల వారిది. ఇతరులు చెప్పేదానిని వినిపించుకొనేవారు కాదు. మహిళలను అణచివేసే వారు. ఇతరులూ మానవులేనని గుర్తించేవారు కాదు. 

సి.కె. నా భర్తకు పినతండ్రి. నక్సలైటు పార్టీలోని వ్యవహారాలతోనే కాకుండా కుటుంబ బాంధవ్యాలతో కూడా నేను అలసిపోయాను. ఈ బాంధవ్యాలు యువతులకు కొన్ని హద్దులు, తరచు హింసాత్మకంగా కూడా విధించేవి. పుట్టింటి బంధనాల నుంచి తప్పించుకున్న నేను వివాహం ద్వారా మరో కుటుంబానికి సన్నిహితమవ్వడమనేది నేను కోరుకునే చివరి విషయం.

సి.కె.తో పరిచయమైన ఏడు సంవత్సరాల వరకు, ఆయనతో నా బాంధవ్యాన్ని నేను అంగీకరించలేదు. దీనికి ఆయనేమీ బాధపడలేదు. 1980లో సి.కె. నేతృత్వంలో ఒక చిన్న బృందం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. హెచ్.బి.టి. ప్రచురించిన తొలి పుస్తకాలతో సి.కె., నేను కలసి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణానికీ, ప్రతి పెద్ద గ్రామానికీ వెళ్ళాం. కొద్ది నెలల కాలంలోనే ఆయన పట్ల నాకు ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. 

ఆయన చాలా అరుదుగా మాట్లాడేవారు. సదా ఇతరులు చెప్పేదానిని వినేవారు. ఆయన తరానికి చెందిన ఏ కమ్యూనిస్టులోనైనా ఇదొక గొప్ప గుణం. తనను తాను మరచిపోయి పనిచేసేవారు. ఇతరులను స్వార్థానికి ఉపయోగించుకొనే గుణం ఆయనలో ఏమాత్రం లేదు. చాలా సున్నితంగా, మృదువుగా వ్యవహరించే వారు. తన ప్రతిపాదనలను నిష్పాక్షికంగా చర్చించేవారు.

ముఖ్యంగా మహిళలు, పేదవారిపట్ల ఒక పరిపూర్ణ పెద్ద మనిషి తరహాలో వ్యవహరించేవారు. నాకుతెలిసిన కమ్యూనిస్టులలో ఇది పూర్తిగా కనరాని విషయం. సంపన్నులతో సాపేక్షంగా కఠిన వైఖరితో వ్యవహరించడంలో ఆయన ఆనందాన్ని పొందేవారు. నిధుల సమీకరణకు మేము ఎవరి గృహానికైనా వెళ్ళినప్పుడు ఆ గృహస్థుడు తాను కొత్తగా ఇల్లు కట్టుకున్నాననో లేదా కుమార్తె వివాహం చేశాననే సాకుతో విరాళం ఇవ్వలేనని చెప్పినప్పుడు సి.కె. ఊరుకునే వారు కాదు. అందుకే మీ దగ్గరికొచ్చామని స్పష్టం చేసేవారు. మీరు ఫలానా వ్యవహారానికి ఫలానా మొత్తంలో ఖర్చుపెట్ట గలరని విన్నాము. అందుకే మిమ్ములను అడగదలచుకున్నదానికి రెట్టింపు ఇవ్వాలని అడుగుతున్నామని సి.కె. అనేవారు.

ఆయనలోని మానవతా దృక్పథం నన్ను విశేషంగా ఆకట్టుకొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, గ్రామాల్లో ప్రయాణిస్తుండగా కూడా ఎక్కడైనా రోడ్లపై అరటి తొక్కలు కనిపడితే వాటిని తీసివేసేవారు. నిత్యం ఆస్పత్రులను సం దర్శించి రోగుల బాగోగులను చూస్తుండేవారు. పేదలు, అవసరంలో ఉన్నవారి గురించి ప్రత్యేకంగా పట్టించుకొనేవారు. నాకు తెలిసిన కమ్యూనిస్టులో కెల్లా సి.కె. చాలా చాలా భిన్నమైన, విలక్షణమైన వ్యక్తి. జంట నగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై కుక్కకాటుకు బాధితులైన పేదల సంక్షేమాన్ని పట్టించుకొనేవారు. పేద గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, పారిశ్రామిక కాలుష్య సమస్యల పరిష్కారానికి ఆయన ఇతోధిక కృషి చేశారు. దళిత బాలబాలికలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించడానికి ఆయన శ్రద్ధ చూపారు. శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యలకు ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించినప్పుడు స్వయంగా మాజీ ఎమ్మెల్యే అయివుండీ ఆ నిర్ణయాన్ని సి.కె. వ్యతిరేకించారు.

ఎస్.ఆర్. శంకరన్ తాను ఇద్దరు వ్యక్తులకు భయడతానని, వారిలో ఒకరు సి.కె. అని చెబుతుండేవారు. ఎందుకంటే సి.కె. ఏదైనా ఒక సమస్య విషయమై శ్రద్ధ చూపితే అది పరిష్కారమయ్యేంతవరకు తదేక దీక్షతో కృషి చేసేవారని శంకరన్ అనేవారు. హెచ్.బి.టి.కి సి.కె. సంస్థాపకుడు, హృదయం, ఆత్మ. ఆయన నాకు మార్గదర్శకుడు. నేను అన్ని కుటుంబ బాంధవ్యాలకు దూరమయినాను కదా. ఆయన చాలా ఉదారుడు. ఆయన నాకు తండ్రి, తల్లి, స్నేహితుడు. 1994లో ఆస్పత్రిలో ఉండవలసి వచ్చినప్పుడు సి.కె. రోజూ వచ్చి నన్ను పరామర్శిస్తుండేవారు. నేను త్వరగా కోలుకోవడానికి ఆయన సహాయపడ్డారు.

కాలంతో పాటు నడిచిన వ్యక్తి సి.కె.. గతకాలం గురించి ఆయన ఎన్నడూ ఏదో కోల్పోయామన్న భావనతో ఆలోచించేవారు కాదు. ప్రజల్లో నిత్యం వస్తున్న మార్పులను గమనించే వారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయని, స్వతంత్ర వైఖరితో మాట్లాడడానికి సాహసిస్తున్నారని ఆయన గుర్తించారు. కనుకనే తన వయస్సులో ఉన్న ఇతరుల కంటే వర్తమాన రాజకీయాలు, ఉద్యమాల ప్రాధాన్యాన్ని ఆయన గుర్తించేవారు. వాటిని ప్రశంసించేవారు. ఇప్పుడు 'మంచి మనిషి'గా, 'స్వార్థరహితుడు'గా ఉండడం ఆనవాయితీగా లేదు. విస్తృతస్థాయిలో సంబంధాలు కలిగివుండడానికి, టెలివిజన్‌లో కనిపించడానికి, ఇతరులు తన గురించి తరచూ రాసేందుకే అందరూ శ్రద్ధ చూపుతున్నారు. సి.కె. నిజంగా మంచి మనిషి, నిస్వార్థపరుడు, మహోన్నతుడు. ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందారు. మన జీవితాలలో ఆయన సజీవుడుగా ఉంటారు.

- గీతా రామస్వామి
(ఆంద్ర జ్యోతి 7 సెప్టెంబర్ 2013 సౌజన్యంతో )

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఈరోజు కొన్ని పత్రిక లలో వచ్చిన వార్తల కత్తిరింపులు :


The Hindu 7 9 2013 

‘Piler Gandhi’ dead

Challa Krishna Narayan Reddy, veteran Communist leader and freedom fighter, popularly known as CK and ‘Piler Gandhi’, for his spartan lifestyle, passed away here on Thursday night. He was 88 and survived by wife Jayaprada and two daughters. In accordance with his wish, his body was donated to Gandhi Medical College.

Born on August 1, 1925, at Challavaripalle near Piler of Chittoor district, he discontinued his BA and joined Quit India Movement. Under the influence of Mahatma Gandhi, he spun the charkha and used to wear pure khadi. He joined Communist movement in 1953.
CK was elected to the AP Assembly on Communist Party ticket in 1962. He was arrested again during the Emergency. On release from prison in 1977, he began Janata Prachuranalu and Anupama Prachuranalu and published transformative literature. He founded the Hyderabad Book Trust in 1980 along with social activist, Gita Ramaswamy.
— Special Correspondent
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  The Hans India 7 9 2013

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
Eenadu 7 9 2013
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
 




Friday, September 6, 2013

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు
సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధిగా సుప్రసిద్ధులు అయిన  సి.కె.నారాయణ రెడ్డి గారు నిన్న అర్థ రాత్రి (5 సెప్టెంబర్‌ 2013న) హైదరాబాద్‌లో చనిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఆయన వయసు 88 సంవత్సరాలు.

సికె గా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని
చల్లావారిపల్లిలో 1 ఆగస్ట్‌ 1925న జన్మించారు. మదనపల్లిలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌/కాలేజీలో బిఎ వరకు చదువుకున్నారు. కాలేజీలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. బిఎ రెండో సంవత్సరంలో వుండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఫైనల్‌ ఇయర్‌లో కాలేజీ నుంచి బయటికి వచ్చారు. గాంధీ ప్రభావంతో ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. తరచూ చరఖా తిప్పేవారు.

 సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. పేదల వేతనాలకోసం, భూమి కోసం భుక్తికోసం పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.  దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కషి చేశారు. యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లిలో బడుగు వర్గాలకోసం సికె స్వయంగా పలు వసతి గృహాలను నిర్వహించారు. బాకారావు పేట, వాయలపాడు వసతి గృహాలకు సహాయ సహకారాలు అందించారు. అందులో వుంటూ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్‌ అధికారులు అయ్యారు. యువత కోసం రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు.

 సికె గారు 1962లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ వెంటనే భారత చైనా యుద్ధం కారణంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. 1967 లో చారుమంజుందార్‌ గ్రూపులో చేరారు. 1970లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్భంధించింది. రెండేళ్ల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో 1977లో విడుదలయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకు జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు నెలకొల్పి - ''ది స్కాల్‌పెల్‌, ది స్వోర్డ్‌'' - రిచర్డ్‌ అ లెన్‌  , టెడ్‌ గోర్డన్‌ (రక్తాశృవులు) ; ''ఫాన్‌షెన్‌'' - విలియమ్‌ హింటన్‌ (విముక్తి) ; ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌''- మేరీ టైలర్‌ (భారత దేశం లో నా జైలు జీవితం) ;'' రెడ్‌ స్టార్‌ ఓవర్‌ చైనా''- ఎడ్గార్‌ స్నో (చైనా పై అరుణ తార) తదితర పుస్తకాలను తెలుగులో ప్రచురించారు.

1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను నెలకొల్పి అప్పటినుంచి 1990ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషి చేస్తూ అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. సైద్ధాంతిక ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు, ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.

జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై  కుక్క కాటు సంఘటనలు విపరీతంగా పెరిగినప్పుడు ఆ సమస్యపై అక్కినేని అమల వంటి శక్తివంతులైన జంతువుల హక్కుల గురించి పోరడే వాళ్లని ఎదిరిస్తూ ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాటాలు చేశారు.  ప్రభుత్వం శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు అనేక సౌకర్యాలను
కల్పించినప్పుడు స్వయంగా మాజీ శాసన సభ్యులయివుండి కూడా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో హత్యకు గురైన కామ్రేడ్ జార్జి రెడ్డి స్వయానా వీరి అన్న కుమారుడు.

సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ  వున్నారు.


.

Saturday, August 24, 2013

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం : డా. గోపీనాథ్




భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: "నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం" : డా. గోపీనాథ్ పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన ముందుమాట :

ముళ్లదారి
                డాక్టర్‌ గోపీనాథ్‌ తన పుస్తకానికి ముందుమాట రాయమనగా నేను ఆశ్చర్య పోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలక పక్షాల లోతుపాతులు ` కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం ` విశ్లేషణ నాలాంటివాడికి అందనిది.
                అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్ల కంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి ` ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో ` ఒంటరిగా అనుభవించిన వొత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
                గజిబిజిగా అస్తుబిస్తుగా, వెనుకా ముందులుగా ` కాలువలుగా, వాగుల్లాగా ప్రవహించిన వాక్యాల లోతుల్లో తడి ` నా కళ్లల్లోకి ప్రవహించి.......
                ఈ పుస్తకం చదవడానికి చాలా రోజులు పట్టింది. ఇది రొమాంటిక్‌ ఫిక్షన్‌ కాదు. కథ కాదు ` కవిత్వం కాదు ` భయంకరమైన కఠోరవాస్తవం. రాసిన వాక్యాల వెంట, రాయని మరెన్నో తెలిసిన ఘటనలు చుట్టుముట్టేవి. గోపి పల్లె బతుకు. మోకాలుమంటి దిగబడే దారులు, అడపాదడపా స్కూలుకు వచ్చే పంతుళ్ళు, ఊరి కొట్లాటలు, పసి మనుసుల్లో ఎగిసిన, కలతపెట్టిన ఘటనలు....  పశువులు, పంటలు, ఎండా, వానా, చలి, చేపలు, కన్నీళ్లు, కష్టాలు ప్రతిదీ ` గుండె గొంతుకలోన గుబగుబలాడినయ్‌.
                పల్లె ` అందునా భారతీయపల్లె ` నిరంతర యుద్ధ క్షేత్రం కదా! పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన ` ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు ` అలాంటి ఒంటరితనాల్లోంచి  ` సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం...
                భూమి కోసం, తాము సృష్టించిన సంపద కోసం ప్రజలు పోరాడుతున్న వేల సంవత్సరాల యుద్ధభూమి పల్లె ` అయినా మాయోపాయాలతో సంపద పంచబడని, దోపిడి చెక్కుచెదరని, స్థితిలో....... సుదీర్ఘ యుద్ధాల్లో కూడా ` తమ సృజనాత్మకతను, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న ` తలవంచని కింది కులాల వీరయోధుల కుటుంబంలో నుండి సాగిన జీవనయానం ` ఆయన యుద్ధ బీభత్స అనుభవాలు నన్ను కకావికలు చేశాయి. ఆయనలాగే నాకు ఆ పల్లె కలలు,
నెత్తుర్లు చిమ్మంగా కొట్టుకున్న కలలు...... సుదీర్ఘ యుద్ధాల పీడకలలు, పెనుగులాడినకొద్దీ మునుపటికన్నా లోతుగా దినదినం యుద్ధరంగంలోకి నెట్టబడుతున్న పల్లెలు `. అడవులు` ఎక్కడేమిటి అన్ని రకాల సంపద, వనరులు, సుడిగాలిలా ` ఎలుగడిలా పరివ్యాప్తమౌతున్న యుద్ధరంగంలో నిలబడి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఈ పుస్తకం....
                రెండు ప్రపంచ యుద్ధాలలో నలిగిన బ్రిటన్‌ అనేక రకాల లోపలి`బయటి కారణాల రీత్యా భారతదేశంలో అధికార మార్పిడి నిర్వహించింది. ఫలితంగా అగ్రకుల భూస్వామ్య, దళారులకు అధికార మార్పిడి ద్వారా రాజ్యాధికారం చిక్కింది. అప్పటికి రష్యాలో ప్రజలు శ్రామికవర్గ పార్టీ నాయకత్వంలో పోరాడి విజయం సాధించారు. సోషలిస్టు మాయోపాయాల నెహ్రూ మార్కు సోషలిజం ` గాంధీ హరిజనోద్ధరణ ` వీటన్నటికి భిన్నంగా అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన కింది కులాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ` ఏ రకంగానైతేనేమి ` అనివార్యంగా అగ్రకుల, రాజుల, భూస్వాముల కబంధ హస్తాల్లో వేల సంవత్సరాలుగా చీకటి కొట్టాలుగా మగ్గుతున్న గ్రామాల్లోకి చిరుదీపంలాగా చదువు రంగ ప్రవేశం చేసింది. సర్వసంపదలు సృష్టించి ఆగర్భ దరిద్రంతో ఉత్త చేతులతో మిగిలిన కింది కులాల వారికి, తమ చుట్టూ నివసించే మనుషుల్లోకి కిటికీ తెరిచినట్టయింది. పల్లెల నుండి పట్నాలకు దారులు తెరుచుకుని పల్లె జనంలో చలనం మొదలైంది. అలాంటి బడుల్లో కూడా మొదట పల్లెల్లో బడి సౌకర్యాన్ని అందిపుచ్చుకుని ఎదిగినవాళ్లు ఎక్కువగా అగ్రకులాలవాళ్లే. అదివరకే గ్రామంలో  అంతోయింతో సంపద కలిగినోళ్లే. ఇప్పటికి కూడా కింది కులాల నుండి మరీ ముఖ్యంగా అంటరాని కులాల నుండి అనేక గండాలు దాటుకుని పెద్ద చదువులు చదువుకుని నిలదొక్కుకునేది ఒక్క శాతం మాత్రమే ` నూటికొక్కరు.
                గ్రామాల్లోని మిగతా 70 శాతం ప్రజలు నిత్య దరిద్రంతో ` ఉన్నవి పోగొట్టుకుని ` అప్పటి నుండి ఇప్పటి దాకా యుద్ధరంగంలో హింసల కొలిమిలోనే బతుకుతున్నారు. అయితే ఏదో కారణం చేత చంపబడడం ` లేకపోతే చిన్న వయసులోనే చనిపోవడం నిత్యకృత్యం.  ఇలాంటి చిక్కుదారులగుండా కోస్తాంధ్ర, తెలంగాణా సరిహద్దుపల్లె అయ్యోరిగూడెంనుండి మొదలైన గోపి నడక మామునూరు హైస్కూలు చదువు ` విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్‌, ఉస్మానియాలో మెడిసన్‌, కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ Ê టెక్నాలజీలో డిఎం కార్డియాలజీదాకా సాగింది. ఒక పల్లెటూరి దళిత పిల్లవాడి కత్తుల వంతెన మీద ప్రయాణం. చావుకు మిల్లీమీటరు దూరంలో ఎన్నిసార్లో చుట్టుముట్టబడి ` తన సహచరులెందరో కూలిపోయినట్టు కూలిపోవాల్సిన వాడే. బహుశా నిత్యం జ్వలిస్తూ ఈ విధంగా మన ముందు నిలబడ్డ గోపీది సాహసయానమేకాక ఒక అపురూప ఘటనే.....
                గోపి పల్లె నుండి బయటపడిన కాలం ` అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మాయ బట్టబయలైన సమయం. నెహ్రూ ప్రవచించిన సంక్షేమం `గాంధీ హరిజనోద్ధరణ కానరాలేదు. పేదలు మరింత పేదవాళ్లయ్యారు. అంబేడ్కర్‌ ప్రవచించిన రాజ్యాగంలోని సామాన్యుల హక్కులు కాలరాచివేశారు.... తెలంగాణాలో 1969 వరకు దళిత కులాల పేద పిల్లలు గోపిలాగే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవితమొక అగ్నిగుండమని గుర్తించారు. ప్రపంచవ్యాపితంగానే ఇది ఒక కోపోద్రిక్త కాలం. దేశవ్యాప్తంగా రెక్కవిప్పుతున్న రెవల్యూషన్‌ నక్సల్బరీ కొత్తదారిలో యాంగ్రీ యంగ్‌మెన్‌ సమస్తాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని మార్చాలని బయలుదేరిన యువకులు... 1969లో మొదలైన తెలంగాణా విద్యార్థుల ప్రత్యేక తెలంగాణా పోరాటం ` 1972 వరకు 370 మంది విద్యార్థుల హత్యతో............. మరోమారు తెలంగాణా రక్తసిక్తమైంది. అప్పటికే తెలంగాణా సాయుధపోరాటం చెల్లాచెదురైన అనుభవం తెలంగాణా ప్రజలకున్నది. ఎప్పటిలాగే ప్రజలు తమ బిడ్డలను పోగొట్టుకుంటే ` మోసగాళ్లు అధికారాన్ని, ఆస్తుల్ని పంచుకున్నారు. కాని మానని గాయం మాటేమిటి? అది లోలోపల సలిపింది. రగిలింది. 1974 వరకు తెలంగాణాలో అన్ని యూనివర్సిటీల్లోని ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని ` విప్లవ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో ఏకమయ్యారు. రాడికల్‌ విద్యార్థి సంఘంగా ఏర్పడి రోడ్‌ టు రెవల్యూషన్‌రచించుకున్నారు. ఉస్మానియాలో జార్జిరెడ్డిని మతవాదులు చంపేశారు. అగ్గిరాజుకుంది. అత్యవసర ప్రకటన తర్వాత దేశమే పెద్ద జైలు అయ్యింది. నిర్బంధంలో జైళ్లు కొత్త రకం పాఠశాలలయ్యాయి. చరిత్రను, రాజకీయాలను, తత్వశాస్త్రాన్ని, ఉత్పత్తి, పంపకం, పెట్టుబడి భూమిక గురించి, భూమి గురించి తెలుసుకున్నారు.
                ఎమర్జెన్సీ ఎత్తివేత తరువాత రాడికల్‌ విద్యార్థులు రోడ్‌ టూ రెవల్యూషన్‌లో భాగంగా తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపి 1978 ఫిబ్రవరిలో రాడికల్‌ విద్యార్థి సంఘానికి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్‌ (ఆజాద్‌) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
                ప్రపంచంలోనే మొదటిసారిగా ` విద్యార్థులు గ్రామాలకు తరిలారు. అదివరదాకా స్కూళ్లు, కాలేజీల్లో కల్లబొల్లి చదువుల స్థానే ` వాళ్ల గ్రామాలను, ప్రజల జీవితాన్ని మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేశారు. ప్రజల దగ్గరికి విద్యార్థులు వెళ్లడమనే ప్రక్రియ ఉత్తర, దక్షిణ తెలంగాణాల్లోనే కాదు` కోస్తాలో, రాయలసీమలో ఒక ఉప్పెనలాగా సాగింది.
గ్రామాలల్లోని ప్రజల స్థితిగతుల గురించి, భూ వివరాలు, కులాలు, సామాజిక సంబంధాలు, పంటలు, నీటి వసతులు, కూలిరేట్లు, రవాణా సౌకర్యాలు ` వైరుధ్యాలు తదితర అనేక విషయాల గురించి కొన్ని లక్షల పేజీల సమాచారం సేకరించారు. ఇట్లా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకుని ` విద్యార్థులు ఈ పరిస్థితులు మార్చే        క్రమంలో ` మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
                గ్రామాల్లో రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయడానికి రాడికల్‌ విద్యార్థులు కృషి చేశారు. ఆటపాట నేర్చుకున్నారు. నిజమైన ప్రజాకళాకారులై వందల సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామాల్లో, చిన్నచిన్న పట్నాల్లో ` బీదలపాట్లు, భూమి బాగోతంలాంటి వీధి నాటకాలను జననాట్యమండలితో కలిసి ప్రదర్శించారు. లోకల్‌ విషయం, స్థానిక భాషలో నిజమైన మనుషుల ఆహార్యంతో ప్రజల్లో కొత్త ఆలోచనలకు, ఐక్యతకు ఆచరణకు ఇవి కారణమయ్యాయి. విద్యార్థుల ఇలాంటి సాహసోపేత ఆచరణకు సంబంధించి ఇంతవరకు ఎక్కడా వివరంగా రికార్డు కాలేదు.
                భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పోరాటాలకు తెరదీసిన ఒక గొప్ప మలుపుకు కారణమైన విద్యార్థులకు గోపి నాయకుడు. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల నిర్మాణం జరిగి, కృార భూస్వాములతో తలపడ్డాయి. గ్రామంలోని అమానవీయ పద్ధతులైన, వెట్టి, కులవివక్షత, అంటరానితనం, అక్రమ గ్రామపంచాయతి పద్ధతి, కూలి రేట్ల పెంపకం, బంజరు, షికం భూముల ఆక్రమణదాకా అనేక విషయాల్లో పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. ఈ ఘర్షణలు ముదిరి నిర్బంధం, పోలీసుల రంగ ప్రవేశం, అరెస్టులు, కోర్టు కేసులతో పల్లెలు అట్టుడికాయి... దొరలను ప్రజలు సాంఘికంగా బహిష్కరించారు. దొరలు గడీలు వొదిలి పట్నాలకు పారిపోయారు. దొరలు అనేకరకాలుగా ఆక్రమించిన భూములను ప్రజలు దున్నుకున్నారు. జగిత్యాల జైత్రయాత్రతో ప్రారంభమైన ఈ పోరాటాలు దావానలంలా అన్ని జిల్లాలకు వ్యాపించాయి. ఫలితంగా కల్లోలిత ప్రాంతాల చట్టం వచ్చింది. విద్యార్థులు అనేకమంది అజ్ఞాత జీవితంలోకి వెళ్లి పూర్తి కాలపు విప్లవకారులుగా మారడం, పోరాటాలు పల్లెల నుండి సింగరేణి గనుల్లోకి, సాయుధ దళాల నిర్మాణంతో అడివిలోని ఆదివాసుల్లోకి విస్తరించాయి. ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు. కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించి వేలాది విద్యార్థులు పాల్గొన్న ఒక గొప్ప ఉద్యమంలోని అనేక ఆటుపోట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, ఈ సరికొత్త ఆరాట పోరాటాల మదింపు, కొనసాగింపు చేసి ముందుకు నడిపించిన నాయకత్వంలో గోపిది ప్రధాన భూమిక. గోపీ తన పుస్తకంలో తను ఎంచుకున్న మార్గంలో రాశారు. కాని ` కీలకమైన ఘట్టాలను, మలుపులను, విభిన్న ధోరణులు ` వాటిని సమన్వయపరిచిన తీరు ` ముఖ్యంగా ఆ వొత్తిడిని, వేడిని, స్పర్శను అనుభవించాడు గనుక అలాంటి అపురూపమైన విషయాలు గోపియే రికార్డు చేయవల్సి ఉన్నది. ఉద్యమాలు అభివృద్ధి చెందే క్రమంలో జరిగిన టూలైన్‌ స్ట్రగుల్‌ గురించి, గ్రామీణ సంబంధాలలో కులం పాత్ర గురించి ` అంతవరదాకా రాజ్యమేలిన రొమాంటిక్‌ భావవాద అంచనాల నుండి, వాగాడంబరం నుండి, ఉద్యమాలను భూమార్గం పట్టించిన అతి కొద్ది మందిలో గోపి ఒకరు. 1982లో మద్రాసులో నేషనాలిటీ క్వశ్చన్‌ ఇన్‌ ఇండియామీద అఖిల భారత విద్యార్థి సెమినార్‌ ఏర్పాటు మొదలు విద్యార్థి ఉద్యమం అఖిల భారత స్థాయిలో ఏర్పాటుదాకా రాజ్‌కుమార్‌, గోపిలాంటివాళ్లు పూనుకుని చేసినవి. గోపి 1978 నుండి 1982 దాకా అనేక మహత్తర పోరాటాలు చేసిన రాడికల్‌ విద్యార్థి సంఘానికి నాయకుడుగా ఉన్నాడు.
                ఆ ఉప్పెన ప్రవాహంలోంచి గోపి డాక్టర్‌గా తను ప్రజలతో మమేకం కావాలనుకుని బయటపడి అనేక అడ్డంకులు ఎదుర్కొని ఒంటరి పోరాటంతో దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న దళిత కార్డియాలజిస్టుగా ఎదిగారు.... అయినా మళ్లీ అనేక పోరాటాలు ` కులాలతో, వర్గాలతో ` కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్న అంతరాల సమాజంలో అదే అశాంతి. అదే కత్తి అంచు మీద ప్రయాణం.......
                రాజ్యాంగం ప్రవచించిన హక్కులను, ఎన్నికల రాజకీయాలను, భారత దేశంలోని కింది కులాలవాళ్లు చైతన్యవంతంగా ఉపయోగించుకుంటే దళితులు రాజ్యాధికారం చేపట్టగలరనే ఆలోచనలతో దివంగత కాన్షీరాం బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో కలిసి గోపి ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీల నాయకునిగా పనిచేశారు.
                పాలకవర్గాలల్లోని అంతర్గత వైరుధ్యాల మూలంగా అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు దళిత కులాలకు  రాజ్యాధికారం రాజ్యాంగం మేరకైనా జరుగుతాయామోకానీ అవి తాత్కాలికమే. సర్వసంపదలు చేజిక్కించుకున్న  దోపిడీ అగ్రవర్గాలు అధికారం పేద ప్రజలకు అంత సుళువుగా ఇవ్వరని గోపికి తెలియంది కాదు. అయినా అధికార రాజకీయాలను అధ్యయనం చేశాడు. బిఎస్పీ ఉత్తర్‌ప్రదేశ్‌కే పరిమితమవడం మూలంగా ` అప్పుడప్పుడే సాంప్రదాయక కాంగ్రెస్‌ రాజకీయాల స్థానే రంగంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితిలాంటి పార్టీలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అన్ని పార్టీలలో నాయకత్వ స్థానంలో ఉండి ఆయా పార్టీలలో కొనసాగే ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు, డబ్బు, ద్వంద్వ ప్రమాణాలతో ఇమడలేక ` సరిపడక ` జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్‌ అధ్యయన వేదిక, హాస్పిటల్‌ నిర్వహణలో ` తను నమ్మిన విలువల కోసం ఎంచుకున్న మార్గంలో సాగిపోతున్నారు.
                తన తరం మనుషులందరిలాగే ` ఒకసారి ప్రజల పక్షం అనే ముళ్లదారిలోకి ప్రవేశించినవారు ` సామాజిక శాస్త్రాలైన మార్క్సిజాన్ని, అంబేడ్కర్‌ను, ఫూలేను తెలుసుకున్నవారు ` ఎక్కడున్నా మండుతూనే ఉంటారు. అసమ విషమ తలకిందుల ప్రపంచంతో నిరంతరం తలపడుతూనే ఉంటారు. తనకు తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అంతర్‌ బహిర్‌ యుద్ధమే ఈ పుస్తకం.
                అయితే ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం ` ప్రచురించడం ఒక సాహసమే ` ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ` ప్రపంచ ప్రజలందరు
తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి ` ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......
                ఈ పుస్తకంలో ఎక్కువగా ఫోకస్‌ చేసిన విషయం ` ‘కులం పాత్ర’. రాష్ట్రవ్యాప్తంగా కులాల పొందిక ` ఘర్షణలు, కులాల ఆర్థిక పరిస్థితులు, కుల రాజకీయాలు ఒకే తీరుగా లేవు. ఈ నలుబై సంవత్సరాల ప్రజా పోరాటాలు అన్ని రంగాలల్లో వేగవంతమైన మార్పులు తెచ్చిన విధంగానే కులాల విషయంలో అనేక మార్పులు తెచ్చాయి. గోపి జీవితమే ఇందుకుదాహరణ. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపర్చిన హక్కుల గురించిన బహుజన కుల సంఘాలన్నీ సంఘటితపడి పోరాడుతున్నాయి. అధికారంలో తమ వాటా గురించి డిమాండు చేస్తున్నాయి. అధికారంతోపాటు ఉత్పత్తి వనరులైన భూమి, పరిశ్రమల్లో కూడా తమ హక్కు కోసం ` అంతిమంగా పీడిత శ్రామిక కులాల రాజ్యాధికారం కోసం, విముక్తి కోసం తమ పోరాటాలకు పదును పెట్టవలసి ఉన్నది. ఇలాంటి ఆవశ్యకత గురించి గోపి చర్చించారు. కింది కులాలతో పై కులాలు చేరడం అతి తక్కువేగాని ` అమానుషమైన, హేయమైన అంటరానితనం చాలా వరకు తగ్గింది. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల ఆవిర్భావం ` అందులో కింది కులాలైన మాదిగ, మాలలు సమీకరించబడడం జరిగింది. గ్రామాల్లో భూస్వాముల అన్ని రకాల దోపిడీ, పెత్తనాలను ఎదిరించడంతోపాటు కుల వివక్షను ఎదిరించడం కూడా ఒక పోరాట రూపమైంది. అనేక గ్రామాలల్లో బతుకమ్మ, పెళ్లిళ్ళలాంటి సామూహిక సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని కులాలవాళ్లు కలిసిపోయి బంతి భోజనాలు చేశారు. నిజానికి మన రాష్ట్రంలో గత నలుబై సంవత్సరాలుగా జరుగుతున్న ప్రజా పోరాటాలు ` అవి అంటరాని కులాలల్లో తెచ్చిన మార్పుల గురించి అధ్యయనం చేయాల్సిన విషయం.
                భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఫ్యూడల్‌ ఉత్పత్తి విధానంతోపాటు సర్వసంపదలు ఉన్నత కులాలు చేజిక్కించుకోవడం ` సర్వసంపదల సృష్టికర్తలైన కింది కులాలు, శక్తివంతులై ఉండికూడా అల్ప సంఖ్యాకులైన పై కులాలతో చేసిన పోరాటాల చరిత్ర ` భూమి కోసం, భుక్తికోసం సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఇప్పటిదాకా కొనసాగుతున్న పోరాటాలను గోపి కలగన్న విధంగా ` ఇలాంటి పోరాటాలు వేగవంతమై విజయం సాధించడానికి ` కులం అడ్డంకిగా ఉన్నది. కింది కులాల చైతన్యవంతమైన తిరుగుబాట్లు ` నేర్చుకున్న గుణపాఠాలు, ఇవ్వాళ ప్రజా పోరాటాల్లో కింది కులాల పాత్ర గురించి సరైన విశ్లేషణ జరుగాల్సి ఉన్నది. అయితే ప్రజా ఉద్యమాలు పాత సాంప్రదాయిక బ్రాహ్మణ భావజాలంతో తలపడి, పోరాడి దాని నుండి బయటపడి, నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నాయనేది కూడా ఒక వాస్తవం.
                గోపిలాంటి కొద్దిమంది వర్గపోరాటాల చరిత్ర ` కులం నిర్వహించిన భూమిక, విధ్వంసక పాత్ర, గురించి పట్టుదలతో అధ్యయనం చేస్తున్నారు. అలాంటి కృషిలో భాగంగానే ఈ పుస్తకం వెలువడుతున్నది.
                మర్యాదస్థుల, పైకులాల రచనాపద్ధతి కాదిది. మట్టిలోంచి లేచిన రాయిలాంటిది. నామట్టుకు నేను ` మర్యాదపూర్వకమైన, తానొవ్వక, నొప్పించక, తప్పించుక తిరిగే రచనలు, సాహిత్యం విరివిగా చదివిన, వాస్తవికతను చర్చించడంస్వీకరించడం తక్కువైన సాహిత్య వాతావరణంలో గోపి అస్తుబిస్తు వాక్యాలకు, కటువైన వెంటాడే కంఠస్వరానికి బిత్తరపోయాను, కకావికలయ్యాను. యుద్ధరంగ స్థలం ` మారుమూల ప్రాంతాల్లోకి ` అదృశ్య, అంతుతెలియని అరణ్యాల్లోకి ` భూమి పొరల్లోకి విస్తరిస్తున్నది..... కన్నీళ్లంత స్వచ్ఛంగా, నిలువెల్లా వణికిపోయే ` ఉన్నకాడ ఉండనీయని, దుర్మార్గపు తరతరాల భూస్వామ్యపు మర్యాదస్థుల సాహిత్య విధ్వంసంలోంచి ` నేలల్లోంచి ఈ దుమ్ము ఎగిసి కమ్ముకోవాల్సిందే. నిజానికి కాల్పనిక కథలు, నవలలు, కవిత్వమంత సుందరమైంది కాదీ రచన.
                నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాదిగ, మాలలతో కలసి బతుకుతున్నా ` వాళ్ల సౌందర్యవంతమైన ఆచరణ నుండి బతకడం నేర్చుకున్నా ` అలాంటి లేమిలో ` మారుమూల పల్లెటూర్లో బతికినా ` కుల వివక్షతను బతుకు పొడుగంతా అన్ని చోట్ల ఏదో రూపంలో ఎదుర్కుంటున్నా కూడా ` అంటరానితనం జ్వర తీవ్రత నాకు తాకలేదు. అయితే అన్నీ చేసి, సంపద, జ్ఞానం ప్రపంచానికిచ్చి అవమానాలు పొందితే ఎట్లా
ఉంటుందో అనుభవంలోకి రావడం ` దాని కోసం పెనుగులాడటం  ద్వారా ఇక్కడ నిలబడి ` ఈ పుస్తకాన్ని ఇందులోని జ్వరతీవ్రతను ముట్టుకోవడం ద్వారా ` ఈ నాలుగు మాటలు రాయ ప్రయత్నించాను.
                ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతి స్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా ` గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు ` తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు ` మేధావిగా గుర్తింపు పొందవచ్చు ` శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి  సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం....  అయినా పోరాటం మనిషి తనంతట తాను ఎంచుకునేది కాదు. అది అనివార్యంగా రుద్దబడేది. అత్యంత విషాదం ప్రపంచంలో ఇదే. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మనిషి యుద్ధం బయట ఉండగలడు? అనూహ్య ప్రదేశమైన అబూజమహడ్‌ ` ఇప్పటికీ కులం, మతం, స్వంత ఆస్తి తెలియని ఆదివాసుల మీద ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వ సైన్యం ఆధునిక ఆయుధాలతో మానవరహిత యుద్ధ విమానాలతో దిగుతోంది. మూలవాసుల ఆస్తుల్ని, దేశాల సరిహద్దుల్ని చెరిపేసి కొల్లగొట్టబడే ` ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద గొప్ప దోపిడి సన్నివేశంలో ` ప్రతిదీ ఒక పేలే తుపాకే ` అది కొండ
చిలువలా నోరు తెరుచుకున్న రోడ్డు కావచ్చు. కుప్పతెప్పలుగా విస్తరించే నెట్‌వర్కులు, మీడియా మాయాజాలం కావచ్చు. అది స్వైన్‌ ఫ్లూ కావచ్చు ` ఎయిడ్స్‌ కావచ్చు ` కార్చిచ్చులా గుప్పుమనే మరేదైనా కావచ్చును.......
                భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు, అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ` వేలసంస్థలు ` నెట్‌వర్కులు ` టీవీలు ` ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికావారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది.
                అదిగో అలాంటి సన్నివేశంలో, సందర్భంలో పోరాడే ప్రజల పక్షాన నిలబడి ` లోపలి, బయటి వైరుధ్యాలను మనతో పంచుకుంటున్నాడు..... అలాంటి జ్వరతీవ్రతగల గోపిని ఆలింగనం చేసుకుంటూ......


అల్లం రాజయ్య
మంచిర్యాల , 10 – 04 - 2012  

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు:

నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం 

- డా. గోపీనాథ్ 

        వెల : రూ. 100

మొదటి ముద్రణ : సెప్టెంబర్‌ 2013

ప్రతులకు, వివరాలకు :  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ ` 500 006.
ఫోన్‌ : 23521849

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌