Sunday, February 26, 2012

కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపు ...

''దేవుడున్నాడా? చూపించు'' అనే నాస్తిక, హేతువాదులు గానీ, ''అడుగో గోడలో ఉన్నాడు. ఇడుగో స్తంభంలో ఉన్నాడు'' అనే ఆస్తిక, భక్తిపారాయణులుగానీ ప్రధానంగా నిరూపణవాదాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు.

ఆటవిక దశ దాటని ఈశ్వరారాధకులు భగవత్‌ దర్శనం చేయించలేనట్టే, ప్రాథమిక భౌతికవాద దృష్టిని మాత్రమే కలిగిన నిరీశ్వరవాదులు తమ వాదనకు అనువుగా ప్రకృతి లీలలను ప్రదర్శించలేరు.

ఈ విషయంలో ఇరుపక్షాలూ మూర్ఖులేననేది కొడవిటిగంటి రోహిణీ ప్రసాద్‌ పరిశీలన.
భౌతిక సూత్రాలను అనుసరించి సాగే ప్రకృతి ... మానవాళికి నిదర్శనాలను చూపించాల్సిన అవసరమే లేదని, మన మంచితనం, అవగాహన, చైతన్య స్థాయిలతో దానికి పనిలేదనేది ఆయన వాదన.

భౌతిక యుద్ధంలో ప్రత్యర్థి బలంపై దెబ్బకొట్టాలనే మార్క్సిస్టు సాహిత్యకారుడు కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపుగా అన్నట్టు సంక్లిష్టమైన మానవ మెదడులో దేవుడు రూపుదిద్దుకున్న క్రమాన్ని ఆయన కుమారుడు రోహిణీప్రసాద్‌ సానుభూతితో పరిశీలించి చేసిన విలువైన విశ్లేషణలతో ''మనుషులు చేసిన దేవుళ్లు'' వ్యాసాలు రూపుదిద్దుకున్నాయి.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ఈ పుస్తకంలోని 44 వ్యాసాల్లో ప్రధానంగా వైజ్ఞానిక దృష్టి కనిపిస్తుంది.

మతాన్ని సమాజ పరిణామక్రమం నుంచే గాక జీవ పరిణామక్రమం నుంచి పరిశీలించడం, చరిత్ర నుంచే కాక నాడీ వ్యవస్థ, మెదడు స్పందనల నుంచి దైవ మూలాలను వెలికి తీసేందుకు ప్రయత్నించడం వంటి పోకడల వల్ల ''తెలుగులో మరెవ్వరూ చేయని ప్రయత్నం చేశా''ననే వ్యాసకర్త మాటలకు పుష్టి చేకూరుతోంది.

అయితే మార్క్సిజానికి బయట కూడా మత విశ్లేషణ చేయొచ్చుననే ప్రతిపాదనతో బయలుదేరిన రోహిణీ ప్రసాద్‌, చాలా వ్యాసాల్లో శద్ధ భౌతికవాదిగా తేలిపోయారు. వైజ్ఞానిక కృషికి తాత్విక దృష్టిని జోడించలేకపోవడం వల్ల ఆయన కంటికి 'మతం' మసగ్గానే కనిపించిందని చెప్పక తప్పదు.

- వి. అరవింద్‌
( ఆదివారం ఆంధ్రజ్యోతి 26 ఫిబ్రవరి 2012 సౌజన్యంతో)

మనుషులు చేసిన దేవుళ్లు (వ్యాసాలు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌

పేజీలు196,

వెల: రూ.100/-

Monday, February 13, 2012

వేదాల్లో ఏమున్నది?


వేదాల్లో ఏమున్నది?

''దాచిపెట్టిన జ్ఞానం నిరుపయోగం కావటమే గాక ప్రజలను పీడించటానికి సాధనమవుతుంది'' అని తెలిసిన వాళ్లు చెబుతారు.
వేదాల విషయంలో ఇదే జరిగినట్లు కనబడుతుంది.
వేదాలను బ్రాహ్మలు గుత్తకు తీసుకొని,
వేదాధ్యయనానికి నిషేధాజ్ఞలు కల్పించి,
అందులో ఏమున్నదీ ఎవరికీ తెలియకుండా చేశారు.

ఈ పరిస్థితిని ఆధారం చేసుకొని కొందరు ముందుకు పోవటమంటే
భయమూ, అసహ్యమూ గల వాళ్లు,
వేదాల్లో లేనిది లేదని ప్రజలను నమ్మించ జూశారు.
...
వేదాల్లో ఏమున్నది అన్న విషయం గురించి
మనకు తెలియజెప్పిన వాళ్లు చాలా వరకు పాశ్చాత్యులు.
వాళ్లు సంస్కృతం చదువుకొని,
వేదాలు పఠించి,
అందులో ఏమున్నదీ మనకు తెలియబరచవలసిన దుస్థితి కలిగింది.
...
ఋగ్వేద రచన క్రీస్తు పూర్వం 1500-1400 ప్రాంతంలో
జరిగిందన్న అంచనాను పురాతత్వ శాస్త్రం బలపరుస్తున్నది.
ఋగ్వేదంలో 10,500 పైచిలుకు ఋక్కులున్నాయి.
కొన్ని ఋక్కులను కలిపి ఒక సూక్తం అన్నారు.
శౌనకుడు ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించాడు.

ఋక్కులలో (సూక్తాలలో) కొన్ని స్తోత్రాలు,
కొన్ని ప్రార్థనలు, కొన్ని మంత్రాలు, కొన్ని ఉత్తపాటలు:
'ఒకప్పుడు వాస్తవమూ, విశ్వసనీయమూ, అద్భుతమూ అయినవి,
కానీ తరచూ చపలంగానూ, పామరంగానూ, దురవగాహంగానూ కూడా వుంటాయి''
అన్నాడు మాక్స్‌ ముల్లర్‌.
...
ఋగ్వేదంలోని భాష ఆడంబరంగానూ, పాండిత్య ప్రకర్షతో కూడినదిగానూ ఉండి, తరచుగా చాలా క్లిష్టంగా కూడా ఉంటుంది.
ఋగ్వేద ఋషులు సుమారు 2000 మంది ఉండేవారట.
వారు ఎంతో శ్రద్ధగా ఋగ్వేద రచన చేశారు.
వారు తాము ఆర్యులమని, కొత్త ప్రదేశాలను జయించామనీ చెప్పుకున్నారు.
...
వేదాలు నాలుగంటారు గానీ కొందరు మూడు వేదాలనే గుర్తిస్తారు.
నన్నయ భట్టు భారతం ప్రారంభిస్తూ ''వేదత్రయ మూర్తయః త్రిపురుషాః'' అన్నాడు.
ఋగ్వేదం పోతే మిగిలిన వేదాలు సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం.
కానీ వీటికి కూడా మూలం ఋగ్వేదంలాగనే కనిపిస్తుంది.
...
వేదాల గురించీ, ఆకాలపు మనుషులను గురించీ, తెలుసుకోవడం మనకీనాడు ఎంతైనా అవసరం. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ జీవితంలోనూ, సమాజ స్వరూపంలోనూ ఊహించరాని మార్పులెన్నో వచ్చినా, మన సంస్కృతి అంతా ఆ వేదాల మీదనే ఆధారపడి పెరిగింది.
ఈ 20 (21)వ శతాబ్దంలో ఈ సంస్కృతిలో మౌలికమైన మార్పులు రాకపోతే మనం ప్రపంచ సంస్కృతికి వెనుకబడి ఉండటం తప్పని సరి అవుతుంది.
అందుచేత తెలిసిన వాళ్లు వేదాలను గురించి వేదకాలపు జీవితం గురించి సాధ్యమైనన్ని వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజెప్పాలి.
ఈ సందర్భంలో తప్పుడు భావాలు ప్రచారంలో వుండటం అంత మంచిది కాదు.
...

వేదాల్లో ఏమున్నది ?
- కొడవటిగంటి కుటుంబరావు
పునర్ముద్రణ
పేజీలు 24, వెల: రూ.10
(అవును పది రూపాయలే)

Friday, February 3, 2012

జార్జి రెడ్డి (1947 -1972 ) జ్ఞాపకాలు ...జార్జిరెడ్డి ...
నాలుగు దశాబ్దాలు గడచినా
అతని జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానేవున్నాయి
విద్యార్థి ఉద్యమానికి
వామపక్ష చైతన్యానికి
అతని పేరు ఒక నిరంతర స్ఫూర్తి
ఆ జ్ఞాపకాలను,
ఆ ఉద్యమ స్ఫూర్తిని
అక్షరబద్ధం చేయాలని ఆలస్యంగానైనా
అతని బంధు మిత్రులు సంకల్పించారు.
ఆ పుస్తక ప్రచురణ బాధ్యతను
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ స్వీకరించింది
మీరు కూడా
అతనితో మీకున్న అనుభవాలను,
అతని గురించి మీరు విన్న విశేషాలను తెలిపిి
ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.

Visit the blog on George ReddyL

http://georgereddyamarrahe.blogspot.in/2012_02_01_archive.html
.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌