Sunday, December 24, 2017

ఆ భారతదేశం బతికే ఉందని నమ్ముతున్నాను - పాల్‌ జకారియా


ఆ భారతదేశం బతికే ఉందని నమ్ముతున్నాను
(" కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకానికి ప్రముఖ మలయాళీ రచయిత పాల్ జకారియా రాసిన ముందుమాట )

గౌరి లంకేశ్‌ తను పుట్టిపెరిగిన భారతదేశాన్ని నమ్మింది.
తనకు వారసత్వంగా సంక్రమించిన ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్మింది.

ఆ రెండిటినీ పూర్తి నియంత్రణలో ఉంచుకునే ఆధిపత్య శక్తులను నిత్యం విమర్శిస్తూ కూడా
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని బేషరతుగా నమ్మడంలో ఆమె మిగతా అందరి భారతీయుల్లానే వ్యవహరించింది.

ఆ నమ్మకం వల్లనే ఆమెను వారు - ఆమె నిర్భయంగా తిరిగిన తన ప్రపంచం మధ్యనే, ఆమె ఇంటి గేటు వద్దనే అంత సులభంగా కాల్చి పడేయగలిగారు.

ఆమె లోలోపల ఏవైనా భయాలున్నా పారిపోవాలని మాత్రం అనుకోలేదు, వ్యవస్థను నమ్మడానికే సిద్ధపడింది. కోట్లాది మంది ఇతర భారతీయుల లాగే ఆమె కూడా ఏడు దశాబ్దాల నుంచి మన పాలకులు మనకు చూపిస్తున్న 'ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సంక్షేమ రాజ్యం' అనే సుందర స్వప్నాన్ని నమ్ముతూ వచ్చింది. ఆమె మాట్లాడిన ప్రతి మాటలో, చేసిన ప్రతి పనిలో ఈ నమ్మకం అంతర్లీనంగా వుంది. ఆమె జరిపిన చర్చల్లో, చేసిన వాదనల్లో, పాల్గొన్న పోరాటాలలోనూ అంతర్లీనంగా ఉంది.

మిగతా పౌరులందరి లాగే ఆమె ఆ స్వప్నం తనకు మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి, భీంరావు రాంజీ అంబేద్కర్‌, తదితరుల నుండి వారసత్వంగా వచ్చిందని నమ్మింది. వాళ్లందరి లాగే ఆమె ఆ స్వప్నాన్ని దేశ రాజ్యాంగంలో దర్శించింది. ఆ స్వప్నాన్ని సాకారం చేసే దేశం కోసం శాయశక్తులా పోరాడింది.

కాని ఆమెకు నమ్మకద్రోహం జరిగింది, కోట్లాది మంది భారతీయులందరికీ జరిగినట్లే. దేశాన్ని పాలిస్తున్న వారి మౌనం చూడండి. తూకం వేసినంత పకడ్బందీగా ఒక్క మాట కూడా బయటికి రాకుండా ఎంత ఘనీభవించినట్టు ఉందో! నిజమే... ప్రతి పౌరుని హత్యా పాలకుల అట్టహాస అధికార కార్యక్రమాలలో చోటు సంపాదించుకోలేదు. కాని గౌరి ఎవరు? ఒక లౌకికవాదిగా, ప్రజాస్వామికవాదిగా, ప్రజాపక్షం వహించిన మేధావిగా ఆమె మనందరం స్వప్నించే భారతదేశానికి బీజరూప ప్రతినిధి. ఆమె హత్య అన్ని హత్యల్లాంటిది కాదు. ఆమె ఒక సీనియర్‌ జర్నలిస్టు.

ప్రజాస్వామ్య భావాలకు ప్రచారకర్త. ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధి. స్వేచ్ఛా సత్యాలకై పోరాడిన ఉద్యమకారిణి. అటువంటి వ్యక్తి హత్య చేయబడినపుడు పాలకులు తప్పనిసరిగా దానిపై స్పందించాలి.

ఈ అర్థంలో చూస్తే ఆమె హత్య కేవలం భౌతికం కాదు. ఆమె ఏ విలువల కోసం నిలబడిందో ఆ విలువలను రూపుమాపేందుకు ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య ఇది. చావు అనే పనిముట్టుతో అసమ్మతి గొంతు నులమడమనేది నూటికి నూరుపాళ్ళు ఫాసిస్ట్‌ చర్య. వంద శాతం పిరికి చర్య.

దేశంలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయనే దానికి గౌరి హత్య ఒక విషాద ఉదాహరణ. ద్వేషం, దురాశ, హింస, యుద్ధోన్మాదం అనే బ్లాక్‌¬ల్‌లోకి నేడు దేశం నెట్టేయబడుతోంది.

మనం నమ్మిన, ప్రేమించిన ప్రజాస్వామ్యం, బహుళత్వం త్వరలో కనుమరుగయ్యేలా వున్నాయి. తన 70వ ఏట భారతదేశం ఒక ప్రమాదకరమైన శిఖరపుటంచు పైన నిలబడి ఉంది.

అయినప్పటికీ, ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న పోరాటంలో గౌరి మరణం ఒక నిర్ణయాత్మక మలుపు అవుతుందని ఒక భారతీయుడిగా నేను గట్టిగా నమ్ముతున్నాను. కాని ఆ పోరాటంలో గౌరి మనతో కలిసి నడవదనేది మాత్రం బాధాకరం. ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని
సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉందనే నమ్ముతున్నాను. ఆ ఇండియా బతికే ఉంది. అదే ఇప్పుడు మనకున్న పెద్ద ధైర్యం.

స్వేచ్ఛ, మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి గౌరి ఆలోచనలు అందరికీ అందేలా ఆమె కన్నడ, ఇంగ్లీషు రచనల నుండి కొన్నిటిని ఎంపిక చేసి చందన్‌ గౌడ ఈ పుస్తకం తీసుకురావడం ఎంతో అభినందనీయం. ఒక పౌర-కార్యకర్త (Citizen Journalist)గా ఆమె గొంతెత్తకుండా ఉండలేకపోయిన అనేక అంశాలు ఈ రచనలలో మనకు కనిపిస్తాయి.

ప్రజాసమస్యల గురించి మాట్లాడే హక్కు తనకుందని ఆమె ఎంతగా నమ్మిందో, అలా మాట్లాడడం తన బాధ్యత కూడా అని అంతగానూ నమ్మింది. మానవ చరిత్రలోని అత్యున్నత విలువల కోసం గొంతెత్తి, దాని ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకున్న మ¬న్నత స్త్రీ పురుషుల జాబితాలో ఇప్పుడు ఆమె పేరు కూడా చేరింది.

జీవితాన్ని ఎంతగానో ప్రేమించిన గౌరి మరణం వృధా కాదని, సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్న భారతదేశంలో గుణాత్మక మార్పుకు అది తప్పకుండా దోహదం చేస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను.

- పాల్‌ జకారియా 
కొల్లం, 22 అక్టోబర్‌ 2017

అనువాదం : వేమన వసంతలక్ష్మి

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

1 comment:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌