చంపవలెనా... చంపవలదా ! - గౌరీ లంకేశ్
('కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు' పుస్తకం నుంచి )
THE STATE IS NOT GOD.
IT HAS NOT THE RIGHT TO TAKE AWAY
WHAT IT CANNOT RESTORE WHEN IT WANTS TO.
- Anton Chekhov
రాజ్యం దైవం కాదు. తాను పునర్జీవం పోయలేని దాన్ని హరించే హక్కు దానికి లేదు.
- ఆంటన్ చెకోవ్
మరణశిక్షల గురించి ఆలోచించే వారందరూ జార్జి రాసిన 'ఒక ఉరితీత' అనే వ్యాసాన్ని చదివి తీరాలి. బ్రిటిష్ ఇండియా కాలంలో ఆర్వెల్ పోలీసు అధికారి హోదాలో ఆర్వెల్ బర్మాలో పని చేస్తుండగా ఒక హిందువును ఉరితీయడం గురించి రాసిన వ్యాసమది. ఉరికంభానికి తీసుకుని వెళుతుండగా దారిలో వర్షపు నీటి మడుగు అడ్డమొస్తే ఆ వ్యక్తి దాని మీద అడుగు వేయకుండా కాస్త పక్కకు తప్పుకుని నడవడం రచయిత చూస్తాడు. ఉరికంభం ఎక్కబోతూ కూడా ఆ వ్యక్తి చేసిన ఆ పని రచయితను ఆలోచింప చేస్తుంది. ''పూర్తి స్పహలో ఉన్న ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిని చంపేయడం అంటే ఏమిటో ఆ క్షణం వరకు నేను గ్రహించలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఒక నిండు జీవితాన్ని మధ్యలోనే తుంచేయడం ఎంత ఘోరమైన తప్పో, మరణశిక్షలో ఎంత సంక్లిష్టత ఉందో ఆ ఖైదీ నీటి మడుగును తప్పించుకున్నపుడు నాకు బోధపడింది. అతను చనిపోతున్న వ్యక్తి కాదు. మనమెంత సజీవంగా ఉన్నామో అతనూ అంతే సజీవంగా ఉన్నాడు''
అంటాడు ఆర్వెల్.
ఏ పౌర సమాజంలోనైనా నేరానికి శిక్ష ఉండాల్సిందే. అరుదైన సందర్భాలలోకెల్లా అరుదైన సందర్భంలో విధించేది అయినప్పటికీ మరణశిక్ష అనేది వెనక్కి తీసుకోలేని ఒక ముగింపు. అయినా మరణశిక్షకు మూడు ప్రయోజనాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అందుకే సమర్థిస్తారు. న్యాయస్థానమూ అదే అనుకుంటుంది. ఒకటి - వేరెవరూ అంతటి నేరానికి పాల్పడకుండా నివారిస్తుందని, రెండు - న్యాయం చేస్తుందని, మూడు - ప్రతీకారం తీర్చుకోనిస్తుందని. చివరిదాన్ని మరో రకంగా చెప్పాలంటే 'జనం మనోభావాలను సంతప్తిపరచడమనే' పేరు మీద మెజారిటీ ప్రజల పాశవిక ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వడం.
నేరాల నివారణకు మరణశిక్ష తోడ్పడలేదని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలలో వెల్లడైంది. ఉదాహరణకు, అమెరికాలో నేరస్తులను ఎలక్ట్రిక్ వైర్ వైపుకి నెట్టే రాష్ట్రాల కంటే మరణశిక్ష రద్దు చేసిన రాష్ట్రాల్లో హత్యల సంఖ్య తక్కువ. మన దేశం సంగతే చూద్దాం - రాజీవ్ గాంధీ హత్య కేసులో చెన్నై టాడా ప్రత్యేక కోర్టు జడ్జి మొత్తం 26 మంది కుట్రదారులకూ, వారికి సహాయపడిన వారికీ (అసలు హంతకులు ముందే మరణించారు కనుక) మరణశిక్ష విధిస్తూ ''ఇది విదేశీ కుట్రదారులు లేదా టెర్రరిస్టులు భవిష్యత్తులో భరతభూమిని తమ కిరాతక పనులకు వాడే సాహసం చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది'' అన్నారు. కాని న్యాయమూర్తి చేసిన ఈ హెచ్చరిక అజ్మల్ కసబ్, అతని మిత్రబందం చెవిన పడ్డట్టు లేదు! ఎలాగూ చనిపోవడానికి సిద్ధమై వచ్చే టెర్రరిస్టులు మరణశిక్షలకు భయపడతారనుకోవడం ఎంత హాస్యాస్పదం! ఎటువంటి నివారణ గురించి మనం మాట్లాడుతున్నాం?
''....ఎటువంటి మానవజీవితాలైనా పవిత్రమైనవనే నేను నమ్ముతాను. న్యాయ వ్యవస్థను పరిపూర్ణంగా నమ్మగలిగిన వాడు మరణశిక్ష విధించడం తప్పు కాదని విశ్వసిస్తాను. కాని న్యాయ వ్యవస్థను మూర్ఖులు తప్ప వేరెవరూ పరిపూర్ణంగా నమ్మరు'' అని నీల్ గామాన్ (+aఱఎaఅ) అనే రచయత 'అమెరికన్ గాడ్' (2001) అనే పుస్తకంలో అంటారు.
చట్టసమ్మతమైన పాలన పేరిట మరణశిక్షలను సమర్ధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాని కోర్టులు మరణశిక్షలు విధించిన అనేక కేసుల్లో నిందితులకు నాణ్యమైన న్యాయ సహాయం అందలేదనేది అనేక అధ్యయనాలలో వెల్లడైన విషయం. దీనిలోని నిజానిజాలు తెలుసుకోవడానికి మనం చరిత్రలో ఎక్కువ దూరం కూడా పోనవసరం లేదు. భారత పార్లమెంట్‌పై 2001 డిసెంబర్‌లో జరిగిన దాడి కేసులో కింది కోర్టు అఫ్జల్ గురు, ఎస్.ఎ.ఆర్. గిలానీలకు మరణశిక్ష విధించింది. గిలానీ కేసును ప్రముఖ న్యాయవాది రాం జేత్మలాని చేపట్టారు కనుక సుప్రీంకోర్టు అతన్ని నిర్దోషిగా భావించి వదిలిపెట్టేసింది. ఆ స్థాయి నాణ్యమైన న్యాయ సహాయం అందని అఫ్జల్ గురుకి మాత్రం ఉరిశిక్ష విధించింది. అమెరికా వంటి దేశాల్లో కూడా దర్యాప్తు సరిగ్గా జరగకపోవడం,
న్యాయవ్యవస్థ పక్షపాత ధోరణుల వల్ల అనేక మందికి మరణశిక్షలు పడుతుంటాయి. దీనికి ఇటీవలి ఉదాహరణ రూబిన్ 'హరికేన్' కార్టర్. ఈ బాక్సర్‌కు ఒకసారి కాదు రెండుసార్లు మరణశిక్ష విధించారు. అంతటి నేరస్తుడు అనుకున్న వ్యక్తి 20 ఏళ్ళ పాటు జైల్లో ఊచలు లెక్కపెట్టిన తర్వాత చివరికి నిర్దోషి అని ప్రకటించి 1985లో విడుదల చేసారు. మరణశిక్షలు విధించడంలో కొన్ని పొరపాట్లు చేశామని మన సుప్రీంకోర్టు కూడా 2009లో ఒప్పుకుంది. వాస్తవం ఈ విధంగా ఉంటే, ఉరిశిక్ష పడిన ప్రతి మనిషి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని మనం
మనస్ఫూర్తిగా అనగలమా?
'ది లాస్ట్ డే ఆఫ్ ది కండెమ్డ్ మాన్' (1829) అనే నవలికలో విక్టర్ హ్యూగో మీరు 'సమాజం ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. శిక్ష విధించాల్సిందే' అంటున్నారు. రెండూ తప్పే. ప్రతీకారం తీర్చుకునేది మనిషి. శిక్ష విధించేది దైవం'' అంటాడు.
కొందరు న్యాయస్థానాలు - అంటే రాజ్యం మరణశిక్ష విధించడంలో తప్పులేదని నమ్ముతారు. అశేష ప్రజల మేలు కోసం ఆ శిక్షను విధించే హక్కు రాజ్యానికి ఉందని నమ్ముతారు వాళ్లు. కాని ఒక వ్యక్తి ఎవర్నయినా హత్య చేయడం తప్పయినప్పుడు రాజ్యం అటువంటి తప్పుకే పాల్పడటం ఒప్పెలా అవుతుంది? హత్యా నేరానికి మరణశిక్ష విధింపును మనం సమర్ధించేట్లయితే మనం మధ్యయుగాల నాటి కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, దొమ్మీకి దొమ్మీ, విధ్వంసానికి విధ్వంసం రోజులకు వెనక్కి పోవాల్సి ఉంటుంది. తాలిబన్ ముల్లాల్లా కాకుండా కొంచెం తార్కికంగా ఆలోచిద్దాం. 'ప్రజల మనోభావాలనో, ఉమ్మడి అంతరాత్మనో సంతప్తి పర్చడం' కోర్టుల పని కాదు. అటువంటి అసంగతమైన ఆలోచనలకు చట్టంలో తావు లేదు.
మానవహక్కుల కార్యకర్త కె. బాలగోపాల్ ఒకానొక వ్యాసంలో రాసినట్లుగా ''వ్యక్తిగత ప్రతీకారం నేరానికి జవాబు కాదని ఆధునిక చట్టాలు స్పష్టం చేశాయి. నైతికంగా అది ఎంత సమర్ధనీయమైన ప్రతీకారం అయినప్పటికీ దాన్ని చట్టాలు అనుమతించవు. అలాంటప్పుడు నల్ల గౌన్లు తొడుక్కుని, సమాజ నైతిక అంతరాత్మ పేరిట దొడ్డిదారిన మరణశిక్షను విధించడాన్ని ఎలా అనుమతిస్తారు?''
ఇటీవల మన భారతీయులు ప్రపంచీకరణకు మరింత చేరువయ్యారని చాలామంది సంతోషిస్తున్నారు. కాని మరణశిక్ష విషయంలో మాత్రం ఆ శిక్షలు రద్దు చేసిన 139 దేశాల సరసన నిలబడడానికి మనం సిద్ధపడం. సిద్ధపడకపోగా ఈ జుగుప్సాకరమైన న్యాయశిక్షా పద్ధతిని పట్టుకుని వేళ్లాడుతూ ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియా, చైనా, మరీ ముఖ్యంగా అమెరికా వంటి దేశాల పక్కన నిలబడడానికి ఇష్టపడతాం. ఈ భావాల నుండి ఇంకెప్పటికి బయటపడి ఎదుగుతాం?
ఈ వ్యాసం రాస్తున్న సమయానికి యాకుబ్ మెమన్ భవిష్యత్తు ఏమిటో ఇంకా తేలలేదు. అతను నిజంగానే 257 మంది హత్యలకు బాధ్యుడై ఉంటే చివరి ఘడియల వరకూ అతన్ని ఆ జ్ఞాపకాల నరకంలో కొట్టుమిట్టాడుతూ బతకనివ్వండి. అంతేగాని అతని రక్తం నా చేతులకు, మనసుకి అంటడం నా వరకు నాకు సుతరామూ ఇష్టం లేదు.
(బెంగుళూరు మిర్రర్, 28 జులై 2015)
అనువాదం : కె. సుధ
( ఈ వ్యాసం అచ్చయిన రెండవ రోజునే తన 53వ పుట్టినరోజు నాడు యాకుబ్ మెమన్‌ను ఉరి తీశారు. )
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు
ఇంగ్లీష్ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి, కె.సజయ, ప్రభాకర్ మందార, పి.సత్యవతి, కాత్యాయని, ఉణుదుర్తి సుధాకర్, కె. సురేష్, కె.ఆదిత్య, సుధాకిరణ్, కల్యాణి ఎస్.జె., బి. కృష్ణకుమారి, కీర్తి చెరుకూరి, కె. సుధ, మృణాళిని, రాహుల్ మాగంటి, కె. అనురాధ, శ్యామసుందరి, జి. లక్ష్మీ నరసయ్య, ఎన్. శ్రీనివాసరావు, వినోదిని, ఎం.విమల, ఎ. సునీత, కొండవీటి సత్యవతి, బి. విజయభారతి, రమాసుందరి బత్తుల, ఎ.ఎమ్. యజ్దానీ (డానీ), ఎన్. వేణుగోపాల్, శోభాదేవి, కె. లలిత, ఆలూరి విజయలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి
230 పేజీలు , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment