Friday, February 27, 2015

"ఆలస్యమైనా ... ఆనందంగానే ఉంది !" కె.లలిత గారితో వసంత లక్ష్మి గారి ఇంటర్వ్యూ - ఆంద్ర జ్యోతి

"ఆలస్యమైనా ... ఆనందంగానే ఉంది !"

'90లలో 'విమన్ రైటింగ్ ఇన్ ఇండియా' ఒక పెద్ద సంచలనం. '
' వాళ్ళూ రాశారు' అనే మాట స్థానంలో 'ఇన్ని రాశామా' అని స్త్రీలలోనే ఆశ్చర్యం కలిగించి,
'ఇన్ని రాసినా గుర్తించరేం' అనే ఆగ్రహం కలిగించి ,
'ఎందులోనూ ఎవరికీ తీసిపోము' అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగించిన రెండు గొప్ప సంకలనాలివి.
సంపాదకులైన సుశీతారు, కె.లలితల సుదీర్ఘ శ్రమ ఫలితంగా వెలువడ్డ ఈ గ్రంధాలలో రెండవ దాన్ని
"దారులేసిన అక్షరాలు- ఇరవైయ్యవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు" పేరుతో అన్వేషి, హెచ్ బీ టీ కలిసి ఇటీవల తెలుగులోకి తీసుకొచ్చాయి. ఆ సందర్భంగా కె.లలితతో ఇష్టాగోష్టి .

(ఆంధ్రజ్యోతి 23 ఫిబ్రవరి 2015 సౌజన్యంతో )

దారులేసిన అక్షరాలు - 
ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 

సంపాదకులు : సుశి తారు, కె.లలిత

600 పేజీలు, ధర : రూ. 400/-

ప్రతులకు, వివరాలకు: 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849


E Mail:    hyderabadbooktrust@gmail.com


వెలుగు దరికి ... తెలుగు దారి ! కే.లలిత గారితో సరస్వతీ రమ గారి ఇంటర్వ్యూ - సాక్షి దినపత్రిక


వెలుగు దరికి ... తెలుగు దారి !
దారులేసిన అక్షరాలు !ఇరవయ్యవ శతాబ్దపు మహిళల రచనల సంకలనం.
ఇంగ్లీష్ లో వచ్చిన "విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా " కు తెలుగు అనువాదం.
ఆంగ్ల మూలానికి సారధ్యం వహించిన వనితలు సూశీతారు , కే.లలితలే ఈ తెలుగు అనువాదానికీ
సంపాదకత్వం వహించారు.
ఆ రచనల గురించి కే.లలిత తో సరస్వతీ రమ జరిపిన ఇంటర్వ్యూ .

(సాక్షి 06 ఫిబ్రవరి 2015 సౌజన్యం తో ...)  దారులేసిన అక్షరాలు - 
  ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 

  సంపాదకులు : సుశి తారు, కె.లలిత

  600 పేజీలు, ధర : రూ. 400/-

  ప్రతులకు, వివరాలకు: 

  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
  85, బాలాజీ నగర్‌,
  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
  ఫోన్‌ : 040 23521849


 E Mail:    hyderabadbooktrust@gmail.com


 

Tuesday, February 17, 2015

అత్యంత వాస్తవికంగా, గొప్ప దార్శనికతతో వ్రాసిన కథలు

ఇస్మత్‌ చుగ్తాయ్‌ కథలు – ఉమామహేశ్వరి నూతక్కి


”హృదయంలేని మనిషొకరు ఒక నల్లటి బక్క పిల్లని బెత్తంతో నిర్దాక్షిణ్యంగా బాదుతున్నారు. అతనెవరో, దెబ్బలు తింటున్న ఆ అభాగ్యుగాలెవరో కూడా తెలుసుకొనే వయసు నాకు లేదు. కానీ నాకు బాగా ఏడుపొచ్చింది. బాగా ఏడ్చాను. ఆ లావాటి బెత్తం ఆ పిల్ల వీపు మీద చేసిన శబ్దం నా చెవులలోనే ఉండిపోయి ఇప్పటికీ తరుచూ వినపడుతూ ఉంటుంది.
నాకప్పుడర్థం అయ్యింది. పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళని ఎప్పుడూ కొడతారు. బలవంతులు బలహీనులను హింసిస్తారు. బలవంతులు తల ఎత్తుకు నిలబడతారు. బలహీను వాళ్ళ పాదాల కింద ధూళిలా అయిపోతారు అనిపించింది. నేను బలవంతులను అభిమానించి బలహీనులను ఏవగించుకోవడం మొదలుపెట్టాను. అయినప్పటికీ నా లోపల నాకు తెలియని భావాలేవో దాగి ఉన్నాయి. ఒక గొప్ప భవనపు గోడలకి నాచు పట్టి గడ్డీ గాదమూ మొలచినప్పుడు నేను లోలోపల సంతోషించేదాన్ని. చిరునవ్వు వచ్చేది నాకు. అంతటి భవనాన్ని నాశనం చేయగల శక్తి ఆ పిచ్చి మొక్కకి ఉండడాన్ని చూస్తే సంభ్రమం కలిగేది….”
ఈ మాటలు ఇస్మత్‌ చుగ్తాయ్‌ తన జీవన యాత్రలో ”ముళ్ళూ పువ్వులూ” అంటూ తన గురించి చెప్పుకున్న నాందీ ప్రస్తావన. ఒక రచయిత్రి నేపధ్యం గురించి, చెప్పదలుచుకున్న శిల్పం గురించి, వ్యక్తీకరించిన శైలి గురించి అర్థం చేసుకోవడానికి పై మాటలు చాలు. స్త్రీలు, అందునా సాహిత్యంలో స్త్రీల ప్రస్థానం అటుంచి అసలు సాహిత్యం అన్న పదాన్ని కలగనటం కూడా పెద్ద నేరంగా పరిగణించబడే 1930 -40ల నాటి కాలంలో తనకంటూ ఒక ఒరవడి సృష్టించి సాహిత్య రంగంలో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న రచయిత్రి కథలు ఈ నెల మీకు పరిచయం చేయబోతున్న ”ఇస్మత్‌ చుగ్తాయ్‌” కథలు. శైలీ విన్యాసంలోనూ శిల్ప పరిణితిలోనూ అగ్రస్థానానికి ఎదిగి, తన సహ రచయిత్రులలో కూడా సృజనాత్మకత పెంచి వారిని అభివ్యక్తి వైపు నడిపించిన రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నిజాయితీ, ధైర్యసాహసాలకు మారుపేరు. తాహిరీ నఖ్వీ ఆంగ్లంలోకి తర్జుమా చేసిన ఈ కథలని ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి తెలుగులోకి అనువదించారు.
15 కథల ఈ సంపుటిలో మనం ముందుగా చెప్పుకోవలసిన కథ ”లిహాఫ్‌”. 1944లో రాసిన ఈ కథ సాహిత్యంలో కొత్త ధోరణి ప్రవేశపెట్టింది. ఒక తుఫాన్‌ సృష్టించింది. కథలోకి వస్తే వైవాహిక జీవితంలో ఆశాభంగానికి గురయిన స్త్రీ బేగం జాన్‌. ఆమె ఒక పరిచారిక దగ్గర లైంగికంగాను, ఉద్వేగపరంగాను ఉపశమనం పొందుతుంది. ఒక స్త్రీ చిన్ననాటి జ్ఞాపకాల రూపంలో ఉంటుంది కథ. చిన్నపిల్ల ఊహల్లోంచి వచ్చిన కథ కనుక అమాయకత్వంతో కూడిన ధైర్యమూ నిష్కపటత్వమూ కనిపిస్తుంది. బేగంకూ ఆమె పరిచారికకూ ఉన్న సంబంధాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తూనే చిన్నపిల్ల చేత చెప్పించడం వల్ల కథలో ఒక సున్నితత్వం మనకు కనిపిస్తుంది. ఈ కథ ఆరోజుల్లో పెద్ద దుమారాన్ని లేపింది. పాఠకులూ, విమర్శకులూ ఆమె కథను తీవ్రంగా విమర్శించారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం అశ్లీలత క్రింద లాహోర్‌ కోర్టులో కేసు కూడా పెట్టింది. అయితే ఆ కథని కేవలం స్వలింగ సంపర్కం గురించి వ్రాసిన కథగా గాక అప్పటి స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థ సాంప్రదాయాలు, పితృస్వామ్యం కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం, వారి జీవితాల్లో పేరుకున్న నిరాశ, నిస్పృహ ఈ కోణంనించి చూసినప్పుడు మాత్రం మన మనస్సులు చలించక మానవు.
మరొక కథ ”మేలి ముసుగు” ఈ కథ చెప్తున్న గోరిబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై యేళ్ళ కన్య. అత్యంత సౌందర్యవతి అయిన గోరిబీ కోటి ఆశలతో కొత్త సంసార జీవితంలోకి అడుగు పెడుతుంది. భర్తకు ఎదురయిన ఒక చిన్న ఆత్మ నూన్యత భావం అర్థం చేసుకోలేనితనం వల్ల ఆమె జీవితం నరకప్రాయమవుతుంది. చేయని తప్పుకు ఆమె నిండు జీవితం బలైపోతుంది. భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన చుగ్తాయ్‌ వదిన కథ ”శిల” మరో కథ. బంధాలకు విలువ ఇవ్వడంలో మునిగిపోయిన ఆమె కరిగిపోతున్న తన జీవితాన్ని పట్టించుకోదు.
ఇస్మత్‌ కథలన్నీ స్త్రీ పాత్రలు ప్రధానంగా వారి చుట్టూనే నడుస్తుంటాయి. అయినా ఏ కథా మరొక కథలా ఉన్నట్లు అనిపించదు. అర్థ శతాబ్దం క్రిందట ఇంత అవగాహనతో, ఇంత శిల్ప నైపుణ్యంతో రచయిత్రి వ్రాయడం మనకి ఆశ్చర్యమనిపిస్తుంది. మనల్ని ఆలోచింపచేసే మరొక కథ ”ఒక ముద్ద”. నర్సు సరళా బెన్‌కు బాధ్యతల వల్ల సరైన వయసులో పెళ్ళి జరగదు. అందరికీ తలలో నాలుకలా ఉండే ఆమె ఒక ఇంటిదయితే బాగుండని ఇరుగు పొరుగు వాళ్ళనుకుంటారు. రోజు బస్సులో ఆమెతో ప్రయాణించే వ్యక్తి ఆమె పట్ల చూపుతున్న ఆసక్తిని గమనించి, అతని మెప్పుపొందేటందుకు ఆమెను చక్కగా అలంకరించి పంపుతారు. అయితే ఎప్పుడు అత్యంత సహజంగా, స్వచ్చంగా ఉండే ఆమెను కొత్త వేషంలో అతను గుర్తించలేక ఛీత్కరించుకుంటాడు. బాహ్య సౌందర్యంకన్నా అంత:సౌందర్యం గొప్పదనే భావన కలిగించే ఈ కథ అద్యంతం మనల్ని కట్టి పడేస్తుంది.
అంతే కాదు, మాట కరువయినా వెన్నలాంటి మనుసున్న బిచ్చు అత్తయ్య, దేవుడిచ్చిన అందమే శాపమై కబళించిన అమృతలత ఇలా చుగ్తాయ్‌ చెప్పిన ప్రతీ కథా చాలా విలక్షణంగా ఉంటుంది. ”ఇది పురుషులకోసం పురుషులు చేసిన ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర మాత్రమే. పురుషుని ప్రేమకో, ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ. అతని చిత్త వృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమో, తిరస్కరించడమో జరుగుతుంది” అంటారు ఇస్మత్‌ చుగ్తాయ్‌. ఆమె కథలన్నీ ఇదే సారాన్ని చాలా పదునుగా వ్యక్తం చేస్తాయి.
ఇస్మత్‌ కథలోని పాత్రలు ఆనాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను చక్కగా ప్రతిబింబిస్తాయి. ఆమె కథలను అధ్యయనం చేస్తే ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం కుటుంబాల సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. వర్గ స్పృహ, వస్త్రధారణ, వంట పద్ధతులు, ఆహారం, పుట్టుక, వివాహం వంటి సందర్భాలలో పాటించే ఆచార ధర్మాలు అన్నీ వివరంగా చర్చిస్తారామె. ”చౌతీకా జోడా” కథలో పెళ్ళి సంబంధాలు కుదుర్చునే పద్ధతి ప్రస్తావిస్తారామె. ఇప్పటికీ అర్థ శతాబ్దం తరువాత కూడా ఇండియాలోనూ, పాకిస్తాన్‌లోనూ ఇంకా ఇలాగే పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. పెళ్ళికూతురు చెల్లిని పెళ్ళికొడుకుతో పరిహాసాలాడడానికి పంపుతారు. అతన్ని ఆకర్షించి పెళ్ళి ప్రతిపాదన రాబట్టడం ప్రధాన యుక్తి. ఆ ప్రతిపాదన కూడా తాను చూసిన అమ్మాయితో కాదు. పెళ్ళివరకూ చూడ నోచుకోని వ్యక్తితో! ఈ కథలో చౌతీ కా జోడా (పెళ్ళయిన నాలుగో రోజు ధరించే దుస్తులు)కున్న ప్రాధాన్యాన్ని, అవి తయారు చేసే పద్ధతినీ కూడా తెలుసుకోవచ్చు.
”ముఖద్దర్‌ ఫర్జ్‌” కథ భారతదేశంలో లౌకికవాద ధృక్పధం అవసరాన్ని ప్రస్తావిస్తుంది. ఇప్పటి కాలమాన పరిస్థితులను కూడా అతికినట్లుండే ఈ కథని చదివినపుడు రచయిత్రిలో దార్శనికత మనం అర్థం చేసుకుంటాం. అలాగే ”ఘూంఘట్‌” కథ వివాహ వ్యవస్థ పద ఘట్టనల కింద నలిగిపోయిన ఒక స్త్రీ గాధ. ఇలా ప్రతి కథలోనూ తన శిల్ప చాతుర్యతతో తనెక్కడా తొణకకుండా ప్రేక్షకురాలిగా మనతో నడుస్తూ మనల్ని నడిపిస్తూ, ఆ కథని ఎలా అర్థం చేసుకోవాలన్న విచక్షణ మాత్రం మనకే వదిలేయడం ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రత్యేకత. ఇస్మత్‌ కథలలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆమెలో వస్తు పరిమితితోనే ఆమె గొప్ప కళాత్మకత సాధించగలిగారు. స్త్రీల గురించి, వారి జీవితాలపై సంస్కృతి సాంప్రదాయాల ఆంక్షల గురించి, భారతీయ సమాజంలో స్త్రీల స్థాయి గురించి, ఆమె ఆర్తితో ఆవేదనతో, లోతుగా పరిశీలించారని ఈ కథలు చదివాక మనకు అర్థమవుతుంది. ఆ కాలంలో స్త్రీలపై సామాజికంగా జరుగుతున్న అణిచివేత, దానికి వ్యతిరేకంగా వారి పోరాటం, స్త్రీల మనస్తత్వం, వారికి స్వంతమయిన అనుభూతులు ఆమె కథా వస్తువులు.
ఒక్క మాటలో చెప్పాలంటే ”ఇస్మత్‌ చుగ్తాయ్‌” కథలు అప్నటికీ, ఇప్పటికీ ఒక సామాజిక కదంబమాల లాంటివి. సామాజిక ధృక్పధంతో, సాంప్రదాయేతర శిల్పంతో సాగే ఆమె కథలు మనల్ని ఆసాంతం కుదిపి మనలో నిద్రాణంగా ఉన్న ఆలోచనలు తట్టి లేపుతాయి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునేటప్పుడు పి.సత్యవతి గారి అనువాద పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉర్దూలో వ్రాయబడ్డ ఇస్మత్‌ కథలని ”తాహీరా నఖ్వీ” ఆంగ్లంలోకి అనువదించారు. తరువాత వీటిని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి గారు తెలుగులోకి అనువాదం చేసారు. ఇస్మత్‌ తెలుగులోనే వ్రాసారా అన్నంత సహజమైన శైలిలో ఉంటాయి అనువాదాలు. ఇందులో పాత్రలు ఎంత సహజంగా ఉంటాయంటే పుస్తకం అంతా చదివేసి హాయిగా ఉండడం కుదరదు. చుగ్తాయ్‌ సృష్టించిన ”బేగం జాన్‌, కుబ్రా; ఆమె తల్లీ, చెల్లీ, రుక్సానా, గొరిబీ, సరళా బెన్‌, బిచ్చూ అత్తయ్య, ఇల్లూడ్చే ముసలమ్మ అంతా చాలా సేపు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కలాలకు, గళాలకు స్వేచ్ఛ లేని కాలంలో, సాంప్రదాయ రీతీ రివాజులు సమాజాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న కాలంలో అత్యంత వాస్తవికంగా, గొప్ప దార్శనికతో వ్రాసిన ”ఇస్మత్‌ చుగ్తాయ్‌” కథలు తప్పక చదివి తీరవలిసిన పుస్తకం….
Courtesy: BUMIKA, Telugu Monthly, February 2015

Saturday, February 7, 2015

పరదా చాటు జీవితాలను చిత్రించిన కథలు

ఇస్మత్ చుగ్తాయ్ కథలు

నవాబుల బిడ్డ షమ్మన్ మియాకి పద్దెనిమిదేళ్ళు . చదువు, క్రికెట్ తప్ప మరో ప్రపంచం తెలీదతనికి. కానీ, ఆ మహల్ లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటి ప్రకారమే ఆ రాత్రి వేళ అతనికి సేవ చేయడం కోసమని షమ్మన్ మియా తల్లి నవాబ్ బేగం పంపగా అతని గదికి వచ్చింది హలీమా, ఆ ఇంటి దాసీపిల్ల. ఆమె సేవలని తిరస్కరించాడు షమ్మన్ మియా. ఫలితం, ఒకదాసి యజమాని గదికి వెళ్లి చెక్కు చెదరకుండా తిరిగి రావడం అన్నది మొదటిసారిగా జరిగింది ఆ ఇంట్లో.

కొడుకు 'ఆరోగ్యాన్ని' గురించి బెంగ పెరిగింది బేగంకి. మరింత చొరవ చూపించాల్సిందిగా హలీమా మీద ఒత్తిడి పెరిగింది. హకీమ్ సాబ్ చేసిన వైద్యం కన్నా, హలీమా చూపించిన భక్తిపూర్వకమైన ప్రేమ బాగా పనిచేసింది షమ్మన్ మియా మీద. అతనిప్పుడు హలీమా లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. రోజులు క్షణాల్లో గడిచిపోగా, ఓ ఉదయం హలీమా గర్భవతి అన్న వార్త తెలిసింది మహల్లో. బేగం ఆనందానికి అవధులు లేవు.

కొడుక్కిక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయొచ్చు. సంబంధం సిద్ధంగానే ఉంది కూడా. మరి హలీమా? ఆ ఇంటి ఆచారం ప్రకారం, ఆమె పల్లెటూరికి వెళ్లి అక్కడ బిడ్డని కని, తిరిగిరావాలి. పుట్టిన బిడ్డ మగబిడ్డ అయితే సేవకుడిగానూ, ఆడబిడ్డ అయితే సేవికగానూ మహల్లో జీవితాన్ని గడపాలి.

అనూచానంగా వస్తున్న మహల్ ఆచారాన్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి షమ్మన్ మియా. తల్లిదండ్రులు, సోదరుల మాటని లెక్ఖ చేయలేదు. హలీమాని పెళ్లి చేసుకునేనేందుకు మనసా వాచా సిద్ధపడ్డాడు. అదే జరిగితే ఇంకేమన్నా ఉందా? మహల్ పరువు ఏమైపోవాలి?? షమ్మన్ మియా తన నిర్ణయాన్ని అమలు చేయగలిగాడా లేదా అన్నది ఉర్దూ రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్ రాసిన పాతిక పేజీల కథ 'అలముకున్న పరిమళం' కి ఇచ్చిన హృద్యమైన ముగింపు.

ఈ కథతో పాటుగా ఇస్మత్ రాసిన మరో పద్నాలుగు కథలని తెనిగించి సంకలనాన్ని తయారు చేశారు స్త్రీవాద రచయిత్రి పి. సత్యవతి. పుస్తకంగా ప్రచురించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్.

అనువాదకురాలి పేరు చూడడంతోనే కథానాయిక ప్రధానంగా సాగే కథలని చదవడానికి సిద్ధ పడిపోయాను మానసికంగా. అయితే, దాసీ పిల్లని మనసారా ప్రేమించిన షమ్మన్ మియా కథతో పాటు, చిన్నప్పుడు తను పని చేసిన ఇంట్లో అమ్మాయినే పెళ్లి చేసుకోగలిగే స్థాయికి ఎదిగిన 'కల్లూ,' తనది కాని బిడ్డని తన బిడ్డగా అంగీకరించగల రామ్ అవతార్ ('చేతులు' కథ), ఇంకా మత మౌడ్యాన్ని ఎదిరించే పడుచు ప్రేమజంట ('పవిత్ర కర్తవ్యం) కథా కనిపించి ఆశ్చర్య పరిచాయి.

అయితే, మెజారిటీ కథలు పరదా చాటు జీవితాలని, వాటిలోని సంఘర్షణలనీ చిత్రించినవే.

వృద్ధుడైన నవాబుగారి పడుచు భార్య బేగం జాన్ పరదాల చాటునే తనదైన జీవితాన్ని వెతుక్కోడాన్ని 'లిహాఫ్' కథ వర్ణిస్తే, భర్త ఎదుట తనకితానుగా మేలిముసుగుని పైకెత్తడం అనే సంప్రదాయ విరుద్ధమైన పనిని తన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడానికి ఇష్టపడక వృద్ధ కన్యగా ఉండిపోయిన గోరీబీ కథని 'మేలిముసుగు' కథ చిత్రిస్తుంది. పట్టుదల విషయంలో గోరీబీకి ఏమాత్రం తీసిపోని మరో స్త్రీ 'బిచ్చూ అత్తయ్య.' తన భర్త దాసీతో సన్నిహితంగా ఉండడాన్ని చూసిన మరుక్షణం వితంతు వేషం ధరించి, జీవితాంతం అతన్ని'కీర్తిశేషుడు అనే విశేషణం జోడించి మాత్రమే ప్రస్తావించిందామె.

డబ్బులేకపోతే అన్నీ సమస్యలే. పెళ్లి కావడం మరీ సమస్య. పెళ్ళికోసం అలవాటు లేని మేకప్ చేసుకున్న సరళా బెన్ అగచాట్లని 'ఒక ముద్ద' కథ చెబితే, తనవాడవుతాడని నమ్మిన వాడికోసం పడరాని పాట్లు పడ్డ కుబ్రా కరుణరసాత్మక కథ 'చౌతీ కా జోడా.' సంప్రదాయం ఎంత కఠినంగానైనా ఉండొచ్చు గాక. వెతుక్కునే వాళ్లకి గమ్యం చేరుకునే మార్గాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయని చెప్పే కథ 'దేవుడి దయ.' భార్యని తనకి అనుకూలంగా మార్చుకునే అన్నయ్యనీ ('శిల') యవ్వనాన్ని కరిగించుకోడం కోసం కష్టపడే రుఖ్సానా యాతనలనీ ('అమృతలత') ఓ పట్టాన మర్చిపోలేం.

'పుట్టుమచ్చ' 'చిన్నక్క' 'గరళం' కథలు వేటికవే ప్రత్యేకమైనవి. వీటికి మెరుపు ముగింపులిచ్చారు రచయిత్రి. వీటిలో చాలా కథలు దేశానికి స్వతంత్రం రాకపూర్వం రాసినవే. 'లిహాఫ్' కథ కోర్టు కేసులని కూడా ఎదుర్కొంది. మనకి ఏమాత్రం తెలియని ప్రపంచంలోకి అలవోకగా తీసుకుపోతారు రచయిత్రి. పదిహేను కథలనీ చదవడం పూర్తిచేశాక కూడా మహళ్ళు, అక్కడి మనుషులు ఓ పట్టాన మన జ్ఞాపకాలని విడిచిపెట్టరు. కథలతో పాటు 'జీవన యాత్రలో ముళ్ళూ, పూలూ' పేరిట చుగ్తాయ్ రాసుకున్న స్వగతం ఉర్దూ కథల్ని ఇంగ్లీష్ లోకి అనువదించిన తాహిరా నఖ్వి రాసిన 'పరిచయం' కథల పూర్వరంగాన్ని గురించి చెబుతాయి.

తెనిగింపుని ఇష్టంతో చేశానని చెప్పారు సత్యవతి.

(పేజీలు 184, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్).

- నెమలి కన్ను మురళి

http://nemalikannu.blogspot.in/2015/02/blog-post_6.html


.


Friday, February 6, 2015

"దారులేసిన అక్షరాలు" పుస్తకావిష్కరణ సభ 7 ఫిబ్రవరి 2015 శనివారం సాయంత్రం 4.30కు గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్ లో

"దారులేసిన అక్షరాలు" 
పుస్తకావిష్కరణ సభ 
7 ఫిబ్రవరి 2015 శనివారం సాయంత్రం 4.30కు 
గోల్డెన్ త్రెషోల్డ్, 
అబిడ్స్ లో
అందరూ ఆహ్వానితులే !


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌