Thursday, December 21, 2017

అన్ని ఛాందసవాదాల్నీ ఖండించవలసిందే - గౌరి లంకేశ్

అన్ని ఛాందసవాదాల్నీ ఖండించవలసిందే 
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" 
పుస్తకం నుంచి )

సల్మాన్‌ రష్దీ మొన్నటి జైపూర్‌ సాహిత్య సమ్మేళనానికి రావలసి ఉండడం,  ఛాందసవాదులైన కొందరు దేవబంద్‌ ముస్లింలు దానికి అభ్యంతరం చెప్పడం, ఎవరేమన్నా తాను కచ్చితంగా వస్తానని రష్దీ పట్టుబట్టడం, ఆయన్ని చంపడానికి సుపారి (కిరాయి) హంతకులు బయలుదేరారని పుకార్లు రావడం, చివరికి రష్దీ తనంతట తానే సమ్మేళనానికి రాకూడదని నిర్ణయించుకోవడం... ఇవన్నీ ఒక రచయిత భావ ప్రకటనా స్వేచ్ఛ, సామాజిక బాధ్యతలకు సంబంధించిన విషయాలు మాత్రమే కావు. 
వాటిలో నిక్షిప్తమై మరెన్నో విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు దృష్టి సారించవలసింది ముఖ్యంగా వాటిపైనే.

సల్మాన్‌ రష్దీ గొప్ప రచయిత అనేది నిజమే, కాని దానితో పాటు వివాదాల్ని ఇష్టపడే వ్యక్తి. ఆయన రాసిన 'సటానిక్‌ వర్సెస్‌' నవల ముస్లింలను అవమానపరిచిందని ఆరోపిస్తూ కొందరు ఆయన తల తీసివేయాలని ఒకనాడు ఫత్వా జారీ చేశారు. దానికన్నా ముందే  ప్రభుత్వం ఆయన పుస్తకాన్ని నిషేధించింది. రెండూ తప్పే.

ఆ మధ్య రోడ్ల మీద కొందరు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ఏడిపించారని దక్షిణ కన్నడ ప్రాంతపు ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకుడు కల్లడ్క ప్రభాకర్‌ భట్‌ ఆరోపించారు. ఆ నేరానికి ఆ యువకుల్ని చంపేయాలన్నారు. దీనికీ, ఇస్లాంను అవమానపరిచాడు కాబట్టి రష్దీ తల తీసేయాలని కొందరు ముల్లాలు ఇచ్చిన పిలుపుకీ ఏం వ్యత్యాసముంది? ఒకటి ఖండించవలసినదైతే రెండవది కాకుండా పోతుందా? 

ఏ ప్రభుత్వమైనా సరే పుస్తకాలను నిషేధించడం సరి కాదు. తరతరాలుగా కొత్త ఆలోచనలు సాహిత్యం ద్వారానే వ్యక్తమవుతూ సామాజిక పరివర్తనకు దోహదపడ్డాయి. కొన్ని పుస్తకాలు వికృత భావాలను వ్యాపింపచేసి ఉండొచ్చు. కాని ఆరోగ్యకరమైన సమాజమేదైనా తన శ్రేయస్సుకు అవసరమైనదాన్ని ఉంచుకుని మిగతా వాటిని వదిలి పెట్టేస్తుంటుంది.

నేడు కొందరికి రష్దీ 'సటానిక్‌ వర్సెస్‌' లేదా భైరప్ప 'ఆవరణ' 1 నచ్చకపోవచ్చు. అంతమాత్రాన వాటిని నిషేధించడం ఉచితం కాదు. దానికి బదులు, అటువంటి పుస్తకాలపై బహిరంగ చర్చ జరపాలి. అన్ని రకాల అభిప్రాయాలను తెలుసుకోవాలి. సమాజంలో కొందరికి ఇష్టంలేదన్న కారణంగా రచనలను నిషేధించుకుంటూపోతే ఇక సాహిత్యం, పుస్తకాలు అనేవే  మిగలవు.

ఉదాహరణకి, 12వ శతాబ్దంలో 'వచనకారులు' చెప్పిన విషయాలు కొందరికి తప్పకుండా ప్రమాదకరంగా అనిపించి ఉండవచ్చు. వెంటనే వచనకారుల్ని చంపేయండి, వాళ్ళ వచనాలను నిషేధించండి అనే ఆజ్ఞ జారీ అయి ఉంటే ఏమయ్యుండేది? అలాగే చార్వాకులు, పెరియార్‌, అంబేద్కర్‌ వంటి వారి రచనలను నిషేధించి ఉంటే ఏమయ్యుండేది?

అన్ని కాలాల్లోనూ, అన్ని సమాజాల్లోనూ వివిధ ఆలోచనాధారలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటి వల్ల కొన్నిసార్లు సమాజంలో, మతంలో సంస్కరణలు జరిగితే, మరికొన్నిసార్లు కొత్త శాఖలు పుట్టుకొచ్చాయి. 

ఉదాహరణకి, రోమన్‌ కాథలిక్‌ చర్చ్‌కి వ్యతిరేకంగా శతాబ్దాలనుండి వివిధ ఆలోచనాధారలు పుట్టుకొచ్చి ప్రస్తుతం అనేక రకాల  క్రిస్టియన్‌ మతాలు మనుగడలో ఉన్నాయి. అలాగే ఇస్లాం కూడా ఒకే రీతిలో లేదు. షియా, సున్నీ అనే రెండు ప్రబల సమూహాలే కాకుండా భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక చోట్ల సూఫీ పరంపర కూడా ఉంది. వాటికి తోడు పందొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో ప్రారంభమై ప్రస్తుతం వేలమంది అనుయాయులు కలిగిన అహ్మదీయ శాఖ కూడా ఉంది. ప్రధాన స్రవంతి ఇస్లాం మొహమ్మద్‌ని మాత్రమే నిజమైన ప్రవక్తగా గుర్తిస్తే, అహ్మదీయులు తమ ప్రవక్తల పరంపరని విస్తరించారు. 

ఆ మతశాఖని స్థాపించిన మీర్జా గులాం అహ్మద్‌ (1835-1908) కి కూడా భగవంతుడి నుంచి దివ్యసందేశం లభించిందని వారు విశ్వసిస్తారు. అలాగే గడిచిన శతాబ్దంలో కుర్దిస్తాన్‌లో పుట్టిన 'యాజిది' అనే శాఖ  హడిత్‌ను  నిరాకరిస్తుంది, ఖురాన్‌ను మాత్రమే అనుసరిస్తుంది. 
మళ్లీ అన్నిటికీ మూలం ఇస్లాం మతమే.

ప్రజాస్వామ్య సమాజంలో ఎప్పుడూ కొత్త ఆలోచనలు, విమర్శలు రావడం సహజం. ఆ విమర్శలు అవహేళనలుగా భావింపబడకుండా ఆత్మవిమర్శకు దారితీస్తే - మతానికైనా, దాని అనుయాయులకైనా, సమాజానికైనా చాలా మంచి జరుగుతుంది. దానికి బదులు మేము చెప్పిందే సరైంది, మా అభిప్రాయం మాత్రమే సరైంది అనే ధోరణి కనబరిస్తే ఆ మతం, దాని ఆరాధకులు, ఆ సమాజం అన్నీ నిలువ నీరులాగా మారి పాచిపట్టి కంపుకొట్టడం మొదలవుతుంది.

ఇది కేవలం రష్దీపై, ఆయన పుస్తకంపై కత్తులు నూరుతున్నవారికి మాత్రమే అన్వయిస్తుందనుకోకండి. శివాజీ గురించి జేమ్స్‌ లైన్‌ (జీaఎవర కూaఱఅవ) రాసిన పుస్తకాన్ని వ్యతిరేకించి, ఆయన పరిశోధనకి సహకరించినందుకు భండార్కర్‌ గ్రంథాలయాన్నే నాశనం చేసిన శంభాజీ బ్రిగేడ్‌కూ అన్వయిస్తుంది. ఎ.కె.రామానుజన్‌ రాసిన 'త్రీ హండ్రెడ్‌ రామాయణాస్‌'  అనే వ్యాసాన్ని వ్యతిరేకించి దాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయం సిలబస్‌ నుంచే తీసివేయించిన హిందుత్వ ముఠాలకీ అన్వయిస్తుంది. 

అందరూ గుర్తుంచుకోవలసిన ఒక విషయమేమిటంటే రష్దీ రచన మూలంగా ఏ ముస్లిమూ తన మతాన్ని విడిచిపెట్టలేదు; లైన్‌ పుస్తకం వల్ల ఎవరికీ శివాజీ పట్ల గౌరవం తగ్గలేదు; రామానుజన్‌ రచన ప్రజల్ని రామాయణం దగ్గరికి తీసుకువెళ్లిందే తప్ప దూరం చెయ్యలేదు.

వీటన్నిటికన్నా ముఖ్యంగా ఛాందసవాదం ఎప్పుడూ ఏ సమాజానికీ, సమూహానికీ మంచి చేయలేదు అని గుర్తుంచుకోవాలి. అందువల్లే దాన్ని మరింత గట్టిగా ఖండించాలి మనం. ఇక భారతదేశ సందర్భంలో అయితే, అల్పసంఖ్యాక సమూహాల్లో ఛాందసవాదం ఎక్కువసార్లు ఆ సమూహాలకే ప్రమాదకరంగా మారింది. పైగా అది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా అధిక సంఖ్యాక సమూహాల్లో ఛాందసవాదాన్ని పెంచింది. చివరికి అది అల్పసంఖ్యాక వర్గాలకూ, అధికసంఖ్యా వర్గాలకూ కూడా చెడుగు తప్ప మరేమీ చెయ్యలేదు. 

అందుకే ఇది కేవలం రష్దీకీ, జైపూర్‌ సాహిత్య సమ్మేళనానికీ, భావప్రకటనా స్వేచ్చకూ మాత్రమే పరిమితమైన విషయం కాదని ముందే చెప్పాను. మన సమాజం మొత్తానికీ ఏది మేలో, ఏది కీడో నిర్ణయించే విషయమిది...

(గౌరి లంకేశ్‌ పత్రికె, 8 ఫిబ్రవరి 2012)

తెలుగు అనువాదం : కే. ఆదిత్య 

1. ఎస్‌.ఎల్‌. భైరప్ప రాసిన ఈ  'ఆవరణ' నవల 2007 లో ప్రచురితమై విపరీతంగా అమ్ముడుపోయింది. అందులో ముస్లింల కారణంగా హిందూ సమాజానికి చాలా నష్టం జరిగినట్లు చిత్రీకరించారు. 2017 లో 'ఆవరణ: ద వెయిల్‌' పేరుతో ఇది ఇంగ్లీషులోకి అనువాదమైంది.  


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌