Saturday, May 28, 2011

హృదయంతో చేసిన అనువాదం - చివరకు మిగిలింది? ('గాన్‌ విత్‌ ద విండ్‌') పుస్తక సమీక్ష - విజయకుమార్‌ (ఈ భూమి మాసపత్రిక)


కొన్ని కొన్ని కొందర్ని ఆకర్షిస్తాయి.
వాటికి ఎన్నో కారణాలు వుంటాయి.
ఎం.వి.రమణారెడ్డి గారిని మార్గరెట్‌ మిచ్చెల్‌ 'గాన్‌ విత్‌ ద విండ్‌' ఆకర్షించింది.
దానికి కారణాలు ఆయన చెప్పుకున్నారు.
ప్రపంచ ప్రసిద్ధ నవలను పరవశంగా అనువదించారు.
ఇది నవ్య వారపత్రికలో సీరియల్‌గా కూడా వచ్చింది.
ఇప్పుడు పుస్తకంగా మనముందు వుంది.
'ప్రతి అనువాదకుడు ఆ భాష కొక ప్రవక్తలాంటివాడు' అన్నాడు జర్మన్‌ మహాకవి గోథె.
రచనను, ఇతర భాషలోని రచనను ఆత్మీయంగా భావించినప్పుడే దాన్ని మాతృభాషలోకి తేవాలనిపిస్తుంది. మన ప్రాచీన మహాకవులందరూ అనువాదకులే.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల గురించి చెబుతూ రమణారెడ్డి గారు 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో సంభవించిన ఒకానొక మలుపు ఈ నవలకు నేపథ్యం... సామాజిక శక్తుల పోరాట క్రమంలో భూస్వామ్య వ్యవస్థకూ పెట్టుబడిదారీ వ్యవస్థకూ మధ్య జరిగిన ముఖాముఖి పోరాటాన్ని చిత్రించిన నవల ఇది. ఈ నవలలో ప్రధానపాత్ర 'స్కార్లెట్‌' అనే అమ్మాయిది. ఆమె పాత సమాజంలో ఇమడనూ లేదు. కొత్త సమాజాన్ని అందుకోనూ లేదు' అన్నారు. ఈ నవలను గతంలో సంక్షిప్తంగా పరిచయం చేసిన మాలతీ చందూర్‌ గారి పట్ల ఆయన కృతజ్ఞత ప్రకటించారు.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1936లో అచ్చయింది.
1998 వరకు ప్రపంచ వ్యాప్తంగా రెండుకోట్ల కాపీలు అమ్ముడుపోయింది.
ప్రతిష్టాత్మకమైన పులిట్జర్‌ బహుమతిని 1937లో అందుకుంది.
1939లో సినిమాగా వచ్చి 9 అకాడమీ అవార్డులు గెలుచుకుంది.
డిసెంబర్‌ 15, 1939న 'గాన్‌ విత్‌ ద విండ్‌' చిత్రం విడుదలయింది.
ఆ చిత్రం విడుదల రోజు జార్జియా రాష్ట్రంలో సెలవుదినంగా ప్రకటించారు.
అట్లాంటా నగరంలో మూడురోజులు ఉత్సవాలు జరపాల్సిందిగా నగర మేయర్‌ ఆజ్ఞలు జారీ చేశారు.
చలన చిత్ర చరిత్రలోనే అది అపూర్వ విషయం.

మార్గరెట్‌ మిచ్చెల్‌ నవల వెలుగు చూడడానికి పూర్వాపరాల్ని రమణారెడ్డిగారు ఆసక్తిగా వివరించారు. మార్గరెట్‌ మిచ్చెల్‌ 48వ ఏట కారు ఢీకొని స్పృహతప్పి ఆస్పత్రిలో చేరి ఐదురోజులుండి 1949 ఆగస్టు 16 న చనిపోయింది. ఈ నవల వచ్చి 70 సంవత్సరాలు గడచినా ఇప్పటి దాకా తెలుగులో రాలేదు. సంక్షిప్త కథా పరిచయాలు తప్ప సమగ్రంగా రాలేదని రమణారెడ్డి గారన్నారు. ఆ బృహత్తర బాధ్యతని స్వీకరించి ఈ నవలను ఆయన తెలుగు పాఠకుల ముందుంచారు.

బానిసత్వాన్ని రద్దు చేస్తూ లింకన్‌ చట్టం చేశాడు.
దాంతో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు విడిపోయాయి.
అంతర్యుద్ధం మొదలయింది.

జార్జియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన స్కార్లెట్‌ ఓహరా జీవిత కథ ఈ నవల. ఆమె యాష్‌లీ అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను మెలనీ అనే అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. తన అందాన్ని లెక్కపెట్టని అతని పై ఆగ్రహంతో అతని తమ్ముడు చార్లెస్‌ను పెళ్లిచేసుకుంటుంది. అతను అంతర్యుద్దంలో చనిపోతాడు. కానీ ఆమె యాష్‌లీని మరచిపోదు. అంతర్యుద్ధంలో కాలిపోతున్న ఇళ్ల నించి స్కార్లెట్‌ను, ఆమె బంధువుల్ని బట్లర్‌ అనే అతను రక్షిస్తాడు. అతనంటే స్కార్లెట్‌కు ఇష్టముండదు. కానీ అతన్ని పెళ్లాడుతుంది. మనసులో యాష్‌లీ వుంటాడు. యాష్‌లీ భార్య చనిపోతుంది. స్కార్లెట్‌ మనసు తెలిసి బట్లర్‌ ఆమెను వదిలి వెళ్లిపోవాలనుకుంటాడు. ఈ మధ్యకాలంలో పిల్లలు కలగడం, పోవడం కూడా జరుగుతుంది. మధ్యలో అంతర్యుద్ధంలో అతలాకుతలమైన జీవితాలు ఎన్నెన్నో.

చివరిదాకా తన అహంకారాన్ని, అభిజాత్యాన్ని వదిలిపెట్టని స్కార్లెట్‌ తత్వం మనల్ని ఆకర్షిస్తుంది. చివరికి తన మనసులో వున్నది యాష్‌లీ కాదని, తన భర్త బట్లర్‌ అని తెలిసినా ఆ విషయం బాహాటంగా భర్తతో చెప్పదు. వ్యక్తులు కలుస్తూ, విడిపోతూ, అకర్షిస్తూ, సంక్షోభంలో సాగిపోతూ అడుగడుగునా మనకు ఉత్కంఠ కలిగిస్తారు.

యాష్‌లీ భార్య మిలెనీ మరణశయ్యపై వుంది. తన భర్తనీ, కొడుకునీ స్కార్లెట్‌కి ఒప్పగించి కళ్లు మూస్తుంది. అన్నాళ్లుగా తను ఆరాటపడిన వ్యక్తి తనకందినా తను ఎండమావులవెంట పరిగెత్తానని గుర్తిస్తుంది. తన మనసులో వున్నది తన భర్త బట్లరని తెలుసుకుంటుంది. బట్లరేమో ఆమెని వదిలి వెళ్లడానికి నిర్ణయించుకుంటాడు. తన అహంకారం వల్ల ఆమె భర్తని అభ్యర్థించదు. బట్లర్‌ లేని జీవితం అంధకారమనిపిస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే ఓపిక, ధైర్యం వుండవు. కానీ ఓటమిని ఒప్పుకొని భర్తని వేడుకోలేదు. తన అందంతో, ప్రేమతో అతన్ని లొంగ దీసుకోగల ననుకుంటూనే నిద్రపోతుంది.

నవలలో స్కార్లెట్‌, బట్లర్‌ పాత్రలు ప్రధానమయినవి. అందంలో, తెలివితేటల్లో, స్వార్థంలో ఒకరికొకరు తీసిపోరు. వాళ్లని యిష్టపడతాం, కోప్పడతాం, భూమిలో కలిసిపోతున్న భూస్వామ్య మనస్తత్వాలకు వాళ్లు ప్రతినిధులు. తన గొప్ప శిల్పంతో మార్గరెట్‌ మిచ్చెల్‌ మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసి చదివిస్తుంది.

రమణారెడ్డిగారు ఈ నవలని రసవంతంగా అనువదించారు. ఉదాహరణకి చివర్లో స్కార్లెట్‌ భర్త బట్లర్‌ ఆమెని వదలివెళ్లాలనుకున్నప్పుడు ఆమెతో అన్న మాటలు చూడండి.
''మన పెళ్లినాటికే నువ్వు నన్ను ప్రేమించడం లేదని తెలుసు. నీ మనవులో నుండి యాష్‌లీ తొలగిపోలేదని తెలుసు. నేను ఎంత మూర్ఖుణ్ణంటే నువ్వు అతన్ని మరచిపోయేలా చేయగలననుకున్నాను. నువ్వు ఏది కోరినా కాదనకుండా సంతోషపెట్టాలనుకున్నాను. వివాహ బంధంతో రక్షణ కలిగించాలనుకున్నాను. నీ స్వేచ్ఛకు అడ్డు తగలకుండా గారాబంగా చూసుకోవాలనుకున్నాను. కష్టాల నుండి నీకు విముక్తి కలిగించాలనుకున్నాను... ఎందుకో తెలుసా? చీకూ చెంత లేకుండా నువ్వు చిన్నపిల్లలా సరదాగా ఆడుకోవాలని. నా దృష్టిలో నువ్వు యింకా చిన్నపిల్లవే. చిన్న పిల్లలు తప్ప నీ అంత మొండిగా తల బిరుసుగా మరొకరు ఉండలేరు.''

రమణారెడ్డిగారి అనువాదంలో తెలుగు పలుకుబడివుంది.
అనువాదం సహజంగా, సరళంగా సాగింది.
తెలుగువాళ్లు హాయిగా చదువుకోవడానికి తగినట్టుగావుంది.
ఆ పేర్లని అనువదించడం అన్నది కుదరదు.
తక్కిన సంభాషణలు, సన్నివేషాలు, రాగద్వేషాలు అన్నీ మన ముందు అపూర్వంగా, ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

అనువాదం ఒక తపస్సు, ఒక తన్మయత్వం.
తన ఆనందాన్ని పంచుకోవాలని భావుకుడు అనుకుంటాడు.
రమణారెడ్డిగారు అనుకున్నారు.
తన మనసుగుండా సాగిన గాన్‌ విత్‌ ద విండ్‌ మన ముందు తియ్యని తెలుగై వెలుగుతోంది.
చదవండి.
- విజయ్‌కుమార్‌
ఈ భూమి, సామాజిక రాజకీయ మాసపత్రిక, మే 2011.

చివరకు మిగిలింది?
513 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు : హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌.

Friday, May 27, 2011

నిరంతర ఘర్షణ ప్రధాన ఇతివృత్తం - 'రాముడుండాడు రాజ్జిముండాది' పుస్తక సమీక్ష - ఎస్‌.రామకృష్ణ (పాలపిట్ట మాస పత్రిక)


డా. కేశవరెడ్డి అభిమానిగా ''రాముడుండాడు రాజ్జిముండాది'' నవల చదివాను. ఆయన మిగతా రచనల కంటే ఇది భిన్నంగా వుంది. ఇంత సరళంగా, సింగిల్‌ లేయర్‌లో మరే ఇతర నవల లేదనిపించింది. అయితే కథను దృశ్యమానం చేయడంలో డా. కేశవరెడ్డి ముద్ర ఇక్కడ కూడా కన్పిస్తుంది.

ఉదాహరణకు 11 వ భాగంలో ''అది పౌర్ణమి వెళ్లిన తరువాతి రాత్రి. సందె చీకటి దట్టంగా అ లముకుని వుంది. కూలిపోయిన కొలిమి దాపున ఉన్న సత్రం నక్షత్రాల కాంతిలో లీలగా కనిపిస్తున్నది. మందంగా వీస్తున్న గాలి పాటకు బూడిద తొలిగిపోవడంతో పొయ్యిలోని నిప్పు కణికలు నిగనిగలాడుతో కనిపించసాగాయి. కొలిమి వెనుకనున్న వెంపలి చెట్లలోను, జిల్లేడు చెట్లలోను అసంఖ్యాకములైన మిణుగురు పురుగులు అవిరామంగా ఎగురబోతున్నాయి.'' మొత్తం నవలకు ఈ వాక్యాలు బీజప్రాయాలు.

చితికిపోతున్న గ్రామీణ జీవితాలు, ఆదరణ కోల్పోతున్న కులవృత్తులు, ఆధునికత దెబ్బతో కుంగిపోయి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్న వివిధ కులాలవారు, ఈ పరిస్థితి నుండి విముక్తి కోసం నిరంతరం సాగే పోరాటం ''రాముడుండాడు రాజ్జిముండాది'' ఇతి వృత్తం.
దీన్ని దృశ్యమానం చేయడానికి డా.కేశవరెడ్డి ఈ సన్నివేశం ఎంచుకున్నారు.

ఒక రైతు చేతిలో కూల్చివేయబడ్డ కంసాలి కొలిమి, అందులో ఇంకా ఆరని నిప్పు కణికలు, జరుగుతున్న దారుణాన్ని మౌనంగా తిలకిస్తున్న మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, అవిరామంగా ఎగరాలని చూసే మిణుగురు పురుగులు. ఓ అద్భుత దృశ్యం.

పైకి కేవలం ఆర్థి సమస్యగానే కనబడే గ్రామీణ ఆర్థికవ్యవస్థ సంక్షోభానికి కేశవరెడ్డి మానవీయతను జోడించారు. కంసాలి కొలిమిలోని ఆరని నిప్పులు వృత్తిపనివారి తరగతి నైపుణ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆకాశ,లోని నక్షత్రాలు కాస్పిక్‌ వాస్తవికతకు తార్కాణంగా, చెట్లలోని మిణుగురులు నిరంతర ఆశావాదులైన గ్రామీణులకు ప్రతీకలుగా తీసుకోవచ్చు.

ఆశ్చర్యకరంగా ఈ చాప్టర్‌లోనే బైరాగి పాత్ర ద్వారా డా. కేశవరెడ్డి ప్రస్తుత సమాజ సంక్షోభానికి కారణం వివరిస్తాడు. తంబూర మీటుతూ బైరాగి వీరబ్రహ్మంగారి తత్వాలు పాడుతున్నాడు. బ్రహ్మంగారు తన శిష్యుడు సిద్ధయ్యకు లోకం తీరు వివరిస్తున్నాడు. ''మానవ సంబంధాలలోని రాక్షసత్వాన్ని, సృష్టి యొక్క నిరర్థకతను'' అతను విపులీకరిస్తున్నాడు అంటూ, మళ్లీ నేపథ్య దృశ్యాన్ని వర్ణించిన కేశవరెడ్డి ఎట్లా ''గాలి వీచే కొద్ది పొయ్యిలోని బూడిద తొలిగిపోయి నిప్పులు బయటపడుతున్నాయో'', ఎట్లా కొమ్మలను అంటిపెట్టెకున్న మిణుగురు పురుగులు కదులుతున్నాయో చెబుతాడు. ఈ ప్రపంచంలో ప్రతీదీ కదులుతుంది. కాకపోతే వాటి వేగం, గమనం విషయంలో ఒక్కోరిది ఒక్కో అంచనా.

బైరాగి దగ్గరకు వచ్చిన యువకుడు ''లోకమంతా ఇట్టానేనే సామీ?'' అని అడుగుతాడు. బైరాగి దీర్ఘంగా నిట్టూర్చి ''లోకం అంతా ఇట్లనే'' అని సమాధానం ఇస్తాడు. అంతేకాదు, ''ఎవని లోకం వానిదిగా వుంది'' అని ముగిస్తాడు.

ఒక స్థాయిలో ''రాముడుండాడు రాజ్జిముండాది'' ను కేవలం గ్రామీణ వ్యవస్థ చితికిపోవడానికి ఆధునికత, సరళీకృత ఆర్థిక విధానాలే కారణమని చెప్పే నవలగానో, కేవలం పట్టణాలకు వలస పోవడమే కుల వివక్షకు పరిష్కారమని చెప్పే రచనగానో చూసేవారుండొచ్చు. కానీ ఫ్యూడల్‌ సమాజానికి, ఆధునిక పట్టణీకరణకు మధ్య జరిగే సంఘర్షణలో అణగారిన కులాల వారికి, కొన్ని నష్టాలూ, ఎక్కువ లాభాలూ జరిగాయని చెప్పడానికి కూడా ''రాముడుండాడు రాజ్జిముండాది'' తార్కాణంగా నిలుస్తుంది.
నిజానికి ఆర్థికాంశాలు ఎంతగా మనల్ని ఆలోచింపజేసినా, నవల చదువుతున్నంతసేపు కేశవరెడ్డి మార్కు కథనం మనల్ని డామినేట్‌ చేస్తుంది.

పెద్దనాయుడు (పెద్ద భూస్వామి), ముత్యాల నాయుడు (పెద్దనాయుడి పెద్ద పాలేరు), కోనిగాడు (పెద్దనాయుడి దగ్గర 30 ఏళ్లుగా జీతం చేసిన ముదుసలి మాల కులస్తుడు), పుల్లిగాడు (కోనిగాడి కొడుకు, మంచి జీవితం కోసం చెన్నై వలస వెళ్లిన యువకుడు), తిరిపాల నాయుడు (చితికపోయిన రైతు), గుడిపూజారి, చేతివృత్తినే నమ్ముకుని ఊరిమీద ప్రేమ చావని, శ్రమకు ప్రతిఫలం లేని కంసాలి, ''రాముడుండాడు రాజ్జిముండాది''లో ప్రధాన పాత్రలు.

ఇందులో క్లుప్తతకు కేశవరెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత కొన్నిచోట్ల బాగుంది. నవలలో ప్రధాన విలన్‌ పెదనాయుడే అయినా, అతడు ఎక్కడా మనకు కనబడడు అతడి ప్రభావం ముత్యాల నాయుడి ద్వారా మనకు అర్థమవుతుంది.
వెట్టిచాకిరిని కొనసాగిస్తూనే పైకి దయామయుడిగా కన్పించడానికి పెదనాయుడి ప్రయత్నాలు ఆధునిక విలన్‌లకు దగ్గరగా ఉంటాయి. బహుశ ఎవరైనా ఈ నవలను సినిమాగా తీస్తే, చివరన కోనిగాడు తన బాండ్‌ పేపర్లను తెచ్చుకోవడానికి దొర ఇంటికి వెళ్లినప్పుడు పెదనాయుడిని, ఓ రంగుల కుర్తా వేసుకున్న ఆర్టిస్టుగా చూపిస్తే బాగుంటుంది. పైకి ఎంత తియ్యగా మాట్లాడినా, లాభనష్టాల విషయంలో అత్యంత కర్కశంగా వ్యవహరించే కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఇవాళ్టి ఫ్యూడల్స్‌కు ఆదర్శం.

అన్నిరకాల భ్రమలు దూరమైనా ఊరి మీద మమకారం చావకపోవడం మానవీయ లక్షణం. కన్నీళ్లతోనే ఉన్న ఊరిని వదిలి పట్నం బయల్దేరిన ఐదుగురు- కోనిగాడు, పుల్లిగాడు, కంసాలి, తిరిపాలనాయుడు, పూజారి- మన ఊళ్లలో కన్పించే వివిధ సామాజిక వర్గాలకు ప్రతినిధులు. అయితే వీళ్లు పట్నంలో మెరుగైన జీవితం గడుపుతారా? దశాబ్దాలపాటు ఉన్న ఊళ్లో అనుభవించిన కష్టాలు గట్టెక్కుతారా? ''రాముడుండాడు రాజ్జిముండాది'' అంటూ వలసపోయే చిత్తూరు ప్రాంత గ్రామీణుల ఆశావాదమే ఈ ప్రశ్నలకు జవాబు.

- ఎస్‌. రామకృష్ణ
(పాలపిట్ట మాస పత్రిక)
సమీక్షకుని సెల్‌ నెం. 924 636 4326Friday, May 20, 2011

సిటీ బ్యూటిఫుల్‌ - డా.కేశవరెడ్డి ...


కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను.
అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి.
కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు.
ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బా, నువు నాణెం రెండు వైపులా చూసినోడివి. సిటీలైఫ్‌ గురించి నువ్వు రాయాల'' అన్నారు. (ఇంతకీ నేను నాణెం రెండువైపులా చూసినోడినేనా?)

నాకు బాగా తెలిసన నగరం పాండిచ్చేరి నగరమే. ఆ నగరంలో ఎవర్ని గురించి రాయాలి? బాగా పరిచయమున్న విషయం గురించి మాత్రమే రాయాలన్న చాదస్తప్రాయమైన నియమం కలవాడిని. కనుక ఒక మెడికో అనుభవాలను ఆధారంగా చేసుకుని రాయాలనుకున్నాను. నా ఇతర నవలలలాగే సంఘటనలన్నీ స్వల్ప వ్యవధిలో - మూడు, నాలుగురోజులలో - జరిగిపోయేలా ప్లాటు వేసుకుని ఈ నవల రాశాను.
ఈ సమాజంలో ఏర్పరచుకున్న బూటకపు విలువలను, బోడి సంప్రదాయాలను ఆమోదించలేని ఒక ఉలిపికట్టె కథే ఇది.
- డా.కేశవరెడ్డి
(ముందుమాట 'లెస్‌ ఎలోన్‌ వెన్‌ ఎలోన్‌ లేక ఇక్కడా మనుషులేనా?' నుంచి)

......................................................................................

మన సమూహాల్లో ఒంటరితనాన్ని గుర్తు చేసే నవల యిది. ఈ సొసైటీలో మన 'బిలాంగింగ్‌నెస్‌' ని మనమే 'డిస్‌ఓన్‌' చేసుకునే ఓ ఆత్మిక సందర్భం ఈ 'సిటీ బ్యూటిఫుల్‌' అనే మంచి నవల.
ఓ గొప్ప రచయిత చేసిన అతి సాధారణ రచన అసాధారణంగా పాపులర్‌ అయిపోవచ్చు.
అదే రచయిత చేసిన ఓ అసాధారణ రచన, సామాజిక స్పృహ, నీతి సూత్రాలూ, సంఘ ప్రయోజనాల్లాంటి చాలా, చాలా 'గొప్ప' సాహితీ సూత్రాల వల్ల అతి మామూలు నవలగా, రచనగా మిగిలిపోవచ్చు. అదుగో అ లా మిగిలిపోయిన రచనే ఈ నవల అని నా ఉద్దేశం.

నిజానికి డా. కేశవరెడ్డి గారు తనమీద పడ్డ ఓ రకపు ముద్రకు తనే తనపైన అంగీకారాన్ని తెలియబరుస్తూ ఓ ఫ్రేమ్‌వర్క్‌లో రచన చేస్తూ వున్నారు...నిన్నటి ''మునెమ్మ'' దాకా.
ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఎక్కడా ఇమడని నవల ''సిటీ బ్యూటిఫుల్‌''. డాక్టర్‌గారి అసలు సిసలు రచనా బలాన్ని... ఆయన చదువరితనాన్ని, ఆయనలోని నిర్భీతినీ 'ట్రాన్స్‌పరెన్సీ' చూపే రచన సిటీ బ్యూటిఫుల్‌.
ఇందులో కథలేదు. (కథ లేకుండా నవలేమిటన్న సామాన్య అమాయక ప్రశ్నవేసే వాళ్లకది అసలు నవల కాదు).
ఇందులో అద్భుత కథనం వుంది.
దేవీదాస్‌ అనబడే ఓ యువ మెడికో అంతస్సంఘర్షణను అక్షరబద్ధం చేయడం చూస్తామిందులో. ప్రాంతాల వారీగా ... మతాల వారీగా ... కులా వారీగా ... జెండర్‌ వారీగా సాహిత్యాన్ని చింపి చూసే, చూపే సాహితీ 'దొడ్డు' వారికి డా.కేశవరెడ్డి ఓ ప్రాంతానికి చెందిన రచయిత.

కేశవరెడ్డి గారి రచనల్లో స్థలాలూ, భాషా నేపథ్యం ఓ ప్రాంతానికి చెందినవైనా ... ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన డా.కేశవరెడ్డి గారి ప్రాత్రల మూలాలు మాత్రం విశ్వమానవీయతలో వుంటాయి.
...
జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా నిజ జీవితాన్ని సాగిస్తూన్న డా.కేశవరెడ్డిగార్ని ఓ చట్రంలో బిగించేసి చూస్తున్నవారికి, సాధారణ పాఠకులక్కూడా ఓ విభిన్నమైన నవల ఈ ''సిటీ బ్యూటిఫుల్‌''.
నా వరకూ నాకు ఇది ఆయన నంబర్‌ వన్‌.

- కాశీభట్ల వేణుగోపాల్‌
(పరిచయం 'మంత్ర నగరి' నుంచి)

..........................................

సిటీ బ్యూటిఫుల్‌
రచన: డా.కేశవరెడ్డి

122 పేజీలు
వెల: రూ.80/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067

ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Thursday, May 19, 2011

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ (క్షుద్ర దేవత) - డా. కేశవరెడ్డి ...


ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ అన్నదే ఈ నవల పేరు!
ఈ ఇంగ్లీషు పేరుకు ఒక తెలుగు అర్థం ... క్షుద్రదేవత.


కొంతకాలం క్రితం ఒకరోజు మా ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నాను. ఒక రోగి 'కన్సల్టేషన్‌ రూమ్‌' లోకి వచ్చాడు. రోగిని పరీక్షించేముందు అతని పేరు, కులం, ఊరు, వయసు వగైరా వివరాలను 'స్టాటిస్టికల్‌ పర్పస'్‌ కోసం నమోదు చేయాలి.
అవన్నీ అయ్యాక ''ఏం చేస్తుంటావు?'' అని అడిగాను.
అతడు ''అడుక్కు తింటుంటా'' అన్నాడు.
''అది సరే నీ కుల వృత్తి ఏమిటి?'' అనడిగాను.
అతడు, ''అడుక్కు తింటాం'' అన్నాడు.
''చూడు బాబూ. నేను రాసుకోవాలి. నీ కులవృత్తి ఏమిటో చెప్పు'' అన్నాను.
అతడు ''మా కులపోళ్లంతా చేసేది అదే. అందరం అడుక్కుతింటాం'' అన్నాడు.
తర్వాత తెలిసిందేమిటంటే అడుక్క తినడమే కులవృత్తిగా గల కులాలు ఈ దేశంలో డజనుకుపైగా వున్నాయట.

ఈ దేశంలో వ్యవస్థీకృతమై వున్న ఈ భ్రష్టకారి కుల వ్యవస్థ మీద పోరాటం దాదాపు రెండువేల సంవత్సరాల నుంచి సాగుతున్నది.
ఇన్ని వేల యేండ్లుగా ఏ కులమైతే తనను అవమానాలకు, అమానవీయతకు, హైన్యతకు గురిచేస్తూ వచ్చిందో ఆ కులనామాన్ని తన పేరు చివరన నేడు దళితుడు రాసుకుంటున్నాడు.
అ లా రాసుకోవడం ద్వారా తన ఆత్మగౌరవాన్ని, తద్వారా తన సాంఘిక సమానత్వాన్ని నిర్ద్వంద్వంగా, బాహాటంగా ప్రకటించుకున్నాడు.
ఈ శతాబ్దంలో సగర్వంగా చెప్పుకోదగిన సాంఘిక చైతన్యంగా దీనిని భావించడానికి ఏమాత్రం తటపటాయించనవసరంలేదు.

ఐతే ఈ సాంఘిక చైతన్యం బాహ్యశక్తులతో పోరాడి సంపాదించింది కాదు.
వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న 'సాంఘిక' సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ''సున్న'' అని చెప్పాల్సి వుంటుంది.
కానీ 'సున్న' కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు 'అంకె' చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి
('దళితుడి పయనం' ముందుమాట నుంచి)
....................................................


మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన కేశవరెడ్డి తన చుట్టూరా వున్న సమాజంలోని నిమ్నోన్నతాల్ని, హింసా సన్నివేశాల్ని, అంతులేని యాతనతో నిండిని దీనజనుల దుఃఖ జీవితాల్నీ బాగా కళ్లు తెరచుకుని చూచిన మానవుడు.
చిన్న వయసులోనే ఒక పెద్ద ఆశయం కోసం కలం పట్టిన రచయిత.
ఏరు దాటి తెప్ప తగలేసేవాడు కాడు.
తిరుపతిలో వున్నా, పాండిచ్చేరిలో వున్నా, నిజామాబాదులో వున్నా తమ పల్లెను గురించి, అక్కడి బక్క రైతుల  యొక్క బీద కూలీల స్థితిగతులను గురించి ఆలోచించే నిజాయితీపరుడు.

ఈ నవలలో రచయిత దాపరికం లేకుండా, మొగమాటానికి పోకుండా హరిజనుల జీవన సమస్యకంతా కీలకప్రాయమైన, మూలకారణమైన లోపం ఎక్కడుందో చెప్పేశాడు.
మనిషికి యితరులవల్ల జరిగే అపకారం కన్నా, తనవల్ల తనకే జరిగే అపకారం ఆత్మహత్యా సదృశమైనదని నిరూపించాడు.
గుండెల్ని పిండిచేసే సానుభూతిలో నుంచీ వెలువడిన ఒక కరుణామయమైన ఆక్రందన యీ నవల.
- మధురాంతకం రాజారాం
(పరిచయం నుంచి)
................................

ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌ (క్షుద్రదేవత)
రచన: డా.కేశవరెడ్డి

155 పేజీలు
వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌