Sunday, January 25, 2009

పంచమం ... నవల ... రచన : చిలుకూరి దేవపుత్ర .

'ఆటా' నవలల పోటీలో (1998) బహుమతి పొందిన ఈ నవలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం వారు 2001లో, యునివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఆంధ్రా యునివర్సిటీ వారు 2005లో తమ ఎం.ఎ. తెలుగు సిలబస్‌లో చేర్చి గౌరవించారు. ఈ నవల ఉండేల విజ్ణాన కళా పీఠం అవార్డును కూడా గెలుచుకుంది.
....

....పద్మకి ఇంగ్లీషు గ్రామర్‌ ట్యూషన్‌ చెపుతున్నాడు శివయ్య. పద్మ తల్లి ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఎప్పటిలాగే పద్మకి స్టీల్‌ గ్లాసులో, శివయ్యకి సత్తుగ్లాసులో.
పద్మవాళ్ల ఈడిగ కులం పెద్దగొప్పదేం కాకపోయినా శివయ్య మాదిగవాడు.
శివయ్యను ప్రేమగా పలకరిస్తూనే అతనికి సత్తు గ్లాసులో కాఫీ ఇవ్వడం సహజమైన విషయంగా పద్మ తల్లి భావిస్తుంది.అ లా కాఫీ ఇచ్చినప్పుడల్లా పద్మ ఎంతో అపరాధ భావనకు గురవుతుంది.

అమ్మ ఇద్దరికీ స్టీల్‌ గ్లాసుల్లోనే కాఫీ ఇస్తే ఎంత బావుండును అనుకొంటుంది. తన గ్లాసు అతనికిచ్చి, అతని గ్లాసు తను తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అదే జరిగితే పరిణామాలెంత తీవ్రంగా వుంటాయో శివయ్యకు తెలుసు.
నిత్యమూ అనుమానాల మధ్యన, హింసల మధ్యన, హింసోన్మత్త ఎగతాళి చూపుల మధ్యన పుట్టి పెరిగినవాడు శివయ్య. ఆ సున్నిత తిరస్కృతి వెనుక ఎంతటి భయం, దాగివుందో, ఎంతటి భీభత్సం పొంచి వుందో రచయిత చిలకూరి దేవపుత్ర తన ''పంచమం'' నవలలో బొమ్మ కట్టినట్లు చూపుతాడు.

తల్లా ప్రగడ వారి ''హేలావతి'' నవల నుండి ఈనాటి వరకూ దళిత జీవితాన్ని చిత్రిస్తూ అనేక నవలలు, కథలూ వచ్చాయి. దళితుడుగా పుట్టి, దళితాన్ని జీవించి, ఆ బాధలోంచి ఆవేదనలోంచి, ఆ అనుభవంలోంచి ఆవిష్కరించిన దళిత జీవన పరిణామమే ''పంచమం'' నవల. దళిత జీవితం ఎంత సంఘర్షణకు లోనవుతోందో ప్రతి చిన్న కదలికతో సహా పట్టి మనకు అందించారు దేవపుత్ర.

.......... కలేకూరి ప్రసాద్‌ (గుండె గొంతుకను దాటిన పంచమం స్వరం, వార్త 8-2-1999)


.........

..... జీవితాన్ని అద్భుతంగా చిత్రించలిగిన నవలా ప్రక్రియలోకి దళిత సాహిత్యోద్యమం ప్రవేశించకపోవడం ఇన్నాళ్లూ ఒక వెలితిగానే ఉండింది. నిజానికి దళిత జీవితంలోని వైవిధ్యం, కళాత్మకత, ఆర్థిక, రాజకీయ, సాంస్కృనిజతిక రంగాలలో దళితులు అనుభవిస్తున్న దోపిడీ పీడనల ప్రత్యేక రూపాలు నవలా ప్రక్రియకు విశిష్టమైన ముడిసరుకుగా పనిచేస్తాయి.

అయితే దళిత సాహిత్యోద్యమం ఆ అద్భుతమైన ముడి సరుకును ఉపయోగించి సృజనాత్మక, కాల్పనిక ప్రక్రియలుగా అనువదించలేకపోయింది. ఆ పని జరిగే లోగానే వాద వివాదాలలో, చీలికలలో పడి జీవన సంక్లిష్టతను సమగ్రంగా ఆకళించుకోగల కుదురును రచయితలకు అందించలేని స్థితి నెలకొంది.

ఈ అన్ని కారణాల వల్ల చిలుకూరు దేవపుత్ర నవల పంచమం, తెలుగు నవలా చరిత్రలోనూ, దళిత జీవిత చిత్రణ చేసిన సృజనాత్మక కళారూపాలలోనూ ప్రధానమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నూట ఇరవై ఏళ్ల తెలుగు నవలా చరిత్రలో వస్తు వైవిధ్యంలో, సంక్లిష్ట సామాజిక సంచలనాలకు అద్దం పట్టడంలో, వ్యక్తి జీవితానికీ సమాజ జీవితానికీ మధ్య వున్న సంబంధాన్ని సరిగ్గా వ్యక్తీకరించడంలో ''పంచమం'' అగ్రస్థానంలో నిలుస్తుంది.

...........ఎన్‌. వేణుగోపాల్‌ (సమగ్ర దృష్టే పంచమం స్వరం బలం, ఆంధ్ర ప్రభ, 15-5-2000)

.........

....కమర్షియల్‌ నవలలు ఎప్పుడూ వస్తుంటాయి. డబ్బు చేసుకుంటుంటాయి. పాఠకులు వాటిని పొద్దుపోవడానికి చదువుతూ వుంటారు. ఆ మరుసటి రోజే చదివినదంతా మరిచిపోతుంటారు. అందుకు కారణాలు - వాటి ఇతివృత్తాలు రచయిత మెదడులోంచి మాత్రమే పుట్టుకురావడం, వాటిలోని పాత్రలన్నీ నేలమీద నడవక పోవడం.

కానీ సామాజిక స్పృహతో చేసిన రచనలన్నీ పదికాలాలపాటు నిలబడతాయి. అందుకు ఉదాహరణ ఉన్నవగారి ''మాలపల్లి'', మహీధర గారి ''రథచక్రాలు'', కొడవటిగంటి కుటుంబరావుగారి ''చదువు'' మొదలైన నవలలు. దళితులు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా, మంత్రి పదవులు చేపట్టినా, వారు భూస్వాములకీ, రాజకీయ నాయకులకీ ఉపయోగపడతారే తప్ప మరెవరికీ ఉపయోగపడరు. దళితులకి రాజ్యాధికారం రావాలంటే వాళ్లల్లో చైతన్యం రావాలి, వాళ్లంతా ఒక్కటయిపోరాడాలి. ఈ అంశాలు ''పంచమం''లో బలంగానే చెప్పానని అనుకుంటున్నాను.

.......... చిలుకూరి దేవపుత్ర (మీతో కాసేపు, ముందుమాట నుంచి)
....

- చిలుకూరి దేవపుత్ర అనంతపురం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డిడబ్ల్యూఎంఎ), ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్నారు. ఇంతవరకూ వీరివి 100 కథలకు పైగా వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. వీటిలో కొన్ని ఆంగ్ల, హిందీ, మరాఠీ, ఒరియా, కన్నడ భాషలలోకి అనువాదమయ్యాయి. ''ఆరుగ్లాసులు'', ''ఏకాకి నౌక చప్పుడు'', ''వంకరటింకర ఓ'', ''బందీ'' పేర్లతో నాలుగు కథా సంకలనాలు వెలువడ్డాయి.
''అద్దంలో చందమామ'', ''చీకటి పూలు'', ''పంచమం'', ''కక్షశిల'' నవలలు ప్రచురితమయ్యాయి.

....


పంచమం (నవల)
రచన: చిలుకూరి దేవపుత్ర
ముఖచిత్రం : రమణ జీవి
275 పేజీలు, వెల: రూ.100


ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కా పూర్‌,
హైదరాబాద్‌- 500 067
ఫోన్‌ నెం. 040-2352 1849

........................

.

Wednesday, January 21, 2009

పంచమం పుస్తక ఆవిష్కరణ సభ అందరూ ఆహ్వానితులే
పంచమం పుస్తక ఆవిష్కరణ సభ
24 జనవరి 2009 శనివారం సాయంత్రం 5.30 కి
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ బషీర్ బాగ్ లోMonday, January 19, 2009

పంచమం ... ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల ... చిలుకూరి దేవపుత్ర .. పుస్తకావిష్కరణ .. జనవరి 24న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ....

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ మరియు సెంటర్‌ పర్‌ రూరల్‌ స్టడీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వారు

పంచమం
చిలుకూరి దేవపుత్ర రచించిన తొలి దళిత నవల

పుస్తకావిష్కరణ సభకు


మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

వేదిక:
ప్రెస్‌ క్లబ్‌, బషీర్‌ బాగ్‌


తేది, సమయం:
24 జనవరి 2009 శనివారం సాయంత్రం 5.30


వక్తలు:
- ప్రొ. కొలకలూరి ఇనాక్‌
మాజీ వైస్‌ ఛాన్స్‌లర్‌, శ్రీ వెంకటేవ్వర విశ్వవిద్యాలయం

- వోల్గా
స్త్రీవాద రచయిత్రి

- విద్యాసాగర్‌
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌

- ఎన్‌. వేణుగోపాల్‌
సంపాదకుడు, వీక్షణం

- బోస్‌
సెంటర్‌ ఫర్‌ రూరల్‌ స్టడీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌

Saturday, January 17, 2009

జబ్బుల గురించి మాట్లాడుకుందాం ...స్మోకింగ్‌ డిసీజ్‌ (పొగ జబ్బు) ... న్యూ ఇంటర్నేషనలిస్ట్‌ ... తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార


స్మోకింగ్‌ డిసీజ్‌ ...
( మీ ఆరోగ్యం గురించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ పుస్తకం మీకు ఎంతగానో తోడ్పడుతుంది)

పొగతాగే అ లవాటు ఒక జబ్బు కాని జబ్బు!

దాని బారిన పడ్డవాళ్లు తమకు తాము హాని చేసుకోవడమే కాకుండా పక్కవాళ్ల ఆరోగ్యానికి కూడా నష్టం కలిగిస్తారు.

ఊపిరితిత్తుల క్యాన్సర్లలో 90 శాతం,
బ్రాంకైటిస్‌ కేసుల్లో 75 శాతం,
గుండె జబ్బుల్లో 50 శాతం
ఈ అ లవాటు కారణంగానే సంక్రమిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వల్ల అకాల మృత్యువు వాత బడుతున్నారని అంచనా.

ధూమపాన ప్రియులు ఏడాదికి దాదాపు 6,000 బిలియన్ల సిగరెట్లను తగలేస్తున్నారు.

తత్ఫలితంగా వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఎంతగా పెరుగుతోందో... చిన్న పిల్లలు, పొగతాగని ఇతర వ్యక్తులు ఎన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తోందో ఊహించుకోవాల్సిందే.

అంతేకాదు, పొగాకు ప్రాసెసింగ్‌కు పెద్ద ఎత్తున వంటచెరుకు కావాలి. అందువల్ల పొగాకు సాగు, ప్రాసెసింగ్‌ల కోసం ప్రతి సంవత్సరం పచ్చని అడవులు నరికివేతకు గురవుతూ పర్యావరణానికి ఎనలేని నష్టం వాటిల్లుతోంది.

ప్రపంచ పొగాకు మార్కెట్‌లో సగ భాగం కేవలం ఐదు అంతర్జాతీయ కంపెనీల గుప్పిట్లో వుంది.
ఫిలిప్‌ మోరిస్‌ (అమెరికా) కంపెనీ ఏడాదికి 47.1 బిలియన్‌ డాలర్లును ఆర్జిస్తుంటే, బిట్రీష్‌ అమెరికన్‌ టొబాకో (బ్యాట్‌) కంపెనీ 31.1 బిలియన్‌ డాలర్లను, జపాన్‌ టొబాకో ఇంటర్నేషనల్‌ 21.6 బిలియన్‌ డాలర్లను ఆర్జిస్తున్నాయి.

పొగాకు పరిశ్రమ వల్ల ఆయా దేశాల ఖజానాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. కానీ అదే సమయంలో ఆ దేశాలు పొగాకు దుష్‌ప్రభావం కారణంగా సంక్రమించే వ్యాధుల చికిత్సకోసం, ప్రజా ఆరోగ్యం కోసం అనేక రెట్ల మొత్తంలో డబ్బును ఖర్చుచేయాల్సి వస్తోంది.

పొగాకు చుట్టూ వున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, పర్యావరణ అంశాలను తెలుసుకునేందుకు, పొగాకుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు, పొగాకు అ లవాటు (జబ్బు) నుంచ బయటపడేందుకు ఈ పుస్తకం మీకు ఎంతగానో తోడ్పడుతుంది.

ఇందులోని అధ్యాయాలు:

1. స్మోకింగ్‌ డిసీజ్‌
2. పొగ చూరిన శరీరం
3. కాసులు రాల్చని కాసుల పంట
4. అదుపులేని అ లవాటు
5. అంతులేని అనర్థాలు
6. పొగాకు కంపెనీలపై కోర్టు కేసులు
7. పొగాకు పరిశ్రమతో పోరాటం
8. అటు నిషేధం - ఇటు ప్రచారం
9. నిప్పులాంటి నిజాలు
10. పొగతాగే అ లవాటును వెంటనే మానేయండి

ఈ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని పనికొచ్చే వెబ్‌సైట్లు:

1. యాష్‌ - యాక్షన్‌ ఆన్‌ స్మోకింగ్‌ అండ్‌ హెల్త్‌: www.ash.org
2. పిల్లలను పొగాకు నుంచి రక్షించే ప్రచార కార్యక్రమాలు: www.tobaccofreekids.org
3. పొగాకు వ్యతిరేక అంతర్జాతీయ మహిళా సంఘాల కృషి:www.inwat.org
4. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ కృషి: www.globalink.org
5. పొగతాగనివాళ్ల హక్కులు : www.nsra-adnf.ca
6. పొగాకు నియంత్రణకు అంతర్జాతీయ హక్కులు: www.quitnow.info.au
7. పొగాకు నియంత్రణకు అంతర్జాతీయ పరిశోధనలు: www.idrc.ca/tobacco
8. పొగాకు రహిత ప్రపంచం కోసం: www.who.int/tobacco/en/
9. పొగాకు మానేందుకు చిట్కాలు: http://www.ash.org.uk/html/factsheets/html/fact24.html


జబ్బుల గురించి మాట్లాడుకుందాం సిరీస్‌లో భాగంగా వెలువడిన...

స్మోకింగ్‌ డిసీజ్‌ (పొగ జబ్బు)

ఆంగ్లమూలం: Hooked on Tobacco, New Internationalist, July 2004, www.newint.org

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

48 పేజీలు, వెల: రూ.10


ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్లాపూర్‌, మెహదీపట్నం,
హైదరాబాద్‌ 500 028
ఫోన్‌ నెం. 040-2352 1849
..............................

Sunday, January 4, 2009

మా కొద్దీ నల్ల దొరతనము ... కుసుమ ధర్మన్న కవి (1921)


తెల్ల దొరల పాలన నుంచి విముక్తిని కోరుకుంటున్న దశలోనే దళితులు తమపై తరతరాలుగా సాగుతూ వస్తున్న నల్ల దొరల పీడన, అణిచివేత, వివక్షల నుంచి విముక్తిని కోరుకున్నారు.

బ్రిటీష్‌ రాజ్యం పోయి స్వరాజ్యం వస్తే అది ఎవరి రాజ్యం అవుతుంది?

స్వరాజ్య ఫలాలు అందరికీ అందుతాయా లేక కొందరికే చెందుతాయా?

అనే ప్రశ్నలు వారిని అప్పట్లో తీవ్రంగా వేధించాయి.

ఆ వేదనలోంచి వెలువడిందే ఈ ''మా కొద్దీ నల్ల దొరతనము'' పుస్తకం.

దళిత వర్గం నుంచి అతి కష్టంమీద చదువుకుని పైకొచ్చి - తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతికొద్ది మంది దళిత విద్యావంతుల్లో 'కుసుమ ధర్మన్న కవి' ఒకరు.

ఆయన ఈ పుస్తకాన్ని 1921లో వెలువరించారు.

అయితే గరిమెళ్ల సత్యనారాయణ రాసిన '' మాకొద్దీ తెల్లదొరతనం'' ప్రబోధ గీతాలు కూడా అదే సంవత్సరం వెలువడ్డాయి.

కాగా కుసుమ ధర్మన్న కవే ముందుగా '' మాకొద్దీ నల్లదొరతనము'' పాట రాశారనీ, ఆ తరువాత అదే వరసలో గరిమెళ్ల ప్రబోధ గీతం రాశారని ప్రతీతి.

మొత్తం మీద ఈ రెండూ ఏకకాలంలో ప్రచారం పొందాయి.

''స్వారాజ్య మనుచు సర్కారుతో పోరాడి
స్వాతంత్రీయ మడుగుతారు
మాకు స్వాతంత్య్ర మివ్వబోరు

గుడిగోపురాలకైనా రానీరు
సత్రమూలందు మమ్ముండనీరు
నూతి నీళ్లన్న తోడుకోనీరు
మాలలంటె హక్కు లేదంటారు
మాకు హక్కు లేదంటె స్వారాజ్య మెక్కడ దక్కు?...

మాకొద్దీ నల్ల దొరతనము -
దేవ మాకొద్దీ నల్ల దొరతనము
మాకు పదిమందితో పాటు -
పరువు గలుగకున్న
మాకొద్దీ నల్ల దొరతనము''

అంటూ ఆగ్రహంతో ఆక్రోశిస్తాడు కవి.

తెల్లదొరల పైని కళ్లెరగ్రా జేసి
హక్కు లడగ జూచు నాగ్రహమున
పక్కనున్న నిన్ను తొక్కిపెట్టరె వీరు
ఆలకింపు మయ్య హరిజనుండ

అంటూ దేశంలో వున్న మాల మాదిగలపట్ల దారుణమైన వివక్షను ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికాలోని జాతివివక్ష గురించి మాట్లాడే అగ్రవర్ణాల వారి హిపోక్రసీని బట్టబయలుచేస్తాడు.

అచ్చరాలు నేర్వ - ముచ్చటున్న గాని
చదువు బడిలో జేరనీరు
చదువు చదివితే సహించుకోరు
విద్యలేదని వెయ్యి తిట్టేరు
సరివారినీ దరికి రానీరు - దేవ
వేదాలంటా మేము వినరాదంట బాబు...

దళితులకు చదువుకునే అవకాశం లేకుండా చేసింది అగ్రకులస్థులే. తిరిగి విద్య లేనివాడు వింత పశువు అంటూ దళితులను అవహేళన చేసేదీ అగ్రకులస్థులే.

అగ్రకులాలవారు దళితుల పట్ల ప్రదర్శించిన అమానుషమైన వివక్షను, అన్యాయాన్ని, అంటరానితనాన్ని, హిందూ అధర్మశాస్త్రాలను, సాంప్రదాయాలను చీల్చి చెండాడుతాడు కవి.

మా కొద్దీ నల్ల దొరతనము
(అంటు దోషము మాన రేలా?)

- కుసుమ ధర్మన్న కవి
28 పేజీలు, వెల: రూ.7

Friday, January 2, 2009

టాల్‌స్టాయ్‌ కథలు ... అనువాదం: మహీధర జగన్మోహనరావు, ఉప్పల లక్ష్మణరావు


... నాలుగు కథల బంగారం ...

రష్యా చక్రవర్తుల నిరంకుశత్వాన్నీ, ఆనాటి జమీందారీ సమాజంలోని అన్యాయాల్నీ తీవ్రంగా ఖండిస్తూ, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు తన రచనల ద్వారా విశేష కృషి చేసిన మహనీయుడు టాల్‌స్టాయ్‌.
ఆయన గ్రంథాలు కేవలం రష్యాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

కథానికా రచనలోనూ, నవలా రచనలోనూ టాల్‌స్టాయ్‌ది అందెవేసిన చేయి.
దాదాపు ప్రపంచ భాషలన్నింటిలోకీ ఆయన రచనలు అనువదించబడ్డాయి.

టాల్‌ స్టాయ్‌ రాసిన నాలుగు చిన్న కథల సంకలనమిది. ఆ కథలు:

1. ఎంత భూమి కావాలి?
2. కోడిగ్రుడ్డంత గోధుమ గింజ
3. చిన్న పిల్లల తెలివి
4. విందు తర్వాత

వీటిలో మొదటి మూడు కథలను మహీధర జగన్మోహనరావు, చివరి కథను ఉప్పల లక్ష్మణరావు అనువదించారు. 1880లలో రాసిన కథలైనప్పటికీ ఈనాటి సమాజానికి కూడా పనికొచ్చే సందేశాన్నీ, స్ఫూర్తిని అందిస్తాయీ కథలు. ఇవి అపరూపమైనవే కాదు అజరామరమైనవి కూడా!

టాల్‌ స్టాయ్‌ కథలు
తెలుగు అనువాదం: మహీధర జగన్మోహనరావు, ఉప్పల లక్ష్మణరావు
ప్రథమ ముద్రణ: 1984
పునర్ముద్రణ: 1989,2000
32 పేజీలు, వెల: రూ.9


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067

ఫోన్ : 040-2352 1849
……………………

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌