Friday, December 29, 2017

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ మంత్రి పోరాటం - Gauri Lankesh




మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ మంత్రి పోరాటం    
 
కర్ణాటక రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి సతీష్‌ జర్కిహోళి గత రెండేళ్లుగా అంటే 2013 నుంచి అంబేద్కర్‌ వర్థంతి దినమైన డిసెంబర్‌ 6 ను ఒక అసాధారణమైన రీతిలో గడుపుతున్నారు. ఆ రోజును  మూఢవిశ్వాసాల వ్యతిరేక దినంగా పాటించడం కోసం ఆయన నిన్నంతా - పగలు రాత్రీ కూడా - బెళగావి స్మశానంలో గడిపారు.

ఓట్ల కోసం ప్రజలను సంతప్తి పరిచే ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుడే అయినప్పటికీ సమాజాన్ని వెల్లువలా ముంచెత్తుతున్న మూఢవిశ్వాసాలకు ఎదురీదాలని జర్కిహోళి నిర్ణయించుకున్నారు. ఆయన స్థాపించిన మానవ బంధుత్వ వేదికె (నబఎaఅ ఖీతీఱవఅసరష్ట్రఱజూ ఖీశీతీబఎ) ఆధ్వర్యంలో 2014లో సదాశివనగర్‌ స్మశానంలో ఓ పెద్ద కార్యక్రమమే జరిగింది.

వేలాదిమంది సాధారణ ప్రజలూ, వందలాది మంది సామాజిక కార్యకర్తలూ, లింగాయత్‌ మఠాలకు చెందిన పలువురు ప్రవక్తలూ, ఇతర మత శాఖల నాయకులూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పేద, వెనుకబడ్డ ప్రజలను మూఢనమ్మకాలు ఏ రకంగా అంధకారంలోకి నెడుతున్నదీ వారంతా వివరించారు. వాటిని ఎదుర్కోవాల్సిన విధానాలను చర్చించారు. ఓ పక్క శవాల ఖననం, దహనం జరుగుతుండగానే వారంతా అక్కడే కూర్చుని సామూహిక భోజనాలు కూడా చేశారు.

ఆ రోజు సాయంత్రం మిగిలిన వారు వెళ్ళిపోగా జర్కిహోళి, మరో పిడికెడు మందీ ఒక డేరా వేసుకొని ఆ రాత్రి అక్కడే స్మశానంలో ఉండిపోయారు. అటువంటి కార్యక్రమమే ఈ ఏడాదీ జరిగింది.

జర్కిహోళి అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం ఇది మొదటిసారేం కాదు. చంద్ర గ్రహణం పట్టువిడుపుల సమయంలో ఎవరూ ఏదీ తినకూడదనీ, తాగకూడదనీ జ్యోతిష్కులు అంటారు. వారిని నమ్మేవారు గ్రహణ దోషాల నివారణ కోసం ఇంట్లో నిల్వ ఉంచుకున్న నీటినంతా పారబోసి, తాజాగా తెచ్చుకున్న నీళ్ళతో ఇంటినంతా కడుక్కుంటారు.         

ఆ జ్యోతిష్కులూ, వారిని గుడ్డిగా విశ్వసించే వాళ్ళూ చెప్పేది తప్పని రుజువు చేయడం కోసం 2014 లో జర్కిహోళి చంద్ర గ్రహణ సమయంలో టీ, వడపావ్‌ కార్యక్రమం ఒకదాన్ని నిర్వహించారు.

చాలామంది దుర్దినంగా భావించే మహాలయ అమావాస్య నాడు తాను క్షవరం చేయించుకుంటున్న ఫోటోను ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. వాట్సాప్‌ ద్వారా కూడా అందరికీ పంపించారు.

'నిమ్న' కులాలను అణచివేసేందుకు, సుఖమయమైన బ్రతుకుతెరువును పొందేందుకే పురోహిత వర్గం ఈ కులాలనూ, మతాలనూ, మూఢనమ్మకాలనూ సష్టించిందని అజ్ఞేయవాది (aస్త్రఅశీర్‌ఱష) అయిన జర్కిహోళి దఢంగా నమ్ముతారు. ''దేవుడూ, దెయ్యమూ రెండూ లేవు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని నా ప్రయత్నం. అందుకోసమే ఇటువంటి కార్యక్రమాలను నేను నిర్వహిస్తుంటాను'' అని చెపుతారు ఆయన.

బుద్ధుడ్నీ, బసవన్ననూ, అంబేద్కర్‌నూ అనుసరించే జర్కిహోళికి తాను ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా ఏదో ఒకరోజు వారి ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని తెలుసు. ''ప్రజల విశ్వాసాల తేనెతుట్టెలో చేయి పెట్టడం ద్వారా ఒక రాజకీయ నాయకునిగా గండాన్ని కొనితెచ్చుకుంటున్నానని నాకు తెలుసు. ప్రజాబాహుళ్యంలో ఇలాంటి విషయాల్లో చైతన్యాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసినందుకే కదా బౌద్ధాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టారు! సమసమాజం గురించి పోరాడినందుకే కదా మనవాళ్ళు బసవన్నను బలవంతంగా మంత్రి పదవి నుంచి తొలగించారు.
వారిలాగే నేను కూడా పదవి పోయినా పట్టించుకోను. చివరి వరకూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఒంటరిసేన మాదిరి పోరు సలుపుతూనే ఉంటాను'' అని చెపుతారు ఈ ఎమకలమరడి ఎం.ఎల్‌.ఎ.

ఎన్నికలప్పుడు నామినేషన్లు వేయడానికి రాహుకాలం లాంటి వాటిని ఆయన అస్సలు పాటించరు. ఆయన దేవాలయాలను సందర్శించడం గానీ, హోమాలను నిర్వహించడం గానీ చేయనే చేయరు. గత ఏడాది పిల్లల చదువు కోసం ఆయన తన నివాసాన్ని స్వస్థలమైన గోకక్‌ నుంచి బెళగావికి మార్చారు. ''ఈ కొత్త ఇంట్లోకి మారిన తర్వాత మాకో విషయం తెలిసింది. ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఖాళీగానే ఉందట. కారణం అడిగితే ఆ ఇంటిని స్మశాన స్థలంలో నిర్మించినందువల్ల ఎవరూ అందులో ఉండడానికి ఇష్టపడలేదని తెలిసింది. పునర్జన్మ లేదా దెయ్యాల మీద నాకు విశ్వాసం లేదు కాబట్టి చనిపోయిన వాళ్ళు నన్ను గానీ, నేను వారిని గానీ బాధ పెట్టకుండా బతికేస్తున్నాం'' అంటూ
ఆయన పరిహాసంగా మాట్లాడతారు.

కొత్త ఇంట్లో చేరే ముందు ఆయన సహజంగానే గహప్రవేశం లేదా మరే క్రతువూ జరపలేదు. జర్కిహోళి కొంతకాలం పాటు 'సమయ' న్యూస్‌ ఛానల్‌ను నడిపారు. అది నష్టాలలో నడుస్తున్నప్పటికీ ఆయన జ్యోతిష, వాస్తుశాస్త్ర పండితులు ఎవర్నీ దగ్గరికి రానివ్వలేదు.

''హేతువాదాన్ని ప్రచారం చేసే లక్ష్యంతోనే ఈ ఛానల్‌ను నేను కొనుగోలు చేశాను.  జ్యోతిషం, వాస్తు శాస్త్రం వంటి అహేతుక విషయాలను ప్రసారం చేయడానికి ఛానల్‌లో స్లాట్‌ ఇస్తే  నెలకు 50 లక్షల

రూపాయలు ఇస్తామని కొంతమంది అడిగారు. కాని నేను ఒప్పుకోలేదు'' అని చెప్పారు జర్కిహోళి. నష్టాలను తగ్గించుకోవడానికి ఆయన ఆ తర్వాత ఆ ఛానల్‌ను విక్రయించారనుకోండి.

రెండు దశాబ్దాలపాటు ఈ విధంగా ఆయన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరు చేస్తూనే వున్నారు. ''నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా పెళ్లి తంతు నిర్వహణ కోసం పురోహితులు ఎవర్నీ పిలవలేదు. అయినప్పటికీ నేనూ, నా భార్యా ఆనందంగానే జీవిస్తున్నాం. దైవారాధనలో నేను సమయాన్ని ఎన్నడూ వధా చేయలేదు. బిల్‌ గేట్స్‌ గానీ, నేను గానీ ఎన్నడూ లక్ష్మీ దేవిని పూజించలేదు. అయినా అతడు ఈనాడు బిలియన్లకు అధిపతి. నేను ఆరు వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ గల వ్యాపారస్తుడ్ని. సరస్వతిని పూజించడం కంటే, బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన సావిత్రీబాయి ఫూలేను గుర్తు తెచ్చుకోవడం మరింత సముచితంగా ఉంటుంది'' అంటారు జర్కిహోళి.


''బుద్ధుడు, బసవన్న, అంబేద్కర్‌, జ్యోతిబా ఫూలే, పెరియార్‌, నారాయణ్‌ గురు వంటి ఎందరో సాంఘిక విప్లవకారులను భారతదేశం చూసింది. అయినా ఎందుకు ఇంకా చాలామంది పేదరికంలోనూ, అజ్ఞానంలోనూ ఉన్నారు? ఎందుకంటే వారు ఆ సంస్కర్తల బోధనలను మరచిపోయారు. తమను తరతరాలుగా పీడిస్తున్న వారినే విశ్వసిస్తున్నారు. మనం ఈ సాంఘిక సంస్కర్తలు ప్రచారం చేసిన భావనలను అనుసరించినపుడు మాత్రమే మన దేశం పురోగతి సాధిస్తుంది'' అని జర్కిహోళి నొక్కి చెబుతారు.

జర్కిహోళి ఒక రాజకీయ వేత్తే అయినా మూఢ, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక వైఖరి తీసుకోవడంలో, వాటికి వ్యతిరేకంగా పోరు చేయడానికి తన చేతి చమురును వదుల్చుకోవడంలో ఆయన ఇతర సాధారణ రాజకీయ నాయకుల మాదిరివాడు కానే కాదు.



(బెంగుళూరు మిర్రర్‌, 7 డిసెంబర్‌ 2015)

అనువాదం : ఎన్‌. శ్రీనివాసరావు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌