Thursday, January 29, 2015

ఆధునిక భారత చరిత్ర రచన: బిపిన్‌ చంద్ర తెలుగు అనువాదం: సహవాసిఆధునిక భారత చరిత్ర
రచన: బిపిన్‌ చంద్ర
తెలుగు అనువాదం: సహవాసి


గతంలో భారతదేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటిష్‌ వారికీ మధ్య తేడా ఏమిటి? 

భారతదేశం మీద బ్రిటన్‌ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి? 
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏయే సామాజిక మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి? 
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేలుకొల్పాయి? 
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు? 
భారత జాతీయ వాదంలోని పాయలేమిటి? 
బ్రిటిష్‌ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. 

ప్రజల ఆర్థిక సామాజిక జీవిత విధానాల్లో వచ్చిన పరిణటామాలకు చరిత్రకు పునాదిగా గ్రహించిన కొద్దిమంది చరిత్రకారులలో ఈ గ్రంధ రచయిత బిపిన్‌ చంద్ర ఒకరు. 
ఈయన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (డిల్లీ)లో ఆధినిక చరిత్రాచార్యులుగా  , నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌కు చైర్మన్‌గా పనిచేశారు.

సహవాసిగా చిరపరిచితులైన ఉమామహేశ్వరరావు తెలుగులో అనువాద ప్రక్రియకు ఒక కొత్త ఒరవడి దిద్దారు. ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావవంతంగా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత ఆయనది.

ఆధునిక భారత చరిత్ర

రచన: బిపిన్‌ చంద్ర
తెలుగు అనువాదం: సహవాసి
పునర్ముద్రణ: జనవరి 2015

356 పేజీలు, ధర రూ. 160/-


పతులకు, వివరాలకు:  
 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849 

ఇండియాలో సామాజిక పరిణామం - కె.ఎస్‌.చలం


ఇండియాలో సామాజిక పరిణామం
- కె.ఎస్‌.చలం


    భారతీయ సమాజం అనాది కాలం నుంచి నేటి వరకూ ఎలా పరిణామం చెందుతూ వస్తోందో సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అన్వేషించి - చాలా సులభంగా మన ముందుంచే - అరుదైన రచన ఇది. 


సమాజ పరిణామాన్ని ఒడిసి పట్టుకోవాలంటే  మానవ పరిణామం, చరిత్ర, ఆర్థిక  వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వంటి వాటన్నింటినీ పరామర్శించటం అవసరం. 

అందుకే అసలు సామాజిక పరిణామాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ పద్ధతులను స్థూలంగా పరిచయం చేస్తూ - ఆర్యులు, ద్రావిడులు వచ్చేంత వరకూ ఈ ప్రాంతంలో మానవ సంచారమే లేదన్నట్లుగా మూలవాసుల ఉనికినే చరిత్ర పరిధిలోకి రాకుండా చూసిన చారిత్రక అహేతుకతనూ, ఫ్యూడల్‌ వ్యవస్థలో పుట్టి పెరిగిన కులమతాల ఆర్థిక, తాత్వక పునాదుల్నీ, క్రోనీ క్యాపిటలిజం వంటి సమకాలీన సామాజిక సమస్యలకున్న ఆర్థిక మూలాల్ని శాస్త్రీయంగా చర్చించిందీ రచన. 

సమాజ పరిణామాన్ని అధ్యయనం చేసేందుకు మనిషి నిర్మించుకున్న తాత్విక ఆలోచనలను, సత్యాన్వేషణ కోసం జరుగుతున్న నిరంతర కృషిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు రచయిత ప్రొ.కె.ఎస్‌. చలం.


    ప్రొఫెసర& కె.ఎస్‌.చలం విస్తృత అధ్యయనంతో పాటు అరుదైన పరిశోధనాత్మక దృష్టికల మేధావి. అంధ్రా యూనివర్సిటీ నుంచి బిఇడి, పొలండ్‌లో పిహెచ్‌.డీ చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయం   వైస్‌ వైస్‌ చాన్స్ లర్ గా, మధ్యప్రదేశ ప్రభుత్వ ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ఆంధ్రా యనివర్సిటీ లోని యూజీసీ అకడమిక్‌ స్టాఫణ కాలేజీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా అనేక హూదాల్లో పనిచేశారు. ఇంగ్లీషులో 22 పుస్తకాలు, తెలుగులో 6 పుస్తకాలు రచించారు. ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలో 8 వ్యాసాలతో పాటు 90 పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ప్రముఖ తెలుగు పత్రికల్లో 200 లకు పైగా వ్యాసాలు రాశారు.ఇండియాలో సామాజిక పరిణామం
- కె.ఎస్‌.చలం

148 పేజీలు, ధర రూ 100/-

పతులకు, వివరాలకు:   
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849 

Wednesday, January 28, 2015

'మరల సేద్యానికి ' శివరామ కారంత్‌ నవల, తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర


'మరల సేద్యానికి'
శివరామ కారంత్‌ నవల
ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగావుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, అర్థిక స్వాలంబన సాధించడం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'దండగ'నే  అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్లీ సేద్యానికి' తరలమని చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికత.

...............................................................- వకుళాభరణం రామకృష్ణ

మనదేశపు పల్లె జీవనానిర ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు నిలువెత్యు నిదర్శనం ఈ కథ, ఇంత గొప్ప పుస్తకం తెలుగోకి రావడం అద్భుతమైన విషయం.

................................................................- సి.రమాదేవి, రచయిత్రి

మూల భాష నుంచి నేరుగా లక్ష్య భాషలోకి అనువదించిన రచనలకు విశ్వసనీయత ఎక్కువ. అసలు రచనలోని సొగసు, కథనంలోని ప్రత్యేకతలను పెద్దగా మార్పులేమీ లేకుండానే పాఠకులు గ్రహించే అవకాశం ఉంటుంది. 'మరల సేద్యానికి' కూడా మూల భాష నుంచి నేరుగా అనువదించిన రచనే. సూక్ష్మ అంశాలను కూడా విస్మరించకుండా సవివరంగా రికార్డు చేసినట్టు రాసిన ఈ నవలలో ప్రకృతి వర్ణనలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. సముద్ర హోరు నవల పొడవునా కథనానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంటుంది'. తిరుమల రామచంద్ర అనువాద నైపుణ్యం, నిఘంటువుల్లో కూడా దొరకని కన్నడ మాండలిక పదాలను అనువదించేందుకు ఆయన తీసుకున్న శ్రద్ధ, శ్రమ ఈ నవల ఉన్నతంగా రూపొందటానికి కారణం.

...................................................-సిహెచ్‌. వేణు, జర్నలిస్ట్‌, ఈనాడు
వందేళ్ల కాలంలో ఒక కుటుంబంలో జరిగిన మూడు తరాల జీవన యానాన్ని అద్భుతంగా చిత్రితమైన కథ ఇది. ఈ నవల అవసరం ఇప్పుడు చాలా వుంది. కళ్ల  ముందే కరిగిపోయిన సహజ జీవన శైలిని ఇప్పుడు తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించలేకపోయినా, అది కరిగిపోయిన క్రమం ఎలాటిదో ఈ నవల్లో తెల్సుకోవచ్చు. ఒక ప్రశాంతమైన నవల. తప్పక చదవాల్సిన నవల.
....................................................................... - సుజాత, ఆస్టిన్ 'మరల సేద్యానికి'
శివరామ కారంత్‌ నవల,

తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర
336 పేజీలు, ధర రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

Email: hyderabadbooktrust@gmail.com 'Kosambi broke with the past, pioneered a new methodology'

డి డి కోసంబి ఇంగ్లీష్ లో రాసిన సుప్రసిధ్ధ పుస్తకం 'An Introduction to the Study of Indian History' తెలుగు అనువాదం " భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం " ఆవిష్కరణ  సభ పై నిన్న 'ది హిందూ' లో
వచ్చిన వార్త :


Courtesy: The Hindu 27-1-2015
 

DD Kosambi's 'An Introduction to the Study of Indian History' Translated into Telugu

డి డి కోసంబి ఇంగ్లీష్ లో రాసిన సుప్రసిధ్ధ పుస్తకం 'An Introduction to the Study of Indian History' తెలుగు అనువాదం " భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం " ఆవిష్కరణ  సభ పై నిన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్స్ లొ
వచ్చిన వార్త :

  Courtesy : The New Indian Express 27-1-2015

భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -
- దామోదర్‌ ధర్మానంద్‌ కోసంబి
తెలుగు అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌
488 పేజీలు, ధర: రూ. 250/-


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849Monday, January 26, 2015

డి డి కోసంబి పుస్తకావిష్కరణ సభ ఈ రోజు సాయంత్రమే !

డి డి కోసంబి పుస్తకావిష్కరణ సభ ఈ రోజు సాయంత్రమే !
డి డి కోసంబి ఈ పుస్తకానికి రాసుకున్న ముందుమాట
ఈ రోజు (26-1-2015)  నమస్తే తెలంగాణ లో చదవండి: 

http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=274525&boxid=190432496

Wednesday, January 21, 2015

మనం తలతిప్పుకునే జీవితాల కథ _ భాను ప్రకాష్ కె.

మనం తలతిప్పుకునే జీవితాల కథ    


అనగనగా…. త్రేతాయుగం. అందరూ శోకసంద్రంలో ఉన్నారు, ఎందుకంటే రాముడు కైక కోరిక మీద అరణ్యవాసానికి వెళ్తున్నాడు. తనతో పాటు అయోధ్య ప్రజలంతా ఆయన వెంట అరణ్యానికి బయలుదేరారు. ఇంతమంది తనతో ఉంటే అరణ్యంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కరుణామయుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని తిరిగి అయోధ్యకి వెళ్ళవలిసిందిగా చెప్పి తనపై వారికి ఉన్న ప్రేమకు కృతజ్ఞత చెప్పాడు. అందరూ తిరిగి అయోధ్యకు బయలుదేరారు. కాని కొంతమంది మాత్రం అక్కడ నుంచి కదలలేదు.
అది చూసిన రాముడు మీరెందుకు వెళ్ళలేదని అడిగాడు.
మీరు ఆడవారిని మగవాళ్ళని వెళ్ళమన్నారు. మేము ఈ రెండింటికి చెందిన వారం కాదు, అందుకే మీ వెంటే ఉండి పోయాము అని చెప్పారు. రాముడు వాళ్ళ సత్యనిరతికి సంతోషించి వాళ్ళ మాట ఎపుడూ సత్యమయ్యేలా దీవించి వరమిచ్చాడు. వాళ్ళే ఇప్పుడు మనమంతా కనీసం మనుషులుగా నైనా చూడడానికి ఇష్టపడని హిజ్రాలు.

OkaHijraAtmakatha600ఈసారి అనగనగా ద్వాపరయుగం. కురుపాండవులిరువురూ కురుక్షేత్ర యుధ్ధ సన్నాహాల్లో ఉన్నారు. పాండవులు యుద్ధానికి ముందు యుద్ధంలో గెలుపు కోసం నరబలి ఇవ్వాలి. ఆ బలి కాబోయేవాడు సకల శాస్త్రాల్లో ఆరితేరినవాడు ఉత్తమజాతి పురుషుడై ఉండాలి. ఆ కాలంలో అలాంటివాళ్ళు ముగ్గురే ముగ్గురు. ఒకరు సాక్షాత్ శ్రీ కృష్ణపరమాత్ముడు, ఇంకొకరు అర్జునుడు, మరొకరు అర్జునునికి నాగకన్యకి పుట్టిన అరవానుడు.

నరనారాయణులిద్దరు కురుక్షేత్రంలో చేయవలసింది చాలా ఉంది కాబట్టి వాళ్ళు అరవానుని బలికి సిద్ధం చేస్తారు. ఐతే బలి కాబోయే ముందు తనకి ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని ఒక్కసారైనా సంసార సుఖం అనుభవించాలని ఉంటుంది. కాని ఆ రాజ్యంలో ఒక్కరు కూడ ముందుకురారు. అది చూసిన శ్రీ కృష్ణుడు ఒక స్త్రీగా మారి ఆతడిని పెళ్ళి చేసుకుంటాడు. అర్వాన్ ని బలి ఇచ్చిన తర్వాత విధవగా మారతాడు. అప్పట్నుంచి ఈ ఒక ఉత్సవం జరుగుతుంది దానినే అర్వాణి ఉత్సవం అంటారు. ఆ ఉత్సవం చేసుకునే వాళ్ళు అర్వాణులు. వారికి మరో పేరే హిజ్రాలు. ఈ హిజ్రాలందరు శ్రీ కృష్ణున్ని తమ పూర్వీకుడిగా అర్వాణ్ ని తమ భర్త గా పూజిస్తారు.

పైన చెప్పిన రెండు కథలూ రేవతి (దొరైస్వామి) తన ఆత్మకథలో చెప్పిన సంగతులు. నిజానికి దొరైస్వామి అని పిలిస్తే తనకి నచ్చదు. ఎందుకంటే ఆమె మగవాడి శరీరంలో బంధింపబడిన స్త్రీ. ఆ లక్షణాల వల్లనే తన కుటుంబానికి దూరం అయ్యింది. సమాజంలో అతి హీనంగా చీత్కారానికి గురైంది. మనసు స్త్రీది అయ్యి మనిషి మగవాడైతే ఎంత నరకమో అది ఎన్ని దారుణమైన పరిస్థితులకి దారి తీస్తుందో “నిజం చెప్తున్నా – ఒక హిజ్రా ఆత్మ కథ”లో మనకి అర్థమవుతుంది.

ఈ పుస్తకంలో కొన్ని విషయాలు మనకి కంట తడి పెట్టిస్తాయి. రేవతిలాంటి బతుకు పగవాడికి కూడా రాకూడదనిపిస్తుంది. కాదు కాదు, పగదానికి కూడ రాకూడదనిపిస్తుంది. లింగ వివక్ష ఒక్క స్త్రీలకే అనుకుంటే వీళ్ళ స్థితి ఇంకా దారుణం. వీళ్ళపై పోలీసులు రౌడీలు చేసే దౌర్జన్యం అమానుషం.

దొరై స్వామి తమిళనాడులోని ఒకానొక పల్లెటూరులో పుట్టిన అభాగ్యుడు. తను ఒక స్త్రీగానే పుట్టాడు ఒక స్త్రీగానే పెరిగాడు. కాని అదంతా తన కోణంలోనే. సమజానికి, కుటుంబానికి తను అబ్బాయిలా వుండి అమ్మాయి వేషాలు వేసే ఆడంగి వెధవ. జీవితం ఒకటే కాని చూసే కోణాలే వేరు. ఎంత దారుణమైనది ఈ సమాజం! అంతా తను చెపినట్టే జరగాలి అనుకుంటుంది. వినలేదంటే పగ తీర్చుకుంటుంది. అలాగే రేవతి పైనా తీర్చుకుంది.

తనకి ఇష్టమొచ్చినట్టుగా బతకడానికి వీలు లేదని రేవతిని వెలివేసింది. కుటుంబం లోనె అన్నల చేతిలో దారుణమైన అవమానాలు, చచ్చేలా దెబ్బలు తింది. ఇంక ఆక్కడ ఉండలేక తన లాంటి వాళ్ళ సహాయంతో పారిపోతుంది. అక్కడ హిజ్రా సమాజాన్ని వాళ్ళ కట్టుబాట్లని మనకి కళ్ళకి కట్టినట్లు చెబ్తుంది రేవతి.

అన్నట్టు తనకి రేవతి అని పేరు కూడా తను సినిమా హీరోయిన్ రేవతిలా ఉంటుందని తన గురువైన ఒక హిజ్రా నామకరణం చేసింది. అత్యంత సాహసంతో కూడిన రేవతి ప్రయాణం మనకి ఒళ్ళు గగుర్పొడిచే విషయాలని చెబ్తుంది. అంతేకాదు హిజ్రా సమాజంలో ఆచారాలు ఎలా ఉంటాయి, వాళ్ళు తమ గురువులని యెంత గౌరవిస్తారు, అలాగే వాళ్ళని వీళ్ళు ఎలా పోషిస్తారు, వీళ్ళు పూర్తిగా ఆడవాల్లుగా మారడానికి చేసుకునే ఆపరేషన్, దాని కోసం పడే అవస్థలూ… అబ్బో కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

ఈ సమాజం వీళ్ళకి సెక్స్ వర్క్ లేదా అడుక్కోవడం ఈ రెండుదార్లే చూపించింది. వేరే దారి లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎవరు పని ఇవ్వరు, సరి కదా కనీసం సాటి మనుషులుగా నైనా చూడరు. అందుకే వీళ్ళు మనకి ట్రైన్లలో షాపుల్లో అడుక్కుంటూ కనిపిస్తారు. ఇంకా రేవతి జీవితంలో ఐతే అడుగడునా విషాదమే కాని కొన్ని తను ఎలా కొనితెచ్చుకుందో మనకి తనే నిర్భయంగా చెప్పుకుంటూ పోతుంది. తను కేవలం తన లైంగిక అవసరాలు తీర్చుకోవడానికి సెక్స్ వర్క్ మొదలు పెడుతుంది. కాని చివరకి అదే తన వృత్తి ఐపోతుంది. రేవతికి మొదటి నుంచి తమ జీవితాలు ఎందుకు ఇంత హీనంగా ఉన్నై అన్న బాధ “సంగమ” అనే స్వచ్ఛంద సంస్థలో పని చేసెలా చేసింది. కాని తను అందులో పని చేస్తున్నప్పుడే తన గురువు, ఇంకా స్నేహితుల హత్యలని చూస్తుంది. హిజ్రాలు కాబట్టి ఆ కేసుల్ని కూడ ఎవరూ పట్టించుకోరు. వీళ్ళని రోడ్లపైన రౌడీలు వెంటపడి కొడుతున్నా సాటి మనుషులు ఎవరూ అడ్డుకోకపోవడాన్ని దీనంగా మనతో చెప్పుకుంటుంది.

బస్సుల్లో ట్రైన్లలో వారి పై జరిగే అత్యాచారాన్ని ఎంత మౌనంగా అనుభవించారో చెప్పుకుంటుంది. ఇంక ఒక పోలీసు ఒక రోజు రాత్రి పోలిస్టేషన్లో తనతో ఎంత హేయంగా ప్రవర్తించాడో చాలా నిజాయితీగా చెప్తుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత ఖచ్చితంగా మనకి హిజ్రాల మీద ఉన్న చిన్న చూపు పోతుంది. వాల్లు కూడా సాటి మనుషులుగా కనిపిస్తారు. అంతే కాదు, ఈ పుస్తకంలో ఎవరు తనపైన అమానుషంగా ప్రవర్తించినా వాళ్ళని ‘మీ ఇంట్లో కూడ నాలాంటి వాడు ఉంటే అప్పుడు తెలుస్తుంది నా బాధ’ అని అంటుంది. తను తెలిసి అన్నా తెలియక అన్నా ఈ సమాజంలో వాళ్ళకి సమానహక్కులు రావాలంటే ఖచ్చితంగా ప్రతీ ఇంట్లో ఆడ మగతో పాటు ఒక హిజ్రా కూడ అంతే సహజంగా పుట్టాలి అప్పుడే అర్థమవుతుంది అనిపిస్తుంది. “సంగమ”లో ఒక మంచి కార్యకర్తగా ఉంటూ తమవారి బాగుకోసం తను చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం.

అలాగే ఇంత నిజాయితీగా తనకోసం తన సమాజం కోసం తను చెప్పడం చాలా చాలా బాగుంది. పుస్తకం మూయగానే ఒక ఆర్ధ్రత మనసులో నింపిపోయే పుస్తకం ఇది. మిస్ కాకండి.

- భాను ప్రకాష్ కె.   

("కినిగె పత్రిక" జనవరి 2015 సౌజన్యం తో)

http://patrika.kinige.com/?p=4741


Monday, January 19, 2015

Prof. Uma Chakravarthi will reflect on Interrogating Kosambi

 Prof. Uma Chakravarthi  will reflect on
Interrogating Kosambi

On the occasion of the book release of Bharatacharita adhyayaniki oka parichayam  (Telugu translation to the Introduction to the study of Indian history) By DD Kosambi

On Tuesday, January 27, 2015 at Department of History, University of Hyderabad at 2.00 pm.

Prof Suvira Jaiswal will chair and Prof. Vakulabharanam Ramakrishna will respond
 

Sunday, January 18, 2015

" భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం " డి. డి. కోసంబి పుస్తకావిష్కరణ సభ

" భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం " డి. డి. కోసంబి 
పుస్తకావిష్కరణ సభ
26 జనవరి 2015 సోమవారం సాయంత్రం  6 గంటలకు 
దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 
బాగ్ లింగం పల్లి , హైదరాబాద్ 

అందరూ ఆహ్వానితులే

27 జనవరి 2015 న మధ్యాహ్నం 2 గంటలకు ఇదే పుస్తకం పై
యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - డిపార్ట్ మెంట్ ఆఫ్ హిస్టరీ లో చర్చా కార్యక్రం ఉంటుంది.
పాల్గొనువారు:
ప్రొ. ఉమా చక్రవర్తి, ప్రొ.సువిర జైస్వాల్, ప్రొ. వకులాభరణం రామక్రిష్ణ. 


హిజ్రా సమూహ జీవిత సంగ్రహం - రమా సుందరి

హిజ్రా సమూహ జీవిత సంగ్రహం. ‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం

   

తల్లికి కాన్పు అవ్వగానే అమ్మాయా, అబ్బాయా అని అడుగుతుంటారు. కానీ ఈ భూమి మీద ఒకటిన్నర కోటికి పైగా ఆడా మగా కానీ వారు ఉన్నారని చాలా మందికి తెలియదు. ఎక్స్, వై క్రోమోజోములు కలిస్తే అబ్బాయిలు పుడతారనీ ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయిలు పుడతారనీ తెలుసు కానీ ఈ క్రోమోజోములు ఇతర నిష్పత్తిలో కలిస్తే రకరకాల శారీరక, మానసిక పరిస్థితులు ఏర్పడతాయని తెలియదు. 
అలా పుట్టిన వాళ్ళు సాంప్రదాయ నిర్దేశిక, సామాజిక ఆమోదమైన ఆడా మగా నమూనాల్లో ఇమడలేక ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ తమ శరీరాలతోనూ, మనస్సులతోనూ.. ఇటు కుటుంబాలతోనూ అటు సమాజంతోనూ నిత్య యుద్ధాలతో మునిగి తేలుతుంటారనీ తెలియదు. 
 
మన చుట్టూ వున్న ప్రపంచంలో కొంతమంది మగవాళ్ళు ‘ఆడ పనులు’ అని చెప్పబడుతున్ప పనులు చేస్తూ అందరి హేళనలకు గురి అవుతుంటారు. కొంతమంది పెళ్ళి వయసుకు ముందో, పెళ్ళి కుదరంగానో ఇళ్ళ నుండి అదృశ్యమవుతారు. ఇంకొంత మంది పెళ్ళికి ముందే ఆత్మహత్యలు చేసుకొంటారు. బస్సుల్లో, రైళ్ళలో చప్పట్లు కొట్టుకొంటూ మగ పాసింజర్లను కొద్దిగా బెదిరిస్తూ అడుక్కునే గుంపులు కొన్ని కనిపిస్తాయి. ఊరి చివర డొంకల్లో, ముళ్ళ పొదల్లో ‘అసాంఘీక కార్యకలాపాలలో’ బలై పోయి సానుభూతికి కూడా నోచుకొని పేద హిజ్రాల శవాలు దినపత్రికల్లో కనిపిస్తుంటాయి. 
సమాజానికి యింత వల్నరబుల్ గా ఉన్న ఈ సమూహాల గురించిన భయం, సంశయం, నిర్లక్ష్యం వదిలి ఎప్పుడైనా ఆలోచించామా?
ఈ భయానక హింసాయుత జీవితం వారు కోరుకొన్నది కాదు. కొన్ని పెట్టుబడిదారీ సాంస్కృతిక ప్రచార సాధనాలు, సాహిత్యం, సినిమాలు ప్రచారం చేస్తున్నట్లు ఆ పరిస్థితి కేవలం భావోద్వేగాలకు సంబంధించింది కూడా కాదు. భావోద్వేగాలు ఆకాశం నుండి ఊడిపడవు, వాటికి భౌతిక పునాది ఉంటుంది అనే కోణం నుండి జరిగిన పరిశోధనలు ఈ స్థితికి అనేక హార్మోన్లు, క్రోమోజోన్లు కారణాలుగా తేల్చాయి. కొందరికి ఈ స్థితి వారి అవయవ నిర్మాణంలో కనబడితే మరికొందరికి కేవలం మానసిక ప్రవృత్తిలో కనబడుతుంది.

‘నిజం చెప్తున్నా. ఒక హిజ్రా ఆత్మ కధ.’ పుస్తకం మగపిల్లవాడిగా పుట్టి అంతర్గతంగా స్త్రీ లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి ఆత్మ కధ. ఇది ‘వ్యక్తి ఆత్మ కధ’ అనటం కంటే ఆ సమూహం బయట ప్రపంచానికి సమర్పించుకొన్న సంవేదన అనవచ్చు. ఎందుకంటే రేవతిగా మారిన దొరై స్వామి( అలా అనటం రేవతికి ఇష్టం ఉండదు, రేవతీ అని పిలవటమే ఇష్టం) జీవితం అలా బతుకుతున్నఒకటిన్నర కోట్ల వ్యక్తుల జీవిత సంగ్రహం. అవయవ మార్పిడి చేసుకొని హిజ్రాలుగా పిలువబడుతున్నవారు మానసికంగా పడిన సంఘర్షణల స్థాయిలను, సమాజంతో చేసిన యుద్ధాలను సాధారణీకరించి, సంగ్రహిస్తే దాని సారమే రేవతి రాసిన ఈ పుస్తకం.

మన చుట్టూ వున్న సమాజం స్త్రీలకు, దళితులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు – మొత్తంగా మెజారిటీ జనసందోహానికి బాగోలేదని తెలుసు. 
కానీ ‘ఆడంగులుగా’ పిలువబడుతూ ఇతరుల ఏహ్యానికి, చీదరింపుకు, భయానికి, వెలివేతకు గురవుతున్న హిజ్రాల పట్ల ఎంత క్రూరంగా వ్యవహరించగలదో ఈ పుస్తకం మనకు అర్ధం చేయిస్తుంది.

కుటుంబం కూడా సమాజంలో ఒక భాగం కాబట్టి ఆ క్రూరత్వపు సెగలు కుటుంబం నుండి కూడా తగులుతుంటాయి. వర్గ సమాజంలో ఆర్ధిక స్థితిగతులు మనిషి బతుకును శాసిస్తాయి. కానీ హిజ్రాలు కుటుంబంతో గడపలేని పరిస్థితుల వలన ఎంతో కొంత ఆర్ధిక వనరులు ఉన్న కుటుంబం నుండి వచ్చినా ఆమె లేక అతను ఆ వనరులను పొందలేరు. కుటుంబంలో వారి సహజ ఉనికికి సాధారణంగా ఒప్పుదల ఉండదు కాబట్టి సమాజంలోకి వారు విసిరివేయబడతారు. 
వారి భౌతిక రూపం, ఆర్ధిక వెనుకబాటుతనం వారిని స్వతంత్రంగా ఉండనివ్వవు. తమకంటూ వాళ్ళు ఏర్పాటు చేసుకొన్న సమాజాల్లో మాత్రమే వాళ్ళు బతకగలరు. అక్కడే వారి ఉనికికి స్వాంతన, ఒప్పుదల ఉంటాయి. అయితే అంతటా విస్తరించిన అవలక్షణాలు వాళ్ళ సమాజాలను కూడా తాకి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. బతుకు పోరులో అలసి పోతూ కేవలం బతకటం కోసమే కుటుంబం నుండి సమాజానికి, సమాజం నుండి కుటుంబానికి పరుగులు పెడుతుంటారు.
అలాంటి పరుగులనే రేవతి నిరలంకారంగా, ఉన్నది ఉన్నట్లుగా ఈ పుస్తకంలో వర్ణించింది. ఆమె సంతోషాలను, ఘర్షణలను, దుఃఖాలను, బలహీనతలను నిజాయితీగా చెప్పింది. ఈమె ఈ పుస్తకంలో స్రవించిన జీవిత ప్రవాహానికి, అక్కడక్కడ ఆమె వ్యాఖ్యానాలు, ఆపుకోలేక కొన్ని చోట్ల ఆమె చేసిన ఉద్వేగ ప్రకటనలు ఏమాత్రం ఆటంకాలు కాలేదు. ఈ జీవితకధ సౌందర్యవంతంగా ఉండదు. ఈ కధ సుఖాంతం అయ్యే ఛాన్స్ లేదు. ఈ జీవితంలో ఉండే భిన్నత్వం .. ఈ బతుకు చూపించే కొత్త కోణం మనకు కలిగించే ఎరుక మాత్రం తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది. 

మగవాడిగా పుట్టి స్త్రీ మానసిక ప్రవృత్తి కలిగి ఉండటం చిన్నతనాన కలిగించే గందరగోళం అర్ధం కావాలంటే ఆమె హృదయాన్ని అక్షరాలలో చూడాల్సిందే. తనకు చిన్నప్పటి నుండి ఎందుకు ఆడ దుస్తులు ధరించాలని అనిపిస్తుంది? ఎందుకు ఆడవాళ్ళకు మగవాళ్ళపై కలిగే సహజ ఆకర్షణ తనకు కలుగుతుంది? మగ శరీరంలో ఇరుక్కు పోయిన స్త్రీగా ఎందుకు అనిపిస్తుంది? ఈ అయోమయపు ప్రశ్నలకు సమాధానాలు దొరక్క తనలో జరుగుతున్న అలజడిని రేవతి బాగా రాయగలిగింది. ఆమెలో పురుషుల పట్ల చెలరేగుతున్న లైంగిక వాంఛల గురించి కూడా నిజాయితీగా చెప్పగలిగింది.

ప్రధాన స్రవంతి జీవితం అంచులకు నెట్టబడిన హిజ్రాలు తమకు తామే కొన్ని సంస్కృతీ, సాంప్రదాయాలు, వావి వరుసలు ఏర్పరుచుకొంటారు. ఎక్కడా ఆమోదం దొరకక తమలో తామే తిట్టుకొంటూ, కొట్టుకొంటూ ఒక ‘కాకి గుంపు లాగా’ ఎప్పుడూ అతుక్కొనే బతుకుతారు. ఎవరూ పనులు ఇవ్వరు. సెక్స్ వర్క్ (వ్యభిచారం) చేయటం, అడుక్కోవటం తప్ప వేరే గతి ఉండదు. ఈ హిజ్రాల లోకంలో ఉన్న హింస భయంకరమైనది. నిరంతరం పోలీసుల, రౌడీల – బెదిరింపులతో, దాడులతో భయం క్రీనీడలో బతుకు వెల్లమారుస్తుంటారు. రేవతి తన ఒక రాత్రి పోలీసు స్టేషన్ లో గడిపిన అనుభవాన్నిఒళ్ళు గగుర్పొడిచేలా వర్ణించింది. చదువుతుంటేనే భీతి కలిగే క్రూర పరిస్థితులలో వారు నిత్యం సహవాసం చేస్తుంటారు.

ఈ దేశంలో పేదగా పుట్టినా, అణగారిన కులాల్లో పుట్టినా, మైనారిటీ మతాల్లో పుట్టినా, అంగవైకల్యంతో పుట్టినా పేరుకి వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ హిజ్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. రేవతి తన జీవితాన్నే ప్రదర్శనగా చూపిస్తూ చట్టాలనూ యితర రాజ్యాంగ యంత్రాలను చాలా ప్రశ్నలు వేసింది. ఆడపిల్లగా కుటుంబంలో కొంత స్థానం ఉంటుంది. మగపిల్లవాడికైతే హక్కులు ఉంటాయి. హిజ్రాలు ఇటు కుటుంబంలోనూ, అటు న్యాయస్థానాలలోనూ తిరస్కృతులు అవుతుంటారు. చివరకు రేషన్ కార్డ్ కోసం, డ్రైవింగ్ లైసెన్స్ కోసం కూడా ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. రేవతి సెక్స్ వర్క్ చేసి పంపించిన డబ్బుతో ఇళ్ళు బాగు చేయించుకొని ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటానికి కుటుంబం అంగీకరించదు. అప్పటి దాక వేసిన ప్రతి అడుగు ఆమెకు యుద్ధం అయినా, రేవతి ఈ తిరస్కారాన్ని మాత్రం భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. 

ప్రేమ, పెళ్ళి విషయంలో ఆమె పొందిన వైఫల్యాన్ని, దాని తాలూకూ దుఃఖాన్ని ఆమె నుండి పుస్తకంలోకి, పుస్తకం నుండి పాఠకులకూ సమర్ధవంతగా బదిలీ చేయగలిగింది. హిజ్రాలకు ప్రేమోద్వేగాలు ఉంటాయా అంటే ఉంటాయి. కానీ అవి మన సినిమాల్లో, సాహిత్యంలో కనబడినంత ఎగతాళిగా, వెకిలిగా ఉండవు. అందరి యువతులకు కలిగినంత సహజంగా మనసుకి నచ్చిన పురుషుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. అయితే అది సఫలం అయ్యే పాళ్ళు మాత్రం చాలా తక్కువ. ‘సాధారణేతర లైంగిక స్వభావం’ కలవారిని పెళ్ళి చేసుకొంటానని ఉపన్యాసాలలో చెప్పి చేసుకొన్న వ్యక్తి కూడా చివరకు ఆమెను వదిలించుకొని వెళ్ళిపోతాడు. 

ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనసుని తాకుతాయి. స్త్రీ తరహా మానసిక ప్రవృత్తి తో ఉన్న వాళ్ళు పురుషుల పట్ల ఆకర్షితులవడం సహజమే కానీ, స్త్రీత్వం అని ఆపాదించినదంతా స్త్రీకి సొంతమైనది కాదు. ఉదాహరణకు రేవతి భార్యగా తన భర్తకు పరిచర్యలు చేయాలనీ, అతన్ని సంతోష పెట్టాలనీ అనుకొంటుంది. అతను ఇంటి పని ఏమీ చేయకపోయినా పట్టించుకోదు. అదే స్త్రీత్వం అనే భావన కూడా ఆమెకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి ఇంటి చాకిరీ, పురుషుడి పట్ల సేవాభావము స్త్రీల మెదళ్ళలో భూస్వామ్య భావజాలం అనాదిగా అంటగట్టబడినవి. అదే స్త్రీత్వమనే తప్పుడు భావన హిజ్రాలకు కూడా బదిలీ అయినట్లు కనబడుతుంది. అలాగే స్త్రీలగా కనబడాలనే తాపత్రయంతో ఎక్కువ అలంకరణలు చేసుకోవటం, శరీరాన్ని ప్రదర్శించటం కూడా జరుగుతుంది. ఇవి పెట్టుబాడీదారి సమాజం స్త్రీలపై రుద్దిన అనారోగ్యధోరణులు. స్త్రీలు మోస్తున్న ఈ భావ దరిద్రాలన్నీ హిజ్రాలు కూడా మోస్తున్నారు. 

రేవతి ఈ పుస్తకం ద్వారా ఒక మంచి రచయిత్రిగా రుజువు చేసుకొన్నది. సామాజిక కార్యకర్తగా పుస్తక రచయిత్రిగా ఎదిగిన ఈమె ఈ పుస్తకం పూర్తి అయ్యేనాటికి మళ్ళీ సెక్స్ వర్క్ చేయాల్సిన పరిస్థితికి నెట్టబడటం ఒక కఠిన వాస్తవం. ఈ గడ్డ మీది ప్రతి మానవ పుటకా హుందాయైన బ్రతుకు తెరువు, గౌరవనీయమైన జీవనం అభయంగా పొందాలి. అలా పొందలేనపుడు వందల సమూహాల అస్థిత్వాలు వాటి ఉనికి కోసం ఆక్రోశిస్తాయి. ఆ సమూహాల్లో ఒక సమూహం ఈ హిజ్రా సమూహం. ఈ పుస్తకం చదివి ఆ సమూహాల పట్ల, వాళ్ళు చేస్తున్న పోరాటాల పట్ల ఒక సానుకూల వైఖరి ఏర్పరుచుకోగలిగితే రేవతి కృషి ఫలించినట్లే .

- రమా సుందరి

(కధలు డాట్ వర్ద్ ప్రెస్ డాట్ కాం సౌజన్యంతో) 

https://kadhalu.wordpress.com/2015/01/09/%E0%B0%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%82%E0%B0%B9%E0%B0%AA%E0%B1%81-%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B8/ 

 

 

Monday, January 12, 2015

భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం - డి.డి.కోసంబిభారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -

- దామోదర్‌ ధర్మానంద్‌ కోసంబి


ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోనూ మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి. ... ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన. ... ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది.
- ఎ.ఎల్‌.బాషామ్‌

చరిత్ర అధ్యయనంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు కోసంబి. ఆధునిక గణితశాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ, నాణాల బరువును బట్టి అవి ఎంతకాలంగా చలామణిలో ఉన్నాయో నిర్ధారించడమే కాదు - ఆయా కాలాలకు సంబంధించిన వివరాలను రాబట్టే దారి చూపారు.
- జె.డి.చెర్నాల్‌

కోసంబి అనుసరించిన విశ్లేషణా పద్ధతుల్లో చాలా భాగం - యాభై ఏళ్ల తర్వాత, ఇప్పటికీ అంతే ప్రభావవంతంగా, అంతే ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మిగిలిన ఆ కొద్ది భాగం విషయంలో కూడా పునరాలోచన అవసరమవుతోందంటే అది - కొత్త ఆధారాలు వెలుగులోకి రావడం వల్లనో, సరికొత్త వివరణా సిద్దాంతాల వల్లనో, లేక గతాన్ని గురించిన మన దృక్పథాల్లో మార్పు రావడం వల్లనో తప్పించి మరేమీ కాదు.  కోసంబి రచనలను మళ్లీ మళ్లీ చదవడం అవసరం. చదివిన ప్రతిసారీ సంభ్రమానికి గురిచేస్తూ మనల్ని మరింత చారిత్రకంగా ఆలోచించేలా ప్రేరేపించడం వాటి విశిష్టత.
- రొమిలా థాపర్‌

ఆనాటికి అందుబాటులో వున్న ఆధారాలకు లోబడడం అనే పరిమితి చరిత్ర రచనలన్నింటికి లాగానే కోసంబి రచనలకు కూడా వుంది. అయితే అప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ప్రారంభకుడు ఆయనే గనుక ఆయన ప్రతిపాదించిన సమాధానాలను తప్పనిసరిగా పరీక్షించాల్సిందే. ఈ పుస్తకమే అంతిమం అని ఆయన కూడా అనుకోలేదు. కాకపోతే - తన తర్వాత చరిత్ర రచన అనేది విభిన్నంగా ఉండక తప్పని పరిస్థితి కల్పించారాయన
- ఇర్ఫాన్‌ హబీబ్‌
...     ...   ...

మనిషి కేవలం రొట్టెతో మాత్రమే జీవించడనీ, చరిత్రా సమాజమూ రెండూ కూడా శాశ్వతమైన ఆత్మ మీద వ్యక్తి సాధించే నియంత్రణ మీదనే ఆధారపడతాయనీ, భౌతికవాదం మానవ విలువలన్నింటినీ ధ్వంసం చేస్తుందనీ కొందరు నొక్కి చెబుతుంటారు.

దురదృష్టవశాత్తూ రొట్టెనో, అటువంటి మరొక పదార్థమో లేకుండా మనిషి మనుగడ సాగించలేడు.
దేహం లోపల ఆత్మ అనేటటువంటిదాన్ని ఆ వ్యక్తి ఉంచుకోగలగాలన్నా కూడా రొట్టె అవసరమే.

మానవ జీవుల సమూహం ఒక సమాజంగా మారాలంటే, ఆ మనుషులు ఏదో ఒకరకమైన పరస్పర సంబంధాలలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

ఆ అత్యవసరమైన సంబంధం రక్తబంధుత్వం కాదు, దానికన్న విస్తృతమైనది. అది సరుకుల ఉత్పత్తిలో, వాటి పరస్పర వినిమయంలో రూపొందుతుంది.

వస్తువులను సేకరించడం గానీ, ఉత్పత్తి చేయడం గానీ ఎవరు చేస్తారు, ఏ సాధనాలతో చేస్తారు,
ఎవరు ఇతరులు చేసిన ఉత్పత్తిని ఆరగించి బతుకుతారు,ఆ హక్కు వాళ్లకు ఎలా వస్తుంది, దైవికంగానా, చట్టబద్దంగానా (ఎందుకంటే పూజా విధానాలూ చట్టాలూ కూడా సామాజిక ఉప ఉత్పత్తులే)పనిముట్ల మీద, భూమి మీద, కొన్నిసార్లు ఉత్పత్తిదారు శరీరంమీద, ఆత్మమీద కూడా యాజమాన్యం ఎవరిది, మిగులను ఎలా పంచాలో, సరఫరా ఎంత ఉండాలో, ఏ రూపంలో ఉండాలోఎవరు నిర్ణయిస్తారు వంటి ప్రశ్నలలో ఏవి అత్యవసరమని అనుకుంటుందనే దానిమీదనే ఒక ప్రత్యేక సమాజపు స్వభావం నిర్ణయమవుతుంది.

ఉత్పత్తి బంధాలతోనే సమాజం కలసికట్టుగా వుంటుంది. భౌతికవాదం మానవ విలువలను విధ్వంసం చేయదు సరికదా దానికి భిన్నంగా ఆ మానవ విలువలు సమకాలీన సామాజిక పరిస్థితులతో, ప్రబలంగా వున్న విలువ భావనతో ఎలా ముడిబడి వున్నాయో చూపుతుంది.

విలువ భావన లాగానే భాష కూడా భావాల వినిమయానికి దారితీసిన భౌతిక వినిమయ సంబంధాల నుంచే తలెత్తింది. నిజానికి ఆ భాష లేకపోతే భావవాది కనీసం తన ఆత్మ గురించి ఊహించడం కూడా సాధ్యం కాదు.

ఒక తాత్విక దృక్పథం గల వ్యక్తి ఈ ఎడ్ల బళ్ల దేశంలో రెండువేల సంవత్సరాల కింద రూపొందిన 'శాశ్వత' భావజాలాలతో తన మనసుకు నచ్చినట్టుగా ఈ యాంత్రిక ప్రపంచాన్ని తిరిగి తయారుచేయలేడు.

- డి.డి.కోసంబి
(మొదటి కూర్పు ముందుమాట నుంచి)


.....   .....    .....


కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధో ప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృత,గానే వున్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మొత్తంగా కోసంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్‌ 'భారత చరిత్ర - డి డి కోశాంబి పరిచయం' (హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నా ముందే కోసంబి రచనలలో 'భగవద్గీత - చారిత్రక పరిణామం' ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1985) వెలువడింది.

ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు - 'భారత చరిత్ర పరిచయ వ్యాసాలు' (అనువాదం హెచ్‌ఆర్‌కె, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1986), 'ఆచరణలో గతితర్కం' (ఎగ్జాస్పరేటింగ్‌ ఎస్సేస్‌కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1991) వెలువడ్డాయి.

తర్వాత 'ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత' (కల్చర్‌ అండ్‌ సివిలైజేషన్‌ ఇన్‌ ఏన్షియంట్‌ ఇండియా' కు ఆర్‌. వెంకటేశ్వరరావు అనువాదం, తెలుగు అకాడమీ ప్రచురణ, 1998) కూడా తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి  కూడా రావడంతో ఇంగ్లీషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.

నిజానికి ఇతర పుస్తకాలకన్నా, వ్యాసాలకన్నా ''యాన్‌ ఇంట్రడక్షన్‌ టు ది స్టడీ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ'' పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్రమీద స్థూల అవగాహన ఇవ్వడం మత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి వుండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నలు ఫలించక, చివరికి ఇది నా కోసం మిగిలిపోయింది.

- ఎన్‌. వేణుగోపాల్‌
(అనువాదకుడి మాట నుంచి)


...     ...    ...

భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -
- దామోదర్‌ ధర్మానంద్‌ కోసంబిఆంగ్ల మూలం :  An Introduction to the Study of Indian History, D.D.Kosambi
తెలుగు అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌

488 పేజీలు, ధర: రూ. 250/-


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849Saturday, January 10, 2015

దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు : సంపాదకులు : సుశి తారు, కె.లలిత

దారులేసిన అక్షరాలు - ఇరవైయవ శతాబ్దపు  భారతీయ మహిళల రచనలు 
సంపాదకులు : సుశి తారు, కె.లలితభారతీయ స్త్రీల రచనలను తొలిసారిగా ఇంగ్లీష్‌లోకి అనువదించి 1989-91ల లోనే 'అన్వేషి' రెండు భాగాలుగా వెలువరించింది. ఆ సంకలనంలోని రెండో భాగానికి తెచ్చిన తెలుగు అనువాదమే ప్రస్తుత గ్రంథం. సమాజ వికసనంలో తమదైన ముద్ర వేసిన మనదేశపు స్త్రీల భావజాలానికి దర్పణం. పితృస్వామ్య శక్తులతో ఘర్షణ పడుతూనే తమ అస్తిత్వాలను నిరూపించుకున్న ఇరవయ్యవ శతాబ్దికి చెందిన 73 మంది రచయిత్రుల అక్షరాల దారులు మనందరి కోసమే.

- విజయ భారతి

విశ్రాంత డైరెక్టర్‌, తెలుగు అకాడెమీ


ఈనాటి మహిళల సాహిత్య ప్రస్థానం గొప్పగా సాగుతున్నదంటే దానికి పునాది ఎన్నో ఏళ్ల క్రితం వాటికి బీజం వేసిన రచయిత్రులదే. ఈ రోజున మహావృక్షం నీడన కూర్చున్నాం కదా అని మనం విత్తనాన్ని మరవలేం. మహిళల సాహిత్య కృషి భారతీయ సాహిత్యాన్ని ఎంత సుసంపన్నం చేసిందో చెప్పడానికి ''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' అన్న గ్రంథం వచ్చినపుడు అందరూ అవాక్కయ్యారు. మనకు ఎంతో తెలుసుననుకున్న భారతీయ సాహిత్యం గురించి ఎంత తక్కువ తెలుసో చెప్పిన ఆ పుస్తకం ఒక చారిత్రక ఘట్టం. ఇప్పటికే రాస్తున్న స్త్రీలకు మరింత ప్రోత్సాహాన్ని, ఇక పై రాయనున్న వారికి గొప్ప స్ఫూర్తిని అందజేయగల ఈ పుస్తకం అక్షరాలా అక్షర మార్గమే.

- మృణాళిని,
డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఎన్‌సైక్లోపీడియా, తెలుగు యూనివర్సిటీ


''విమెన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా'' రెండు భాగాలూ చరిత్రను సృష్టించాయి. వలసవాద వాసనలతో జాతీయవాద చట్రం నుంచి రాసిన సాహిత్య చరిత్రని విమర్శనాత్మకంగా పరిశీలించాయి. సాహిత్య చరిత్రలో మరుగునపడ్డ పీడితుల గురించి ఆలోచించే గొప్ప సైద్ధాంతిక దృష్టిని అందించాయి. ఈ పుస్తకాలు ఆఫ్రికన్‌ స్త్రీలూ, దళితులూ, ఇంకా అనేక పీడిత సమూహాలు సాహిత్య చరిత్ర రచనకు పూనుకోవడానికి గొప్ప స్ఫూర్తినిచ్చాయి. తెలుగులో వీటి అవసరం చాలా ఉంది.

- కె. సత్యనారాయణ,
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కల్చరల్‌ స్టడీస్‌,
ఇంగ్లీష్‌ & ఫారిన్‌ లాంగ్వేజెస్‌ (EFLU)


దారులేసిన అక్షరాలు - 
ఇరవైయవ శతాబ్దపు భారతీయ మహిళల రచనలు 
సంపాదకులు : సుశి తారు, కె.లలిత
600 పేజీలు, ధర : రూ. 400/-

ప్రతులకు, వివరాలకు: 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

...................................................................................................................................................

ఈ పుస్తకం ముందుమాట నుంచి కొంత భాగం :
...  ... ... 
స్త్రీల సాహిత్యంలో అద్భుతమైన 'మచ్చుతునకలు' వెలికితీయటం సంతోషకరమైన ప్రయత్నం. ఇంకొక స్థాయిలో అది స్త్రీవాద విమర్శ సిద్ధాంతం, ఆచరణలకు సంబంధించిన కష్టతరమైన, ప్రయోగాత్మక చర్య. పేరుపొందిన రచయిత్రుల కృషిని తిరిగి 'చదవటానికి', ప్రపంచానికి అంతగా పరిచయంలేని వాళ్ళను పరిచయం చేయటానికీ, మేం ప్రయత్నించాం. ఇందులో కొన్ని మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేసే విషయాలున్నాయి. తెలుగు సాహిత్యంలో తెలుగు పాఠకులకి కూడా ఆనందాన్ని కలగజేసే విషయాలున్నాయి. సాంప్రదాయక అంచనాల్తో చూస్తే ఇక్కడ ఉన్న రచనలు చాలా వరకు ప్రఖ్యాత గ్రంథాల నుంచే. అందులో కొన్ని కాలం పెట్టిన పరీక్షలకు- అవి ఎంత కఠినమైనాసరే- తట్టుకొని నిలబడినవి. ... ...

ఇంతకు ముందు రూపొందించిన ఎన్నో రకాల సిద్ధాంత భావనల్ని ప్రశ్నించే అవసరం ఈ సంకలనానికి ఉంది. ఇంతకు ముందు రచనా ప్రపంచంలో ఏరి వేయబడిన; 'కొనసాగలేని' ఎన్నో రకాల అంశాలను నిర్లక్ష్యం చేయకుండా వాటికి స్పష్టతనిచ్చి, ప్రాముఖ్యత కలిగిస్తామని మా ఆశ. సాహిత్య గ్రంథాన్ని, దాని సాంఘిక సందర్భాలను విడదీసి గత నూటయాభై సంవత్సరాలుగా సాహిత్య సౌందర్య శాస్త్రం మీద పెట్టిన భారాన్ని వదిలించుకోవాలని, తిరుగుబాటు ధోరణుల రూపాలు వైరుధ్యాలను ఎత్తిచూపే విధిని నిర్వర్తించాలని మా కోరిక. అటువంటి ఆచరణ చేసే వాగ్దానం ఒక సాహిత్యానికే పరిమితం కాదు. అకాడెమీలో కూడా - గాయిత్రీ స్పీవాక్‌ అన్నట్టు, ''చరిత్ర, రాజకీయార్ధ శాస్త్రం - ప్రపంచంతోటి కలిపి సాహిత్య రూపాల్ని చూడాలి''.68 పాతకాలం విశ్వజనీనత మాసిపోయి, ఆకర్షణావిహితంగా కన్పించటం ప్రారంభమైతేనే నూతన ప్రపంచపు సౌందర్యం కంటికి తోచే అవకాశం ఉంది. ఆ సాహిత్యాలలోని ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే భావ ప్రకటనలూ, వాటి అనుభూతులూ, రుచులూ - జీవం లేనివిగా, ఉత్త సెంటిమెంట్లుగా కన్పించడం మొదలవుతుంది.

... ... రాజకీయ ఆర్థిక విధానాల మధ్య సంబంధాల్ని శోధించటం మా ఉద్దేశం. మా నమ్మకంలో ఈ సంబంధాలే స్త్రీల రచనల్లో అంశాలకు వెలుగు పడతాయి. మొదటి సంకలనంలో సంస్కరణ, జాతీయ ఉద్యమ సాహిత్యాల ముందుమాటల్లో పంథొమ్మిది, ఇరవై శతాబ్దాలలో 'స్త్రీలు', 'పితృస్వామ్యం' అనే అంశాలకు సంబంధించిన స్త్రీల సాహిత్య చొరవల గురించి ఉంది. మొదట సామ్రాజ్యాధిపత్య స్థాపన గురించీ, తర్వాత జాతీయ ఉద్యమం పెరుగుదల గురించీ అందులో కనిపిస్తుంది. 


వర్గం, జెండర్‌, కులం, జాతి, మతం, పరస్పరం ప్రభావితం అయ్యే క్రమాల గురించి వివరించే ప్రయత్నం చేసాం. ఈ సంపుటంలో 1940-50లలో మనదేశం సృష్టించిన సామాజిక ఊహా చిత్రణ, 1970లలో పైకెగసిన తిరుగుబాటు ఉద్యమాల గురించి ఉంది. వివిధ  పద్ధతుల్లో ముందుకొచ్చిన ఈ నూతన ఆధిపత్యాన్ని  స్త్రీల రచనలు నిలదీస్తాయని మా వాదన. ఐతే కొన్ని సార్లు అవి అధికారిక పద్ధతుల్ని కూడా  స్థిరీకరిస్తాయి. స్త్రీల పోరాటాలు ఏ రూపాల్ని తీసుకుంటాయన్న అంశం మీదే మా దృష్టి ఎక్కువ. 

వాళ్ళ ప్రపంచాలెలా మలచబడ్డాయి? ఇతర ప్రయోజనాల కోసం నిర్దేశించిన ఇతివృత్తాలను, చిత్రణలను, కవితా కల్పనా సృష్టిని, తమ ప్రయోజనాలకోసం స్త్రీలెలా వినియోగించారు? వాళ్ళ పట్ల శత్రుబద్ధమైన, నిర్లక్ష్యమైన ధోరణి ప్రదర్శించిన సాంస్కృతిక  చిహ్నాలని తెలివిగా వారికనువుగా ఎట్లా మల్చుకున్నారు? సైద్ధాంతిక వలల్ని తప్పించుకుంటూ, 'సంఘ, చట్ట' విరుద్ధమైన సౌఖ్యాలనెట్లా కోరుకున్నారు? 'ఆత్మశక్తి', చిత్తశుద్ధి గురించి వాళ్ళ కలలు ఏ రూపాల్ని తీసుకున్నాయి? అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ తిరుగుబాటు రూపాలేమిటి? మా ఎంపికలో కూడా ప్రధానంగా చూసిన విషయం ఇదే. 

వాళ్ళ కోసం నిర్దేశించిన కార్యక్రమాల్ని ప్రశ్నించి, దాటేసి, తిప్పిరాసి, మార్పుచేసి చివరికి తారుమారు ఎలా చేయగలిగారు?

ఇంకొక రకంగా చెప్పాలంటే, మనకు సంక్రమించిన ప్రపంచాల్ని ఈ స్త్రీలెలా మలిచారో తెలుసుకోవాలని మా ఆసక్తి. ఆధిపత్యానికి సంబంధించిన చరిత్రనా, సవాలు చేసిన చరిత్రనా, దేనిని మనం కోరుకుంటున్నాం? ఈ ప్రయత్నాలలో రచయిత్రులు పడ్డ ఇబ్బందులు, పోగొట్టుకున్న నిక్షేపాలు, చేసుకున్న ఒప్పందాలు, ఒదులుకున్న  రాయితీలు అవన్నీ మనకు సంక్రమించిన అంశాల మీద ఏం ప్రభావాల్ని కలిగించాయి అని పరిశీలించగలిగాం. ఈ రచనల ద్వారా ఇంత వరకూ ఉన్న దానికంటే మరింత శక్తివంతమైన సంక్లిష్టమైన స్త్రీవాద చరిత్రవైపు దృష్టి నిలిపే ప్రయత్నం చేసాం. ఈ ప్రయత్నం 'అణచివేత', 'విముక్తి' అనే సులభతరమైన సూత్రీకరణలను మించిన, మరింత ఇబ్బందికరమైన చరిత్ర గురించే!
 


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌