Tuesday, January 22, 2013

బొజ్జా తారకం "పంచతంత్రం" నవలపై చర్చ జనవరి 25 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ! ...

ఆహ్వానం

బొజ్జా తారకం రాసిన "పంచతంత్రం" నవల పై చర్చ నిర్వహిస్తున్నాం.


ప్రముఖ రచయితలు 

బి. కళ్యాణరావు, 
నందిగం కృష్ణారావు, 
ఎన్. వేణుగోపాల్ 
మొదలైన వారు మట్లాడతారు. 

మీరు తప్పక రండి !


తేదీ: 25 జనవరి 2013 

సాయంత్రం 5-30 కి.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, 

హైదరాబాద్ .

Monday, January 21, 2013

చాయ్, సమోస ఔర్ లామకాన్ ...
చాయ్, సమోస ఔర్ లామకాన్

భంగ్యా భూక్యా. ఇటువంటి పేర్లను విద్యావిషయకమైన బృందాల్లో వినడానికి మనం ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. వేరే స్థలాల్లో వేరే సందర్భాల్లో వేరే కోవల్లో మాత్రమే కనిపించే పేర్లు అధికార స్థానాల్లో, జ్ఞానపీఠాల్లో, పత్రికల కాలమ్స్‌లో తరచు తారసపడితే తప్ప సమాజంలోని అహంకారాలూ అర్థసత్యాలూ అంతరించిపోవు.
ఇంగ్లీషు, విదేశీభాషల యూనివర్సిటీలో సామాజికవివక్ష అధ్యయన విభాగంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న భూక్యా నిజాం పాలనలో లంబాడాల స్థితిగతుల మీద ఇంగ్లండ్‌లోని వార్‌విక్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన చరిత్రకారులతో కలసి పనిచేశారు. 2010లో ఇంగ్లీషులో వచ్చిన ఆయన పరిశోధనాగ్రంథం తెలుగు సంక్షిప్త అనువాదం జనవరి 5 హైదరాబాద్‌లో ఆవిష్క­ృతమైంది.

ఆ పుస్తకం నుంచి కోకొల్లలుగా కొత్త సత్యాలు నేర్చుకోవచ్చును. అవన్నీ ఒక ఎత్తు, పుస్తకావిష్కరణ జరిగిన వేదిక 'లామకాన్' నేర్పే కాలజ్ఞానం మరో ఎత్తు. గ్రంథకర్తకూ, ప్రచురించిన హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌వారికీ ఆ సమయంలో ఆ స్ఫురణ కలిగిందో లేదో కానీ, బంజారా హిల్స్‌లో, మేడాగూడూ కాకుండా మధ్యరకంగా, బృహత్‌శిలలను కడుపులోనే పెట్టుకుని కట్టుకున్న ఒక పొదరింటిలో భూక్యా పుస్తకావిష్కరణ జరగడం ఒక చారిత్రక న్యాయంగా తోచింది నాకు.
ఒక వైపు జివికె మహాసామ్రాజ్యం, మరో పక్కన వెంగళరావు పార్కు, తక్కిన వైపులంతా విషంలా వ్యాపించిన నవసంపన్నత, వీటి మధ్య 'లామకాన్' ఒక చెలిమె. సాహిత్యం, సంస్క­ృతి, సమాజం- ఏదైనా సరే, నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి, పాడుకోవడానికి ఒక మంచి మనిషి అందించిన కాసింత స్థలం. అతి విలువైన అతి అరుదైన స్థలం. ఆ స్థలం ఉండబట్టే, బంజారాల చరిత్రను ఆవిష్కరించిన పుస్తకం బంజారాహిల్స్‌లో ఆవిష్క­ృతమైంది. ఆ సన్నివేశం మీటిన రహస్తంత్రి ఏమి చెబుతున్నది? ఈ దేశపు మహాజనులారా! మీరు కోల్పోయిన స్థలాలన్నిటినీ తిరిగి ఆక్రమించుకోండి, మీరు విస్మ­ృతులైన కాలాలన్నిటినీ నిద్రలేపండి!

సంపన్నతతో విర్రవీగుతున్న బంజారాహిల్స్‌ను ఉద్రిక్త వక్షోజాలతో పోల్చాడు తిలక్. మహానగరంలోని ఉన్నతవర్గాల కేంద్రంగా బంజారాహిల్స్ ప్రఖ్యాతినో అపఖ్యాతినో మూటగట్టుకున్నది కానీ దాని నామవాచకం వెనుక ఉన్న చారిత్రక అర్థం మరుగున పడిపోయింది. ఒకనాడు సంచారవర్తకులుగా, రవాణాదారులుగా ఉన్న లంబాడాల ఆవాస ప్రాంతాలు నేటి బంజారాహిల్స్. ఆ కొండలు ఇప్పుడు బంగారు కొండలయిన క్రమం గానీ, ఎవరెవరినుంచి చేతులు మారి అవి నేడు కొండచిలువలకు కొలువైన కథ గానీ చరిత్రలో కనిపించదు.

భంగ్యా భూక్యా- ఆ చరిత్ర డొంకను కదిలించాడు. 'లామకాన్'లో ఆ పుస్తకం గురించి చర్చించుకున్న కాసేపయినా బంజారాహిల్స్‌ను తిరిగి బంజారాలకు అంకితం చేశాడు.

'లామకాన్' ఒక సాంస్క­ృతిక బహిరంగ వేదిక కాకముందు, అది ఒక నివాసం. అప్పుడు కూడా దానిపేరు లామకానే. లామకాన్ అంటే ఇల్లులేని వారు అని అర్థం. ఇల్లు లేకపోవడం అంటే నిరాశ్రయత కాదు. సర్వవ్యాపిత్వం అని. ఇస్లామ్‌లో అల్లాకు ఉన్న అనేక నామాలలో లామకాన్ కూడా ఒకటి. నిరాకారుడైన దైవం స్థావరుడు కాదు. అన్నిటా ఉండే మహాశక్తి. జంగమతత్వానికి దగ్గరగా కనిపించే అద్భుతమైన భావన అది.
భాగ్యనగరానికి ఆభరణాల వంటి మహాశిలలను ధ్వంసం చేయకుండా, వాటిని గర్భీకరించుకుంటూ, కళాత్మకంగా, నిరాడంబరంగా నిర్మించుకున్న ఆ నివాసం మొయిద్ హసన్‌ది. హైదరాబాదీ శిలా రక్షణ ఉద్యమకారుడు, ఛాయాగ్రాహకుడు, డాక్యుమెంటరీల నిర్మాత, చిత్రకారుడు మొయిద్ హసన్. ఉర్దూ రచయిత్రి జిలానీ బానో సోదరుడు ఆయన. తన తండ్రి స్నేహితుడైన హైదరాబాద్ అద్భుత కవి మగ్దూం మొహియుద్దీన్ ఒడిలో బాల్యకౌమారాలు గడిపిన అదృష్టవంతుడు.

పదిహేనేళ్ల కిందట హసన్‌ను 'లామకాన్' లో కలిశాను. చలపతి, విజయవర్థనరావు ఉరిశిక్షల రద్దు ఉద్యమంపై ఆయన, సజయ కలిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిన సందర్భం అది. సందర్భం అదే అయినా సంభాషణ బహుముఖాలుగా సాగింది. ఆయన ఆదరణలాగే ఉన్న పరిమళభరితమైన వెచ్చటి టీ తాగాను. ఆయన స్వయంగా వండి వడ్డించిన ఆతిథ్యాన్ని స్వీకరించాను. అప్పుడప్పుడే తెలంగాణ చరిత్రపై ఆసక్తి పెంచుకుంటున్న నేను నా అజ్ఞానాన్ని, కుతూహలాన్ని ఆయనతో పంచుకున్నాను. వెలుగునీడల మర్మం తెలిసినవాడేమో, సత్యాసత్యాల మధ్య ఉండే పొరలను విప్పిచెప్పాడు. ట్యూబ్‌లైట్‌లు నిర్జీవ దీపాలని అన్నాడు. నీడలు రాని దీపం వృథా అన్నాడు. ఆయన ఇంట్లో అన్నీ గుండ్రటి ఫిలమెంట్ బల్బులే.

ఏ ఉత్తరాది నుంచో ఏడెనిమిది దశాబ్దాల కిందట వలసవచ్చిన హసన్ కుటుంబం, హైదరాబాద్‌ను ప్రాణప్రదంగా ప్రేమించింది. మఖ్‌మల్ బట్టలో చుట్టి కుట్టిన ఒక చిన్న హైదరాబాదీ శిలను చూపిస్తూ, అభివృద్ధి చేస్తున్న విధ్వంసం గురించి, జనజీవనంలో వస్తున్న శైథిల్యం గురించి హసన్ వేదనతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనపై ఆయనకు ఎంతటి వ్యతిరేకతో, హైదరాబాద్ చరిత్రపై, తెహజీబ్ పై ఆయనకు అంత మక్కువ. కర్కోటకుడని పేరుపొందిన ఏడో నిజాం హయాంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదనే విషయం ఆయన చెబితేనే నాకు తెలిసింది. వాస్తవాలను కమ్మివేసిన అభిప్రాయాల పొరలను తొలుచుకుని చూడకపోతే చరిత్రను అర్థం చేసుకోవడం కష్టమని హసన్ నన్ను హెచ్చరించారు.

ఆయనను కలిసింది ఒక్కసారే కానీ, జ్ఞాపకం మాత్రం బలంగా మిగిలిపోయింది. 2004లో ఆయన చనిపోయినప్పుడు, ఆలస్యంగా తెలిసింది. సమాచార విప్లవ యుగంలో కూడా అన్ని వార్తలూ వేగంగా ప్రసరించవని అర్థమయింది. ఆయనను ఎవరెంత గుర్తించారో అనవసరం కానీ, ఆయన బలమైన ఆకాంక్షలు నిరాకరించలేని గుర్తింపును సాధించుకున్నాయి.
 
ఆయన అభిమతాన్ని గుర్తించిన వారసులు, ఆయన నివసించిన ఇంటిని ఒక ఊరుమ్మడి సాంస్క­ృతిక వేదికగా మలిచారు. మంచితనాన్ని పంచుకునే ఏ ప్రయత్నానికయినా ఉచితంగా దొరికే వేదిక 'లామకాన్'. మిత్రుడు రామ్మోహన్ హోలగుండి ప్రదర్శించిన నాటకాలో, మానవహక్కుల వేదిక 'సోంపేట' మీటింగో, కవి శివారెడ్డి కవిత్వాలాపనో, కచేరీలో, ఆటపాటలో బంజారాహిల్స్ రాళ్లలోపల పూలు పూయిస్తూనే ఉన్నాయి. వేడివేడి చాయ్ సమోసాల మధ్య కొత్త మెహఫిళ్లను తీర్చిదిద్దుతున్నాయి. ఎదురీతల్లో రాటుదేలిన భూక్యాల మేధావిత్వం ఒక శిఖరం. విలువలను, సమష్టిని వదలని హసన్‌ల మంచితనం మరో శిఖరం.

- కె. శ్రీనివాస్

(Adivaaram Andhra Jyothy , 20-1-2013)

Sunday, January 20, 2013

చరిత్ర'కు సవాల్ లంబాడా చరిత్ర - బత్తుల కార్తీక్ నవయాన్, ఆదివారం ఆంద్ర జ్యోతి లో ...


సింహాలనుంచి చరిత్రకారుడు ఉద్భవించేవరకు వేటగాడు చెప్పే పిట్టకథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అవుతాయన్నది ఆఫ్రికన్ సామెత. ఈ దేశంలో ఆదిమజాతులు, ఆదిమకులాలు తమ తమ చరిత్రలను తిరగరాస్తున్న సమయమిది. అంటరానితనం, అవమానాల పెనుమంటల పెనుగులాటలో నుండి తమ గతాన్ని తవ్వి 'ఇదిగో ఇదీ మా చరిత్ర' అని వర్తమాన చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగమిది.

ఇప్పుడు పేదలుగా, అంటరానివారుగా, కేవలం ఓటర్లుగా, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదురు చూసే అర్భకులుగా ఉన్న ఆదిమజాతుల గత చరిత్ర ఏమిటి? నాలుగైదు వందల సంవత్సరాల క్రితం కూడా వారు ఇలాగే ఉన్నారా? వారి బ్రతుకులు ఇలాగే ఉన్నాయా? తదితర అనేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న చరిత్రకారుల వద్ద సమాధానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. నిజానికి తమ తాతలు, తండ్రులు ఈ దేశంలోని అడుగుకులాలపై, జాతులపై సాగించిన అమానవీయ దోపిడీ దౌర్జన్యాలను అగ్రకుల చరిత్రకారులు చరిత్రగా రికార్డు చేయాలి. కానీ అంత నీతి, నిజాయతీ గలిగిన చరిత్రకారులు దుర్భిణీ వేసి వెతికినా దొరకరు. అందుకే అడుగుకులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.

ప్రొఫెసర్ భుక్యా భంగ్యా రాసిన 'నిజాంపాలనలో లంబాడాలు' (అణచబడిన సంచారులు)పుస్తకం ఆ కోవలోదే. ఇది పి.హెచ్.డి పరిశోధన గ్రంథం. మూడేళ్ల క్రితం ఇంగ్లీషులో ప్రచురించబడి ఇప్పుడు తెలుగులోకి అనువాదమైంది. అణచబడిన, అంటరాని జాతుల చరిత్రను విద్యారంగ పరిధిలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పుస్తకం ఇది.

ఒకప్పుడు స్వయంసమృద్ధిగా రాజీలేని జీవితం గడిపిన ఆదిమజాతులు ఆ తర్వాత వెనుకబడిన జాతులుగా మిగిలిపోయాయి. ఈ దుస్థితికి వలసపాలకులే కాదు, వారితో షరీకైన స్థానిక అధికారులు కూడా ఎంతో కారణం. ఈ చారిత్రక పరిణామాన్ని పట్టి ఇచ్చేదే ఈ పుస్తకం. గతంలో పశువులద్వారా రవాణారంగాన్ని నిర్వహించిన లంబాడాలు టెక్నాలజీ ప్రవేశంతో కూలీలుగా మారిపోయారు. బ్రిటీష్ వారు తీసుకొచ్చిన చట్టాలతో నేరస్త జాతిగా ముద్రపడ్డారు. ప్రధానంగా హైదరాబాద్ డక్కన్‌లోని లంబాడా జాతి తన సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి కన్న బిడ్డలను కూడా అమ్ముకునే దుర్భర పరిస్థితులకు ఎలా లోనయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే.

- బత్తుల కార్తీక్ నవయాన్
 ( 20.1.2013 ఆదివారం ఆంద్ర జ్యోతి లో)

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా, 

అనువాదం : ఆకెళ్ళ శివప్రసాద్
వెల : రూ 80, పేజీలు : 158,

ప్రతులకు :
 హైదరాబాద్ బుక్ ట్రస్ట్
040-23521849

Sunday, January 6, 2013

నిజాం పాలనలో లంబాడాలు (Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams) - భంగ్యా భుక్యా

నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా 


ఈ పుస్తకం ఇంగ్లీష్‌లో వెలువడిన తరువాత దేశ, విదేశీ జర్నల్స్‌లో చాలా విశ్లేషణలే వచ్చాయి. చాలా విశ్లేషణలు ఈ పుస్తకాన్ని పొగడ్తలతో ముంచెత్తాయి. ముఖ్యంగా ''ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ, సోషల్‌ సైంటిస్ట్‌, ది బుక్‌ రివ్యూ''లలో వచ్చిన విశ్లేషణలు ఈ పుస్తకానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను.

ఈ పుస్తకం ఇంత ప్రాచుర్యం పొందటానికి నేను ఎంచుకున్న అధ్యయన అంశమే కారణమని చెప్పాలి. లంబాడాలు ఏవిధంగా వలసవాద పాలనలో వచ్చిన ఆధునిక రాజకీయ, పాలన, ఆర్థిక విధానాలను ఎదుర్కొని ఒక సామాజిక వర్గంగా రూపాంతరం చెందారో ఈ పుస్తకం వివరిస్తుంది.

ఇందులో రెండు వందల సంవత్సరాల లంబాడాల చరిత్రను విశ్లేషించడటమే కాకుండా ఆనాటి  ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను కూడ వివరించటం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశ చరిత్ర నిర్మాణంలో లంబాడాల పాత్రను వివరిస్తుందిది.

దేశ నిర్మాణంలో చరిత్ర ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఒక చరిత్రకారుడిగా నాకు తెలుసు. అనేక జాతుల/కులాల సమ్మేళనమైన భారతదేశం వంటి దేశంలో చరిత్ర మరింత ముఖ్య పాత్ర వహిస్తుంది. జాతుల/కులాల ఆధిపత్యానికి, విముక్తికి చరిత్రే మూలం.

చరిత్రను ఉపయోగించుకొనే ఆధిపత్య కులాలు సమాజంలో పెత్తనం చలాయిస్తున్నాయి.  ఈ ఆధిపత్య కులాల చరిత్రను తిరగ రాయడం ద్వారా అణగారిన కులాలను శాశ్వతంగా విముక్తి చేయగలుగుతాము. 1990 నుంచి దేశంలో, రాష్ట్రంలో వస్తున్న దళిత, బహుజన, ఆదివాసి చైతన్య ఉద్యమాలు ఈ దశగా ఆలోచించి తమ జాతుల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకురావడాన్ని ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కారంచేడు, చుండూరు సంఘటనలు, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమాలు, కాన్షీరాం బహుజన ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, దండోరా ఉద్యమం మొదలైనవి దళిత, ఆదివాసీ, బహుజన రచనలకు స్ఫూర్తినిచ్చాయి.

దళిత రచయితలు ఆధిపత్య కులాల/వర్గాల చరిత్రను ధిక్కరిస్తూ నూతన పంథాలో తమ జాతుల చరిత్రను, సాహిత్యాన్ని తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దళిత చరిత్రలు, దళిత కవిత్వాలు, దళిత ఆత్మ కథలు ఎన్నో తెలుగులో వచ్చాయి. అయితే ఆదివాసీ, సంచార జాతుల రచనలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఈ పుస్తకం ఆ లోటును కొంతవరకైనా తీరుస్తుందని భావిస్తున్నాను.

- భంగ్యా భుక్యా
(తెలుగు అనువాదానికి ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఈ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు:

''లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్తిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించటం దీని ప్రత్యేకత.''
.............................................................................- క్రిస్పిన్‌ బేట్స్‌ (ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం)

''లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించటం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన.''
............................................................................- డేవిడ్‌ హార్డిమాన్‌ (వార్‌విక్‌ విశ్వవిద్యాలయం)

''సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని వలసవాద పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, హైదరాబాదు రాష్ట్రంలో లంబాడాలు ఏవిధంగా 'నేర జాతి'గా ముద్రవేయబడి అణిచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.''
.................................................- గేల్‌ ఆంవెట్‌ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, సిమ్లా)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రచయిత గురించి:

భంగ్యా భుక్యా పన్నెండేళ్ళ పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర బోధించారు. ప్రస్తుతం ఇఫ్లూ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ స్టడీస్‌ విభాగంలో చరిత్ర అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.ఎంఫిల్‌ చేసిన ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నుంచి అంతర్జాతీయ ఫెలోషిప్‌  సాధించి ఇంగ్లండ్‌లోని వార్‌విక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి చేశారు.

కులం ఆదివాసీ జాతుల చరిత్రలు, అస్తిత్వ రాజకీయాలు, జాతులు - తెగలపై రాజ్యం దాని యంత్రాంగం చూపే ప్రభావం వంటి సామాజిక ప్రాధాన్యమున్న అంశాలపై లోతైన అధ్యనం చేస్తున్న ఆయన  లండన్‌, ఆక్స్‌ఫర్డ్‌, ఎడిన్‌బరో, వార్‌విక్‌ తదితర ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఉపన్యాసాలిచ్చారు. పలు జాతీయ, అంతర్జాతీయజీ జర్నల్స్‌కు వ్యాసాలు రాశారు. ప్రస్తుతం మధ్య భారతంలోని గోండు జాతిపై అధ్యయనం జరుపుతున్నారు.


నిజాం పాలనలో లంబాడాలు
- భంగ్యా భుక్యా


ఆంగ్ల మూలం : Subjugated Nomads; The Lambadas under the Rule of the Nizams, Orient Blackswan, Hyderabad, 2010
తెలుగు అనువాదం : ఆకెళ్ల శివప్రసాద్‌

157 పేజీలు, వెల : రూ.80/-

ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 - 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌