Tuesday, March 31, 2020

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తొలి కార్యాలయం

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తొలి కార్యాలయం 1980 బషీర్ బాగ్


హైదరాబాద్ బుక్ ట్రస్ట్  40 సంవత్సరాల క్రితం కొంతమంది ఔత్సాహికుల సమిష్టి కృషితో 1980 జనవరి లో ప్రారంభించ బడింది.  హెచ్.బి.టి. తొలి నాళ్ళ కార్యాలయం ఫోటో ఇది. బషీర్ బాగ్ చౌరస్తాలో ఓరియంట్ బ్లాక్ స్వాన్ వారి ఆవరణలో వుండేది. లక్ష్మి గారు ఆమె తండ్రి రామేశ్వర్ రావు గారు తమ కార్యాలయం వెనక వన్న ఈ రెండు గదులను ఎంతో ఉదారంగా ఒక్క పైసా అద్దె లేకుండా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు ఇచ్చారు. 

ఎంతో ప్రశాంతమైన, అందమైన ఆ ఆవరణలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు హెచ్. బి. టి. తన కార్యకలాపాలను కొనసాగించింది. హెచ్ బి టి అనే మొక్క నిలకడగా ఎదిగేందుకు ఆనాడు వాళ్ళు అందించిన చేయూత  ఎంతగానో తోడ్పడింది. 

అలాగే మంచి పుస్తకాల ఎంపిక, అనువాదం, డీటీపీ, ప్రూఫ్ రీడింగ్, ప్రింటింగ్, అమ్మకాలు, కార్యాలయ నిర్వహణ మొదలైన అనేక పనుల్లో మరెందరో మిత్రులు, కామ్రేడ్స్, పుస్తకాభిమానులు తమ సహాయ సహకారాలను  అందించడం వల్లనే ఈ నాలుగు దశాబ్దాలుగా హెచ్ బి టి తన మనుగడను అప్రతిహతంగా సాగించ గలుగుతోంది. 
ఈ సందర్భంగా  వారందరికీ పేరు పేరునా కృతజ్నతాభివందనములు తెలియజేసు కుంటున్నాము . 




Sunday, March 22, 2020

కారంచేడు నేపథ్యంలో స్థాపించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ’కు స్ఫూర్తి నిచ్చింది ‘‘దళిత్‌ పాంథర్‌’’ ఉద్యమమే



కారంచేడు నేపథ్యంలో స్థాపించిన ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ’కు స్ఫూర్తి నిచ్చింది ‘‘దళిత్‌ పాంథర్‌’’ ఉద్యమమే

తిరుపతిలో 22 మార్చి 2020 ఆదివారం నాడు ‘దళిత సాహిత్య వికాస వేదిక’ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు  ప్రచురించిన ‘దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. 

ఆరోజు  దేశవ్యాప్తంగా జనతా కర్‌ఫ్యూ ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆర్‌.పి.ఐ. రాష్ట్ర అధ్యక్షు పి. అంజయ్య ఇంట్లో కొద్దిమంది సమక్షంలో ఉదయం 11 గంటలకు నిర్వహించారు. 

ఈ సందర్భంగా పి. అంజయ్య మాట్లాడుతూ 1985లో కారంచేడు దళితుల పై జరిగిన హత్యాకాండను ప్రతిఘటించేందుకు ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభకు దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఎంతో స్ఫూర్తి నిచ్చింది అన్నారు. 19172లో మహారాష్ట్రలో ఏడుగురు దళిత యువకులతో మొదలైన దళిత్‌ పాంథర్స్‌ సంస్థ యావత్‌ దేశంలో నిద్రాణమై వున్న దళిత చైతన్యాన్ని తట్టి లేపిందని, తమ రచనల ద్వారా, పోరాటాల ద్వారా అంబేడ్కర్‌ సిద్ధాంతాలను గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడంలో గణనీయమైన విజయాలను సాధించిందని అన్నారు. 

అమానుషమైన అంటరానితనం పూర్తిగా నిర్మూలించబడాలంటే, కులాల మధ్య అంతరాలు సమూలంగా తొలగి, కుల నిర్మూలన జరిగి  సర్వమానవ సమానత్వం సాధించబడాంటే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ రచనలను తప్పనిసరిగా చదవాలన్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ కొద్దికాలమే కొనసాగినప్పటికీ అది మన సమాజంపై ఎన్నటికీ చెరగని ముద్రవేసిందనీ, ఇప్పటికీ దళిత్‌ పాంథర్స్‌ చేసిన పోరాటాలు మనకు స్పూర్థినిస్తూనే వున్నాయని అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత వుందన్నారు. 

నాటి కార్యక్రమంలో టి.టి.డి. ఆయుర్వేద కళాశాల విశ్రాంత ప్రొఫెసర్‌ ఎ. మోహన్‌,  ఆర్‌.పి.ఐ. జిల్లా అధ్యక్షులు ఎ. సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ నాయకులు పి. ప్రభాకర్‌, ఎస్‌. సుబ్రమణ్యం, సహదేవ్‌, రెడ్డి బాబు తదితరులు  పాల్గొన్నారని దళిత సాహిత్య వికాస వేదిక వారు తెలియజేశారు. 

Tuesday, March 17, 2020

విశాఖపట్నంలో, హైదరాబాద్‌లో ‘దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ



విశాఖపట్నంలోహైదరాబాద్‌లో దళిత్‌ పాంథర్స్‌ చరిత్ర’ పుస్తకావిష్కరణ






హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన దళిత్‌ పాంథర్స్‌ చరిత్రపుస్తకాన్ని మార్చి 14న విశాఖపట్నంలో, మార్చి  15న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ రెండు సమావేశాలలోనూ పుస్తక రచయిత జె. వి. పవార్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖపట్నంలో రామాటాకీస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ భవన్‌లో జరిగిన సభను స్థానిక భీమసేన వారు నిర్వహించారు. 

పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం జె. వి. పవార్‌ మాట్లాడుతూ మన సమాజంలో సమానత్వం రావాంటే ప్రతి ఒక్కరూ అంబేడ్కర్‌ రచనలను చదవాలన్నారు. ఈ ఉద్దేశంతోనే తను ముద్రణకు నోచుకోకుండా వుండిపోయిన అనేక అంబేడ్కర్‌ రచనలను  సేకరించి, అంబేడ్కర్‌ భార్యనీ, కుమారుడినీ ఒప్పించి మొత్తం 22 సంపుటాల రూపంలో అంబేడ్కర్‌ సమగ్ర రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రచురింపజేసేందుకు నిబద్ధతతో కృషి చేసినట్టు చెప్పారు. అంబేడ్కర్‌ నిర్యాణానంతర ఉద్యమాలలో దళిత్‌ పాంథర్‌ ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత వుందన్నారు. దళిత్‌ పాంథర్‌ సంస్థ కొద్ది కాలమే మనుగడ సాగించినప్పటికీ మహారాష్ట్రలో, ఆమాటకొస్తే యావత్‌ భారతదేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలనూ, అత్యాచారాలనూ ఎదిరించేలా దళిత్‌ యువతను సంఘటిత పరచడంలో, చైతన్య పరచడంలో చెప్పుకోతగ్గ విజయం సాధించిందని చెప్పారు. 

నాటి సభలో భీమ సేన వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ,  హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు గీతా రామస్వామి, ప్రముఖ అంబేడ్కరీయులు వి. రాఘవేంద్రరావు,  డా. కె.వి.పి. ప్రసాదరావు, ప్రముఖ బహుజన రచయిత దుప్పల రవికుమార్‌, అంబేడ్కర్‌ మెమోరియల్‌ సొసైటీ అధ్యక్షులు ఇంటి గురుమూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. వక్తల ప్రసంగాలతో స్ఫూర్తి పొందిన ప్రేక్షకులు పుస్తకం కొనేందుకు పొటీపడ్డారు.  తీసుకువెళ్లిన పుస్తక ప్రతులన్నీ కాసేపట్లోనే అమ్ముడుపోవడం ఒక విశేషం.

హైదరాబాద్‌లో మార్చి 15న బంజారాహిల్స్‌ లమకాన్‌లో జరిగిన సభలో  పుస్తక రచయిత జె.వి.పవార్‌ మాట్లాడుతూ దళిత్‌ పాంథర్‌ ఆవిర్భావానికి దారితీసిన ఆనాటి పరిస్థితులను, దళితులపై జరుగుతున్న అత్యాచారాలను ఎదిరించడంలో తాము అనుసరించిన పద్ధతులను, సాధించిన విజయాలను వివరించారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. 

సుబోధ్‌ మోరే, సురేష్‌ కరడే లు ప్రసంగిస్తూ ప్రస్తుత పరిస్థితులలో లాల్‌ జెండా నీల్‌ జెండా ఏకం కావసిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. కన్హయ్య కుమార్‌ వంటి కమ్యూనిస్టు యువ నేతలు ప్రతి సభలో జై భీమ్‌, లాల్‌ సలామ్‌ అంటూ రెండు నినాదాలు  చేస్తుండడం ఒక శుభపరిణామం అన్నారు. 
అనువాదకుడు  ప్రభాకర్‌ మందార మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అనువదిస్తున్నప్పుడు తాను ఎంతో ఉద్వేగానికి గురైనట్టు, కొన్ని సంఘటనలైతే కంటతడిపెట్టించినట్టు, ఆగ్రహావేశాలకు గురిచేసినట్టు చెప్పారు. సభలో ఇంకా హెచ్‌బిటి నిర్వాహకులు గీతా రామస్వామి ప్రభృతులు పాల్గొన్నారు.


దళిత్ పాంథర్స్ చరిత్ర

రచన : జే.వి. పవార్
ఆంగ్ల మూలం  : Dalit Panthers, An Authoritative History
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార

252 పేజీలు , వెల : రూ.180 /-.

ప్రతులకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ 500006

Phone: 040 2352 1849

Email: hyderabadbooktrust@gmail.com
    

Friday, March 13, 2020

టిపుసుల్తాన్' పుస్తకం లోని కొన్ని విషయాలు


టిపుసుల్తాన్' పేరుతో యార్లగడ్డ నిర్మలగారు రచించిన పుస్తకాన్ని
 హైద రాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించింది. అందులోని కొన్ని ఈ విషయాలు:
- భాస్కరం కల్లూరి

1. టిపుసుల్తాన్ అనాలి. టిప్పుసుల్తాన్ తప్పు.
2. టిపు తల్లి ఫాతిమా ఫక్రున్నీసా  స్వస్థలం కడప.

3. టిపు మరణవార్త తెలుసుకుని, టిపుకు వ్యతిరేకంగా తరచు ఆంగ్లేయులకు సహకరించిన మరాఠా రాజకీయ దురంధరుడు నానా ఫడ్నవీస్ అన్నమాటలు:
టిపు మరణించాడు. ఆంగ్లేయుల బలం పెరుగుతుంది...ముందు ముందు చెడ్డరోజులు రాబోతున్నాయి.(రచయిత్రి పరిచయం నుంచి)

4. టిపు దేశానికి ఆంగ్లేయుల ప్రమాదాన్ని గ్రహించాడు. ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఒంటరిగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సమకాలికులవలె బ్రిటిష్ కింద బానిసత్వాన్ని అంగీకరించలేదు.

5. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు టిపును క్రూరనియంతగా, మతోన్మాదిగా ప్రచారం చేశారు. 20వ శతాబ్దిలో కొత్త చారిత్రక ఆధారాలు వెలుగు చూసేవరకు ఈ ప్రచారం విజయవంతంగా కొనసాగింది. 1791లో మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధసమయంలో ఆంగ్లేయులతో కలసి టిపుతో యుద్ధం చేస్తున్న మరాఠాలు- టిపు రాజ్యంలోని శృంగేరి మఠంపై జరిపిన దాడికి, అక్కడ వారు చేసిన విధ్వంసానికి టిపు వ్యక్తం చేసిన ఆవేదన, మఠ పునరుద్ధరణకు సంబంధించి టిపుకు, శృంగేరి మఠాధిపతికి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు 1916లో వెలుగు చూశాయి.

6. టిపు మతసామరస్యానికి సంబంధించి ఎంతో సమాచారం లభిస్తుండగా బ్రిటిష్ చరిత్రకారులు ఆయనపై మతోన్మాది అన్న ముద్ర వేశారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నవారికి మాత్రమే టిపు మరణదండన విధించేవాడు. మిగతావారికి మతమార్పిడి ప్రత్యామ్నాయంగా ఉండేది.

7. 1970 దశకంలో ఆర్.ఎస్.ఎస్. కర్ణాటకరాష్ట్రంలోని మహనీయుల జీవితచరిత్రలను భారత భారతి అనే సీరీస్ లో కన్నడంలో ప్రచురించింది. వాటిలో టిపు జీవితచరిత్ర కూడా ఉంది.

8, బ్రిటిష్ వారు వదిలి వెళ్ళిన 'టిపు విలన్' చర్చ భారతదేశంలో 20వ శతాబ్దం 80వ దశకంలో తిరిగి తెరపైకి వచ్చింది. 1976లో ఎమర్జెన్సీ తర్వాత భారతదేశ రాజకీయాల్లో వచ్చిన కొత్త రాజకీయ సమీకరణలు, వాటి కొత్త అజెండాలే అందుకు కారణం.

9. బీజేపీలో ఉన్నప్పుడు టిపును విమర్శిస్తూ వచ్చిన యడ్యూరప్ప 2012లో కొత్త పార్టీ పెట్టాక టిపును గొప్ప దేశభక్తుడని పొగిడాడు. తిరిగి బీజేపీలోకి వచ్చాక టిపు జయంతి ఉత్సవాలను వ్యతిరేకిస్తున్నాడు,

10. నాలుగవ ఆంగ్లో-మైసూరు యుద్ధం ప్రారంభమైనప్పుడు దక్షిణభారతంలోని సంస్థానాధీశులందరూ బ్రిటిష్ కు సహాయమైనా చేయాలి, లేదా తటస్థంగానైనా ఉండాలని గవర్నర్ జనరల్ రిచర్డ్ వెలస్లీ ఆదేశించాడు. పేష్వా తరపున మరాఠారాజ్యం నడుపుతున్న నానా ఫడ్నవీస్ తటస్థంగా ఉండడానికి నిర్ణయించాడు. మరాఠాల్లోనే కొందరు టిపుకు సాయం చేయాలని అన్నా ఒప్పుకోలేదు. మరాఠాలు టిపుతో కలసి ఆంగ్లేయులతో పోరాడి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం. టిపుపై విజయం సాధించాక వెలస్లీ మరాఠాలపై కూడా దాడి చేసి సైన్యసహకార సంధికి ఒప్పించాడు.

11. 20వ శతాబ్ది ప్రారంభంలో కలకత్తా యూనివర్సిటీలో సంస్కృత విభాగానికి అధిపతిగా ఉన్న డా. హరిప్రసాద్ శాస్త్రి మెట్రిక్యులేషన్ కు రాసిన పాఠ్యపుస్తకంలో, టిపు సుల్తాన్ జరిపే మత మార్పిదులకు ఇష్టపడని 3000 మంది బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్నారని రాశాడు. ఉత్తరభారతంలో ఈ పాఠ్యపుస్తకం చాలా కాలం కొనసాగింది. 1928లో అలహాబాద్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకుడిగా ఉన్న బి. ఎన్. పాండే కు ఇది ఆశ్చర్యం కలిగించింది. ఆధారాలు చెప్పమని కోరుతూ హరిప్రసాద్ శాస్త్రికి ఆయన ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు. చివరికి, మేధో
వంచనగా భావించవలసివస్తుందని హెచ్చరించడంతో మైసూర్ గెజిటీర్ లో తనకు ఆ ఆధారం దొరికిందని హరిప్రసాద్ శాస్త్రి చిన్న ఉత్తరం రాసి ఊరుకున్నాడు, మైసూర్ గెజెటీర్ లో ఎంత వెదికినా పాండేకు ఆ ఆధారం కనిపించలేదు.

మరిన్ని విశేషాల కోసం పుస్తకం చూడగలరు.

(భాస్కరం కల్లూరి  ఫేస్ బుక్ పేజ్ నుంచి )
...................................................................................................................................

యార్లగడ్డ నిర్మలగారు రచించిన 'టిపు సుల్తాన్-తలవంచని వీరుడు' అనే పుస్తకంపై 
నిన్నటి నా పోస్ట్ పై వచ్చిన కొన్నిస్పందనలు చూశాక, ఆ పుస్తకం గురించి తప్పుడు సందేశాలు వెళ్ళే ప్రమాదాన్ని గమనించాను కనుక ఇప్పుడు మరోసారి దాని గురించి రాయవలసివస్తోంది:

1. 160 పేజీలు, 14 అధ్యాయాలు, 12 పుస్తకాల గ్రంథసూచి ఉన్న ఈ పుస్తకంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మార్కెట్లో ఉన్న పుస్తకంలోని అన్ని విషయాలనూ ఏకరవు పెట్టడం భావ్యం కాదు కనుక కొన్నింటికే పరిమితమయ్యాను.

2. ముందుగా చెప్పుకోవలసింది ఇందులోని ఇతివృత్తంపై రచయిత్రి అనుసరించిన దృక్పథం, లేదా ప్రణాళిక. ఆమె పరిచయంలో ఇలా రాశారు: 'కాశ్మీర్ విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసిన మోహిబ్బుల్ హసన్ 1951లో 'హిస్టరీ ఆఫ్ టిపు సుల్తాన్' అనే పుస్తకం వ్రాసారు. ఈయన దేశవిదేశాల్లోని టిపు, ఇంగ్లీష్ , తూర్పు ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ, గోవాలోని పోర్చుగీస్ వారికి చెందిన ఇంగ్లీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, కన్నడ, మరాఠీ, పర్షియన్ రచనలను, అనేక ప్రభుత్వపత్రాలను క్షుణ్ణంగా పరిశోధించి టిపు చరిత్రను గురించిన వాస్తవాలను తన పుస్తకంలో పొందుపరిచారు. 1967లో సుబ్బరాయగుప్తా రచించిన 'న్యూ లైట్ ఆన్ టిపు సుల్తాన్', 1970లో డెనిస్ ఫారెస్ట్ రచన 'టైగర్ ఆఫ్ మైసూర్ అండ్ ద లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టిపు' వంటి పుస్తకాలు టిపు చరిత్రను వాస్తవికదృక్పథంతో పరిశీలించాయి. మోహిబ్బుల్ హసన్ టిపును క్రూర నియంత, ఇస్లాం మతోన్మాది అనడం ఎంత అసమంజసమో, టిపును భారత జాతీయవాది, భారతదేశ మొదటి స్వతంత్ర సమరయోధుడు అనడం కూడా అంతే అసమంజసం అని తేల్చి చెప్పారు. టిపు బలాన్ని, బలహీనతలను, గెలుపు ఓటములను బేరీజు వేశారు. 1951లో ప్రచురించిన ఈ పుస్తకం 2013లో కూడా పునర్ముద్రణ కావడం విశేషం.

3. నేను చూసినంతవరకు రచయిత్రి 'సెక్యులర్', 'దేశభక్తి', 'దేశభక్తుడు' లాంటి మాటలు వాడలేదు. ఈ మాటలు ఈ కాలపు నిర్దిష్టార్థంలో వాడుతున్న మాటలు. గతానికి వర్తించేటప్పుడు జాగ్రత్త వహించాలి. రచయిత్రి మోహిబ్బుల్ హసన్ వాడిన జాతీయవాది అనే మాటను ఉపయోగిస్తూనే దానిని టిపు సుల్తాన్ కు వర్తింపజేయడం అసమంజసం అన్న హసన్ అభిప్రాయాన్నీ ఉటంకించారు. అలాగే క్రూర నియంత, మతోన్మాది అనడం కూడా అసమంజసమే అన్న హసన్ అభిప్రాయాన్ని కూడా ఉటంకించారు. టిపును క్రూర నియంత అనడానికి వస్తే, "ఆ కాలంలో ప్రజాస్వామ్యం లేదు. రాజులందరూ నిరంకుశులే"నని ఆమె అంటారు. అలాగే మతంపట్ల విశ్వాసం, నిబద్ధత, మతాచారణ అనేవి కూడా రాజులందరిలోనూ ఉన్నవే. "వ్యక్తిగతంగా టిపు ఒక నిబద్ధుడైన ముస్లిం. కానీ ఒక పాలకుడిగా మతవిషయాల్లో ఎంతో లౌక్యాన్ని, పరిణతిని ప్రదర్శించా"డని రచయిత్రి అంటారు. 'సెక్యులర్' అని వాడకుండా 'మతసామరస్యం' అనే మాటను వాడడంలో కాలికమైన స్పృహను ఆమె పాటించారు. పాలకునికి సొంత మతంపట్ల అభిమానం, ఆచరణ ఉండవచ్చు. వాటిని బహిరంగంగా ప్రకటించుకోవచ్చు. కొందరిలో అది ఉన్మాదం స్థాయికి ప్రకోపించడాన్నీ, మత మార్పిడులకు పాల్పడడాన్నీ కాదనలేం. అదే సమయంలో పాలకునిగా మతసహనాన్ని, సామరస్యాన్ని పాటించకతప్పదు. శివాజీ తుల్జాభవాని భక్తుడు. అయినా ఆయన సైన్యంలో ముస్లింలు కూడా ఉన్నారు..కనుక నియంత అన్నప్పుడుగానీ, మతవాది లేదా మతోన్మాది అన్నప్పుడు గానీ కేవలం టిపును మాత్రమే వేలెత్తిచూపడం నిష్పాక్షికత అనిపించుకోదు.

4. టిపు విషయంలో రెండో వైపు చూడకుండా ఆయనను ఒక క్రూరనియంతగా, మతోన్మాదిగా ప్రపంచం ముందు నిలపడం ఆంగ్లేయులకు అప్పటి రాజకీయ అవసరం అంటారు రచయిత్రి. అదే అవసరం ఇప్పుడు కొందరిచేత అదే పని చేయిస్తోందంటారు. టిపు మత మార్పిడులు చేయించిన సంగతిని చెబుతూనే అతనికి గల మరో పార్స్వాన్నీ చూపించారు. టిపు శృంగేరి మఠం పునరుద్ధరణకు సాయపడడమే కాక గురువాయూరు సహా అనేక దేవాలయాలకు ఎలా ఆస్తులు, ఆభరణాలు సమకూర్చాడో, కొన్ని హిందువుల విశ్వాసాలను ఎలా పాటించేవాడో, ఒడయార్ రాజుల ఆనవాయితీని పాటిస్తూ ఉదయమే రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఎలా అల్పాహారం తీసుకునేవాడో కూడా ఆమె రాశారు.

5. పేష్వాలు హిందువులైనా శృంగేరి మఠం మీద దాడి చేసి దోచుకున్నారు, మతం అడ్డురాలేదు. టిపు తమలానే ముస్లిం అయినా హిందువులైన పేష్వాలతో, ఆంగ్లేయులతో కలసి నిజాం, టిపుతో యుద్ధం చేశాడు. మతం అడ్డు రాలేదు. వీటిని ఆ కాలానికి పరిమితం చేయకుండా ఈ కాలానికి తీసుకొస్తే అభాసుపాలు కాకుండా ఎవరూ మిగలరు.నేటి 'దేశభక్తి', 'దేశద్రోహం' కొలమానంతో చూడాల్సి వచ్చినప్పుడు టిపుతోపాటు పేష్వాలూ వస్తారు, నిజాములూ వస్తారు. ఎవరూ మిగలరు.

6. సారాంశం ఏమిటంటే, చారిత్రకవ్యక్తులు ఎవరి గురించి అయినా రెండు పక్కలా చూద్దాం. సత్యం ప్రకృతి, అసత్యం వికృతి. ప్రకృతిని కాపాడుకుందాం. చరిత్రను మనం రక్షిస్తే చరిత్ర మనల్ని రక్షిస్తుంది.



Wednesday, March 11, 2020

విశాఖపట్నం లో కూడా దళిత్ పాంథర్స్ చరిత్ర పుస్తకావిష్కరణ సభ మార్చ్ 14 శనివారం నాడు !


*దళిత పాంథర్స్ చరిత్ర* 
_పుస్తకావిష్కరణ సభ_

*తేదీ* :14 మార్చి 2020 శనివారం,
*సమయం* :సాయంత్రం 05:00
*స్థలం* : లైబ్రరీ హాల్ *అంబేద్కర్ భవన్*
బుల్లయ్య కాలేజీ ప్రక్కన
*విశాఖపట్నం.*


_పుస్తకావిష్కరణ సభలో పాల్గొనే ప్రముఖులు:_

• *జె వి పవార్*
"దళిత పాంథర్స్ చరిత్ర "_ పుస్తక రచయిత

• *గీతా రామస్వామి*
హైదరాబాద్ బుక్ ట్రస్ట్, వ్యవస్థాపక సభ్యురాలు

• *వి రాఘవేంద్ర రావు*
ప్రముఖ అంబేడ్కరీయులు, విశాఖ

• *డాక్టర్ కె పి వి ప్రసాద్ రావు*
ప్రముఖ అంబేడ్కరీయులు, విశాఖ

• *డాక్టర్ దుప్పల రవికుమార్*
బహుజన రచయిత, శ్రీకాకుళం

• *యింటి గురుమూర్తి*
అధ్యక్షులు‌, అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, విశాఖపట్నం

( ఖచ్చితంగా సమయం పాటించాలని మనవి )

నిర్వహణ : *భీమ్ సేన, విశాఖపట్నం*



గమనిక :
హైదరాబాద్ బంజారా హిల్స్ 'లామకాన్' లో మార్చ్ 15 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ పుస్తకావిష్కరణ సభ, రచయిత తో ముఖాముఖి యదావిధిగా వుంటుంది. 

Tuesday, March 10, 2020

అనుభవాల వంతెన – కొండపల్లి కోటేశ్వరమ్మ అరణ్య కృష్ణ


అనుభవాల వంతెన – కొండపల్లి కోటేశ్వరమ్మ
అరణ్య కృష్ణ  
(కొలిమి - ప్రత్యామ్నాయ కళా సాహిత్య సంస్కృతిక వేదిక)

కొండపల్లి కోటేశ్వరమ్మ! జీవితం ఆమెకిచ్చినంత అనుభవం, జ్ఞాపకాలు మరొకరి ఎవరి జీవితమూ అంతటి జీవితానుభవం, జ్ఞాపకాలు ఇచ్చి వుండదు. కొండపల్లి సీతారామయ్య భార్యగా కంటే ఆమె గురించి చెప్పాల్సిందే ఎక్కువగా వుంది.

ఆమె నిండు నూరేళ్లు జీవించిన పరిపూర్ణమైన మనిషి. ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లల్లో ఈసడించబడ్డ, జాలి చూపించబడ్డ పుత్తడిబొమ్మ
పూర్ణమ్మలాంటి బాల వితంతువు.
చిన్న వయసులోనే గాంధిగారి జోలెలో బంగారు నగలు వేసిన పెద్ద మనసుగల చిన్నారి.
ఆదర్శ వివాహం చేసుకున్న సంస్కరణాభిలాషి. భర్త ఆశయాల వల్ల ప్రభావితమై చేదోడువాదోడుగా వుండటమే కాక తానూ మానసికంగా అభివృద్ధి చెందిన ఉన్నత హృదయామయి.
స్వాతంత్ర్య సమర యోధురాలు.
కష్టకాలంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. ఎన్నో వందల గ్రామాల్లో పాటలు పాడి బుర్రకథలు చెప్పిన “ప్రజా నాట్యమండలి” కళాకారిణి.
తెలంగాణ సాయిధ పోరాటానికి వెన్ను దన్నుగా నిలిచి అనేక సంవత్సరాలు అజ్ఞాతంలో పనిచేసిన వీరనారి.
సాయుధపోరాటంలో ఆయుధాలు స్మగ్లింగ్ చేసి డెన్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సాహసి.
ప్రజా జీవితంలో కేసులు ఎదుర్కొన్న నిందితురాలు.
జైలు జీవితం గడిపొచ్చిన ఖైదీ.
ఏ సహచరుడైతే తనని ప్రేరేపించి ఉద్యమంలోకి తీసుకొచ్చాడో అదే భర్త నిరాదరణకు గురై అల్లాడిపోయిన స్త్రీ.
పిల్లల బాగోగుల కోసం వాళ్లకే దూరమై పోయి ఒంటరితనపు శిక్షను అనుభవించిన ఓ నిరపరాధ తల్లి.
తన ఒక బిడ్డని లాటిన్ అమెరికన్ ప్రభుత్వాల తరహాలో రాజ్యమే మాయం చేసి “రైలు పట్టాల మీది మృతదేహం మీది దుస్తులు నీ కొడుకువేనా? అని అడిగితే వణికిపోయిన తల్లడిల్లిన మాతృమూర్తి.
మరో బిడ్డ చనిపోయిన తన భర్త ప్రేమని మరిచిపోలేక ఒక చిన్న ఉత్తరంలో తన తల్లికి క్షమాపణలు చెబుతూ ఈ లోకం విడిచి వెళ్లిపోతే కుదేలైపోయిన పిచ్చి తల్లి.
ఆస్తిపాస్తులన్నీ ప్రజలకి పార్టీకి అంకితం చేసిన కారణంగా భర్త సహచరుడు వదిలి వెళ్లిపోయాక పొట్ట గడవటం కోసం ఏదో వుమన్స్ హోంలో తలదాచుకున్న అందరూ వున్న అనాథ.
బతుకు తెరువుకోసం అమ్మాయిల హాస్టళ్లలో వార్డెన్ గా పని చేసిన ఉద్యోగస్తురాలు.
వృద్ధాశ్రమంలో చేరి తనలాంటి వృద్ధులకు సేవ చేసిన దయామయి.

ఆమె తన మనవరాలి దగ్గర బతికిన చివరి రోజులు మినహాయిస్తే మొత్తం జీవితం అంతా దుఃఖ సన్నివేశాల పరంపర.
అతి తక్కువ పుస్తకాలు మాత్రమే పఠితుల కంటి కొసల్లో కన్నీటి చుక్కలవుతుంటాయి. పాఠకుల గుండెల్ల్లో ప్రమిదెల్లా వెలుగుతుంటాయి. నాకు సంబంధించినంత వరకు స్పార్టకస్, ఏడుతరాలు, ఒక తల్లి వంటి పుస్తకాల జాబితాలో కొండపల్లి కోటేశ్వరమ్మగారి ఆత్మ కథ “నిర్జన వారధి” చేరుతుంది. మనవి కాని అంతర్జాతీయ సమాజాల్ని ప్రతిఫలించిన సాహిత్యాలే గొప్పవి అనుకోవటం పొరబాటు. మన భాషల్లో కూడా అంతర్జాతీయ సాహిత్యం వస్తుంది. కాకపోతే మనం వాటిని అంతర్జాతీయం చేయలేక పోతుంటాం. వాటిలో “నిర్జన వారధి” ఒకటి.

ఏమున్నది ఈ పుస్తకంలో?
ఆమె ఏదో మామూలు మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, తల్లిదండ్రులు కట్టపెట్టిన కుర్రాడిని చేసుకొని, ఒక నలుగురైదుగురు పిల్లల్ని కనేసి, తల్లిగా, ఇల్లాలిగా తన బాధ్యతల్ని నిర్వర్తించి, భర్త ఒడిలో కనుమూసే సాధారణ మహిళ ఆత్మ కథ కాదు ఇది. తన కాలపు సమాజంలో జరుగుతున్న అన్ని రకాల మానవ సంబంధాలు, ఆర్ధిక సంబంధాలు, సామాజిక సంబంధాలకు సంబంధించిన సాంస్కృతిక, సామాజిక ఘర్షణలన్నింటినీ స్వీకరిస్తూ, వాటిని ఢీకొంటూ, పడుతూ, లేస్తూ, దిగ్భ్రాంతికి గురవుతూ, దుఃఖిస్తూ, ఎదురు తిరుగుతూ, ఒక్కోసారి మౌనంగా ఉండిపోతూ, కొన్నిసార్లు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ… మొత్తం మీద తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ బతికిన కొండపల్లి కోటేశ్వరమ్మ జీవితముంది ఈ పుస్తకంలో.

నిజానికి ఏ ఆత్మ కథ అయినా అది సమకాలీన సమాజ చరిత్ర. అప్పటి సమాజంలో ఘర్షించే శక్తుల చరిత్ర. మనుషులు, వారి వ్యక్తిత్వాలు, ప్రవర్తనల్ని ప్రభావితం చేసే వర్తమాన చారిత్ర కథనం. అది చెప్పకుంటే గుళ్లో పురాణ కాలక్షేపానికో లేక టీవీ సీరియల్ చూడటానికో పరిమితమయ్యే అనుభవంతో సమానం అలాంటి పొడి పొడి మాటల ఆత్మకథల్ని చదవటం. శ్రీశ్రీ “అనంతం” చదవండి మీరు ఆ నాటి సమాజంలోకి వెళ్లి పోతారు.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య నలిగిపోయిన దందహ్యమాన మూడు నాలుగు దశకాల నాటి సమాజంలో మీరు కొట్టుకుపోతారు. సమాజంతో ఆత్మ కథకులు ఎంతగా పెనవేసుకుపోతే అంతగా సమాజం ఆ ఆత్మకథలో ప్రతిఫలిస్తుంటుంది. అప్పుడు వ్యక్తి జీవితం ఆ సమాజానికి అద్దం అవుతుంది.
ఆ అద్దంలో మనం అక్షరాల్ని చూడం. ఆ కాలపు జీవితాల్ని చూస్తాం.

అగ్రశ్రేణి భారత విప్లవ నాయకుడు కొండపల్లి సీతారామయ్య భార్యగానే కొండపల్లి కోటేశ్వరమ్మ ఎంతోమందికి తెలుసు. కానీ ఒక ఉద్యమకారిణిగా ఆమె చాలా తక్కువమందికి తెలుసు. తన ఎదుగుదలలో సహచరుడి పాత్రని అంగీకరించిన ఆమె నిజానికి తన సహచరుడి విప్లవ రాజకీయ ఆచరణలో, ఎదుగుదలలో తన పాత్రని కూడా ఈ పుస్తకంలో వివరిస్తారు. ఆమె సహకారం లేని యువ విప్లవ సీతారామయ్య లేడు. ఏవో విభేదాలొచ్చి
విడిపోయినప్పటికీ ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఆమె సీతారామయ్యలోని సమానత్వ దృక్పథాన్ని, సాహస తత్వాన్ని, సామాజిక నిబద్ధతని,త్యాగ నిరతిని కొంచెం కూడా తక్కువ చేసి చూపకుండా ఎంతో నిజాయితీగా రాస్తారు. ఎక్కడా ఆయన పట్ల అగౌరవాన్ని కానీ, కించపరుస్తూ మాట్లాడటం కానీ ఆమె చేయరు. తన మీద ఆయన ప్రభావాన్ని వివరంగా రాస్తారు. కులం, సామాజిక కట్టుబాట్లని, వ్యక్తిగత ఆస్తిని ధిక్కరించిన సీతారామయ్యని గొప్పగా అభిమానిస్తారు.

ఆమెలో నిష్కర్షతో కూడిన సహజ పరిశీలనా శక్తి వుంది. కులం, జెండర్ కి సంబంధించిన వివక్షల గురించి చాలా చిన్న వయసులోనే ఆమె గమనిస్తారు. తనని శూద్రకులానికి చెందిన వ్యక్తిగా గుర్తించినప్పుడు ఎంతటి అవమానాన్ని పొందారో, మేని చాయ కారణంగా బ్రాహ్మణ స్త్రీగా తనకి మర్యాదలు ఇచ్చినప్పుడూ అంతే నిష్కర్షగా తిరస్కరిస్తారు. కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుల్లోని కుల కోణం ఆమెని హతాశురాలిని చేస్తుంది.

అలాగే కమ్యూనిస్టు భర్తల్లోని జెండర్ వెనుకబాటుతనం, పితృస్వామిక ప్రవర్తనని కూడా బైత పెడతారు. వ్యక్తుల్ని అంచనా వేయటంలో వారి బలాబలాలు గమనిస్తుంటారు. ఈ నిష్కర్ష దృక్పథం లేకుంటే సాంస్కృతికంగా వెనుకబడి పోవలిసిందే కదా!

కమ్యూనిస్టు పార్టీల చరిత్రంటే ఉద్యమాల చరిత్రే కాదు చీలికల చరిత్ర కూడా! నాయకత్వపు అహాల, మూర్ఖపు పట్టుల చరిత్ర కూడా. అప్పటి దాకా ప్రబలంగా వుండి కలిసి మెలిసి తిరిగిన కామ్రెడరీ అంతా ఎక్కడికి పోతుందోనని ఆశ్చర్యపోతుంటారు. ఒక్కసారి మొదలైన విభేదాలు శతృత్వాలకు దారి తీయటం ఆమెని నిర్ఘాంతపోయేలా చేస్తుంది. ఈ విషయంలో పురుష కామ్రేడ్స్ కంటే మహిళా కామ్రేడ్స్ మానవీయ కోణమో మసులుకుంటారని ఆమె చెప్పకనే చెబుతారు. బహుశా అది నిజం కావొచ్చేమో అనిపిస్తుంది. పార్టీల చీలికల గురించి తన ఆత్మకథలో ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. బహుశా భారతదేశంలో విప్లవం రాకపోవటానికి శత్రువు బలం కంటే అతి ముఖ్య కారణం కమ్యూనిస్టులు ఐక్యంగా వుండలేని బలహీనతే ప్రధానం కావొచ్చేమో.

తల్లిదండ్రులు, అత్త మామలు, భర్త పిల్లలు, సోదరుడు, అశేష సంఖ్యలో స్నేహిత కామ్రేడ్స్ వున్నప్పటికీ ఒక్క తల్లి తప్పితే ఆమె తనతో వున్నారని లేదా వుంటారని నమ్ముకున్న వారెవ్వరూ లేకపోవటం కనిపిస్తుంది. ఆమెకి భరోసగా వున్న మానవ సంబంధం ఏమైనా వున్నదంటే అది తల్లితో మాత్రమే. కోటేశ్వరమ్మ తనకున్న ప్రతి మానవసంబంధాన్ని ఎంతో గౌరవించారు. ఆమెకి భారతదేశపు అగ్రశ్రేణి కమ్యూనిస్టు నాయకుల నుండి గ్రామ
స్థాయి వరకు బలమైన పరిచయాలున్నాయి. ఇందులో ఆమె తన తండ్రిలా భావించే సుందరయ్య, రాజేశ్వర్రావు నుండి తాను పెద్దబ్బాయిగా పిలుచుకునే రాఘవరావు వరకు వున్నారు. ఎన్ని సెంటిమెంట్స్ వున్నా, ఎన్ని మానవసంబంధాలున్నా ఆమె జీవితంలో ఒంటరితాన్నే ఎక్కువగా ఫీలయ్యారు. మొత్తం మీద జీవితం అంటే ఒక పెద్ద నిర్వేద ప్రయాణమనే భావనకి ఎన్నోసార్లు గురయ్యారు ఆమె.

ఆమె రాసే విధానం కూడా చాలా సరళంగా, సూటీగా వుంటుంది. చెప్పే విధానంలో గొప్ప నిజాయితీ కనబడుతుంది. మనుషుల అల్ప బుద్ధుల్ని అర్ధం చేసుకోవటంలో, ఆచరించే ఉన్నత విలువల్ని మెచ్చుకోవటంలో ఆమె దృష్టి కోణం నిశితమైనది. ఒకే సమయంలో, ఒకే సమాజంలో మనుగడ సాగించే సామాజిక వైరుధ్యాలతో మనుషులందరూ సంఘం చెక్కిన శిల్పాలుగా కనబడుతుంటారు ఆమె చెప్పే విధానం చూస్తే. ఇందులో మనసుని హృద్య పరిచే సందర్భాలతో పాటు హృదయాన్ని కలిచివేసే సంఘటనలెన్నో వున్నాయి. ఇది మనుషుల కోసం, ఒక మంచి సమాజం కోసం పరితపించిన ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాదు. ఇది గత శతాబ్దపు ముఖ్య కాలానికి చెందిన సమాజం, అందులో భాగమైన మనుషుల చరిత్ర.

కమ్యూనిస్టు మహిళా ఉద్యమకారుల తొలితరానికి చెందిన కొండపల్లి కోటేశ్వరమ్మగారు తన జీవితాన్ని ఒక “నిర్జన వారధి”గా చెప్పుకున్నారు కానీ నిజానికి అది తనకి సమాజానికి మధ్యన ఒక అనుభవాల వంతెన! అసలు నిష్కర్షగా చెప్పుకోవాలంటే ఈ సమాజమే ఒక నిర్జన వారధి. ఇక్కడ మనిషికి మనిషీ మధ్య మానవ సంబంధమే సరిగ్గా లేదు. మన సమాజం మనుషుల మధ్య మానవీయ వారధి కావాలని కోరుకుంటూ అందుకు
కృషి చేయటమే కోటేశ్వరమ్మగారికి మనం ఇచ్చే నివాళి!

(“నిర్జన వారధి” కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మ కథ. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ. వెల 150 రూపాయిలు)


- అరణ్య కృష్ణ
"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  
సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

(కొలిమి - ప్రత్యామ్నాయ కళా సాహిత్య సంస్కృతిక వేదిక సౌజన్యం తో )


https://kolimi.org

Friday, March 6, 2020

“దళిత్ పాంథర్స్ చరిత్ర” రచయిత తో ముఖా ముఖి :




అంబేడ్కర్‌ పేరు ఆ రోజే నా మనసులో బలంగా నాటుకుంది
.................................................................................
(జె.వి. పవార్‌ ఏడుపదులు దాటిన వయసులో కూడా ఇప్పటికీ ప్రతిరోజూ ముంబయిలోని బోరివలీ ప్రాంతం నుంచి చర్చిగేటు వరకూ వెళ్ళి అంబేడ్కరిస్ట్‌ / దళిత ఉద్యమ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటుంటారు. విప్లవాత్మక కుల వ్యతిరేక ఉద్యమంలో, దళిత్‌ పాంథర్స్‌ వ్యవస్థాపకులలో ఒకరిగా ఆయనకు మహరాష్ట్రలో మంచి గుర్తింపు ఉంది. ఆయన 40 కి పైగా పుస్తకాలను రాశారు. మహరాష్ట్ర అంబేడ్కరిస్ట్‌ ప్రపంచంలో జరిగిన అన్ని సంఘటలు, సంఘర్షణలు, పోరాటాలు విజయాలు అన్నింటిలో ఆయన అంతర్గత భాగస్వామి. ముంబయి మిర్రర్‌ పత్రిక సంపాదకురాలు మీనల్‌ బఘేల్‌ 2019 సెప్టెంబర్‌లో జరిపిన ఈ ఇంటర్వ్యూలో ` మారుమూల పల్లెనుంచి ముంబయికి తండ్రితోపాటు వలస వచ్చిన ఓ పదేళ్ళలోపు బాలుడు దళిత్‌ పాంథర్స్‌ సహ వ్యవస్థాపకుడిగా ఎదిగిన క్రమాన్ని చూడవచ్చు)
...............................................
మీనల్‌ బఘేల్‌:”జె.వి. అంటే ఏమిటి?
జె.వి. పవార్‌ :జయరాం విఠల్‌. నా పూర్తిపేరు జయరాం విఠల్‌ పవార్‌. కోర్టు ఆవరణలో తప్ప ఈ పేరు ఎక్కడా వినిపించదు. అందరికీ నేను జె.వి. పవార్‌గానే తెలుసు. కొందరు మిత్రులు నన్ను జె.వి. అని సంబోధిస్తుంటారు.
మీనల్‌ :మీ బాల్యం గురించి వివరిస్తారా?
జె.వి     :మాది రత్నగిరి జిల్లా, చిప్లున్‌ తాలూకాలోని ఓ మారుమూల పల్లెటూరు. నాలుగవ తరగతి వరకు నేను మా వూళ్లోనే చదువుకున్నాను. మా అమ్మ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు విన్నదో లేదో నాకు తెలియదు కానీ నా చదువు విషయంలో మాత్రం చాలా పట్టుదలగా వుండేది. నన్ను విడిచి వుండడం తనకి కష్టం అనిపించినా పై చదువు కోసం నన్ను మా నాన్నతో పాటు ముంబయికి పంపించింది. ఆ రోజుల్లో మా ఊరికి సరైన ప్రయాణ సౌకర్యాలే వుండేవి కావు. నేను పడవలో ప్రయాణించి ముంబయి చేరుకున్నాను. మొట్టమొదటిసారి ఈ మహా నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా ఊళ్లో అన్నీ గుడిసె వంటి ఇళ్లే. ఒకటి కంటే ఎక్కువ అంతస్తుల ఇళ్ళు వుంటాయనే తెలియదు. ముంబయిలో మా గది రెండో అంతస్తులో వుండేది. మేం వచ్చింది వర్షాకాంలో. రోడ్డు మీద ఒక ట్రాఫిక్‌ పోలీసు జనం మీద అరుస్తుంటే చూసి వణికి పోయాను. అతను నన్ను కూడా గదమాయిస్తాడేమో, కొడతాడేమో అని భయపడ్డాను. అప్పుడు నేను చాలా భయస్తుడిని.
మీనల్‌ :అప్పటి వరకు మీరు రెండంతస్తుల ఇంటినే చూడలేదా?
జె.వి.    :లేదు. ఒక ఇంటి మీద మరో ఇల్లు వుంటుందన్న విషయమే నాకు తెలియదు. పై అంతస్తు నుంచి కింద పడిపోతానేమో అని ఎప్పుడూ భయంగా వుండేది. మా ఊళ్లో అన్నీ గుడిసెలే కదా.

మీనల్‌ :ముంబైలో మీ ఇల్లు ఎక్కడుండేది?
జె.వి     :దోఖీ తలావొ, ఫస్ట్‌ క్రాస్‌ లేన్‌, మెట్రో సినిమా థియేటర్‌ దగ్గర మా గదిలో 20-25 మంది వుండేవాళ్ళు. అందరికీ కలిపి ఒకావిడ వంట చేసి పెడుతుండేది. అందరూ గ్రామాల్లోంచి వచ్చినవాళ్ళే. అంటే అందరూ పేయింగ్‌ గెస్టులే అన్నమాట. మా నాన్న, తమ్ముడు, నేను వుండేవాళ్ళం.
మీనల్‌  :ఒక్క గదిలో 25 మందా!
జె.వి     :అవును. 8 బై 10 అడుగుల గది. మా అందరికీ అది ఏమాత్రం సరిపోయేది కాదు. అందుకని రాత్రుళ్ళు దుప్పటి తీసుకుని వెళ్ళి వీధిలో పడుకునే వాణ్ని.
మీనల్‌ :వీధిలోనా!
జె.వి     :అవును దోఖీ తలావో వీధిలో. అక్కడ ఒక మసీదు. దాని పక్కన ఒక పెద్ద చెట్టూ వుండేవి. అక్కడ పడుకునే వాళ్ళం.

మీనల్‌ :నీతో పాటు ఇంకా ఎవరైనా అక్కడ పడుకునే వాళ్ళా?
జె.వి     :ఆ మా గదిలోంచి మరో పది మంది ఆ చెట్టు కిందే నిద్రపోయే వాళ్ళు. బొంబాయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాళ్ళు తెల్లవారు జామున్నే వచ్చి వీధులను ఊడ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అలా చేయడం లేదు.  ఆ రోజుల్లో నీళ్ళు జల్లి మరీ వీదుల్ని శుభ్రం చేసేవాళ్ళు. అందువల్ల చాలా తెల్లవారు జామున్నే నిద్రలేవాల్సి వచ్చేది. నేను అక్కడి వీధిలైటు కిందే చదువుకునే వాణ్ని. ఆ పక్కన ఒకే ఒక్క మెట్రో సినిమా థియేటర్‌ వుండేది. పూర్తి ఎయిర్‌ కండిషన్‌ థియేటర్‌. అందులో ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. ప్రేక్షకులందరూ కార్లల్లో వచ్చేవాళ్ళు. నా తోటి పిల్లలు అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు కార్లు దిగుతున్నప్పుడు, తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు సెల్యూట్  చేసేవాళ్ళు. తామేదో వారి కార్లకు కాపలా కాసినట్లు ప్రవర్తించేవాళ్ళు. నేను కూడా పిల్లలతో కలిసి వెళ్ళి అలాగే సెల్యూట్ చేస్తుండేవాణ్ని. వాళ్ళు ఒక పైసో రెండు పైసలో ఇస్తుండేవాళ్లు. ఇంగ్లీషు సినిమాలు గంటో గంటన్నరసేపో నడిచేవి. కొందరు ప్రేక్షకు సినిమా నచ్చక మధ్యలోనే థియేటర్‌ లోంచి వచ్చేస్తుండేవాళ్ళు. అందువల్ల మేం ఆ గంట, గంటన్నర సేపు ఆ కార్ల వద్దనే తచ్చాడుతుండేవాళ్ళం. మధ్యలో ఏ అరటి పళ్లో, పల్లీలో అమ్ముకుంటూ వుండేవాళ్ళం. అట్లా రెండు గంటల డ్యూటీ చేస్తే రోజుకు నాలుగైదు అణాల ఆదాయం వచ్చేది. నాకే కాదు నాతోపాటు అలా చేసే 10-15 మంది పిల్లలకు  కూడా రోజుకు నాలుగు నుంచి ఎనిమిది అణాల వరకు ఆదాయం వచ్చేది.
మీనల్‌  :ఆ డబ్బు ఏం చేసేవాడివి?
జెవి      :స్కూల్‌ ఫీజుకు ఉపయోగపడేది. మా నాన్న బెస్ట్‌లో ఫిట్టర్‌గా పనిచేసేవాడు. మాకు ఊళ్లో కొంత అప్పు వుండేది. అందువల్ల మా నాన్న తన జీతంలో ఎక్కువ భాగం అమ్మకు పంపించేవాడు. డబ్బుకు మాకు చాలా ఇబ్బందిగా వుండేది.

మీనల్‌ :జావీ నువ్వు బాంబేకి వచ్చినప్పుడు చిన్న ప్లివాడివి. వీధిలో పడుకునే వాడివి. నీకు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించేది కాదా? బొంబాయిలో నీకు బాగానే అనిపించేదా?
జెవి      :లేదు. పరీక్షలు అయిపోగానే ప్రతి సంవత్సరం ఏప్రిల్‌` మే నెల్లో అమ్మదగ్గరకు వెళ్ళిపోయేవాణ్ని. బొంబాయిలో మేముండే చోటు అంబేడ్కరిస్టులు ఎక్కువగా ఉండే ప్రదేశం. అక్కడ ఎప్పుడూ ఏవో కార్యక్రమాలు జరుగుతుండేవి. నేను చిన్నప్పుడే సమతా సైనిక్‌ దళ్‌లో చేరాను. అంబేడ్కరిస్టు ఉద్యమంలో అది మిలిటరీ పద్ధతిలో పనిచేసే సంస్థ. సభ్యులంతా తెల్ల పాంటు, తెల్ల షర్టు వేసుకునేవాళ్ళు. అందరికంటే నేను పొట్టిగా వుండే వాణ్ని. అందువల్ల నేనే చిన్నారి సైనికుణ్ని అన్నమాట.
మీనల్‌  :అప్పుడు మీ వయసు ఎంతుండేది?
జెవి      :నేను ఐదో తరగతో ఆరో తరగతో చదువుతున్నాను. నేను 1944 లోనో 1945లోనో పుట్టి వుంటాను. పుట్టిన తేదీ కరెక్ట్‌గా తెలియదు. 1944లో బాంబు పడ్డ తర్వాత పుట్టానని మా అమ్మ అంటుండేది. స్కూల్లో నా పుట్టిన రోజు 15 జులై అని నమోదు అయింది. విచిత్రం ఏమిటంటే మా అన్నయ్యది, మా తమ్ముడిది కూడా అదే పుట్టిన రోజుగా నమోదు చేశారు, టీచర్‌.
మీనల్‌ :స్కూల్‌ అడ్మిషన్‌ కోసం అలా చేసివుంటారు కదా?
జెవి      :ఏమో మా అమ్మకూ, మా నాన్నకూ అసలు ఏమీ తెలియదు.

మీనల్‌  :బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును మీరు మొదటిసారి ఎప్పుడు విన్నారు?
జెవి      :మా ఊళ్లో నేను ఎప్పుడూ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు వినలేదు. మా నాన్న బాంబేలో వుంటారు కాబట్టి, అలాగే మా అమ్మ బాంబేకి వచ్చి వెళ్తుండేది కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. మా నాన్న నోటి నుంచి అప్పుడప్పుడు బారిస్టర్‌అన్న పదం వినిపించేది. అంబేడ్కర్‌ బారిస్టర్‌ కాబట్టి ఆయనను బారిస్టర్‌ అనేవాళ్ళు. అందువల్ల మా నాన్న అంబేడ్కర్‌ పేరు విని వుండవచ్చు అనుకుంటాను. నేను మాత్రం స్పష్టంగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు విన్నది 6 డిసెంబర్‌ 1956 నాడు.
మీనల్‌  :అది ఆయన చనిపోయిన రోజు కదా !
జెవి      :అవును, అప్పుడు నేను ఐదవ తరగతిలో వున్నాను. మా జానాబాయి మాధవరావు రోకడే స్కూల్‌ మాండ్వి సమీపంలో కర్నాక్‌ బందర్‌ ప్రాంతంలో వుండేది. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చనిపోయినందువల్ల పాఠశాలకు సెలవు ఇస్తున్నట్టు నోటీసు బోర్డు మీద ప్రకటనను అంటించారు. త్వరగా ఇంటికి వెళ్ళి తోటి పిల్లలతో ఆడుకోవచ్చని నేను తెగ సంబరపడి పోయాను.
మీనల్‌  :ఇంటికి వచ్చాక ఏం జరిగింది?
జెవి      :నేను ఇంటికి చేరుకునే సరికే ఎవరో ఆనాటి సాయంకాల మరాఠీ దినపత్రిక ‘‘మరాఠా’’ను కొనుక్కొచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 కే ఆ పత్రిక బయటికి వచ్చేసింది. మా చుట్టు పక్కల వున్న వాళ్ళలో చాలామంది మా ఊరివాళ్ళే. అందరూ బెస్ట్ లోనే పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో చాలా సులువుగా ఉద్యోగాలు దొరికేవి. నేను ఇంటికి వెళ్ళగానే వాళ్ళు పేపర్‌ని నా చేతిలో పెట్టి చదవమన్నారు.
మీనల్‌  :ఎందుకంటే వాళ్ళకు చదువురాదు అవునా?

జెవి      :అవును. నాకు అప్పుడు అంబేడ్కర్‌ గురించి ఏమీ తెలియదు కాబట్టి ఎలాటి ఉద్వేగం లేకుండా వార్తలను  చదివాను. నేను చదువుతుంటే అందరూ కన్నీళ్ళు పెట్టుకోసాగారు. కొందరైతే భోరుమంటూ విలపించారు. వాళ్ళకు ఏమైందో, ఎందుకలా ఏడుస్తున్నారో నాకు ఏమీ అర్థం కాలేదు. ఈలోగా మరొకరెవరో ‘‘సంధ్యకాల్‌’’ అనే మరో సాయంకాల మరాఠీ దినపత్రికను తెచ్చారు. దానిని చదువుతున్నప్పుడు కూడా అందరూ ఒకటే ఏడవడం. దాంతో ఆ రోజే డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు నా మనసులో బలంగా నాటుకు పోయింది. ఆ రోజు నుంచే ఇతర అంబేడ్కరిస్ట్‌ కార్యకర్తలతో కలసి పనిచేయడం మొదలయింది. అంబేడ్కర్‌ గురించి ఏదో ఒకటి రాయడం కూడా అప్పటినుంచే  ప్రారంభించాను. గత 50 సంవత్సరాలుగా నేను ఏది రాసినా ముందుగా డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు రాసి మొదలు పెడ్తున్నాను. ఏ విషయం గురించి రాసినా ఈ అలవాటును మానలేదు. బహుశా ఈ విషయంలో ఇదొక ప్రపంచ రికార్డు కావచ్చు. అంబేడ్కర్‌ రాజో, చక్రవర్తో కాడు. అయినా నేను ఏం రాసినా ముందుగా ఆయన పేరు రాయడం నాకు అలవాటైపోయింది.
మీనల్‌  :మిమ్మల్ని ఆయన ఇంతగా ఎలా ప్రభావితం చేశారు? ఈనాటి యువతరం అర్థం చేసుకోవడం కోసం కాస్త వివరిస్తారా?
జె.వి     :ఇదిగో ఈ పుస్తకం చూడండి ఒక విధంగా ఇది నా ఆత్మకథ. అయితే ఇది ఒక వ్యక్తి ఆత్మకథ కాదు. ఒక ఉద్యమ ఆత్మకథ. దళిత సమాజం మొత్తం రెక్కలు లేని పక్షిలా వుండేది. దానికి రెక్కలు ఇచ్చింది ఈ మహానుభావుడే!
మీనల్‌  :అద్భుతంగా చెప్పారు.

జెవి      :ఒకప్పుడు దళితులు చక్కటి గొంతుతో పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు పాటలు కాదు, మాట్లాడడానికి కూడ తగరని దళితుల గొంతును నులిమేసింది అగ్రకు వ్యవస్థ. ఆ మహనీయుడే దళితుకు మళ్ళీ ప్రశ్నించే గొంతును ప్రసాదించాడు. ఆయన మనకు చదువుకునే హక్కును, రాయడానికి శక్తిని ఇచ్చాడు. అందువల్లనే ఈనాడు దళితులు చదవగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. అంబేడ్కరే మనకు బలాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. మనం మన ముందు తరాలు, దళిత జాతి మొత్తం ఆ మహానుభావునికి శిరస్సు వంచి నమస్కరించాలి.
మీనల్‌  :మీరు చాలా చిన్న వయసు నుండే రాజకీయ ఉద్యమాల నిర్వహణలో పాలు పంచుకుంటూ వస్తున్నారు. మీ తొలినాళ్ళ అనుభవాలు, మీ పట్ల బొంబాయి, బొంబాయి నగరం పట్ల మీ స్పందన ఏ విధంగా వుండేది?

జెవి      :చూడండి మా నాన్న బెస్ట్ లో  పని చేసేవాడు. అప్పులు ఎక్కువగా వుండటంతో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మా అన్నయ్యకు అప్పుడు ఉద్యోగం లేదు. అందువల్ల నేను పని చేస్తూ చదువుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాను. సరిగ్గా అప్పుడే నేను చదువుకుంటున్న ఠాకూర్‌ ద్వార్‌లోని మరాఠా మందిర్‌ హైస్కూల్‌ వాళ్ళు బీద విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలను ప్రారంభించారు. నేను వెంటనే అందులోకి మారిపోయాను. చదువూ సంపాదనా ఏకకాలంలో సాగించాలన్న సూచన అంబేడ్కర్‌దే కదా.  ఆ పరిస్థితిలో చదువుకన్నా నా సంపాదన చాలా ముఖ్యం. నేను రెండూ చేశాను. పగలు బాంబే టెలిఫోన్స్ లో ఫ్యూన్‌గా పని, రాత్రి స్కూల్‌ చదువు, ఇవికాక మరో రెండు మూడు చిన్న చిన్న పనులు కూడా చేసేవాణ్ని.
మీనల్‌  :అంటే ఎలాంటి పనులు?
జెవి      :పాత్రలు తోమడం, పాత్రలకు కళాయి పెట్టడం మొదలైనవి. అవి తాత్కాలికమైనవి. ఏ రోజు పని చేస్తే ఆ రోజు ఒక అణానో, రెండణాలో లభించేవి. బాంబే టెలిఫోన్‌లో-176 లో ఫ్యూన్‌ ఉద్యోగమే శాశ్వతమైనది. నాకు 18 సం॥ వయసు రాగానే ఆఫీస్‌ ఫ్యూన్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు. అయితే  నాకు అన్నింటి కంటే చదవడం, రాయడం అంటేనే ఎక్కువ ఇష్టం. అంబేడ్కర్‌ అనంతర, అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం గురించి రాయాలన్న అభిలాష బలంగా వుండేది. అంబేడ్కర్‌ ఉద్యమంపై సి.బి. ఖైర్‌మోడ్‌ (చంగ్‌దేవ్‌ భావన్‌రావు ఖైర్‌ మోడ్‌) విస్తృతంగా రాశారు. ఆయన చాలా గొప్ప రచయిత. కానీ ఆయన కూడా అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం గురించి ఏమీ రాయలేదు. నేను రాయడం మొదలుపెట్టగానే అందరూ నన్ను రెండవ ఖైర్‌ మోడ్‌ అనేవారు. అంబేడ్కర్‌ మనవడు ఆనంద్‌ తెల్‌తుంబ్డే నన్ను అంబేడ్కర్‌ అనంతర దళిత ఉద్యమానికి సంబంధించిన ఎన్‌సైక్లోపీడియాగా అభివర్ణించేవారు.
మీనల్‌  :మీరు బాంబే టెలిఫోన్స్‌ లో పనిచేసేప్పుడే రాయడం మొదలుపెట్టారా?
జెవి      :అవును. ఆ ఉద్యోగం నాకు ఎంతో సంతృప్తి నిచ్చేది. వినియోగదార్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ‘176లో పనిచేసే మహిళలు విస్తృతంగా సమాచారం సేకరించేవారు. నేను కూడా అక్కడ విస్తృతంగా పత్రికలు చదివేవాణ్ని. అదంతా నాకు ఎంతో ఉపయోగపడింది. సి.బి. ఖైర్‌మోడ్‌ చనిపోవడంతో ఆయన వదిలేసిన పనిని నేనెందుకు చేయకూడదు అనిపించింది. అంతవరకు ఎవ్వరూ అంబేడ్కర్‌ అనంతర దళిత ఉద్యమంపై రచనలు చేయలేదు. నేను ఒక్కడినే రాశాను.
మీనల్‌  :అప్పటికి మీ చదువు పూర్తయింది కదా?

జెవి      :ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మా రాత్రి హైస్కూల్‌ మొదటి బ్యాచ్‌లో పరీక్ష పాసయింది నేను ఒక్కడినే. మరెవ్వరూ పాస్‌ కాలేదు. ఆ రోజుల్లో చాలామంది విద్యార్థులు ఇంగ్లీషు, మాథ్స్‌ సబ్జెక్టులు తీసుకోకుండా మెట్రిక్యులేషన్‌ పాసయ్యేవారు. నేను బాంబే టెలిఫోన్స్‌లో ఉద్యోగం చేస్తుండేవాణ్ని కాబట్టి కొంత ఇంగ్లీషు వచ్చు, మాథ్స్‌ అంటే కూడ ఆసక్తి వుండేది. అందువల్ల ఆ రెండు సబ్జెక్టులు తీసుకుని మరీ మెట్రిక్యులేషన్‌ పాసయ్యాను. ఆ తర్వాత ఎంప్లాయిమెంట్‌ ఎక్స్‌ఛేంజిలో పేరు రిజిష్టర్‌ చేయించుకున్నాను. ఇక ఇన్‌కమ్‌టాక్స్‌, సేల్స్‌టాక్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇలా అనేక వాటిలో జాబ్‌ లు ఒకదాని వెనుక ఒకటి వచ్చేవి.
మీనల్‌  :మీరు ఇంగ్లీష్‌, మాథ్స్‌ సబ్జెక్టు తీసుకోవడమే అందుకు కారణమా?
జెవి      :అవును ఆ రోజుల్లో కూడా ఉపాధికి, ఎదుగుదలకి ఇంగ్లీష్‌ ఎంతో తోడ్పడేది. బాంబే టెలిఫోన్స్‌లో కూడా ఎల్‌డిసి ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు అక్కడే ఫ్యూన్‌గా, ఆఫీస్‌ ప్యూన్‌గా చేసి వున్నాను కదా. మళ్ళీ అక్కడే ఎందుకు జాబ్‌ చేయకూడదు అనుకున్నాను.

మీనల్‌  :బాంబే టెలిఫోన్స్‌లో మీ ఉద్యోగం ఎలా సాగేది. దళిత ఉద్యమంలో మీ పాత్ర ఎలా మొదయింది?
జెవి      :మేముండే ప్రాంతంలో దాదాపు అందరూ అంబేడ్కరిస్ట్‌లే. వాళ్ళు అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాన్ని నిర్వహించేవారు. నేను వాటిలో పాల్గొనేవాణ్ని. 1964లో ఆనాటి ఎంపి దాదాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో భూమిలేని శ్రామికుల సత్యాగ్రహం జరిగింది. అందులో కూడా పాల్గొన్నాను. కొన్ని గొడవల వల్ల 1964లోనే మా మకాం ధోబీ తలావ్‌ నుంచి కామాటిపురాకు మారింది. అది రెడ్‌లైట్‌ ఏరియా. అక్కడ గూండాయిజం కూడా కొంత ఎక్కువగా వుండేది. అయితే ఆ ప్రాంతంలో అందరికంటే ఎక్కువ చదువుకున్న వాణ్నీ, 9వ తరగతి లోపు పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాణ్నీ గనక అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. 1964లోనే 29వ వార్డులో రిపబ్లికన్‌ పార్టీ విభాగానికి నన్ను అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ పదవికి ఎన్నుకున్నారు. నాకు ఏదో రాజకీయ అనుభవం వుందని కాదు, ముఖ్యమంత్రి తదితరుకు దరఖాస్తు అవీ రాయగలను అని నన్ను తీసుకున్నారు. అలాగే కామాటిపురా యువజన సంఘానికి కూడా! ఒక ఆందోళనలో పాల్గొని మొట్టమొదటిసారి అక్కడే అరెస్టు అయ్యాను.
మీనల్‌  :అప్పుడే అరెస్టు కూడా అయ్యారా?
జెవి      :చాలా పెద్ద ఉద్యమమది. 1964లో జరిగింది. ఉద్యమ కారులను అరెస్టు చేసి జైలులో పెట్టేందుకు చోటు సరిపోలేదు. స్కూళ్లు, సినిమా హాళ్లు, గార్డెన్‌ లు, ప్లే గ్రౌండ్లు అన్నింటినీ జైళ్ళుగా మార్చేశారు. నేను మా ప్రాంత యూనిట్‌కి నాయకత్వం వహించాను. పోలీసులు చుట్టుముట్టి మమ్మల్ని అరెస్టు చేశాం అన్నారు. భారీ ఊరేగింపులు జరిగాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి వున్నారు. ఆయన కూడా నాలాగే పొట్టి కదా. వీధుల్లో పోటెత్తిన జనాన్ని చూసేందుకు టేబుల్‌ మీద కుర్చీ వేయించుకుని దాని మీద నిల బడి జనాన్ని పరిశీలించారట. ఆ వెంటనే ఎవ్వరితో ఏమీ చర్చించకుండానే ఉద్యమకారుల అన్ని డిమాండ్లను ఆమోదిస్తున్నట్టు, వెంటనే ఉద్యమాన్ని విరమించమని ప్రకటన చేశారు. పార్లమెంటు ముందు అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ చేసిన డిమాండ్‌ అప్పటిదే.
మీనల్‌  :అదే మీకు తొలిసారిగా సామాజిక న్యాయ పోరాటాన్ని, రాజకీయ క్రియాశీలతని పరిచయం చేసిందని చెప్పుకోవచ్చా?
జెవి      :అవును.

మీనల్‌  :దళిత్‌ పాంథర్‌ ఉద్యమానికి కూడా ఇదే పునాది వేసిందనుకోవచ్చా? దళిత్‌ పాంథర్‌ ఎలా మొదయింది?
జెవి      :ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక మొత్తం రాజకీయాలే మారిపోయాయి. ఉత్తర భారతంలో కాంగ్రెసేతర ప్రభుత్వా లు అధికారంలోకి రావడం, కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలు వీయడం మొదలయింది అప్పుడే. అదే సమయంలో దళితులపై అత్యాచారాలు పెరిగాయి. కాంగ్రెస్‌కు దళితుల ఓట్లు కావాలి. అందుకే ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా దళితులపై జరిగిన అత్యాచారాలను విచారించి తగిన నివారణా చర్యలను సూచించేందుకు గాను ఇళయ పెరుమాళ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీలో పార్లమెంట్‌ సభ్యుడు దాదాసాహెబ్‌ గైక్వాడ్‌ ఒక్కరే మరాఠీ తెలిసిన సభ్యులు.  ఆ కమిటీ ఐదేళ్ళపాటు దేశమంతా పర్యటించి, వివరాలు సేకరించి 31 జనవరి 1970 న తన నివేదికను సమర్పించింది. దానిని చూసి ప్రభుత్వం అదిరిపోయింది. పార్లమెంటు ముందు పెట్టడానికి జంకింది. కానీ ప్రతిపక్షం బంగా వుండటంతో తప్పనిసరి పరిస్థితిలో మూడు నెలల తరువాత 1970 ఏప్రిల్‌లో పార్లమెంటుకు సమర్పించింది. దిగ్భ్రాంతికరమైన అనేక దారుణాలు అప్పుడే వెలుగు చూశాయి. మేము అలాంటి వాటిపై రచనలు చేస్తున్నాం. నేను బలిదాన్‌ వంటి నమ అప్పటికే రాశాను. ప్రబుద్ధ భారత్‌కు కూడా రచనలు చేశాను. అయితే ఇళయ పెరుమాళ్‌ నివేదిక బయటికి వచ్చాక కేవలం రచనలు చేస్తే సరిపోదు, వీధుల్లోకి వచ్చి క్రియాశీలక పోరాటం చేయాలి అనే ఒత్తిడి ఎక్కువయింది. ఆ నివేదికలో వెలుగు చూసిన దారుణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పన్నెండు మంది రచయితలం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు నాయక్‌కి ఒక రిప్రజెంటేషన్‌ను ఇచ్చాం.
మీనల్‌  :ఎవరు ఆ రచయితలు?
జెవి      :సుప్రసిద్ధ దళిత రచయిత బాబురావు బగుల్‌ మొదట సంతకం చేస్తానని ముందుకొచ్చాడు కానీ ఆ మహజరులోని ఒక వాక్యం చూసి వెనక్కి తగ్గాడు. అదేమిటంటే దళితులపై అత్యాచారాలను గనుక అరికట్టకపోతే, దోషుపపై ప్రభుత్వం గనక కఠిన చర్యలు తీసుకోకపోతే మేము చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోవసి వస్తుందిఅన్నది. ఆయన తప్ప అందరూ అంటే రాజా ఢాలే, నామ్‌దేవ్‌ డసాల్‌, నేనూ  సంతకాలు చేశాం. ముఖ్యమంత్రి వసంతరావు నాయక్‌ని కలిశాం. రచనలు చేస్తే సరిపోదు క్రియాశీల  పోరాటాలు కూడా చేయాలి అని అప్పుడే నిశ్చయించుకున్నాం. అమెరికాలో బ్లాక్‌ పాంథర్లు అలాగే చేసేవారు. వాళ్ళు మొదట ఆఫ్రో అమెరికన్లపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన వివరాలన్నీ సేకరించేవారు. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి పోరాటం మొదలు పెట్టేవారు. వారి నివేదికను చూడగానే ప్రభుత్వం వణికిపోయేది. మేం ముఖ్యమంత్రిని కలవడానికి కొద్దిరోజుల ముందే పరణి జిల్లా బ్రాహ్మణ్‌గావ్‌లో ఇద్దరు మహిళలని వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ సంఘటన జరిగింది.

మీనల్‌  :ఇద్దరు మహిళల్ని బట్టలు విప్పి ఊరేగించారా?
జెవి      :అవును దాహం వేస్తుంటే మంచినీళ్ళ కోసం ఒక బావి దగ్గరకు వెళ్ళడమే వాళ్ళు చేసిన నేరం. వాళ్ళు ఇంకా బావిని ముట్టుకోకముందే ఒకడు పరుగెత్తుకు వచ్చి వాళ్ళమీద దాడి చేశాడు. ఆ తర్వాత వాళ్ళను వివస్త్రలను చేసి ఊరేగించారు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన అంటాడు మీరు బ్రాహ్మణ్‌ గావ్‌కు వెళ్ళి ఆ మహిళను కలిసి జరిగిన సంఘటనపై ఒక నివేదిక ఇవ్వండి అని. నేనూ నామదేవ్‌ డసాల్‌ ముఖ్యమంత్రి ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాం. మీ వెనక పెద్ద పోలీసు యంత్రాంగం వుంది. సిఐడీ లున్నారు. మందీమార్బలం వుంది మీరెందుకు స్వయంగా వెళ్ళి నిజానిజాలు కనుక్కుని చర్యలు తీసుకోరు అని ప్రశ్నించాం. ఆ తర్వాత వడా హస్టల్‌లో జరిగిన దళిత కార్యకర్తల సమావేశంలో బ్రాహ్మణ్‌గావ్‌కు వెళ్ళి ఆ దళిత మహిళల్ని పరామర్శించి వారికి చీరలు పెట్టాని తీర్మానించారు.
మీనల్‌  :ఆ ప్రతిపాదన చేసింది ఎవరు?
జెవి      :యువక్‌ అఘాది అనే దళిత సంస్థకు చెందిన కార్యకర్తలు. అప్పుడు నేనూ, నామదేవ్‌ డసాల్‌ మళ్ళీ గట్టిగా వ్యతిరేకించాం. అప్పటికే దారుణ అవమానానికి గురైన ఆ మహిళల్ని బయటకు తీసుకొచ్చి చీరలు ఇస్తుంటే ` పత్రికవాళ్ళు ఫోటోలు తీసి మళ్ళీ పత్రికల్లో వేయడం ` ఇదంతా అవసరమా అని నామ్‌దేవ్‌ డసాల్‌, నేనూ గట్టిగా వ్యతిరేకించాం.
మీనల్‌  :నామ్‌దేవ్‌ ఢసాల్‌ని మీరు మొదటిసారి ఎప్పుడు కుసుకున్నారు?

జెవి      :దాదర్‌లోని ముంబయి మరాఠీ గ్రంథ సంగ్రహాలయంలో జరిగిన ఒక కవి సమ్మేళనంలో మొదటి సారి అతడిని కలుసుకున్నాను. సుప్రసిద్ధ రచయిత అనంత్‌ కనేకర్‌ ఆ సభకు అధ్యక్షత వహించారు. అప్పుడు నామ్‌దేవ్‌ ఢసాల్‌ చదివిన కవితలు ఉత్తేజభరితంగా వున్నాయి. సభ ముగిశాక నేను 63వ నెంబర్‌ బస్సు ఎక్కాను. కామాటిపూరాకు వెళ్ళే బస్సు అక్కడి నుంచి అదొక్కటే. విచిత్రంగా అతను కూడా ఆ బస్సే ఎక్కాడు. నన్ను చూసి దగ్గరకు వచ్చాడు. ఇద్దరం అవీ ఇవీ మాట్లాడుకుంటూ కామాటిపుర 13వ లేన్‌లో అలెగ్జండ్రా సినిమా వద్ద దిగాం. అక్కడ ఓ హోటల్‌లో కాసేపు టీ తాగుతూ కూచున్నాం. ఇక ఆ రోజు నుంచి అతను తరచూ మా ఇంటికి వచ్చేవాడు.
మీనల్‌  :ఆయన ప్రసంగాలు చాలా పవర్‌ఫుల్‌గా వుండేవి కదా?
జెవి      :ప్రసంగాలే కాదు అతని కవిత్వం కూడా. అప్పటికి నేను మారాఠీలో ఎం.ఎ. చేశాను. అతను ఎనిమిదో తొమ్మిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. అందువల్ల తను రాసిన ప్రతీదీ నాకు చూపించేవాడు. నా అభిప్రాయం అడిగేవాడు. చాలా సింపుల్‌గా వుండేవాడు. కానీ అసాధారణంగా కవిత్వం రాసేవాడు. వాళ్ళది చాలా బీదకుటుంబం అప్పుడతనికి ఏ ఉద్యోగం లేదు. నేనేమో బ్యాంకులో తెల్లచొక్కా ఉద్యోగిగా పనిచేసేవాణ్ని. రోజూ ప్రొద్దున్నే కవితలు పట్టుకుని మా ఇంటికి వచ్చేవాడు. నా భార్య నాష్టా చేసి పెట్టేది. ఆ రోజుల్లో అతను రాత్రుళ్ళు టాక్సీ నడుపుతుండేవాడు.
మీనల్‌  :రాత్రుళ్ళు టాక్సీ నడిపేవాడా!
జెవి      :అవును ఎందుకంటే పగటిపూట టాక్సీ లు  సరిగా అద్దెకు దొరికేవి కాదు.

మీనల్‌  :దళిత్‌ పాంథర్‌ని ఎప్పుడు ఏర్పాటు చేశారు.
జెవి      :బ్రాహ్మణ్‌గావ్‌కు వెళ్ళమన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనను మేము తిరస్కరించాం కదా. ఆ తర్వాత దళితుల పై జరుగుతున్న అత్యాచారాల గురించి కేవలం రచనలు చేయడం కాకుండా ఒక మిలిటెంట్‌ సంస్థను ఏర్పాటు చేసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. అది అజ్ఞాత సంస్థగా వుంటే బాగుంటుందని నేను అన్నాను. అజ్ఞాతంగా ఎందుకు బహిరంగ సంస్థగానే వుండాలని నామదేవ్‌ ఢసాల్‌ అన్నాడు. కామాటిపురా నుంచి చార్నిరోడ్‌కు వెళ్తున్నప్పుడు వీధిలోనే మేం ఆ నిర్ణయం తీసుకున్నాం. పాంథర్స్‌ అనే పేరును అతను సూచించాడు. దళిత్‌ అన్న పేరును నేను ప్రతిపాదించి దళిత్‌ పాంథర్స్‌ అని ఖరారు చేశాం.
మీనల్‌  :ఇదంతా చార్నీరోడ్‌లో నడుస్తూ వెళ్తున్నప్పుడే జరిగిందా?
జెవి      :అవును. అమెరికాలో బ్లాక్‌ పాంథర్స్‌ కూడా అలాగే వీధిలోనే ఆవిర్భవించింది అని ఒక పుస్తకంలో బాబ్‌ సీలే అంటారు. బ్లాక్‌ పాంథర్స్‌ గురించిన విశేషాలను టైమ్‌ మాగజైన్‌లో చదివేవాళ్ళం. రాజా డాలే, నామ్‌దేవ్‌ ఢసాల్‌, నేనూ వాటిని చదువుతూ చర్చించుకునేవాళ్ళం. దళిత్‌ పాంథర్స్‌ స్థాపన గురించి ఒక పత్రికా ప్రకటనను రాసి మొదట నేను, ఆ తర్వాత నామ్‌దేవ్‌ ఢసాల్‌ ఇద్దరం సంతకాలు చేశాం. నేను ఉద్యోగిని, ఢసాల్‌కు ఉద్యోగం లేదు. పగలంతా ఖాళీగా వుంటాడు కాబట్టి దానిని టైప్‌ చేసి అన్ని పత్రికలకు ఇవ్వమని చెప్పాను. జార్జి ఫెర్నాండెజ్‌ ఆఫీస్‌ చార్నీరోడ్డులోనే వుండేది. మేం తరచూ వాళ్ళ ఆఫీసుకు వెళ్ళేవాళ్ళం. ఆయన మా సమావేశాల్లో మాట్లాడేవారు. ఆ రోజు ఢసాల్‌ ఫెర్నాండెజ్‌ వాళ్ళ ఆఫీసుకు వెళ్ళి ఆ పత్రికా ప్రకటనను టైప్‌ చేసి పత్రికలన్నీంటికీ ఇచ్చాడు. 1972 మే చివర్లో ఆ వార్త అన్ని పత్రికల్లో వచ్చింది. అయితే నామ్‌దేవ్‌ ఢసాల్‌ పేరు మొదట, నా పేరు తర్వాత వేశారు. అదీ ప్రారంభం. ఆ తర్వాత దళిత్‌ పాంధర్స్‌ దళితులపై అత్యాచారాు జరిగిన గ్రామాకు వెళ్తూ, పోరాటాలు చేస్తూ విస్తృతంగా జనంలో గుర్తింపును పొందింది. దళిత్‌ పాంథర్‌కు సంబంధించిన వార్త లు పత్రికల్లో మొదటి పేజీలో వచ్చేవి.

మీనల్‌  :         దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో అన్నింటికంటే ప్రధానమైనది ఏది?
జెవి      :వోర్లీ, నయీగావ్‌ అల్లర్లప్పుడు చేసిన పోరాటంతో దళిత్‌ పాంథర్‌కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించింది. ఆర్‌డి భండారే బీహార్‌ గవర్నర్‌గా వెళ్ళిపోవడంతో అక్కడ ఎంపి సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఆ ఉప ఎన్నికలను బహిష్కరించాని దళిత్‌ పాంథర్‌ పిలుపునిచ్చింది. విస్తృతంగా ప్రచారం చేసింది. దళిత్‌ పాంథర్స్‌లో ఐదుగురు ప్రధాన వక్తలు వుండేవారు. నేను సభను ప్రారంభించేవాణ్ని. ఆ తరువాత వరుసగా భాయ్‌ సంగారే, అవినాష్‌ మహతేకర్‌, నామ్‌దేవ్‌ ఢసాల్‌ చివర్న రాజా ఢాలె ఉపన్యసించేవారు. రాజా ఢాలె మంచి వక్త. జాతీయ జెండా గురించిన వివాదాస్పద  వ్యాసంతో అతనికి చాలా పేరు వచ్చింది. అందుకే అతడిని చివరలో ఉపన్యసించాని కోరేవాళ్ళం. ఆ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బారిస్టర్‌ రామారావు ఆదిక్‌ పోటీ చేశారు. ప్రతిపక్షం తరపున  కమ్యూనిస్ట్‌ పార్టీ నేత ఎస్‌.ఎ. డాంగే కూతురు రోజా దేశపాండే నిబడ్డారు. ఆ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. దళిత్‌ పాంథర్స్‌ ప్రభావం వల్లనే అలా జరిగిందని జనం అన్నారు.

మీనల్‌  :జాతీయ జెండా గురించి రాజా ఢాలె ఏం రాశారు?
జెవి      :ఒక దళిత స్త్రీని వివస్త్రను చేసిన వాడికి ఎలాంటి శిక్ష వేయడం లేదు. కానీ  జాతీయ జెండాను అవమానించిన వారిని మాత్రం వెంటనే శిక్షిస్తున్నారు. సినిమా హాళ్ళలో జాతీయ గీతం వేసినప్పుడు లేచి నిబడకపోతే 300 రూపాయలు ఫైన్‌ వేస్తున్నారు. జెండా కూడా ఒక రకంగా బట్ట పీలికే కదా. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం దేనికి అని విమర్శ చేశాడు. అది వివాదాస్పదంగా మారింది. అన్ని పత్రికల్లో మొదటి పేజీ వార్త అయింది. ఆయనను అరెస్టు కూడా చేశారు. అప్పటి నుంచి అతనిని చూడటానికి జనం సభకు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. నిజానికి రాజా ఢాలె కంటే నామ్‌దేవ్‌ ఢసాల్‌ ఉపన్యాసమే సామాన్య జనం భాషలో గొప్పగా సాగేది.
మీనల్‌  :1970 లో, 1980లో ముఖ్యంగా బొంబాయిలో రాజకీయ, సామాజిక ఉద్యమాు పెద్ద ఎత్తున సాగేవి. శివసేన`బాల్‌థాకరే ఎదుగుదల, మిల్లు కార్మికు నేత దత్తాసామంత్‌, అలాగే జార్జి ఫెర్నాండెజ్‌ రైల్వే కార్మికుల సమ్మె, ఇటు దళిత్‌ పాంథర్స్‌... ఆ నాయకులతో మీకు పరిచయాలుండేవా?
జెవి      :శివసేన 1967లో ఏర్పడిరది. అప్పుడు ప్రమోద్‌ నవ్కార్‌, నేనూ నవశక్తికి రచనలు  చేస్తుంటే బాల్‌థాకరే కార్టూన్లు వేసేవాడు. ఆ పత్రిక ఆఫీసు పక్కనే వున్న చిన్న హోటల్ లో ముగ్గురం టీ తాగేవాళ్ళం. కార్టూన్లు వేసే బాల్‌థాకరే ఇంత పెద్ద నాయకుడు అవుతాడని అప్పుడు మాకు తెలియదు. థాకరేతో కంటే ప్రమోద్‌ నవ్కార్‌తోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం వుండేది. మొదట్లో బాల్‌థాకరే ప్రబోధాంకర్‌ కుమారుడిగానే సుప్రసిద్ధుడు. 20 శాతం రాజకీయాలు 80 శాతం సామాజిక ఉద్యమం చేస్తాననే వారు. 1966లో శివాజీ పార్కులో జరిగిన సభకు వచ్చిన అశేష జనాన్ని చూసిన తరువాత తన మనసు మార్చుకున్నాడు. జార్జి ఫెర్నాండెజ్‌, ఎస్‌.ఎ. డాంగే ఆయనను వ్యతిరేకించేవారు.
మీనల్‌  :మీ దళిత్‌ పాంథర్స్ కు కూడా శివసేన అతిపెద్ద ప్రత్యర్థిగా మారింది కదా?

జెవి      :అవును. ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. శివసేన ఏర్పడడానికి ముందు మా వాళ్ళంతా (దళితులు) కాంగ్రెస్‌ పార్టీలో వుండేవాళ్ళు. తమ అభివృద్ధి కోసం బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చేసిన కృషిని మర్చిపోయి కాంగ్రెస్‌ గూటిలో చేరారు. అలాంటి వాళ్ళ రిపబ్లికన్‌ పార్టీ ఉద్యమం వెజిటేరియన్‌ ఉద్యమం. వాళ్ళ తరువాత వచ్చిన మా తరానిది నాన్‌ వెజిటేరియన్‌ ఉద్యమం. కాంగ్రెస్‌ పార్టీ రిపబ్లికన్‌ పార్టీని పూర్తిగా లోబరచుకుంది. శివసేనది కూడా నాన్‌ వెజిటేరియన్‌ ఉద్యమమే. లుంగీ కట్టుకునేవాళ్ళను తరిమికొట్టండి. ఇది చేయండి. అది చేయండి అని వీధి పోరాటాలకు దిగేవారు. దాంతో చాలామంది దళిత యువకులు శివసేన వైపు ఆకర్షితుయ్యారు. అప్పట్లో శివసేనలో శాఖా ప్రముఖ్‌ లు అందరూ దళితులే. లీడర్లు మాత్రం దళితు కారు.
మీనల్‌  :బ్రాహ్మణులు కదా.
జెవి      :అవును. బ్రాహ్మణు లేదా ఇతర అగ్రకులావాళ్ళు అంటే చంద్రసేనియ కాయస్థ ప్రభు కులస్తులు.
మీనల్‌  :ఆ తదనంతరం మీరు ఎప్పుడైనా బాల్‌థాకరేను కలిశారా?
జెవి      :లేదు ఎప్పుడూ కవలేదు. నామ్‌దేవ్‌ ఢసాల్‌ మొదట్లో శివసేనను, బాల్‌ థాకరేనూ తీవ్రంగా విమర్శించేవాడు. కాని ఆ తరువాతి కాంలో ఆయనతో చేతు కలిపాడు.
మీనల్‌  :జార్జి ఫెర్నాండెజ్‌తో మీ సంబంధాలు ఎలా వుండేవి?
జెవి      :ఆయనకు దళిత్‌ పాంథర్స్‌ పట్ల అభిమానం వుండేది. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీకి  బద్ధ వ్యతిరేకి. చార్నీ రోడ్‌లోని వాళ్ళ సమాజ్‌వాది పార్టీ కార్యాయంలో మేం తరచూ కలుసుకునేవాళ్ళం. దళిత్‌ పాంథర్‌ సమావేశాలు వాళ్ళ ఆఫీసులోనే నిర్వహించుకునే వాళ్ళం. చాలాసార్లు ఫెర్నాండెజ్‌ మా సమావేశాల్లో మాట్లాడారు.
మీనల్‌  :ఆయన మీద మీ అభిప్రాయం ఏమిటి?
జెవి      :ఆనాటి జార్జి ఫెర్నాండెజ్‌ గొప్ప పోరాట యోధుడు. డిమెల్లోకు నిజమైన శిష్యుడు. శివసేనకు వ్యతిరేకంగా పోరాడేవాడు. బాల్‌థాకరేకు వ్యతిరేకంగా పోరాడేవాడు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోరాడేవాడు. కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడేవాడు. ఆ తర్వాత ఎలా మారిపోయాడో మీకు తెలుసు. నేను చెప్పనవసరం లేదు.

మీనల్‌  :జెవీ ఒక విషయం చెప్పండి. మీరు అతి చిన్న వయసులో మహరాష్ట్రలోని మారుమూల పల్లెటూరు నుంచి బొంబాయికి వలస వచ్చారు. మీ జీవితమంతా బొంబాయిలో గడిచింది. ‘‘జెవి పవార్‌, బొంబాయి’’ అని రాస్తే చాలు ఉత్తరాలు మీకు అందేంత స్థాయికి ఎదిగారు. ఇక్కడ అనేక ఉద్యమాలను చూశారు. అప్పుడు బొంబాయి ఎలా వుండేది?
జెవి      :బొంబాయి పేద ప్రజల నగరం. ఇక్కడ సంపన్నులు వున్నారు. కానీ వాళ్ళు అల్ప సంఖ్యాకులు. అప్పుడు బొంబాయి లోఒకే ఒక్క 19 అంతస్తుల భవనం వుండేది. ఉషాకిరణ్‌. ఇప్పుడు 60 కంటే ఎక్కువ అంతస్తున్న బిల్డింగులు అనేకం కనిపిస్తాయి. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా బొంబాయికి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుండేది. ఇదొక విశ్వనగరం. అప్పుడు నగరంలో ఎన్నో థియేటర్లుండేవి.  ఇప్పుడు అవన్నీ పోయాయి. వాటి స్థానంలో మాల్స్‌ వచ్చాయి. ఇప్పుడు అంతా మారిపోయింది. ఆనాడు ప్రపంచ వ్యాప్తంగా బొంబాయికి వున్న గొప్ప పేరు ఇప్పుడు లేదు. బొంబాయి ముంబయిగా మారిన తరువాత అన్నీ మారిపోయాయి. ఇప్పుడు అన్ని రకా బొంబాయి గూండాయిజా బొంబాయి కూ నెలవు అయింది. ఇప్పుడు బొంబాయి ఉత్త ముంబయి మాత్రమే.

మీనల్‌  :మీరు జైలుకు వెళ్ళారు. దెబ్బలు తిన్నారు. అజ్ఞాతవాసం చేశారు. జెవీ మీకు ఎప్పుడైనా భయం అనిపించేదా?
జెవి      :ఎప్పుడూ లేదు. భయమన్నది నా జీవితంలోనే లేదు. ఇవాళ్టికి కూడా నాకు భయం అంటే ఏమిటో తెలియదు. పోలీస్‌ డిపార్ట్‌మెంటుతోనైనా, గూండాయిజంతోనైనా ఎప్పుడూ ముఖాముఖి పోరాడాను. మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాను కానీ నా పాత ఫోటోలో చూడండి. తొమ్మిది నెలలు, పది నెలలు  క్షవరం చేయించుకునే వాణ్నే కాదు. అచ్చమైన తిరుగుబాటుదారుగా వుండేవాణ్ని. 1969లో నేనూ నామ్‌దేవ్‌ ఢసాల్‌ కసి ‘‘విద్రోహ్’’ అనే పత్రికను ప్రారంభించాం. అప్పుడు మేము నిజంగా విద్రోహు లమే. (విప్లవకారు లమే).
మీనల్‌  :మీరు రాజకీయంగా క్రియాశీలురైనప్పటి నుంచీ విస్తృతంగా రచనలు చేస్తున్నారు కదా అలాగే నామ్‌దేవ్‌ ఢసాల్‌ కూడా. మీకు ప్రపంచ సాహిత్యంలో మంచి గుర్తింపు వుంది. ఆ రోజుల్లో రాజకీయ క్రియాశీలతలో పత్రిక పాత్ర ఎలా వుండేది?
జెవి      :మీడియాను నేను తప్పు పడతాను. విమర్శిస్తాను. ఎందుకంటే దళిత్‌ పాంథర్స్లో ఎలాంటి గ్రూపిజం లేకపోయినా వున్నట్టు పదే పదే రాసేవారు. ఉద్యమంలో మొదట వాళ్ళే విభేదాలను సృష్టించారు. ప్రత్యేకించి ప్రింట్‌ మీడియా గురించి చెప్తున్నాను. వాళ్ళు తప్పు చేశారు.

మీనల్‌  :మీరూ నామదేవ్‌ ఢసాల్‌ స్నేహితుల్లానే మిగిలిపోయారా?
జెవి      :లేదు. 1975 వరకే అంటే దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించేంత వరకే మేం స్నేహితుల్లా వున్నాం. 26 జూన్‌ 1975 న ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఎమర్జెన్సీ అనంతరం అతను మృణాల్‌ గోరేకు ఎందుకు వ్యతిరేకంగా మారాడో నాకు తెలియదు. జార్జి ఫెర్నాండెజ్‌లాగే ఆమె కూడా దళిత్‌ పాంథర్‌ సానుభూతి పరురాలు. వారితో పాటు బాలచంద్ర ముంగేకర్‌, హుస్సేన్‌ దాల్వాయి అందరూ మా కోసం పోరాడేవాళ్ళు. అలాంటి వారికి నామ్‌దేవ్‌ ఢసాల్‌ ఎందుకు వ్యతిరేకంగా మారాడో తెలియదు. అలాగే ఇందిరాగాంధీని విమర్శించడానికి బదులు పొగడడం మొదలుపెట్టాడు. ప్రియదర్శినీ అంటూ ఓ కవిత కూడా రాశాడు. ఉద్యమ వ్యతిరేక శిబిరంలో చేరిపోయాడు. మమ్మల్ని కలవడమే మానేశాడు. కాకపోతే నా గురించి వాకబు చేస్తుండేవాడు. మా మధ్య వ్యక్తిగత అభిమానం అలాగే వుండేది. కానీ రాజకీయంగా, సామాజికంగా మేం ప్రత్యర్థులమై పోయాం. దళిత్‌ పాంథర్స్లో రాజా ఢాలే గ్రూప్‌, నామ్‌దేవ్‌ ఢసాల్‌ గ్రూప్‌ అని రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. నిజానికి ఒకటే గ్రూపు. కొద్దిమంది వెళ్ళిపోయారు. అంతే. నేను రాజా ఢాలే గ్రూపులోనే అంటే దళిత్‌ పాంథర్స్లోనే కొనసాగాం. ఆ మాట కొస్తే నా వెనక కూడా పదిమంది వున్నారు. నేనూ ఒక గ్రూపును ప్రారంభించవచ్చు. కానీ ‘‘విడిపోతే పడిపోతాం, ఐక్యంగా వుంటేనే ఏమైనా సాధిస్తాం’’ అన్న డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సూచనకు కట్టుబడి వున్నాను. ఇప్పటికీ నేను రామ్‌దాస్‌ ఆఠ్‌వలె (ప్రస్తుతం కేంద్ర మంత్రి)లాగా సొంత కుంపటి పెట్టుకోకుండా ప్రకాష్‌ అంబేడ్కర్‌తో కలసి పనిచేస్తున్నాను.

మీనల్‌  :భారతదేశంలో ఈ గుర్తింపు రాజకీయాలకు (ఐడెంటిటీ పాలిటిక్స్కు) భవిష్యత్తు వుందంటారా?
జెవి      :లేదు. ఇప్పటికే అవి రాజకీయాను సర్వనాశనం చేశాయి. సామాన్య ప్రజను ఇంకా దెబ్బతీసాయి.
మీనల్‌  :         ఎందుకలా అంటున్నారు?
జెవి      :మనసులో మాట చెప్తున్నాను. కారణం వివరించలేను. కానీ ఆనాటిలాగా ఈనాడు ప్రిన్సిపుల్స్‌ వున్న రాజకీయ నేతలు కనిపించడం లేదు. తెరవెనుక ఒకటి చేస్తారు. తెరముందు మరొకటి  మాట్లాడతారు. అర్ధరాత్రికి ముందు వాళ్ళేమిటో అర్ధరాత్రి తర్వాత వాళ్ళేమిటో మీ రిపోర్టర్లకు బాగా తెలుసు. మీకు కూడా తెలుసు. అందువల్ల వారిమీద నాకు విశ్వాసం లేదు. మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయబోతున్నారు.
మీనల్‌  :జెవీ మీరు ఉన్నతమైన జీవితాన్ని చవి చూశారు. ముఖ్యమైన మూడు జీవిత పాఠాలు చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు?
జెవి      :మీకు ముందే చెప్పినట్టు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. రెండవది నా సాహిత్యం. నేను మొదట్లో కేవలం రచనలే చేసేవాణ్ని. ఉద్యమంలోకి వచ్చాక ఎన్నో చేశాను. ఆ తర్వాత నాకు కూతురు పుట్టడం. నేను జైల్లో వుండగా నా కూతురు జన్మించింది. ఆమెకు బ్లాక్‌ పాంథర్‌ నేత ‘ఏంజెలా’ పేరు పెట్టడం, అది తెలుసుకుని ఇండియాకు వచ్చినప్పుడు ఆమె మా ఇంటికి రావడం... ఇలా ఎన్నో సంఘటనలు. ఒక్కటి మాత్రం నిజం. నేను నా జీవితం విషయంలో ఎప్పుడూ సంతోషంగా వున్నాను. ఒక చిన్న పిల్లవాడిగా వున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఏం చేసినా, ఏం నేర్చుకున్నా అంతా ఇక్కడే. డ్యూటీ కానిస్టేబుల్‌ను చూస్తేనే వణికి పోయే దశ నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కారు ఆపి ‘‘ఏం పవార్‌ ఎక్కడికి వెళ్తున్నావు లిఫ్ట్‌ కావాలా?’’ అని అడిగే స్థాయికి చేరుకున్నాను. అయితే అది వేరే విషయం. మా కుటుంబానికి ఎలాంటి సాహిత్య నేపథ్యం లేదు. అందరూ నిరక్షరాస్యులే. అయినప్పటికీ నేను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వెళ్తున్నాను. నా పుస్తకాలు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలుగా వున్నాయి. నా కవితలు ప్రాథమిక, మాథ్యమిక  పాఠశాలల్లో బోధిస్తున్నారు. నాలుగు సాహిత్య సమ్మేళనాకు అధ్యక్షత వహించాను. అనేక కవి సమ్మేళనాలు నిర్వహించాను. అన్నిభాషల సమ్మేళనాల్లో పాల్గొన్నాను. మరాఠీ భాషకు ప్రాతినిధ్యం వహించాను.

మీనల్‌  :అంటే ఒక పల్లెటూరు నుంచి పడవ మీద ఈ మహా నగరానికి వచ్చిన బాలుడు కన్న కలలన్నీ నెరవేరినట్టేనా?
జెవి      :లేదు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర రాయాలన్న నా కల ఇంకా నెరవేరలేదు. ధనంజయ్‌ కీర్‌ వంటి వాళ్ళు రాశారు. కానీ వాళ్ళ దృక్పథం నుంచి రాశారు. నేను రాయాలనుకున్నది భిన్నమైన కోణం నుంచి. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ శిష్యుడిగా అదొక కొత్త చరిత్ర అవుతుంది.
మీనల్‌  :కొత్తపుస్తకం రాయాలనుకుంటున్నారా?
జెవి      :కొత్త కోణంలోంచి ఇప్పటికే ప్రారంభించాను. ఒక్క సంవత్సరంలో పూర్తిచేయాలనుకుంటున్నాను. అలాగే అంబేడ్కర్‌ అనంతర అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంపై 14 సంపుటాలు రాయాని నిశ్చయించుకున్నాను. ఇప్పటికే ఐదు సంపుటాను ప్రచురించాను. ఇలాగే ఇంకా కొన్ని ఆలోచనలున్నాయి.
మీనల్‌  :మీ కలానికి మరింత శక్తి సమకూరాని మేము ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు.
...  
(దళిత్ పాంథర్స్ చరిత్ర పుస్తకం నుంచి)
...................................................



దళిత్ పాంథర్స్ చరిత్ర

రచన : జే.వి. పవార్
ఆంగ్ల మూలం  : Dalit Panthers, An Authoritative History
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
252 పేజీలు , వెల : రూ.180 /-.
ప్రతులకు :
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85 , బాలాజీ నగర్, గుడిమల్కాపూర్
హైదరాబాద్ 500006
Phone: 040 2352 1849
Email: hyderabadbooktrust@gmail.com




హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌