సీరియల్ కిల్లర్ నాగరాజ - గౌరి లంకేశ్
("కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి మరొక ఆర్టికిల్)
అతను ఇష్టపడేది వాళ్ల చీరలనే.
రంగురంగులవీ మెరిసేవీ వెలిసిపోయినవీ మెత్తనివీ ఉల్లిపొర లాంటివీ ముతకవీ పట్టువీ నూలువీ ఏవైనా సరే చీరలు మాత్రమే ఇష్టం అతనికి.
చీర కట్టిన అమ్మాయిలనే నాగరాజ కోరుకుంటాడు.
ముందు ఆ చీర లాగి పడేస్తాడు.
ఆమె ఏ మాత్రం అనుమానించక ముందే దాన్ని మెలి తిప్పి ఆమె గొంతుకి బిగించి రెండు వైపుల నుంచి గుంజి వదిలిపెడతాడు.
ఆమె శవమై నేల మీద నగ్నంగా పడిపోతుంది.
ఒంటిమీద ఉండాల్సిన చీర గొంతు దగ్గర బిగించి వుంటుంది.
రాత్రి వేళల అతను చీరెలు కట్టుకున్న అమ్మాయిల కోసం వెతుకుతూ వీధుల వెంట తిరుగుతూ వుంటాడు.
1991 జనవరి నెలలో అతను బెంగుళూరు రైల్వేస్టేషన్ దగ్గర మసక చీకటిగా వున్న వీధుల్లో తచ్చాడుతుండగా జయలక్ష్మి (మారుపేరు. ఇప్పటివరకు ఆమె ఎవరో తెలియదు) కనపడింది. ఆమె ఒక దీప స్తంభం కింద నిలబడి చూపరులను ఆకర్షించేందుకు అటూ ఇటూ చూస్తూ వుంది. ఆమె వత్తి ఏమిటో అతనికి అర్థమై పోయింది. ఆమె చీర అతనికి నచ్చింది. రైల్వే స్టేషన్ దగ్గరే తచ్చాడుతూ చిన్న చిన్న నేరాలకి పాల్పడే మిత్రుడు గోపాల్‌ని పిలిచాడు. ఏదో విశేషం వుందని అర్థమై గోపాల్ వెంటనే వచ్చాడు. ఇద్దరూ తాపీగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళారు. వాళ్ళను చూసి ఆమె మొహం వెలిగింది. ఎంత అన్నాడు నాగరాజ. ఆమె తన పద్ధతి చెప్పింది, గంటకింతని డబ్బు పుచ్చుకుని గదులు అద్దె కిచ్చే ఒక చవక బారు హోటల్‌కి తీసికెళతానని చెప్పింది. కావాలనుకుంటే ఇద్దరికీ కలిపి ఒక రేటు మాట్లాడుకోమంది. నాగరాజకి ఇది నచ్చలేదు. ''వద్దు. అట్లా కాదు, మనం బయటికి పోదాం. ఆరు బయలే బాగుంటుంది'' అన్నాడు. జయలక్ష్మి ఆశ్చర్యపడింది. ''మనం ఆటో మాట్లాడుకుని ఒక అందమైన చోటుకి పోదాం. పనయి పోయాక మేము నిన్ను తిరిగి ఇక్కడ దించుతాం'' అన్నాడు.
''అట్లా అయితే 200 ఇవ్వాలి'' అంది ఆమె. ''150 ఇస్తాం. వస్తే రా లేకపోతే లేదు'' అన్నాడు నాగరాజ. ఆమె ఒప్పుకుంది. ముగ్గురూ కలిసి ఒక ఆటో ఎక్కి ఇరవై నిమిషాలు ప్రయాణం చేసి యూకలిప్టస్ చెట్లు దట్టంగా వున్న ఒక చోటికి పోయారు. ఆటోకి గోపాల్ డబ్బిచ్చి పంపేశాడు. జయలక్ష్మిని చెట్ల మధ్యకి తీసికెళ్లాడు నాగరాజ. ఆమె భయపడుతున్నట్లు గమనించి ''భయపడకు. నిన్ను మళ్లీ వెనక్కి తీసికెళ్లి దింపేస్తాం'' అన్నాడు నాగరాజ. అక్కడ దాకా వచ్చాక వాళ్ళతో ఆమె ఏం వాదించగలదు? ముందు గోపాల్ ఆమెను అనుభవించాడు. తరువాత నాగరాజ. అతని పద్ధతి వేరుగా ఉంది. చాలా మొరటుగా దూకుడుగా ఉంది. జయలక్ష్మి భయంతో అతని కింద ముడుచుకు పడుకుంది. హఠాత్తుగా అతను ఆమె చీర పట్టుకుని ఛాతీమీదకు లాగాడు. పైట కొంగు బలంగా గుంజాడు. ఆమె స్పందించే లోపునే దాన్ని మెడ చుట్టూ తిప్పాడు. ఆమె పెనుగులాడింది. కాని ఈ లోగానే అంతా అయిపోయింది. అతను దయ్యం పట్టిన వాడి లాగా చీరను ఆమె మెడ చుట్టూ బిగించి ఇంకా ఇంకా గట్టిగా లాగాడు. ఆమెకి ఊపిరాడలేదు. మెడ ఎముకలు విరిగిపోయాయి. పెనుగులాట నిలిచిపోయింది. ఆమెలో ప్రాణం మిగిలి లేదని తెలిసి కూడా ఇంకా అతను గొంతుకి ఉరి బిగిస్తూనే వున్నాడు. ఆ తరువాత అసలేమీ జరగనట్లు లేచి ప్యాంటు సరిచేసుకుని జయలక్ష్మి ఒంటి మీద ఉన్న చిన్నచిన్న బంగారు వస్తువుల్ని జేబులో వేసుకుని గోపాల్‌తో కలిసి మెయిన్‌రోడ్ మీదికి వెళ్ళాడు. అక్కడ ఒక ట్రక్కును ఆపి ఎక్కి బెంగుళూరు తిరిగి వచ్చారు,
ఆ రాత్రి ఇద్దరూ ఎప్పటికన్నా ఎక్కువ తాగేసి తమ ఘనకార్యం గురించి ముచ్చటించు కున్నారు. అయిదు రోజుల తర్వాత నాగరాజ అటువంటి మరో హత్య చేశాడు. ఒక్కసారి కాదు మళ్లీ మళ్లీ చేశాడు.
వరుస హత్యలకు పాల్పడే వాళ్లు మతి భ్రమించిన వాళ్లని వాడుక. సినిమాల్లో ఇలాంటి వాళ్ళని కాలు కుదురు లేకుండా తిరుగుతూ చెమటలు కక్కుతుండే ఆంథొనీ పెర్కిన్స్ నమూనాలో చూపిస్తూ వుంటారు. ఆధునిక సాహిత్యంలో ఇలాంటి వాళ్ళని స్వలింగ సంపర్కులుగా, లేకపోతే థామస్ హ్యారిస్ నవల 'సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్' (Silence of the lambs) లోని డాక్టర్ లాగా చిత్రిస్తారు. ఈ డాక్టర్ తన రోగుల కాలేయాల్ని కొద్దిపాటి గ్రీన్ సలాడ్‌తో కలిపి తింటుంటాడు. దాంతో పాటు మోన్ ట్రాషె (Montrachet) అనే వైన్ పుచ్చుకుంటుంటాడు. కానీ నిజ జీవితంలో ఈ సీరియల్ హంతకులు సినిమాల్లో లాగా ఒక మూస నమూనాలో వుండరు. వాళ్ల పద్ధతులు, మనస్తత్వం చాలా సంక్లిష్టంగా వుంటాయి. ఉదాహరణకి 1960 లలో బొంబాయి ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన రామన్ రాఘవ్, యార్క్‌షైర్ హంతకుడు (ఇతన్ని యార్క్‌షైర్ రిప్పర్ అంటారు) పీటర్ సట్‌క్లిఫ్ (Sutcliffe) లాంటి వాళ్ళు ఏ నమూనాకీ లొంగరు.
అయితే కేవలం హంతకుడని కాక Serial Killer అని పిలవడానికి ఆ వ్యక్తికి కొన్ని లక్షణాలు వుండాలి: అతను ఒకే పద్ధతిలో మళ్ళీ మళ్లీ దాడి చేయాలి. స్వలాభం లేకపోయినా హత్యలు చేయాలి. ఎక్కువ సార్లు ఈ నేరంలో స్త్రీలపై అత్యాచారం కూడా కలిసి వుంటుంది. ఈ విధంగా చూస్తే నాగరాజ అసలు సిసలైన సీరియల్ కిల్లర్. ఇప్పటిదాకా 24 హత్యలు చేసానని అతనే ఒప్పుకున్నాడు. బెంగుళూరు పోలీసులు మాత్రం అతను మరో ఇరవై హత్యలు కూడా చేసి వుండొచ్చు ననుకుంటున్నారు. కొంతమంది పోలీసులు అతను యాభై హత్యల దాకా కూడా చేసి వుండొచ్చంటున్నారు.
ఒక్కరు తప్ప అతను చంపిన వారంతా స్త్రీలే. దాదాపు ఆ స్త్రీలందరినీ చంపే ముందు లైంగికంగా అనుభవించాడు. కొన్నిసార్లు వాళ్ల అనుమతితో, కొన్నిసార్లు బలవంతంగా. అతనికి రక్త దాహం ఒక జబ్బుగా మారినట్లుంది. అవసరం లేనిచోట కూడా హత్యలు చేశాడు. ఇతర సీరియల్ హంతకుల్లాగానే ఇతనూ తప్పించుకోడంలో బహు నేర్పరి. నాగరాజ హత్యలకు ఎంచుకునే వారంతా సమాజం అంచుల్లో నివసించేవారు. పడుపు వత్తి చేసుకు బ్రతికేవారు. పట్నంలో బ్రతుకుదామని ఏదో ఒక రైలు పట్టుకుని వచ్చిన పల్లెటూరి యువతులు, తాడు బొంగరం లేనివాళ్లు. వాళ్ల కోసం వెతికే వాళ్ళు గాని పట్టించుకునే వాళ్ళు గాని ఎవరూ ఉండరు. దానికి తోడు 'ద సైలన్స్ ఆఫ్ ల్యాంబ్స్'లో బఫెలో బిల్ (Buffalo Bill) లాగా అతను కర్ణాటకలో ఒక చోట ఎక్కడా వుండకుండా, పోలీసులకి తన హత్యా విధానం అర్థం కాకుండా తప్పించుకుని తిరిగాడు. యార్క్‌షైర్ రిప్పర్ వలె అతను ఎప్పుడైనా, ఏదైనా హత్య కేసులో అనుమానితుడిగా పోలీసులకి దొరికినా అబద్ధాలు చెప్పి తప్పించుకుపోయేవాడు.
నాగరాజ ఈ పని ఎప్పుడు ప్రారంభించాడు, ఎందుకు అలా తయారయ్యాడు అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. 1989 మే 20 న బెంగుళూరు శివార్లలో సుమతి అనే యువతి కుళ్ళిపోయిన శవం కనిపించింది. ఆమే తన మొదటి బాధితురాలు అంటాడు నాగరాజ. అతను పచ్చి అబద్ధాలకోరు కనుక ఇది నిజం కాకపోవచ్చు కూడా. సుమతికి పదిహేడేళ్ళు. కాస్త మందమతి. మాట స్పష్టత లేదు. ఆమె కుందపుర అనే ఊరు నుంచి తన అక్క ఇంటికి బెంగుళూరు వచ్చింది. ఎందువల్లనో ఆమె అక్క ఆమెను ఒంటరిగా సినిమా చూసిరమ్మని పంపించింది. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చిన సుమతి బెంగుళూరు మెజిస్టిక్ ప్రాంతంలోని జన సమ్మర్దాన్ని చూసి బెదిరిపోయింది. బస్సు ఎక్కి అక్క ఇంటికి పోదామనుకుంది కాని ఏ బస్సు ఎక్కి వెళ్ళాలో అర్థం కాక కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. అప్పుడామెను నాగరాజ చూసాడు. అతనితో పాటు చంద్ర అనే స్నేహితుడు కూడా వున్నాడు. ఆమె తప్పిపోయి వుండవచ్చని ఊహించి దగ్గరకు వెళ్లి ''సాయం కావాలా'' అని అడిగాడు. తను అక్క ఇంటికి వెళ్లాలనీ, దారి తెలీడం లేదనీ చెప్పింది. తీసికెళతామని ఆమెను నమ్మించారు కాని మిత్రులిద్దరికీ ఆమెను ఆమె అక్క ఇంటికి చేర్చే ఉద్దేశం ఎంతమాత్రం లేదు.
ఆ సాయంత్రం మొట్టమొదటిసారి వాళ్లు ఒక అమ్మాయిని బెంగుళూరు శివార్లకి తీసుకుపోయి రేప్ చేశారు. అత్యాచారం చేసిన తరువాత నాగరాజ ఆమె చీర లాగేసి దానితోనే ఆమె ప్రాణాలు తీశాడు. ఎంతసేపటికీ సుమతి ఇంటికి తిరిగి రాకపోయేసరికి సుమతి అక్క-చెల్లెలు తప్పిపోయిందని మడివాళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎన్నాళ్ళకీ సుమతి ఆచూకీ తెలియకపోయేసరికి ఇంకేదో జరిగిందని పోలీసులు అనుమానించారు. వెంటనే చిన్న చిన్న నేరాలకు పాల్పడే వారందర్నీ పట్టుకొచ్చి ప్రశ్నించారు. అందులో నాగరాజ ఒకడు. అతను చెపుతున్నట్లుగా నిజంగా అదే అతని మొదటి హత్య అయితే పోలీసులు పట్టుకెళ్లినప్పుడు అతను చాలా భయాందోళనలకు గురి కావలసినది. కానీ అతను చెక్కు చెదరలేదు. తనకు అసలు సుమతి తెలియదని, ఆమె అదృశ్యమైపోవడానికీ తనకీ ఎలాంటి సంబంధం లేదని అతను చాలా దృఢంగా చెప్పినట్లు పోలీసు రికార్డులు చెపుతున్నాయి. మామూలుగా ఎవర్నీ నమ్మని పోలీసులనే అతన్ని పొరపాటుగా పట్టుకొచ్చామని అనుకునేలా నమ్మించాడట. వాళ్ల దగ్గర ఏ ఆధారమూ లేకపోవడంతో ఆ తర్వాత వదిలేసారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డ ఆ రోజే అతనికి అర్థమయి ఉంటుంది - తను ఇక ఎన్ని హత్యలైనా చేసి తప్పించుకోగలనని. ఆ తర్వాత అతన్ని ఎవరూ ఆపలేకపోయారు.
ఇలా వరస హత్యలకు పాల్పడేవారిలో ఎక్కువమంది ఒంటరిగానే తమ పని కానిస్తారు. అయితే యార్క్‌షైర్ రిప్పర్ కేసును పరిశోధించిన పోలీసులు ఒక్కొక్కసారి అతనికి తోడుదొంగలు కూడా ఉండేవారని చెప్పారు. కాని నాగరాజ దాదాపు అన్నిసార్లూ ఎవరో ఒక పరిచయస్తుడిని వెంట తీసుకువెళ్లడం అసాధారణమనిపిస్తుంది. అతను తన వెంట వచ్చే వాళ్లకి ఆ స్త్రీని చంపే ఉద్దేశం వుందని చెప్పేవాడో లేదో తెలియదు. కాని ప్రతిసారీ వేరే వేరే వాళ్లను వెంట తీసుకెళ్లడం చూస్తుంటే రేప్ చెయ్యబోతున్నట్టు మాత్రమే వాళ్లకు చెప్పేవాడనిపిస్తుంది. మరో అసాధారణ విషయం ఏమిటంటే ఆ స్త్రీలను చంపాక వారి వొంటి మీద వున్న చిన్న చిన్న బంగారం వస్తువుల్ని కాజేయడం. అతను ఏ పనీ చేయని తిరుగుబోతు కావడం వలన ఆ కాస్త బంగారాన్నీ అమ్ముకుని బతికినట్టున్నాడు.. ఈ డబ్బుని అతను తన తోటి దొంగలతో పంచుకున్నట్టు కూడా కనిపించదు.
నాగరాజ ఎక్కువగా పడుపు వత్తి చేసుకు బ్రతికే స్త్రీలనే ఎందుకు ఎంచుకున్నాడు? యార్క్‌షైర్ రిప్పర్ గానీ, జాక్ ది రిప్పర్ గానీ అలాంటి అమ్మాయిలనే ఎందుకు ఎంచుకున్నారో నాగరాజ కూడా అందుకే ఎంచుకున్నాడు. తెలియని మగాడిని నమ్మి తెలియని చోట్లకు వెళ్ళేది ఎక్కువగా అటువంటి అమ్మాయిలే. వాళ్ళు మాయమైనా సమాజానికి పట్టదు. కనీసం వాళ్ళు కనిపించడం లేదని కూడా ఎవరూ గుర్తించరు. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలలో ఎక్కువమంది కుటుంబాలతో కలిసి వుండరు. కనుక వాళ్ళు తప్పిపోయినట్లు ఫిర్యాదు చేసే వాళ్ళూ తక్కువే ఉంటారు. ఇప్పటికి తాను పదహారు మంది పడుపువత్తి చేసుకు బ్రతికే అమ్మాయిల్ని చంపానని నాగరాజే చెప్పాడు. వీళ్ళందరినీ అతను చంపిన పద్ధతి ఒక్కటే. ముందు తన సహచరుడూ, ఆ తర్వాత తనూ ఆమెను లైంగికంగా అనుభవించాక ఆమెను హత్య చేసి మరింత త్రిల్ అనుభవించడం అతని పద్ధతి.
కాని అతను ఎందుకు ప్రతిసారీ ఒక మనిషిని తోడు తీసుకువెళతాడు? దీని మీద రెండు అభిప్రాయాలున్నాయి. ఒకటి-బాధితురాలు తిరగబడితే ఆమెను లొంగదియ్యడానికి అవసరమవుతారని కావచ్చు. అయితే ఆరు సందర్భాలలో అతనొక్కడే వెళ్లి చంపేశాడు కనుక ఆ కారణం కరెక్టు కాకపోవచ్చు. రెండు-బహుశా ఒక స్త్రీతో ఒకరికంటే ఎక్కువమంది ఒకేసారి శృంగారంలో పాల్గొనడం చూడడం అతనికి ఆనందం కావచ్చు. ఇతరుల లైంగిక చర్యలను చూస్తూ తనే ఆ ఆనందం పొందుతున్నట్లు భావించే (voyeurism) మనస్తత్వం గలవాడయి వుండొచ్చు. తను చంపదలుచుకున్న స్త్రీని లైంగికంగా అవమానించడాన్ని కూడా అతను ఆస్వాదిస్తూ వుండవచ్చు,
అందరు హంతకులూ, రేపిస్టులూ ఉన్మాదులేమీ కారు. ప్రతి రామన్ రాఘవ్1కు అత్యాచారం చెయ్యడం, హత్య చెయ్యడం అనేవి తమ ఘనకార్యాల జాబితాలో మరికొన్ని పతకాలుగా భావించే బిల్లా2 లాంటివారు కూడా వుంటారు.
నాగరాజకు అయిదేళ్ళప్పుడు వాళ్ల కుటుంబం బెంగుళూరు వచ్చింది. బిల్లా లాగా కార్లు దొంగిలించడం, కిడ్నాపులు చెయ్యడం, ఆయుధాలతో దోపిడీలకు పాల్పడడం వంటి పనులు నాగరాజ ఎప్పుడూ చెయ్యలేదు. అతను ఎప్పుడో తప్ప ఆయుధం మోసుకు తిరగలేదు. పిచ్చివాడు కూడా కాదు. గత జీవితంలో సైతం అతనికి మతి చాంచల్యం
ఉన్న దాఖలాలు లేవు. అతని బాల్యం ఆనందంగా గడవలేదని కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ నిశితంగా పరిశీలిస్తే అటువంటి నేపథ్యంలో పెరిగిన వాళ్ళ కంటే అతని బాల్యం ఏమీ భిన్నం కాదనిపిస్తుంది. అటువంటి బాల్యాలు చాలామందికి వున్నాయి.
నాగరాజ ఉరఫ్ కుమార్ ఉరఫ్ సెల్వన్ 27 సంవత్సరాల క్రితం తమిళనాడులోని బందేహళ్లి అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి కరియప్ప రాళ్ళు చెక్కే పనివాడు. చాలా బీదవాడు. తాగుబోతు. అతనికి ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. తాగినప్పుడు అందర్నీ కొట్టేవాడు. పని కోసం ప్రయత్నించేవాడు. దొరకనప్పుడు తాగుతూ కూర్చునే వాడు. ఆ తాగుడే కొన్నాళ్ళకి అతన్ని ఏ పనికీ పనికిరాని వాణ్ణి చేసింది. కాలేయం చెడిపోయి చనిపోయాడు. కుటుంబానికి ఏ ఆధారమూ లేకుండా పోయింది. నాగరాజకు చిన్నప్పుడే బ్రతుకుతెరువు వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. కాని అతను ఏ పని చేసి పొట్టపోసుకునే వాడో ఎవరికీ తెలియదు. ఆ విషయం గురించి అతను ఎప్పుడూ చెప్పలేదు. బహుశా చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికి వుంటాడని పోలీసుల అనుమానం. ఎందుకంటే మూడు నెలల పాటు ఎంత తీవ్రంగా పరిశోధించినా అతనికి పని ఇచ్చిన వ్యక్తులెవర్నీ వారు కనుగొనలేకపోయారు.
ఇరవై మూడేళ్ళ వయస్సులో అతనికి అతని సోదరి పెళ్లి కుదిర్చింది. పెళ్లికూతురు ఆమె ఆడబిపడుచే. భార్యకు లారీ డ్రైవర్ పని చేస్తానని నాగరాజ చెప్పాడు కానీ అతను నిజంగా ఏ పని చేస్తాడో ఆమెకు తెలియదు. అతను నడిపే లారీని ఎవరూ చూడలేదు కూడా. అయితే ఆ కల్పిత ఉద్యోగాన్ని రోజుల కొద్దీ మాయమై పోవడానికి అతను ఒక సాకుగా వాడుకున్నాడు. ఒక్కొక్కసారి బాగా డబ్బులతో తిరిగి వచ్చేవాడు. భార్య అడిగితే లారీలో బొంబాయి వెళ్లి వచ్చాననీ, ఆ డబ్బు జీతంగా ఇచ్చిన డబ్బు అనీ చెప్పేవాడు.
ఇప్పుడు అడిగితే తానెప్పుడూ లారీ నడపలేదంటాడు నాగరాజ. మరయితే మధ్యమధ్యలో ఎక్కడికి మాయమై పోతుండేవాడు? అతను చెప్పినదాని ప్రకారం చూసినా అతను మొదటి హత్య చేసింది1989 ఏప్రిల్-మే లో. కానీ ఈ మాయమవడాలు జరిగింది 1987-89 మధ్యలో. అంటే అతను ఆ హత్యల్ని ఆ కాలంలోనే మొదలుపెట్టి ఉండొచ్చా? పోలీసులు ఇప్పుడు ఆ విషయం కనుక్కోడానికే ప్రయత్నిస్తున్నారు.
చివరికి అతని పెళ్లి విఫలమైపోయింది. అతను కనిపించకుండా పోవడాలు రానురాను ఎక్కువై పోయాయి. కొన్నాళ్లకు అసలే మాయమై పోయాడు. తనకి భార్యంటేనూ, సంసారమంటేనూ విసుగు పుట్టిందని చెబుతాడు. బెంగుళూరు రైల్వే స్టేషన్ దగ్గరకు చేరాడు. అది తిరుగుబోతులకూ చిట్టి పొట్టి దొంగలకూ స్వర్గధామం. కావల్సినన్ని జేబులు కొట్టొచ్చు. సూట్‌కేస్‌లు కొట్టేయ్యొచ్చు. అక్కడ తచ్చాడే అమ్మాయిలతో సుఖం కొనుక్కోవచ్చు.
క్రమంగా అతనికి చాలా రకాల నేరస్తులు పరిచయం అయ్యారు. అందులో చాలామంది తమిళనాడు వాళ్ళు.ఊరితో పరిచయంలేని వాళ్ళు రైలు దిగినప్పుడు వాళ్ళకి ఊరు చూపించే నెపంతో మోసాలు చేయడానికి ఆ రైల్వే స్టేషన్ వాళ్లకు బాగా పనికొచ్చింది. అవతలి వాళ్ళు మగవాళ్ళయితే దోచుకుని వదిలేసేవాళ్లు. ఆడవాళ్ళయితే అత్యాచారం చేశా దోచుకుని వదిలేసేవాళ్లు. ఈ హత్యలు చెయ్యడం ఎప్పుడు మొదలయిందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇండియా మొత్తం మీద రైల్వే స్టేషన్లు దొంగలకు మంచి ఆశ్రయాలు. ప్రయాణీకుల్ని బురిడీ కొట్టించడానికి అవి బాగా పనికొస్తాయి. కానీ హత్యలు జరగడం మాత్రం తక్కువే. అత్యాచారాలు అందరూ కలిసి చేసినా హత్యలు చెయ్యడం మాత్రం నాగరాజ పనేనని అతని స్నేహితులు చంద్ర, రాజా ఇద్దరూ పోలీసులకు చెప్పారు. తన స్నేహితులు అత్యాచారాల్లో పాల్గొన్నారు కానీ హత్యలు మాత్రం తనే చేసానని నాగరాజ కూడా ఒప్పుకున్నాడు.
ఎంత అన్యాయమో చూడండి: సెక్స్ వర్కర్లని చంపినంత కాలం నాగరాజ బాగానే వున్నాడు. సెక్స్‌వర్కర్లు కాని వాళ్లను చంపడం మొదలుపెట్టాకే అతను పోలీసులకు దొరికాడు. తను ఒక్క మగవాడిని మాత్రమే చంపానని నాగరాజ పోలీసులకు చెప్పాడు. కోలార్ బంగారు గనుల దగ్గర కత్తి చూపించి తన చేతి గడియారం, ఉంగరం, బట్టలు దొంగిలించిన బాషా అనే వ్యక్తిని ఆ తర్వాత ఒకరోజు బస్సులో పోతూ చూసి ఆగి ప్రతీకారం కోసం చంపానన్నాడు. ఈ కథ నిజమో కాదో అనుమానమే. ఎందుకంటే బాషాను కూడా అతని బెల్ట్‌తోనే మెడ నులిమి చంపాడు. పైగా బాషాను చంపాక అతని భార్యపై అత్యాచారం చేసి ఆమెను కూడా గొంతు నులిమి చంపాడు. ఆమె పేరు నూర్జహాన్. అతనికి కావలసింది నూర్జహానే కావచ్చు. మధ్యలో బాషా అడ్డం వచ్చి వుంటాడు. వాళ్ళిద్దరి హత్యల గురించి సమాజం ఎంత గగ్గోలు పెట్టినా అప్పుడు కూడా నాగరాజ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. అయితే ఆ తరువాత మాత్రం 'అదష్టదేవత' అతన్ని కరుణించలేదు.
గత సంవత్సరం అతను తమిళనాడు లోని ధర్మపురి జిల్లాలో పడుపు వత్తి చేసుకు బ్రతికే ఒక స్త్రీని హత్యచేసి అక్కడ నుండి వెంటనే పరారయ్యాడు. గోవింద అనే స్నేహితుడితో కలిసి బెంగుళూరు దగ్గర పట్టు బట్టలు నేసే కనకపురా అనే ఊర్లో తేలాడు. అక్కడి అంబేద్కర్ నగర్ మురికివాడలో గోవిందకు ఒక పాక వుంది. నాగరాజ ఎందుకు కనకపురాలో ఉండడానికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. బహుశా తన కోసం వేట ముమ్మరమైందనీ, కొన్నాళ్ళ పాటు హత్యలకీ, అత్యాచారాలకీ విరామం ఇవ్వాలనీ అనుకుని వుండవచ్చు. ఇక్కడ ఇరుగు పొరుగులెవ్వరూ అతన్ని హంతకుడని అనుమానించలేదు. చాలా సాదాసీదాగా కనిపించేవాడు.గోవింద పొరుగున వుండే హొన్నయ్య అనే వాచ్‌మన్ నాగరాజను చాలా ఇష్టపడి తన పద్దెనిమిదేళ్ళ కూతురు హొన్నమ్మకు అతనే తగిన వరుడని అనుకున్నాడు. నాగరాజ వారికి అలాంటి అభిప్రాయమే కలిగించడానికి ప్రయత్నించాడు. వాళ్ళతో కూడా తను లారీ డ్రైవర్ననే చెప్పాడు. అందుకే కుదురుగా ఒక చోట వుండననీ, కానీ బాగా సంపాదిస్తాననీ చెప్పాడు. ఉంగరం, వాచీ చూపించాడు. అయినా సంతృప్తి చెందక నీకు కుటుంబ సభ్యులెవరూ లేరా అని ఆరా తీశాడు హొన్నయ్య. తనొక అనాథననీ, తన బ్రతుకేదో తనే బతుకుతూ వచ్చాననీ చెప్పాడు నాగరాజ. హొన్నయ్య పెద్ద కూతుళ్ళు జయమ్మ, గౌరమ్మలకు అతని మీద జాలి కలిగింది.అతనే హొన్నమ్మకి తగిన వరుడు అని వాళ్ళు కూడా గట్టిగా నమ్మారు. ఫలితంగా 1991 లో నాగరాజ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. వాళ్లు అతన్ని చాలా బాగా చూసుకున్నారు. ఎంతో మందిని చంపి శిక్ష తప్పించుకున్న అతనికి ఇప్పుడు మళ్ళీ కుదురుగా బ్రతికే అవకాశం వచ్చింది.
కానీ రక్త దాహం ఊరుకోదు కదా! హత్యలూ, అత్యాచారాలూ లేకుండా రెండు నెలలు గడపడం కూడా కష్టమై పోయింది అతనికి. ఇప్పుడు కొత్త అమ్మాయిలు కావాలి. పెళ్లి చేసుకున్న వారానికే వాళ్లమీద కన్నుపడింది అతనికి. తను ఏవో కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి బెంగుళూరు వెళ్లాలని హొన్నయ్యకి చెప్పాడు. సరేనని హొన్నయ్య కుటుంబం కొత్త దంపతులతో కలిసి నగరానికి వెళ్లింది. తన పాత సంచార స్థలమైన మెజెస్టిక్ ప్రాంతం చూడగానే అతనిలోని వికారాలు మళ్లీ బయటికొచ్చినట్టున్నాయి. అతనిలోని సైకోపత్ నిద్ర లేచాడు. ''అందరం ఒక ఆటో రిక్షాలో పట్టం'' అని హొన్నయ్యతో అంటే నిజమే కదా అని హొన్నయ్య రెండో ఆటోను పిలిచాడు. రెండో ఆటోలో హొన్నయ్య కూర్చున్నాడో లేదో మొదటి ఆటోలో నాగరాజ ముగ్గురు ఆడవాళ్ళతో కలిసి తుర్రుమన్నాడు.
ఆ ఆటో బెంగుళూరు శివార్లలోని బన్నేర్‌ఘట్ట (Bannerghatta) నేషనల్ పార్క్ దగ్గరున్న ఒక పొలం దగ్గర ఆగింది. భార్యని రోడ్డు మీదే వేచి వుండమని చెప్పి ఆమె అక్కలను ఆ దగ్గరలోనే వున్న తన అమ్మమ్మకి చూపించి తీసుకువస్తానని వాళ్ళిద్దర్నీ తీసుకుపోయాడు. ఒకప్పుడు నాగరాజతో వుండిన షంగుట్ట వాళ్ళని అనుసరించి వస్తున్నాడని ఆ ఆడవాళ్ళెవరికీ తెలియదు. పొలం దగ్గరకు వెళ్ళేసరికి అతనక్కడ ప్రత్యక్షమయ్యాడు. మగవాళ్ళిద్దరూ కలిసి జయమ్మని పట్టుకుని ఆమె చీర ఊడదీసారు.. గౌరమ్మ పారిపోబోతే షంగుట్ట ఆమెని పట్టుకున్నాడు. ఆ తరువాత అన్నీ ఎప్పటిలాగే జరిగిపోయాయి. వదినగార్లిద్దరి పైనా అత్యాచారం జరిగింది. వాళ్ల చీరలతోనే వాళ్ల గొంతులు నులిమారు. ఆ తరువాత నాగరాజ చాలా మామూలుగా మెయిన్ రోడ్డు మీద ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలబడ్డ భార్య దగ్గరకు వచ్చి ''మీ అక్కలు బెంగుళూరు వెళ్ళిపోయారు'' అని చెప్పాడు. ఏ మాత్రం అనుమానించకుండా హొన్నమ్మ భర్త మాటల్ని అమాయకంగా నమ్మింది. తర్వాత భర్తతో కలిసి ధర్మపురి జిల్లాలోని కొత్తనూరుకి కొత్త కాపురానికి వెళ్ళిపోయింది.
అయితే హొన్నయ్య తన చిన్న కూతురులా అతన్ని నమ్మలేదు. పెద్ద కూతుర్లిద్దరూ ఇంటికి రాకపోయేసరికి అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు ఊరంతా గాలించారు. చివరికి ఒక గుర్తుతెలియని శవం బెంగుళూరు శివారు పొలాల్లో దొరికినప్పుడు ఆమె చేతి మీద జయమ్మ భర్త పేరున పచ్చబొట్టు వుండడంతో బెంగుళూరు అదనపు జిల్లా పోలసు సూపరింటెండెంట్ ఎస్.కె.వేణుగోపాల్‌కి లంకె దొరికింది. ఆయన శవాన్ని గుర్తుపట్టడానికి హొన్నయ్యను పిలిచాడు. అతను గుర్తు పట్టడంతో రెండో ఆమె గౌరమ్మ శవం కోసం భారీగా గాలింపు జరిగింది. అది కూడా దొరకడంతో నాగరాజకు ఈ హత్యలతో సంబంధం వుందని తేలిపోయింది. హొన్నయ్య ఇచ్చిన పెళ్లి ఫోటో సాయంతో పోలీసులు నాగరాజ కోసం వెదకడం ప్రారంభించారు. చివరకు కొత్తనూరులో అలాంటి మనిషిని చూసామని ఒకరు చెప్పారు.
పోలీసులు అతన్ని కనుక్కునే సమయానికి అతను భార్య పక్కన పడుకుని గాఢంగా నిద్రపోతున్నాడు. పోలీసులను చూసి అమితాశ్చర్యం ప్రదర్శించాడు. తన భర్త అమాయకుడని హొన్నమ్మ గట్టిగా చెప్పింది. కాని ఈసారి ఆట ముగిసిందని అతనికి అర్థమైనట్టే ఉంది. అయినా అచ్చమైన సైకోపత్‌లా అతను అమిత ఆత్మ విశ్వాసంతో పోలీసుల వాదనలన్నీ తిప్పికొట్టాడు. ఒకసారి పొలీసులను మాయ చేసాడు కనుక ఎల్లప్పుడూ చెయ్యగలను అనుకున్నాడు, అయితే ఈసారి బెంగుళూరు పోలీసులు చాలా చురుకుగా వ్యవహరించారు. అతను తన వదినగార్లను హత్య చేసాడన్నది దాదాపు స్పష్టమైంది కానీ బెంగుళూరు జిల్లా ఎస్.పి టి. జయప్రకాష్‌కి తను కేవలం ఒక మామూలు హంతకుడితో వ్యవహరించడం లేదని, నాగరాజ అంతకంటే ఎక్కువ నేరస్తుడని తోచింది.
దానితో వేణుగోపాల్, జయప్రకాష్, అనేకల్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ కె.హెచ్. చంద్రశేఖర్‌లు బాగా ఆలోచించుకుని తాము జంట హత్యలని ఛేదించినట్లు వెంటనే ప్రకటించవద్దను కున్నారు. నాగరాజ సంగతి తేల్చాలనుకున్నారు. అతన్ని మూడు రోజులు ఇంటరాగేషన్ చేశారు. నవంబర్ ఆఖరికి తను ఇరవైకి పైగా హత్యలు చేసినట్లు అంగీకరించాడు. అయినాసరే వాళ్లు హడావిడిగా ఒక సైకోపత్‌ని పట్టుకున్నామని పత్రికలకు ప్రకటించలేదు. అతనిపై కేసు తయారు చేయడానికి మూడు నెలలు తీసుకున్నారు. ''మా అదష్టం కొద్దీ అతనికి మంచి జ్ఞాపకశక్తి వుంది'' అన్నారు జయప్రకాష్. నాగరాజ కూడా పోలీసులకు సహకరించాడు. తను ఎక్కడెక్కడ ఎవరెవరిని చంపిందీ ఆ స్థలాలను వారికి చూపించాడు. ఎట్లా అమ్మాయిలను వలలో వేసుకున్నాడో, ఎట్లా చంపాడో కాస్త గర్వంగా కూడా చెప్పుకున్నాడు. ఆఖరికి మార్చి ఒకటిన పోలీసులు నాగరాజ అరెస్టును బయటికి చెప్పారు. (అన్ని రోజులు పోలీసు కస్టడీలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం కనుక అతన్ని ఫిబ్రవరి 20న అరెస్ట్ చేసినట్టు చెప్పారు.)
పెద్ద సంచలనం అయింది. దక్షిణ భారతదేశంలో తాము ఛేదించలేకపోయిన అనేక కేసుల్లో ఇతనే హంతకుడై ఉండొచ్చని ఎక్కడెక్కడి ఊళ్ల నుంచో పోలీసులు ఆ కేసుల్ని బెంగుళూరు పోలీసులకు పంపారు. కొంతమంది అతని ఫోటో గుర్తు పట్టి కొన్ని హత్యల గురించిన వివరాలు అందచేసారు.
ప్రస్తుతం నాగరాజ తన జైలు గదిలో కేసు విచారణ కోసం ఎదురుచూస్తూ మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతనిలో పశ్చాత్తాపం లాంటిది ఏమీ కనపడదు. పచ్చి అబద్ధాలకోరు కనుక ప్రశ్నలడిగే వాళ్ళతో ఆడుకుంటాడు. ఒక్కొక్కసారి తను అమాయకుడినంటాడు. ఇంకోసారి రెండు హత్యలు మాత్రమే చేశాను, తక్కినవి చెయ్యలేదంటాడు. అట్లా సాగుతూ వుంటుంది. పోలీసులు అతను చేసిన హత్యల చిట్టా ఇంకా తయారుచేస్తూనే ఉన్నారు. ఆ సంఖ్య యాభై దాటితే ప్రపంచ ప్రసిద్ధ సైకోపత్ సీరియల్ కిల్లర్ జాబితాలోకి అతని పేరు ఎక్కుతుంది.
ఒక హంతకుడితో ముఖాముఖీ
నాగరాజ అరెస్టు వార్తను పోలీసులు బహిరంగంగా ప్రకటించగానే అతన్ని అందరికంటే ముందు జైల్లో కలిసింది 'సండే' పత్రికే. ఆ సైకోపత్‌ని ఫోటోలు తీసింది కూడా 'సండే' పత్రిక మాత్రమే.
నాగరాజ చూడ్డానికి చాలా వినయంగా కనిపిస్తాడు. కొంచెం అయోమయంగా, బెదురుగొడ్డులా కూడా కనిపిస్తాడు. రక్త దాహంతో అలమటించే ఉన్మాదిలా మాత్రం అస్సలు అనిపించడు. గళ్ళ లుంగీ, మాసిపోయిన పాలిస్టర్ షర్ట్ వేసుకుని వున్నాడు. ఒంటరి ఖైదు నుండి కుంటుకుంటూ వచ్చాడు. ఎంతోమంది గొంతులు నులిమిన అతని చేతులు అప్పుడు వినయంగా జోడించి వున్నాయి. కళ్ళు దయా బిక్షను కోరుతున్నాయి. బెంగుళూరు కేంద్ర కారాగారంలోని ఒక గదిలో ఒక మూల ముడుచుకుని కూర్చుని ''ఏం కావాలి మీకు నా నుండి?'' అని నమ్రతగా అడిగాడు.
ఫోటోగ్రాఫర్ కెమెరా బయటికి తీయగానే అతను తన బుగ్గ మీద ఉన్న చిన్న బ్యాండేజిని చూపించి తీసేయొచ్చా అని జైలర్‌ని అడిగాడు, ఫోటోలకు మంచి మంచి పోజులు ఇచ్చాడు. ''నన్ను గురించి పత్రికల్లో ఏం రాస్తున్నారో నాకు తెలుసు. అయితే నేనెవర్నీ చంపలేదు. నాకు ముగ్గురు చిన్న కూతురులున్నారు. అంతమంది ఆడవాళ్ళని చంపేటంత రాతి గుండెనా నాది?'' అన్నాడు. నిజానికి రెండు సార్లు పెళ్లి చేసుకున్నా అతనికి పిల్లలు లేరు.
నాలుగు సంవత్సరాల కిందట పెళ్ళయిన రెండు నెలలకే మొదటి భార్య మంజమ్మను వదిలేశాడు. కిందటి సంవత్సరం నవంబర్‌లో పద్దెనిమిదేళ్ళ హొన్నమ్మను పెళ్లి చేసుకున్న మూడు వారాలకే అరెస్ట్ అయ్యాడు (మంజమ్మకు కొడుకు పుట్టలేదని హొన్నమ్మను పెళ్లి చేసుకున్నానని పచ్చి అబద్ధం చెబుతాడు.)
''మంజు, పిల్లలు కూడా అనేకల్ పోలీస్‌స్టేషన్‌కి నన్ను చూడడానికి ప్రతిరోజూ వచ్చే వాళ్ళు. నాకు భోజనం తెచ్చేవాళ్ళు'' అని చాలా నమ్మకంగా చెబుతాడు. అసలు సంగతేమిటంటే మంజమ్మ ఒక్కసారి మాత్రమే అతన్ని చూడ్డానికి వెళ్ళింది. నాగరాజ అందర్నీ తేలిగ్గా నమ్మించగలడు. ''నేనెప్పుడూ ఎవర్నీ చంపలేదు. నేను చంపానని పోలీసులు చెప్పిన ఏ అమ్మాయినీ నేను చూడనైనా చూడలేదు'' అంటాడు చాలా అమాయకత్వం నటిస్తూ.
జరిగిన సంఘటనలను రకరకాలుగా అల్లి చెబుతాడు. ''నేను ఒక ఉంగరం తాకట్టు పెట్టడానికి చిక్‌పేట వచ్చాను. జయమ్మ, గౌరమ్మ కనపడడం లేదని మా మామగారు పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిసింది. అనేకల్ పోలీస్‌స్టేషన్‌లో జయమ్మను ఉంచినట్లు నాకు చెప్పారు. నేను హొన్నమ్మను తీసుకుని స్టేషన్‌కు వెళ్లాను. అక్కడ పోలీసులు నాకు చాలా డబ్బిస్తామని చెప్పారు. బాగా తాగించారు, ఎక్కడెక్కడో తిప్పారు. ఆడవాళ్ళందరినీ నేనే చంపానని బలవంతంగా చెప్పించారు'' అంటాడు.
''పోలీసులు నన్ను మూడు నెలల నాలుగు రోజులు స్టేషన్‌లో వుంచి ఇక్కడికి (సెంట్రల్ జైలుకి) తీసుకొచ్చారు అని చాలా జ్ఞాపకశక్తితో చెబుతాడు. మళ్ళీ వెంటనే ''పోలీసులు నన్నెప్పుడూ అరెస్ట్ చెయ్యలేదు. నా అంతట నేనే స్టేషన్‌కు పోయాను'' అని మరో అబద్ధం ఆడతాడు. నిజానికి బెంగుళూరు శివార్లలోని కొత్తనూరులో బాగా తాగి వున్న నాగరాజను అరెస్ట్ చేసినప్పుడు తను పక్కనే వున్నానని హొన్నయ్య చెప్పాడు. ఇంటి తలుపు తీసిపెట్టి నాగరాజ, అతని భార్య హొన్నమ్మ గాఢనిద్రలో వున్నారని, పోలీసులు అతన్ని నిద్రలేపి కొట్టి స్టేషన్‌కి తీసుకుపోయారని చెప్పాడు
నాగరాజ అబద్ధాలాడడంలో బహు నేర్పరి. ఒకసారి చెప్పిన దానికీ మరొక సారి చెప్పిన దానికీ పొంతనలేని విధంగా చెబుతాడు. అతని పదహారు పేజీల నేరాంగీకార పత్రంలో (ఆ అంగీకార పత్రాన్ని 'సండే' ప్రతినిధులు చూశారు.) ''జయమ్మ షంగుట్ట గౌరమ్మలను అనుభవించాలనుకున్నాడు. కాని నేను వాళ్ళను హొన్నమ్మతో పాటు తీసుకుపోయాను. షంగుట్ట మమ్మల్ని వెంటాడాడు. జయమ్మ, గౌరమ్మలను నేను పొలాల్లోకి తీసుకుపోగానే అతను వారిమీద దాడి చేసి అత్యాచారం చేశాడు. ఆ పైన ఇద్దర్నీ గొంతు నులిమి చంపేసాం'' అని చెప్పాడు.
జైల్లో 'సండే' పత్రికతో మాత్రం ''షంగుట్ట వాళ్ళిద్దర్నీ ఆటోలో తీసుకుపోయి చంపేసాడు. నింద నా మీద పడింది'' అన్నాడు. అతని నేరాంగీకార పత్రంలో ఆటో ప్రసక్తే లేదు. మరోసారి తనూ, తన స్నేహితుడు గోపాల్ బాగా తాగేసి వాళ్ళను చంపేసామని చెప్పాడు. రెండు హత్యలూ నాగరాజ ఒక్కడే చేసాడని-ఈ రెండే కాదు - మరో ఇరవై ఇద్దర్ని కూడా నాగరాజే హత్య చేసాడని పోలీసులు నమ్ముతున్నారు.
నువ్వు అమాయకుడివయితే నిన్ను ఈ హత్య కేసుల్లో ఎట్లా ఇరికించారు'' అని అడిగితే పారిపోయిన షంగుట్ట, గోపాల్‌లని తలుచుకుని విలపిస్తాడు. 'షంగుట్ట, షంగుట్ట' అని కాసేపు ఏడ్చి తరువాత మౌనంగా వుండిపోయాడు. ఆ తరువాత ఎంత బ్రతిమిలాడినా, బెదిరించినా ఏమీ చెప్పలేదు. పదిహేను నిమిషాలు అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఇంక అతనేమీ చెప్పడని నిర్థారించుకున్నాక పోలీసులు అతన్ని లేచి వెళ్ళిపొమ్మన్నారు. అతను గుమ్మం దాకా పోయి వెనక్కి తిరిగి ''నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇంకేం చెప్పను?'' అనేసి వెళ్లిపోయాడు.
('సండే' వారపత్రిక, 15-21 మార్చి 1992)
అనువాదం : పి. సత్యవతి
ఎడిటర్ నోట్ :
నాగరాజ 1993 నవంబర్‌లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. తరువాత సంవత్సరం ఫిబ్రవరి వరకూ పోలీసులకు దొరకలేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ అతను తన పాత వ్యూహాలనే ఆశ్రయించాడు. ఒక రహస్య నివాసం కోసమని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అత్తగారిని హత్య చేసి ఆమె నగలు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
1) 1960 లలో బొంబాయి ప్రజలను వణికించిన సీరియల్ కిల్లర్. మురికివాడల్లో నివసించే వాళ్లను, పేవ్‌మెంట్ల మీద పడుకున్న వాళ్ళను కొట్టి చంపేవాడు. ఇతని మీద అనురాగ్ కశ్యప్ 2016 లో ఒక సినిమా కూడా తీసాడు. 1995లో చనిపోయాడు.
2) బిల్లా (జస్బీర్ సింగ్), ఇతనికి తోడు రంగా (కుల్జీత్ సింగ్) అక్కతమ్ముళ్ళయిన ఇద్దరు టీనేజ్ పిల్లలు-గీతా, సంజయ్ చోప్రాలను కిడ్నాప్ చేసి చంపారు. 1982 లో వీరిద్దరినీ ఉరి తీసారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు
ఇంగ్లీష్ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి, కె.సజయ, ప్రభాకర్ మందార, పి.సత్యవతి, కాత్యాయని, ఉణుదుర్తి సుధాకర్, కె. సురేష్, కె.ఆదిత్య, సుధాకిరణ్, కల్యాణి ఎస్.జె., బి. కృష్ణకుమారి, కీర్తి చెరుకూరి, కె. సుధ, మృణాళిని, రాహుల్ మాగంటి, కె. అనురాధ, శ్యామసుందరి, జి. లక్ష్మీ నరసయ్య, ఎన్. శ్రీనివాసరావు, వినోదిని, ఎం.విమల, ఎ. సునీత, కొండవీటి సత్యవతి, బి. విజయభారతి, రమాసుందరి బత్తుల, ఎ.ఎమ్. యజ్దానీ (డానీ), ఎన్. వేణుగోపాల్, శోభాదేవి, కె. లలిత, ఆలూరి విజయలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి
230 పేజీలు , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
dear sir ,very blog is super sir
ReplyDeleteTelugu Cinema News