Tuesday, November 7, 2017

మేరీ టైలర్‌ రచించిన భారతదేశంలో నా జైలు జీవితం, మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌ ఇంగ్లీష్ లేదా తెలుగు పుస్తకం కావాలిఒక విజ్ఞప్తి

పాఠకుల కోరికపై మేరీ టైలర్‌ రచించిన ''భారతదేశంలో  నా జైలు జీవితం'' అనే పుస్తకాన్ని పునర్ముద్రించాలనుకుంటున్నాం.

మన దేశంలో 1970లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఆమె రాసిన ఈ పుస్తకం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పెంగ్విన్‌ వారు ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌'' అన్న పేరుతో ఇంగ్లీషులో వెలువరించగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1983లో ''భారతదేశంలో నా జైలు జీవితం'' పేరిట తెలుగులో ప్రచురించింది.

అయితే ప్రస్తుతం మాదగ్గర వున్న ఒకే ఒక ప్రతి కవర్‌పేజీ సరైన స్థితిలో లేదు.  ముద్రణా యొగ్యమైన మేరీ టైలర్‌ ఫొటో కూడా అందుబాటులో లేదు. కాబట్టి ఎవరిదగ్గరైనా ఈ దిగువ ఇంగ్లీషు లేదా తెలుగు పుస్తక ప్రతి ముఖచిత్రం మెరుగైన స్థితిలో వున్నట్టయితే దయచేసి మాకు పంపించవలసిందిగా కోరుతున్నాం. వారం పది రోజుల్లో మీ పుస్తకాన్ని మీకు భద్రంగా తిరిగి అందజేస్తాం. ( పెంగ్విన్ కాకుండా ఇతర పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకం మాత్రం అవసరం లేదు.)

పుస్తకం పంపించడానికి వీలుకాకపోతే కవర్‌ పేజీని ముద్రణకు అనువుగా హై రెజల్యూషన్‌తో స్కాన్‌ చేసి ఈ కింది చిరునామాకు వెంటనే పంపించండి.

ధన్యవాదాలు       
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ,

07 నవంబర్‌ 2017 మా చిరునామా:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్ నెం 85 , బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌ - 500006

ఫోన్‌ నెం. 040-23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com
Monday, November 6, 2017

జయకాంతన్‌ కథలు తెలుగు అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

'' మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్‌ కథలో కొన్ని - ఇదిగో మీ కోసం....'

- కామం పిడికొట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు, ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే రసవాదం సంభవిస్తుంది. కానీ సోదరభావంతో తను కట్టుకున్న పంచెను తీసి ఆమెను కట్టబెట్టేస్తాడు - 'ఉడుపు'కథలో...

ఇంట్లో ఉక్కపోత, ఒంట్లో ఉక్కపోత, వీథిని చూసే కిటికీనే తన ఒంటరితనానికి పరిష్కారం ఆ తల్లిలేని అమ్మాయికి. కెలైడ్‌స్కోప్‌ లాగా వీథిలో పరుగులు తీసే దృశ్యాలు ఆమె జీవితపు కలలు. దృశ్యాలలో కాలమూ దొర్లిపోతుంది. కిటికీకే అంకితమైపోయి 'బామ్మ' పట్టమూ దక్కించుకుంటుంది. చదివే పాఠకుని హృదయంలో శోకపూరితమైన వీచిక చుట్టేస్తుంది - 'నేను కిటికీ దగ్గర కూర్చోనున్నాను'... అన్న కథలో...

నమ్మిన వ్యక్తి చేసిన మోసానికి తాను గురయ్యానని బాధపడి, మనసుకు సర్దిచెప్పుకుంటే - ఆశ్చర్యకరంగా తనను మోసం చేసిన వ్యక్తి చేసిన పనివల్ల మనిషిమీద అపారమైన నమ్మకాన్ని కలిగించే కథ- 'నమ్మకం'

ఏ స్పందనలూ లేని ముసల్ది పిల్లల్ని బొమ్మల్లా బడికి తీసుకెళ్లి వస్తుంటుంది. కానీ కఠినమైన శిలలోనూ జల స్పర్శను కలిగించే కథ- 'యంత్రం'

ఎదురుచూపులకే తన జీవితాన్ని అంకితం చేసి ఒంటి స్తంభంలా నిలబడిపోయిన ఒక స్త్రీ అంతర్యపు లోతుల్ని తేటతెల్లం చేసే కథ - 'ఎదురుచూపులు'

ఇలా... స్త్రీ పురుష సంబంధాల గాఢతను తెలిపే మరెన్నో కథలు ఇందులో... చదవండి!

జయకాంతన్‌ కథలు

తెలుగు అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ

పేజీలు: 218 వెల : 150Tuesday, October 31, 2017

ఒక తల్లి తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం

Add caption

చిన్న కొడుకు, ఇరవై యేళ్ళవాడు, అలా యెందుకు మారిపోయాడు? ఇంటి పట్టున ఉండడు, యెక్కడికి వెడుతున్నాడో స్నేహిం చేస్తున్నాడో తెలియదు. తల్లికి గాని తండ్రికి గాని తెలియదు. డబ్బుకి లోటులేదు. పుష్కలంగా ఉంది. కాలేజి చదువు పూర్తికాగానే అమెరికా పంపి పై చదువులు చదివించాలనుకున్నారు. కాని ఈ చిన్న కొడుకు అందిరికీ దూరమైపోయాడు. ఇంటిలో యెవరితోనూ మనసిచ్చి మాటాడడు. భోగభాగ్యాలంటే నిరసన. తల్లికి అర్థంకాదు. చిన్న కొడుకు మారిపోయాడు. చివరికి ఇరవయ్యోయేట దారుణంగా చంపబడ్డాడు. వాడు పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే, జనవరి 17 తల్లికి మాత్రమే ఇదిజ్ఞాపకం, వాడు చచ్చిపోయి ఏడాది తిరిగి వచ్చింది. ఆ రోజున తల్లి అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందుకలా అయిపోయినాడని. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి బోధపడింది. బోధపడేసరికి తట్టుకోలేక పోయింది. ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది. ఇది ఆ ఒక్క తల్లి కథకాదు. ఈనాడు సమాజంలో కొత్తతరం. యువజనం, స్వాతంత్య్రానంతరం పుట్టిన తరం, ఇలా యెందుఉక మారిపోతున్నారో తెలియక దు:ఖానికి గురవుతున్న అనేక మంది తల్లుల కథ - అందరి తల్లుల కథ కూడా
మహాశ్వేతాదేవి బెంగాలీలో రచించిన యీ నవల విశేష ప్రచారం ప్రశంసలూ పొందిన తరువాత, నాటకంగా కూడా విశేష ప్రచారం సాధించింది. ఈమధ్యనే ప్రఖ్యాత దర్శకుడు గోవింద నిహలానీ దర్శకత్వంలో ''హజార్‌ చౌరాసియాకి మా'' అనే పేరుతో సినిమాగా కూడా నిర్మించబడింది. గ్రామీణుల దుర్భర జీవితాన్ని యథాతథంగా చిత్రించిన మరో నవల ''రాకాసి కోర, అలాగే ''ఎవరిదీ అడివి'', ''దయ్యాలున్నాయి జాగ్రత్త'' యింతకు పూర్వం ప్రచురించాం.

ఈ రచయిత్రి ప్రతిష్ఠాత్మక మెగసేసే, జ్ఞానపీఠ్‌ అవార్డులు కూడా పొందారు.

ఒక తల్లి 
తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం 
141 పేజీలు  ; వెల: రూ. 150

Tuesday, October 17, 2017

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు - టి. జే. ఎస్. జార్జ్ తెలుగు అనువాదం : ఓల్గా

యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశం లోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్ధం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మదురైలో ఒక సామాన్య దేవదాసి కుటుంబంలో షణ్ముగవడివు అనే వైణికురాలికి జన్మించిన యమ్‌.యస్‌. సుబ్బులక్ష్మి ''భారతరత్న'' పురస్కారానికి చేరుకున్న క్రమం, ఆమె జీవిత గమనం కేవలం ఆసక్తికరంగా వుండటమే కాదు. ఆధునిక భారతదేశంలో కులం, జండర్‌ యెలాంటి పరిణామాలను పొందాయో, యెన్ని సంక్లిష్ట, భిన్న సందర్భాలను యెదుర్కొన్నాయో, ఆ వివక్షలను యెదుర్కునేందుకు స్త్రీలు యెలాంటి సాహసాలు, పోరాటాలు, ప్రయోగాలు చేశారో, యెలా రాజీపడ్డారో తెలియజేప్పే ఒక చారిత్రక సామాజిక శాస్త్ర పాఠం. అగ్రవర్ణ పురుషుల ఆక్రమణలో శతాబ్దాలుగా చిక్కుబడిన కర్ణాటక సంగీతం ఆలపించిన స్వేచ్ఛా గీతం యమ్‌. యస్‌. సుబ్బులక్ష్మి.

ఈ పుస్తకంలో టి.జె.యస్‌ జార్జ్‌ కేవలం ఆమె జీవిత కథను మాత్రమే చెప్పలేదు. కర్ణాటక సంగీత భౌగోళిక సామాజిక, రాజకీయ స్వరూప స్వభావాల సారాంశంలో యమ్మెస్‌ యెక్కడ నిలబడి ప్రకాశిస్తున్నదో , ఆ స్థానమూ ఆ ప్రకాశమూ యెలా సాధ్యమయ్యాయో విశ్లేషించి, వివరించి, పోల్చి చెప్పాడు. కర్ణాటక సంగీతపు లోతుపాతులను కూడా. ఈ పుస్తకం తెలియజెబుతుంది.
మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 
పేజీలు; 240, వేల ,150/-


Thursday, September 14, 2017

కార్టూన్లలో 'కార్ల్ మార్క్స్'


కార్టూన్లలోమార్క్స్
మార్క్సిజం సామాన్య ప్రజలకు అర్థం కాని బ్రహ్మపదార్థంగా పరిగణింపబడు తున్నది.
ఇంతాచేస్తే ఇది సామాన్యుడి కోసమే ఏర్పడ్డ సిద్ధాంతం.
మార్క్సిజం కొద్దిమంది పండితుల సొత్తుగానే చాలాకాలం నుండి ఉంటున్నది. మళ్ళీ ఈ పండితులలో ఏకాభిప్రాయంలేదు. వాళ్ళ వాళ్ళ వాద భేదాలను బట్టి రకరకాల భాష్యాలు, ఖండనమండనలూ కనిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్య మార్క్సిజం నిజంగానే బ్రహ్మపదార్థమయి కూర్చున్నది.

ఈ పై పరిస్థితి ఒక్క తెలుగు ప్రాంతాలకే పరిమితమయినది కాదు. ప్రపంచ మంతా ఇదే పరిస్థితి ఉంది.
దీనికెక్కడో ఎవరో గండికొట్టకపోతే, మార్క్స్‌ తన సిద్ధాంతాన్ని ఎవరికోసం ఉద్దేశించాడో వారికందకుండా పోయే ప్రమాదం ఉంది.
ఈపాటికే మార్క్సిజం విశ్శవిద్యాలయ 'ఎకడమిక్‌' చర్చల్లో భాగమైపోయింది.

'మార్క్సిస్టు' అనేమాట కొంతమంది పేర్లకు బిరుదుగా కూడా తగిలిస్తున్నారు (వాళ్ళకి యిష్టమున్నా లేకపోయినా). ఇదేదో ''పెద్ద పెద్ద'' వాళ్ళకు, ఉద్దండ పండితులకూ సంబంధించిన విషయమనుకొని, సామాన్యుడు దీన్నుంచి దూరంగా తొలగి పోతున్నాడు. ఇది హాస్యాస్పదమే కాదు, విచారించదగింది కూడా.
మార్క్సిజాన్ని తెలుగులో చెప్పే ప్రయత్నాలు చాలాకాలం నుంచి జరుగు తున్నాయి.
తెలుగు పత్రికలు తెలుగు ప్రచురణ సంస్థలు, ఔత్సాహికులైన వ్యక్తులూ ఈ పనిచేస్తున్నారు.
వాళ్ళ సిన్సియారిటీని ఏమాత్రం శంకించడానికి వీల్లేదు.
కాని వాళ్ళ ప్రయత్నం ఆశించినంతగా ఫలవంతం కాలేదు. విషయం కఠినమయింది కావటం ఒక్కటే అందుకు కారణం కాదు. ఉపయోగించిన భాష 'గొట్టు'ది కావటం ఇంకో ముఖ్యకారణమనుకుంటాం.

అయితే పూర్వప్రయత్నాలు పూర్తిగా నిరర్థక మయినవిగా భావించడం పొరబాటు. ఇప్పటి వాళ్ళు స్వేచ్ఛగా వాడుకోవడానికి వీలుగా, మాట్లాడుకోటానికి అనువుగా బోలెడు పదజాలాన్ని వెనకటితరం వాళ్ళు సృష్టించి ప్రచారం చేశారు.

'పెట్టుబడిదారీ విధానం, కార్మికవర్గం, వర్గసామరస్యం, వర్గ వైరుధ్యం, వర్గ పోరాటం, చారిత్రక భౌతికవాదం, గతితర్కం'' వంటి ఎన్నో మాటలు ఇవాళ ఏమంత కొత్తవిగా అనిపించకపోవటానికి కారణం, ఇంతకు ముందటి వాళ్ళ కృషే. అంతేకాక 'ఫ్యూడలిజం, బూర్జువా, బూర్జువాజీ, సోషలిజం వంటి ఇంగ్లీషు, ఫ్రెంచి మాటలు తెలుగు మాటలతో బాటు ప్రచారం కావటానికి కూడా వాళ్ళ ప్రయత్నమే కారణం.

అయితే ఆ ప్రయత్నం మాత్రమే చాలదు. వీలైనన్ని పద్ధతుల ద్వారా, మార్గాల ద్వారా ఆ పని జరగాలి. విషయం సాధ్యమయినంత ఎక్కువ మందికి బోధపరచాలి. తప్పులు పోతాయని భయపడుతూ కూర్చుంటే అసలు పనే జరగదు.

మార్క్సిజాన్ని సంప్రదాయేతర మార్గాలద్వారా చదివే వాళ్ళకు ఆసక్తి కలిగించే లాగా చేయాల్సిన అవసరాన్ని మెక్సికోలో 'రీయుస్‌' అనే మారుపేరుతో బొమ్మలు వేసే ప్రఖ్యాత కార్టూనిస్టు ఎడువార్డో-డెల్‌-రియో అనే ఆయన గుర్తించాడు.
దాని ఫలితమే ఈ పుస్తకం.
అంతర్జాతీయ బహుమతులందుకున్న కార్టూనిస్టు ఇతను. కార్టూను బొమ్మల ద్వారా మార్క్సును (అంటే మార్క్సిజాన్ని) పరిచయం చెయ్యటం ఒక కొత్త ప్రయత్నం. చదివేవాళ్ళను ఆకట్టుకొని ముందుకు లాక్కుపోయే గుణం ఈ కార్టూన్లకుంది. బొమ్మల ద్వారా సున్నితమైన హాస్యం కలిగిస్తూ, మాటల్లో కూడా సాధ్యమైనంత చమత్కారాన్ని నింపుతూ సాగిన ఈ రచన పుస్తక రచనలలోనే సరికొత్త ప్రయోగం.
అనుకున్న లక్ష్యానికి అత్యంత ప్రయోజనకారి
....

(1982 నాటి తోలిముద్రణ కు 'చే. రా. ' రాసిన ముందుమాట నుంచి )

కార్టూన్లలో మార్క్స్
-రీయుస్
తెలుగు అనువాదం : కే. బాలగోపాల్ 

148 పేజీలు  ; వెల: రూ. 100


Tuesday, September 12, 2017

బొజ్జా తారకం జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను" ఆవిష్కరణ సభ 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో


బొజ్జా తారకం జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను"
ఆవిష్కరణ సభ 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో

బొజ్జా తారకం గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా 16 సెప్టెంబర్ 2017 శనివారం 5-30 కి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సంస్మరణ సభ,  అయన జ్ఞాపకాల సంచిక "నీలి ఆకాశంలోఎర్ర నక్షత్రం"; కవితల సంపుటి "నేనడుగుతున్నాను" ఆవిష్కరణ జరుగుతుంది
అధ్యక్షత: కాకి మాధవ రావు IAS
ముఖ్య అతిధి : జస్టిస్ సురశ్ కైత్
వక్తలు : ప్రొ. హరగోపాల్, గెడ్డం ఝాన్సి, బత్తుల పున్నయ్య, దాసరి శ్రీనివాసులు , ప. అంజయ్య,
నాళేశ్వరం శంకరం
మిత్రులకు ఆహ్వానం
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్ 

Friday, September 1, 2017

ఆనాటి ''నలుపు'' ప్రజా పక్ష పత్రిక సంచికలను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!


''నలుపు'' ప్రజా పక్ష పత్రిక

సిరిల్‌ రెడ్డి ప్రచురణ కర్తగా, బొజ్జా తారకం సంపాదకుడిగా, కె.బాలగోపాల్‌, డి. నరసింహారెడ్డి, కంచె ఐలయ్య, సజయ, పి.ఎల్‌. విశ్వేశ్వరరావు, ఆర్‌.అఖిలేశ్వరి ప్రభృతులు సంపాదక వర్గ సభ్యులుగా వెలువడిన ''నలుపు'' పత్రిక ఆనాడు కుల, వర్గ, అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన విషయం విదితమే.

1989 ఏప్రిల్‌ లో ప్రారంభమై 1993 వరకు ఐదేళ్లపాటు నిరాటంకంగా నడచిన ఈ పత్రిక తెలుగునాట రాజకీయ సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసింది. కారంచేడు అనంతరం ఉవ్వెత్తున ఎగిసిపడిన దళితోద్యమాలకు, రిజర్వేషన్లపై మండల్‌ కమిషన్‌ నివేదిక అనంతరం చెలరేగిన ఆందోళనలకు, వామపక్ష సాయుధ రైతాంగ పోరాటాలకు అద్దంపట్టింది.

రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణలకు నలుపు గొప్ప వేదికగా నిలిచింది.

నలుపులో ప్రచురించిన బొజ్జాతారకం వ్యాసాలు, సంపాదకీయాలను ఇటీవలనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తక రూపంలో వెలువరించింది.

నలుపును అధ్యయనం చేయడం అంటే ఆనాటి పోరాటాల తీరుతెన్నులను, రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో చోటుచేసుకుంటున్నమార్పులను అధ్యయనం చేయడమే.

విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇతర ఔత్సాహికులందరి సౌలభ్యం కోసం ఐదేళ్ల నలుపు పత్రిక
సంచికలన్నింటినీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
దిగువ లింక్‌ ల ద్వారా నలుపు పత్రికలను పిడిఎఫ్‌ రూపంలో ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు:

Online Catalog

Center for Research Libraries ,
Global Resources Network


1)    http://catalog.crl.edu/record=b2896132~S1

2)   https://dds.crl.edu/crldelivery/30204

ఎంతో శ్రమ తీసుకుని నలుపు పత్రికలన్నింటినీ స్కానింగ్‌ చేసిచ్చిన ''మనసు ఫౌండేషన్‌'' వారికి (http://www.manasufoundation.com/) ఈసందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలాగే ఈ బృహత్తర కార్యానికి ఇంకా ఎందరో హెచ్‌బిటి, నలుపు పత్రిక అభిమానులు ఎన్నో విధాలుగా తమ సహాయ సహకారాలు అందించారు వారందరికీ కూడా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాం.

మీ సలహాలు, సూచనలు ఏమైనా వుంటే ఈ కింది ఐడీకి మెయిల్‌ చేయండి:
hyderabadbooktrust@gmail.com

-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
https://dds.crl.edu/crldelivery/30204
...........................................................

కొందరు పాఠకుల సూచన మేరకు :
కోరుకున్న నలుపు పత్రికను, లేదా అందులోని  అవసరమైన  పేజీలను  డౌన్లోడ్ చేసుకునేందుకు సులువైన పద్ధతి :
1. ఈ దిగువ శాశ్విత లింక్ పై క్లిక్ చేయండి లేదా ఈ url ని ఉపయోగించి 'సెంటర్ ఫర్ రీసెర్చ్ లైబ్రరీస్' లోని 'నలుపు ప్రజల పక్ష పత్రిక' పేజ్ లోకి ఎంటర్ అవండి:
https://dds.crl.edu/crldelivery/30204

2. నిర్ణీత బాక్స్ లో కావలసిన పత్రిక పబ్లికేషన్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకోండి (1989-1993)
3. అదేవిధంగా అక్కడి కాలెండర్ లో కావలసిన నెల, కావలసిన పత్రిక తేది (బోల్డ్ ఫాంట్ లో వున్న అంకె ) పై క్లిక్ చేయండి
4.పత్రిక పీ డీ ఎఫ్  కనిపించగానే డౌన్లోడ్ బటన్  (కిందకు చూపిస్తున్నబాణం గుర్తు ఎగువ  కుడివైపున ఉంటుంది ) పై క్లిక్   చేయండి.
5. సంచిక ప్రత్యక్షమయ్యాక .మొత్తం పత్రికను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే "Download Full Issue " పై క్లిక్ చేయండి. కొన్ని పేజీలు  మాత్రమె కావాలంటే 'ఫ్రమ్-టూ' కాలం లో  పేజీ నెంబర్లను టైప్ చేసి ఆ తర్వాత"Download"  పై క్లిక్ చేయండి.
 .......


 


Tuesday, July 4, 2017

బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలు

బొజ్జా తారకం నలుపు సంపాదకీయాలు


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1980లో ఆరంభమైంది. దళిత అంశాలపట్ల మేం ప్రత్యేక శ్రద్ధ కనపరచటమన్నది కూడా దాదాపుగా అదే సమయంలో మొదలైందని చెప్పొచ్చు. డా|| బి.విజయభారతి గారు రచించిన  బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర (1982) మేం ప్రచురించిన తొలి పుస్తకాల్లోనే ఉంది. ఆ తర్వాత 1984లో మరాఠీ దళిత కథా సంకలనాన్ని తెలుగులోకి తెచ్చాం. 'శూద్రులెవరు?' అన్న అంబేడ్కర్‌ రచననూ అదే సంవత్సరం ప్రచురించాం. 1985లో జరిగిన కారంచేడు ఘటన సామాజికంగా, రాజకీయంగా పెద్ద కుదుపునే తీసుకువచ్చింది. హెచ్‌బీటీ విషయంలో కూడా దాన్నో ముఖ్యమైన మైలురాయిలా చెప్పుకోవచ్చు. ఆ దారుణకాండ అనంతరం పెల్లుబికిన ఉద్యమం ఎంతటి ప్రభావవంతంగా నడిచిందో వర్ణించటానికి మాటలు చాలవు. దళితులు సాగించిన

ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పాటు నిలకడగా జరిగిన అద్భుత ఉద్యమం ఇది. ఈ ఉద్యమ సమయంలో చర్చలకు ఒక వేదిక అవసరమన్న బలమైన నమ్మకంతో హెచ్‌బీటీ సిరిల్‌ రెడ్డి, బొజ్జా తారకం, మరి కొంతమంది కలిసి 'నలుపు' పత్రికను ప్రారంభించారు. అప్పటి వామపక్ష పార్టీలూ, ఉద్యమాలన్నీ కూడా కులం విషయంలో తాము అనుసరించాల్సిన వైఖరిపై ఇంకా స్పష్టత తెచ్చుకోలేదు. మరోవైపు షెడ్యూల్డు కులాల సంఘాలన్నీ కూడా 'సంక్షేమ' దృక్పథంతోనే పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైన 'నలుపు' పత్రిక... దళితుల గొంతుగా, అట్టడుగు వర్గాల సమస్యలు, ఆలోచనలు, ఆవేదనలన్నింటికీ అక్షర రూపంగా నిలిచేందుకు ప్రయత్నించింది. నలుపు మొదటి సంపాదకవర్గ సమావేశం 1988 మార్చి 12న ఉదయం 11 గంటలకు హెచ్‌బీటీ ఆఫీసులోనే జరిగింది. దాదాపు ఏడాది కసరత్తు అనంతరం 1989 ఏప్రిల్‌లో తొలి సంచిక వెలువడింది.

నలుపు- 'ప్రజా పక్ష పత్రిక' అనే పేరుతో వెలువడేది. పేరుకు తగ్గట్లుగానే నలుపు నిబద్ధమైన వామపక్ష ఉద్యమ మేధావుల నుంచి దళిత బహుజన ఆలోచనాపరుల వరకూ అందరినీ భాగస్వాములను చేస్తూ విశాలమైన చర్చా వేదికగా అవతరించింది. దీన్ని  తీసుకురావటం వెనక ఎంతగానో శ్రమించింది బొజ్జా తారకం. ఆయన కవి, రచయిత, న్యాయవాది, ఉద్యమకారుడు. హైకోర్టులో న్యాయవాదిగా పని చేసేవారు. ఇలా ఎన్నో వ్యాపకాలతో తన మీద ఎంతో పని భారం ఉన్నప్పటికీ 'నలుపు' కోసం ఆయన కచ్చితంగా సమయం కేటాయించి, ప్రత్యేక శ్రద్ధతో పని చేశారు. నలుపును ప్రజాపక్ష పత్రికగా తీసుకురావటం గురించి ఆయన మాటల్లో.. ''ప్రజలంటే అందరూ ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం బాధలకు, దోపిడీకి, హింసకు గురవుతున్న వాళ్ళు, హక్కులు కోల్పోతున్న వాళ్ళందరూ ప్రజలనే ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించింది నలుపు! ప్రత్యేకంగా దళితుల కోసం పత్రిక పెట్టటంగానీ, వ్యాసాలు రాయటంగానీ దీనిలో భాగమే...''

'నలుపు'కు బొజ్జా తారకం సంపాదకులు కాగా హెచ్‌బీటీ సిరిల్‌రెడ్డి ప్రచురణకర్త. సంపాదకవర్గంలో కె. బాలగోపాల్‌, డి. నరసింహారెడ్డి, కంచ ఐలయ్య, పి.ఎల్‌. విశ్వేశ్వర రావు, ఆర్‌. అఖిలేశ్వరి ఉన్నారు. నలుపును ప్రజలు తమ పత్రికగా సొంతం చేసుకున్నారు. వ్యాసాలు, క్షేత్ర నివేదికల వంటివి రాయటమే కాదు, పత్రికను స్వయంగా అమ్మిన

వాళ్ళున్నారు. రకరకాల రూపాల్లో 'నలుపు' పనిలో పాలు పంచుకున్నవాళ్ళు ఎంతోమంది.

1989-95 మధ్య పత్రిక ఐదేళ్ళ పాటు 'నలుపు' విజయవంతంగా నడిచింది. పోలీసులు దీన్ని కూడా విప్లవ పత్రికలా భావిస్తూ ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్నా కూడా పత్రిక రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో... రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా దొరుకుతూనే ఉండేది. ప్రజలు దీన్ని అంతగా అక్కునజేర్చుకున్నారు.

'నలుపు' ప్రతి ఒక్కరి జీవితాలను స్పృశించింది. హెచ్‌బీటీలో మాలో కూడా సరి కొత్త స్పృహ నింపింది. వామపక్ష ఆలోచనా ధోరణిలో ఎక్కడెక్కడ అంతరాలున్నాయన్నది వారికి బలంగా ఎత్తి చూపింది. దళితులకు వారి నిత్యజీవన పోరాటాల్లో అండగా నిలబడింది. దళిత రచయితలు, కార్యకర్తలకు కీలకమైన వేదికగా నిలిచి, వారి రచనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. వామపక్షాలకూ, దళిత వర్గాలకూ మధ్య అంతరాలను పూడ్చే దిశగా అవగాహనా పూరితమైన చర్చలకు దోహదపడింది. అప్పట్లో 'నలుపు'లో పనిచేసిన ఉపసంపాదకుల్లో గుడిపాటి, జగన్‌రెడ్డి, చంద్రమౌళి, ఎస్‌. జయ, వై. నాగేశ్వర రావు, ఎస్‌.మల్లారెడ్డి ఇలా ఎంతోమంది తర్వాతి కాలంలో మంచి రచయితలుగా, జర్నలిస్టులుగా నిలబడ్డారు.

1995లో ఆగిపోయే నాటికి 'నలుపు' దాదాపు దాని లక్ష్యాలను పాక్షికంగానైనా అందుకుందనే చెప్పొచ్చు. భిన్న వర్గాల వారిని, భిన్న నేపథ్యాల నుంచి వచ్చే ప్రజలను దళిత అనుకూల ఉద్యమాల్లో భాగస్వాములను చెయ్యటం, దళితేతరుల్లో కూడా దళిత అంశాలపట్ల స్పృహ పెంచటం, దళిత రచయితలకూ, కార్యకర్తలకూ అవసరమైన ఒక వేదికను అందించటం - వీటన్నింటిలోనూ 'నలుపు' కీలక మలుపుగా నిలిచిందన్నది నిస్సందేహం!
-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 183, వేల ,120/-


బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు '

బొజ్జా తారకం 'నలుపు వ్యాసాలు


తెలుగు రాజకీయాలకు సంబంధించినంతవరకు 1989-1995 మధ్యకాలం - అంటే కారంచేడు మారణకాండ అనంతరం జన చైతన్యం ఉవ్వెత్తున ఎగసిపడిన కాలం.  సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలన్నీ ఒక కుదుపునకు గురైన కాలం. అన్ని ముఖ్యమైన సమస్యలపై ఆ రోజుల్లో విస్తృతమైన చర్చలు జరిగేవి. అదే కాలంలో నలుపు పత్రికలో బొజ్జా తారకం ఎంతో సాహసోపేతంగా, లోతైన పరిశీలనతో, ప్రత్యక్ష పోరాటానుభవంతో రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు ఆనాటి తరానికి ప్రశ్నించడం, సంఘటితమవడం, ఎదురుతిరగడంలో మార్గనిర్దేశనం చేశాయి. మతోన్మాదం, కులోన్మాదం మళ్లీ పడగవిప్పి బుసకొడుతున్న ఈ రోజుల్లో వాటి ఆవశ్యకత మరింత వుంది.
--------------------------------------------------------------------------------------------------------------------------

అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురవుతున్న ప్రజల పక్షాన జీవితాంతం రాజీలేని పోరాటం సల్పిన బొజ్జా తారకం (1939-2016) వృత్తి రీత్యా సీనియర్‌ న్యాయవాది.
ఆయన నిరంతరం అధ్యయన శీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
అపారమైన న్యాయశాస్త్ర వైదుష్యంతో అటు న్యాయ పోరాటాలనూ, ఇటు ఉద్యమ సారధ్యాన్నీ శక్తివంతంగా నిర్వర్తించారు.
భారత రిపబ్లికన్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
కారంచేడు, చుండూరు, లక్షింపేట మారణకాండల ప్రతిఘటనలలో రాజీలేని పోరాటం సల్పారు. దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే పూర్తికాలం వెచ్చించిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
మానవ హక్కుల పౌర హక్కుల పరిరక్షణకై విస్తృతంగా కృషి సల్పిన ఆయన తన ప్రసంగాలు రచనల ద్వారా తన భావజాలాన్ని ప్రచారం చేశారు.
ఆయన రచనల్లో పోలీసులు అరెస్టు చేస్తే (1981),
నది పుట్టిన గొంతుక (1983),
కులం వర్గం (1996),
నాలాగే గోదావరి (2000),
దళితుడు-రాజ్యం (2008),
నేల నాగలి మూడెద్దులు (2008),
ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు (2012),
ఎస్సీ, ఎస్టీ నిధులు విదిలింపు మళ్లింపు (2012),
పంచతంత్రం (2012),
చరిత్ర మార్చిన మనిషి (2016) వీరి రచనల్లో ముఖ్యమైనవి.


ప్రతులకు, వివరాలకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 283, వేల ,200/-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌