Thursday, December 14, 2017

'సొంత దేశం'లోనే దేవుడు చచ్చిపోతున్నాడు - గౌరి లంకేశ్

'సొంత దేశం'లోనే  దేవుడు చచ్చిపోతున్నాడు
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)

'మాది దేవుడికే ఇష్టమైన ప్రదేశం' అని వర్ణించుకునే కేరళ రాష్ట్రంలో ఇటీవల దేవుడి పేరుమీద అనేక మరణాలు సంభవించడం చూస్తున్నాం.

భారత దేశంలోనే అతి పెద్ద పుణ్య క్షేత్రాలలో ఒకటైన కేరళలోని శబరిమలలో ఇప్పటివరకు మూడు పెద్ద దుర్ఘటనలు జరిగాయి. 2016 ఏప్రిల్‌ 10 న పుట్టింగల్‌లో జరిగినట్లే, 1952లో బాణాసంచా ప్రదర్శనలో మందుగుండు సామాగ్రి పేలి 62 మంది చనిపోయారు. 1999 లో మకరజ్యోతి చూడటానికి వెళ్లిన భక్తుల తొక్కిసలాటలో మరో 52 మంది చనిపోయారు. అంత పెద్ద దుర్ఘటనలు జరిగిన తరువాత కూడా 2011 లో మరొక సారి అదే శబరిమలలో మళ్లీ తొక్కిసలాట జరిగి 102 మంది చనిపోయారు.

పుట్టింగల్‌ దేవి ఆలయానికి వెళ్లే భక్తులు ఎలాగైతే బాణాసంచా పేలిస్తేనే కీడు తొలుగుతుందని నమ్ముతారో శబరిమల కెళ్లే భక్తులు కూడా మకరజ్యోతిని దర్శిస్తేనే తమ ఆత్మ ప్రక్షాళనం జరిగి దేవుని ఆశీస్సులు అందుతాయని నమ్ముతారు.

రెండూ నిజం కాదు.

పుట్టింగల్‌ ఆలయంలో జరిగే బాణాసంచా పేలుడు కార్యక్రమం నిజానికి వివిధ రాజకీయ పార్టీల, కుల సమూహాల నాయకుల బల ప్రదర్శనకి ఒక వేదిక. అక్కడ పేల్చే బాణాసంచా ఏటా 6000 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్నపరిశ్రమ నుండి వస్తోంది. అలాగే 'దివ్య' మకర జ్యోతి అనేది కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులు, అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్‌ దేవస్థానం సభ్యులు కలిసి చేసే పెద్ద మోసం. ఇవి అందరికీ తెలిసిన విషయాలే అయినా 'దివ్య దర్శనం',

        'కీడు' లాంటి  అంధ విశ్వాసాలు ఇంత కాలం కొనసాగటానికి  కారణమేంటి? హేతుబద్ధమైన ఆలోచన కంటే, ఇటువంటి మూఢనమ్మకాలే 'దైవ పరిశ్రమ'ని పెంచి పోషించటానికి సహాయ పడతాయి కనుకే వీటిని ఇంకా ఇంకా కొనసాగిస్తున్నారు.

మరి ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమిటి?

దేశ ప్రజల్లో మూఢ భక్తిని అంతమొందించి, విజ్ఞాన స్ఫూర్తిని పెంపొందించాలని చెప్పే రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన మన ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తోంది?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం అయ్యప్ప సిండ్రోమ్‌ను ఆవరించి వున్న ఆర్థిక అంశాలను పరిశీలించాలి.
ప్రతి సంవత్సరం, దాదాపు రెండు నుండి రెండున్నర కోట్ల మంది భక్తులు శబరిమలకి వస్తారు. రకరకాల రుసుముల ద్వారా వారి నుండి ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. ట్రావెన్కోర్‌ దేవస్థానం భక్తుల దాన ధర్మాల నుండి మరో 200 కోట్లు సంపాదిస్తుంది. వీరిద్దరూ కాక అక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, అనేక వ్యాపారాల వాళ్లు ప్రతి సంవత్సరం అయ్యప్ప సీజన్‌లో (నవంబరు-జనవరి మధ్య) బాగానే సంపాదించుకుంటారు. ప్రాణాలు,

తెలివి రెండూ పోగొట్టుకుంటున్న భక్తులు తప్ప మిగతా అందరికీ లాభం ఉంటోంది కనకే ఎవరికీ హేతుబద్ధ ఆలోచనని పెంచాలనే ఆసక్తి లేదు. లౌకికం పేరు చెప్పుకుని పరిపాలించే కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో అయినా, వీర నాస్తిక వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టు ఫ్రంట్‌ ప్రభుత్వంలో అయినా అయ్యప్ప ప్రభావం మాత్రం పెరుగుతూనే
వుంటుంది. ఇటువంటి ధోరణులు క్రైస్తవ, ఇస్లాం మతాలకు చెందిన పవిత్ర స్థలాలతో సహా ఎన్నో పవిత్ర స్థలాలలో చూడొచ్చు.

పుట్టింగల్‌ దుర్ఘటనపై ఇప్పటి కాంగ్రెసు ముఖ్యమంత్రి ఊమెన్‌ చాండీ ప్రకటించినట్లే, 1999 లో అప్పటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి ఇ.కె. నయనార్‌ కూడా శబరిమలలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం కలిగింది? జస్టిస్‌ చంద్రశేఖర మీనన్‌ ఆధ్వర్యంలోని ఆ న్యాయ కమిషన్‌ 'దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల భద్రత గురించి పట్టించుకోనందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషి'గా పరిగణించినప్పటికీ, కేరళ ప్రభుత్వం మాత్రం భక్తుల ప్రాణాలను రక్షించటానికి ఏ రకమైన చర్యలూ తీసుకోలేదు. పుట్టింగల్‌ దుర్ఘటనపై వేసిన విచారణ నివేదికకి కూడా ఇదే గతి పడుతుందని చెప్పటానికి పెద్ద దివ్యదష్టి అవసరం లేదు. ఇంకొక దుర్ఘటన జరిగినప్పుడు ఇంకొక న్యాయ విచారణకు ఆదేశిస్తారు.
         ఈ కథ ఇలా నడుస్తూనే ఉంటుంది.

ఇక ప్రజల భక్తి చుట్టూ రాజకీయ నాయకులు ఆడే ఆటలు చూద్దాం.
నాలుగు దశాబ్దాల కిందటి వరకు అయ్యప్ప పిచ్చి కేరళకి మాత్రమే పరిమితమయి ఉండేది. 1970ల నుండి మకరజ్యోతి గురించి బయట ప్రచారం, చెప్పుకోవటం మొదలైంది. 'జ్యోతి' కథతో ప్రభావితులయిన అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌, వారి కొడుకులు, కార్లు, షేవింగ్‌ క్రీముల గురించి ప్రచారం చేసినట్లే 'అయ్యప్ప మాల' గురించి కూడా అంతే అలవోకగా ప్రచారం చేసి పెట్టారు. త్వరలోనే అయ్యప్పకి ఉత్తర భారత దేశంలో కూడా ప్రజాదరణ పెరిగింది.
కేరళలోని హేతువాదులు దీన్ని చూసి ఆందోళన చెందారు. 1980 లలో ఒక అధ్యయనం జరిపి, మకర జ్యోతి మోసమని చెప్పటానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సంపాదించారు. వాళ్లు ఆ సాక్ష్యాలను బయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కర్తలు ఇద్దరూ మౌనం వహించారు. ఎట్టకేలకు 2008 లో పరిస్థితులు వారిని నిజాన్ని ఒప్పుకునేట్లు చేశాయి. అంటే, అన్ని సంవత్సరాల పాటు, అమాయక ప్రజలు మకరజ్యోతి అంటే దైవ దర్శనం అని నమ్మి దాన్ని చూడటానికి ప్రాణాల్ని పణంగా పెట్టి శబరిమలకు వస్తున్నారని తెలిసి కూడా, ఆ భక్తిని సొమ్ము చేసుకోవటానికి ఏ ఆధారం లేని ఆ నమ్మకాన్ని వారిద్దరూ అలాగే కొనసాగనిచ్చారు.

పుట్టింగల్‌ విషయానికొస్తే స్థానిక అధికారులు గుడిలోపల బాణాసంచా కాల్చటానికి అనుమతి నిరాకరించినప్పటికీ, రాజకీయ నాయకులు మొదట దాన్ని హిందూ వ్యతిరేక నిర్ణయంగా దూషించారు. ఆ తరువాత బాణాసంచా కాల్చటం హిందువుల మతాచారమని వాదించారు. ఆ తరువాత ఏ చట్టమూ తమను అడ్డుకోలేదని ప్రకటించారు.
ఎందుని వారికి ఆ ధీమా? ఎందుకంటే, ఇవన్నీ తరువాతి ఎన్నికల్లో తమకు ఓట్లు తెచ్చి పెడతాయని వారికి తెలుసు కాబట్టి.

ప్రజల ప్రాణాల కంటే మూఢ భక్తిని పెంపొందించి ఎన్నికల్లో గెలుపొందడం ముఖ్యమైంది కాబట్టే, దేవుడు తన సొంత రాష్ట్రంలో కూడా పదే పదే మరణించాల్సి వస్తోంది.


(బెంగుళూరు మిర్రర్‌, 11 ఏప్రిల్‌ 2016)

అనువాదం : ఎ. సునీత
.........................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌