Friday, September 6, 2013

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు
సి. కె. నారాయణ రెడ్డి అస్తమయం

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధిగా సుప్రసిద్ధులు అయిన  సి.కె.నారాయణ రెడ్డి గారు నిన్న అర్థ రాత్రి (5 సెప్టెంబర్‌ 2013న) హైదరాబాద్‌లో చనిపోయారని తెలియజేయడానికి చింతిస్తున్నాము. ఆయన వయసు 88 సంవత్సరాలు.

సికె గా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణ రెడ్డి. చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని
చల్లావారిపల్లిలో 1 ఆగస్ట్‌ 1925న జన్మించారు. మదనపల్లిలో బీసెంట్‌ థియొసాఫికల్‌ స్కూల్‌/కాలేజీలో బిఎ వరకు చదువుకున్నారు. కాలేజీలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. బిఎ రెండో సంవత్సరంలో వుండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు ఫైనల్‌ ఇయర్‌లో కాలేజీ నుంచి బయటికి వచ్చారు. గాంధీ ప్రభావంతో ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. తరచూ చరఖా తిప్పేవారు.

 సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. పేదల వేతనాలకోసం, భూమి కోసం భుక్తికోసం పార్టీ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.  దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కషి చేశారు. యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లిలో బడుగు వర్గాలకోసం సికె స్వయంగా పలు వసతి గృహాలను నిర్వహించారు. బాకారావు పేట, వాయలపాడు వసతి గృహాలకు సహాయ సహకారాలు అందించారు. అందులో వుంటూ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్‌ అధికారులు అయ్యారు. యువత కోసం రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు.

 సికె గారు 1962లో కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ వెంటనే భారత చైనా యుద్ధం కారణంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. 1967 లో చారుమంజుందార్‌ గ్రూపులో చేరారు. 1970లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975లో మళ్లీ జైల్లో నిర్భంధించింది. రెండేళ్ల తరువాత ఎమర్జెన్సీ ఎత్తివేయడంతో 1977లో విడుదలయ్యారు. ఆ తరువాత కొన్నాళ్లకు జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు నెలకొల్పి - ''ది స్కాల్‌పెల్‌, ది స్వోర్డ్‌'' - రిచర్డ్‌ అ లెన్‌  , టెడ్‌ గోర్డన్‌ (రక్తాశృవులు) ; ''ఫాన్‌షెన్‌'' - విలియమ్‌ హింటన్‌ (విముక్తి) ; ''మై ఇయర్స్‌ ఇన్‌ ఏన్‌ ఇండియన్‌ ప్రిజన్‌''- మేరీ టైలర్‌ (భారత దేశం లో నా జైలు జీవితం) ;'' రెడ్‌ స్టార్‌ ఓవర్‌ చైనా''- ఎడ్గార్‌ స్నో (చైనా పై అరుణ తార) తదితర పుస్తకాలను తెలుగులో ప్రచురించారు.

1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను నెలకొల్పి అప్పటినుంచి 1990ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషి చేస్తూ అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. సైద్ధాంతిక ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు, ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.

జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువై  కుక్క కాటు సంఘటనలు విపరీతంగా పెరిగినప్పుడు ఆ సమస్యపై అక్కినేని అమల వంటి శక్తివంతులైన జంతువుల హక్కుల గురించి పోరడే వాళ్లని ఎదిరిస్తూ ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై పోరాటాలు చేశారు.  ప్రభుత్వం శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు అనేక సౌకర్యాలను
కల్పించినప్పుడు స్వయంగా మాజీ శాసన సభ్యులయివుండి కూడా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో హత్యకు గురైన కామ్రేడ్ జార్జి రెడ్డి స్వయానా వీరి అన్న కుమారుడు.

సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ  వున్నారు.


.

2 comments:

  1. పదేళ్ళపాటు నా చెయ్యిపట్టుకుని సాహితీలోకంలోకి తీసుకెళ్లి-ఊరూవాడా ఎక్కడెక్కడో ఉన్న పాఠక మిత్రుల్నీ, మేథావుల్నీ ఎంతో దగ్గరగా, ఎంతో ఆత్మీయంగా పరిచయం చేశారు సి.కె. ఉన్నతమైన విలువల్నీ, అనుభవాల్నీ మాకు పంచి ఇచ్చిన సి.కె. కి జోహార్లు.

    - పరుచూరి సుబ్బయ్య,
    చరిత ప్రెస్

    ReplyDelete
  2. ధన్యజీవికి జోహార్.చల్లావారిపల్లి ఏ మండలం ఏ పంచాయతీ క్రింద వస్తుంది?

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌