Sunday, December 17, 2017

కుల రాజకీయాలు - ఒక ఆత్మహత్య - గౌరీ లంకేశ్


కుల రాజకీయాలు - ఒక ఆత్మహత్య 

(రోహిత్ వేముల గురించి బెంగళూర్ మిర్రర్ పత్రిక 19 జనవరి 2016 నాటి సంచికలో గౌరి లంకేశ్ రాసిన వ్యాసం. " కొలిమి రవ్వలు -  గౌరి లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి )

నేను ఈ వ్యాసం రాస్తుండగా కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు రోహిత్‌ వేముల మరణం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ రోహిత్‌?
26 ఏళ్ల  రోహిత్‌ ఎంతో తెలివైన, ఉత్సాహవంతుడైన యువకుడు. గుంటూరు లాంటి పట్టణంలో నివసించే ఒక పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రెండు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌ సాధించేంత తెలివితేటలు అతనికి ఉన్నాయి. తన ఫేస్బుక్‌ పోస్టులను గమనిస్తే సిగరెట్లు, బీరు, స్నేహితులతో సరదాగా గడపడం అతనికి ఇష్టమని తెలుస్తుంది. అతను సామాజిక స్పహతో కూడా ఉండేవాడని అతని పోస్టులు చూస్తే తెలుస్తుంది.

ఉదాహరణకి రెండేళ్ళ క్రితం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ''ఎక్కడైతే సమానత్వం వుంటుందో... ఒకరి పట్ల ఒకరికి కరుణ, ప్రేమ వుంటాయో... ఎక్కడైతే మత ఘర్షణలు వుండవో... ఎక్కడైతే కుల మతాల కతీతమైన ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు చిన్నపిల్లల మొహాల్లో కనిపిస్తుందో... అలాంటి సమాజాన్ని మనమంతా కోరుకుందాం'' అని  రాసాడు.

ఈ మధ్య జరిగిన ఎం.ఎం కల్బుర్గి హత్యను కూడా ఖండించాడు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ''నేను గొడ్డు మాంసం తింటాను.. నన్ను అడగడానికి మీరెవరు..?'' అనడాన్ని అభినందించాడు.
సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె మాటల్ని ఉటంకించాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన 'బీఫ్‌ ఫెస్టివల్‌' కు మద్దతు ప్రకటించాడు.
పఠాన్‌కోట్‌లో మరణించిన భారత సైనికులకు సంతాపం తెలిపాడు.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే రోహిత్‌ సమానత్వాన్ని నమ్మే ఒక ఉదారవాది, సున్నిత మనస్కుడు అని నాకు అర్థమైంది. ఒక పోస్ట్‌లో తనను తాను 'ప్రొ-లైఫ్‌ అంబేద్కర్‌వాది'నని ప్రకటించుకున్న ఈ యువకుడు మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?

ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో మాత్రమే వామపక్ష రాజకీయాలది పై చేయిగా వుండగా దేశంలోని మిగతా అన్ని విద్యా సంస్థల్లో మతతత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. వాళ్ళ ప్రధాన లక్ష్యం యువతను తమ మతతత్వ రాజకీయాలలోకి ఆకర్షించడం మాత్రమే అయినా ఆ పని కొన్నిసార్లు దారుణ హత్యలకు దారి తీసింది.

ఉదాహరణకు భోపాల్‌లో 2006 లో ప్రొఫెసర్‌ హెచ్‌.ఎస్‌ సబర్వాల్‌ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ూదీహూ) గూండాల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు.
'ఇండియా టుడే' వెబ్‌సైట్‌ ప్రకారం : 2009 లో ఇండోర్‌లో ఒక కాలేజి ప్రిన్సిపాల్‌ని ఎ.బి.వి.పి వాళ్ళు చుట్టుముట్టి బెదిరించగా ఆమె గుండె పోటుకు గురైంది.
2010 లో ఎ.బి.వి.పి గూండాలు గుజరాత్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ పరిమళ్‌ త్రివేది ఇంట్లోకి దూసుకెళ్లి ఆయన మీద దాడిచేశారు.
2011 లో ఉజ్జయినిలో ఎ.బి.వి.పి దుండగులు తన సహోద్యోగిని కొడుతుండగా చూసి ప్రొఫెసర్‌ సుందర్‌ సింగ్‌ ఠాకూర్‌ షాక్‌కు గురై మరణించాడు.
మన కర్ణాటక రాష్ట్రంలో సైతం 2005 లో నక్సల్‌ సానుభూతిపరుడనే ఆరోపణపై ప్రొఫెసర్‌ వి.ఎస్‌. శ్రీధరను ఎ.బి.వి.పి గూండాలు కొట్టారు.
ఈ మధ్య కాలంలోనే కొందరు దళిత బహుజన విద్యార్థులు ఈ కాషాయ మూకల దాడులను అడ్డుకోవటం మొదలుపెట్టారు. అంబేద్కర్‌, పెరియార్‌, నారాయణ గురు, జ్యోతిబా ఫూలే మొదలైన సంఘ సంస్కర్తల రచనలతో ప్రభావితులై దళిత బహుజన విద్యార్థులు వివిధ కార్యక్రమాలు చేపట్టడం కాషాయ మూకలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 

ప్రతిష్టాత్మక మద్రాసు ఐ.ఐ.టి విద్యార్థులు పోయినేడాది 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' ఏర్పాటు చేసుకుని మతతత్వానికి, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తే వెంటనే ఎవరో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మ్రృతి ఇరానీకి ఆకాశరామన్న ఉత్తరం రాసి ఫిర్యాదు చేశారు. వెనువెంటనే స్టడీ సర్కిల్‌ గుర్తింపును రద్దు చేశారు.

ఇప్పుడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంతు వచ్చింది. పోయిన ఏడాది యాకుబ్‌ మెమన్‌ ఉరి తీయబడ్డపుడు ఉరిశిక్షలను వ్యతిరేకించే అంబేద్కర్‌ విద్యార్థి సంఘం (ఎ.ఎస్‌.ఎ) దానిపై నిరసన తెలిపింది.

ఈ సంఘంలో రోహిత్‌ వేముల క్రియాశీల సభ్యుడు.

ఢిల్లీ యూనివర్సిటీలో 'ముజఫర్‌నగర్‌ బాకీ హై' ప్రదర్శన ఎ.బి.వి.పి చేత బలవంతంగా నిలిపి వేయబడినపుడు కూడా ఎ.ఎస్‌.ఎ దాన్ని ఖండించింది. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఎ.ఎస్‌.ఎ జరిపిన ప్రదర్శనపై హైదరాబాద్‌ యూనివర్సిటీ ఎ.బి.వి.పి  ప్రెసిడెంట్‌ సుశీల్‌ కుమార్‌ ''ఎ.ఎస్‌.ఎ గూండాలు దౌర్జన్యం గురించి మాట్లాడడం  హాస్యాస్పదంగా వుంది'' అని ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అంబేద్కర్‌ వాదులందర్నీ గూండాలు అంటున్నాడని కోపం తెచ్చుకున్న ఎ.ఎస్‌.ఎ సభ్యులు సుశీల్‌ కుమార్‌ క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. వాళ్ల సంఖ్యాబలం చూసి కాబోలు సుశీల్‌ కుమార్‌ తన వ్యాఖ్యను ఫేస్‌బుక్‌ నుంచి తీసేసాడు.

అయితే దళిత విద్యార్థులకు, కాషాయ వాదులకు మధ్య ఏర్పడ్డ ఘర్షణ అక్కడితో ముగిసిపోలేదు. ఎ.ఎస్‌.ఎ సభ్యులు తనపై భౌతిక దాడి చేసారని తర్వాత రోజు సుశీల్‌ కుమార్‌ ఆరోపించాడు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, కొందరు ఆర్‌.ఎస్‌.ఎస్‌, ఎ.బి.వి.పి సభ్యులు సుశీల్‌ కుమార్‌పై భౌతిక దాడి చేసినందుకు ఎ.ఎస్‌.ఎ పై చర్యలు తీసుకోవాలని వైస్‌ చాన్సలర్‌ మీద ఒత్తిడి తెచ్చారు.
సికింద్రాబాద్‌  ఎం.పి. బండారు దత్తాత్రేయ ''యూనివర్సిటీ కుల తత్వ, ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల స్థావరంగా మారిందం''టూ ఎ.ఎస్‌.ఎ సభ్యుల మీద చర్య తీసుకోవాలని స్మ్రృతి ఇరానీకి ఉత్తరం రాసారు. దీని మీద ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. ఎ.ఎస్‌.ఎ సభ్యులు సుశీల్‌ కుమార్‌ మీద దాడి చేసినట్లు గట్టి ఆధారాలేమీ దొరకలేదని అభిప్రాయపడి కూడా రోహిత్‌తో సహా ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేయాల్సిందిగా కమిటీ సిఫార్సు చేసింది. 

తన విద్యా జీవితం ముగింపుకొస్తున్న ఆ పరిస్థితిలో కూడా రోహిత్‌ ''సామాజిక అసమానతలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నా గొంతు నులమడానికి ప్రయత్నిస్తున్న నా స్నేహితులకి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ప్రియమైన స్నేహితులారా! దూది పరుపులతో నిప్పు కణికని ఆర్పే ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు. మరింత మండుతుంది. మనుషుల్ని వెలి వేసే సిద్ధాంతాలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా నేను చేస్తున్న ఈ పోరాటాన్ని, గోపరాజు రామచంద్రరావు (గోరా), నరేంద్ర దబోల్కర్‌ లాంటి వారు వేసిన దారుల వెంట ప్రయాణం చేస్తూ, కొనసాగిస్తూనే వుంటాను'' అని రాసుకున్నాడు.

ఆధారాలు లేనప్పటికీ ఐదుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేయటం మీద ఎ.ఎస్‌.ఎ అభ్యంతరం తెలపటం వలన వి.సి తన నిర్ణయాన్ని రద్దు చేసుకొని తాజా పరిశీలన కోసం ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయటానికి అంగీకరించాడు. రెండు వారాల తర్వాత మోదీ ప్రభుత్వం కొత్త వి.సిగా పొదిలి అప్పారావును నియమించింది. అప్పారావు కొత్త కమిటీని నియమించాడో లేదో  ఎవరికీ తెలియదు, ఎ.ఎస్‌.ఎ సభ్యులతో సహా అందరికీ తెలిసింది ఏమిటంటే డిసెంబర్‌ 20 న ఆ ఐదుగురు ఎ.ఎస్‌.ఎ సభ్యులూ వారి హాస్టల్‌ గదుల నుంచి ఉన్న పళంగా గెంటివేయబడ్డారని. అంతేకాదు, ఐదుగురు క్యాంపస్‌లోని ఏ కామన్‌ప్లేస్‌లకూ వెళ్లకూడదని ఆంక్షలు జారీ చేసారని.
మరో రకంగా చెప్పాలంటే వాళ్ళని 'అంటరాని వాళ్ళ'ని చేసి యూనివర్సిటీ వెలి వేసింది. ఈ విధమైన 'వెలి'కి వ్యతిరేకంగానే రోహిత్‌ లాంటి యువత మొదటి నుండి పోరాటం చేస్తున్నది. రోహిత్‌ అంతకుముందు పెట్టిన ఒక పోస్టుల్లో ''నేను చేస్తున్న యుద్ధం ఎంత పెద్దదో నాకు తెలుసు'' అన్నప్పటికీ ఇంత చదువుకొని, ఇన్ని మెట్లు ఎక్కి వచ్చాక కూడా మరోసారి కిందకు విసిరేయబడటం భరించలేకపోయినట్టున్నాడు. 

కుల సమస్య లేదన్నట్లుగా మనం ఎంత నటించాలని ప్రయత్నించినా, రోహిత్‌ వేముల మరణం కుల రాజకీయాల ఫలితమేనని గుర్తించక తప్పదు.

మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకపోతే మరెంతోమంది రోహిత్‌ వేములలు సమానత్వం కోసం చేస్తున్న తమతమ పోరాటాలను విరమించాల్సి వస్తుంది.


(బెంగుళూరు మిర్రర్‌, 19 జనవరి 2016)

అనువాదం : ఎం. వినోదిని
.................................................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి

అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌