Showing posts with label చరిత్ర. Show all posts
Showing posts with label చరిత్ర. Show all posts

Thursday, January 29, 2015

ఆధునిక భారత చరిత్ర రచన: బిపిన్‌ చంద్ర తెలుగు అనువాదం: సహవాసి



ఆధునిక భారత చరిత్ర
రచన: బిపిన్‌ చంద్ర
తెలుగు అనువాదం: సహవాసి


గతంలో భారతదేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటిష్‌ వారికీ మధ్య తేడా ఏమిటి? 

భారతదేశం మీద బ్రిటన్‌ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి? 
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏయే సామాజిక మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి? 
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేలుకొల్పాయి? 
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు? 
భారత జాతీయ వాదంలోని పాయలేమిటి? 
బ్రిటిష్‌ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం. 

ప్రజల ఆర్థిక సామాజిక జీవిత విధానాల్లో వచ్చిన పరిణటామాలకు చరిత్రకు పునాదిగా గ్రహించిన కొద్దిమంది చరిత్రకారులలో ఈ గ్రంధ రచయిత బిపిన్‌ చంద్ర ఒకరు. 
ఈయన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (డిల్లీ)లో ఆధినిక చరిత్రాచార్యులుగా  , నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌కు చైర్మన్‌గా పనిచేశారు.

సహవాసిగా చిరపరిచితులైన ఉమామహేశ్వరరావు తెలుగులో అనువాద ప్రక్రియకు ఒక కొత్త ఒరవడి దిద్దారు. ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావవంతంగా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ఘనత ఆయనది.

ఆధునిక భారత చరిత్ర

రచన: బిపిన్‌ చంద్ర
తెలుగు అనువాదం: సహవాసి
పునర్ముద్రణ: జనవరి 2015

356 పేజీలు, ధర రూ. 160/-


పతులకు, వివరాలకు:  
 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849 

Monday, January 12, 2015

భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం - డి.డి.కోసంబి



భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -

- దామోదర్‌ ధర్మానంద్‌ కోసంబి


ఇది ఎన్నో రకాలుగా కొత్త శకానికి నాంది పలికిన రచన. దాదాపు ప్రతి పేజీలోనూ మనకు సరికొత్త మౌలిక ప్రతిపాదనలు, స్వతంత్ర ఆలోచనలు కనబడతాయి. ... ఇది ఒక స్ఫూర్తిమంతమైన రచన. ... ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులను ఉత్తేజపరిచి, వారిలో ఆలోచనలను పురికొల్పిందిది.
- ఎ.ఎల్‌.బాషామ్‌

చరిత్ర అధ్యయనంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు కోసంబి. ఆధునిక గణితశాస్త్ర సూత్రాలను అన్వయిస్తూ, నాణాల బరువును బట్టి అవి ఎంతకాలంగా చలామణిలో ఉన్నాయో నిర్ధారించడమే కాదు - ఆయా కాలాలకు సంబంధించిన వివరాలను రాబట్టే దారి చూపారు.
- జె.డి.చెర్నాల్‌

కోసంబి అనుసరించిన విశ్లేషణా పద్ధతుల్లో చాలా భాగం - యాభై ఏళ్ల తర్వాత, ఇప్పటికీ అంతే ప్రభావవంతంగా, అంతే ఆమోదయోగ్యంగా ఉన్నాయి. మిగిలిన ఆ కొద్ది భాగం విషయంలో కూడా పునరాలోచన అవసరమవుతోందంటే అది - కొత్త ఆధారాలు వెలుగులోకి రావడం వల్లనో, సరికొత్త వివరణా సిద్దాంతాల వల్లనో, లేక గతాన్ని గురించిన మన దృక్పథాల్లో మార్పు రావడం వల్లనో తప్పించి మరేమీ కాదు.  కోసంబి రచనలను మళ్లీ మళ్లీ చదవడం అవసరం. చదివిన ప్రతిసారీ సంభ్రమానికి గురిచేస్తూ మనల్ని మరింత చారిత్రకంగా ఆలోచించేలా ప్రేరేపించడం వాటి విశిష్టత.
- రొమిలా థాపర్‌

ఆనాటికి అందుబాటులో వున్న ఆధారాలకు లోబడడం అనే పరిమితి చరిత్ర రచనలన్నింటికి లాగానే కోసంబి రచనలకు కూడా వుంది. అయితే అప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ప్రారంభకుడు ఆయనే గనుక ఆయన ప్రతిపాదించిన సమాధానాలను తప్పనిసరిగా పరీక్షించాల్సిందే. ఈ పుస్తకమే అంతిమం అని ఆయన కూడా అనుకోలేదు. కాకపోతే - తన తర్వాత చరిత్ర రచన అనేది విభిన్నంగా ఉండక తప్పని పరిస్థితి కల్పించారాయన
- ఇర్ఫాన్‌ హబీబ్‌
...     ...   ...

మనిషి కేవలం రొట్టెతో మాత్రమే జీవించడనీ, చరిత్రా సమాజమూ రెండూ కూడా శాశ్వతమైన ఆత్మ మీద వ్యక్తి సాధించే నియంత్రణ మీదనే ఆధారపడతాయనీ, భౌతికవాదం మానవ విలువలన్నింటినీ ధ్వంసం చేస్తుందనీ కొందరు నొక్కి చెబుతుంటారు.

దురదృష్టవశాత్తూ రొట్టెనో, అటువంటి మరొక పదార్థమో లేకుండా మనిషి మనుగడ సాగించలేడు.
దేహం లోపల ఆత్మ అనేటటువంటిదాన్ని ఆ వ్యక్తి ఉంచుకోగలగాలన్నా కూడా రొట్టె అవసరమే.

మానవ జీవుల సమూహం ఒక సమాజంగా మారాలంటే, ఆ మనుషులు ఏదో ఒకరకమైన పరస్పర సంబంధాలలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.

ఆ అత్యవసరమైన సంబంధం రక్తబంధుత్వం కాదు, దానికన్న విస్తృతమైనది. అది సరుకుల ఉత్పత్తిలో, వాటి పరస్పర వినిమయంలో రూపొందుతుంది.

వస్తువులను సేకరించడం గానీ, ఉత్పత్తి చేయడం గానీ ఎవరు చేస్తారు, ఏ సాధనాలతో చేస్తారు,
ఎవరు ఇతరులు చేసిన ఉత్పత్తిని ఆరగించి బతుకుతారు,ఆ హక్కు వాళ్లకు ఎలా వస్తుంది, దైవికంగానా, చట్టబద్దంగానా (ఎందుకంటే పూజా విధానాలూ చట్టాలూ కూడా సామాజిక ఉప ఉత్పత్తులే)పనిముట్ల మీద, భూమి మీద, కొన్నిసార్లు ఉత్పత్తిదారు శరీరంమీద, ఆత్మమీద కూడా యాజమాన్యం ఎవరిది, మిగులను ఎలా పంచాలో, సరఫరా ఎంత ఉండాలో, ఏ రూపంలో ఉండాలోఎవరు నిర్ణయిస్తారు వంటి ప్రశ్నలలో ఏవి అత్యవసరమని అనుకుంటుందనే దానిమీదనే ఒక ప్రత్యేక సమాజపు స్వభావం నిర్ణయమవుతుంది.

ఉత్పత్తి బంధాలతోనే సమాజం కలసికట్టుగా వుంటుంది. భౌతికవాదం మానవ విలువలను విధ్వంసం చేయదు సరికదా దానికి భిన్నంగా ఆ మానవ విలువలు సమకాలీన సామాజిక పరిస్థితులతో, ప్రబలంగా వున్న విలువ భావనతో ఎలా ముడిబడి వున్నాయో చూపుతుంది.

విలువ భావన లాగానే భాష కూడా భావాల వినిమయానికి దారితీసిన భౌతిక వినిమయ సంబంధాల నుంచే తలెత్తింది. నిజానికి ఆ భాష లేకపోతే భావవాది కనీసం తన ఆత్మ గురించి ఊహించడం కూడా సాధ్యం కాదు.

ఒక తాత్విక దృక్పథం గల వ్యక్తి ఈ ఎడ్ల బళ్ల దేశంలో రెండువేల సంవత్సరాల కింద రూపొందిన 'శాశ్వత' భావజాలాలతో తన మనసుకు నచ్చినట్టుగా ఈ యాంత్రిక ప్రపంచాన్ని తిరిగి తయారుచేయలేడు.

- డి.డి.కోసంబి
(మొదటి కూర్పు ముందుమాట నుంచి)


.....   .....    .....


కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధో ప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృత,గానే వున్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

మొత్తంగా కోసంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్‌ 'భారత చరిత్ర - డి డి కోశాంబి పరిచయం' (హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నా ముందే కోసంబి రచనలలో 'భగవద్గీత - చారిత్రక పరిణామం' ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1985) వెలువడింది.

ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు - 'భారత చరిత్ర పరిచయ వ్యాసాలు' (అనువాదం హెచ్‌ఆర్‌కె, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1986), 'ఆచరణలో గతితర్కం' (ఎగ్జాస్పరేటింగ్‌ ఎస్సేస్‌కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రచురణ, 1991) వెలువడ్డాయి.

తర్వాత 'ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత' (కల్చర్‌ అండ్‌ సివిలైజేషన్‌ ఇన్‌ ఏన్షియంట్‌ ఇండియా' కు ఆర్‌. వెంకటేశ్వరరావు అనువాదం, తెలుగు అకాడమీ ప్రచురణ, 1998) కూడా తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి  కూడా రావడంతో ఇంగ్లీషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.

నిజానికి ఇతర పుస్తకాలకన్నా, వ్యాసాలకన్నా ''యాన్‌ ఇంట్రడక్షన్‌ టు ది స్టడీ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ'' పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్రమీద స్థూల అవగాహన ఇవ్వడం మత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి వుండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నలు ఫలించక, చివరికి ఇది నా కోసం మిగిలిపోయింది.

- ఎన్‌. వేణుగోపాల్‌
(అనువాదకుడి మాట నుంచి)


...     ...    ...

భారత చరిత్ర అధ్యయనానికి ఒక పరిచయం -
- దామోదర్‌ ధర్మానంద్‌ కోసంబి



ఆంగ్ల మూలం :  An Introduction to the Study of Indian History, D.D.Kosambi
తెలుగు అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌

488 పేజీలు, ధర: రూ. 250/-


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849



Thursday, December 8, 2011

గౌరి, గణపతి చారిత్రక, సామాజిక పరిణామ వ్యాసాలు -పురాణం సుబ్రహ్మణ్యశర్మ



గౌరి, గణపతి
చారిత్రక, సామాజిక పరిణామ వ్యాసాలు
-పురాణం సుబ్రహ్మణ్యశర్మ
...

ఆదిమ ఆటవిక సమాజంలో ఉండే మాత్రృస్వామిక వ్యవస్థ, గణ వ్యవస్థల గురించి, తంత్ర శాస్త్ర రహస్యాలను గురించి దేవిప్రసాద్‌ ఛటోపాధ్యాయ రాసిన 'లోకాయత' అనే గ్రంథం ఆధారంగా పురాణం సుబ్రహ్మణ్యశర్మ తెలుగులో రచించిన వ్యాసాలు ఇవి.

మన సమాజం పూర్వ చరిత్రను మనం సక్రమంగా అర్థం చేసకోటానికి ఈ వ్యాసాలు తోడ్పడతాయి. నేడు ఇంటింటా, ఊరూరా పూజలందుకుంటున్న గౌరి, గణపతి వంటి మూర్తుల మూలాలను చారిత్రకంగా సామాజికంగా అన్వేషించే విశేష కృషి ఈ వ్యాసాల్లో కనబడుతుంది.

పురాణం సుబ్రహ్మణ్యశర్మ (1929-1996) సుప్రసిద్ధ పాత్రికేయులు. కథా నవలా రచయితగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, జీవిత చరిత్రకర్తగా సుబ్రహ్మణ్యశర్మ తెలుగు పాఠకులకు సుపరిచితులు. సత్య తత్వాన్వేషణ దృష్టి, సున్నిత హాస్యం మొహమాటంలేని సూటిదనం వీరి రచనల్లో కనిపించే సుగుణాలు.

ఈ పుస్తకంలోని కొన్ని శీర్షికలు:
1. ఆదిమ ఆటవిక సమాజంలో స్త్రీ స్వామ్యం
2. మాతృస్వామికమా? పితృస్వామికమా?ఏదిముందు
3. వైదిక ప్రజల తేజోమయ కవితా కల్పన పురుషసూక్తం
4. గణపతి చేతిలో దానిమ్మ పండు రహస్యం
5. స్త్రీస్వామిక వ్యవస్థపై ఆర్య వైదిక సమాజం దాడి
6. వామాచారం తంత్రశాస్త్ర రహస్యాలు
7. బౌద్ధ తంత్రం బౌద్ధ మతానికి వ్యతిరేకం
8. గణపతి
9. వేదాలలోని గణాలు, గణపతులు
10. మొట్టమొదటి సాంఘిక విప్లవం

గౌరి, గణపతి
చారిత్రక, సామాజిక పరిణామ వ్యాసాలు

-పురాణం సుబ్రహ్మణ్యశర్మ
81 పేజీలు, వెల : రూ.30

Saturday, October 1, 2011

వీరనారి ఝల్‌కారీ బాయి



వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి


ఝాన్సీకి చెందిన ఝల్‌కారీ బాయి ఒక దళిత వీర వనిత. గత అనేక శతాబ్దాలుగా బుందేల్‌ఖండ్‌ (ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం)లో ప్రజలు ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆమె పేరు ఇంతవరకూ చరిత్ర పుటల్లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయింది. ఆమె చరిత్రను దళిత రచయితలే అతి కష్టం మీద కాపాడుకుంటూ వస్తున్నారు. ఆమె జీవితాన్ని, ప్రత్యేకించి ఆమె మారువేషంలో ఈస్టిండియా కంపెనీ సైన్యంతో చేసిన పోరాటాన్ని బుందేల్‌ఖండ్‌లో జానపద గీతాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. ఆమె ధైర్య సాహసాలు, దళిత అస్తిత్వం ఉత్తర భారత దేశంలో దళితుల సాంస్కృతిక ఐక్యతకు దోహదం చేస్తూ గొప్ప స్ఫూర్తి నిస్తున్నాయి.

ఇవాళ ఇతర దళిత కులాలలో మాదిరిగానే కోరిస్‌ కులం వారు కూడా ఝల్కారీ బాయిని తమ కులదేవతగా కొలుస్తున్నారు. తమ స్వాభిమానాన్ని, తమ కుల ప్రతిష్టను పెంపొందించుకునేందుకు వారు ప్రతి సంవత్సరం ఝల్కారీ బాయి జయంతిని వేడుకగా జరుపుకుంటున్నారు. ఆమె కోరిస్‌ కులంలో పుట్టిన దళిత వీరాంగణ కావడం గర్వకారణంగా భావిస్తున్నారు. అందుకే ఆమె వీరోచిత పోరాటాన్ని గానం చేసేటప్పుడు వారు ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారని సుప్రసిద్ధ విద్యావేత్త బద్రీనారాయణ్‌ అంటారు.

వివిధ దళిత సంస్థలు ప్రతి యేటా ఝల్కారీ బాయి వర్థంతిని 'షహీద్‌ దివస్‌' (మృతవీరుల సంస్మరణ దినం) గా జరుపుతున్నాయి. గ్వాలియర్‌లో ఆమె పేరిట ఝల్కారీ బాయి బాలికల కళాశాల కూడా వుంది. 2001 జులైలో భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆమె స్మారకార్థం నాలుగు రూపాయల పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. 2010లో నీలి జెండా పత్రికలో ఈ పుస్తకం సీరియల్‌గా వచ్చింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ గతంలో అయ్యంకాళీ, పండిత్‌ అయోతీదాస్‌, కొమురం భీం వంటి విస్మృత దళిత కథానాయకుల జీవిత చరిత్రలను ప్రచురించింది. ఆ పరంపరలో భాగంగా ఇప్పుడు ఈ ఝల్కారీ బాయి జీవిత గాధను సగర్వంగా సమర్పిస్తోంది.

వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి
రచన: మోహన్‌ దాస్‌ నైమిశ్‌ రాయ్‌

తెలుగు: డా. జి.వి. రత్నాకర్‌

బొమ్మలు: పైడిరాజు
24 పేజీలు, వెల: రూ.30/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Monday, November 8, 2010

ఆధునిక భారత చరిత్ర ...


ఆధునిక భారత చరిత్ర ...

గతంలో భారత దేశాన్ని ఆక్రమించిన విదేశీయులకూ, బ్రిటీష్‌ వారికీ మధ్య వున్న తేడా ఏమిటి?
భారతదేశం మీద బ్రిటన్‌ సాధించిన విజయం ప్రత్యేకత ఏమిటి?
భారత జాతీయోద్యమానికి 1857 తిరుగుబాటు ఏ రకమైన ఊపునిచ్చింది?
ఏఏ సామాజిక, మత సంస్కరణోద్యమాలు ఆవిర్భవించాయి?
అవి ఏ సుప్త చైతన్యాన్ని మేల్కొల్పాయి?
జాతీయోద్యమానికి ప్రజలు ఏవిధంగా స్పందించారు?
భారత జాతీయవాదంలోని పాయలేమిటి?
బ్రిటీష్‌ వలసవాద కుటిల రాజనీతి ఫలితంగా దేశానికి కలిగిన అరిష్టమేమిటి?

ఈ ప్రశ్నలకు సామాధానమే ఈ పుస్తకం.
ప్రజల ఆర్థిక, సామాజిక జీవిత విధానాల్లో వచ్చిన పరిణామాలకు చరిత్రను పునాదిగా గ్రహించిన కొద్దిమంది చరిత్రకారులలో ఈ గ్రంథ రచయిత బిపిన్‌ చంద్ర ఒకరు.

భారత సామాజిక జీవితంలోని వైరుధ్యాలనూ, సంక్లిష్టతనూ బిపిన్‌ చంద్ర అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించారు. నాయకుల మీద, మహా వ్యక్తుల మీద కాకుండా చరిత్రచోదక శక్తుల మీద, ఉద్యమాల మీద తమ దృష్టిని కేంద్రీకరించారు.
18వ శతాబ్దపు ఆర్థిక, సాంఘిక విషయాల చర్చ ఈ పుస్తకంలో విశేషంగా వుంది.
విదేశాల నుంచి వచ్చిన వర్తక సంస్థలు ఈ దేశాన్ని సునాయాసంగా ఆక్రమించుకోటానికి దారితీసిన పరిస్థితులను గ్రహించటానికి ఈ చర్చ ఎంతో ఉపయోగపడుతుంది.
బ్రిటీష్‌ సామ్రాజ్యవాదతత్వాన్ని, భారత ప్రజల జీవన విధానాలమీద దాని ప్రభావాన్ని విపులంగా వివరించారు.
దేశ ప్రజల్లో జాతీయతా భావావిర్భావం, విదేశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాపిత పోరాటం, రాజకీయ స్వాతంత్య్ర సముపార్జన తదితర అంశాలను ఇందులో సవివరంగా చిత్రించారు.

ఆధునిక భారత చరిత్ర
బిపిన్‌ చంద్ర
 

ఆంగ్ల మూలం: Modern India, Bipin Chandra
తెలుగు: సహవాసి
ప్రథమ ముద్రణ:1988
పునర్ముద్రణ: 1992, 1994, 1996, 1998, 2000, 2003, 2007
పేజీలు: 348 వెల: రూ.100/-

Tuesday, July 21, 2009

చరిత్ర అంటే ఏమిటి? - ఇ.హెచ్‌. కార్‌ ...అనువాదం : వల్లంపాటి వెంకట సుబ్బయ్య ...



What is History? by E.H.Carr ...

అన్ని వాస్తవాలూ చారిత్రక వాస్తవాలేనా ?
చరిత్రకారుడు వాస్తవాలను ఎలా ఎన్నుకుంటాడు ?
పాలకవర్గ భావజాలం చరిత్రకారుణ్ణి ఎలా ప్రభావితం చేస్తుంది ?
చరిత్రకూ, తత్వశాస్త్రానికీ మధ్య వున్న సంబంధం ఎలాంటిది ?
ఏ తత్వశాస్రాన్నీ నమ్మని గొప్ప చరిత్రకారుడుంటాడా ?
చరిత్ర అంటే కొందరు ప్రముఖుల జీవిత చరిత్రేనా ?
చరిత్రలో కార్యకారణ సంబంధాన్ని నిర్ణయించటం ఎలా ?
చారిత్రక సంఘటనలను యాదృచ్ఛికత ఎలా నిర్ణయిస్తుంది ?
చరిత్ర తయారుచేసిన చరిత్రకారుడు చరిత్రను ఎలా రాస్తాడు ?
చరిత్ర శాస్త్రమేనా ?
ఆక్టస్‌, ఇసయా మెర్లిన్‌, కాలింగ్‌వుడ్‌, టాయన్‌బీ మొదలైన చరిత్రకారుల చారిత్రక దృక్పథాల్లోని లోపాలేమిటి?

చరిత్రను గురించిన ఇలాంటి ఇంకెన్నో ప్రశ్నలను ఈ గ్రంథం కూలంకషంగా చర్చిస్తుంది.
మన చారిత్రక చైతన్యాన్ని తట్టిలేపుతుంది.
ఇది ప్రతి చరిత్ర విద్యార్థికీ కరదీపికగా వుండతగ్గ పుస్తకం.
ఈ గ్రంథంలోని చరిత్రను గురించిన సిద్ధాంతాలను కొన్ని చిన్న చిన్న మార్పులతో సాహిత్యానికీ, సాహిత్య చరిత్రకూ అన్వయింపజేయవచ్చు.
అందుచేత ప్రతి రచయితా, విమర్శకుడూ తప్పకుండా చదవవలసిన పుస్తకం యిది.

చరిత్ర అంటే ఏమిటి?
- ఇ.హెచ్‌.కార్‌

ఆంగ్లమూలం : What is History? -E.H.Carr
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య

ట్రస్ట్‌ సంపాదకుడు: చేకూరి రామారావు
తొలి ముద్రణ: 1983
మలి ముద్రణలు: 1984, 1994, 1997
115 పేజీలు, వెల: రూ.22

Friday, December 5, 2008

ప్రతిష్టాత్మక 'క్లుగ్‌' అవార్డుకు ఎంపికైన ప్రముఖ భారత చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌కు అభినందనలు!






రొమిల్లా థాపర్‌కు క్లుగ్‌ అవార్డు

ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌ ప్రతిష్టాత్మక క్లుగ్‌ పురస్కారానికి సంయుక్తంగా ఎంపికయ్యారు. అమెరికా లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన ఈ అవార్డు విజేతలకు 10 లక్షల డాలర్ల పారితోషికం అందజేస్తారు. భారతీయ నాగరికతలోని భిన్నత్వంలోని ఏకత్వపు సంవిధానాన్ని చాటిచెప్పడంలోఆమె విశేష కృషి చేశారు. తరతరాల చరిత్రను పరిశోధించి, శాస్త్రీయ దృక్పథంతో సేవలనందించారని అమెరికా లైబ్రరీ కాంగ్రెస్‌ ఈ అవార్డు ప్రకటన సందర్భంగా ప్రశంసించింది. 77 సంవత్సరాల రొమిల్లా ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో చరిత్ర విభాగంలో ప్రొఫెస్‌గా వున్నారు. ఐర్లాండ్‌కు చెందిన చరిత్రకారుడు పీటర్‌ రాబర్ట్‌ లమెంట్‌ బ్రౌన్‌తో కలిపి థాపర్‌కు ఈ పురస్కారం బహుకరిస్తారు. చరిత్రలో వక్రీకరణలను, వివిధ సిద్ధాంతాలను కావాలని జోడించడాన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమె చరిత్రకు నిజమైన భాష్యం చెప్పారు అని పలువురు పరిశోధకులు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ చరిత్రను సమగ్ర రీతిలో విశ్లేషించగల చరిత్రకారులలో ఆమె అగ్రగణ్యురాలని ప్రశంసలు కురిపించారు.

(ఆంధ్రజ్యోతి, ఈనాడు 5-11-2008 సౌజన్యంతో)

రొమిలా థాపర్‌ తరతరాల భారత చరిత్రను 1983లోనే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని స్వర్గీయ సహవాసి తెలుగులోకి అనువదించారు. ఈ సందర్భంగా మరో సారి ఆ పుస్తకం గురించి ప్రస్తావించుకుందాం.
………………………………………


తరతరాల భారత చరిత్ర ... రొమిలా థాపర్‌ ...తెలుగు అనువాదం : సహవాసి

భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది.
నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి.
డి.డి.కొశాంబి, సుశోభన్‌ సర్కార్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిలా థాపర్‌, బిపిన్‌ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్రక్రియలో కొత్త విలువలు ప్రవేశపెట్టారు.
... ... ...

గతం కడుపులో దాగి వుంది ఓ నిధి.
ఏమిటా నిధి?
దాన్ని కనుక్కోడానికి మనకున్న ఆనవాళ్లేమిటి?
ఆధారాలేమిటి?
నిధి అంటే మనం పుట్టకపూర్వం వందల, వేళ ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర.
లిపి తెలియని అతి పురాతనకాలం మొదలు లిఖిత, ముద్రిత పత్రాల, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం కళలు, సాహిత్యం భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు, ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా, రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రొమిలా థాపర్‌ది.

రొమిలా థాపర్‌ నవతరం చరిత్రకారుల్లో ప్రముఖులు.
ఆమె 1931లో ప్రసిద్ధ పంజాబీ కుటుంబంలో పుట్టారు. 1958లో లండన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పొందారు. కొద్దికాలం అక్కడే దక్షిణాసియా ప్రాచీన చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేశారు. డిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్‌గా కృషిచేశారు.

తరతరాల భారత చరిత్ర
- రొమిలా థాపర్‌

తెలుగు అనువాదం : సహవాసి

ప్రథమ ముద్రణ: 1983
పుర్ముద్రణలు: 1984, 1993, 1998, 2000, 2005, 2006
179 పేజీలు, వెల: రూ.60
……………………..

Monday, November 17, 2008

చరిత్రలో ఏం జరిగింది? ... గార్డన్‌ చైల్డ్‌ .. తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య




మానవుడు తాను అవతరించిన మంచుయుగం నుంచి రోమన్‌ సామ్రాజ్య పతనం వరకు తన చెమటను చిందించి ప్రపంచ ప్రగతికి పునాదులు వేసిన గొప్ప శ్రమ జీవి.
రాళ్లతో, కుండ పెంకులతో చారిత్రక పూర్వదశలోని మహత్తర మానవేతిహాసాన్ని నిర్మంచిన హృదయమున్న మేధావి.

అటువంటి మానవజాతి వేల సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రస్థానాన్ని, మనిషి శ్రమ నైపుణ్యం పనిముట్ల భావజాలాన్ని లీలా సృష్టించాయో, చరిత్రగతిని ఎట్లా మార్చాయో వివరించే
ఈ పుస్తకంతో రచయిత గార్డన్‌ చైల్డ్‌ వేసిన బాట కొత్తది మాత్రమే కాదు... శాశ్వతమైనది కూడా!

ప్రొఫెసర్‌ గార్డన్‌ చైల్డ్‌ (1892-1957) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్‌ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు. వాటిలో చరిత్రలో
ఏం జరిగింది? ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం ప్రముఖమైనవి.

ఇందులో చర్చించిన అంశాలు:
1. పురాతత్వ శాస్త్రం చరిత్ర
2. పాత రాతి యుగం
3. కొత్త రాతి యుగం
4. రాగి యుగం
5. మెసపొటేనియాలో నగర విప్లవం
6. ఈజిప్టు, భారతదేశాల్లో తొలి కంచుయుగం నాగరికత
7. తొలి ఇనుపయుగం
8. ప్రాచీన నాగరికత ఉన్నత దశ
9. ప్రాచీన ప్రపంచం యొక్క పతనం


ఈ పుస్తక అనువాదకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు, సృజనాత్మక రచయిత. వీరు అనువాదం చేసిన ప్రపంచ చరిత్ర వంటి పుస్తకాలను లోగడ లోగడ
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. వీరు రాసిన కథాశిల్పం అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందింది. వీరు మదనపల్లిలోని బి.టి.కళాశాలలో లెక్చరర్‌గా
పనిచేశారు.

చరిత్రలో ఏం జరిగింది?
గార్డన్‌ చైల్డ్‌
ఆంగ్లమూలం: వాట్‌ హాపెన్డ్‌ ఇన్‌ హిస్టరీ, పెంగ్విన్‌.

తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
188 పేజీలు, వెల: రూ.40

Saturday, November 15, 2008

తరతరాల భారత చరిత్ర ... రొమిలా థాపర్‌ ...తెలుగు అనువాదం : సహవాసి





భారత చారిత్రక రచనకి సంబంధించి భావంలో, విషయ వివరణలో, వ్యాఖ్యానంలో వ్యాఖ్యానానికి అనుకూలంగా దిద్దుకొనే వాస్తవాలలో చాలా మార్పు వచ్చింది.
నూతన ధోరణులు చోటుచేసుకున్నాయి.
డి.డి.కొశాంబి, సుశోభన్‌ సర్కార్‌, ఇర్ఫాన్‌ హబీబ్‌, రొమిలా థాపర్‌, బిపిన్‌ చంద్ర వంటి కొత్త చరిత్రకారులు రంగంలోకి వచ్చారు.చారిత్రక రచనా ప్రక్రియలో కొత్త విలువలు ప్రవేశపెట్టారు.



... ... ...


గతం కడుపులో దాగి వుంది ఓ నిధి.
ఏమిటా నిధి?
దాన్ని కనుక్కోడానికి మనకున్న ఆనవాళ్లేమిటి?
ఆధారాలేమిటి?
నిధి అంటే మనం పుట్టకపూర్వం వందల, వేళ ఏళ్ల కిందట ఈ ప్రపంచంలో, అందులో భాగమైన ఈ దేశంలో ఏం జరిగిందో ఎరుకపర్చే చరిత్ర.
లిపి తెలియని అతి పురాతనకాలం మొదలు లిఖిత, ముద్రిత పత్రాల, పుస్తకాల పునాదుల మీద లేచిన సమీప గతం వరకు సాగిన భారత చరిత్ర గతిని, మతం కళలు, సాహిత్యం భావజాలం, వ్యవస్థలు, ఉద్యమాలు, ఇత్యాదుల్లో దర్శనమిచ్చే భారతీయ సంస్కృతి స్వరూపాన్ని అత్యంత ప్రతిభావంతంగా, రసవత్తరంగా, విజ్ఞానదాయకంగా వర్ణించిన ఘనత రొమిలా థాపర్‌ది.

రొమిలా థాపర్‌ నవతరం చరిత్రకారుల్లో ప్రముఖులు.
ఆమె 1931లో ప్రసిద్ధ పంజాబీ కుటుంబంలో పుట్టారు. 1958లో లండన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌ పొందారు. కొద్దికాలం అక్కడే దక్షిణాసియా ప్రాచీన చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేశారు. డిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్‌గా కృషిచేశారు.

తరతరాల భారత చరిత్ర
- రొమిలా థాపర్‌

తెలుగు అనువాదం : సహవాసి

ప్రథమ ముద్రణ: 1983
పుర్ముద్రణలు: 1984, 1993, 1998, 2000, 2005, 2006
179 పేజీలు, వెల: రూ.70/-

Monday, November 10, 2008

మానవుడే చరిత్ర నిర్మాత ... గార్డన్‌ చైల్డ్‌, తెలుగు అనువాదం: హెచ్‌. ఆర్‌. కె.






ప్రాచీన మానవ చరిత్రను పరిచయం చేసే పుస్తకాల్లో గార్డెన్‌ చైల్డ్‌ రాసిన ఈ పుస్తకాన్ని క్లాసిక్‌గా పరిగణిస్తారు.

మూడు లక్షల నలభైవేల యేళ్ల నుంచీ, నిప్పును పుట్టించి, రాళ్లను పనిముట్లుగా, ఆయుధాలుగా మలచుకొని మానవులు క్రూరమృగాల నడుమ ఎలా నిలదొక్కుకున్నారో ఈ పుస్తకం తెలియజేస్తుంది.

ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, నగరాల నిర్మాణం, రాజ్యం పుట్టుక, సదూర ప్రాంతాలలో వర్తకం, నగర విప్లవం వంటి దశలూ, మలుపులూ ఎలా వచ్చాయో వివరిస్తుంది ఈ పుస్తకం.

ప్రొఫెసర్‌ గార్డన్‌ చైల్డ్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జన్మించారు. ప్రాక్‌ పురాతత్వ చరిత్ర శాస్త్రజ్ఞుడైన ఈయన అనేక ప్రముఖ పుస్తకాలను రచించారు.

వాటిలో చరిత్రలో ఏం జరిగింది?, ఉదయించిన ఐరోపా నాగరికత, అతిప్రాచీన తూర్పు నాగరికత, సామాజిక పరిణామం అనేవి ప్రముఖమైనవి.

ఈ పుస్తక అనువాదకులైన హెచ్చార్కె తెలుగు పాఠకులకు కవిగా, రచయితగా, పత్రికా విలేఖరిగా సుపరిచితులు. స్వయంగా అనేక రచనలు చేయడంతో పాటు ఎన్నో ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.


మానవుడే చరిత్ర నిర్మాత

- గర్డన్‌ చైల్డ్‌

తెలుగు అనువాదం: హెచ్చార్కె

169 పేజీలు, వెల: రూ.50

Monday, October 13, 2008

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర ... రెండు భాగాలు ... రచన : కంభంపాటి సత్యనారాయణరావు ... తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామమోహనరావు


మనకింతకు పూర్వం రచించిన ఆంధ్రదేశ చరిత్రలున్నాయి. అవి సాధారణంగా రాజవంశాలనో, ప్రముఖ వ్యక్తులనో కీర్తిస్తూ సామ్రాజ్య విస్తీర్ణతను ప్రశంసించేవిగా వున్నాయి.
శాతవాహనులు తెలుగువారేనా? విజయనగర సామ్రాజ్యం తెలుగువారిదేనా? కాకతీయుల వర్ణమేది? ఇట్లాంటి ప్రశ్నలకు ఆ చరిత్ర గ్రంథాల్లో ప్రాధాన్యత ఎక్కువ.
ప్రజల సాంస్కృతిక చరిత్రను సాహిత్యం ద్వారా పునర్నిర్మించటానికి సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) కృషిచేసి ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రకటించారు.
ఆ తరువాత ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం గార్లు ఆంధ్రుల సంస్కృతి చరిత్ర-సంస్కృతి అనే గ్రంథం రచించారు. ఇందులో సాంస్కృతికాంశ పూర్వపు చరిత్రలకన్నా కొంత ఎక్కువ వున్న మాట నిజమే. అయినా ఈ రెండు పుస్తకాలు సమాజ ఆర్థిక వ్యవస్థను గురించి పట్టించుకొన్నవి కావు.
కంభంపాటి సత్యనారాయణగారు స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి వివిధ ప్రజోద్యమాల్లో పాల్గొన్నారు. బహు గ్రంథ రచయితలు.
వారు మార్క్సిస్టు మూలసూత్రాల వెలుగులో ఆంధ్ర దేశ ప్రజల ఆర్థిక సాంస్కృతిక చరిత్రను ఇంగ్లీషులో రచించారు. ఆయన పరిణత వయస్సులో బహు ప్రయాసల కోర్చి, ఎన్నో గ్రంథాలు పరిశీలించి స్వత్సంత పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు.
యూరపులో ఫ్యూడలిజానికి, మన దేశంలో చిరకాలం వర్థిల్లిన స్వయం పూర్ణ గ్రామీణ వ్యవస్థకూ భేదాల్ని చాలా స్వతంత్రంగా ప్రతిపాదించారు. ఈ పద్ధతిలో ఆంధ్ర దేశానికి చరిత్ర కూర్చటం ఇదే ప్రథమం.
తరవాత రాబోయే విపుల చరిత్రలకు ఇది మార్గదర్శకం అవుతుందని మా నమ్మకం.
ఈ పుస్తకంలో చేసిన ప్రతిపాదనలు తుది నిర్ణయాలనే భ్రమ రచయితకూ లేదు. ప్రకాశకులకూ లేదు.
ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితం ఆధారంగా నవలలు రచించిన సుప్రసిద్ధ రచయిత మహీధర రామమోహనరావుగారు ఈ గ్రంథాన్ని తెలుగు చేసి పెట్టారు. రామమోహనరావు గారు కూడా బహుగ్రంథ రచయితలేగాక, ప్రజోద్యమాల్లో జీవితాన్ని పండించుకున్నవారు. వారి సరళమైన అనువాదం ఈ పుస్తకాన్ని ఆకర్షణీంగా తయారు చేసిందని మా నమ్మకం.

మొదటి భాగంలో 1. చరిత్ర పూర్వయుగం, 2. సజీవ చరిత్ర పూర్వదశ 3. శాతవాహన యుగం 4. తెగ సంస్కృతి నుంచి నాగరికతకు పరివర్తన 5. శాతవాహనుల అనంతరపు వ్యవస్థా రూపం 6. ఫ్యూడల్‌ వ్యవస్థ పునాదులు 7. మధ్య యుగాల ఆరంభ దశ 8. ఫ్యూడల్‌ వ్యవస్థ పుట్టుక పెరుగుదల అనే ప్రకరణాలున్నాయి.

రెండవ భాగంలో 1. వరంగల్లు కాకతీయులు 2. వరంగల్లు కాకతీయులు వాణిజ్యం, సాహిత్యం కళలు 3. కాకతీయుల తదనంతరులు 4. బహమనీ రాజవంశం 5. గజపతుల కళింగ రాజ్యం 6. విజయ నగర సామ్రాజ్యం 7. విజయనగర రాజ్య పరిపాలనా వ్యవస్థ 8. విజయనగర రాజ్య ఆర్థిక విధానం 9. విజయనగరం సామాజిక స్థితి 10. విజయనగర సాహిత్యం కళలు, 11. కుతుబ్‌షాహీ రాజవంశం 12. కుతుబ్‌షాహీల పరిపాలనా వ్యవస్థ 13 కుతుబ్‌షాహీల ఆర్థిక నిర్మాణం 14. కుతుబ్‌షాహీ యుగ మతం సమాజ స్థితి 15. కుతుబ్‌షాహీ యుగ సాహిత్యం-కళలు 16 ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పులు: విదేశీ పెట్టుబడుల పాత్ర మొదలైన అధ్యాయాలున్నాయి.

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 1
190 పేజీలు వెల: రూ.50

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 2
274 పేజీలు వెల : రూ.75

రచన: కంభంపాటి సత్యనారాయణ
తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామ మోహనరావు

ఆంగ్ల మూలం : A Study of the History and Culture of the Andhras by Kambhampati Satyanarayana, Peoples's Publishing House, New Delhi.

Wednesday, September 24, 2008

దక్షిణ తూర్పు పవనం ... మెక్సికో జపటిస్టా జాతీయ విముక్తి సైన్యం తిరుగుబాటుదారుడు మార్కోస్‌ ఉత్తరాలు, ప్రకటనలు ... షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యూరీ



ఈ పుస్తకం మీరు చదవకపోతే ఎంతో నష్టపోతారు. కొద్ది రోజుల్లో మీ ముఖం వాడిపోతుంది. రాత్రులు నిద్రపట్టదు. క్రమంగా మీ జుట్టు రాలిపోతుంది. ఆ తరువాత కాళ్లు చేతులు సహకరించడం మానేస్తాయి. ఏం జరుగుతుందో తెలియని వేదనతో చనిపోతారు.
మీ ఇష్టం ...

... షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యూరీ ... మీద న్యూయార్క్‌ టైమ్స్‌లో బిల్‌ కాస్‌బీ రాసిన రివ్యూ నుంచి ...

...


ఇక ఇదే పుస్తకానికి గద్దర్‌ రాసిన ముందుమాట ...

ఈ మహా పుస్తకం చదివిన కొద్ది
అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
అన్నం పండించి తిండిలేని,
బట్టలను పుట్టించి మానం దాచుకోను మాసికలేని,
ఏడేడు అంతస్తుల అద్దాల మేడలు కట్టి,
దాని నీడలో కూడా తలదాచుకోలేని
కష్టజీవుల మూగ కన్నుల్లోకి చూసినప్పుడు
స్పందించే ప్రతి మనిషిలో ...
ఏదో అంతుచిక్కని సరికొత్త స్పందన మొదలౌతుంది
ఈ అక్షరాలను చదివిన కొద్ది.
నడిపే కాళ్లకే దుమ్ము అంటుతుంది
కలిసే చేతులకే బురద అంటుతుంది
బతకడం కోసమే చనిపోతమంటది ఈ పుస్తకం
మేం నేలతల్లి మీద సెమట సుక్కలు రాల్సినప్పటినుండి,
మాకు తెలియకుండనే మా రక్తాన్ని
శ్రమరూపంలో తాగేదివాళ్లే ...
హింసావాదులెవరో చెప్పండి
అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ పుస్తకం.
మేం కన్నీళ్లు రాల్చి
మా నిరసనను తెలిపితే ...
మా కనుపాపలను కూడా చిదిమేస్తే
కొడవండ్లు నూరకుండా ఏం చేయమంటారు?
అని అడుగుతుంది ఈ నెత్తురు ఉత్తరం.
మేం మహోన్నతమైన మానవులం
మా గుడిసెలోని పిల్లి, కుక్క, మేకపిల్ల, ఆవు, గుర్రం, గాడిదా ...
అన్నీ తిన్న తరువాతే మేం తింటాం
దీనిలో రహస్యమేమీ లేదు
మాకు స్వంత ఆస్తి లేదు.
చెట్లు.. పక్షులు.. నదులు.. పాములు.. పులులు వేటికీ మావల్ల హానిలేదు.
చంపడం మాకు చాలా సులువైన పని
కానీ అది మా నీతి కాదు
అన్నిటిని బ్రతకనివ్వని కొందర్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం
అది మా ధర్మంగా భాావిస్తాం.
ఆయుధాలే మా యుద్ధాన్ని నిర్ణయించవు
అవి ప్రాణంలేని సాధనాలే
మేం ఒక్కసారి మెంటల్లీ ఆర్మ్‌డ్‌ అయిపోతే
ఇక మాదే జయం, విజయం.
పుట్టలోని నాగన్న పుట్టలోనే వుంటే
మేం దానికి పాలు పోసి పూజిస్తాం
అది దారి తప్పి మా ఇంటికే వొస్తే
నాగస్వరం పాట ద్వారా వెల్లిపో నాగన్నా
అని బ్రతిమాలుకుంటాం
కానీ...
అది మా పసిపిల్లల తొట్టిలో ఎక్కితే
నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా నరికేస్తాం
అన్ని జీవరాసులు బ్రతుకాలనే కోరుకొంటాయి
కొన్ని మాత్రం బ్రతకడం కోసం చావుని కోరుకొంటాయి. అట్లాంటి వారమే ఈ జపటిస్టా జాతీయ విముక్తి సైనికులం. మీ మనసులో మాకింత చోటిస్తే మా బతుకు ధన్యం అని మురిసిపోతాం....
కొనసాగుతుంది ఈ పుస్తక కావ్యం -

దక్షిణ తూర్పు పవనం
మెక్సికన్‌ జపటిస్టా తిరుగుబాటుదారుడు మార్కోస్‌ లేఖలు, ప్రకటనల సంకలనం

ఆంగ్ల మూలం : షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యురీ, మంత్లీ రివ్యూ ప్రెస్‌, న్యూయార్క్‌

తెలుగు అనువాదం: శశి
72 పేజీలు, వెల రూ.18

Friday, September 19, 2008

ప్రపంచ చరిత్ర ...ఆంగ్ల మూలం: క్రిస్‌ బ్రేజియర్‌ ...తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్య



ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల చరిత్రల గురించి స్లూళ్లో నాకు నేర్పింది శూన్యం. అనంత యుద్ధాల, రాజకీయాల అడుగున సహస్రాబ్దాలుగా మరుగున పడిపోయిన మహిళల చరిత్ర గురించి నాకు బొత్తిగా తెలియదు. అది ఇప్పుడిప్పుడే కాలగర్భం నుంచి పైకి తేలుతున్నది. యుగయుగాల జన సామాన్యపు దైనందిన అనుభవాల తాలూకు సమాచారం కొద్దికొద్దిగా తెలుస్తున్నది. పిరమిడ్లు నిర్మస్తూ మరణించిన వ్యక్తుల, కోటల అడుగున వున్న నేలను దున్నిన సామాన్యుల వ్యథార్థ జీవిత యదార్థ దృశ్యాలు స్వల్పంగానైనా ప్రస్ఫుటమవుతున్నాయి..

పాత పాఠ్యపుస్తకాలన్నీ వదిలేసిన ఖండాల, సమాజాల లోతుల్లోకి తొంగి చూసినప్పుడు చరిత్ర పరిశోధన నాకు అద్భుతంగానే తోచింది.

అయితే, ఈ గుప్త చరిత్రలను నేను రాజ వంశాల, అగ్రరాజ్యాల యుద్ధాలకు సంబంధించిన సాంప్రదాయక కథనంతో జోడించే ప్రయత్నం కూడా చేశాను. సామాన్య స్త్రీ పురుషుల సేవనూ విస్మరించకూడదు. దానితో పాటే అప్పటి రాజకీయ స్థితిగతులనూ, ఆనాటి ప్రపంచ రూపకల్పనకు దోహదం చేసిన వివిధ సామ్రాజ్యాల విజయ పరంపరలనూ చరిత్రలో చేర్చాలి. వాటిని స్పృశించని చరిత్ర అయోమయంగా వుంటుంది.

చరిత్ర బోధన మెరుగవుతోంది.

చిన్నపిల్లలకు వాళ్లకు తెలిసిన పరిధికి వెలుపల వున్న మహా విశ్వ దృశ్యాన్ని ప్రదర్శించడంపై ఇతోధిక శ్రద్ధ పెరిగిందని వింటున్నాను. మంచిదే. ఒక గొప్ప అ ల్లిక తాలూకు కొద్ది భాగాలు మాత్రమే తెలిసిన మనలాంటి వాళ్లందిరి కోసమే ఈ రచన.
- క్రిస్‌ బ్రేజియర్‌


వస్తు మార్పిడి కాలం వరకు సామాన్యుల జీవితం ఒక రకంగా వుండి - మతం, భూస్వామ్యం ప్రవేశంతో ఎలా విచ్ఛిన్నమయిందో, రాజకీయ కుట్రలు, యుద్ధోన్మాదం, మతోన్మాదంతో రాజులు, పోప్‌లు ప్రపంచ మనుగడను ఎలా అధోగతి పాలుచేశారో విశ్లేషించిన పుస్తకమిది. అదే క్రమంలో బానిస తిరుగుబాట్లు, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాల ఉద్భవాలను కూడా ఇది వివరించింది.పెట్టుబడిదారి సమాజం ఆవిర్భావం వరకు ప్రతిబింబించిన ఈ సమగ్ర ప్రపంచ చరిత్రను అందరూ తప్పక చదవాలి.

ప్రపంచ చరిత్ర
క్రిస్‌ బ్రేజియర్‌
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
146 పేజీలు, వెల: రూ.30

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌