Tuesday, September 30, 2008

చదువు చర్చ ... ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌ ... స్వతంత్ర భారతంలో సమాజం - విద్య, చదువు మంచి చెడ్డలు, పాఠ్యపుస్తకాలూ పరీక్షా విధానాల్లో వలసవాద విధానాలు
ఏది బోధించదగింది?
దానిని ఎలా బోధించాలి?
విద్యావకాశాల వ్యాప్తి ఏ స్థితిలో వుంది?
పాఠ్యక్రమం సమస్యలతో ముడిపడి వున్న ఈ మూడు ప్రశ్నలు విద్యారంగంతో సబంధంవున్న వారందరూ ఆలోచించాల్సినవి.
వీటిపై విస్తృత చర్చ జరిగినప్పటికీ అది వికలచర్చగానే ముగిసిందని డాక్టర్‌ కృష్ణకుమార్‌ అభిప్రాయం. ప్రణాళికా కర్తలు, ఆర్థిక వేత్తలు, సమాజ శాస్త్రజ్ఞులు వాడే భాషది ఒక దారి, అధ్యాపకులు, విద్యా శిక్షకులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు వాడే భాషది మరో దారి. ఈ రెంటిలో ఏదీకూడా ప్రతి పిల్లవాడు తాను విద్యావంతుడు కావడానికి సాగుతున్న క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, అనుభవిస్తున్న మానసిక ఆందోళనల్ని ఆకళింపు చేసుకుని పరిష్కరించగలిగిందిగా లేదు.
ప్రొఫెసర్‌ కృష్ణకుమార్‌ తనదైన సునిశిత వివేచనా దృష్టితో విద్యా పరిశోధన, విద్యా విచారం అంకితమైపోయిన ఈ మూడు ప్రశ్నల పరస్పర సంబంధాన్ని కనుగొని పథ నిర్దేశం చేయగలిగారు. అద్యాపకులు, విద్యార్థులు, విద్యావేత్తలు, బాలల చదువంటే ఆసక్తి కలిగిన వారందరి ఆలోచనాలోచనాలను తెరిపించే ఈ అమూల్య సంకలనం ఆవశ్యం చదవదగింది.
డాక్టర్‌ కృష్ణకుమార్‌ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌గా వున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషా కోవిదులు. హిందీలో రాజ్‌ సమాజ్‌ ఔర్‌ శిక్ష, త్రికాల్‌ దర్శన్‌, విచార్‌ కా ధారా, వగైరా పుస్తకాలతో పాటు ఇంగ్లీషులో సోషియల్‌ కారెక్టర్‌ ఆఫ్‌ లెర్నింగ్‌, పొలిటికల్‌ అజెండా ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ద చైల్డ్స్‌ లాంగ్వేజ్‌ అండ్‌ ద టీచర్‌, లెర్నింగ్‌ థ్రూ కాన్‌ఫ్లిక్ట్‌ (పిల్లల పాఠాలు పెద్దలకు గుణపాఠాలు) తదితర పుస్తకాలు రాశారు.

చదువు చర్చ
- కృష్ణకుమార్‌
ఆంగ్ల మూలం: What is Worth Teaching, Social Character of Learning, Education and Society in Post Independecnce India - Looking towards the future.

తెలుగు అనువాదం: సహవాసి, కలేకూరి ప్రసాద్‌, ప్రభాకర్‌ మందార
115 పేజీలు, వెల: రూ.25

Sunday, September 28, 2008

శాంతి దూతలు మతోన్మాదాన్ని ఎదిరించిన మానవత్వం ... మహరాష్ట్ర, గుజరాత్‌ మతకల్లోలాల సమయంలో ప్రాణాలకు తెగించి సాటి మనుషులను కాపాడిన ఆదర్శమూర్తుల కథనాలు
2001 సంవత్సరం మహారాష్ట్రలోని మాలెగాంలో, 2002 సంవత్సరం గుజరాత్‌లో చెలరేగిన దారుణమైన మతకల్లోలాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీ విధ్వంసాలకు గురికావడం అటుంచి వందల సంఖ్యలో అమాయకులు, స్త్రీలు, పసిపిల్లలు ఊచకోతకు, సజీవదహనానికి గురయ్యారు.

మత పిచ్చితో మానవ మృగాలుగా మారిన వాళ్లు, మతరాజకీయ బేహారులు, అవకాశం కోసం పొంచి వుండే రౌడీమూకలు ఏకమై అన్ని మానవ విలువలను మంటగలిపారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అకృత్యాలకు పాల్పడ్డారు.

అయితే ఆ మతోన్మాదులు మారణాయుధాలు ధరించి వీధుల్లో స్వైర విహారం చేస్తున్న సమయంలో సైతం కొందరు మానవతామూర్తులు రాగల పరిణామాలను లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి సాటి మనుషులను ఆదుకునేందుకు నడుంబిగించారు. వారు కనబరచిన తెగువ విస్మయం కలిగిస్తుంది. మన సమాజంలో మానవతా విలువలు ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని మనసు స్వాంతన పడుతుంది.

ఫతే-ఏ-ఆలం పత్రికా సంపాదకుడు అబ్దుల్‌ హలీం సిద్ధిఖీ మహారాష్ట్రలోని మాలెగాంలో విస్తృతంగా పర్యటించి ఎందరో హిందువులను, ముస్లింలను ఇంటర్వ్యూ చేసి అట్టి అజ్ఞాత కథానాయకుల మానవీయ సేవలను అమన్‌ కే ఫరిష్తే పేరిట అక్షరబద్ధం చేశారు.
అదేవిధంగా ప్రముఖ పాత్రికేయులు హర్ష్‌ మందర్‌ గుజరాత్‌లోని షా ఆలం సహాయ శిబిరాన్ని సందర్శించి అక్కడ బాధితులే కార్యకర్తలుగా మారి సాటి వారికి సాయం చేస్తున్న వైనాన్ని విక్టిమ్‌ యాజ్‌ వలంటీర్‌ పేరిట ప్రంట్‌లైన్‌లో ఒక నివేదికను ప్రచురించారు.

స్ఫూర్తిదాయకమైన ఆ కథనాల సమాహారమే ఈ శాంతిదూతలు.


శాంతి దూతలు
మతోన్మాదాన్ని ఎదిరించిన మానవత్వం

అబ్దుల్‌ హలీం సిద్దిఖీ, హర్ష్‌ మందర్‌


ఆంగ్ల మూలం: Messengers of Peace by Abdul Haleem Siddiqui, Published in Communalism Combat, June-July 2003
Victim as Volunteer by Harsh Mander, Published in Fronline, July 18, 2003

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార
52 పేజీలు, వెల: రూ.15

Saturday, September 27, 2008

మానవతపై దాడి గుజరాత్‌ 2002 మారణకాండపై కన్సర్న్‌డ్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ నివేదిక

27 ఫిబ్రవరి 2002 ... కరసేవకులతో క్రిక్కిరిసిపోయిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అయోధ్యనుంచి అహ్మదాబాద్‌కు తిరిగి వస్తోంది.
1100 మంది ప్రయాణికుల సామర్థ్యం వున్న ఆ ట్రైన్‌లో 2000 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. వారిలో 1700 మంది వరకు కరసేవకులు వున్నారు.
త్రిశూలాలు, లాఠీలు పట్టుకున్న స్త్రీపురుష కరసేవకులు ప్రతి స్టేషన్‌లో దిగుతూ పెద్ద పెట్టున నినాదాలు చేయసాగారు.

మందిర్‌ వహీ బనాయేంగే... జై శ్రీరాం... ముస్లిం భారత్‌ ఛోడో పాకిస్థాన్‌ జావో... దూద్‌ మాంగేతో ఖీర్‌ దేంగే కాశ్మీర్‌ మాంగేతో ఛీర్‌దేంగే... అంటూ వారు చేస్తున్న గొడవతో సాధారణ ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందికి గురయ్యారు. అయినా ఎవరూ ఎదురు చెప్పలేదు.

ట్రైన్‌ నాలుగుంటలు ఆలస్యంగా నడుస్తోంది.

ఆ రోజు ఉదయం 7.30 గంటలకు ఆ ట్రైను గోద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అప్పుడు ప్లాట్‌ పాం మీద ఏవో గొడవలు జరిగాయి. అక్కడినుంచి బయలు దేరిన కాసేపటికే అంటే 7.48 కి ఎవరో చైన్‌ లాగడంతో ట్రైన్‌ ఆగిపోయింది. ఆవెంటనే ఒక బోగీకి మంటలు అంటుకున్నాయి. దుండగులు బయటినుంచి నిప్పంటించడం వల్ల ఆబోగీ అంటుకుందా లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా అన్నది ప్రశ్న.

అగ్నికి ఆహుతయిన ఎస్‌-6 బోగీలో 58 మంది మృతుల కళేబరాలు లభించాయి. 26 స్త్రీలవి, 20పురుషులవి, 12 పిల్లలవి. మరో 43 మంది గాయపడ్డారు.

ఆ మరునాడు గుజరాత్‌లో మొదలైన జాతి హత్యాకాండకు ఆ సంఘటన అంకురార్పణ అయింది.

ఐదు రోజులపాటు గుజరాత్‌లోని అనేక ప్రాంతాలలో హిందూ మతోన్మాదులు యధేచ్ఛగా పిల్లలు, స్త్రీలు అని చూడకుండా అనేక మంది ముస్లింలను ఊచకోత కోశారు. వందలాది మందిని సజీవంగా దహనం చేశారు. మంటల్లోకి నెట్టేముందు స్త్రీల మీద, చిన్నారి బాలికల మీద దారుణంగా అత్యాచారాలు చేశారు. వారి ఇళ్లను, దుకాణాలను లూటీలు చేశారు. తగులబెట్టారు. వందల సంఖ్యలో మసీదులను, దర్గాలను, చారిత్రక కట్టడాలను ధ్వంసం చేశారు.

మన దేశ లౌకిక పరువుప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా మంటగలిపిన ఈ దారుణం పై జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ఠ అయ్యర్‌ నేతృత్వంలో ఎనిమిదిమంది న్యాయమూర్తులు, మేధావులతో కూడిన కన్సర్న్‌డ్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ అల్లర్లు చెలరేగిన ప్రాంతలను పర్యటించి విచారణ జరిపింది. ఆ విచారణ నివేదిక తాలూకు తెలుగు అనువాదమే ఈ పుస్తకం.


మానవతపై దాడి
గుజరాత్‌ మారణకాండపై విచారణ నివేదిక,
పౌర ప్రతిస్పందన వేదిక
ఆంగ్లమూలం : Crime against Humanity - An Inquiry into the Carnage in Gujarat, Findings and Recommendations, Concerned Citisens Tribunal - Gujarat 2002, Abridged version published in Communialism Combat, Nov-Dec.2002 issue.
Justice VR Krishna Iyer, Justice PB Sawant, Justice hosbet Suresh, Adv. KG Kannabiran, Ms.Aruna Roy, Dr. KS SubramanianIPS Rtd, Prof Ghanshyam Shah, Prof. Tanika Sarkar

తెలుగు : గౌతమ్‌
125 పేజీలు, వెల రూ. 30

Friday, September 26, 2008

వేమన్న వాదం ... వ్యాఖ్యాత డా. ఎన్‌. గోపి
తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న.
అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం.
వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందుచూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.

పదిహేడవ శతాబ్దానికి చెందిన వేమన్న కొన్ని విషయాల్లో తన కాలాన్ని మించి ముందుకు చూడగలిగాడు.

విగ్రహారాధనను వ్యతిరేకించాడు.
శైవ వైష్ణవ మతాల వారి ఆర్భాటాలనూ వారి దురాచారాలను మోసాలనూ బట్ట బయలు చేశాడు.
చిలుకపలుకుల చదువులను విమర్శించాడు.
కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు.
శ్రమశక్తిలోనే సర్వమూ వున్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు.
తన కాలపు చట్రంలో ఇమడని మహాకవి.

వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు.
1. ప్రజల భాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం.
2. చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం.
3. ఊహలో నుంచి కాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం.

కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది ఎంతో వుంది.

వేమన్న వాదం
వ్యాఖ్యాత: డా. ఎన్‌. గోపి
88 పేజీలు, వెల రూ. 25

Thursday, September 25, 2008

స్త్రీలు - ప్రాతినిధ్యం ... కోటా పై చర్చ ... మహిళా రిజర్వేషన్ల బిల్లు ... 84వ రాజ్యాంగ సవరణ ... సంకలనం: అన్వేషి
73వ, 74వ రాజ్యాంగ సవరణల తరువాత చట్టసభల్లో కూడా స్త్రీలకు ప్రాతినిధ్యమివ్వాలనే ఉద్యమాలు వచ్చాయి.
1996లో మొదటిసారిగా మహిళా రిజర్వేషను 81వ రాజ్యాంగ సవరణ ప్రవేశ పెట్టడం, అది ఓడిపోవడం జరిగింది.
ఆతర్వాత చాలాసార్లు బిల్లును ప్రవేశపెట్టి పాస్‌ చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అయితే చర్చకు కొత్తగా వచ్చిన విషయం 33 శాతం ప్రాతినిధ్యంలో కుల రీత్యా కూడా స్త్రీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని దళిత, బహుజన పార్టీలు, స్త్రీలు చేసిన డిమాండు.
స్త్రీలకు స్త్రీలుగా మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే, దళిత, బహుజన స్త్రీలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలుండకపోవచ్చు.
పైగా మధ్య తరగతి, చదువుకున్న ఉన్నత కుటుంబాల స్త్రీలకే ప్రాతినిధ్యం పరిమితమయ్యే ప్రమాదం వుంటుంది.
పై అంశాలపై వచ్చిన చర్చ మహిళా సంఘాలలో వున్న భేదాభిప్రాయాలను, కుల వ్యవస్థపై వుండే అవగాహనలను వెలిబుచ్చాయి.
ఈ చర్చను చారిత్రకంగా, రాజకీయంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. ఇది భారత రాజకీయ, సామాజిక వ్యవస్తను అర్థంచేసుకోడానికి ఒక కీలకమైన అంశం.
చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం గురించి వివిధ కోణాల్లో చర్చించిన ఈ పుస్తకంలో ఆరు అధ్యాయాలున్నాయి.
1. ప్రత్యామ్నాయ ఆధునికతలు ... రిజర్వేషన్లు - స్త్రీల ఉద్యమాలు. - మేరీ జాన్‌
2. రిజర్వేషన్ల చరిత్రలో ఉద్యమాలు - భగవాన్‌దాస్‌
3. ఫ్రాన్స్‌లో సమానత్వ ఉద్యమం - డానియెల్‌ హాస్‌ ద్యుబోస్‌
4. అంతుపట్టని స్త్రీ : స్త్రీవాదం రిజర్వేషన్‌ బిల్‌ - నివేదితా మీనన్‌
5. కర్ణాటకలో రిజర్వేషన్ల చరిత్ర - మానస గ్రూపు, బెంగళూరు
6. కులం - జెండర్‌ చిక్కుముడి : హైద్రాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి పోరాటం - జాయింట్‌ యాక్షన్‌ కమిటి.
వీటిని డి.వసంత, బాలాజీ, మొక్కపాటి సుమతి, శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలుగులోకి అనువాదం చేశారు. ముందుమాట రమా మేల్కోటే, ఎస్‌.జయ రాశారు. ఇది అన్వేషి ప్రచురణ.

స్త్రీలు - ప్రాతినిధ్యం
కోటాపై చర్చ
సంకలనం : అన్వేషి
106 పేజీలు, వెల రూ.20

Wednesday, September 24, 2008

దక్షిణ తూర్పు పవనం ... మెక్సికో జపటిస్టా జాతీయ విముక్తి సైన్యం తిరుగుబాటుదారుడు మార్కోస్‌ ఉత్తరాలు, ప్రకటనలు ... షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యూరీఈ పుస్తకం మీరు చదవకపోతే ఎంతో నష్టపోతారు. కొద్ది రోజుల్లో మీ ముఖం వాడిపోతుంది. రాత్రులు నిద్రపట్టదు. క్రమంగా మీ జుట్టు రాలిపోతుంది. ఆ తరువాత కాళ్లు చేతులు సహకరించడం మానేస్తాయి. ఏం జరుగుతుందో తెలియని వేదనతో చనిపోతారు.
మీ ఇష్టం ...

... షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యూరీ ... మీద న్యూయార్క్‌ టైమ్స్‌లో బిల్‌ కాస్‌బీ రాసిన రివ్యూ నుంచి ...

...


ఇక ఇదే పుస్తకానికి గద్దర్‌ రాసిన ముందుమాట ...

ఈ మహా పుస్తకం చదివిన కొద్ది
అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది
అన్నం పండించి తిండిలేని,
బట్టలను పుట్టించి మానం దాచుకోను మాసికలేని,
ఏడేడు అంతస్తుల అద్దాల మేడలు కట్టి,
దాని నీడలో కూడా తలదాచుకోలేని
కష్టజీవుల మూగ కన్నుల్లోకి చూసినప్పుడు
స్పందించే ప్రతి మనిషిలో ...
ఏదో అంతుచిక్కని సరికొత్త స్పందన మొదలౌతుంది
ఈ అక్షరాలను చదివిన కొద్ది.
నడిపే కాళ్లకే దుమ్ము అంటుతుంది
కలిసే చేతులకే బురద అంటుతుంది
బతకడం కోసమే చనిపోతమంటది ఈ పుస్తకం
మేం నేలతల్లి మీద సెమట సుక్కలు రాల్సినప్పటినుండి,
మాకు తెలియకుండనే మా రక్తాన్ని
శ్రమరూపంలో తాగేదివాళ్లే ...
హింసావాదులెవరో చెప్పండి
అనే ప్రశ్నను లేవనెత్తుతుంది ఈ పుస్తకం.
మేం కన్నీళ్లు రాల్చి
మా నిరసనను తెలిపితే ...
మా కనుపాపలను కూడా చిదిమేస్తే
కొడవండ్లు నూరకుండా ఏం చేయమంటారు?
అని అడుగుతుంది ఈ నెత్తురు ఉత్తరం.
మేం మహోన్నతమైన మానవులం
మా గుడిసెలోని పిల్లి, కుక్క, మేకపిల్ల, ఆవు, గుర్రం, గాడిదా ...
అన్నీ తిన్న తరువాతే మేం తింటాం
దీనిలో రహస్యమేమీ లేదు
మాకు స్వంత ఆస్తి లేదు.
చెట్లు.. పక్షులు.. నదులు.. పాములు.. పులులు వేటికీ మావల్ల హానిలేదు.
చంపడం మాకు చాలా సులువైన పని
కానీ అది మా నీతి కాదు
అన్నిటిని బ్రతకనివ్వని కొందర్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం
అది మా ధర్మంగా భాావిస్తాం.
ఆయుధాలే మా యుద్ధాన్ని నిర్ణయించవు
అవి ప్రాణంలేని సాధనాలే
మేం ఒక్కసారి మెంటల్లీ ఆర్మ్‌డ్‌ అయిపోతే
ఇక మాదే జయం, విజయం.
పుట్టలోని నాగన్న పుట్టలోనే వుంటే
మేం దానికి పాలు పోసి పూజిస్తాం
అది దారి తప్పి మా ఇంటికే వొస్తే
నాగస్వరం పాట ద్వారా వెల్లిపో నాగన్నా
అని బ్రతిమాలుకుంటాం
కానీ...
అది మా పసిపిల్లల తొట్టిలో ఎక్కితే
నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా నరికేస్తాం
అన్ని జీవరాసులు బ్రతుకాలనే కోరుకొంటాయి
కొన్ని మాత్రం బ్రతకడం కోసం చావుని కోరుకొంటాయి. అట్లాంటి వారమే ఈ జపటిస్టా జాతీయ విముక్తి సైనికులం. మీ మనసులో మాకింత చోటిస్తే మా బతుకు ధన్యం అని మురిసిపోతాం....
కొనసాగుతుంది ఈ పుస్తక కావ్యం -

దక్షిణ తూర్పు పవనం
మెక్సికన్‌ జపటిస్టా తిరుగుబాటుదారుడు మార్కోస్‌ లేఖలు, ప్రకటనల సంకలనం

ఆంగ్ల మూలం : షాడోస్‌ ఆఫ్‌ టెండర్‌ ఫ్యురీ, మంత్లీ రివ్యూ ప్రెస్‌, న్యూయార్క్‌

తెలుగు అనువాదం: శశి
72 పేజీలు, వెల రూ.18

Monday, September 22, 2008

గంధపు చెక్కల వీరప్పన్‌ ... తమిళ పక్ష పత్రిక నక్కీరన్‌ విలేకరులు 2000 సంవత్సరంలో వీరప్పన్‌తో జరిపిన ఇంటర్వ్యూ ... ముధల్‌ వెట్టెయుమ్‌ ముధల్‌ కలైయుమ్‌ .


రాంగోపాల్‌ వర్మ వీరప్పన్‌పై చలన చిత్రం నిర్మించేందుకు పూనుకోవడంతో ఈ లెజండరీ క్రిమినల్‌ మళ్లీ మరోసారి వార్తలలోకి వచ్చాడు.

తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 6,000 కి.మీ. మేర విస్తరించివున్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని తన నేర సామ్రాజ్యంగా మార్చుకొని, అడ్డొచ్చినవాళ్లని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తూ దాదాపు పాతిక సంవత్సరాలపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ కంటిలో కునుకులేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌.

దంతాలకోసం వీరప్పన్‌ రెండువేల ఏనుగులను చంపాడనీ, రూ.100 కోట్ల విలువచేసే గంధపు చెక్కలను, ఏనుగు దంతాలను స్మగ్లింగ్‌ చేశాడనీ, పోలీసు ఫారెస్టు సిబ్బందితో సహా మొత్తం 138 మందిని పొట్టనపెట్టుకున్నాడనీ అంటారు.

సరిహద్దు భద్రతా దళానికి చెందిన 7 బెటాలియన్ల సైనికులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 4,500 మంది స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఏళ్ల తరబడి అతడిని వేటాడి వెంటాడి చివరికి ఎన్‌కౌంటర్‌ చేయగలిగాయి. అతను హతుడవడానికి ఎంతో కాలం ముందే అతని తలకు ప్రభుత్వం రూ.40,00,000 ల బహుమతిని ప్రకటించింది. సుప్రసిద్ధ కన్నడ చలనచిత్ర కథానాయకుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్‌ 100 రోజుల పాటు కిడ్నాప్‌ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.

వీరప్పన్‌ కోసం పోలీసులు సత్యమంగళం అడవుల్లో ఉధృతంగా గాలిస్తున్న సమయంలోనే సుప్రసిద్ధ తమిళ పక్షపత్రిక నక్కీరన్‌కు చెందిన విలేకరులు రహస్యంగా వీరప్పన్‌ను కలిసి ఇంటర్వ్యూ చేసి ఈ సంచలన కథనాన్ని బయటపెట్టారు.
మన వ్యవస్థ లోని లొసుగుల్ని, హిపోక్రసీని, ముఖ్యంగా న్యాయస్థానాలు, పోలీసు విభాగం, ప్రభుత్వ యంత్రాంగాల పనితీరునూ, రాజకీయ దివాళా కోరుతనాన్నీ అర్థంచేసుకునేందుకు ... చిత్తశుద్ధి గనక వుంటే ఆ లోపాలను సవరించుకునేందుకు కూడా ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.

మహనీయుల జీవిత చరిత్రల నుంచే కాదు, హంతకుల నేరస్థుల జీవనపరిణామ క్రమాలనుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చాటి చెబుతుందీ పుస్తకం.

నక్కీరన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరప్పన్‌ తన బాల్యం గురించి, తన కుటుంబం గురించి, తను ఏనుగుల వేటగాడిగా, గంధపు చెక్కల స్మగ్లర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితుల గురించి, తను చేసిన హత్యల గురించి, అటవీ శాఖలోని అవినీతి, పోలీసుల అత్యచారాల గురించి, ప్రస్తుత వ్యవస్థలోని హిపోక్రసీ గురించి సోదాహరణంగా వివరించాడు.

వీరప్పన్‌, ఫూలన్‌ దేవి వంటి క్రిమినళ్ల ఆవిర్భావానికి మూలాలు మన వ్యవస్థలోనే వున్నాయి. వాళ్లు కూడా ఈ వ్యవస్థ చే సృష్టించబడిన వ్యక్తులే.

అందువల్ల మన వ్యవస్థలోని లొసుగుల్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా కేవలం వ్యక్తుల్ని అదీ తను సృష్టించిన వ్యక్తుల్ని తనే వేటాడుతూ పోవడం వల్ల సమాజానికి ఒనగూడే ప్రయోజనం పెద్దగా ఏమీ వుండదు. అసమానతలు, అక్రమాలు, ఆకలి, అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం వంటి రుగ్మతలకు తావులేని వ్యవస్థను సృష్టించుకోగలిగినప్పుడే ఇలాంటి నేరగాళ్లకు, నేరాలకు తావు వుండదు.


గంధపు చెక్కల వీరప్పన్‌
తమిళ మూలం: ముధల్‌ వెట్టాయుమ్‌ ముధల్‌ కొలాయుమ్‌, నక్కీరన్‌ ప్రచురణ, చెన్నయ్‌. జులై 2000.
తెలుగు అనువాదం: జానకీ అయ్యర్‌, ప్రభాకర్‌ మందార
100 పేజీలు, వెల: రూ.25

Sunday, September 21, 2008

తల్లి దండ్రుల తలనొప్పి ... గిజుభాయి ... పిల్లల పెంపకం పై పెద్దలకు పాఠాలుపిల్లలను పెంచడం ఒక కళ.
అది తలనొప్పి కానే కాదు.
పిల్లలతో కలిసి ఎదగటం లో ఆనందం వుంది. జీవిత సార్థకత వుంది.
పిలల్లను సరిదిద్దాలంటే ముందుగా వాళ్ల తల్లిదండ్రుల్ని దృష్టిలో వుంచుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం పెద్ద తలనొప్పి వ్యవహారం అని ఎప్పుడూ అనుకోకూడదు
ఈసఫ్‌ కథలు, పంచతంత్రం, హితోపదేశంలతో పోల్చదగిన చక్కని కథల సమాహారమే ఈ పుస్తకం. సరళ సుందరమైన శైలి చదువరుల మనసులపై చెరగని ముద్ర
వేస్తుంది.
ఈ కథలు కొత్తవేం కావు.
ఇవి ఇంటింటి కథలు. ప్రతి ఇంటి కథలు. చదువుతున్నప్పుడు మాత్రం సరికొత్తగా అనిపిస్తాయి.
పిల్లలతో చేయించదగిన పనులూ, చేయించకూడని పనులూ పిల్లల భవిష్యత్తు గురించిన ఉచితమైన నిర్ణయాలూ, అనుచితమైన నిర్ణయాలనూ యీ కథలు చక్కగా
బోధిస్తాయి.
పిల్లలను అర్థ చేసుకోవటం ప్రపంచాన్ని అర్థం చేరుకోవటమే.
సిద్ధాంతాలూ, తాత్విక చర్చలతో తలనొప్పి కలిగించకుండా ఆహ్లాదకరమైన రీతిలో చిన్న చిన్న కథలలో జీవిత సత్యాలను అ లవోకగా అందిస్తుంది ఈ పుస్తకం.
గిజుభాయి ఇలా అంటారు :
ప్రపంచ తల్లిదండ్రులారా... మీరు దేనిని తలనొప్పి అంటున్నారో, అది వాస్తవంగా తలనొప్పి కానే కాదు. మీరు మీ మనస్సును స్థిరపరచుకొని చూస్తే మీకు ఆ తలనొప్పి
తలనొప్పిగా వుండనే వుండదు. దాని స్థానంలో మీకు మరేదో కన్పిస్తుంది.
తల్లి దండ్రులు ఈ పుస్తకం చదివిన తరవాత రోజూ తమకు కలిగే తలనొప్పి బాధ నుంచి కొంతయినా విముక్తి పొందగలిగితే, తమ పిల్లలను కొంచెం అర్థం చేసుకోవడం
నేర్చుకోగలిగితే; వాళ్లను గిజుభాయి దృష్టితో చూడటం నేర్చుకొంటే తలనొప్పి స్థానంలో వున్న ఆ మరేదో చూపించాలనుకొన్న గిజుభాయి ఉద్దేశం సఫలమైనట్టే. ఈనాడు
ఇంటింటా వ్యాపించిన కలహాలనూ, క్లేశాలనూ నియమ నిగ్రహాలు లేని వాతావరణాన్నీ తొలగించాలనుకొంటే ఈ తలనొప్పుల విషయంలో ఆలోచించనిదే ప్రయోజనం
వుండదు. ఆవిధంగా ఆలోచించినప్పుడే తల్లిదండ్రుల పిల్లల జీవితాలు సామరస్యంగా సాగిపోతాయి.

తల్లిదండ్రుల తలనొప్పి
- గిజూభాయి
మూలం : మా బాప్‌ కీ మాతాపచ్చి
తెలుగు అనువాదం : పోలు శేషగిరిరావు
100 పేజీలు, వెల: రూ.18

Saturday, September 20, 2008

స్పార్టకస్‌ ... నవల ... రచన: హోవర్డ్‌ ఫాస్ట్‌ ... తెలుగు అనువాదం: ఆకెళ్ల కృష్ణమూర్తి ... ముందుమాట: రాచకొండ విశ్వనాథ శాస్త్రిలోకంలో మనిషికి నిత్యావసరమైన వస్తువులన్నింటినీ మనుష్యుల్లో కాయకష్టం పడేవాళ్లే ఉత్పత్తి చేస్తుంటారు. కానీ ఆశ్రమ ఫలితం మాత్రం వాళ్లకి దక్కదు. అది స్పష్టంగా అందరికీ కనిపిస్తున్నదే. అట్లా దక్కకపోవడానికి కారణం రాముడి మీదో రహీము మీదో లేక పూర్వజన్మల మీదో మరి దేనిమీదో తోసేస్తారు.
ఎవరు అని ప్రశ్నిస్తే ...
ఆ శ్రమపడేవారి కష్టఫలితాన్ని ఎవరైతే దోచుకొంటున్నారో వారే నని సమాధానం చెప్పవలసివుంటుంది.

దోపిడీ చేసే వర్గాలే దాదాపు ప్రతి దేశంలోనూ పాలకవర్గాలుగా వుంటూ వస్తున్నాయని చరిత్ర ఏమాత్రం చదువుకున్నా మనకి తెలుస్తుంది.

దోపిడీ కాబడేవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పక తిరుగుబాటు చేస్తాడని ఈ ఇరవయ్యో శతాబ్దపు ప్రతి దేశపు దోపిడీ పాలకవర్గానికీ తెలుసు. కానీ, ఈ నిజాన్ని స్పార్టకస్‌ తిరగబడేవరకూ కూడా ఆనాటి రోమన్‌ పాలకవర్గం కనుక్కోలేకపోయింది. అందువల్ల తొలుత దెబ్బతింది. తరవాత నిలదొక్కుకొని తిరుగుబాటుని అణచివేయగలిగింది.
పాలక వర్గం స్పార్టకస్‌ నుంచి పాఠాలు నేర్చుకొంది.

స్పార్టకస్‌ తరవాత ఈ రోజుకీ కూడా పాశ్చాత్య దేశాల పాలకవర్గాల ఏకైక లక్ష్యం (ఇప్పుడు మనదేశంలోని పాలకవర్గపు లక్ష్యం లాగే) ఏమిటీ అంటే ...
శ్రామిక వర్గాన్ని ఎన్నటికీ అధికారంలోకి రానివ్వకూడదు. వారిని ఎల్లకాలం అణచివుంచాలి. అందుకు ఎల్లప్పుడూ సర్వసిద్ధంగా వుండాలి. అదీ ఆ లక్ష్యం.
అందువల్లనే స్పార్టకస్‌కి అంత ప్రాముఖ్యత.
అతను ఓడిపోయాడు, చనిపోయాడు. క్రీస్తు పూర్వమే పుట్టాడు, గిట్టాడు. కానీ అతని పేరు చెప్తే దోడిడీదారులందరికీ ఇప్పటికీ బెదురు. వారు శ్రామికవర్గాల జనాన్ని పందులకంటే హీనంగా చూస్తారు. కానీ ఆ జనాలు ఉగ్రనరసింహులుగా మారి విజృంభించగలరన్న సత్యాన్ని చరిత్రలో మొదటిసారిగా చాటిచెప్పినవాడు స్పార్టకస్‌.
అందుకే, ఇరువర్గాలువారికీ కూడా అతను ముఖ్యడు. ఇరువర్గాల వారూ అతణ్ని గుర్తుంచుకుంటారు ... శ్రమించేవారు ఆశతో, దోపిడీదార్లు పగతో ...!
....

హోవర్డ్‌ ఫాస్ట్‌ 1914లో జన్మించారు. 75కు పైగా నవలలు, అనేక చిన్న కథలు రాశారు. ఇ.వి.కన్నింగ్‌ హోమ్‌ అన్న కలం పేరుతో మిస్టరీ నవలలు కూడా రాసారు. ఫాస్ట్‌ అత్యంత పేదరికంలో పుట్టి పెరిగారు. పదేళ్ల వయసప్పుడు పనిచేయడం మొదలుపెట్టారు. దినపత్రికలు వేయడం, సిగరెట్ల తయారీ, కసాయి దుకాణం శుభ్రం చేయడం, దుస్తుల ఫాక్టరీలో పని, ఓడల రవాణాలో గుమాస్తాగిరి వంటి ఎన్నో పనులు చేస్తూనే హైస్కూల్‌ చదువు పూర్తిచేశారు.

జాక్‌ లండన్‌ రాసిన ఉక్కుపాదం నవలతో తనకు తొలిసారిగా సోషలిజంతో పరిచయమయ్యిందని ఫాస్ట్‌ స్వయంగా చెప్పుడున్నారు. ఆయన 1944-57 మధ్య అమెరికా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా వున్నాడు. వామపక్షీయులను సంవత్సరాలపాటు వేధించిన మాక్‌కార్తిజం నుంచి ఎలాగో బతికి బయటపడ్డారు. ఆయన జీవితమంతా ఫోనుల టాపింగ్‌, అమెరికా గూఢచారి పోలీసు (ఎఫ్‌.బి.ఐ) నిఘాలతో గడిచిపోయింది. ఆయన పుస్తకాలను ప్రచురించనివ్వలేదు. అమెరికా సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవాళ్ల పేర్లు ఇవ్వ నిరాకరించినందుకు ఫాస్ట్‌కి జైలు శిక్ష కూడా పడింది. 1950లో జైలులో వున్నప్పుడే ఆయనకు స్పార్టకస్‌ నవల రాయాలన్న ఆలోచన వచ్చింది. అట్టడుగు వర్గాల బాధామయ, నిరాశాపూరిత జీవితం జైలులో వుండగా మరింత బాగా అవగతం అయ్యింది. మాక్‌కార్తిజం అణచివేతకారణంగా ఏ ప్రచురణకర్త కూడా స్పార్టకస్‌ని ప్రచురించే సాహసం చేయలేదు. దాంతో 1951లో హోవర్డ్‌ ఫాస్ట్‌ స్వయంగా స్పార్టకస్‌ని ప్రచురించారు. ఆ తరువాత అది ఒక్క ఇంగ్లీషులోనే వందకు పైగా ముద్రణలు పొంది లక్షలాది ప్రతులు అమ్ముడయ్యాయి. ప్రపంచంలోని దాదాపుగా అన్ని ప్రధాన భాషలలోకి అనువదించబడింది. స్పార్టకస్‌ నవల ఆధారంగా అదే పేరుతో ఇంగ్లీషులో వచ్చిన సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందింది.


స్పార్టకస్‌
-హోవర్డ్‌ ఫాస్ట్‌

తెలుగు అనువాదం: ఆకెళ్ల కృష్ణమూర్తి
ముందుమాట: రాచకొండ విశ్వనాథశాస్త్రి

224 పేజీలు, వెల: రూ.45

Friday, September 19, 2008

ప్రపంచ చరిత్ర ...ఆంగ్ల మూలం: క్రిస్‌ బ్రేజియర్‌ ...తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకట సుబ్బయ్యఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల చరిత్రల గురించి స్లూళ్లో నాకు నేర్పింది శూన్యం. అనంత యుద్ధాల, రాజకీయాల అడుగున సహస్రాబ్దాలుగా మరుగున పడిపోయిన మహిళల చరిత్ర గురించి నాకు బొత్తిగా తెలియదు. అది ఇప్పుడిప్పుడే కాలగర్భం నుంచి పైకి తేలుతున్నది. యుగయుగాల జన సామాన్యపు దైనందిన అనుభవాల తాలూకు సమాచారం కొద్దికొద్దిగా తెలుస్తున్నది. పిరమిడ్లు నిర్మస్తూ మరణించిన వ్యక్తుల, కోటల అడుగున వున్న నేలను దున్నిన సామాన్యుల వ్యథార్థ జీవిత యదార్థ దృశ్యాలు స్వల్పంగానైనా ప్రస్ఫుటమవుతున్నాయి..

పాత పాఠ్యపుస్తకాలన్నీ వదిలేసిన ఖండాల, సమాజాల లోతుల్లోకి తొంగి చూసినప్పుడు చరిత్ర పరిశోధన నాకు అద్భుతంగానే తోచింది.

అయితే, ఈ గుప్త చరిత్రలను నేను రాజ వంశాల, అగ్రరాజ్యాల యుద్ధాలకు సంబంధించిన సాంప్రదాయక కథనంతో జోడించే ప్రయత్నం కూడా చేశాను. సామాన్య స్త్రీ పురుషుల సేవనూ విస్మరించకూడదు. దానితో పాటే అప్పటి రాజకీయ స్థితిగతులనూ, ఆనాటి ప్రపంచ రూపకల్పనకు దోహదం చేసిన వివిధ సామ్రాజ్యాల విజయ పరంపరలనూ చరిత్రలో చేర్చాలి. వాటిని స్పృశించని చరిత్ర అయోమయంగా వుంటుంది.

చరిత్ర బోధన మెరుగవుతోంది.

చిన్నపిల్లలకు వాళ్లకు తెలిసిన పరిధికి వెలుపల వున్న మహా విశ్వ దృశ్యాన్ని ప్రదర్శించడంపై ఇతోధిక శ్రద్ధ పెరిగిందని వింటున్నాను. మంచిదే. ఒక గొప్ప అ ల్లిక తాలూకు కొద్ది భాగాలు మాత్రమే తెలిసిన మనలాంటి వాళ్లందిరి కోసమే ఈ రచన.
- క్రిస్‌ బ్రేజియర్‌


వస్తు మార్పిడి కాలం వరకు సామాన్యుల జీవితం ఒక రకంగా వుండి - మతం, భూస్వామ్యం ప్రవేశంతో ఎలా విచ్ఛిన్నమయిందో, రాజకీయ కుట్రలు, యుద్ధోన్మాదం, మతోన్మాదంతో రాజులు, పోప్‌లు ప్రపంచ మనుగడను ఎలా అధోగతి పాలుచేశారో విశ్లేషించిన పుస్తకమిది. అదే క్రమంలో బానిస తిరుగుబాట్లు, జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమాల ఉద్భవాలను కూడా ఇది వివరించింది.పెట్టుబడిదారి సమాజం ఆవిర్భావం వరకు ప్రతిబింబించిన ఈ సమగ్ర ప్రపంచ చరిత్రను అందరూ తప్పక చదవాలి.

ప్రపంచ చరిత్ర
క్రిస్‌ బ్రేజియర్‌
తెలుగు అనువాదం: వల్లంపాటి వెంకటసుబ్బయ్య
146 పేజీలు, వెల: రూ.30

Tuesday, September 16, 2008

ఆంధ్రజ్యోతి దినపత్రిక లో బ్లాగ్లోకం


ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ప్రతి ఆదివారం నవ్య పేజీలో బ్లాగ్లోకం శీర్షికన ఒక మంచి తెలుగు బ్లాగును పరిచయం చేస్తున్నారు. వారు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ బ్లాగుతో ఈ శీర్షికను మొదలుపెట్టడం విశేషం.

మంచి పుస్తకాలకోసం...
ఆలోచింపజేసేవీ, కదిలించేవీ, అవసరమైనవీ, సమాచారం - విజ్ఞానాలనిచ్చేవీ ... అయిన చక్కని పుస్తకాల ప్రచురణకు హైదరామాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బిటి) పెట్టింది పేరు. అయితే, క్రమం తప్పకుండా చదివే ఏ కొద్ది మందికో తప్ప, పుస్తక అభిమానులు చాలామందికి, హెచ్‌బిటీ ప్రచురించే పుస్తకాలు, వాటిలోని అంశాల గురించి బాగా తెలియదు. ఆ కొరతను తీరుస్తోంది హైదరాబద్‌ బుక్‌ ట్రస్ట్‌ డాట్‌ బ్లాగ్‌ స్పాట్‌ డాట్‌ కామ్‌.

హెచ్‌బిటీ ప్రచురించిన మంచి పుస్తకాలు, వాటిలోని అంశాలను విపులంగా పరిచయం చేస్తుంది ఈ బ్లాగ్‌.
ఏదో కాలక్షేపానికి చదివి పక్కన పడేసే పుస్తకాల తరహా కాదు హెచ్‌బిటీది.

బొలీవియా లోని తగరపు గనుల్లో పనిచేసే కార్మికుల స్థితిగతులు మొదలుకొని, మానవ మలాన్ని చేతుల్తో ఎత్తిపోసే పాకీ పనివాళ్ల క1బ్టిల వరకూ ... ఎన్నో ఆలోచించాల్సిన అంశాలను పుస్తకాల రూపంలో మన ముందుకు తెస్తుంది ఈ బ్లాగ్‌. మన వ్యాఖ్యలను సైతం స్వీకరిస్తుంది.

http://hyderabadbooktrust.blogspot.com

క్లిక్‌ చేస్తే చాలు ... హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ బ్లాగు ప్రత్యక్షమవుతుంది.

బ్లాగ్‌ లోకం శీర్షిక మిమ్మల్ని ఇకపై ప్రతి ఆదివారం పలకరిస్తుంది. ఇంటర్నెట్‌ ప్రపంచంలో పలువురి మన్ననలందుకుంటున్న మంచి మంచి బ్గాదీలను మీకు పరిచయం చేస్తుంది. ఈ శీర్షికలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. మీకు నచ్చిన, మెచ్చే బ్లాగుల గురించి మాకు రాసి పంపిస్తే ప్రచురిస్తాం

navyajyothy@gmail.com


బ్లాగ్లోకం, ఆంధ్ర జ్యోతి,
ఫ్లాట్‌ నెం.76, అశ్వని ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌,
రోడ్‌ నెం. 70, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 500 033

Monday, September 15, 2008

యుద్ధానికి పునాదులెక్కడ? ...అమెరికా...చమురు...పొలిటికల్‌ ఇస్లాం


వర్తమాన ప్రపంచ రాజకీయాల పోకడ మారుతోంది. ఒకప్పుడు కమ్యూనిజాన్ని బూచిగా చూపిస్తూ ప్రచ్ఛన్న యుద్ధం సాగించిన అమెరికా ఇప్పుడు తీవ్రవాదంపై సమరం పేరుతో ప్రత్యక్ష యుద్ధాలకు, ప్రపంచ స్థాయి పోరాటాలకు తెర తీస్తోంది.

2001 సెప్టెంబర్‌ 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, పెంటగాన్‌లపై జరిగిన దాడులకు ప్రతిగా అమెరికా యుద్ధ స్పందన హఠాత్తుగా తీసుకున్న అనూహ్య నిర్ణయమేమీ కాదు. ఆ యుద్ధానికి అదొక్కటే పార్శ్వమూ కాదు. అదొక సంక్లిష్ట అర్థిక - రాజకీయ - మత సంబంధ అంశం. తీవ్రవాదం పై సమరం పేరుతో ఆఫ్ఘనిస్థాన్‌పై సాగిన భీకర యుద్ధానికి మూలాలు ఎక్కడ వున్నాయో గ్రహించాలంటే - ఈ శతాబ్ది ఆర్థిక రంగం తీరుతెన్నులనూ, పశ్చిమాసియా, గల్ఫ్‌ ప్రాంతాల్లో అమెరికా సాగిస్తున్న చమురు రాజకీయాలనూ, అమెరికాకు పెను సవాలుగా నిలుస్తున్న రాజకీయ, ఉగ్రవాద ఇస్లామిక్‌ ఉద్యమానూ అర్థం చేసుకోక తప్పదు. ఆ దిశగా సాగిన ప్రయత్నమే ఈ పుస్తకం.

అమెరికా సామ్రాజ్యవాద ఆర్థిక రాజకీయాలు, వాటి పర్యవసానాలు, స్వప్రయోజన కాంక్షతో ఆ దేశం అంతర్జాతీయంగా జోక్యం చేసుకుంటూ కొన్ని దేశాలను ధూర్త రాజ్యాలుగా ముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను, చమురు దాహంతో నడుపుతున్న రాజకీయాలను ఈ పుస్తకంలోని వేరు వేరు అధ్యాయాలు వివరంగా విప్పి చెబుతాయి.

1. అసలు ఉగ్రవాది అమెరికాయే ... అనే వ్యాసంలో నోమ్‌ చోమ్‌స్కీ (తెలుగు అనువాదం: ఎన్‌.వి.రమణమూర్తి) అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానాలను, అంతర్జాతీయ మానవహక్కుల ప్రకటనను ఎలా కాలదన్నిందో, తన యుద్ధోన్మాదాన్ని స్వార్థ రాజనీతిని సమర్థించుకునే క్రమంలో అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఎలా ఉల్లంఘించిందో వివరిస్తారు.

2. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ధోరణులు, లక్షణాలు ... అనే వ్యాసంలో డి. పాపారావు పెట్టుబడిదారీ వ్యవస్థ గతిని, గమనాన్ని విశ్లేషించారు. గతంలో మాదిరిగా ఇప్పుడు ఇతర దేశాలను ఆక్రమించి ప్రత్యక్ష దోపిడీని కొనసాగించే పరిస్థితులు సామ్రాజ్యవాదానికి లేవు. అందుకే అది పెట్టుబడిదారీ మార్కెటు వ్యవస్థను ఆసరాగా చేసుకొంటోంది. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ సమస్త రుగ్మతలను నిర్మూలిస్తుందనే ప్రచారంలోని డొల్లతనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఏదేశంలో చూసినా సంస్కరణలు ప్రజల జీవన ప్రమాణాలను, ఉపాధి అవకాశాలను పెంచకపోగా ఇంకా దెబ్బతీస్తున్నాయి. బహుళ జాతి సంస్థలు వర్ధమానదేశాల మార్కెట్‌ను దారుణంగా కొల్లగొడుతున్నాయి అంటారాయన.

3. అమెరికా చమురు రాజకీయాలు మధ్య ఆసియా దేశాలు, ఆఫ్ఘనిస్థాన్‌ ... అనే వ్యాసంలో యం. చెన్న బసవయ్య రెండో ప్రపంచ యుద్ధం తరువాత అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికా చమురు రాజకీయాలలో పోషిస్తున్న కీలక పాత్రను, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‌లలో జరుగుతున్న పరిణామాలని విశ్లేషించారు.

4. ఇస్లామిక్‌ విప్లవాలు కొత్త కోణాలు ... అనే వ్యాసంలో శ్యామసుందరి ఇస్లామిక్‌ విప్లవ నేపథ్యాన్ని, ఇరాన్‌లో పెల్లుబికిన జన చైతన్యాన్ని, పాలస్తీనా విమోచన ఉద్యమాన్ని, ఆఫ్ఘనిస్థాన్‌ స్థితిగతులను, అమెరికా ద్వంద్వ నీతిని వివరించారు.

పాఠకుల ముందున్న ప్రశ్నలు, సమస్యలన్నింటికీ ఈ పుస్తకం సమాధానం కాకపోవచ్చు. అయితే గత రెండు మూడు దశాబ్ధాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను, మరో దశాబ్దకాలం ప్రభావితం చేయనున్న సంఘటనల మూలాలను అర్థం చేసుకోవటానికి ఈ పుస్తకం తప్పక ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.

యుద్ధానికి పునాదులెక్కడ?
అమెరికా...చమురు...పొలిటికల్‌ ఇస్లాం
-నోమ్‌ చోమ్‌స్కీ, డి.పాపారావు, డా.యం. చెన్నబసవయ్య, శ్యామసుందరి
118 పేజీలు, వెల: రూ.30

Friday, September 12, 2008

అసుర సంధ్య - మాల్కం ఎక్స్ ఆత్మ కథ” యువతరం తప్పక చదవాల్సిన ఒక మంచి పుస్తకం.
అసుర సంధ్య : ఆర్థిక స్వావలంబనే అసలు పరిష్కారం
కొన్ని పుస్తకాలకు నిజానికి విపులమైన పరిచయం అవసరం లేదు. మరెవ్వరూ చెప్పలేన్ని విషయాలు మనకు స్వయంగా ఆ పుస్తకాలే తెలియజెప్తాయి. అలాంటి అరుదైన పుస్తకాలలో ఒకటి “అసుర సంధ్య“. అలెక్స్ హేలీ రచించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదం ఇంత ఆలస్యంగా వెలువడడం అంతు చిక్కని విషయం. తెలుగు సాహితీ ప్రపంచంలోకి ఇప్పటికైనా వచ్చినందుకు ఆనందంగా ఉన్నప్పటికి ఆలస్యానికి కారణాలు మాత్రం నిజంగా ఆలోచించాలి. అలెక్స్ హేలీ పేరు వినగానే తెలుగు పాఠకులకు సహవాసి పుణ్యమా అని వెంటనే గుర్తుకొచ్చేది “ఏడు తరాలు” నవల. అనితర సాధ్యమైన ఆ నవలను రచించిన హేలీ ఇతర రచనల గురించి మనకు మరేమీ తెలియనప్పుడు అత్యంత సాహసంగా ‘యాజ్ఞీ అనే అనువాదకుడు హేలీ మరో రచనను “అసుర సంధ్య” పేరుతో మన ముందుకు తీసుకొచ్చారు. ఈ పుస్తకానికి ‘నల్లజాతి వైతాలికుడు మాల్కం ఎక్శ్ పేరుతో జిలుకర శ్రీనివాస్ రాసిన పదిహేను పేజీల సవివరమైన ముందుమాట పుస్తకంలోని అసలు విషయానికి అవసరమైన బ్యాక్ డ్రాప్ను అందివ్వడమే కాకుండా అనేక ఆలోచనలు రేకెత్తించి, కొన్ని విలువైన ప్రశ్నలను మన ముందు చర్చకు పెడుతుంది.
మన దేశంలో కొంతమంది ప్రజలను అంటరానితనం పేరుతో అంటరానివారుగా కొన్ని వేల సంవత్సరాల పాటు అత్యంత హీన స్థితిలో ఉంచాం. అంటరానితనమనేది కింది కులాల వారనబడే ప్రజల శరీరాల్లోనో, మనసుల్లోనో, వారు బతుకులీడుస్తున్న పరిస్థితుల్లోనో ఉండదు. అదంతా పై కులస్తులలో ఉండే ‘అంటలేనితనం‘ అని గుర్తించగలిగిన తరువాత మన మానసిక పరిస్తుతుల్లో ఇప్పుడిప్పుడే కొంత మార్పు కనిపిస్తోంది. పిలిచే పిలుపులో కూడా దళితులని వ్యవహరించడం వెనుక కొన్ని శతాబ్దాల ఆత్మ గౌరవ పోరాటాల చరిత్ర ఉందని మర్చిపోకూడదు. ఇంత భయంకరమైనది కాకపోయినా మనిషిని నిలువునా నీరు చేసే యిలాంటి వ్యవహారమే పాశ్చాత్య దేశల్లో నీగ్రోల వ్యవస్థలోనూ ఉంది. కాని అక్కడ కూడా ఈ పిలుపుపట్ల వ్యతిరేకత స్ప్షష్టంగా వ్యక్తీకరిస్తున్న ఫలితమే వారిని యిప్పుడు బ్లాక్స్ లేదా ఆఫ్రికన్ అమెరికన్స్ అని పిలవడం నెమ్మదిగా మొదలైంది. రావలసిన పెను మార్పునకు ఇది కేవలం ప్రంభం మాత్రమేనని గుర్తించాలి. వేల సంవత్సరాల తరబడి రక్తంలో పతుకుపోయిన జాడ్యం పోవడానికి కొన్ని వందల ఏళ్ళ పోరాటం సరిపోదు. ఈ పోరాతం ఇంకా ఉధృతంగా జరగాలి. మనందరి మనస్సులను ప్రక్షాళన చేయాలి. అప్పుడే ఒక మనిషి తన తోటి మనిషిని కులం, రంగు, చదువు, సంపదల ఆధారంగా హీనంగా చూసే అవకాశం ఉండదు. ముడ్డికి తాటికమ్మ కట్టుకుని, చేతిలో ముంత పట్టుకుని కొందరు మనుషులు మన సమాజంలోనే తిరిగేవారంటే మన గుండె తరుక్కుపోతుంది. నడుస్తున్న అడుగులను చెరిపి ఇంకొకరికి ఆ పాదాల ఛాయకూడా కనిపించకుండా ఉండడానికి వెనక తాటికమ్మ పట్టుకోవడం, ఎక్కడపడితే అక్కడ ఉమ్మకునండా చేతిలోనే ముంత పట్టుకోవడ అనేవి సాటి మనుషులను హీనంగా ఉంచే సామాజిక వ్యవస్థ దుర్మార్గానికి అద్దం పడతాయి.
అమెరికాలో నల్లవారి పట్ల ప్రజాస్వామిక సభ్య సమాజం అత్యంత నీచంగా జరుపుతున్న ఆత్మగౌరవ హననానికి వ్యతిరేకంగా పెల్లుబుకిన ధిక్కర స్వరం మాల్కం ఎక్స్ ది. ఈ మాల్కం కథ చదువుతున్నకొద్దీ మనదేశం మనకు పదేపదే గుర్తుకు రావదం యాదృఛ్చికమేమీ కాదు. మాల్కం ఎక్స్ ను మన అంబేడ్కర్తోనూ, మార్టిన్ లూథర్ కింగ్ ను మన గాంధీతోనూ పోల్చడానికి మొగ్గు చూపిస్తాం. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే జ్యొతీరావ్ ఫూలేకానీ, అంబేడ్కర్ కానీ, పెరియార్ కానీ జరిపిన సామాజిక సంస్కరణలను వేటినీ మాల్కం ఎక్స్ చర్యలతో పోల్చి చూడలేం. ఎందుకంటే అతడి జీవిత గమనమే చిత్రాతిచిత్రంగా నడిచింది. తన బతుకుబాటలో నడిచివచ్చిన తన దారిలో తనకు ఎదురైన అనుభవాలు నేర్పిన సారం మాల్కం ఎక్స్ వంట పట్టించుకోవడం వల్లనే కాబోలు తన తరువాతి తరాలను ప్రభావితం చేయగల ఉపన్యాసాలతో రెచ్చగొట్టిన ఎక్స్ ఆర్థిక స్వయం ప్రతిపత్తి గురించి తన వాళ్లకు ఉగ్గుపాలతో రంగరించి పోశాడు. దానివల్ల నిర్మితమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ బ్లాక్ రెస్టరెంట్లు, బ్లాక్ పరిశ్రమలు, బ్లాక్ పఠశాలలు….. ఒకటేమిటి అవన్నీ అగ్ర దురహంకారులకు ఒక సవాలును విసరగలిగాయి.
అమెరికాలో నల్లజాతి విముక్తి పోరాట చరిత్రలో ప్రధాన స్రవంతిలో కనిపించే పేర్లు మూడు మాత్రమే. వారు అబ్రహాం లింకన్, బుకర్ టి. వాషింగ్టన్, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లు మాత్రమే. కానీ చరిత్రలో అంతగా నమోదుకాని, మనకు (ముఖ్యంగా తెలుగువారికి) అంతగా తెలియని మరో పోరాటపాయ ఎలైజా ముహమ్మద్ ది. తాను స్థాపించిన నేషన్ ఆఫ్ ఇస్లాం సంస్థలో చేరి దాని దిశానిర్దేశాన్ని మార్చి తన జాతి తరాల తలరాతలను కూడా మార్చగలిగిన మాల్కం ఎక్స్ కథ అంతగా పత్రికల్లోకి ఎక్కలేదు. జనం నోళ్లలో నానలేదు. దానికి కారణం తర్వాత తర్వాత ఇతడి మాటలు, ఉపన్యాసాలు, రాతలవల్లే అక్కడ చెలరేగిన విప్లవాత్మక, సాయుధ బ్లాక్ పాంథర్స్ ఉద్యమం బహుశా ఒక కారనం కావచ్చు. కాని అమెరికాలోనే కాక దేశవిదేశాల్లో ముహమ్మద్ గురించి, నేషన్ ఆఫ్ ఇస్లాం గురించి, నల్ల జాతి విముక్తి ఉద్యమం గురించి అత్యంత ప్రభవశీలంగా ప్రచారం చెయ్యగలిగింది మాల్కం ఎక్స్ మాత్రమే.
తన గురువు, దైవం అయిన ముహమ్మద్ కూడా అనైతికతకు లొంగిపోయాడని తెలిసిన తర్వాత తన ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడి తన సొంత మార్గంలో ప్రయాణించిన అసమాన ధైర్య సాహసాలున్న యోధుడు మాల్కం ఎక్స్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్తో సహా గాంధేయవాదులంతా ‘కలసి ఉంటే కలదు సుఖం‘ సూత్రాన్ని ప్రభోదిస్తూ ‘కొంచెం మర్యాదివ్వండి బాబోయ్‘ అంటూ బతిమాలుకుంటూ పోరాదుతున్న రోజుల్లో నల్లవారి రాజ్యం స్థాపించుకున్న నాడే తమ కష్టాలు ఈడేరుతాయని కలలుగన్న మాల్కం ఎక్స్ ఆర్థిక స్వాతంత్రమే అన్ని సమస్యలకు పరిష్కారమని ప్రభోదించాడు. అయితే నల్లజాతి ప్రజలంతా ఇస్లాం మతం స్వీకరించాలని, అలా కలసికట్టుగా ఉండాలని ప్రభోదించడం వెనుక ముహమ్మద్ ప్రభావం ఎంతైనా ఉందనే సంగతి గుర్తుంచుకోవాలి.
ముహమ్మద్ ను విడిచిపెట్టిన తరువాత మాల్కం విదేశీ పర్యటనకు బయలుదేరుతాడు. మతం అసలు రంగు తెలుసుకుంటాడు. మత గ్రంథాలను సరైన రీతిలో అర్థం చేసుకుంటాడు. అనంతరం ‘నిజమైన ఇస్లాం‘ను అమెరికాలో తన సహచరులతో ప్రభోదిస్తాడు. ఆఫ్రికన్ అమెరికన్ యూనిటీ ఆర్గనైజేషన్ ను స్థాపిస్తాడు. కానీ మృత్యువు తనవద్ద పొంచివుందని గమనించిన మాల్కం ఆ సంగతి తన మిత్రులందరికీ తెలియపరుస్తాడు. దారుణంగా హతమయ్యేలోపు విస్తృతంగా పర్యటనలు, ఉపన్యాసాలు పూర్తిచేసుకుని ఆర్థిక అజెండాను సంపూర్ణంగా తన ప్రజల ముందుంచాడు. కానీ పరిస్థితులు ఇప్పుడు qన్నీ తారుమారయ్యే సూచనలు పొడసూపుతున్నాయి. అమెరికాపై ఉగ్రవాదులు జరిపిన భీతవహ దాడుల తరువాత ఇస్లాం మతస్తులు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంటున్న నల్లజాతి ప్రజలకు ఉగ్రవాద దుశ్చర్య పెద్ద చెంపపెట్టు. ఇలాంటి అవకాశాల కోసమే కాచుక్కూచున్న అమెరికా ఉగ్రవాద దురహంకారానికి ఇదొక పెద్ద అలుసు. సామ్రాజ్యవాద స్వభావం దీనిని సాకుగా తీసుకొని నల్లజాతి మీద మళ్ళీ పడగ విసిరేలోగా ఈ దెబ్బను తమాయించుకొని నిలబదిథే ఆత్మగౌరవ పోరాటానికి పునరుజ్జీవనం లభించినట్టు. లేదంటే ఈ త్యాగాలన్నీ, పోరాటాలన్నీ నిష్ఫలమవుతాయి.
జీవితంలో ఎత్తుపల్లలన్నీ చూసాడని కొందరిని వర్ణిస్తుంతారు. నిజానికి అక్షరాలా ఈ మాట మాల్కం ఎక్స్ కు వర్తిస్తుంది. భద్ర జీవనం గడుపుతున్న చిన్నారి మాల్కం తండ్రి మరణించాక, తల్లి ఆత్మగౌరవంతో పెనంచడానికి ప్రయత్నించి విఫలమవుతుంది. ఆమెను సమాజం దాదాపు పిచ్చిదాన్ని చేస్తుంది. వివక్ష విస్వరూపాన్ని లేతప్రాయంలోనే అనుభవిస్తాడు. అయితే దానిపై పోరాటం ప్రకటించిన మాల్కం జీవిత ప్రవాహంలోపడి కొట్టుకుపోతాడు. చిల్లర దొంగతనాలనుండి క్రమంగా పెద్ద దొంగతనాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం, ఒకటేమిటి అన్ని రకాల దుర్వ్యసనాలకు బానిసవుతాడు. చివరకు జైలు పాలవుతాడు. మతాన్ని, దేవున్ని నమ్మని మాల్కం జైలులో క్రమంగా ఎలైజా ముహమ్మద్ గురించి తెలుసుకొని ఇస్లాం గురించి అధ్యయనం ప్రారంభిస్తాడు. ఒక జాతిపట్ల ఇతర జాతులన్నీ చూపిస్తున్న వైమనస్యానికీ, వివక్షకూ, సమస్యలకు మూలాలను అన్వేషించడం ప్రరంభిస్తాడు. ఆ అన్వేషణలో తనకు లభించిన సమాధానాలకు అనుగుణంగానే తన ఉపన్యాసాలను తయారుచేసుకున్నాడు. ఇంక అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో నేషన్ ఆఫ్ ఇస్లాం శాఖలు ఏర్పాటుచేసి, మసీదులు నిర్మించడం ప్రారంభిస్తాడు. ముమ్మరంగా తన కృషి సాగుతున్న దశలో ఎలైజా అనైతిక వ్యవహారం బయటపడుతుంది. దానిని మన్నిస్తాడు కూడా. అయినా అనవసర అహంకారాలతో ఎలైజా దూరాన్ని పెంచుకుంటాడు. దానితో విభేదాలు ఏర్పడి అతడి నుండి విడివడి స్వతంత్రుడవుతాడు. మరణించేవరకు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూనే గడిపాడు.
‘ఏడు తరాలు ‘ నవల రాయడం కోసం అలెక్స్ హేలీ చాలా ఏళ్ళపాటు అవిశ్రాంతమైన పరిశోధన సాగించాడు. నిజానికి తన పూర్వీకుల గురించి కథనం రాసే ప్రయత్నంలో ఆ ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, ఒక పడవలో డెక్ మీద అదే తరహాలో ప్రయాణిస్తూ, కేవలం అప్పటి మూడ్ లోకి వెళ్లడానికి అలెక్స్ హేలీ ప్రయత్నించాడని చెప్తుంటారు. అదేవిధమైన కష్టం మళ్లీ ఈ రచన కోసం పడినట్టు ఈ గ్రంథంలో హేలీ స్వయంగా చెప్పుకుంటాడు. అనేక దఫాలుగా మాల్కం తో ఇంటర్వ్యూలు తీసుకొని, అన్ని విషయాలమీద కూలంకషంగా చర్చించి ఒక్కో వాక్యమూ రాసుకుంటూ వచ్చాడట. మాల్కం గురించి చెప్తూ రచయిత ‘ఇంతటి విద్వత్తేజం కలిగిన వ్యక్తిత్వాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ‘ అని ప్రశంసిస్తాడు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఈ “అసుర సంధ్య - మాల్కం ఎక్స్ ఆత్మ కథ” యువతరం తప్పక చదవాల్సిన ఒక మంచి పుస్తకం.
(ఈ వ్యాసం “వీక్షణం” నవంబర్ 2007 సంచికలో ప్రచురితమైంది.)

Courtsey: Sri Duppala Ravikumar, Srikakulam
http://chaduvu.wordpress.com


అసుర సంధ్య

మాల్కం ఎక్స్‌ ఆత్మకథ

అ లెక్స్‌ హేలీ

ఆంగ్ల మూలం: The Autobiography of Malcolm X with the assistance of Alex Haley, Penguin Books, 1968.

తెలుగు అనువాదం: యాజ్ఞి

పేజీలు: 110 వెల: 40/-

Thursday, September 11, 2008

దేవుడి రాజకీయతత్వం ... బ్రాహ్మణత్వంపై బుద్ధుని తిరుగుబాటు ... కంచ ఐలయ్య


మన దేశంలో ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితి బద్దలవడానికి సిద్ధంగా వున్న అగ్నిపర్వతంలా వుంది.

శతాబ్దాలుగా అక్షర జ్ఞానానికి నోచుకోని వివిధ వర్గాల ప్రజల్లో క్రమేణా విద్యావ్యాప్తి జరుగుతున్నందువల్ల దేశ రాజకీయ రంగంలో వారి ప్రమేయం, డిమాండ్లు పెరుగుతున్నాయి.
వారి పోరాటాలు కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయి.

వర్తమానంలోని ప్రతి పోరాటం వేళ్లు భూతకాలం లోతుల్లోకి చొచ్చుకునిపోయి వుంటాయి.
నేటి పోరాటాన్ని బలోపేతం చేసుకునేందుకు, భవిష్యత్తును మరింత ప్రతిభావంతంగా తీర్చిదిద్దుకునేందుకు మనం మన పోరాట మూలాలను అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ....

కుల వ్యవస్థను, హిందూ సామాజిక దొంతరలను సవాలు చేస్తూ అనేక ఉద్యమాలు వచ్చాయి. కొన్ని ముఖ్యమైన సామాజిక మార్పులకు సైతం అవి దోహదపడ్డాయి. అయితే సమాజంలోని అధికార సంంబంధాలను మాత్రం అవి పెద్దగా మార్చలేకపోయాయనేది మాత్రం వాస్తవం..

బ్రాహ్మణత్వాన్ని ఎదురిస్తూ ఉద్భవించిన బౌద్ధ మతం పలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో గొప్ప సామాజిక, రాజకీయ శక్తిగా మారింది కానీ తను పుట్టిన భారతదేశంలో మాత్రం అది నిలదొక్కుకోలేకపోయింది.

సమకాలీన దళిత ఉద్యమం (నవీన బౌద్ధమత ఉద్యమం) కుల వ్యవస్థను సవాలు చేసేందుకు గాను బౌద్ధమతాన్ని పునరుద్ధరించే స్థాయిలో లేదు. తమ మనుగడ కోసం, తమ హక్కుల, అధికారాల సాధనకోసం పోరాడే దళిత బహుజనులకు (షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి) తగిన రాజకీయ గుర్తింపును సాధించే స్థాయిలోలేదు.
ఇవాళ బుద్ధుణ్నీ, బౌద్ధ మతాన్నీ హిందూత్వీకరించేందుకు, దళిత బహుజనుల ఉద్యమాలన్నింటినీ హిందూత్వ పరిధిలో ఇరికించేందుకు సరికొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం వుంది.

ఈ క్రమంలో అసలు బుద్ధుణ్ని ఒక రాజకీయ తాత్వికుడిగా, ఆ కాలపు గొప్ప విప్లవకారుడిగా చూడకుండా ఆయనను ఏ విధంగా దైవీకరించారు... ఏవిధంగా ఆయనకు పవిత్రతను ఆపాదించారు... ఆయనను సాక్షాత్తు విష్ణు మూర్తి తొమ్మిదవ అవతారంగా ఎందుకు మార్చారు ... వంటి అంశాల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

బౌద్ధ ఉద్యమం, బౌద్ధ ఆలోచనా విధానం మేధోపరంగా కూడా తీవ్ర వక్రీకరణకు, చిన్న చూపునకు గురైంది.
బుద్ధుణ్ని మేధావులు ఒక ఋషిగా, మత బోధకుడిగా చూశారే తప్ప ఒక విప్లవకారుడిగా ఒక రాజకీయ సిద్ధాంత కర్తగా పరిగణించలేదు.

బుద్ధుణ్ని ఈవిధంగా సొంతం చేసుకోవడం, వక్రీకరణకు గురిచేయడం వెనుక వలసవాద, జాతీయవాద మేధావుల పాత్ర (కుట్ర) ఎంతగానో వుంది.

జాతీయోద్యమ కాలంలో మహాత్మా జ్యోతీబా ఫూలే, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌లు తప్ప మిగతా తాత్విక మేధావులంతా బౌద్ధమతాన్ని హిందూమతంలో అంతర్భాగంగానే చూశారు. ....

ప్రాచీన భారత రాజకీయ తత్వవేత్తల్లో కేవలం ఇద్దరిమీదనే ఎక్కువ పరిశోధనలు జరిగాయి. వాళ్లు హిందూ ధర్మాన్ని పెంచి పోషించిన మనువు, కౌటిల్యుడు. అయితే బుద్దుడు మనవుకంటే, కౌటిల్యుడి కంటే ఎంతో పూర్వకాలం వాడని అనేక పురావస్తు, చారిత్రక అధ్యయనాల వల్ల స్పష్టమవుతోంది. నిజానికి సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ల కంటే కూడా బుద్ధుడు చాలా ముందరివాడు.

చైనా చారిత్రక రికార్డులను బట్టి చూస్తే బుద్ధుడు కన్ఫ్యూషియస్‌ కంటే కూడా ముందరి వాడని స్పష్టమవుతుంది.

కాబట్టి బుద్ధుడిని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసి, ఆయనను రాజనీతి తత్వవేత్తగా నిలబెట్ట గలిగితే మానవాళికి తెలిసిన, అతి ప్రాచీన రాజకీయ తాత్వికులలోకెల్లా గౌతమ బుద్ధుడే మొట్టమొదటివాడవుతాడు. ఆయన తాత్వికత ఈ దేశపు, యావత్‌ ప్రపంచపు తత్వశాస్త్రాన్ని మరో మలుపు తిప్పుతుంది.

అయితే ఇదొక బృహత్తరమైన కార్యక్రమం. ఈ రచనలో నా లక్ష్యం చాలా పరిమితం. బుద్ధుడి తాత్వికతలో అంతర్లీనంగా వున్న రాజకీయ స్వభావాన్ని మాత్రమే ఇందులో రుజువు చేయాలనుకుంటున్నాను.

బుద్ధుణ్ని కేవలం మతపరమైన సంస్కరణవాదిగా కాకుండా ఒక రాజకీయ తాత్వికుడిగా అధ్యయనం చేసేందుకు నా ఈ ప్రయత్నం భవిష్యత్‌ రాజకీయ శాస్త్రవేత్తలకు ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. ఇందులో గౌతమ బుద్ధుడి రాజకీయ తాత్విక రూపురేఖలను స్థూలంగా మాత్రమే చిత్రించాను. భవిష్యత్తులో ఈ అంశంపై పరిశోధనలను నిర్వహించే వారికి ఇది ఒక ప్రాథమిక ఆధారంగా పనికొస్తుందని భావిస్తున్నాను.

భారత దేశ చరిత్రను తిరగరాసే ఒక బృహత్తర ప్రణాళికలో నా ఈ రచన అంతర్భాగమని చెప్పవచ్చు. కొందరు భారతీయ విద్యావేత్తలు ఇప్పటికే ఆ ప్రణాళికలో నిమగ్నమై వున్నారు. .....

(ముందుమాట నుంచి...)

ఈ పుస్తకం డా.కంచ ఐలయ్య పిహెచ్‌డి కోసం చేసిన అధ్యయన ఫలితం.


దేవుడి రాజకీయ తత్వం
బ్రాహ్మణత్వంపై బుద్ధుని తిరుగుబాటు
రచన: కంచ ఐలయ్య
ఆంగ్లమూలం : గాడ్‌ యాజ్‌ ఎ పొలిటికల్‌ ఫిలాసఫర్‌, బుద్ధాస్‌ ఛాలెంజ్‌ టు బ్రాహ్మణిజం, సామ్య, కోల్‌కతా, సర్వహక్కులు రచయితవి.‌
తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార
226 పేజీలు, వెల : రూ.70/-

Wednesday, September 10, 2008

ఒక తల్లి ... మహా శ్వేతాదేవి నవల ... హజార్‌ చౌరాసియా కీ మా హిందీ సినిమాకి మాతృక


మానవ హక్కుల కోసం పోరాడే యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్న నేటి సమాజాన్నీ, ఆ సమాజంలోని దుష్టశక్తులనూ, వారి దౌష్ట్యాన్నీ కళ్లకు కట్టినట్టు చూపే నవల యిది.
చిన్న కొడుకు ఇరవైయేళ్ల వ్రతి ఆవిధంగా ఎందుకు మారిపోయాడు?
ఇంటి పట్టున వుండడు, ఎక్కడికి వెడుతున్నాడో ... ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలియదు.
తమకిి డబ్బుకి లోటు లేదు. కాలేజీ చదువు పూర్తికాగానే అమెరికాకు పంపి పైచదువులు చదివించాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ వ్రతి ఇంటిలో ఎవరితోనూ మనసిచ్చి మాట్లాడడు. భోగభాగ్యాలంటే లెక్కలేదు, నిరసన. అతని ఆలోచనలేమిటో, ఆవేదన దేని గురించో తల్లికి ఒకపట్టాన అర్థం కాదు.
వ్రతి మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు. చివరికి ఇరవయ్యేళ్ల లేత వయసులోనే దారుణంగా చంపబడ్డాడు. ఈ దుర్మార్గపు వ్యవస్థ వ్రతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది.
వ్రతి పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే. జనవరి 17. తల్లి సుజాతకి మాత్రమే జ్ఞాపకం ఇది.
సుజాత అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందులా మారిపోయాడు తెలుసుకోవాలనుకుంది. వ్రతి స్నేహితుల్ని కలుసుకుంది. జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటిగా అవగతమయ్యాయి.
ఆరోజు సాయంత్రం అయ్యే సరికి ఆమెకు వాస్తవం బోధపడింది. ఆ వాస్తవాన్ని తట్టుకోలేక పోయింది. తల్లడిల్లి పోయింది. చివరికి ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది.
ఇది ఆ ఒక్క తల్లి కథ మాత్రమే కాదు. ఈనాడు సమాజంలో స్వాతంత్య్రానంతరం పుట్టిన తరం ఇలా ఎందుకు మారిపోతున్నారో తెలియక అంతులేని ఆవేదనతో తల్లడిల్లిపోతున్న అనేక మంది తల్లులందరి కథ.
మహా శ్వేతాదేవి బెంగాలీలో రచించిన ఈ నవల విశేష ప్రాచుర్యం పొందింది. నాటకంగా వేలాది ప్రేక్షకుల. ప్రశంసలు అందుకుంది. ప్రఖ్యాత దర్శకుడు గోవింద నిహలాని దర్శకత్వంలో హజార్‌ చౌరాసియా కీ మా పేరుతో హిందీలో చలనచిత్రంగా కూడా నిర్మించబడింది. అందులో తల్లి పాత్రను జయా బచ్చన్‌ అద్భుతంగా పోషించారు.
....
...ఈ సమాజంలో ఆహార పదార్థాలను, ఔషధాలను కల్తీ చేసేవాళ్లు, హంతకులు, రౌడీలు, దొంగలు, దోపిడీదార్లు, లంచగొండులు హాయిగా బతకొచ్చు. దేశ సంపదను దిగమింగే నేతలు పోలీసుల రక్షణలో సకల భోగ భాగ్యాలతో దర్జాగా బతకొచ్చు. కానీ ఈ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్లకి ... కవులూ కళాకారులు, బుద్ధి జీవులకు మాత్రం బతికే హక్కు లేదు. వాళ్లకి మృత్యుదండన ఒక్కటే తగిన శిక్ష. వాళ్లని నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్‌ చేసిపారేయవచ్చు. వాళ్లని చంపెయ్యడం వీళ్ల ప్రజాస్వామిక హక్కు. రిపబ్లిక్‌ వీళ్లకా అధికారం యిచ్చింది. వీళ్లకి ఏ చట్టం వర్తించదు. ఏ నియమం, ఏ నీతీ అడ్డు రాదు. అసలు న్యాయ విచారణే అవసరం లేదు.......
....

ఒక తల్లి
రచన: మహా శ్వేతాదేవి
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం
142 పేజీలు, వెల: రూ.18

Tuesday, September 9, 2008

శూద్రవర్ణం ఎలా పుట్టింది? ...ఆర్‌.ఎస్‌. శర్మ


ప్రాచీన భారతీయ సమాజంలో నిమ్న వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు వుదయిస్తాయి.
శూద్రవర్ణం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడింది?
అగ్రవర్ణాల వాళ్లకు సేవలు చేయడం కోసమే శూద్రులు నిర్దేశించబడినట్లయితే, వాళ్లను బానిసలుగా వర్గీకరించవచ్చునా?
ప్రాచీన భారతీయ సమాజం బానిస సమాజమా?
కర్మకాండకు సంబంధించి శూద్రులస్థాయి వారి ఆర్థిక స్థాయికి ఎంతవరకు అనుగుణంగా వుంది?
మత సంస్కరణవాదులు నిమ్న వర్గాల స్థితిలో మౌలికంగా ఏదైనా మార్పు తీసుకువచ్చారా?
లేక ఇతర కారణాల వల్ల వాళ్లలో వచ్చిన మార్పుల్ని వేళ్లూనుకొని నిలబడేలా చేయడానికి ప్రయత్నించారా?
గడచిన శతాబ్దాల్లో మన ఆర్థిక వ్యవస్థలో నిమ్న వర్గాల పాత్ర ఎంతవరకు మారింది?
ద్విజులుగా పరిగణింపబడ్డ వైశ్యుల్ని శూద్రుల స్థాయికి తీసుకెళ్లి, శూద్రులకు వైశ్యులతో పాటు సమాన హోదా కల్పించడం ఎందువల్ల జరిగింది?
మన అధ్యయన విషయమైన కాలపరిమితి ముగిసేసరికి సేవక వర్గం విపరీతంగా అభివృద్ధి చెందడానికి కారణాలేవి?
సేవక వృత్తికీ, దానివల్ల ఏర్పడే అసౌకర్యాలకూ శూద్రులు ఎలా స్పందించారు?
ఇతర దేశాలతో పోలిస్తే ప్రాచీన భారత దేశంలో సామాజిక విప్లవాలు లేక పోవడానికి కారణాలేమిటి?
ఈ పుస్తకంలో వీటికీ, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం జరిగింది.

శూద్ర వర్ణం ఎలా పుట్టింది?

- ఆర్‌.ఎస్‌.శర్మ
తెలుగు అనువాదం: సనగరం నాగభూషణం
196 పేజీలు, వెల: రూ.40

Sunday, September 7, 2008

ఖైదీ నెం. 174517 ... నాజీ మారణ శిబిరాలలో యూదులు ... ప్రీమో లెవి స్వీయానుభవాలు


నాజీలు, ఫాసిస్టులు సృష్టించిన విధ్వంసం, భయానకమైన మారణకాండ గురించి ఎన్నో రచనలు వచ్చాయి.
వాటిలో మృత్యువు అంచువరకూ వెళ్లి బతికి బయటపడ్డ ప్రీమొ లెవి రాసిన స్వీయానుభవాలు మనల్ని వెంటాడుతాయి. మనుషులు ఇంత రాక్షసులుగా మారగలరా అని గగుర్పాటు కలుగుతుంది.
ఒకానొక చారిత్రక వికృతత్వానికి సాక్షిగా నిలబడి, దాని భయానకమైన అనుభవాలకు బాధితుడై కూడా ఎంతో సంయమనంతో ఆయన తన అనుభవాలను మనకు చెపుతున్నారు.
దాదాపు 60 లక్షల మందిని దారుణంగా హతమార్చిన ఆ దుర్మార్గపు ఫాసిస్టు హింసను ఈ పుస్తకం నగ్నంగా బట్టబయలు చేసింది.
ఈ పుస్తకంలో అక్షరబద్ధమైన అనుభవాలు మనుషుల్ని నిల్చున్నచోట నిలువనీయవు.
ప్రీమొ లెవి 1919లో ఇటలీలోని టురిన్‌లో పుట్టాడు. రసాయనిక శాస్త్రంలో పిహెచ్‌.డి. చేశాడు. 1943లో ఫాసిస్టు వ్యతిరేక తిరుగుబాటు కూటమిలో చేరాడు. జర్మన్‌ సైన్యం అతణ్ని బందీగా పట్టుకొని ఔప్విట్స్‌ క్యాంపు (మృత్యు శిబిరం)కు పంపింది. ఆయన 1945లో ఆ నరకం నుంచి బయటపడగలిగాడు. తర్వాత టురిన్‌ వచ్చి కెమిస్ట్‌గా తన జీవితం కొనసాగిస్తూ అనేక రచనలు చేశారు.
1947లోనే ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. అతికష్టం మీద ఒక ప్రచురణ సంస్థ దీనిని ప్రచురణకు స్వీకరించి 2,500 కాపీలను ముద్రించింది. కానీ ఐరోపా అంతా యుద్ధ శోకంలో వుండి తేరుకోడానికి ప్రయత్నిస్తున్న సమయం కావడంతో అవి కూడా అమ్ముడు పోక అటకెక్కాయి. ఆతరువాత 1958లో తిరిగి ఈ పుస్తకాన్ని పునర్ముద్రించారు. ఒక్క ఇటలీలోనే 5,00,000 కాపీలు అమ్ముడు పోయాయి. అనేక ప్రపంచ భాషల్లో ఇది అనువదించబడింది. రేడియోకు, థియేటర్‌కు కూర్పులు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
దుర్భరమైన కష్టాలను, అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఎంతో ఆశావహంగా జీవిస్తూ వచ్చిన ప్రిమో లెవి1987 ఏప్రిల్‌ 11న ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఒక విషాదం.
...సర్వస్వాన్ని కోల్పోయిన మనిషి తనను తాను కోల్పోతాడు. అతని చావునీ బతుకునీ ఏ మాత్రం మానవ స్పృహ లేకుండా నిర్ణయించవచ్చు. అతను పనికి వస్తాడా లేదా అన్నదానిపైనే ఇక్కడ అతని బతుకును నిర్ణయిస్తారు. ఈ అర్థంలో నాజీ మృత్యు శిబిరాలను (కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులను) అర్థం చేసుకోవాలి. భౌతికంగా మాత్రమే చనిపోవడం కాదు... సర్వస్వాన్ని కోల్పోతూ చనిపోవడం... అదే ఇక్కడ జరుగుతుంది. నేనిప్పుడు ఖైదీని. నా నెంబరు 174517. నాకు బాప్తిజం యిచ్చారు. (బాప్తిజం అంటే చర్చిలో/క్రైస్తవ మతంలో చేర్చుకొనడానికి జరిపే ఒక మతకాండ.) మమ్మల్ని వరుసగా నిలబెట్టారు. ఒక నాజీ అధికారి చేతిలో చిన్న సూది వున్న సాధనం వుంది. దాంతో అతను ఎంతో నైపుణ్యంతో మా ఎడమ చేతుల మీద చకచకా మా ఖైదీ నెంబర్లను పచ్చబొడిచాడు. పచ్చపొడిచేటప్పుడు విపరీతంగా నొప్పి వేసినా ఆ కార్యక్రమం త్వరగానే ముగిసింది. ఆ పచ్చబొట్టును మేమిక చనిపోయేంతవరకు మోయాల్సిందే...

ఖైదీ నెం.174517
నాజీ మారణ శిబిరాలలో యూదులు
ప్రిమొ లెవి
ఆంగ్ల మూలం: ఇఫ్‌ దిస్‌ ఈజ్‌ ఎ మాన్‌, ట్రాన్స్‌లేటెడ్‌ బై స్టువర్ట్‌ వోల్ఫ్‌.
తెలుగు అనువాదం: కలేకూరి ప్రసాద్‌
110 పేజీలు, వెల: రూ.25

Saturday, September 6, 2008

చోళీ కే పీఛే ... మహా శ్వేతా దేవి కథలు


చోళీ కే పీఛే

చోళీ కే పీఛే క్యా హై అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, కరవుకాటకాలు, ఉగ్రవాదం, ఘర్షణలు, ఎన్‌కౌంటర్లు, కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం, నర్మదా బచావో ఆందోళన, విచ్చలవిడిగా జరుగుతున్న మాన భంగాలు, హత్యలు, లాకప్‌ చిత్రహింసలు, మరణాలు ... వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానమైనవైపోయియి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించలేకపోయియి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం...చోళీ కే పీఛే ... రవిక మాటున....!
భారత దేశపు అగ్రశ్రేణి రచయిత్రి మహా శ్వేతాదేవి రచించిన మూడు శక్తివంతమైన కథల సంపుటి యిది. ఇందులో చోళీకే పీఛే, పాల తల్లి, ద్రౌపది అనే మూడు కథలున్నాయి.
ఈ కథలన్నింటిలో కనపడే సాధారణాంశం రొమ్ములు.
వీటిలో రొమ్ములు కేవలం ప్రతీకలు మాత్రమే కావు. దోపిడీ సామాజిక వ్యవస్థ కర్కశమైన అత్యాచారాలను అవి బట్టబయలు చేస్తాయి.
ద్రౌపది కథలో ప్రధాన పాత్ర ఒక ఆదివాసీ విప్లవకారిణి. ఆమెను అరెస్టు చేస్తారు. కస్టడీలో పోలీసులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. గాయాలతో, క్షతాలతో నెత్తురోడే రొమ్ములతో ఆమె నడిరోడ్డుపై నగ్నంగా నడుస్తుంటే సాయుధుడైన శత్రువు వణికిపోతాడు. ఆ గాయపడ్డ రొమ్ములు శత్రువును వణికించే ఆయుధాలు.
పాలతల్లి కథలో తన కుటుంబాన్ని పోషించడానికి ఆమె కిరాయికి పాలిచ్చే తల్లి వృత్తిని చేపడుతుంది. ఏళ్ల తరబడి తను పాలిచ్చి సాకిన కొడుకలూ... చివరకు తన అస్తిత్వానికి ప్రతీకలైన రొమ్ములూ ఆమెకు విద్రోహం చేస్తాయి. ఆమె రొమ్ము క్యాన్సర్‌ బారిన పడి చనిపోతుంది.
చోళీ కే పీఛే కథలో వలస కూలీగా వచ్చిన గంగోర్‌ అందమైన రొమ్ములు ఫోటో గ్రాఫర్‌ ఉసిన్‌పురిని ఆకర్షిస్తాయి. దాని చుట్టూ తిరిగిన కథ రైలు ప్రమాదంలో ఉసిన్‌ మరణించడంతో విషాదాంతమవుతుంది.
కలవరపెట్టే భయానక దృశ్యాలను ఈ కథల్లో రచయిత్రి చిత్రించిన తీరు పాఠకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.

చోళీ కే పీఛే
మహా శ్వేతాదేవి కథలు
ఆంగ్ల మూలం: బ్రెస్ట్‌ స్టోరీస్‌
తెలుగు అనువాదం: సహవాసి, కలేకూరి ప్రసాద్‌
46 పేజీలు, వెల: రూ.13

Friday, September 5, 2008

మా కథ: పోరాట పథంలో బొలీవియా మహిళలు- దొమితిలా బారియోస్‌ ద చుంగార


మా కథ
పోరాట పథంలో బొలీవియా మహిళలు
దొమితిలా బారియోస్‌ ద చుంగార


దక్షిణ అమెరికా ఖండంలో ఒక చిన్న దేశం బొలీవియా. దాని జనాభా 50 లక్షలు. పేరుకు ఇంత చిన్న దేశమే అయినా అది గని కార్మిక ఉద్యమంతో, దానితో చేయీ చేయీ కలిపి నడచిన మహిళా ఉద్యమంతో ఎంతో పేరు సంపాదించుకుంది. అక్కడి తగరపు గనుల్లో మహిళా ఉద్యమాన్ని నడిపిన ఒక నాయకురాలి స్వీయ కథనం ఈ పుస్తకం.
ఇది నవలా? అనుభవాల గుచ్ఛమా? ఆత్మకథా? చరిత్రా? అర్థశాస్త్రమా?
జన జీవితపు కొలిమిలో పుటం పెట్టిన ఆ అనుభవాలు చదువుతోంటే ఇది నవలే అనిపిస్తుంది.
శకలాలు శకలాలుగా వున్న ఆ కథనం ఇది అనుభవాల సంపుటేమో అనిపిస్తుంది.
పుస్తకం మొత్తం దొమితిలా మన ఎదురుగా నిలబడి చెప్పిన ఆత్మకథేమో అనిపిస్తుంది.
తారీఖులు, దస్తావేజుల జోలికి పోకుండానే ముఫ్ఫై సంవత్సరాల బొలీవియన్‌ ప్రజా పోరాట సాంప్రదాయాన్ని ఇది మన కళ్లముందు రూపుకట్టి... ఇది చరిత్ర పుస్తక మేమో అన్పిస్తుంది.
అంకెలూ, పట్టికలూ లేకుండానే ఈ పుస్తకం ఆర్థిక విధానాల్ని వివరిస్తుంటే అర్థశాస్త్ర గ్రంథమేమో అన్పిస్తుంది.
ఇంతకూ ఇదేమిటో మీరే తేల్చుకోండి.

దొమితిలా మాటల్లో:
....నా జీవితమంతా జనానిది. నా కేమేం జరిగాయో నా దేశంలో వందలాది మందికవే జరిగాయి. నేను స్పష్టంగా చెప్పదలచుకున్నది ఈ సంగతే. ప్రజల కోసం నేను చేసినదానికన్నా చాలా ఎక్కువ చేసిన వాళ్లు వున్నారని నాకు తెలుసు. ఐతే వాళ్లలో కొందరు చనిపోయారు, మరికొందరి సంగతి బయటకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. అందుకే నేనిక్కడ నా సొంత గొడవ మాత్రమే చెప్పదలచుకోలేదంటున్నాను. బొలీవియాలో ఎన్నో సంవత్సరాల పోరాటంలో మేం పొందిన అనుభవాలను నేనిక్కడ పొందుపరచదలచుకున్నాను. మా అనుభవాలు కొత్త తరానికి, కొత్త జనానికి ఏదో ఓ రకంగా ఉపయోగపడతాయనే ఆశతోనే ఈ చిన్నమెత్తు కానుకను మీ ముందు పెడుతున్నాను......

మా కథ
దొమితిలా బారియోస్‌ ద చుంగార
స్పానిష్‌ మూలం: లెట్‌ మి స్పీక్‌ ! టెస్టిమోనీ ఆఫ్‌ డొమిటిలా, ఎ వుమన్‌ ఆఫ్‌ ది బొలీవియన్‌ మైన్స్‌.
తెలుగు అనువాదం: వేణు
192 పేజీలు, వెల: రూ.50

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌