Sunday, February 6, 2011

మతతత్వంపై బాలగోపాల్‌

మతతత్వంపై బాలగోపాల్‌
హిందూత్వం అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? ఏ పరిస్థితుల్లో హిందూత్వం 1980ల చివర ఉప్పెనలా లేచింది? దానికీ, అదే కాలంలో ప్రపంచంలో ముందుకు వచ్చిన నయా ఉదార వాదానికి ఏమైనా సంబంధం వుందా? ఉత్తర భారతాన కొన్ని ఆధిపత్య స్థానాల్లోకి చొచ్చుకుపోయిన హిందూత్వం, దక్షిణ భారతదేశంలో ఎందుకు చొరబడలేకపోయింది? ఈ ప్రశ్నలకు, పరిశోధకుడిగా ప్రపంచ చారిత్రక దృక్పథంతో పాటు దేశీయ, ప్రాంతీయ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన కె. బాలగోపాల్‌ మత తత్వంపై ప్రత్యేకించి హిందూత్వంపై రాసిన విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనమిది. మొదటి భాగం ...
ఈ రోజు (06 ఫిబ్రవరి 2011) వార్త దినపత్రికలో కె.పి.అశోక్‌ కుమార్‌ చేసిన పూర్తి సమీక్షను ఇక్కడ చదవండి.


Saturday, February 5, 2011

రాముడుండాడు రాజ్జిముండాది -డా.కేశవరెడ్డి నవల


రాముడుండాడు
రాజ్జిముండాది

-డా.కేశవరెడ్డి నవల
...
కేశవరెడ్డి గారు ఈ నవలలో ఇంత విశాల దేశంలో పనెక్కడైనా దొరకకపోతుందా అని గ్రామాలనుంచి వలసపోతున్న కుల వృత్తులవారి జీవితాలు, మనో ప్రవృత్తులు చిత్రించారు. చిత్తూరు ప్రాంతంలో వలసపోయే ప్రజలు ''రాముడుండాడు రాజ్జిముండాది'' అనే భరోసాతో యలబారిన వైనాన్ని చిత్రించారు.

''రాముడుండాడు రాజ్జిముండాది'' అని వలసల విషయంలో ప్రజలకేర్పడిన భరోసాతోనే ఈ పరిణామంలోని రహస్యం ఇమిడివున్నది. దేశం గొడ్డుబోయిందా, ఇంత సువిశాల దేశం ఇది - బతకకపోతామా అని బయల్దేరలేదు వాళ్లు.  బ్రిటీష్‌వాళ్లు వచ్చి యంత్రాలు, మార్కెట్‌ వచ్చాక రాజ్యం (ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి పర్యాయపదం) జీవనోపాధి కలిగిస్తుందనే ఒక ఎండమావి ఏర్పడింది. పుట్టిచ్చిన వాడు రాతి కింది కప్పకు కూడ బతుకు దెరువు చూపకపోడనే విశ్వాసం మత శాస్త్రాలన్నీ ఉగ్గుపాలతో రంగరించి పోసినదే. కనుక రాముడూ రాజ్జివూ కలిసిపోయాయి. బ్రహ్మణీయ హిందూ మత విశ్వాసం కలిగించిన మాయకు మార్కెట్‌ మాయ తోడైంది.

ప్రజలకు, కష్టజీవులకు రాముడు చేయగల సాయమేమిటో రచయితే స్వయంగా గుట్టు విప్పి చెప్పారు. హరిశ్చంద్రుని అప్పుల బాధలు మొదలు తానీషా అప్పుల బాధల వరకు తీర్చిన దేవుడు ఈ దేశంలో రైతుల అప్పుల బాధలు తీర్చే దగ్గరికి వచ్చే వరకు రాతి దేవుడైపోయాడు. కలరా, ప్లేగు వంటి రోగాలు 'స్వామి' వల్లనే మాయమయ్యాయని నమ్మారు గానీ ఆకలి రోగం అరికడతానని ఆయన భరోసా ఇవ్వలేదు. ఈ రోగం ఎందుకు వచ్చిందని వాళ్లు స్వామిని ప్రశ్నలడగడంలేదు.
...
కేశవరెడ్డి గారిలో అద్భుతమైన సౌందర్య దృష్టి వున్నది. అయితే ఆయన సౌందర్యాన్ని ప్రకృతిలో, జీవితంలో, శ్రమైక జీవనంలో చూస్తారు. అది ఒక తాత్విక స్థాయినుంచి, హృదయపు లోయల్లోంచి వచ్చింది గనుక అది భాషలోనూ, వర్ణనలోనూ, పాత్ర చిత్రణలోనూ - అంతటా వెలుగువలె, వెన్నెలవలె, సూర్య కిరణాలవలె, నక్షత్రాలవలె పరచుకొని వుంటుంది. ఇంక భాషా సౌందర్యం గురించి అయితే - చిత్తూరు మాండలికంలోని ఆయన నవలలు చదివితే కానీ శ్రమ నుంచి సమస్త సంపదలవలెనే సంపద్వంతమైన భాష పుడుతుందనే విషయాన్ని అనుభూతిచెందలేం. చిత్తూరు అడవుల్లో, పల్లెల్లో, అక్కడ చెట్లమధ్య, పక్షుల మధ్య ఈ అన్ని సమూహాల భాషనూ ఆస్వాదిస్తూ అక్కడ సంచరిస్తున్నట్లు వుంటుంది ఆయన నవలలు చదువుతుంటే.
...
(రాముడుండాడు రాజ్జిముండాది నవలకు వరవరరావు రాసిన 'ఒయాసిసుల కోసం' ముందుమాట నుంచి)

పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రల
నా తల్లి బందీయై పోయిందో
కనిపించని కుట్రల ... పల్లె ...

కుమ్మరి వాముల తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిల దుమ్ము పేరెను
పెద్ద బారిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగు లిరిగినవి
చేతి వృత్తుల చేతులరిగిపోయె నా పల్లెల్లోన
గ్రామ స్వరాజ్యం
గంగలోన పాయె నా పల్లెల్లోన ... పల్లె ...

( గోరటి వెంకన్న పాట 'పల్లె కన్నీరు పెడుతుందో' నుండి)రాముడుండాడు
రాజ్జిముండాది
-డా.కేశవరెడ్డి 

 డా.కేశవరెడ్డి

ముఖచిత్రం : కాళ్ల
122 పేజీలు, వెల : రూ.80/-


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067

ఫోన్‌ నెం. 040-2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.comహైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌