Sunday, November 29, 2009

వనవాసి - బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (పథేర్‌ పాంచాలి రచయిత) - తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం...


వనవాసి (నవల) ...

భారతీయ సాహిత్యంలో అజరామరంగా నిలబడే గొప్ప బెంగాలీ నవల ఇది. ''పథేర్‌ పాంచాలీ'' నవలాకర్తగా విఖ్యాతినొందిన బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ కలం నుంచి జాలువారిన మరో అపురూప రచన ఇది. పథేర్‌ పాంచాలితో సమానమైన ప్రాచుర్యం దీనికి లభించనప్పటికీ ఇది కూడా అంతటి (లేదా అంతకంటే ఎక్కువే) విశిష్ట రచన అన్నది వివేచనాపరులైన విమర్శకుల అభిప్రాయం.
నానాటికీ అంతరించిపోతున్న అరణ్యాలు, కనుమరుగైపోతున్న మన జీవనం గురించి ఇంతటి హృద్యమైన అనుభూత్యాత్మక రచన మరోటి మన సాహిత్యంలో అరుదనే చెప్పవచ్చు.

.....

ముందుమాట నుంచి ...


బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ (1894-1950) బెంగాలీలో రాసిన 'అరణ్యక' నవలకి అనువాదం 'వనవాసి'. అరణ్యక నవల 1938 ఏప్రిల్‌లో మొట్ట మొదటగా ప్రచురింపబడింది.

భిభూతి భూషణ్‌ అనగానే పాఠకుల మనసులో 'పథేర్‌ పాంచాలీ' మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పథేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టిన విషయం పాఠకులకు తెలుసు. ''వనవాసి''ద్వారా భభూతి భూషణ్‌ తెలుగు పాఠకులకు మరింత చేరువయ్యారు.

డెబ్భై ఏళ్లక్రితం రాయబడిన నవల వనవాసి. అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పిరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. భౌగోళిక ఉష్ణోగ్రత నానాటికీ పెరిగి పోతోంది. వర్షాభావం వల్ల రాబోయే కాలంలో జరగబోయేవి జల యుద్ధాలేననిపిస్తుంది.

వంద సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40% ఆక్రమించుకొని వున్న అడవులు 1997 నాటికి 19% అయ్యాయి. కాస్త హెచ్చుతగ్గులున్నప్పటికీ మొత్తం మీద అడవులు అంతరించి పోతున్నాయన్నది వాస్తవం. అభివృద్ధి పేరుతో అడవులు కనుమరుగవు తున్నాయన్నది చేదు నిజం.

అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్థకమవుతోంది. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద బడుగు వర్గాలని నిర్వాసితులను చేసే అనివృద్ధి అధివృద్ధికాదు. ఈ దృష్టితో చూసినప్పుడు సాహిత్యంలో ''వనవాసి'' వంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ.

ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ మనదేశంలోకి ప్రవేశించి ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో సంక్షోభాన్ని సృష్టిస్తున్న సందర్భంలో; కాలుష్య భూతం భోగోళాన్ని కబళించడానికి పొంచివున్న తరుణంలో, కుల, మత, వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణపడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో; స్వచ్ఛమైన ప్రాణవాయువును అతి స్వచ్ఛమైన అరణ్య వృక్షాల మీద నుంచి సభ్య సమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వచ్ఛమైన జీవితాలనుంచి మనకందిస్తున్నాడు రచయిత ఈ నవల ద్వారా.

...

అభివృద్ధి అంటే ఏమిటన్నది నేటికీ చర్చనీయాంశమే.

చలం ''జీవితాదర్శం'' చదివాక భీమ్లీ సముద్రం చూడాలని మనసు ఆరాటపడేది. అట్లాగే వనవాసి నవల చదివాక ఆ అరణ్యాలన్నీ సంచరించాలనే ప్రగాఢ వాంఛ పీడిస్తుంది.

రచయిత తనతో పాటు పాఠకులనీ అరణ్య సంచారం చేయించి అరణ్య ప్రకృతినీ, ప్రకృతితో మమేకమయిన కపటమెరుగని గిరిజనుల స్వచ్ఛమైన జీవనాన్ని అనుభూయమానం చేస్తాడు. మానవ నిర్మితమైన ఉద్యాన వనాలే కాదు సహజ సుందరమైన అరణ్య ప్రకృతినీ, వనాలనీ సందర్శాన స్థలాలుగా ఏర్పాటుచేసి అడవుల నిర్మూలనకి వ్యతిరేక దిశగా ఉద్యమించాల్సిన అవసరముంది.
వన విహారానుభూతిని స్వయంగా అనుభవించగలిగితే భిభూతి భూషణుని తపనలోని గాఢత ఏమిటో అర్థం చేసుకోగలుగుతాం. అతడు మన ఆత్మలమీది పొరల్ని తొలగిస్తున్నాడు. అతడి చేయిపట్టుకుని దుర్గమారణ్యంలోకి ప్రవేశించడానికి మనం సిద్ధం కావాలి మరి!

...

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువందించిన సూరంపూడి సీతారాం తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో జన్మించారు. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో ఉద్యోగాలు చేశారు. ఢిల్లీ ఆకాశవాణిలో, చెన్నైలో ఆంధ్రప్రభలో, కలకత్తాలో ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌లో,ఆంధ్రపత్రికలో, చివరగా భారతీయ సమాచారవిభాగంలో పనిచేసి 1981లో పదవీ విరమణ పొందారు. సహజ సుందర అనువాదాల రూపంలో ప్రపంచ సాహితాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసిన ఘనత ఆయనది. వారు అనువదించిన మహాశ్వేతాదేవి రచనలైన 'హజార్‌ చౌరాసియాకి మా' (ఒకతల్లి), 'డాయిన్‌' (దయ్యాలున్నాయి జాగ్రత్త), 'శ్రీశ్రీగణేష్‌ మహిమ' (రాకాసి కోర) లను గతంలో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించింది. సీతారాం 1997లో మరణించారు.


వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం


తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Saturday, November 28, 2009

సూర్యుడి ఏడో గుర్రం (సూరజ్‌ కా సాత్వా ఘోడా) ... ధర్మవీర్‌ భారతి ... తెలుగు అనువాదం : వేమూరి ఆంజనేయశర్మ ... ముందుమాట : శ్యామ్‌ బెనెగల్‌ ...


సూర్యుడి ఏడో గుర్రం

హిందీ సాహిత్యంలో ఆత్యంత ప్రయోగాత్మకమైన తొలితరం రచన ఇది. నవల కాని
నవల, కథా సంకలనం కాని కథా సంకలనం.

పైకి సాధారణంగా కనిపిస్తూనే నిగూఢమైన మానవ సంబంధాలనూ, ప్రేమ
పరిణామాలనూ అసాధారణ సహజత్వంతో కొత్తకోణం ఆవిష్కరిస్తుందీ ఆధునిక రచన.
ధర్మవీర్‌ భారతి దీన్ని ఆరు దశాబ్దాల క్రితం రాశారు. అయినా నేటికీ వన్నెతగ్గకపోగా
ప్రముఖ దర్శకుడు శ్యాం బెనెగల్‌ చేతుల్లో (అదే పేరుతో) చలనచిత్రంగా రూపుదిద్దుకుని
అంతర్జాతీయ ప్రాశస్త్యాన్నీ సంతరించుకుంది.
................

శ్యాం బెనెగల్‌ రాసిన ముందు మాట నుంచి ...

1980ల చివర్లో అనుకుంటా... ఓ రోజు షమా జైదీ వచ్చి మీరు ధర్మవీర్‌ భారతి రాసిన ''సూరజ్‌కా సాత్వా ఘోడా'' నవల చదివారా? అని నన్నడిగారు. స్క్రిప్టులు రాయటంలో చిరకాలంగా నాకు సహకరిస్తున్న ఆమె ఆ సమయంలో ఈ నవల ప్రస్తావన తేవటానికి ఓ చిన్న నేపథ్యం ఉంది. ... ...

ఇదిగో సరిగ్గా అప్పుడే ''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నా కంటబడింది షమా జైదీ ద్వారా! దాన్ని చదువుతూనే కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ నవల సినిమా హక్కులు కొందామనుకుని వెంటనే ధర్మవీర్‌ భారతిని సంప్రదించాను గానీ ... అప్పటికే దాన్ని టీవీ
సీరియల్‌గా తీస్తానన్న ఓ నిర్మాతకు హక్కులు అమ్మటమో లేక మాట ఇవ్వటమో జరిగిందని చెప్పారాయన. ప్రాణం ఉసూరు మనిపించింది.
....

''సూరజ్‌ కా సాత్వా ఘోడా'' నవలలో ఎన్నో కథలున్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుని, బిగువుగా అ ల్లుకుపోతూ చదువరులకు గాఢమైన, నిగూఢమైన అనుభూతిని కలగజేస్తాయి. అ లాంటి దీన్ని విడి విడి భాగాలుగా ముక్కలు చేసి, టీవీ
సీరియల్‌గా నడిపిస్తే... పురి విప్పిన దారంలా ... ఆ అ ల్లిక, బిగువు, పొందిక... ...అన్నీ పేలవంగా తేలిపోతాయనిపించింది. చూస్తూ వుండలేక, ఆ టీవీ ప్రొడ్యూసర్‌తో ఎలాగైనా తెగతెంపులు చేసుకోవాలని ధర్మవీర్‌ భారతిపై ఒత్తిడి తేవటం ఆరంభించాను.

నిజానికది నా తత్వానికి సరిపడని పనే. ముందెన్నడూ ఇలా చేయలేదు, భవిష్యత్తులో చేస్తాననీ అనుకోను. కానీ అప్పటికీ, ఇప్పటికీ కూడా నా విశ్వాసం ఏమంటే - అసాధారణ ప్రాముఖ్యం గల ఈ నవలను ఏ ముక్క కాముక్కగా విడగొట్టటం,
ఇందులోని ఒక్కో కథనూ ఒక్కో ఎపిసోడ్‌గా మలిచి సీరియల్‌గా తియ్యటం సరికాదని! మొత్తానికి కొన్ని నెలలు పెనుగులాడి దాన్ని ఎలాగైనా సాధించగలిగాను.
.... .... ....

ఇక నవల గురించి చెప్పుకోవాలంటే ... నాటి సమకాలీన భారతీయ సాహిత్యంలో అత్యంత ఆధునికతను సిద్ధించుకున్న ''మోడర్నిస్ట్‌'' నవలగా దీన్ని నిస్సందేహంగా పేర్కొనవచ్చు. అనువాద రూపంలో ''సూర్యుడి ఏడో గుర్రాన్ని'' నేటితరం తెలుగు
పాఠకుల ముందుకు తెస్తుండటం ముదావహం.

ధర్మవీర్‌ భారతి గురించి వినని, భారతీయ సాహిత్యంపై ఆయన వేసిన ముద్ర ఏమిటో అంతగా తెలియని కొత్త తరానికి ఇదో అమూల్యమైన కానుక అని భావిస్తున్నాను.


- శ్యాం బెనెగల్‌

4 జులై 2009

సూర్యుడి ఏడో గుర్రం
ధర్మవీర్‌ భారతి

(సూరజ్‌ కా సాత్వా ఘోడా - హిందీ నవల)
తెలుగు అనువాదం: వేమూరి ఆంజనేయ శర్మ

ముందు మాట : శ్యాం బెనెగల్‌
మలిమాట : ఎన్‌. వేణు గోపాల్‌
ముందుమాట అనువాదం: అనంత్‌

115 పేజీలు, వెల: రూ.50

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

E Mail ID : hyderabadbooktrust@gmail.com

Friday, November 27, 2009

జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ ... పూర్ణిమ గారి సమీక్షజమీల్య నవలపై పుస్తకం డాట్ నెట్ లో పూర్ణిమ గారు చేసిన అద్భుతమైన సమీక్షను మరోసారి మా వీక్షకుల దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ పొందుపరుస్తున్నాము. పూర్ణిమ గారికి మా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో పుస్తక సమీక్షల కోసం పుస్తకం డాట్ నెట్ ని సందర్శిస్తున్దండి.

జమీల్యా – నాకు నచ్చిన ప్రేమకథ


పుస్తకం పై అట్ట మీదేమో ఒక అమ్మాయి బొమ్మ, వెనుకాలేమో “ప్రపంచంలోని బహుసుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన” అన్న వాక్యం, అట్టకీ అట్టకీ మధ్య మహా అయితే ఓ వంద పేజీలు.. చూడ్డానికి చిట్టిగా, ప్రేమ కథ అంటూ విషయం ఘాటుగా ఉండడంతో “ఓ గంటలో అవ్వగొట్టేయచ్చు” అంటూ మొదలెట్టిన పుస్తకం ఇది.

చదవటం పూర్తవ్వగానే “అబ్బే.. ఇంతేనా?” అనిపించింది. సమయం గడిచే కొద్దీ, పుస్తకం నాలో ఇంకుతున్న కొద్దీ “అబ్బో.. చాలానే ఉంది” అనిపించింది.

ఇది ఒక ప్రేమ కథ! అంటే ఒక అమ్మాయి – ఒక అబ్బాయి ఉన్నారన్న మాటే. ప్రేమన్నాక ఏవో ఆవాంతరాలో, భయంకరమైన బాక్‍డ్రాపో ఉండాలి కదా..అది రెండో ప్రపంచ యుద్ధ సమయం సమీపంలో జరిగుతుంది! ఇక కథ అన్నాక ఎవరో ఒకరు చెప్పాలి..అందుగ్గాను మన హీరోయిన్ మరిది ఉంటాడు.

అప్పటి వ్యవస్థను, ఆచారాలనూ ధిక్కరించి తన మనసుపడ్డ మగాడితో ధైర్యంగా నడిచిపోయే ఒక అమ్మడి కథ ఇది! కొంతమంది అమ్మాయిలుంటారు.. వాళ్ళకేం కావాలో, అది ఎందుకు కావాలో కూడా తెల్సు! తెలీటంతో పాటు దాన్ని సాధించుకునే ధైర్యం, తెగింపు కూడా ఉంటాయి. తమపై తాము పూర్తిగా అవగాహనతో ఉంటారు కాబట్టి ప్రపంచం వారి గురించి ఏమనుకుంటుందో అన్న చింత ఉండదు. ఆత్మవిశ్వాసం, నిర్భీతి అనే రెక్కలతో స్వేచ్ఛా విహంగాల్లా విహరించే వీరిని చూసి లోకం కుళ్ళుకోవచ్చు, ఆడిపోసుకోవచ్చూ, శాపనార్థాలూ పెట్టవచ్చు, అన్నీ తాత్కాలికంగానే! ఆ ఆత్మవిశ్వాసంలో ఇమిడిన అందానికి మాత్రం కాస్త ఆలస్యంగానైనా ప్రపంచం ఎప్పుడూ జోహార్లే పలుకుతుంది.

జమీల్యా అచ్చు ఇలాంటి అమ్మాయే! ఈమె శారీరిక సౌందర్యవతి అని కథలో అనేక మార్లు చెప్తారు. కానీ ఈ పాత్ర నిజంగా మనతో నిలిచిపోయేది మాత్రం ఒక సంపూర్ణ స్త్రీ మూర్తిగా. ఇక ఇంతటి అమ్మాయి మనసు పారేసుకునే వాడు, నిజంగానే మరో గొప్ప వ్యక్తిత్వం అయ్యుండాలి. ఆ హీరోనే దనియార్.. ఒక యుద్ధవీరుడు. కోపంతో మొదలయ్యి, పంతాలూ వేళాకోలాల్లో ఒకరిపై ఒకరికి అభిమానం కలిగి, అది కాస్తా ప్రేమై ఇద్దరనీ నిలువనీయక అప్పటి సామాజిక పరిస్థుతులను కాళ్ళదన్ని మరీ సహజీవనం కొనసాగిస్తారు. పుస్తకంలో ఒక చోట ఉటకించబడట్టు దనియర్ ఆత్మిక బలం అటువంటిది.

ఇందులో విశేషంగా చెప్పుకోవల్సిన మరో పాత్ర, ఈ కథను తన జ్ఞాపకాల పొరల్లోనుండి జాగ్రత్తగా మన కళ్ళ ముందు నిలిపే పాత్ర: జమీల్య మరిది. కొత్త కోడలికి అత్తారింట మరిదికి మించిన స్నేహితుడుండంటారు. జమీల్యా విషయంలో కూడా ఇది నిజం. అన్నలంతా యుద్ధానికెళ్ళిపోయాక చిన్నతనంలోనే పెద్దరికం తెచ్చిపెట్టుకునే ప్రయత్నంలో ఎప్పుడూ వదిన చుట్టూనే తిరిగే ఈ కుర్రాడు, తన వదిన ప్రేమకథకి ప్రత్యక్ష సాక్షి.

మొన్న కవిత్వంపై టాగోర్ రాసిన ఒక వాక్యం:
“Like a tear or a smile a poem is but a picture of what is taking place within.” జమీల్య ప్రేమకావ్యం ఆమె మరిదిలో నిద్రాణమై ఉన్న చిత్రలేఖనం తట్టి లేపుతుంది. ప్రేమ కూడా కవిత్వమే ఏమో. నాకీ కథలో నచ్చినది అదే..

జమీల్య-దనియర్ ప్రణయం ఒక ఎత్తు అయితే అది ఒక మనిషిని కదిపి, కుదిపిన తీరు నన్ను కదిలించింది. పెంపరికం, social conditioning, చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ ఎంత ప్రభావం చూపుతున్నా మనలోని “మనిషి” ప్రేమారాధకడే అన్న నమ్మకం కలిగించింది.

Beauty of the book?! ఒడ్డున నుంచున్న వాళ్ళు వచ్చి పోయే అలల తుంపర్లతో ఆడుకోవచ్చు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇందులో భాషగానీ, భావం గానీ. ఇది తెలుగులోకి అనువదించబడ్డ పుస్తకం. ఆలోచనల్లో మునిగే సాహసముంటే, ఓ సముద్రమంతా చుట్టి రావచ్చు. ఈ కథ జమీల్య మరిది గీసిన ఒక చిత్రపఠం వర్ణనతో మొదలవుతుంది. చదవడం పూర్తయ్యాక ఎందుకో ఒకసారి పుస్తకం వంక చూస్తే వచ్చిన చిలిపి ఊహ.. యష్ రాజ్ పోస్టర్ బాయ్ లా ఈ పుస్తకం “come.. fall in love” అంటూ నన్నూరిస్తున్నట్టు ;)

- పూర్ణిమపుస్తకం వివరాలు:
పేరు: జమీల్య
రచయిత: చింగీజ్ ఐత్‍మాతొవ్
అనువాదం: ఉప్పల లక్ష్మణ రావు
వెల: రూ. 40/-
ప్రచురణ: హైదరబాద్ బుక్ ట్రస్ట్


........................

Tuesday, November 24, 2009

భగవత్ గీత చారిత్రక పరిణామం: దామోదర్ ధర్మానంద్ కొశాంబి...సాహిత్య అవలోకనం బ్లాగు సమీక్ష ...


భగవద్గీత చారిత్రిక పరిణామం పుస్తకాన్ని ప్రవీణ్ శర్మ గారు తన బ్లాగు "సాహిత్య అవలోకనం" లో సమీక్షించారు. మాబ్లాగు సందర్శకులకు సదా అందుబాటులో ఉండేలా ఆ సమీక్షను ఇక్కడ తిరిగి పొందుపరుస్తున్నాము. ఈ మెయిల్ ద్వారా స్వయంగా ఈ సమీక్ష గురించి మాకు తెలియజేసిన ప్రవీణ్ శర్మ గారికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఎవరైనా తమ బ్లాగుల్లో మా పుస్తకాలను సమీక్షించి నప్పుడు దయచేసి మాకు తెలుపవలసినదిగా కోరుతున్నాము.

భగవద్గీత చారిత్రిక పరిణామం

వేదాలు వ్రాస్తున్న కాలంలో హిందువులు ఇంద్రుడిని ప్రధాన దేవుడిగా పూజించారు.
సంస్కృత బాషలో ఇంద్ర అంటే రాజు అని అర్థం. ఇంద్రుడు ఆర్యులకి రాజు.
విష్ణువుకి నారాయణుడు అని ఇంకో పేరు ఉంది.

నారాయణ అనే పదం సంస్కృత పదం కాదు. అది సింధు లోయ నాగరికత కాలంలో వాడిన బాష పదం. నారాయణ అంటే నీటి మీద నివాసం ఉండేవాడు అని అర్థం. నారా అంటే నీరు. ఆయణ అంటే నివాసం. విష్ణువు నీటి మీద పాము మీద పడుకుంటున్నట్టు హిందూ పురాణాలలో కథలు ఉన్నాయి.

మెసోపొటేమియా (ఇరాక్) నాగరికతలో కూడా నీటి పైన ఇంటిలో నివసించే దేవుడి కథ ఉంది. అప్పట్లో ప్రజలకి వ్యవసాయమే ప్రాధాన జీవనాధారం. ప్రజలు ఎక్కువగా నదీ తీర ప్రాంతాలలో నివసించేవారు కనుక ప్రజలు నీటి పై నివసించే దేవుడి గురించి కథలు అల్లుకోవడం సహజం.

కృష్ణ అంటే నల్లని వాడు అని అర్థం. మహాభారతం, శ్రీమత్భాగవతం, భగవత్ గీత వ్రాయకముందు ద్రవిడులు (నల్లని వారు) మాత్రమే కృష్ణుడిని పూజించేవారు. వేదాలలో కృష్ణుడికీ, ఇంద్రుడికీ మధ్య యుద్ధాలు జరిగినట్టు కథలు ఉన్నాయి.

హిందూ మతం ఒకప్పుడు ఆర్యుల మతంగా ఉండేది. హిందూ మతాన్ని ద్రవిడులకి కూడా వర్తింపచెయ్యాలంటే ఇంద్రుడి ప్రాధాన్యం తగ్గించాలి. నల్లని దేవుడైన కృష్ణుడి ప్రాధాన్యం పెంచాలి.

అప్పట్లో ప్రజలలో ఆత్మ పరకాయ ప్రవేశం పై అనేక కథలు ఉండేవి. ఆత్మ పరకాయ ప్రవేశం కథలు ఆధారంగా దశావతారాల కథలు వ్రాయడం జరిగింది.

భగవత్ గీత ఆత్మవాదాన్ని ఎక్కువగా ప్రబోధిస్తుంది. ప్రజలకి మరణానంతర మోక్షం, పునర్జన్మ లాంటి వాటి పై విశ్వాసం కలిగించడానికే భగవత్ గీత వ్రాయడం జరిగిందని అర్థమవుతోంది.

ఈ వ్యాసాన్ని కొశాంబి గారు 1959లో ఇంక్వైరీ పత్రికలో వ్రాసారు. 1985లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీన్ని తెలుగులోకి అనువదించి పుస్తక రూపంలో ప్రచురించారు.

..................................

..

Monday, November 23, 2009

విమర్శ కాదు విజ్ఞానం ... దుప్పల రవికుమార్ ...


డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ “రాముని కృష్ణుని రహస్యాలు” పుస్తకాన్ని ఇటీవల దుప్పల రవికుమార్ గారు తన బ్లాగులో ( చదువు. వర్డ్ ప్రెస్.కాం) సమీక్షించారు.
http://chaduvu.wordpress.com/2009/11/09/ambedkar/#comments
మాబ్లాగు సందర్శకులకు సదా అందుబాటులో ఉంటుందని దానిని ఇక్కడ తిరిగి పొందు పరుస్తున్నాము.
రవికుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

“రాముని కృష్ణుని రహస్యాలు”


భారత రాజ్యాంగ నిర్మాతగా, రాజనీతి శాస్త్రజ్ఞుడిగా, న్యాయశాస్త్ర కోవిదుడిగా, దళిత వర్గాల ఆశాజ్యోతిగా మెరుగైన భారత సమాజం కోసం పరితపించిన నిజమైన దేశభక్తుడు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్. ఆయన ఆలోచనసరళితో కాస్త పరిచయం వున్న వారెవరైనా అతడొక గొప్ప చదువరనే సంగతి తెలుసుకుంటారు.

చాలా చిన్నచిన్న వివరాలు పొందుపరచడానికి, క్రాస్ రిఫరెన్సులకోసం విస్తృతంగా పురాణాలను, ఇతిహాసాలను, ఇతర గ్రంథాలను అధ్యయనం చేయడంద్వారా అంబేడ్కర్ తన అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకున్నారన్న కోపం కూడా అతడి సీరియస్ పాఠకులకు వస్తుంటుంది.

లోతైన విశ్లేషణ, పదునైన పదజాలంతో, ఉన్నతమైన భావాలతో అలరారే అంబేడ్కర్ సంపూర్ణ సాహిత్యాన్ని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రచురించాలని తొలిసారి భావించింది. వెలువడిన మొదటి మూడు సంపుటాలను ప్రజలు విశేషంగా ఆదరించారు.ఆయితే నాలుగో సంపుటి మాత్రం వివాదాస్పదమైంది.

హిందూ మతాన్ని విమర్శిస్తూ, దేవుళ్లను కించపరుస్తూ రాసిన వ్యాసాలన్నీ అందులో సంపుటీకరించారని శివసేన గగ్గోలు పెట్టింది. సెక్యులర్ భావాలు, ప్రజాస్వామిక దృక్పథమున్న ప్రతి భారతీయుడు చేయీచేయీ కలిపి దీన్ని ప్రతిఘటించారు. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, చేతనైతే ఆ వ్యాఖ్యలను సమర్ధంగా ఖండించాలి గాని, రచనలను, ప్రచురణలను నిషేధించకూడదని మేధావులు ప్రభుత్వానికి నచ్చజెప్పారు.

“రిడిల్స్ ఇన్ హిందూయిజమ్” అనే గ్రంథంలోని ఒక వ్యాసాన్ని “రాముని కృష్ణుని రహస్యాలు” పేరిట హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తెలుగులో ప్రచురించింది. ఆ చిన్ని పొత్తపు పరిచయమే ఈ వ్యాసం.

ఇరవై ఆరు పేజీల చిన్న వ్యాసంలో ఆదిలోనే రామాయణంలో రాముని పాత్ర చాలా నిస్సారమయిందనే వాదన ప్రతిపాదిస్తారు. ఇక అక్కడనుంచి వాల్మీకి రామాయణంలోని పద్యాలను ఉదాహరణలుగా చూపి వాదనను నిర్మిస్తారు. వ్యక్తిగా, రాజుగా రాముని శీలాన్ని (కారెక్టర్) అంచనా వేస్తారు. వాలిపట్ల, భార్యపట్ల రాముని వ్యవహార శైలి అతని వ్యక్తిత్వాన్ని (పర్సనాలిటీ) పట్టిస్తుందంటారు.

ఎలాంటి రచయిత రచించిన రచనలోనైనా సీతపట్ల రాముని ప్రవర్తనకంటే క్రూరమైన దానిని ఊహించలేమని అంబేడ్కర్ బాధపడతారు. ‘నీ అంత సౌందర్యవతి అయిన స్త్రీని అనుభవించకుండా రావణుడు విడిచిపెట్టి వుంటాడని నేను అనుకోవడం లేదు’ అని రాముడు అన్నాడంటే మనం నమ్మలేం.

విలపించి, ఆగ్రహించి, అగ్నిప్రవేశం పొంది పునీతురాలయి సీత వచ్చాకనే రాముడు అయోధ్యకు తీసుకొచ్చిన కథ మనకు తెలిసిందే. ఆ తరువాత జరిగిన కథే మానవీయ కోణం లేనిది. వాల్మీకితో సహా రామాయణ రచయితలందరూ హృదయ విదారకంగా వర్ణించినది. ఎన్నో విలువైన పద్యాలు, వివరాలను ఎవరికీ అందకుండా చేసిన (వైదిక భావజాల ప్రచారకులైన బ్రాహ్మణ) పురోహితులు సైతం విడిచిపెట్టలేకపోయారు.

అనుమానంతో గర్భవతి అయిన స్త్రీని ఒంటరిగా అడవిపాలు చేయడం – అదీ మోసంతో, కపట పన్నాగంతో. నిండు గర్భిణి సీతను దిక్కూమొక్కూలేని కీకారణ్యంలో విడిచిపెడుతూ లక్ష్మణుడు సీత కాళ్లపై పడ్డాడు. వెచ్చని కన్నీళ్లు బొటబొటా కారుతుండగా, ‘ఓ మచ్చలేని మహారాణీ, నేను చేస్తున్న పనికి నన్ను క్షమించు. నిన్ను తన ఇంట్లో పెట్టుకున్నందుకు తనను ప్రజలు నిందిస్తున్నందువల్ల నిన్ను ఇక్కడ వదిలి వేయమని మా అన్నగారి ఆజ్ఞ‘ అని అంటాడు. (వ్యక్తిత్వం, మూర్తిమత్వం లేని లక్ష్మణుడు ఎలా ఎదిగిందీ మరింత వివరంగా, వ్యంగ్యంగా రంగనాయకమ్మ తన “రామాయణ విషవృక్షం”లో రాశారు.)


రాజుగా రాముని విలాస జీవితాన్ని అంబేడ్కర్ ఉదాహరణలతో వెలుగులోకి తెస్తారు.

ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ క్షత్రియులు మద్యం, మాంసం, మగువ అంటే మక్కువ చూపించడం మరీ అంత విడ్డూరమైన విషయమేమీ కాదు. దీనికి రాముడికే మినహాయింపూ ఇవ్వక్కర్లేదు. ఇంతవరకూ నిదానంగా మాట్లాడిన అంబేడ్కర్ శంభుక వధ విషయంలో రాముడ్ని దూదేకిపారేస్తారు. దీనికి కారణం అంబేడ్కర్ అపార ప్రేమ, సానుభూతులు శూద్ర ప్రతినిధి శంబుకునిపై వుండడమే.

ఇక కృష్ణుని గురించి – మహాభారతంలో కృష్ణుడి కుటిల నీతిని అంబేడ్కర్ ఎండగడతారు. చెడిపోయే బేరం చేస్తే ‘కృష్ణ రాయబారం’ చేశాడని జనపథంలో వాడుక – బహుశా ప్రజలందరికీ కృష్ణుని తీరు తెలిసే వచ్చిందేమో.

కేవలం అంబేడ్కర్ చదువుకున్న పురాణ, ఇతిహాసాల జ్ఞానమే ఈ వ్యాసంలో గుప్పిస్తారు. దీనికి తన వ్యాఖ్యానం జోడించరు. అందుకు కారణం అంబేడ్కర్ ఇదివరకే స్పష్టంగా చెప్పినట్టు ప్రజలను విజ్ఞానవంతులను చేయడమే అతడి రచనోద్దేశం.

అయితే విజ్ఞులైన పాఠకులు ఈ ప్రభావశీల వ్యాసం చదివాక, డి. డి. కోశాంబిని కొద్దిగా అధ్యయనం చేస్తే వలయం పూర్తవుతుంది. అప్పటికే బౌద్ధమత బోధనలు ఉజ్వలంగా వెలుగొందుతున్నాయి. పూజాపునస్కారాలు కాదు సరికదా, విగ్రహారాధనే వద్దన్న బుద్ధుడిని సమర్ధంగా ఎదుర్కోవడానికే అప్పటి పురోహిత వర్గం రాముడికి అంత సీన్ ఇచ్చిందన్న సంగతి (ఆ మాటకొస్తే ఇప్పటికీ ఇస్తోందన్న సంగతి) మనకు బోధపడుతుంది.

రాళ్లూ పూలూ అనదగ్గ కామెంట్లు అన్నీ చేర్చి 45 పేజీలలో “రాముని కృష్ణుని రహస్యాలు” పుస్తకం 12 రూపాయలకే హెచ్ బి టి అందిస్తోంది.
వీలు చేసుకుని తప్పక చదవండి.

Saturday, November 21, 2009

భారతదేశంలో కులాలు - వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ... డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ... తెలుగు అనువాదం : భార్గవ ...


భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి ...
1916 మే 9వ తేదీన కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌ అమెరికాలో జరిగిన డాక్టర్‌ ఎ.ఎ.గోల్డెన్‌ వైజర్‌ స్మారక ఆంత్రోపాలజీ సెమినార్‌లో చేసిన ప్రసంగ పాఠం.


డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ అధ్యయనశీలతకు, శాస్త్రీయ దృక్పథానికి, తర్క పటిమకు ఈ చిన్న పుస్తకం ఒక ఉదాహరణ.

ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, సమాజంలో అట్టడుగున నలిగిపోయే దళితుల విముక్తి కొరకు తదనంతర కాలంలో తాను నిర్మంచిన దళిత చైతన్య, విముక్తి ఉద్యమాలకు సైద్ధాంతిక భూమికను ఆయన చాలా మ,ధుగానే తయారుచేసుకున్నారు అనడానికి ఈ ప్రసంగపాఠం ఒక నిదర్శనం.

కులం పుట్టుక అన్నది ఇప్పటికీ పరిష్కారం దొరకని ఒక వివాదాస్పద అంశంగానే ఉన్నప్పటికీ, 1916 నాటి ఈ ప్రసంగం కులం పుట్టుక - పరిణామం విషయంలో నేటికీ కొత్త ఆలోచనలను రేకెత్తించగల శక్తిని కలిగి వున్నది.

అనువాదకులు భార్గవ ప్రజాభ్యుదయ సంస్థ (కర్నూలు) ప్రధాన కార్యదర్శి. మార్క్సిస్టు రాజకీయ కార్యకర్తగా పనిచేసే వీరు సామాజిక వ్యవస్థ,ఉద్యమాలు, రాజకీయ వ్యూహాలకు మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడంపై ఆసక్తి కలిగివున్నారు.


భారతదేశంలో కులాలు వాటి పుట్టుక, పనితీరు, అభివృది
- బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం : భార్గవ


27 పేజీలు, వెల: రూ.8

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Friday, November 20, 2009

ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... తెలుగు: యాజ్ఞి ...


ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ...

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటీష్‌ పాలనలో 'చట్టం ముందు అందరూ సమానమే' అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది.

బ్రిటీష్‌ వాళ్లు ఈ దేశాన్ని అక్రమించుకోవటానికి, అధికారం నిలబెట్టుకొని పరిపాలించడానికి అంటరానివాళ్ల సహాయం తీసుకొని ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ సర్వీసు, విద్య, సాంఘిక సంస్కరణల విషయంలో వాళ్లు అమలు చేసిన విధానాలు, అగ్రవర్ణాలపట్ల చూపిన పక్షపాత వైఖరిని కూడా ఇది తేటతెల్లం చేస్తుంది.

ఆధునిక విద్య, ఉపాథి రంగాల్లో ప్రతిభ, కులం వలసపాలకుల చేతిలో అవసరానికి తగినట్టు రంగులు మారుస్తూ కింది కులాలకు అవకాశాలు లేకుండా చేశాయి. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్‌ సూటిగా ప్రశ్నిస్తారు.

అంటరానితనం దేశమంతా అమల్లో వున్నా, ఆధునికులమూ నాగరికులమూ అని చాటుకునే బ్రిటీషు పాలకులు ఈ సమస్యపై ఒక్క సాంఘిక చట్టమూ తీసుకొని రాలేదు. పైకి దళితులకు అనుకూలంగా మాట్లాడినట్టు కనిపించినా, సారాంశంలో కులతత్వం ఈ దేశంలో మరింతగా వేళ్లూనుకునేట్టు చేసిన బ్రిటీష్‌ కుటిల రాజనీతిని ఆయన బట్టబయలు చేశారు.

అనువాదకులు యాజ్ఞి ఆ లంపూరు (మహబూబ్‌నగర్‌)కు చెందినవారు. ఆయనకు అధికారం-విస్మృతి ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో 'జానపద కథనాల'కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.


ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు: యాజ్ఞి


60 పేజీలు, వెల: రూ.20

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)


సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

...................................

Wednesday, November 18, 2009

రాష్ట్రాలు - మైనారిటీలు ... డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ...తెలుగు అనువాదం: హారతి వాగీశన్‌ ...


రాష్ట్రాలు - మైనారిటీలు
స్వతంత్ర భారత రాజ్యాంగంలో వారి హక్కులేమిటి? వాటిని సాధించుకోవడం ఎట్లా?
... అఖిల భారత షెడ్యూల్డ్‌ కులాల సమాఖ్య తరఫున భారత రాజ్యాంగ నిర్ణయసభకు షెడ్యూల్డు కులాల రక్షణలకు సంబంధించి
సమర్పించిన నివేదిక (ప్రచురణ 1947)...


ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రవక్త భారతరత్న డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌. భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్థిక
నమూనా ఎలా ఉండాలని ఆయన భావించారో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన, భారత సంయుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్‌ ఆశించారు. ఆ సమాఖ్యలో సామాజిక ఆర్థిక అసమానతలుండకూడదని ఆయన ఆకాంక్ష.

ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది. అంతరాల దొంతరల వర్గ కుల
సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలకు అక్షరరూపం ఈ పుస్తకం.

పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, దారుణమైన సామాజిక వివక్షకు గురై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న షెడ్యూల్డు
కులాలవారికి ప్రత్యేక హక్కులుండాలన్నది అంబేడ్కర్‌ వాదం. అ ల్పసంఖ్యాకులు (మైనారిటీలు) అంటే హిందూ మతంలో లేనివారు
అన్న తప్పుడు అభిప్రాయానికి అంబేడ్కర్‌ గట్టి సమాధానం యిస్తారు. షెడ్యూల్డ్‌ కులాలు మైనార్టీలకంటే దుర్భర స్థితిలో ఉన్నారని
నిరూపించారు.

రాజ్యాధార సామ్యవాదం (స్టేట్‌ సోషలిజం) అంటే ప్రభుత్వం చేతిలో వ్యవసాయం పరిశ్రమలు ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక
సమానత్వం సాధించవచ్చన్న అభిప్రాయాన్ని, వాదనా పటిమను ఇందులో చూడవచ్చు.

అనువాదకులు హారతీ వాగీశన్‌ ఖిల్లా ఘన్‌పూర్‌ (మహబూబ్‌నగర్‌)కు చెందిన రాజనీతి శాస్త్ర విద్యార్థి, యూజీసీ ఢిల్లీ వారి రీసెర్చ్‌
ఫెలోషిప్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ''పంచాయితీ రాజ్‌ వ్యవస్థలో నాయకత్వం'' విషయంలో పరిశోధన పూర్తి చేసే దశలో
వున్నారు.

రాష్ట్రాలు - మైనారిటీలు
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం: హారతి వాగీశన్‌
74 పేజీలు, వెల:రూ.25


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Monday, November 16, 2009

బషీర్‌ ఫకీర్‌ సూఫీ ఫన్‌కార్‌ (కళాకారుడు). ...సాక్షి సమీక్ష ...బషీర్‌ కథలు

అతను వేరు, అతని సృజన వేరు కాదు.
అతని ఆత్మ, అతని అక్షరం రెండూ ఒక్కటే.
రచయితగా కావచ్చు, అతని రచనలు కావచ్చు, అతనే కావచ్చు- మొదటి నుంచి చివరి దాకా క్రమంగా అర్థం కావచ్చు, కాకపోనూ వచ్చు.
ఎంత కొంచెం జ్ఞానమైనా, అదీ అత్తరబుత్తర గున్నా, జ్ఞానం జ్ఞానమే.
జ్ఞానమే జీవితం.
అందుకే ఆ మహాసముద్రుడి నుంచి ఓ నాలుగు జ్ఞానం చుక్కల్ని నెత్తిన చల్లుకుంటాను!

పద్మశ్రీ వైకం మహమ్మద్‌ బషీర్‌కు కథకుడిగా భారతీయ సాహిత్యంలో పెద్దపేరు. అతను పుట్టిన ఊరు 'వైకం'. అదే అతని ఇంటిపేరయింది. నివసించిన ఊరు 'బేపూర్‌' పేరిట మేపూర్‌ సుల్తాన్‌ బిరుదయింది. అతని కథలు చదువుతుంటే మామూలు దిన చర్య రాసుకున్నట్లే వుంటుంది. ఎవరైనా కథలు రాయగలరు అనిపిస్తుంది. ఇల్లు కట్టుకుంటే కథ షల్లుకున్నాడు. బిడ్డ పుడితే కథను సృష్టించాడు. గాంధీజీని ముట్టుకోవడం కథ అయింది. మానసిక అనారోగ్యంతో దవాఖానలో చేరితే కథా రచన ఉపశమనం ఇచ్చింది.

కళాత్మక కత తెలిసిన జీవిత కథకుడాయన. ఏ వస్తువును తీసుకున్నా అద్భుత సాహితీ రూపాన్ని తీసుకుంది. విభిన్న కథలను రాసిన కథా ప్రేమికుడు. స్వతంత్ర పోనరాట కథలు, జైలు కథలు, తాత్విక కథలు, ప్రేమ కథలు ఇలా ఏ అంశం గురించి రాసినా మనం చదవకుండా, ప్రభావితం కాకుండా వుండలేం.

మన తెలుగు కథలకు భిన్నంగా వుండే ఏనుగులను దొంగిలించే వాళ్ల కథలు ఎంతో ఆసక్తికరంగా వున్నాయి. అంతేకాదు ఎంతో జటిలమైన అంతర్మథనాలూ ఎంతో సులువుగా అర్థమైపోతాయి. చాలా కథల్లో పునరావృతమయ్యే అతని కొన్ని పాత్రలతో, ఆ వాతావరణంతో కలిసిపోతాం. ప్రతి కథలో బషీరే నేరుగా పాఠకులకు కథ చెప్తుంటాడు. విస్మయాన్ని కలిగించే విషయాలున్నా, చదువుతూ పోతుంటే చాలా మామూలుగా జరిగిపోయినట్లు అనిపిస్తాయి. మనింట్లోనో, మనకు పరిచయమున్న బజార్లోనో, మనూర్లోనో జరిగినట్లుంటాయి. సంఘటనలన్నీ, ఎంతో విస్తృతమైన తన జీవితానుభవాలను, సామాజిక వాస్తవికతలను ఆవిష్కరించటమే ప్రధానం కానీ, ఏ శిల్పంలో చెప్పాలనేది అతనికి ప్రధానం కాదు. ఆ వస్తువే దాని శిల్పాన్ని మలచుకుంటుంది. శ్రద్ధ చూపించినట్లు అన్పించకపోయినా అతనో గొప్ప ఫన్‌కార్‌ (కళాకారుడు).

చాలా వరకు కథలన్నీ ఫస్ట్‌ పర్సన్‌లో ఆత్మకథనాత్మక ధోరణిలో సాగుతాయి. బషీర్‌ పేరుతోనే నేరేషన్‌ సాగుతుంటుంది. ఆతని వ్యక్తీకరణలు ఎంత అద్భుతంగా వుంటాయో!

ఉదాహరణకు ఓ రెండ చూడండి. ''జమీలా... కన్నీళ్లన్నీ కూజాలోకి పడేలా ఏడువు. వృథా కాకుండా నేను స్నానం చేస్తాను- ప్రపంచాన్ని మార్చేయాలి. జరిత్ర తిరగరాయాలి. లోకాన్ని నెత్తుట్లో స్నానం చేయించి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఆత్మగౌరవం దెబ్బతినకుండా ప్రేమించాలి. యవ్వనంలో ఆలోచనలకు సలాం- మతాలకతీతంగా పిల్లల పేర్లు - చిన్నకథ, నాటకం, వచన కవిత ఆకాశం, ఆలిచిప్ప, చాక్లెట్‌, రొయ్యకన్ను, నక్షత్రం, తుఫాను అని పెట్టుకుందాం.

అతన్ని చదవటం షురూ చేస్తే ఎదురుగా వచ్చి కూర్చుని నింపాదిగా కథలు చెప్తున్నాడనుకుంటాం. చదవటం పూర్తయ్యాక మనకు మనం అర్థమైపోతాం. కథలు సుదీర్ఘంగా నడుస్తున్నట్లే వుంటాయి. కానీ నవలలా సాగదీయని కథా కళాత్మకతా రహస్యాలు అతనికి తెలుసు.

తెలుగు కథల్లో ముస్లిం జీవితం పది, పదిహేను సంవత్సరాల నుంచే వస్తున్నది. కానీ బషీర్‌ యాభై సంవత్సరాల క్రితమే రాశాడు.

''ఫాతిమా మేక'', ''మి గ్రాండాడ్‌'' లాంటి పెద్ద కథలు లేదా నవలికలు సాహితీ ప్రేమికులు తప్పక చదివి తీరాల్సినవి.
అన్ని కథలూ చదివాక బషీర్‌ ఆత్మకథను చదివినట్లు అనిపిస్తుంది.
అతని కుటుంబం మన కుటుంబం అయిపోయినట్టు అనిపిస్తుంది.

ఆలస్యంగానైనా ''బషీర్‌ కథలు'' హెచ్‌బిటి వాళ్లు తెలుగు వారికి పరిచయం చేయటం ఎంతో అభినందనీయం. (ఈ పుస్తకం అన్ని ప్రధాన బుక్‌ షాపుల్లోనూ దొరుకుతోంది). అతని మిగిలిన సాహిత్యాన్ని కూడా ఇంకో పుస్తకంగా తీసుకురావాలని విన్నపం.
- బా రహమతుల్లా
సాక్షి దినపత్రిక 16 నవంబర్‌ 2009.

……………………………….

ఇందులోని కథలు:

1. ఒక ప్రేమ లేఖ 2. ఏనుగుల దొంగ - బంగారు శిలువ 3. పూవన్‌ బనానా 4. బంగారు ఉంగరం 5. దుడ్డులాఠీ పణిక్కర్‌ 6. అమ్మ 7. మోసకారి కూతురు 8. తాయెత్తు 9. విశ్వవిఖ్యాత ముక్కు 10. ఏకాంత తీరం 11. గోడలు 12. ఒకనాటి ప్రేమకథ 13. పుట్టిన రోజు 14. టైగర్‌ 15. ఒక మనిషి 16. అవని తల్లికి అసలైన వారసులు 17. అనల్‌ హఖ్‌ 18. శబ్దాలు 19. ఏనుగు పిలక 20. పాత్తుమ్మా మేక కథ నేపథ్యం 21. పాత్తుమ్మా మేక


ఈ కథలను తెలుగులోకి అనువదించినవారు:

సి.అనంత్‌, జి.షేక్‌బుదన్‌, విమల, ప్రభాకర్‌ మందార, సి.వనజ, హెచ్చార్కె, పి.సత్యవతి, ఎస్‌.జయ, భార్గవ, కాత్యాయని, ఆకెళ్ల శివప్రసాద్‌, సంధ్య, కలేకూరి ప్రసాద్‌, పట్నం ఉమాదేవి.

...............

బషీర్‌ కథలు
-వైక్కం మొహమ్మద్‌ బషీర్‌

ముఖచిత్రం: శంకర్‌
మొదటి ముద్రణ: ఆగస్ట్‌ 2009


289 పేజీలు, వెల: రూ.100
.....................

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067

ఫోన్‌: 040 2352 1849
EMail ID : hyderabadbooktrust@gmail.com

Sunday, November 15, 2009

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు ... ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌ ... తెలుగు అనువాదం: అ ల్లం నారాయణ ...


భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు
ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం


మాంఛెస్టర్‌ మెట్రోపాలిటన్‌ యునివర్సిటీ, లండన్‌లో ముంబాయి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌ చేసిన డాక్టర్‌ అంబేడ్కర్‌ స్మారక ప్రసంగపాఠం

భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తున్న ప్రణాళిక చేస్తున్న ప్రణాళిక సంఘం సభ్యులుగా వున్న డాక్టర్‌ బాల్‌చంద్ర ముంగ్రేకర్‌ దేశంలో అగ్రగణ్యులైన వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్తలలో ఒకరు. ప్రణాళిక సంఘం బాధ్యతకలు చేపట్టడానికన్న ముందు ఆయన ముఐబాయి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. అ లాగే, ప్రతిభావంతులైన ఒక సామాజిక తత్వవేత్త. సంస్కర్త. ఆయన ప్రతిభావ్యృత్పత్తులు గల అనేక అకడమిక్‌ పదవులు అధిష్టించారు. ముఐబాయి యూనివర్శిటీ ''అడ్వాన్స్‌డ్‌ స్టడీ సెంటర్‌'' చైర్మన్‌గా, భారత సాంస్కృతిక సంబంధాల మండలి సభ్యుడుగా, ''డాక్టర్‌ అంబేడ్కర్‌ సామాజిక, ఆర్థిక పరిణామాల సంస్థ'' వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇతర ప్రతిష్టాత్మక పనులను ఆయన నిర్వహించారు. వ్యవసాయం, అభివృద్ధి ఆర్థిక శాస్త్రాలలో ప్రావీణ్యతకు గుర్తింపుగా 1999లో భారత ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ ధరవరల మండలి సభ్యునిగా నియమించింది. జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో పలు ప్రభుత్వ కమిటీలలో కూడా ఆయన సేవలు అందించారు.

డాక్టర్‌ ముంగేకర్‌ను అంబేడ్కర్‌ ఆలోచనావిధానం వెలుగులో సాగే ఉద్యమాలలో అగ్రగణ్యుడైన నిపుణుడుగా భావిస్తారు.

ఆర్థిక సంస్కరణలు పేదలపై, ముఖ్యంగా దళితులపై కలుగజేస్తున్న దుష్పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.

భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు - ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం
-ప్రొఫెసర్‌ బాల్‌చంద్ర ముంగేకర్‌
తెలుగు అనువాదం: అల్లం నారాయణ


పేజీలు 72, వెల: రూ.20

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీనగర్‌, గుడిమల్కాపూర్‌,
మెహదీపట్నం, హైదరాబాద్‌ - 500067 (ఫోన్‌ 040-23521849)

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

Saturday, November 14, 2009

రాముని కృష్ణుని రహస్యాలు... డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ రచన ...తెలుగు అనువాదం: డాక్టర్‌ బి.విజయభారతి, బొజ్జా తారకం ...రాముని కృష్ణుని రహస్యాలు

అంబేడ్కర్‌ మరణానంతరం ఆయన సంపూర్ణ రచనలను ప్రచురించే బాధ్యతను మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా మూడు
సంపుటాలు వెలువడ్డాయి. ''రిడిల్స్‌ ఇన్‌ హిందూయిజం'' నాలుగవ సంపుటం. అందరూ అనుకున్నట్టే ఈ పుస్తకం బయటకు రాగానే గొప్ప సంచలనం సృష్టిస్తూ పెద్ద వివాదాన్ని రేపింది.

హిందూ మతం పై విమర్శలున్నాయని, అసభ్యకరమైన రాతలున్నాయని, ఈ పుస్తకం లోని ''ది రిడిల్‌ ఆఫ్‌ రామా అండ్‌ కృష్ణా'' లో తమ దేవుళ్లను కించపరిచే రాతలున్నాయని, దీన్ని సహించేది లేదని, వెంటనే ఆ పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలని, అందులోని కొన్ని భాగాలను తొలగించాలని, మరాఠా మహా సంఘం వారు, శివసేన వారు పెద్ద ఎత్తున ఆందోళన లేవదీశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకం అమ్మవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పుస్తకం కోసం ఎదురు చూస్తున్న మేధావులు,

దళితులు, ప్రజాస్వామిక శక్తులు ఈ సంఘటనతో కలవరపడ్డాయి. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, శక్తి వుంటే వాటిని ఖండించాలి గానీ నిషేధించాలనే హక్కు ఎవరికీ లేదని, తన అభిప్రాయాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ప్రతి రచయితకూ ఉన్నదని, దానిని ఇతరులు గౌరవించాలని, అంబేడ్కర్‌ అభిప్రాయాలను తొలగించాల్సిన అవసరం లేదని దేశంలోని మేధావులు అభిప్రాయపడ్డారు.

డా.అంబేడ్కర్‌ రచనలు ప్రచురించే బాధ్యత మాత్రమే ప్రభుత్వం స్వీకిరించింది కానీ దానిలో మార్పులు, మినహాయింపులు చేసే హక్కు ఎవరికీ లేదని ''రిడిల్స్‌ ఇన్‌ హిందూయిజం'' పుస్తకాన్ని యధాతథంగా అమ్మకానికి విడుదల చేయాలని దళితులు, లక్షలాది ప్రజలు, అభ్యుదయ వాదులు, ముంబాయి, నాగపూర్‌ పట్టణాల్లో గొప్ప ప్రదర్శనలు జరిపారు.

ఒక రచయితకున్న భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి లక్షలాది ప్రజలు ఆందోళన చేయటం అనేది చరిత్రలో ఇదే ప్రథమం. అయితే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకోక ముందే ప్రభుత్వం రెండు వర్గాలకు రాజీ కుదురుస్తూ ''అంబేడ్కర్‌ భావాలతో ప్రభుత్వం అంగీకరించడం లేదు'' అనే వాక్యాన్ని చేర్చి పుస్తకాన్ని యధాతథంగా విడుదల చేసింది. అదే ఈ పుస్తకం.

దీని అనువాదకులు డా. విజయభారతి, బొజ్జా తారకం గార్లు.
విజయనారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ఫూలే, అంబేడ్కర్‌ రచనలు ప్రముఖమైనవి.
బొజ్జా తారకం గారు ప్రముఖ న్యాయవాది. పౌరహక్కులు, దళితుల సమస్యలపై తోడ్పడుతున్న వ్యక్తి. ''పోలీసులు అరెస్టు చేస్తే '' అన్న వీరి రచన తెలుగునాట ప్రత్యేకించి పౌరహక్కుల రంగంలో విశేష ప్రాచుర్యం పొందింది.
రాముని కృష్ణుని రహస్యాలు
రచన: డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌
తెలుగు అనువాదం: డా.బి.విజయభారతి, బొజ్జా తారకం


ప్రథమ ముద్రణ: 1988
పునర్ముద్రణ: 1992, 1994, 1996, 1998, 2000, 2003, 2007

48 పేజీలు, వెల : రూ.20/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067 ఫోన్‌: 040 2352 1849

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌,
3-4-142/6, ఫస్ట్‌ ఫ్లోర్‌, బర్కత్‌పుర,
హైదరాబాద్‌ -500027 (ఫోన్‌ 040-23449192)

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

.....................................

Monday, November 2, 2009

ఆదివాసీల ఆత్మబంధువు సి కే జాను ..........ఆదివాసీలు అమాయకులు . నిరక్షరాస్యులు . రక్తాన్ని చెమటగా మార్చి సేకరించిన వస్తువులను మధ్య దళారీలు తరలించుకు పోతుంటే కళ్ళప్పగించి చూసే నిస్సహాయులు . పుట్టి పెరిగిన చోట కనీసం ఆరు గజాల స్థలం సంపాదించు కోలేని నిరుపేదలు . ఆ అభాగ్యుల దుర్భర స్థితిగతులను చూసి తల్లడిల్లిన జాను ... వారి పక్షాన నిలిచింది . అన్యాయాలకు ఎదురొడ్డి ... ఆదివాసీల హక్కుల సాధనకు , వారిని సంక్షేమ పథాన నడిపించేందుకు కంకణ బద్దురాలైంది .

ఆదివాసీల తరఫున కేరళలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన జానూది నిరుపేద గిరిజన కుటుంబం . ఆరేళ్ల వయసులో పాకీ పని చేసింది . పదమూదేల్లకు రోజు కూలిగా రెక్కలు ముక్కలు చేసుకుంది . ఆ సమయంలో కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితురాలై ..... ....

ఈనాడు 02 10 2009 ఈనాడు వసుంధరలో "ఆదివాసీల ఆత్మబంధువు " పేరిట ప్రచురించబడ్డ కథనాన్ని పూర్తిగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి .

జాను గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మేం ప్రచురించిన "అడవితల్లి సి .కే జాను" ను చదవండి .

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌