'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి'
("కొలిమి రవ్వలు - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం)
ఆ సంఘటన 2003 లోనో, 2004 లోనో జరిగింది. దావణగేరె జిల్లాలో ఉన్న మలెబెన్నూర్ అనే చిన్న పట్టణంలో కొందరు లింగాయత్ యువకులు మైనారిటీ మతానికి చెందిన ఇద్దరు స్త్రీలపై 'జై రామ్' అని నినాదాలు చేస్తూ అత్యాచారం జరిపారు. దానిపై పెద్ద గొడవే జరిగింది. ఘర్షణలు, దోపిడీలు కూడా జరిగాయి. మలెబెన్నూరు మా అమ్మ తరఫు బంధువుల ఊరికి దగ్గర ఉన్న పట్టణం కావడంతో ఈ సంఘటన నన్ను మరింత కలవరపరిచింది.
మలెబెన్నూరులో కొన్ని తరాలుగా హిందువులు, ముస్లింలు ఎంతో సామరస్యంగా జీవిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికే దావణగేరెలోని ఒక లింగాయత మఠంలో ప్రసంగించమని నాకు ఆహ్వానం వచ్చింది. అంతకుముందు వరకు నేను లింగాయత మఠాలకు వెళ్లేదాన్ని కాను గానీ, ఆ రోజున వాళ్లకు కొన్ని విషయాలు చెప్పాలనిపించి వెళ్లాను. నా ప్రసంగంలో బసవణ్ణ వచనం ఒకటి ఉటంకించాను.
'సంపన్నులు శివుడికి ఆలయం నిర్మిస్తారు
పేదవాడిని; నేనేం చెయ్యగలను?
నా కాళ్లే స్తంభాలు
నా శరీరమే ఆలయం
నా శిరస్సే స్వర్ణ గోపుర శిఖరం
విను, నదీ సంగమ దేవా
నిశ్చలమైనవి కూలి పోతాయి; చలన శీలమైనవి నిలబడతాయి.'
ఆ తర్వాత వారిని అడిగాను ''మీ లింగాయత మతాన్ని స్థాపించిన బసవణ్ణ ఆలయ నిర్మాణాన్ని, విగ్రహారాధనను వ్యతిరేకించాడు కదా! మరి మీరెందుకు ఒక కాల్పనిక దేవుడికి గుడి కట్టాలనుకునే వాళ్లతో స్నేహం చేస్తున్నారు?'' అని. అంతే, వెంటనే సభ భగ్గుమంది. నన్ను ప్రసంగం పూర్తిచెయ్యనివ్వలేదు. స్థానిక లింగాయతులు ఎంత అలజడి సృష్టించారంటే పోలీసులు నాకు భద్రత కల్పించాల్సి వచ్చింది.
నా అదృష్టం బాగుండి డా|| ఎం.ఎం. కల్బుర్గి కూడా ఆ రోజు దావణగేరెలోనే ఉన్నారు. పైగా నేనున్న హోటల్‌లోనే ఉన్నారు. మఠంలో జరిగిన విషయమంతా తెలిసి ఆయన నా కోసం కబురు పంపారు. నేను ఆయన్ని కలిసింది ఆ ఒక్కసారే. ఆయన చాలా పెద్దమనిషి. మంచి పండితుడు కూడా. ఎన్నో శాసనాలను, వచనాలనూ ఉల్లేఖిస్తూ, లింగాయతులు ఎలా హిందువులు కారో ఆయన నాకు వివరంగా చెప్పారు. 'మీరు చెప్పిందంతా నిజమే. మీ ఆలోచనలను చెప్పడానికి ఎప్పుడూ భయపడవద్దు' అని నన్ను ప్రోత్సహించారు కూడా.
కల్బుర్గి దారుణ హత్యకు కారణాలు ఇంకా తెలియాల్సే వుంది. అయితే ఆయన మరణం పట్ల మితవాదుల ఆనందం చూస్తుంటే, మెజారిటీ ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా మాట్లాడ్డం ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.
మా పొరుగువాళ్లతో పోలిస్తే భిన్న రకాల ఆలోచనల పట్ల మా కన్నడిగులు చాలా ఉదారంగా, సహనంగా ఉంటారని చెప్పుకోవడం మాకిష్టం. కానీ దురదృష్టవశాత్తు, గత తొమ్మిది శతాబ్దాలలో, పరిస్థితులలో పెద్దగా మార్పురాలేదు. ఈ విషయం కల్బుర్గి మరణానంతరం ఆదివారం నాడు జరిగిన సమావేశంలో ఒక అట్టమీద రాసిన మాటలద్వారా నాకు కొట్టొచ్చినట్టు అర్థమైంది. అందులో ఇలా ఉంది:
'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి'
పన్నెండవ శతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైక జీవనానికి మించింది లేదని నమ్మి కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేసాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, 'తక్కువ కులస్థుల'తో మమేకమై జీవించాడు. ఒక 'వచనం'లో ఆయన, తను మదర చెన్నయ్య అనే సేవకుడికీ, కక్కయ్య వద్ద చర్మకార వృత్తి చేసే పనిపిల్లకు పుట్టిన వాడినని చెప్పుకునేంతగా సాహసం కూడా చేశాడు.
బసవణ్ణ, మిగతా వచనకారులు అందరూ కలిసి అన్ని కులాలు, వర్గాలవారిని ఆకర్షించగల ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించగలిగారు. 'లింగాయత ధర్మ'గా ప్రసిద్ధి చెందిన వారి సరికొత్త సమూహంలో చేరిన వాళ్లు గతంలోని తమ కుల అస్తిత్వాలను వదిలిపెట్టి, అందరినీ సమానులుగా భావించడం ప్రారంభించారు. అయితే బసవణ్ణకు అసలు పరీక్ష వివాహం రూపంలో ఎదురైంది.
బసవణ్ణ గట్టి మద్దతుదార్లలో హరలయ్య అనే చెప్పులు కుట్టేవాడు, మధువరస అనే సంపన్న బ్రాహ్మణుడు ఉండేవారు. వీళ్లిద్దరూ తాము బసవణ్ణ సమసమాజాన్ని మనసా, కర్మణా నమ్ముతామని నిరూపించదలచుకుని హరలయ్య కుమారుడు శీలవంతుడికి, మధువరస కుమార్తె లావణ్యకు వివాహం నిశ్చయించారు. సహజంగానే బసవణ్ణ ఈ వివాహానికి సమ్మతించి నూతన వధూవరులను ఆశీర్వదించాడు.
అయితే ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక అస్పృశ్య యువకుడికీ మధ్య వివాహాన్ని అక్కడి పురోహిత వర్గం సహించలేకపోయింది. వారు దాన్ని వ్యతిరేకిస్తూ రాజు బిజ్జలుడికి ఫిర్యాదు చేసారు. బిజ్జలుడు స్వయంగా మంగలి కులానికి చెందిన వాడైనప్పటికీ ఉన్నత కులాల వారి ఒత్తిడికి తట్టుకోలేక వారిని చాలా క్రూరంగా శిక్షించాడు. వరుడైన శీలవంతుడి కళ్లు ఊడబెరకమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత అతన్ని, అతని తండ్రి హరలయ్యను, మధువరసను ఏనుగుల కాళ్లకు కట్టేసి, ప్రాణాలు పోయేవరకూ వీధుల్లో ఈడ్చుకెళ్లమన్నాడు.
అంతటితో ఆగక, బిజ్జలుడి సైన్యం మొత్తం అందరు లింగాయతుల మీద విరుచుకుపడింది. వేలాదిమందిని చంపేయడంతో, మిగిలిన వాళ్లు తలో దిక్కూ పారిపోయారు. వాళ్లు స్థాపించదలచిన కుల రహిత, వర్గ రహిత సమాజానికి మిగిలిన సాక్ష్యమల్లా వాళ్లు రచించిన వచనాలు మాత్రమే. వాటిని రక్షించడం కోసం లింగాయతులు వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని కొన్ని చొప్పున భద్రపరిచారు. అవన్నీ ఒక చోటికి సేకరించబడింది 20వ శతాబ్దిలోనే. 900 ఏళ్ల క్రితం రాసిన లక్షలాది వచనాల్లో ఇప్పుడు ఇరవై వేలు మాత్రమే లభిస్తున్నాయి. ఇక బసవణ్ణ విషయానికి వస్తే ఈ సంఘటనకు అతను విచలితుడై నిస్పృహతో కల్యాళికి తరలిపోయాడు.
ఈ రోజున లింగాయతులు తమ మతం ఎటువంటి ఆదర్శప్రాయమైన సిద్ధాంతాల పునాదులపై ఏర్పడిందో పూర్తిగా మరచిపోయారు. వాళ్లు కూడా మిగతా వారిలాగా ఆలయదర్శనాలు చేసుకుంటూ, విగ్రహారాధకులుగా మారిపోయారు. అంతకంటే దారుణంగా బసవణ్ణ ఏ పురోహిత వర్గాన్నయితే వ్యతిరేకించాడో ఆ వర్గానికే సైద్ధాంతిక బానిసలుగా మారిపోయారు.
'వచన' సాహిత్యోద్యమాన్నీ, కన్నడ భాష సాంస్కృతిక చరిత్రనూ అధ్యయనం చేసిన కల్బుర్గి వంటి పండితుడు వాళ్లకు 'ఇది మీ మతం కాదు' అని చెప్పడానికి ప్రయత్నిస్తే, అతన్ని మతద్రోహిగా ముద్రవేసి, అసంఖ్యాకంగా కేసులు పెట్టి వేధించారు. చివరకు ఆయన హత్యకు గురయ్యాక, 'హైందవమతాన్ని వెక్కిరిస్తే ఇలాగే కుక్క చావు ఛస్తావు' అని కేరింతలు కొట్టారు. వాళ్లు మరిచిపోతున్నదేమిటంటే, కల్బుర్గిలాగే బసవణ్ణ కూడా అన్ని వందల సంవత్సరాల క్రితం తన అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పివుండకపోతే, అసలు లింగాయతులే ఉండేవారు కారని.
కల్బుర్గి మరణం వల్ల ఎవరికి ఎలాంటి భౌతిక ప్రయోజనం ఉంటుందో తెలీదు కానీ బసవణ్ణ, కల్బుర్గి వంటి సంస్కర్తల స్వరాలను పాశవికంగా, శాశ్వతంగా నొక్కేసాక మితవాద ఫాసిస్టు శక్తులు సైద్ధాంతికంగా చాలా లాభపడతారనేది స్పష్టం.
అయితే ఆలోచనలకు ఎప్పటికీ మరణం ఉండదు.
బెంగుళూరు మిర్రర్, 31 ఆగస్టు 2015
అనువాదం : మృణాళిని
....................................................................................................
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు
ఇంగ్లీష్ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి, కె.సజయ, ప్రభాకర్ మందార, పి.సత్యవతి, కాత్యాయని, ఉణుదుర్తి సుధాకర్, కె. సురేష్, కె.ఆదిత్య, సుధాకిరణ్, కల్యాణి ఎస్.జె., బి. కృష్ణకుమారి, కీర్తి చెరుకూరి, కె. సుధ, మృణాళిని, రాహుల్ మాగంటి, కె. అనురాధ, శ్యామసుందరి, జి. లక్ష్మీ నరసయ్య, ఎన్. శ్రీనివాసరావు, వినోదిని, ఎం.విమల, ఎ. సునీత, కొండవీటి సత్యవతి, బి. విజయభారతి, రమాసుందరి బత్తుల, ఎ.ఎమ్. యజ్దానీ (డానీ), ఎన్. వేణుగోపాల్, శోభాదేవి, కె. లలిత, ఆలూరి విజయలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి
230 పేజీలు , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment