Showing posts with label పుస్తక సమీక్షలు. Show all posts
Showing posts with label పుస్తక సమీక్షలు. Show all posts

Sunday, February 26, 2012

కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపు ...

''దేవుడున్నాడా? చూపించు'' అనే నాస్తిక, హేతువాదులు గానీ, ''అడుగో గోడలో ఉన్నాడు. ఇడుగో స్తంభంలో ఉన్నాడు'' అనే ఆస్తిక, భక్తిపారాయణులుగానీ ప్రధానంగా నిరూపణవాదాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు.

ఆటవిక దశ దాటని ఈశ్వరారాధకులు భగవత్‌ దర్శనం చేయించలేనట్టే, ప్రాథమిక భౌతికవాద దృష్టిని మాత్రమే కలిగిన నిరీశ్వరవాదులు తమ వాదనకు అనువుగా ప్రకృతి లీలలను ప్రదర్శించలేరు.

ఈ విషయంలో ఇరుపక్షాలూ మూర్ఖులేననేది కొడవిటిగంటి రోహిణీ ప్రసాద్‌ పరిశీలన.
భౌతిక సూత్రాలను అనుసరించి సాగే ప్రకృతి ... మానవాళికి నిదర్శనాలను చూపించాల్సిన అవసరమే లేదని, మన మంచితనం, అవగాహన, చైతన్య స్థాయిలతో దానికి పనిలేదనేది ఆయన వాదన.

భౌతిక యుద్ధంలో ప్రత్యర్థి బలంపై దెబ్బకొట్టాలనే మార్క్సిస్టు సాహిత్యకారుడు కొ.కు. సూత్రీకరణకు కొనసాగింపుగా అన్నట్టు సంక్లిష్టమైన మానవ మెదడులో దేవుడు రూపుదిద్దుకున్న క్రమాన్ని ఆయన కుమారుడు రోహిణీప్రసాద్‌ సానుభూతితో పరిశీలించి చేసిన విలువైన విశ్లేషణలతో ''మనుషులు చేసిన దేవుళ్లు'' వ్యాసాలు రూపుదిద్దుకున్నాయి.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించిన ఈ పుస్తకంలోని 44 వ్యాసాల్లో ప్రధానంగా వైజ్ఞానిక దృష్టి కనిపిస్తుంది.

మతాన్ని సమాజ పరిణామక్రమం నుంచే గాక జీవ పరిణామక్రమం నుంచి పరిశీలించడం, చరిత్ర నుంచే కాక నాడీ వ్యవస్థ, మెదడు స్పందనల నుంచి దైవ మూలాలను వెలికి తీసేందుకు ప్రయత్నించడం వంటి పోకడల వల్ల ''తెలుగులో మరెవ్వరూ చేయని ప్రయత్నం చేశా''ననే వ్యాసకర్త మాటలకు పుష్టి చేకూరుతోంది.

అయితే మార్క్సిజానికి బయట కూడా మత విశ్లేషణ చేయొచ్చుననే ప్రతిపాదనతో బయలుదేరిన రోహిణీ ప్రసాద్‌, చాలా వ్యాసాల్లో శద్ధ భౌతికవాదిగా తేలిపోయారు. వైజ్ఞానిక కృషికి తాత్విక దృష్టిని జోడించలేకపోవడం వల్ల ఆయన కంటికి 'మతం' మసగ్గానే కనిపించిందని చెప్పక తప్పదు.

- వి. అరవింద్‌
( ఆదివారం ఆంధ్రజ్యోతి 26 ఫిబ్రవరి 2012 సౌజన్యంతో)

మనుషులు చేసిన దేవుళ్లు (వ్యాసాలు)

కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌

పేజీలు196,

వెల: రూ.100/-

Monday, January 30, 2012

విస్తృత చర్చకు విశేష ప్రతిపాదనలు - 'రూపంసారం: సాహిత్యంపై బాలగోపాల్‌ ' -2 ... కె.కె.రంగనాథాచార్యులు ...

సాహిత్యం బాలగోపాల్‌ ప్రధాన కార్యక్షేత్రం కాదు.
కానీ సాహిత్యానికి సంబంధించిన అవగాహన, నిబద్ధత ఆయనకున్నాయి.
హక్కుల ఉద్యమాల కార్యాచరణ క్రమంలోనే సాహిత్యాన్ని మానవ అస్తిత్వంలో ముఖ్య”మైన భాగంగా గుర్తించి ఉంటాడు.
రాష్ట్రంలో రోజురోజుకూ నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజాతంత్ర ఉద్యమాలకే తాను ఎక్కువగా సమయం కేటాయించవలసి వచ్చిందని, అందువల్ల సాహిత్యాన్ని తన రంగంగా ఎంచుకోలేకపోయానని చెప్పుకున్నాడు.
అయినా అవకాశం, అవసరం వచ్చినప్పుడల్లా సాహిత్య సమస్యలకు స్పందిస్తూనే వచ్చాడు.

చదవండి:
''రూపం - సారం: సాహిత్యంపై బాలగోపాల్‌'' పుస్తకంపై
కె.కె.రంగనాథాచార్యులు సమీక్ష రెండో భాగం :
ఆంధ్ర జ్యోతి 'వివిధ' సాహిత్య వేదిక తేది: 30 జనవరి 2012.




.

Monday, January 23, 2012

తాత్త్విక ప్రయాణంలో సాహిత్య చర్చ - కె.కె.రంగనాథాచార్యులు ...



తాత్త్విక ప్రయాణంలో సాహిత్య చర్చ - కె.కె.రంగనాథాచార్యులు ...

పోరాటాలు మద్దతు కోసం ఎదురు చూస్తున్నట్టుగానే
నడుస్తున్న చరిత్ర కథకుల కోసం ఎదురుచూస్తున్నది.
కథకులకు కొదవలేదు.
కానీ జీవితాన్ని, జీవిత సంఘర్షణలను బహుముఖంగా అర్థం చేసుకొనే సంస్కృతి లోపించిందని ఆవేదన.
అందువల్లనే నడుస్తున్న చరిత్ర, అందులో భాగమైన కథలన్నీ అ లిఖితంగానే ఉండపోయాయనే బాధ.
పోరాటమే కాదు జీవితంలోని అనేక కోణాలు సాహిత్య వస్తువు కావాలని
బాలగోపాల్‌ ఆకాంక్షించాడు....

రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్‌
పుస్తకంపై
కె.కె.రంగనాథాచార్యులుగారి సమీక్ష
మొదటి భాగం ఇక్కడ చదవండి:

ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక వివిధ సోమవారం 23 జనవరి 2012

రూపం-సారం: సాహిత్యంపై బాలగోపాల్‌
పేజీలు : 360
ధర : రూ. 150
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణ



.

Friday, January 6, 2012

మా నాన్న బాలయ్య ... My Father Balaiah By Dr.Y.B.Satyanarayana ...

అంటరాని తనం ఎలా వుంటుంది?
చాలా చేదుగా వుంటుంది.
అనుభవిస్తే కాని అర్ధం కాదు.

ఇప్పుడు అంటరానితనం చాలా వరకు తగ్గినా ఒకప్పుడు అది సమాజం లోతుల దాకా పాతుకుపోయిన దురాచారం.
అలాంటి దురాచారాన్ని అధిగమించి పైకి వచ్చిన విద్యాధికులలో వై.బి. సత్యనారాయణ ఒకరు.

అమెరికాలో ఉన్న తన మనవరాలు లాంటి వాళ్లకు ఈ చెడు నిజాలు తెలియాలనే ఉద్దేశం తో ఆయన రాసిన పుస్తకమే "మై ఫాదర్ బాలయ్య "
దానిలోని ఆసక్తి కరమైన భాగాలు మీకోసం :

ఇక్కడ క్లిక్ చేయండి : ఆంద్ర జ్యోతి 5 -1 -2012 నవ్య పేజీ






.

Sunday, December 18, 2011

రూపం - సారం ... బాలగోపాల్‌ పుస్తకంపై 'నమస్తే తెలంగాణా' పత్రిక సమీక్ష


బాలగోపాల్‌ను ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యాతగా భావించేవాళ్లు ఆయన ఆలోచనల తాత్విక మూలాలు, ఆయన సాహిత్య పరిశీలనలో ఉన్నాయని గుర్తించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందంటూ ప్రచురణ కర్తలు పేర్కొన్నారు.

మనిషి జీవితంపై, సమాజ జీవితంపై ప్రతి మలుపులోనూ వెలుగులు ప్రసరించి అన్ని పార్శ్వాలనూ మనకు చూపించగల శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని నమ్మిన వ్యక్తి బాలగోపాల్‌.

అటువంటి వ్యక్తి ఎంతో నిజాయితీగా వేర్వేరు సందర్భాల్లో రాసిన సమీక్షలు, వ్యాసాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, అట్లే రాసిన ముందుమాటలను ఈ పుస్తకంలో సంకలనం చేశారు. అంతేకాదు తన రూపం సారం పుస్తకానికి చేరా, కె.వి.ఆర్‌., త్రిపురనేని మధుసూధనరావులు రాసిన ముందుమాటల్ని, అదేవిధంగా బాలగోపాల్‌ రాసిన ఆంగ్ల వ్యాసాల్ని కూడా ఈ పుస్తకంలో అనుబంధాలుగా చేర్చారు.

కె. శ్రీనివాస్‌ ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ కె. బాలగోపాల్‌ విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగా లభించడం తెలుగు సాహిత్యానికి చరిత్ర కల్పించిన ఒక అపురూపమైన అవకాశం అన్నాడు. అయితే, విప్లవ శిబిరమే కాదు, ఆ స్రవంతికి సమాంతరంగా వర్థిల్లిన గుర్తింపు ఉద్యమాలు సైతం బాలగోపాల్‌ నుంచి మద్దతు స్వీకరించి నంతగా , ఆయన ఆలోచనలను తీసుకోలేదు. ఫలితంగా ఆయన సాహిత్య వ్యక్తిత్వం ఒక తరం వారికి పెద్దగా పరిచయమే కాలేదు. ఆయన రచనలన్నింటినీ ఒక క్రమంగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవడానికి ఆయన నిష్క్రమణతో అవకాశం కలగడమే విషాదం అన్నారు . అది పూర్తిగా నిజం.

ఈ పుస్తకం సాహిత్యాన్ని బాలగోపాల్‌ తన కార్యరంగంగా ఎంచుకోదని, సాధికారంగా వ్యాఖ్యానించడానికి తగినంతగా తెలుగు సాహిత్యాన్ని చదవలేదని, తాను రాసిన వ్యాసాలు సమగ్రం కావని బాలగోపాలే అనేక సందర్భాల్లో అన్నప్పటికీ సాహిత్యానికి ఆయన వ్యక్తిగత, ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్నది. తాత్విక విశ్వాసంగా తాను అప్పటిదాకా భావిస్తూ వచ్చిన మార్క్సిజం పట్ల వున్న అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భమూ, తాను మొదలుపెట్టిని తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందని, తనకు సంతృప్పినిచ్చే ప్రాపంచిక దృక్పథం లభించిందని ప్రకటించిన సందర్భమూ సాహిత్య అవగాహన, వివేచన, మీమాంస అన్నీ కూడా ఈ వ్యాసాలనుంచి అందిపుచ్చుకోవడం ప్రజా జీవితంలో ఉన్న పాఠకులందరికీ అత్యంత అవసరం, అవశ్యం.

యండమూరి తులసీదళం నుంచి అలెక్స్‌ హేలీ రూట్స్‌ నవల దాకా మాభూమి నుంచి శంకరాభరణం దాకా, ఇంకా చెప్పాలంటే అటెన్‌బరో గాంధీ దాకా బాలగోపాల్‌ నిశిత పరిశీలనతో చేసిన సమీక్షలు, వ్యాసాలూ ప్రతీ అంశాన్ని సీరియస్‌గా లోతుగా తరచి చూడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. సామాన్య పాఠకులనూ లోతైన అధ్యయనానికి ప్రేరేపిస్తాయి.

- ( నమస్తే తెలంగాణా ఆదివారం బతుకమ్మ 11 డిసెంబర్ 2011 సౌజన్యంతో )

రూపం-సారం
సాహిత్యం పై బాలగోపాల్‌
339 పేజీలు, వెల: రూ.150

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

.

Tuesday, November 22, 2011

"వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి" సౌదా అరుణ వ్యాసం


...
మన దేశం లో అగ్ర కుల రచయితలూ, చరిత్ర కారులూ రాజుల మెప్పుకోసం పాకులాడారే తప్ప ప్రజా జీవితాన్నీ, ప్రజా చరిత్రనూ వాస్తవిక రీతిలో చిత్రించేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. దళిత వీరుల వీరనారీమనుల వైపు కన్నెత్తి చూసిన పాపాన కూడా పోలేదు. అందుకే బుందేల్ ఖండ్ (ఉత్తర ప్రదేశ్ కు ) చెందిన దళిత వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి (1830 -1890 ) సాహస గాధ చరిత్ర పుటలకెక్కకుండా పోయింది.

దళిత అంశాలపై హిందీలో విస్తృతంగా రచనలు చేస్తున్న మోహన్ దాస్ నైమిష్ రాయ్ ఇటీవల ఎంతో పరిశోధించి ఆమె జీవిత చరిత్రను గ్రంధస్తం చేసారు. డా. జీ. వీ. రత్నాకర్ అనువదించిన పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ "వీరనారి ఝాన్సీ ఝల్కారీ బాయి" పేరిట ప్రచురించిన విషయం విదితమే.

ఈ పుస్తకం తెలుగు పాఠకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మరుగునపడ్డ ఝల్కారీ బాయి జీవిత చరిత్ర పై దేశ వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో " సమాంతర వాయిస్ " మాస పత్రిక నవంబర్ 2011 సంచికలో సౌదా అరుణ గారు ఒక వ్యాసం రాసారు.
సమాంతర సౌజన్యంతో ఆ వ్యాసం పీ డీ ఎఫ్ ఫైలు రూపం లో ఇక్కడ పొందు పరుస్తున్నాము.
దిగువ టైటిల్ పై క్లిక్ చేయండి.
:

సమాంతర పత్రిక కోసం ఈ కింది చిరునామాలో సంప్రదించవచ్చు :
Samaantara Voice, 11-6-868/10, First Floor, Lakdikapool, Hyderabad - 500004
Phone: 040 23303397

వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి
రచన: మోహన్‌ దాస్‌ నైమిశ్‌ రాయ్‌

తెలుగు: డా. జి.వి. రత్నాకర్‌

బొమ్మలు: పైడిరాజు
24 పేజీలు, వెల: రూ.30/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

..


Monday, November 21, 2011

టి.ఎన్‌.సదాలక్ష్మి జీవిత చరిత్ర - - కె.పి.అశోక్‌ కుమార్‌



...
ప్రజాసేవ కోసం రంగంలోకి దిగిన నాయకులంతా పదవులు దక్కగానే ప్రజలను మరిచిపోవడం మామూలే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఉన్నట్టుండి ఆస్తులు, అంతస్తులు పెరుగుతాయి. నెల తిరిగేసరికి బంజారాహిల్స్‌కు వెళ్లిపోవడం చూస్తూనే వున్నాం. పదవులు చేపట్టగానే తమ కులం నుండి, తమ సమాజం నుండి దూరమవుతారు. కాని సదాలక్ష్మి జీవితం ఇందుకు పూర్తిగా భిన్నమైంది.

ఆమె ఎమ్మెల్యే నుండి డిప్యూటీ స్పీకర్‌ స్థాయికి వచ్చినా, రాజకీయాల్లో వున్నా లేకపోయినా, ఎప్పుడూ ప్రజా సమస్యల వైపు, దళితుల అభివృద్ధి వైపే దృష్టి సారించేవారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న అరుదైన వ్యక్తిత్వం సదాలక్ష్మిది. నిబద్ధత కలిగి అనేక అస్తిత్వాలకు, వివిధ తరాలకు చెందిన ప్రజానీకాన్ని తన వెంట నడిపించుకున్న రాజకీయ నాయకురాలు ఆమె. అవినీతికి దూరంగా నిస్వార్థంగా, నిజాయితీగా, నిరాడంబరంగా జీవించిన సదాలక్ష్మి జీవితం నేటి యువతరానికి ఆదర్శప్రాయం.

విషయసేకరణ వేరు, దాన్ని విశ్లేషించుకుని, నింగడించుకుని సరిగ్గా ప్రజెంట్‌ చేయడం వేరని రచయిత్రి గుర్తించలేకపోయారని తెలుస్తుంది. పుస్తకం నిండా బోలెడంత రిపిటేషన్‌, అనవసర, అసందర్భ వ్యాఖ్యానాలు కోకొల్లలు. పదే పదే సదాలక్ష్మి కులాన్ని పనిగట్టుకుని తెలియజేయడం చిరాకనిపిస్తుంది. తెలంగాణ చరిత్ర, భాష, సమానత్వంల గురించిన అధ్యాయాలు అనవసరం. ఇది పుస్తకం నిడివిని పెంచడానికే తప్ప సదాలక్ష్మి జీవిత చరిత్రను, ఆమె గొప్పదనాన్ని తెలియజేయడానికి

ఏమాత్రం ఉపకరించవు. సరిగ్గా ఎడిట్‌ చేసి ఈ పుస్తకాన్ని సగానికి కుదించి, పాఠకునికి తక్కువ ధరకు మరింత ఆసక్తికరంగా వుండేట్టు అంజేసే అవకాశాన్ని ప్రచురణకర్తలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాదు.

- కె.పి.అశోక్‌ కుమార్‌
(వార్త, ఆదివారం 20 నవంబర్‌ 2011 సౌజన్యంతో)

నేనే బలాన్ని - టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ
రచన: గోగు శ్యామల
పేజీలు: 338, వెల: రూ.180/-

ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Tuesday, November 8, 2011

ధైర్యే సాహసే ‘సదాలక్ష్మీ’ - అబ్బూరి ఛాయాదేవి - (భూమిక November 2011)

ధైర్యే సాహసే "సదా లక్ష్మీ"


మన రాష్ట్రరాజకీయాల్లో తనదైన ముద్రవేసిన శ్రీమతి టి.ఎన్‌.సదాలక్ష్మి గురించి శ్రీమతి గోగు శ్యామల రాసిన సదాలక్ష్మి గారి మొట్టమొదటి జీవితచరిత్ర.


సదాలక్ష్మి గారి ఆఖరి దశలో ఆమెని ఇంటర్వ్యూ చేసి ఆమె ఆత్మచరిత్రని ఆధారంగా చేసుకుని, ‘నేనే బలాన్నిఅన్న శీర్షికతో, పరిశోధనాత్మకంగా సదాలక్ష్మిగారి సన్నిహిత బంధువుల్నీ, మిత్రుల్నీ, సమకాలీన రాజకీయ నాయకుల్నీ, ఉద్యమాలలో పాల్గొన్న ప్రముఖుల్నీ ఇంటర్వ్యూ చేసి ఆమె జీవితచరిత్రని అన్వేషిసంస్థ ఆధ్వర్యంలో రాయగా, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు వారు ఆకర్షణీయమైన ముఖచిత్రంతో ప్రచురించిన అపూర్వగ్రంథం ఇది.


ప్రధానంగా ఇంటర్వ్యూల మీద ఆధారపడిన గ్రంథం కాబట్టి, ఇందులో కాలక్రమానుసారంగా సదాలక్ష్మి జీవితాన్ని చిత్రించడంలో కొంత ముందు వెనకలయి నప్పటికీ, ప్రతి అధ్యాయం ఆసక్తికరమైన వివరాలను అందించింది.


ఆమెకు ఎవ్వరంటే భయం లేదు. స్వయంగ నేను చూసాను. అందరు మినిస్టర్లు వచ్చేవాల్లు. నేను ఆమె వెనుకనే వుండేవాన్ని. తను ఎవ్వర్నీ సర్‌అన్నదిగానీ, తలవంచి మాట్లాడిందిగానీ లేదు. సంజీవరెడ్డితో, పి.వి.నరసింహరావుతో, బ్రహ్మానందరెడ్డితో మాట్లాడినాఆమె ఎప్పుడూ గూడా వాళ్ళతో సమానంగా మాట్లాడింది. ఏదో వాల్లకంటే కిందికి తగ్గాలనే మాట ఆమెకు లేకుండె. అంత నిర్భయత్వంల ఆమె వుండేదిఅని సదాలక్ష్మి గారి గురించి ఆమె భర్త టి.వి.నారాయణగారే అన్న మాటలబట్టి సదాలక్ష్మిగారి వ్యక్తిత్వం తెలుస్తుంది.


నేనే బలాన్నిఅనడంలోనే సదాలక్ష్మిగారి ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటమవుతుంది. సదాలక్ష్మికి చిన్నప్పుడు ట్యూషన్‌ మాస్టర్‌ చెప్పేదిట - రాదు అనే మాటను మన లిస్టులో నుంచి తీసెయ్యాలఅని. ఎవరు ఏ పనిచేస్తే, ఎవరు ఏ పని మీద ధ్యాసపెడితే ఆ పనిలో ప్రావీణ్యత ఒచ్చేస్తది. ఏ పనైన మనం చేస్తూ పోవాలి. మేము చెయ్యమూ అనొద్దునన్నడిగితె నాకు రాదూ అని ఎవరైన అంటే అట్లనొద్దు! దేన్నిగూడ రాదని చెప్పొద్దు. గమ్మున వూర్కోవాలె, చేస్తున్నది చూడాలె. అది నేర్చుకోవాలె అని చెప్పుత. నేను అట్లనే చేస్తఅన్న సదాలక్ష్మిగారి ఉద్ఘాటన అన్ని తరాలవారూ అనుసరించవలసిన మార్గదర్శకసూత్రం.
నిండ మన్సుబెట్టకుండ నా జీవితంల నేనేదీ చెయ్యను. చిన్నదానికి పెద్దదానికి మన్సుబెట్టాల్సిందే. ఇది దినచర్యలాగ అలవాటైయింది నాకు. ఆ విధంగా మా నాయినే అన్నీ చెప్పేదిఅని చెప్పిన విశేషమే సదాలక్ష్మిగారి విజయరహస్యం.


హిందూసమాజంలోని అట్టడుగు కులాలన్నింటిలోకీ అడుగున ఉండే మాదిగ ఉపకులమైన, మరుగుదొడ్లు సాఫు జేసే మెహతర్‌వృత్తికులంలో పుట్టి, ఏటికి ఎదురీదుతూ మంత్రివర్గ సభ్యురాలిగా,” ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిగా తన సత్తా నిరూపించుకుని, ”డిప్యూటీ స్పీకర్‌ స్థాయికి చేరుకున్న సదాలక్ష్మి జీవితాంతం కాంగ్రెస్‌, తెలుగుదేశం వంటి అధికారపార్టీ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ,” దళిత, తెలంగాణా మొదలైన ఉద్యమాలలో నాయకురాలిగా తనదైన ముద్రవేసిన తెలుగు మహిళ.


సదాలక్ష్మి 1928 వ సంవత్సరంలో డిసెంబర్‌ 25న పుట్టింది. అగ్రవర్ణ స్త్రీలలోనే చదువు అంతగా లేని పరిస్థితిలో తల్లిదండ్రుల ప్రోద్బలంతో 1939లో వీరి వంశంలోనే తొలి తరంగా పాఠశాలలోకి, ప్రాథమిక విద్యలోకి ప్రవేశించింది,” ముందుగా బొల్లారంలో ప్రైవేటు పాఠశాలలోనూ, పై తరగతులు కీస్‌ హైస్కూల్లోనూ చదివింది. ఇంటర్‌మీడియట్‌ కోసం నిజాం కాలేజిలో చేరి, నాలుగు నెలలపాటు చదివింది. రజాకార్లను ఎదుర్కొనేందుకు ఆమె ఎంత ధైర్యంగా ఉండేదంటే, నిజాం కాలేజికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ ఒక కత్తి దగ్గర పెట్టుకొని ఉండేదిఅని సదాలక్ష్మిగారి భర్త గుర్తు చేసుకున్నారు. అది కో-ఎడ్యుకేషన్‌ కాలేజి అని ఆమె పెద్దన్న కాలేజి మాన్పించాడు. ఎక్కడన్నా ఆడపిల్లల కాలేజి ఉంటే అక్కడ చదివిస్తానని తల్లి ప్రోత్సహించిందిట. మద్రాసులోని క్వీన్‌ మేరీస్‌ విమెన్స్‌ కాలేజిలో యఫ్‌.ఏ. (ఫస్ట్‌ ఆర్ట్స్‌ కోర్సు)లో చేరింది.


అంతకుముందు పదవ తరగతి చదువుతూండగానే 1947లో తను ఇష్టపడిన టి.వి.నారాయణని పెళ్ళి చేసుకుంది. వాళ్ళది ఇంటర్‌కాస్ట్‌ మ్యారేజి”. ఆమెది మాదిగ సబ్‌కాస్ట్‌ పాకీ వృత్తి. ఆయనది చెప్పులు కుట్టే వృత్తి. ఆ కాస్త తేడాలోనే నరకం చూశానుఅని చెప్పారు సదాలక్ష్మి, గోగు శ్యామలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో. సదాలక్ష్మిగారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమెని అత్త కొట్టేదిట. భర్త ఏమీ చెయ్యలేకపోయేవాడుట. నా మ్యారేజి లైఫ్‌ చాలా ఘోరమైన లైఫ్‌. ఇప్పటికీ ఎదురీదుతున్నాను…” అని ఆమె ఆఖరి రోజుల్లో కూడా చెప్పుకున్నారు.


మద్రాసుకీ హైదరాబాదుకీ మధ్య తిరగడంతో ఆమె చదువు సరిగ్గా సాగలేదు. అదే సమయంలో లేడీస్‌ కావాలని కాంగ్రెస్‌ పార్టీనుంచి స్వయంగా పిలుపు వచ్చిందిఎందుకంటే స్కూలు చదువులనుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేదని.


మొదటిసారి పార్లమెంటుకి ఎన్నికలలో కమ్యూనిస్ట్‌ పార్టీవల్ల ఓడిపోయినప్పటికీ, ”ఆమె జీవితంలో ఒక నూతన దశ మొదలయింది. తరవాత ఎం.ఎల్‌.ఎ.గా గెలిచింది.ఇక ఆమె స్వయం నిర్ణయాలుతీసుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఇష్టంతో చేసిన మరొక పని వ్యవసాయం. ధైర్యం సాహసం వుంటే తమకు తాము రక్షించుకుంటారు. ఇంక కొంతమందిని రక్షిస్తారుఅంటూ, ఒకసారి పెద్దపులిని ఎలా ఎదుర్కొందో చెప్పారు సదాలక్ష్మి. ఆనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో, ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూతో, రాష్ట్రంలో బ్రహ్మానంద రెడ్డితో, సంజీవరెడ్డితో, చెన్నారెడ్డి మొదలైన వారితో ఎలా వ్యవహరించారో సదాలక్ష్మి జీవితచరిత్ర చదివితే తెలుస్తుంది.


రకరకాల ఆధిపత్యాలు, పెత్తనాలు రాజ్యమేలుతుండే పార్టీల్లోనూ, సమాజంలోనూ మనుగడ సాగిస్తూ, అట్టడుగు కుల, తెగ, జండరు, ప్రాంత అంశాలపై పనిచేస్తున్నప్పుడు ఎదురయ్యే అడ్డంకులను, అనుభవాలను అర్థం చేసుకోవాలంటే సదాలక్ష్మి జీవితాన్ని చదవాల్సిందేఅని ఈ గ్రంథ రచయిత్రి గోగు శ్యామల అన్నది అక్షరాల నిజం. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం.


- అబ్బూరి ఛాయాదేవి

భూమిక నవంబర్ 2011 సౌజన్యంతో

http://bhumika.org/archives/1997


...

Monday, November 7, 2011

చారిత్రక ప్రేమకావ్యం


...
సరిగ్గా 33 ఏళ్ల్ల క్రితం (నవంబర్‌, 1978) 'గాన్‌ విత్‌ ద విండ్‌' నవలని మాలతీ చందూర్‌ (స్వాతి మాసపత్రికలో) పరిచయం చేసినప్పుడు పాఠకులంతా అబ్బురపడి,

'ఇంత గొప్ప నవలని ఎవరైనా తెలుగులోకి పూర్తిగా తీసుకొస్తే బాగుండేది కదా' అని మధనపడ్డారు.

వాళ్ల బాధని అర్థం చేసుకున్నట్టుగా మూడు దశాబ్దాల తర్వాత పూర్తి అనువాదంతో తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఎం.వి.రమణారెడ్డి.

ప్రపంచ ప్రఖ్యామైన వంద నవలల్ని ఎంపిక చేస్తే అందులో తొలి పది నవలల్లో 'గాన్‌ విత్‌ ద విండ్‌' ఉంటుందన్న అనువాదకుడి మాటతో పాఠకులు పూర్తిగా ఏకీభవిస్తారు.

అయితే ఈ నవల చదవడానికి ముందు కొంత అమెరికా చరిత్ర, 1861 నుండి 1865 మధ్య కాలంలో అక్కడ జరిగిన సివిల్‌ వార్‌ గురించి తెలిసివుంటే మరింత ఆసక్తిగా చదివిస్తుంది.

యూరోపియన్లు అమెరికాను ఆక్రమించి స్థానిక 'రెడ్‌ ఇండియన్స్‌'ని తరిమేసి వందలాది ఎకరాల్ని ఆక్రమించి, పత్తి పండించే భూకామందులుగా చలామణి అయ్యారు. ఆ క్రమంలో ఆఫ్రికా ఖండం నుండి లక్షలాది నల్లజాతీయుల్ని బానిసలుగా తీసుకెళ్లి వారితో ఊడిగం చేయించుకున్న చరిత్ర ప్రపంచానికి తెలిసిందే.

బానిసత్వ నిర్మూలన పోరాటాల నేపథ్యంలో అప్పటి అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అబ్రహాం లింకన్‌ నీగ్రోలకి పూర్తి స్వేచ్ఛనివ్వడం అమెరికా దక్షిణాది రాష్ట్రాలకు నచ్చలేదు.

అవి యునైటెడ్‌ స్టేట్స్‌తో విడిపోయి 'కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ స్టేట్స్‌'గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తిరుగుబాటుని అణిచివేసి, దేశాన్ని ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో సాగిందే అమెరికా అంతర్యుద్ధం.

1900 సంవత్సరంలో పుట్టిన 'మార్గరెట్‌ మిచ్చెల్‌' తన 25-35 ఏళ్ల మధ్యకాలంలో ఈ నవల రాశారు. 65 ఏళ్ల క్రితం జరిగిన అంతర్యుద్ధ చరిత్రని శోధించి, మధించి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారు.

ఈ నవలలో ప్రధాన పాత్ర స్కార్లెట్‌. తను అనుకున్నది సాధించే అసమాన స్త్రీగా స్కార్లెట్‌ పాత్రని మలిచిన తీరు పాఠకుల్ని అడుగడుక్కీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. స్వార్థం మూర్తీభవించిన స్కార్లెట్‌కి సమాన స్థాయిలో సృష్టించిన మరో పాత్ర 'రెట్‌ బట్లర్‌'. ఈ రెండు పాత్రలు ఒకే జాతి పక్షులు. వాళ్ల సుఖం కోసం ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదనుకునే మనస్తత్వం వీరిది. వీరిద్దర్నీ ఇష్టపడకుండానూ, ఏవగించుకోకుండానూ ఉండలేరు పాఠకులు.
మొదట్నుంచి 'యాష్లీ' ప్రేమ కోసం పరితపించిన స్కార్లెట్‌, అతని ప్రేమ అందకపోవడం లోంచి పుట్టిన కసితో ఛార్లెస్‌, కెనడి, రెట్‌ బట్లర్‌లను ఒకరి తర్వాత ఒకర్ని పెళ్లాడి ... ఎవరికీ స్వంతం కాలేక చివరికి ఒంటరిగా మిగిలిపోతుంది. 'నిజానికి యాష్లీ అర్థమయ్యి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ప్రేమించేది కాదని, రెట్‌ బట్లర్‌ అర్థమై ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదులుకునేది కాదనే' స్కార్లెట్‌ అంతర్మథనంతో నవల ముగించడం గొప్పగా అన్పిస్తుంది.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1940-50 దశకాల మధ్య ఇతర ప్రపంచ రచయితల మీద కూడా గాఢమైన ప్రభావం చూపించివుండాలి. గమనిస్తే పి.శ్రీదేవి 'కాలాతీత

వ్యక్తులు' నవలలోని ఇందిర, కృష్ణమూర్తి, కళ్యాణి, ప్రకాశం పాత్రలు స్కార్లెట్‌, రెట్‌ బట్లర్‌, మెలనీ, యాష్లేల మనస్తత్వాలకు అతి దగ్గరగా అనిపిస్తాయి. అ లాగే మట్టిమనిషి (వాసిరెడ్డి సీతాదేవి) వరూధినిలోనూ స్కార్లెట్‌ లక్షణాలు కనిపిస్తాయి.

'గాన్‌ విత్‌ ద విండ్‌' నవల 1939లో సినిమాగా విడుదలై పది ఆస్కార్‌ అవార్డులు సాధించడం గమనార్హం. ముఖ్యంగా స్కార్లెట్‌ పాత్రతో ఆస్కార్‌ స్వంతం చేసుకున్న నటి వివియన్‌ లీహ్‌ ఇండియాలోని డార్జీలింగ్‌లో పుట్టి ఊటీలో బాల్యం
గడపడం ఆసక్తి కలిగించే విషయం.

నవల సాంతం ఏకబిగిన చదివించే చక్కటి అనువాదం చేసిన రమణారెడ్డి ఇంత గొప్ప నవల రాసిన మూల
రచయిత్రి 'మార్గరెట్‌ మిచ్చెల్‌' పేరుని ముఖచిత్రంపై వేయకపోవడం, ఆమె ఛాయాచిత్రం పుస్తకంలో ఎక్కడా ప్రచురించకపోవడం పాఠకుల మనసును చివుక్కు మనిపిస్తుంది.

- గొరుసు
(ఆదివారం ఆంధ్రజ్యోతి 6-11-2011 సౌజన్యంతో)

చివరకు మిగిలింది?
మూలం : మార్గరెట్‌ మిచ్చెల్‌
అనువాదం : ఎం.వి.రమణారెడ్డి,
పేజీలు : 512, వెల : రూ.200

ప్రతులకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

Thursday, November 3, 2011

నిష్కల్మతను నిద్రలేపే బషీర్‌ కథలు - వాడ్రేవు చినవీరభద్రుడు


...
నా మళయాల మిత్రురాలొకామెను వైకం మహమ్మద్‌ బషీర్‌ కథలమీద సమీక్ష రాయాలి, ఏవైనా నాలుగు మాటలు చెప్పమని అడిగాను. ఆమె రెండు మాటలు చెప్పింది:

'మొదటిమాట బషీర్‌లో నాకు నచ్చేదేమిటంటే ఆయన రాసిన పుస్తకాలు చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతాయి. కానీ ప్రతి వాక్యంలోనూ ఎంత దార్శనికత ఉంటుందంటే, దాన్ని పండితులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. అ లాగని ఆ రచనలు చదివి ఆనందించడానికి ఆ దార్శనకిత తెలియాల్సిన పనిలేదు' అని.
ఆమె వెంటనే ఓ ఉదాహరణ కూడా ఇచ్చింది: ''బాల్యకాల సఖి'' కథలో ఒక చిన్నపిల్లవాడు ఒకటి ఒకటి కలిస్తే పెద్ద ఒకటి అవుతుంది అంటాడు. ఈ మాట వినగానే మనకు నవ్వొస్తుంది. రచయిత చిన్న పిల్లల మనస్తత్వాన్ని భలే పట్టుకున్నాడనిపిస్తుంది. కానీ కొద్దిగా ఆలోచిస్తే ఈ వాక్యం తాత్వికంగా చాలా లోతైన వాక్యమని అర్థమవుతుంది. ఒక నది మరొక నదితో కలిసిందనుకో, అప్పుడవి రెండు నదులు కావు కదా, పెద్ద నదిగా మారతాయంతే'' అంది.

ఆమె మాటలు వింటుంటే నాకో ఆలోచన వచ్చింది. కొందరు రచయితలు కొన్ని భాషా సాహిత్యాలకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటారేమోనని. ఉదాహరణకి చలం లాంటి రచయిత మనకి భారతదేశంలో మరే సాహిత్యంలోనూ కనబడడు. గాంధీజీ లాంటి రచయిత ఒక్క గుజరాతీకి మాత్రమే ప్రత్యేకం.
ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో గిరిజన తెగలు నివసిస్తుంటారో, అక్కణ్ణుంచి మాత్రమే గోపీనాథ మొహంతి లాంటి రచయిత ప్రభవిస్తాడు. అ లాగే, వైకం మహమ్మద్‌ బషీర్‌ (1908-1994) ఒక్క మళయాళ సాహిత్యానికి మాత్రమే ప్రత్యేకం, ఆ ప్రాంతానికి చెందిన మొక్కల్లాగా, పూలల్లాగా.

పరశురాముడు పైకిలేపాడని చెప్పుకునే భూభాగం మీద హిందువులు ప్రధాన స్రవంతిగా కొనసాగే సమాజంలో అ ల్పసంఖ్యాక ముస్లిం జీవితం నుండి పుట్టి పెరిగిన రచయిత - ఆయన భాషలో ఎనభై శాతానికి పైగా పదజాలం సంస్కృతం మీద ఆధారపడే మళయాళంలో ఒక గురజాడ లాగా పూర్తి మట్టి వాసన కొట్టే సాధారణ వాడుక భాషలో రచనలు చేసినవాడు. దాదాపు అర్థ శతాబ్దపు సాహిత్య కృషిలో ఆయన రాసింది మొత్తం 13 నవలలు, 13 కథా సంపుటాలు. 2,200 పేజీలకు మించని రచనా సర్వస్వం.

కానీ, ఇరవయ్యవ శతాబ్దపు భారతదేశ రచయితల్లో ఒక సుబ్రహ్మణ్య భారతి, ఒక టాగోర్‌, ఒక ప్రేమ్‌ చంద్‌, ఒక గురజాడతో సమానమైన స్థానాన్ని పొందాడు. ఎందుకని?
ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ తెలుగులోకి అనువదింపచేసి తీసుకువచ్చిన ''బహీర్‌ కథలు'' చదివితే ఆ ప్రశ్నకు జవాబు చాలా సులభంగా దొరుకుతుంది.

బషీర్‌ కథలు ఒట్టి కథలు కావు.
అవి ఒక రకంగా ఆయన అనుభవాలు. ఆయన కుటుంబ కథలు. ఆయన పుట్టి పెరిగిన సమాజం కథలు.

ఈ సంపుటంలోని 21 కథలూ చదవడం పూర్తి చేయగానే మనమొక నిజమైన మానవుణ్ణి కలుసుకున్నట్టనిపిస్తుంది. ఆగ్రహం, దు:ఖం, జీవిత పరిమళాలతోపాటు మనకెందుకో ఒకటే నవ్వొస్తూంటుంది. ఆ నవ్వు మళ్లా ఎక్కడో తీవ్రమైన విచారంలోకి తీసుకుపోయి పడేస్తుంది మనని.

బషీర్‌ కథల్ని ఇంగ్లీషులోకి అనువదించిన అబ్దుల్లా ఒక మాట రాస్తాడు: ''మీరు ఈ కథల్ని మళ్లీ మళ్లీ చదవకుండా ఉండలేరు. ఆ కథలు చదువుతూ మీ కళ్లమ్మట నీళ్లొచ్చేంతగా నవ్వుకుంటారు. ఇంతలో మీకు తెలియకుండానే రచయిత మిమ్మల్నేడిపిస్తున్నాడనే సంగతి మీకు తడుతుంది. మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

''పాతుమ్మా మేక'' కథనే తీసుకోండి, ఆ కథ చదువుతున్నంతసేపూ మీరు గడియారం పెండ్యులంలాగా నవ్వులకీ, కన్నీళ్లకీ మధ్య, మళ్లీ కన్నీళ్లకీ, నవ్వులకీ మధ్య ఊగుతూనే ఉంటారు.' (పూవన్‌ బనానా అండ్‌ అదర్‌ స్టోరీస్‌, ఓరియంట్‌ లాంగ్మన్‌, 2009, పే.11).

బషీర్‌ను చదువుతున్నప్పుడు, మనం మర్చిపోయిన మనలోని మానవత్వం, నిజాయితీ, నిష్కల్మషత్వం లాంటి గుణాలన్నీ నెమ్మదిగా బయటికి రావడం మొదలెడతాయి. ఆ మనిషి ఓ వరుసవేది. ఎటువంటి మనిషి కాకపోతే, వైకంలో ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుకోమని పంపిస్తే, 16 సంవత్సరాల వయసులో వైకం సత్యాగ్రహం (1924) కోసం వచ్చిన గాంధీజీని ఒక్కసారి తాకి చూడాలని అంతగా ఉవ్విళ్లూరతాడు!

తాకి ఊరకున్నాడా? ఆ క్షణమే సమస్తం వదిలేసాడు. స్కూలుకు పోవడం కన్నా సత్యాగ్రాహ ఆశ్రమానికి పోయిరావడాన్నే ఎక్కువ ప్రేమించాడు. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాడు. తిరువాన్కూరు సంస్థానంలో సత్యాగ్రహం చేయాలనుకున్నాడు. జైలుకి వెళ్లాడు. జైలు నుంచి బయటికొచ్చి ఎనిమిదేళ్లపాటు హిమాలయాల నుంచి ఆఫ్రికాదాకా తిరిగిన చోటు తిరక్కుండా తిరిగాడు. చేనేతకారుడిగా, జ్యోతిష్కుడిగా, వంటమనిషిగా, కాపలాదారుగా, సేవకుడిగా, గొర్రెలు కాచుకునేవాడిగా, సూఫీ సాధువుగా, సన్యాసిగా ఆయన ఎత్తని అవతారం లేదు. చెయ్యని ఉద్యోగం లేదు. తిరిగి ఇంటికి రాగానే అరెస్టువారంటు. మళ్లీ మరొకసారి జైలు. జైలు నుంచి బయటపడేటప్పటికి, మానసిక ఉన్మాదం. ఈ సారి పిచ్చాసుపత్రికి.

తుపాను పట్టిన సముద్రంలాగా ఘూర్ణిల్లిన ఆ యవ్వన దినాలన్నీ అయిపోయాక, ఏభైయ్యోపడిలో పడ్డాక, పెళ్లి. ఇద్దరు పిల్లలు. భర్తగా, తండ్రిగా కొత్త పాత్రలు. ''బేపూర్‌ సుల్తాన్‌''గా మూడున్నర దశాబ్దాలు ప్రశాంతమైన గృహజీవితం.

నా మిత్రురాలు చెప్పిన రెండో మాట ఏమిటంటే ''బషీర్‌ రచనలు కాలంతో పాటు కొత్తగా అనిపిస్తాయి. ఆయన మొట్టమొదటి కథ ''ప్రేమ లేఖనం'' (1943) ఇప్పుడు మళ్లీ చదివితే, అందులో స్త్రీపురుష సహజీవనం గురించీ, ఎవరూ మరొకరి మీద పెత్తనం నెరపని ఆదర్శ జీవితం గురించీ, స్త్రీల సాధికారత గురించీ ఎన్నో కొత్త ఆలోచనలు కలుగుతాయి' అని.

నిజమే. ఆ కథలో ఇవి చాలా మామూలు వాక్యాలే కాని, చూడండి: ''అ లా రైలు మూడు స్టేషన్లు దాటి ఆగింది. పెట్టెలో వాళ్లిద్దరే ఉన్నారు. నాలుగో స్టేషను దగ్గర ఆగినప్పుడు కేశవన్‌ నాయర్‌ టీకోసం చూసాడు. సారమ్మ కాఫీ కావాలంది. కేశవన్‌ నాయర్‌ టీయే కావాలన్నాడు. మాటా మాటా పెరిగింది. చివరకి సారమ్మ టీ, కేశవన్‌ నాయర్‌ కాఫీ తాగారు. తెల్లారింది. రైలు ఒక వంతెన దాటుతోంది. వంతెనకింద బంగారు నది ప్రవహిస్తూంది. కాఫీ, టీ గొడవను మరిచిపోయారు వాళ్లు.''

బషీర్‌ ముస్లిం మలబారు ముస్లిం జీవితం గురించి రాసాడు. అరబిక్‌లో ఖొరాన్‌ అధ్యయనం చేసాడు. కానీ ఆయన ముస్లిం మాత్రమే కాదు, పదహారేళ్ల తొలి యవ్వనంలో యువకులు యువతుల ప్రేమకోసం పరితపించే వేళ, ఆయన గాంధీజీతో ప్రేమలో పడ్డాడు. సత్యాగ్రహం చేసాడు. జైలుకు వెళ్లాడు. కానీ కాంగ్రెస్‌ వాది కాదు. భగత్‌సింగ్‌లో తన పోలికలు చూసుకున్నాడు. భావాల్లో, భాషలో సమూల విప్లవం అనుభవించాడు. కానీ రివల్యూషనరీ కాదు. బీదరికం, ప్రేమ, తనకు కలిగినది నలుగురితో కలిసి పంచుకోవడం కోసమే జీవించాడు. దాన్నే రాసాడు. కానీ మ్యూనిస్టు కాదు. స్త్రీ పరిమళాన్ని ప్రాణప్రదంగా ఆస్వాదించాడు. కానీ పూవన్‌ బనానా కథ చదివితే, ఆడవాళ్లను ద్వేషిస్తున్నాడా అనిపిస్తుంది. ఆయన ఫెమినస్టూ కాడు. యాంటీ ఫెమినిస్టూ కాడు. పైకి విరుద్ధంగా కనిపించే ఈ అంశాలన్నిటినీ, ఈ జిగ్‌సా పజిల్‌ని జాగ్రత్తగా పేర్చుకుంటూ పోతే అత్యంత విశ్వసనీయుడైన, అత్యంత ప్రేమాస్పదుడైన ఒక మనిషి ముఖచిత్రం సాక్షాత్కరిస్తుంది. ఆయన్ని కేరళ సమాజమెలా ప్రేమించిందో మనం కూడా అ లాగే ప్రేమించడం మొదలు పెడతాం.

ఇంతకుముందే చెప్పినట్టుగా, ఆయన మనలో నిద్రపోతున్న నిష్కపట మానవుణ్ణి మేల్కొలుపుతాడు. అవును, మనం కూడా ఒకప్పుడు, మన బాల్యంలోనో, తొలియవ్వనంలోనో ఇంత నిర్మలంగా ఉండేవాళ్లం. ఇప్పుడెందుకిలా అయిపోయాం? మనకి ఏడుపొస్తుంది.

''అమ్మ కథ (అది కథ కాదు, ఆయన జీవితమే) చదవడం ముగించగానే నాకు నిజంగానే ఏడుపొచ్చేసింది.
బషీర్‌ నేను కూడా నీలా బతకాలంటే, నీలా రాయాలంటే, చెప్పు నేను ఏం కావాలి? ఏం వదులుకోవాలి?

నాలాంటివాళ్లు అసంఖ్యాకంగా ఉన్న తెలుగు సమాజం, తెలుగు సాహిత్య సమాజం తప్పనిసరిగా చదవాల్సిన కథలివి. అనువాదాలు కూడా బాగున్నాయి.

-వాడ్రేవు చినవీరభద్రుడు
( ఆదివారం ఆంద్ర జ్యోతి తేదీ 02 అక్టోబర్ 2011 సౌజన్యంతో )

పేజీలు 200, వెల: రూ.100



...

Wednesday, November 2, 2011

ఘంటారావం, అజేయుడు : ఆంధ్రజ్యోతి సమీక్ష


...
రెండూ రెండు ప్రపంచ ప్రఖ్యాత నవలలు.

ఒకటి విక్టర్‌ హ్యూగో 1831లో రాసిన "The Hunchback of Notre Dame" నవలకు తెలుగు అయిన ''ఘంటారావం''.

రెండోది ''అజేయుడు'' 1844లో అ లెగ్జాండర్‌ డ్యుమా రాసిన "The Count of Monte Cristo" నవలకు తెలుగు

అన్ని భాషల్లోకి అనువదించబడ్డ ఈ రచనల గొప్పతనం గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం ఎలా లేదో వీటిని తెలుగు చేసిన సూరంపూడి సీతారాం అనువాద శైలి గురించి కూడా అంతే.

కౌంట్‌ ఆఫ్‌ మాంటి క్రిస్టో నవల చాలా పెద్దది కాబట్టి ఈ కాలం పాఠకులను దృష్టిలో పెట్టుకుని కాస్త సంక్షిప్తం చేశారు హెచ్‌బీటీ వాళ్లు.

మనుషుల పేర్లూ, ప్రాంతాల పేర్లు, వ్యవస్థల పేర్లు పరాయిగా అనిపించవచ్చునేమో గాని మానవ స్వభావాల రీత్యా ఈ రెండు కాల్పనిక నవలలలోని ఇతివృత్తం మనకు సుపరిచతంగా అనిపిస్తుంది.

అన్యాయాలు, అక్రమాలు, అవహేళనలకు గురైన చాలామంది శక్తిలేక, పరిస్థితులకు తలొగ్గి చరిత్రలో కనుమరుగైపోవచ్చు. కానీ వాళ్లందరికీ ప్రతినిధిగా ఎవరో ఒకరు ఎదురుతిరిగి తమ బాధలకు ప్రతీకారం తీర్చుకుంటారు. మిగతా బాధితులందరూ వారిలో తమను తాము చూసుకుంటారు.
కనుకే అటువంటి పాత్రలకు అంత ప్రజాదరణ లభిస్తుంది. ఆ ప్రతీకారం తీర్చుకోవడంలో వారు ఉదాత్తులుగా కూడా వ్యవహరిస్తే సాహిత్యంలో వారి స్థానం సుస్థిరమవుతుంది.

ఈ ఇతివృత్తాలు సినిమా పరిభాషలో ఫార్ములా కథలుగా మారిపోయాయి నిజానికి.
కానీ అవి నిజ జీవిత ప్రతీకలే.
చాలా ఏళ్ల తర్వాత తెలుగులో లభ్యమవుతున్న ఈ పుస్తకాలను మిస్‌ కాకండి.

- వసంత
(ఆదివారం ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)

ఘంటారావం, పేజీలు, 186, వెల: రూ.100
అజేయుడు, పేజీలు, 404, వెల: రూ.160
అనువాదం: సూరం పూడి సీతారాం.

For EBooks. Pl Click : KINIGE.COM


...

సత్యానికీ, మిథ్యకీ మధ్య ...



సత్యానికీ, మిథ్యకీ మధ్య ...
...
చరిత్రపుటలకు ఎక్కని చరితార్థులకు మన దేశంలో లోటు లేదు.
జనం నోళ్లలో (నిజానికి హృదయాలలో) పాటల రూపంలో, గాథల రూపంలో వారి చరిత్ర మౌఖికంగా వినిపిస్తూనే ఉంటుంది.

అ లాంటి వీరులు, వీరవనితల గురించిన కథలు మనకూ ఉన్నాయి.
ద్వారబంధాల చంద్రారెడ్డి, అ ల్లూరి సీతారామరాజు, చిన్నపరెడ్డి వంటి వారిపైనా, బీర్సా ముండా వంటి వారి చుట్టూ అనేక కట్టు కథలు చుట్టుముట్టి ఉంటాయి.
శాస్త్రీయంగా జరిగే చరిత్ర రచనలో స్థల పురాణాల పాత్ర వాస్తవాల నడుమ చెదిరిన లంకెను కూర్చడానికి మాత్రమే పరిమితం.
అంతేగానీ స్థలపురాణమే చరిత్ర కాదు.

కానీ హెచ్‌బీటీ వెలువరించిన ''వీరనారి ఝాన్సీ ఝల్‌కారీబాయి'' స్థలపురాణానికి సమీపంగానే ఉంది తప్ప, చరిత్ర లక్షణాలను పూర్తిగా సంతరించుకోలేకపోయింది.
ఝాన్సీ లక్ష్మీబాయికి సమకాలీనురాలైన ఝల్‌కారీ యుద్ధవేళ తానే రాణినని కంపెనీ సేనను ముప్పు తిప్పలు పెట్టిందని ఇందులో కనిపిస్తుంది. చిరుతను చంపడం, ఆవు దూడ ఉదంతం, కోట ఆక్రమణ వేళ కనిపించిన ప్రతి తెల్ల సైనికుడి తలను నరకడం వంటి ఘట్టాలు స్థలపురాణాల స్థాయివే తప్ప చారిత్రక వాస్తవాలు అనిపించుకోలేవు. చరిత్ర రచనలో దినుసులు కాలేవు.

ఝల్‌కారీ గురించిన ప్రస్తావన చాలా పుస్తకాలలో ఉన్నదని ఒక పక్క చెబుతూనే ఆమె చరిత్ర మరుగున పడిందని ప్రచురణకర్తలు భావించడం వింతగా ఉంది. ఝాన్సీ ప్రాంతంలో దొరుకుతున్న ఝల్‌కారీ చారిత్రక విశేషాలను సరిగా మథించకుండా ఇలాంటి పుస్తకం రాయడం వల్ల అంతటి చారిత్రక మహిళను ఈ తరానికి పరిచయం చేయాలన్న లక్ష్యం నెరవేరదు.

పుస్తక ముఖచిత్రం రమణీయంగా ఉంది. కానీ ఝల్‌కారీభాయి అంటూ అట్ట శీర్షికలో కనిపించే తప్పు మీద దృష్టి పడితే ఆ ఆనందం కూడా మిగలదు. హిందీలో మోహన్‌దాస్‌ నైమిశ్‌ రాయ్‌ రాసిన ఈ పుస్తకాన్ని డాక్టర్‌ జీ.వీ. రత్నాకర్‌ తెలుగులోకి అనువదించారు.

- కల్హణ
(సాక్షి దినపత్రిక తేది31-10-2011 సౌజన్యంతో)

Tuesday, November 1, 2011

అ లనాటి ఫ్రెంచి సమాజం





...
కొన్ని రచనలకు కాలదోషం వుండదు.
అ లెగ్జాండర్‌ ద్యుమా నూటయాభై ఏళ్లనాడు రచించన 'అజేయుడు' ఇప్పటికీ అజేయంగా పాఠకుల్ని
అ లరిస్తూనే వుంది.
కథానాయకుడి వీరోచిత వ్యక్తిత్వం హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా అనేకానేక పాత్రలకు స్ఫూర్తినిచ్చింది.
అ లనాటి ఫ్రెంచి సమాజాన్నీ, రాజకీయాల్నీ కళ్లకు కట్టే రచన ఇది. అరవై అయిదేళ్ల క్రితం సూరంపూడి సీతారాం

తెలుగులోకి అనువదించారు.
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు క్లుప్తీకరించి అందిస్తున్నారు.

పదిహేనవ శతాబ్దపు 'పారిస్‌ నగరాన్ని పునరుజ్జీవింపచేసిన మరో నవల ''హంచ్‌బాక్‌ ఆఫ్‌ నోత్రెదామ్‌''.
దీన్ని 'ఘంటారావం' పేరుతో సీతారాం తెలుగు చేశారు.
ఈ రెండు పుస్తకాలనీ చదవడం గొప్ప అనుభూతి.

- స్వామి (ఈనాడు ఆదివారం 30 అక్టోబర్‌ 2011 సౌజన్యంతో)

ఘంటారావం- రచన: విక్టర్‌ హ్యూగో, పేజీలు:186 వెల: రూ. 100
అజేయుడు - రచన: అ లెగ్జాండర్‌ ద్యుమా, పేజీలు: 404, వెల: రూ.160
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

For EBooks Pl Click: KINIGE.COM

...

Monday, October 24, 2011

మతాలపై వైజ్ఞానిక విశ్లేషణ


... మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషించిన వ్యాసాల కూర్పు ఇది. ప్రకృతి శక్తులకు తలొగ్గి దినదినగండంగా బతికిన ఆదిమానవులకు మత భావనలు మంచే చేశాయి. వారి మధ్య ఐకమత్యం పెంచి సామూహిక పద్ధతిలో ఆశావాద దృక్పథాన్ని కలిగించాయి. అయితే లాభనష్టాలను బేరీజు వేసినప్పుడు మత విశ్వాసాల ద్వారా సమకూరేఉపయూగాలేవీ ఇన్‌హేలర్ల స్థాయిని మించవని రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ విస్పష్టంగా చెబుతారీ పుస్తకంలో! అవి వ్యక్తిగత, సమాజ ఆరోగ్యానికి పట్టిన జలుబును ఎంత మాత్రం తగ్గించవనీ, పైగా 'సైడ్‌ ఎఫెక్ట్స్‌' ప్రమాదకరమైనవనీ వివరిస్తారు. ఈ క్రమంలో సాంస్కృతిక చరిత్రకున్న భిన్న పార్శ్వాలను స్థూలంగా ప్రస్తావిస్తారు రచయిత. ప్రాచీన నాగరికతలూ, దేశధేశాల్లోని విశ్వాసాలూ, అవశేషాల విశేషాల గురించి ఆకట్టుకునే చిత్రాల సాయంతో వివించారు. ఉద్వేగాలకు తావివ్వకుండా, సిద్ధాంతాల ప్రమేయం లేకుండా సాగిన ఈ వ్యాసాల శైలి సులభంగా, సూడిగా ఉండి ఆసక్తికరంగా చదివిస్తుంది.
- వేణు (ఈనాడు ఆదివారం 23 అక్టోబర్‌ 2011 సౌజన్యంతో)

మనుషులు చేసిన దేవుళ్లు

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌


పేజీలు: 196; వెల: రూ. 100/-
ప్రతులకు :
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 ౦౬౭

...

Monday, October 3, 2011

' నేనే బలాన్ని ..... ' టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ ... పుస్తక సమీక్షా సభ ... నీలి జెండా నివేదిక



'నేనే బలాన్ని - టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ' పుస్తకం 60 ఏళ్ల సాంఘిక, రాజకీయ చరిత్రకు దర్పణం వంటిదనీ, నేటి నాయకులు తప్పక చదవవలసిన గ్రంథమనీ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొ.ఘంటా చక్రపాణి అన్నారు.

అన్వేషి, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ప్రచురించిన ఈ పుస్తక సమీక్షా సదస్సు సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది.

సదాలక్ష్మి రాజీపడని మనస్తత్వం గల నాయకురాలనీ, ఈ గ్రంథంలో రచయిత్రి గోగు శ్రామల మొత్తం సమాజాన్ని కూడా విశ్లేషణ చేశారనీ అన్నారు. మురికివాడల నుంచి పైకి వచ్చిన నిప్పుకణిక సదాలక్ష్మి అని కొనియాడారు. 1969లో తెలంగాణ సమస్యపై జె. ఈశ్వరీబాయి, సదాలక్ష్మి ప్రభుత్వంపై విరుచుకుపడేవారని చక్రపాణి అన్నారు.

ఈ గ్రంథంపై విస్తృతంగా చర్చ జరగాలని ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర అన్నారు. వివిధ కోణాల నుంచి సదాలక్ష్మి జీవితాన్ని విశ్లేషణ చేయాలన్నారు.

సుశీతారు (ఇఫ్లూ యూనివర్సిటీ) మాట్లాడుతూ రాజకీయ నాయకుల జీవిత చరిత్రల్లో సదాలక్ష్మి వంటి అణగారిన వర్గాల నాయకుల చరిత్రలు చోటు చేసుకోలేకపోవడం, కుల వివక్షకు తార్కాణమన్నారు.

సదాలక్ష్మి కుమారుడు డా. వంశీ తిలక్‌ పుస్తకాన్ని సమీక్షిస్తూ ఆమెకు ఆమె భర్త టి.వి. నారాయణ ప్రథమ గురువు అనీ, ఆమె జీవితంలో అనేక నాటకీయ విజయగాథలు ఉన్నాయని చెప్పారు. కొన్ని విలువలకు కట్టబడిన నాయకురాలనీ, ధనాశకు పోలేదనీ అన్నారు.

తెలంగాణ మహిళా మేధావుల, రచయితల వేదికకు చెందిన డా. టి. దేవకీదేవి మాట్లాడుతూ సదాలక్ష్మి స్త్రీ కావడం వల్లా, అందులో దళిత స్త్రీ కావడం వల్లా, అందులోనూ అట్టడుగు కులంలో జన్మించినందువల్లా రావలసినంత రాణింపు రాలేదన్నారు.

ఉస్మానియా విద్యార్తి జెఎసికి చెందిన బాలలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణా సాహిత్యంలో ఈ పుస్తకం చెప్పుకోతగ్గదన్నారు.

సదాలక్ష్మి భర్త డా.టి.వి.నారాయణ గ్రంథాన్ని సమీక్షిస్తూ ఆమె జీవితం ఒడుదొడుకులతో గడిచిందన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దేవాదాయ శాఖల మంత్రిగా విశేష సేవలందించారని చెప్పారు. కాంగ్రెస్‌పై విసుగుచెంది జగ్జీవన్‌రాం పిలుపు మేరకు 'జనతా పార్టీ'లో చేరిందనీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులయ్యారనీ చెప్పారు. ఆమె రాజకీయ జీవితంలోని ఎత్తుపల్లాలను డా. నారాయణ ఎత్తి చూపారు. ఎప్పుడూ ఆమె వెనుక ఒక పురుషుడు ఉన్నట్లు అనిపించేదికాదనీ, తనకు ఇంకెవరి బలం అక్కరలేని బలవంతురాలనీ ఆమెను కొనియాడారు. ఈ పుస్తకం స్ఫూర్తితో
తనుకూడా తన జీవిత చరిత్రను రాయడానికి పూనుకున్నట్లు చెప్పారు.

పుస్తక రచయిత్రి శ్రీమతి గోగు శ్యామల స్పందిస్తూ దళితులు ఎవరికి వారు తమ చరిత్రలు రాసుకోవాలనీ, అట్లా చేయకపోవడం వల్ల దళిత చరిత్రలో అనేక చారిత్రక అంశాలు చోటు చేసుకోలేదనీ చెప్పారు. తన కుటుంబాన్నీ, శాసన సభనీ ఒకే ధాటిన పెట్టిన ధీశాలిగా సదాలక్ష్మిని కొనియాడారు. ఈ పుస్తక రచనకు ఏడు సంవత్సరాలు పట్టిందన్నారు. పుస్తక రచనకు తోడ్పడిన వారందరికీ - ముఖ్యంగా లలిత (అన్వేషి), హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు చెందిన గీతా రామస్వామికి, సదాలక్ష్మి బంధువులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సభకు లలిత అధ్యక్షత వహించారు.

- నీలిజెండా హైదరాబాద్‌ ప్రతినిధి
నీలిజెండా, పక్షపత్రిక,( సెప్టెంబర్‌ 16-30, 2011) సౌజన్యంతో
సంపాదకులు: బొజ్జా తారకం; అసోసియేట్‌ సంపాదకులు: గనుమల జ్ఞానేశ్వర్‌
వెబ్‌సైట్‌ : www.neelizenda.com


...

Wednesday, September 28, 2011

ఊరు వాడ బతుకు - పుస్తక పరిచయం - అనంత్ ...



యువ రచయిత తొలి రచన ఊరూవాడా బతుకు వెయ్యి ఆత్మలు చెప్పుకున్న కతల కమలం. ఇటీవల తెలుగులో నచ్చిన ఆత్మకతలలో గడియారం రామకృఫ్ణ శర్మ శతపత్రం ఒకటి. గడియారం రామకృఫ్ణ శర్మ తన శ్వేతపత్రానికి ఒక్కో రెక్కా అమరుస్తున్న కాలంలో ఆయనతో నేను చాలా సార్లు ముచ్చటించాను. ముచ్చటించిన ప్రతి సందర్భంలోనూ నేనన్నది ఒకే మాట. అది నాకిప్పటికీ గ్నాపకం.
"
మీరు చరిత్ర రాయడం మానేసి గ్నాపకాలు రాయండి" అని.
"
నీవన్నంత సులభం కాదు వాటిని విడదీయడం" అన్నట్టు నవ్వారు. ఆయన అవేవీ రాయలేదు తన శతపత్రంలో.
మరోసారి కలిసినపుడు మళ్ళీ నిలదీసాను.
"
ఎన్నని రాస్తాం"- అని పెదవి విరిచారు.
"
ఏది రాయకూడదనుకుంటున్నారు మీరు" - అడిగాను
సమాధానంగా అద్భుతమైన అనిక్ డోట్స్ చెప్పారు.
"
రాయండి ఇవన్నీ"- అన్నాను.
"
ఓపిక లేదు. అనుకున్నదే రాయలేకపోతున్నాను"-అని తన పెన్షన్ క్లియరెన్స్ కోసం రాసిన పేద్ద ఉత్తరం ఇచ్చారు.
అలా శతపత్రంలో రెక్కలు తొడగని గ్నాపకాలెన్నో.
ఆ శతపత్రం తర్వాత దేవులపల్లి కృష్ణమూర్తి రాసిన ఈ శ్వేతపత్రం చదువుతుంటే బిగ్ ఫిష్ సినిమా గుర్తుకువస్తుంది.
ఈ రెండు కథల్లాంటి ఆత్మల్లో అదొక్కటే పోలిక.
గడియారం రామకృఫ్ణ శర్మ లోకానికి తన శ్వేతపత్రం సమర్పించక ముందే అతని జీవితానికి వేల రెక్కలు తొడిగిన కమలమ్మ సెలవంటూ వెళ్ళిపోయింది.
తెల్లారిన వేళ పొడిచిన చందమామతో మొదలై కలికి గాంధారి వేళ విరిసిన కమలంతో ముగుస్తుంది దేవులపల్లి కృష్ణమూర్తి గాధ. అక్కడా ఇక్కడా రెక్కల లెక్క మాత్రం వందే. ఆ వందే మా తరమ్ కాదు.


ఇది పితృస్వామ్యం. కాబట్టే నేను సీమవాసిని అయ్యాను. కానీ ననుకన్న గొట్టుముక్కుల సామ్రాజ్యలక్ష్మిది కొల్లాపురమే. తల్లి తెలంగాణ. పిత్రార్జితమే తెలంగాణ.మగ్గాల లడీల మారు మోతల నడుత గడిచింది కోడుమూరులో నా బాల్యం. ఎమ్మిగనూరు నుంచి కోడుమూరు వరకు నేశోళ్ళే నా నేస్తులు. కొత్త సామాజిక బాధ్యత నెత్తిన వేసుకున్నట్టు పోజు కొట్టే చాలా మంది ఆత్మకతాత్మక రచయితల్లా కాకుండా నింపాదిగా, నిమ్మలంగా, సాదాసీదాగా పూసగుచ్చినట్టు గ్నాపకాలను గుర్తుకు తెస్తున్న కొత్త నేస్తమే ఈ దేవులపల్లి కృష్ణమూర్తి.


గూగుల్ సెర్చ్ లో అస్సలు దొరకదీ గుల్ మొహర్ గ్రామం. పేరు అనంతారం. మొదటి పేజీ మొదలు పుస్తకం తిప్పుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో దాసరి రాములు తన లోగొంతుకలో సన్నగా సందమామను పొడిపిస్తాడు. అదీ పొదలపొదల గట్ల మీంచి. అంతే... అక్కడి నుంచి మీకు పలు పాటలు రాసిపెట్టి వున్నాయి ఈ పుస్తకం నిండా.
పాటలే.. పాటల్.
బొట్ల బొట్ల చీర కట్టి మగ్గం ఆడిస్తూ కాపోడు అయిన తన బాయ్ ఫ్రెండ్ ను కలుసుకునేందుకు బోనగిరి వెళ్ళి అక్కడి నుంచి కాకినాడకు రైల్లో వెళ్ళి కలిసే ప్రియురాలి నోస్టాల్జిక్ బాట ఒక పాట.
తనతో నడిపే ప్రతి యవ్వారానికి ఒక రేటు పెట్టే ఒక జాణ పాటలో టారీఫ్ ని తారీఫ్ చేయకుండా ఎలా వింటాం?
నల్లది, పొట్టిది అయిన ఇంకో నల్ల పిల్ల(తమిళ అర్థంలో) -హమ్ కాలే హై తొ క్యా హువా దిల్ వాలే హై-అంటూ ఇంటికి ఇన్ వైట్ చేస్తుంది. ఎంటైస్ చేస్తుంది పాట పాడి...
బుర్రకథ, బాగోతాలు, కలుపు పాటలు, అలుపు రాకుండా రోకటి పాటలు, నిద్ర రాకుండా జాగారం పాటలు, కవ్వించే పాటలు, అణచుకున్న కోర్కెను మనసారా కైగట్టే పాటలు, పాటలే పాటలు... గాజులోడి పబ్లిసిటీ పాటలు, గాజుల కోసం పడిగాపులు కాసే అమ్మాయిల పాటలు...
ఓహ్ కృష్ణమూర్తీ నీ పాటల్....
ఆలస్యంగానయినా పాడుతున్న అరుదైన, అపురూపమైన పాటే ఈ పుస్తకం.
గ్రామాల గురించి మూల మూలనా మూరలతో కొలిచినట్టు, జాడలతో తూచి నట్టు ఈ 70+కృష్ణమూర్తి తన బాల్యం గురించి నిన్న అన్నంత తాజాగా స్వ్కేర్ ఫీట్ బై స్వ్కేర్ ఫీట్ కైకట్టడం రేర్ ఫీట్. ఇది పక్కా రెవెన్యూ వ్యూ. పల్లెల్లో కులాలు, వాటి కింది కులాలు, వాటి ఆశ్రిత కులాలు, వాళ్ళ పని విభజన. శ్రమకు విలువ చెల్లించే ఆచారాల్లాంటి బాధ్యతలూ... చిన్న చిన్న వివరాలు. చీకూ, చింతా, పస్తూ తెలియని బతుకుల పల్లె ఇంతలా తెలిసిన మాతృమూర్తి కృష్ణ మూర్తి.


ఆంధ్రా నుంచి వలస వచ్చిన ముస్లిం అమ్మాయి, పైగా పిల్ల తల్లి; ఆపై చెప్పేది ఝాన్సీ లక్ష్మి బాయి బుర్రకథ. ఆమె కథ చెప్తే అది మెగా సినిమానే. ఈమె గ్నాపకం కృష్ణమూర్తిని చాన్నాళ్ళు వెంటాడింది. ఆ పిల్ల అందం ఒక తియ్యని గ్నాపకం కృష్ణమూర్తికి.
ఇక కుడుముల పండుగకూ కుక్కల కడుపు నిండటానికీ వున్న సింబయాటిక్ సంబంధం ఒక కదిలించే గ్నాపకం. పదో తరగతి పిల్లల పైనే పోలీసు కేసుండే మరో గ్నాపకం. ఓహ్ ఏం కాలం.
బొగ్గు బస్సూ, నీడల తోలుబొమ్మలు ఆడించే బుడగ జంగాలు, ఉర్దూలో మూలికలు అమ్ముకునే వాడూ, అలా అమ్ముకోడానికి తెలుగులో తర్జుమా చేసేవాడూ. ఆ నడి రోడ్డుల దవాసాజ్ ఒక మధుర గ్నాపకం.
ఇంత మామూలు గ్నాపకాలు కూడా ఇంత బలాదూర్ గా బందిస్తాయని తెలియదు నాకు ఇంతక ముందు. కవితలు, కథలు, నవలలు ఎవరైనా రాస్తారు. కానీ, కానీకి కొరగాకుండా పోయాయనుకున్న ప్రతి గ్నాపకాన్నీ అద్భుతంగా రాసే నేర్పు తెలిసిన యువ రచయిత కృష్ణమూర్తికి పేరా పేరానా పడి పదివేల దండాలు.
ఈ ఊరు, ఈ వాడా, ఈ బతుకూ నాలో చెలరేపిన గ్నాపకాలెన్నో.


మూడో తరగతిలో ఆలూరులో ఆరుబయట రాత్రిపూట రెహమాన్ సర్కస్ చూసిన గ్నాపకం. టాకీస్ లో కృష్ణమూర్తిలా నాటక చూడలేక పోయాను. కానీ ఆలూరులో గోవర్థన టాకీసులో చూసిన సింహబలుడు నా తొలి సినిమా గ్నాపకం. కోడుమూరులో పరప్ప జిన్నుకు ఎదురుగా చేలలో తెల్లార్లూ ఆడిన చింతామణి నాటకం కొంచెం సేపే చూసి పడుకున్న గ్నాపకం. నాటకం అయిపోయిన మరుసటి రోజు మల్లె పూవులా మా ఇంట్లో తిరుగుతున్న బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్ర్రిని చింతామణిగా పోల్చుకోలేని గ్నాపకం.
నేషనల్ పేనసోనిక్ టు ఇన్ వన్ లో తొలిసారి కుంతీ విలాపం పద్యాలు, వర విక్రమయంలో కాళింది, కమలల డైలాగులు, సిలోన్ నుంచి మీనాక్షి పొన్నుదురై, గౌరీ మునిరత్నం దయతలచి వినిపించిన పాటలు నా బాల్యపు గ్నాపకాలు.

మరాఠీలో మాట్లాడుకుని , కాఫీ అమ్ముకునే రంగ్రీజోళ్ళను ప్రస్తావిస్తాడు కృష్ణమూర్తి. మా కోడుమూరులో కూడా ఈ రంగ్రీజులుండే వారు. వాళ్ళను మేం రంగరాజులు అనే వాళ్ళం. ఈ కుటుంబాలు కూడా బట్టల వ్యాపారం చేసేవారు. కాఫీ అమ్ముకునే వారు. అయితే షోలాపూర్ నుంచి వచ్చిన వీళ్లను ఖత్రోళ్ళు, దగుడోళ్ళు అనికూడా అనే వాళ్ళం. వీళ్ళలో కొంత మంది కంసాలి పని చేసేవాళ్లు. ఇంకొంత మంది దర్జీ పని చేసే వాళ్ళు.


ఇక సైన్ బోర్డులు, అంగళ్ళమీద రాతలు, గోడల మీద ప్రకటనలు రాసే పెయింటర్ ఎం.హెచ్.కె గురించి కృష్ణ మూర్తి ఆప్యాయంగా రాస్తాడు. ఈ ఎం.హెచ్.కె ఎవరో నాకు తెలియదు. కానీ ఎం.హెచ్.కె లాగే సంతకం పెట్టిన మా మాస్టర్ వి.యకుమార్ నాకు గ్నాపకం వచ్చాడు చదువుతుంటే.


కర్నూలు జిల్లాలో మంత్రాలయం నుంచి శ్రీశైలం వరకు కనిపించే అన్ని సైన్ బోర్డులపైనా ధగధగ మెరిసిన పేరు బై మాస్టర్. మాస్టర్ కుంచె నుంచి ఏ కళాఖండాలూ జాలువారలేదు అప్పటి టాబ్లాయిడ్స్ లో రాసి వార్చేందుకు. మాస్టర్ అని సంతకం చేసే అతని పేరు విజయ్ కుమార్. అతను దళిత క్రిస్టియన్. మాల. టెలిఫోన్ ఎక్సేంజిలో ఆపరేటర్. మా శేషఫణి బాబాయికి బాల్యపు జిగిరి. మాస్టర్ మా జిల్లాలో ఎన్నో పెళ్ళిల్లను ఘనంగా, వైభవంగా, మధురంగా తీర్చి దిద్దిన ఫోటోగ్రాఫర్ కూడా. ఈ ప్రకాశ్ ఆర్ట్స్, ఇజ్రా బోర్డుల గుత్తాధిపత్యం, దాన్ని మింగేసిన ఫ్లెక్సీలు, వినైల్ షీట్లు రాకముందు మాస్టరే మెగాస్టార్ మా జిల్లాలో. దళితుడైనందుకు ఉద్యోగం చాలా సార్లు పోగొట్టుకున్నాడు. క్రైస్తవుడు అయినందుకు కర్నూలు జిల్లా క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటి అనే వన్ మ్యాన్ ఆర్మీని కర్నూలు జిల్లా ఫ్యాక్షనిస్టులకు వ్యతిరేకంగా నడిపి అనేక సార్లు ప్రాణాలు పోగొట్టుకున్నంత పనిచేసుకున్నాడు. మాస్టర్ విజయ కుమార్ దగ్గర నేను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను.
మాస్టర్ సైన్ బోర్డులపై చేసే సంతకం వెనుక ఒక కత వుంది. తర్వాతే అది నాకూ తెలిసింది. బోర్డులపైన బై మాస్టర్ అని చేసే సంతకం లోపల ముగ్గురు కళాకారులు దాగి వున్నారు. ఒకరు మాస్టర్ విజయ్ కుమార్. రెండు- మాస్టర్ కి ప్రాణ నేస్తుడయిన గిడ్డయ్య. మూడు- మాస్టర్ తమ్ముడు సుకుమార్. రెండు సందర్భాలలో మాస్టర్ అన్న సంతకాన్ని విజయ్ కుమార్ కాకుండా తక్కిన ఇద్దరు చేసేవాళ్ళు.


సందర్భం-1
ఆర్డర్లు ఎక్కువై మాస్టర్ మరీ బిజీ అయిపోతే అతనికి ఆసరాగా ఆ బ్రాండ్ నీడను చల్లగా చూసుకునేవారు మిగతా ఇద్దరూ-ఎక్కువ సార్లు గిడ్డయ్య, అప్పుడప్పుడు సుకుమార్.


సందర్భం- 2
మాస్టర్ విజయ్ కుమార్ కు తరచూ ఉద్యోగం ఊడేది. లేదా ట్రాన్స్ఫర్ అయ్యేది. మాస్టర్ కు విపరీతమైన ఆత్మాభిమానం. పైగా ఆర్టిస్టు. ఆపై అనార్కిస్టు. చాలాసార్లు తనపై అధికారులను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద బుక్ చేసి కులం పేరుతో కుళ్ళు జోకులు పేలుస్తూ, బూతులు తిట్టే వాళ్ళకు చెక్ పెట్టేవాడు. ఉద్యోగం వదిలి కోర్టుల చుట్టూ తిరిగి కేసులు గెలిచి కాలర్ ఎగరేసేవాడు. ఉద్యోగం ఊడటానికీ, కాలర్ ఎగరేయడానికీ మధ్య కాలంలో మాస్టర్ మరేమీ చేసేవాడు కాదు. తన తరపు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి తన కేసు ఎలా గెలవచ్చో, ఎందుకు గెలవాలో లాంటి విషయాల్లో తర్ఫీదు ఇస్తూ బైబిల్ కొటేషన్లను అవోకగా అరువు ఇచ్చేవాడు. సరిగ్గా ఇలాంటి క్రాప్ హాలిడేలో గిడ్డయ్య తన స్నేహాన్ని మాస్టర్ సంతకం పెట్టి చాటుకునేవాడు. అంత వరకూ అల్లరిగా తిరిగే సుకుమార్ కూడా ఇల్లు గడవడానికి మాస్టర్ కి ఘోస్టయ్యేవాడు.
మా జిల్లాలో సైన్ బోర్డుల్లో ఇప్పటికీ చెక్కు చెదరని సంతకం, వ్యక్తిత్వం- మా మాస్టర్ ది. కృష్ణమూర్తి గుర్తు చేసుకున్న ఎం.హెచ్.కె నాకు మాస్టర్ ని గుర్తుకు తెచ్చాడు. గ్నాపకాలు చెప్పుకునేందుకే కదా మనందరికీ ఒక నికార్సయిన సందర్భం కావాలి. అది ఇచ్చినందుకు కృష్ణమూర్తికి కృతగ్నతలు. అంతకు మించి ఇలా నా మాస్టర్ విజయ్ కుమార్ గురించి ఈ నాలుగు స్క్రీన్ ప్రింట్లు ఎక్స్పోజ్ చేసుకునేందుకు వెతుక్కోకుండానే ఒక మంచి సందర్భం ఇచ్చినందుకు కృష్ణమూర్తికి నమస్కారాలు.


ఈత రాని తన దోస్త్ రెహమాన్ ని దొరోరి బావిలో కృష్ణమూర్తి ఎలా కాపాడాడో చెప్పినప్పుడు నాదీ ఒక గ్నాపకం చెప్పాలనిపిస్తోంది. నేనూ, శశి, ఖదీర్, ఉమ, విష్ణు, చిట్టి బాబాయ్(సత్య శ్రీనివాస్) తారామతి బిరాదరిపైన గ్రూప్ డాన్స్ వేసి గండిపేట చెరువుకెళ్ళి టెమ్ట్ అయ్యి ఈతకు దిగాం. గండిపేటలో అక్కడ, అప్పుడు ఈత నిషేధం. ఈత రాని విష్ణు నీళ్ళలోకి దిగలేదు. రాకున్నా ఖదీర్, శశి, చిట్టి దిగి తడిసారు. వస్తుందని దిగిన ఉమకు నీళ్ళలోకి దిగిన వెంటనే తెలియని భయమేదో వేసి తడబడ్డాడు. అప్పుడే ఈత కొట్టి ఒడ్డుకు వచ్చాను నేను. అప్పటికే ఉమ నీళ్ళలో ఉక్కిరిబిక్కిరి అయి కసిబిసి అయిపోతుంటే అదంతా ఆట అనుకుని పెద్దగా స్పందిచలేదు ఒకే ఒక్క ఈతగాడినైన నేను. గండిపేటలో ఉన్నట్టుండి లోతు ఎక్కువవుతుంది. ఉమ మునిగి పోతున్నాడు. అరుస్తున్నాడు. అదంతా ఆటలో భాగమే అనుకున్నాం అప్పటికీ అందరం. గారడీ వాడు కత్తి సాము చేస్తూ పొరపాటున కత్తి నెత్తికి తగిలి తల తెగి పడినా చప్పట్లే కదా కొడతాం. అలాగే వుండింది మాకూ ఆ రెండు క్షణాలు. కాని విష్ణుకు విషయం అర్థం అయిపోయింది. నేను వెంటనే నీళ్ళలోకి దూకి ఉమను గడ్డకు తీసుకువచ్చాను. ఉమ ప్రాణాలు కాపాడి హీరోనయ్యాను. ఈ గ్నాపకాన్ని నాలో ట్రిగ్గర్ చేసింది కృష్ణమూర్తి ఫ్రెండ్ రెహమానే. ఇవన్నీ ఇక్కడ అప్రస్తుతమే అని అనిపించవచ్చు. కానీ ఇలాంటి గ్నాపకాలను తీసి పారేయలేం. చెరిపేయనూ లేం. గొప్ప మలుపులూ, మైలురాళ్ళూ కాకపోయినా ఇవన్నీ బతికిన క్షణాలే. ఈ ఎరుక తన పుస్తకమంతా పరిచిన కృష్ణమూర్తికి సవినయ సలాములు.


ఇక గాలి పతంగుల గ్నాపకం. ఓహ్! ఈత తర్వాత తలచుకుంటేనే నా అణువణువూ పుకించేది గాలిపటాలకే. ఒక్క కోడుమూరులో వున్నన్ని గాలిపటాలు మళ్ళీ నేనెక్కడా చూడ్లేదు. గాలి పటం అన్న పదం కర్నూలు టవున్లో కూడా ఏకవచనమే. అంతా ఒకే రకం. ఆకారం చతురస్రం. టెక్స్ట్ బుక్కుల్లో బుక్కయిన ఈ గాలిపట విశేషం పేరు మా కోడుమూరులో బుడ్దంగి. ఇదే కాక ఇంకా బుర్ బుర్ పటాకి, నక్షత్రం పటాకి, మనిషి పటాకి, చామంతి పటాకి, సూపర్ కాయితం పటాకి..... ఇవన్నీ ఎంతెంత పెద్దవో... ఎంతెంత ఎత్తుల్లో ఎగిరేవో. వీటికి సరిపడా తోకలు కట్టడం, ఎగిరేందుకు చక్కని సూత్రాలు వేయడం ఒక సైన్స్... ఒక కళ. అందకే గాలిపటానికి బహువచనంలా వుండేది మా కోడుమూరు ఆకాశం. అదీ సంక్రాంతి ముందు. ఎక్కడా మాంజా అన్న మాట కానీ , కటీ అన్న పదం కానీ తెలియని స్వచ్ఛమైన గాలిపటాల ప్రదర్శన కోడుమూరు. పరుల గాలిపటాలను కటీ చేసి చప్పట్లూ, కేరింతలూ కొట్టడం కోడుమూరుకు తెలియదు. నేను చూడనూ లేదు. ఎగరేసిన గాలి పటానికి క్యాండిల్ కట్టి పైకి పంపించి ,రాత్రంతా గుంజకు కట్టేసి పొద్దునే పళ్ళు కూడా తోముకోకుండా ఇష్టమైన నేస్తం ముఖం చూసినట్లు మురిసిపోవడం ఒక్కటే తెలుసు మాకు. గాలిపటాలు అవంతటవే ఏ అవాంతరమో సాంకేతిక లోపమో వచ్చి తెగిపోవాల్సిందే. తెంపడం తెలియని బాల్యం అది. అలా తెగిపోయిన గాలిపటాలన్నీ మా సద్ద సేన్లో దొరుకుతాయి. అందమైన వేర్వేరు ఆకారాల్లో సగర్వంగా, సమున్నతంగా గాలిపటాలను ఎగురవేసేది ఎక్కువగా నేసోళ్ళే. అయితే మేదరోళ్ళ దగ్గర ఎలాంటి బొంగు బద్దలు తెచ్చుకోవాలి, వాటిని ఎలా కోయాలి, ఎలా కట్టాలి, ఎలా కాయితాలు మూయాలి, ఎలాంటి సూత్రమేసి బుర్ బుర్ మనిపించాలి అన్న మర్మాలను నాకు నేర్పింది మాత్రం మా నాయనే. నేసోళ్ళ గాలిపటాల నైపుణ్యానికి సవాల్ గా వుండేది మా నాన్న పనితనం.


ఈ పుస్తకం ఒక మంచి village ethnography study కి మంచి నమూనా. కేంద్రీకృతకం అయిపోయిన విశ్వవిద్యాలయాల్లోని ఏ కల్చరల్ ఆంత్రొపాలజీ విభాగంలోని ఏ ఎం.ఎన్.శ్రీనివాసన్ లాంటి బోధకులకూ బోధపడని, తెలియని రాత పద్ధతి కృష్ణమూర్తిది. గోల్డు మెడలల్లో వేసుకునే ఆ విద్యార్థులు పొందాల్సిన తక్షణ తర్ఫీదు ఇదీ. టేకింగ్ సైడ్స్ల్ లో చాలా dispassionate గా వుంటూనే చెప్పే పద్ధతిలో విపరీతమైన passion కురిపిస్తాడు కృష్ణమూర్తి. Anthropology లోని observer-participant method కు applied అచ్చుపోత ఈ రచన. మహా ఘటనలను కూడా చాలా మామూలుగా matter-of-fact గాచెప్పి పాఠకులకూ. ఘటనకూ మధ్యవర్తిత్వం, సూత్రధారకత్వం (ఒక ఎరుకతో) మానిన అరుదైన రచనా శైలి ఇది. పాఠకుడికి ఎలాంటి దిశానిర్దేశం అవసరం లేదిలాంటి చారిత్రక జీవిత ఘటనా సమాహారాన్ని చెప్పుకొచ్చేటపుడు. పాఠకులు వట్టి చవట దద్దమ్మలనుకునే మేధావి రచయితలకు నివాళి ఈ శైలి. ప్రతి వచనం పుస్తకం నిండా తాజాగా, చాలా నేల బారుగా, నిటారుగా, సాదాసీదాగా కృష్ణమూర్తిలా పాండిత్యంతో ఎలాంటి దుప్పటి పంచాయితీలు లేకుండా సాగిపోతుంది. మాట అలవోకగా కదులుతుంది.
ఇది రచయితకు రమారమి 19 ఏళ్ళు నిండినపుడు ఆగిపోయే గ్నాపకాల కదంబం. అసలు 19 ఏళ్ళకు ఇంత విస్తారమైన జీవితం, అనుభవం, విపులమైన గ్నాపకం ఎలా సాధ్యం? ఎవరైనా ఎలా వడుకుతారిలా?


కొన్ని గ్నాపకాలు మరిచిపోవడానికి గుప్పెడు గుళికల్ని మింగుతుంటాం. ఇంకోసారి గుర్తు తెచ్చుకోడానికి పిడికెడు గ్నాపకాలు కూడా మిగిలి వుండవు వెనక్కి చూసుకుంటే. కొన్నింటిని రబ్బరు పెట్టి అదేపనిగా చెరిపేసుకోవాలనీ అనుకుంటుంటాం. మరి కొన్నింటిని ఆల్కహాలిక్ డిమెన్షియాలో, ఏజింగ్ అమ్నీషియాలో, అల్జమీర్ రోగాలో, ఏ గాలో మింగేస్తున్న ఈ కాలంలో ఇసుకలో మేలు రకం రేణువులను పోట్చుకోగల నిపుణతతో గతాన్ని సైకత శిల్పంగా మలిచే ఈ మెలకువ ఎప్పటికొస్తుందో నా మటుకు నాకు.
కతకూ, నవలికకూ, నవలకూ- అసలు మనకు తెలిసిన సకల కాల్పనిక రచనా స్వరూపాలకూ అంతుపట్టని , లొంగని ఇట్లాంటి పోగులు పెట్టే సృజన శైలులకు మనం నిజంగా రుణపడి వుంటాం కథా.

-

తన బ్లాగులో రాసుకున్న ఈ సమీక్షను పునర్ముద్రించేందుకు అనుమతించిన అనంత్ గారికి కృతజ్ఞతలు. వారి ఇతర రచనలకోసం ...ఇక్కడ ... క్లిక్ చేయండి )


http://anantamu.blogspot.com/2011/09/blog-post_26.html

ఊరు వాడ బతుకు ఈ పుస్తకం గా కూడా లబిస్తుంది. ఈ పుస్తకం కోసం ... ఇక్కడ ... క్లిక్ చేయండి

ఊరు వాడ బతుకు
- దేవులపల్లి కృష్ణమూర్తి
ముఖచిత్రం, బొమ్మలు : లక్ష్మణ్‌ ఏలే
మొదటి ముద్రణ: మే 2009
136 పేజీలు, వెల: రూ.40

..

ప్రతులకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 067
ఫోన్‌ : 040 2352 1849
ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com

..


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌