Saturday, August 24, 2013

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం : డా. గోపీనాథ్
భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: "నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం" : డా. గోపీనాథ్ పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన ముందుమాట :

ముళ్లదారి
                డాక్టర్‌ గోపీనాథ్‌ తన పుస్తకానికి ముందుమాట రాయమనగా నేను ఆశ్చర్య పోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలక పక్షాల లోతుపాతులు ` కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం ` విశ్లేషణ నాలాంటివాడికి అందనిది.
                అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్ల కంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి ` ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో ` ఒంటరిగా అనుభవించిన వొత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
                గజిబిజిగా అస్తుబిస్తుగా, వెనుకా ముందులుగా ` కాలువలుగా, వాగుల్లాగా ప్రవహించిన వాక్యాల లోతుల్లో తడి ` నా కళ్లల్లోకి ప్రవహించి.......
                ఈ పుస్తకం చదవడానికి చాలా రోజులు పట్టింది. ఇది రొమాంటిక్‌ ఫిక్షన్‌ కాదు. కథ కాదు ` కవిత్వం కాదు ` భయంకరమైన కఠోరవాస్తవం. రాసిన వాక్యాల వెంట, రాయని మరెన్నో తెలిసిన ఘటనలు చుట్టుముట్టేవి. గోపి పల్లె బతుకు. మోకాలుమంటి దిగబడే దారులు, అడపాదడపా స్కూలుకు వచ్చే పంతుళ్ళు, ఊరి కొట్లాటలు, పసి మనుసుల్లో ఎగిసిన, కలతపెట్టిన ఘటనలు....  పశువులు, పంటలు, ఎండా, వానా, చలి, చేపలు, కన్నీళ్లు, కష్టాలు ప్రతిదీ ` గుండె గొంతుకలోన గుబగుబలాడినయ్‌.
                పల్లె ` అందునా భారతీయపల్లె ` నిరంతర యుద్ధ క్షేత్రం కదా! పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన ` ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు ` అలాంటి ఒంటరితనాల్లోంచి  ` సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం...
                భూమి కోసం, తాము సృష్టించిన సంపద కోసం ప్రజలు పోరాడుతున్న వేల సంవత్సరాల యుద్ధభూమి పల్లె ` అయినా మాయోపాయాలతో సంపద పంచబడని, దోపిడి చెక్కుచెదరని, స్థితిలో....... సుదీర్ఘ యుద్ధాల్లో కూడా ` తమ సృజనాత్మకతను, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న ` తలవంచని కింది కులాల వీరయోధుల కుటుంబంలో నుండి సాగిన జీవనయానం ` ఆయన యుద్ధ బీభత్స అనుభవాలు నన్ను కకావికలు చేశాయి. ఆయనలాగే నాకు ఆ పల్లె కలలు,
నెత్తుర్లు చిమ్మంగా కొట్టుకున్న కలలు...... సుదీర్ఘ యుద్ధాల పీడకలలు, పెనుగులాడినకొద్దీ మునుపటికన్నా లోతుగా దినదినం యుద్ధరంగంలోకి నెట్టబడుతున్న పల్లెలు `. అడవులు` ఎక్కడేమిటి అన్ని రకాల సంపద, వనరులు, సుడిగాలిలా ` ఎలుగడిలా పరివ్యాప్తమౌతున్న యుద్ధరంగంలో నిలబడి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఈ పుస్తకం....
                రెండు ప్రపంచ యుద్ధాలలో నలిగిన బ్రిటన్‌ అనేక రకాల లోపలి`బయటి కారణాల రీత్యా భారతదేశంలో అధికార మార్పిడి నిర్వహించింది. ఫలితంగా అగ్రకుల భూస్వామ్య, దళారులకు అధికార మార్పిడి ద్వారా రాజ్యాధికారం చిక్కింది. అప్పటికి రష్యాలో ప్రజలు శ్రామికవర్గ పార్టీ నాయకత్వంలో పోరాడి విజయం సాధించారు. సోషలిస్టు మాయోపాయాల నెహ్రూ మార్కు సోషలిజం ` గాంధీ హరిజనోద్ధరణ ` వీటన్నటికి భిన్నంగా అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపర్చిన కింది కులాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ` ఏ రకంగానైతేనేమి ` అనివార్యంగా అగ్రకుల, రాజుల, భూస్వాముల కబంధ హస్తాల్లో వేల సంవత్సరాలుగా చీకటి కొట్టాలుగా మగ్గుతున్న గ్రామాల్లోకి చిరుదీపంలాగా చదువు రంగ ప్రవేశం చేసింది. సర్వసంపదలు సృష్టించి ఆగర్భ దరిద్రంతో ఉత్త చేతులతో మిగిలిన కింది కులాల వారికి, తమ చుట్టూ నివసించే మనుషుల్లోకి కిటికీ తెరిచినట్టయింది. పల్లెల నుండి పట్నాలకు దారులు తెరుచుకుని పల్లె జనంలో చలనం మొదలైంది. అలాంటి బడుల్లో కూడా మొదట పల్లెల్లో బడి సౌకర్యాన్ని అందిపుచ్చుకుని ఎదిగినవాళ్లు ఎక్కువగా అగ్రకులాలవాళ్లే. అదివరకే గ్రామంలో  అంతోయింతో సంపద కలిగినోళ్లే. ఇప్పటికి కూడా కింది కులాల నుండి మరీ ముఖ్యంగా అంటరాని కులాల నుండి అనేక గండాలు దాటుకుని పెద్ద చదువులు చదువుకుని నిలదొక్కుకునేది ఒక్క శాతం మాత్రమే ` నూటికొక్కరు.
                గ్రామాల్లోని మిగతా 70 శాతం ప్రజలు నిత్య దరిద్రంతో ` ఉన్నవి పోగొట్టుకుని ` అప్పటి నుండి ఇప్పటి దాకా యుద్ధరంగంలో హింసల కొలిమిలోనే బతుకుతున్నారు. అయితే ఏదో కారణం చేత చంపబడడం ` లేకపోతే చిన్న వయసులోనే చనిపోవడం నిత్యకృత్యం.  ఇలాంటి చిక్కుదారులగుండా కోస్తాంధ్ర, తెలంగాణా సరిహద్దుపల్లె అయ్యోరిగూడెంనుండి మొదలైన గోపి నడక మామునూరు హైస్కూలు చదువు ` విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్‌, ఉస్మానియాలో మెడిసన్‌, కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ Ê టెక్నాలజీలో డిఎం కార్డియాలజీదాకా సాగింది. ఒక పల్లెటూరి దళిత పిల్లవాడి కత్తుల వంతెన మీద ప్రయాణం. చావుకు మిల్లీమీటరు దూరంలో ఎన్నిసార్లో చుట్టుముట్టబడి ` తన సహచరులెందరో కూలిపోయినట్టు కూలిపోవాల్సిన వాడే. బహుశా నిత్యం జ్వలిస్తూ ఈ విధంగా మన ముందు నిలబడ్డ గోపీది సాహసయానమేకాక ఒక అపురూప ఘటనే.....
                గోపి పల్లె నుండి బయటపడిన కాలం ` అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మాయ బట్టబయలైన సమయం. నెహ్రూ ప్రవచించిన సంక్షేమం `గాంధీ హరిజనోద్ధరణ కానరాలేదు. పేదలు మరింత పేదవాళ్లయ్యారు. అంబేడ్కర్‌ ప్రవచించిన రాజ్యాగంలోని సామాన్యుల హక్కులు కాలరాచివేశారు.... తెలంగాణాలో 1969 వరకు దళిత కులాల పేద పిల్లలు గోపిలాగే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవితమొక అగ్నిగుండమని గుర్తించారు. ప్రపంచవ్యాపితంగానే ఇది ఒక కోపోద్రిక్త కాలం. దేశవ్యాప్తంగా రెక్కవిప్పుతున్న రెవల్యూషన్‌ నక్సల్బరీ కొత్తదారిలో యాంగ్రీ యంగ్‌మెన్‌ సమస్తాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని మార్చాలని బయలుదేరిన యువకులు... 1969లో మొదలైన తెలంగాణా విద్యార్థుల ప్రత్యేక తెలంగాణా పోరాటం ` 1972 వరకు 370 మంది విద్యార్థుల హత్యతో............. మరోమారు తెలంగాణా రక్తసిక్తమైంది. అప్పటికే తెలంగాణా సాయుధపోరాటం చెల్లాచెదురైన అనుభవం తెలంగాణా ప్రజలకున్నది. ఎప్పటిలాగే ప్రజలు తమ బిడ్డలను పోగొట్టుకుంటే ` మోసగాళ్లు అధికారాన్ని, ఆస్తుల్ని పంచుకున్నారు. కాని మానని గాయం మాటేమిటి? అది లోలోపల సలిపింది. రగిలింది. 1974 వరకు తెలంగాణాలో అన్ని యూనివర్సిటీల్లోని ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని ` విప్లవ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో ఏకమయ్యారు. రాడికల్‌ విద్యార్థి సంఘంగా ఏర్పడి రోడ్‌ టు రెవల్యూషన్‌రచించుకున్నారు. ఉస్మానియాలో జార్జిరెడ్డిని మతవాదులు చంపేశారు. అగ్గిరాజుకుంది. అత్యవసర ప్రకటన తర్వాత దేశమే పెద్ద జైలు అయ్యింది. నిర్బంధంలో జైళ్లు కొత్త రకం పాఠశాలలయ్యాయి. చరిత్రను, రాజకీయాలను, తత్వశాస్త్రాన్ని, ఉత్పత్తి, పంపకం, పెట్టుబడి భూమిక గురించి, భూమి గురించి తెలుసుకున్నారు.
                ఎమర్జెన్సీ ఎత్తివేత తరువాత రాడికల్‌ విద్యార్థులు రోడ్‌ టూ రెవల్యూషన్‌లో భాగంగా తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపి 1978 ఫిబ్రవరిలో రాడికల్‌ విద్యార్థి సంఘానికి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్‌ (ఆజాద్‌) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
                ప్రపంచంలోనే మొదటిసారిగా ` విద్యార్థులు గ్రామాలకు తరిలారు. అదివరదాకా స్కూళ్లు, కాలేజీల్లో కల్లబొల్లి చదువుల స్థానే ` వాళ్ల గ్రామాలను, ప్రజల జీవితాన్ని మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేశారు. ప్రజల దగ్గరికి విద్యార్థులు వెళ్లడమనే ప్రక్రియ ఉత్తర, దక్షిణ తెలంగాణాల్లోనే కాదు` కోస్తాలో, రాయలసీమలో ఒక ఉప్పెనలాగా సాగింది.
గ్రామాలల్లోని ప్రజల స్థితిగతుల గురించి, భూ వివరాలు, కులాలు, సామాజిక సంబంధాలు, పంటలు, నీటి వసతులు, కూలిరేట్లు, రవాణా సౌకర్యాలు ` వైరుధ్యాలు తదితర అనేక విషయాల గురించి కొన్ని లక్షల పేజీల సమాచారం సేకరించారు. ఇట్లా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకుని ` విద్యార్థులు ఈ పరిస్థితులు మార్చే        క్రమంలో ` మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
మొదట కూలిరేట్ల పెంపు, పాలేర్ల జీతాల పెంపు, బంజరు, షికం తదితర ప్రభుత్వ భూముల ఆక్రమణ, పంచాయతి పద్ధతులను అగ్ర కులాల నుండి కింది కులాలకు మార్పు ` అంటరాని తనానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలు తీసుకున్నారు.
                గ్రామాల్లో రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయడానికి రాడికల్‌ విద్యార్థులు కృషి చేశారు. ఆటపాట నేర్చుకున్నారు. నిజమైన ప్రజాకళాకారులై వందల సాంస్కృతిక ప్రదర్శనలు గ్రామాల్లో, చిన్నచిన్న పట్నాల్లో ` బీదలపాట్లు, భూమి బాగోతంలాంటి వీధి నాటకాలను జననాట్యమండలితో కలిసి ప్రదర్శించారు. లోకల్‌ విషయం, స్థానిక భాషలో నిజమైన మనుషుల ఆహార్యంతో ప్రజల్లో కొత్త ఆలోచనలకు, ఐక్యతకు ఆచరణకు ఇవి కారణమయ్యాయి. విద్యార్థుల ఇలాంటి సాహసోపేత ఆచరణకు సంబంధించి ఇంతవరకు ఎక్కడా వివరంగా రికార్డు కాలేదు.
                భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా పోరాటాలకు తెరదీసిన ఒక గొప్ప మలుపుకు కారణమైన విద్యార్థులకు గోపి నాయకుడు. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల నిర్మాణం జరిగి, కృార భూస్వాములతో తలపడ్డాయి. గ్రామంలోని అమానవీయ పద్ధతులైన, వెట్టి, కులవివక్షత, అంటరానితనం, అక్రమ గ్రామపంచాయతి పద్ధతి, కూలి రేట్ల పెంపకం, బంజరు, షికం భూముల ఆక్రమణదాకా అనేక విషయాల్లో పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. ఈ ఘర్షణలు ముదిరి నిర్బంధం, పోలీసుల రంగ ప్రవేశం, అరెస్టులు, కోర్టు కేసులతో పల్లెలు అట్టుడికాయి... దొరలను ప్రజలు సాంఘికంగా బహిష్కరించారు. దొరలు గడీలు వొదిలి పట్నాలకు పారిపోయారు. దొరలు అనేకరకాలుగా ఆక్రమించిన భూములను ప్రజలు దున్నుకున్నారు. జగిత్యాల జైత్రయాత్రతో ప్రారంభమైన ఈ పోరాటాలు దావానలంలా అన్ని జిల్లాలకు వ్యాపించాయి. ఫలితంగా కల్లోలిత ప్రాంతాల చట్టం వచ్చింది. విద్యార్థులు అనేకమంది అజ్ఞాత జీవితంలోకి వెళ్లి పూర్తి కాలపు విప్లవకారులుగా మారడం, పోరాటాలు పల్లెల నుండి సింగరేణి గనుల్లోకి, సాయుధ దళాల నిర్మాణంతో అడివిలోని ఆదివాసుల్లోకి విస్తరించాయి. ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు. కోస్తా, రాయలసీమ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించి వేలాది విద్యార్థులు పాల్గొన్న ఒక గొప్ప ఉద్యమంలోని అనేక ఆటుపోట్లు, అరెస్టులు, ఎన్‌కౌంటర్లు, ఈ సరికొత్త ఆరాట పోరాటాల మదింపు, కొనసాగింపు చేసి ముందుకు నడిపించిన నాయకత్వంలో గోపిది ప్రధాన భూమిక. గోపీ తన పుస్తకంలో తను ఎంచుకున్న మార్గంలో రాశారు. కాని ` కీలకమైన ఘట్టాలను, మలుపులను, విభిన్న ధోరణులు ` వాటిని సమన్వయపరిచిన తీరు ` ముఖ్యంగా ఆ వొత్తిడిని, వేడిని, స్పర్శను అనుభవించాడు గనుక అలాంటి అపురూపమైన విషయాలు గోపియే రికార్డు చేయవల్సి ఉన్నది. ఉద్యమాలు అభివృద్ధి చెందే క్రమంలో జరిగిన టూలైన్‌ స్ట్రగుల్‌ గురించి, గ్రామీణ సంబంధాలలో కులం పాత్ర గురించి ` అంతవరదాకా రాజ్యమేలిన రొమాంటిక్‌ భావవాద అంచనాల నుండి, వాగాడంబరం నుండి, ఉద్యమాలను భూమార్గం పట్టించిన అతి కొద్ది మందిలో గోపి ఒకరు. 1982లో మద్రాసులో నేషనాలిటీ క్వశ్చన్‌ ఇన్‌ ఇండియామీద అఖిల భారత విద్యార్థి సెమినార్‌ ఏర్పాటు మొదలు విద్యార్థి ఉద్యమం అఖిల భారత స్థాయిలో ఏర్పాటుదాకా రాజ్‌కుమార్‌, గోపిలాంటివాళ్లు పూనుకుని చేసినవి. గోపి 1978 నుండి 1982 దాకా అనేక మహత్తర పోరాటాలు చేసిన రాడికల్‌ విద్యార్థి సంఘానికి నాయకుడుగా ఉన్నాడు.
                ఆ ఉప్పెన ప్రవాహంలోంచి గోపి డాక్టర్‌గా తను ప్రజలతో మమేకం కావాలనుకుని బయటపడి అనేక అడ్డంకులు ఎదుర్కొని ఒంటరి పోరాటంతో దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న దళిత కార్డియాలజిస్టుగా ఎదిగారు.... అయినా మళ్లీ అనేక పోరాటాలు ` కులాలతో, వర్గాలతో ` కుట్రలు, కుతంత్రాలతో నిండి ఉన్న అంతరాల సమాజంలో అదే అశాంతి. అదే కత్తి అంచు మీద ప్రయాణం.......
                రాజ్యాంగం ప్రవచించిన హక్కులను, ఎన్నికల రాజకీయాలను, భారత దేశంలోని కింది కులాలవాళ్లు చైతన్యవంతంగా ఉపయోగించుకుంటే దళితులు రాజ్యాధికారం చేపట్టగలరనే ఆలోచనలతో దివంగత కాన్షీరాం బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)తో కలిసి గోపి ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీల నాయకునిగా పనిచేశారు.
                పాలకవర్గాలల్లోని అంతర్గత వైరుధ్యాల మూలంగా అప్పుడప్పుడు అలాంటి అద్భుతాలు దళిత కులాలకు  రాజ్యాధికారం రాజ్యాంగం మేరకైనా జరుగుతాయామోకానీ అవి తాత్కాలికమే. సర్వసంపదలు చేజిక్కించుకున్న  దోపిడీ అగ్రవర్గాలు అధికారం పేద ప్రజలకు అంత సుళువుగా ఇవ్వరని గోపికి తెలియంది కాదు. అయినా అధికార రాజకీయాలను అధ్యయనం చేశాడు. బిఎస్పీ ఉత్తర్‌ప్రదేశ్‌కే పరిమితమవడం మూలంగా ` అప్పుడప్పుడే సాంప్రదాయక కాంగ్రెస్‌ రాజకీయాల స్థానే రంగంలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితిలాంటి పార్టీలలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అన్ని పార్టీలలో నాయకత్వ స్థానంలో ఉండి ఆయా పార్టీలలో కొనసాగే ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు కుతంత్రాలు, డబ్బు, ద్వంద్వ ప్రమాణాలతో ఇమడలేక ` సరిపడక ` జ్యోతిరావుఫూలే, అంబేడ్కర్‌ అధ్యయన వేదిక, హాస్పిటల్‌ నిర్వహణలో ` తను నమ్మిన విలువల కోసం ఎంచుకున్న మార్గంలో సాగిపోతున్నారు.
                తన తరం మనుషులందరిలాగే ` ఒకసారి ప్రజల పక్షం అనే ముళ్లదారిలోకి ప్రవేశించినవారు ` సామాజిక శాస్త్రాలైన మార్క్సిజాన్ని, అంబేడ్కర్‌ను, ఫూలేను తెలుసుకున్నవారు ` ఎక్కడున్నా మండుతూనే ఉంటారు. అసమ విషమ తలకిందుల ప్రపంచంతో నిరంతరం తలపడుతూనే ఉంటారు. తనకు తన చుట్టూ ఉన్న ప్రపంచంతో అంతర్‌ బహిర్‌ యుద్ధమే ఈ పుస్తకం.
                అయితే ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి ` నిరంతరం అవమానపరిచే ` గాయపరిచే ` హత్య చేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా ` మన సాహిత్య వాతావరణానికి అలవాటు లేని పద్ధతిలో ` ఇలాంటి పుస్తకం రాయడం ` ప్రచురించడం ఒక సాహసమే ` ఆక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ` ప్రపంచ ప్రజలందరు
తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి ` ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది......
                ఈ పుస్తకంలో ఎక్కువగా ఫోకస్‌ చేసిన విషయం ` ‘కులం పాత్ర’. రాష్ట్రవ్యాప్తంగా కులాల పొందిక ` ఘర్షణలు, కులాల ఆర్థిక పరిస్థితులు, కుల రాజకీయాలు ఒకే తీరుగా లేవు. ఈ నలుబై సంవత్సరాల ప్రజా పోరాటాలు అన్ని రంగాలల్లో వేగవంతమైన మార్పులు తెచ్చిన విధంగానే కులాల విషయంలో అనేక మార్పులు తెచ్చాయి. గోపి జీవితమే ఇందుకుదాహరణ. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ పొందుపర్చిన హక్కుల గురించిన బహుజన కుల సంఘాలన్నీ సంఘటితపడి పోరాడుతున్నాయి. అధికారంలో తమ వాటా గురించి డిమాండు చేస్తున్నాయి. అధికారంతోపాటు ఉత్పత్తి వనరులైన భూమి, పరిశ్రమల్లో కూడా తమ హక్కు కోసం ` అంతిమంగా పీడిత శ్రామిక కులాల రాజ్యాధికారం కోసం, విముక్తి కోసం తమ పోరాటాలకు పదును పెట్టవలసి ఉన్నది. ఇలాంటి ఆవశ్యకత గురించి గోపి చర్చించారు. కింది కులాలతో పై కులాలు చేరడం అతి తక్కువేగాని ` అమానుషమైన, హేయమైన అంటరానితనం చాలా వరకు తగ్గింది. కరీంనగర్‌, ఆదిలాబాదు జిల్లాల్లో రైతుకూలి సంఘాల ఆవిర్భావం ` అందులో కింది కులాలైన మాదిగ, మాలలు సమీకరించబడడం జరిగింది. గ్రామాల్లో భూస్వాముల అన్ని రకాల దోపిడీ, పెత్తనాలను ఎదిరించడంతోపాటు కుల వివక్షను ఎదిరించడం కూడా ఒక పోరాట రూపమైంది. అనేక గ్రామాలల్లో బతుకమ్మ, పెళ్లిళ్ళలాంటి సామూహిక సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని కులాలవాళ్లు కలిసిపోయి బంతి భోజనాలు చేశారు. నిజానికి మన రాష్ట్రంలో గత నలుబై సంవత్సరాలుగా జరుగుతున్న ప్రజా పోరాటాలు ` అవి అంటరాని కులాలల్లో తెచ్చిన మార్పుల గురించి అధ్యయనం చేయాల్సిన విషయం.
                భారతదేశంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఫ్యూడల్‌ ఉత్పత్తి విధానంతోపాటు సర్వసంపదలు ఉన్నత కులాలు చేజిక్కించుకోవడం ` సర్వసంపదల సృష్టికర్తలైన కింది కులాలు, శక్తివంతులై ఉండికూడా అల్ప సంఖ్యాకులైన పై కులాలతో చేసిన పోరాటాల చరిత్ర ` భూమి కోసం, భుక్తికోసం సుదీర్ఘంగా, సంక్లిష్టంగా ఇప్పటిదాకా కొనసాగుతున్న పోరాటాలను గోపి కలగన్న విధంగా ` ఇలాంటి పోరాటాలు వేగవంతమై విజయం సాధించడానికి ` కులం అడ్డంకిగా ఉన్నది. కింది కులాల చైతన్యవంతమైన తిరుగుబాట్లు ` నేర్చుకున్న గుణపాఠాలు, ఇవ్వాళ ప్రజా పోరాటాల్లో కింది కులాల పాత్ర గురించి సరైన విశ్లేషణ జరుగాల్సి ఉన్నది. అయితే ప్రజా ఉద్యమాలు పాత సాంప్రదాయిక బ్రాహ్మణ భావజాలంతో తలపడి, పోరాడి దాని నుండి బయటపడి, నిలదొక్కుకొని ముందుకు సాగుతున్నాయనేది కూడా ఒక వాస్తవం.
                గోపిలాంటి కొద్దిమంది వర్గపోరాటాల చరిత్ర ` కులం నిర్వహించిన భూమిక, విధ్వంసక పాత్ర, గురించి పట్టుదలతో అధ్యయనం చేస్తున్నారు. అలాంటి కృషిలో భాగంగానే ఈ పుస్తకం వెలువడుతున్నది.
                మర్యాదస్థుల, పైకులాల రచనాపద్ధతి కాదిది. మట్టిలోంచి లేచిన రాయిలాంటిది. నామట్టుకు నేను ` మర్యాదపూర్వకమైన, తానొవ్వక, నొప్పించక, తప్పించుక తిరిగే రచనలు, సాహిత్యం విరివిగా చదివిన, వాస్తవికతను చర్చించడంస్వీకరించడం తక్కువైన సాహిత్య వాతావరణంలో గోపి అస్తుబిస్తు వాక్యాలకు, కటువైన వెంటాడే కంఠస్వరానికి బిత్తరపోయాను, కకావికలయ్యాను. యుద్ధరంగ స్థలం ` మారుమూల ప్రాంతాల్లోకి ` అదృశ్య, అంతుతెలియని అరణ్యాల్లోకి ` భూమి పొరల్లోకి విస్తరిస్తున్నది..... కన్నీళ్లంత స్వచ్ఛంగా, నిలువెల్లా వణికిపోయే ` ఉన్నకాడ ఉండనీయని, దుర్మార్గపు తరతరాల భూస్వామ్యపు మర్యాదస్థుల సాహిత్య విధ్వంసంలోంచి ` నేలల్లోంచి ఈ దుమ్ము ఎగిసి కమ్ముకోవాల్సిందే. నిజానికి కాల్పనిక కథలు, నవలలు, కవిత్వమంత సుందరమైంది కాదీ రచన.
                నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాదిగ, మాలలతో కలసి బతుకుతున్నా ` వాళ్ల సౌందర్యవంతమైన ఆచరణ నుండి బతకడం నేర్చుకున్నా ` అలాంటి లేమిలో ` మారుమూల పల్లెటూర్లో బతికినా ` కుల వివక్షతను బతుకు పొడుగంతా అన్ని చోట్ల ఏదో రూపంలో ఎదుర్కుంటున్నా కూడా ` అంటరానితనం జ్వర తీవ్రత నాకు తాకలేదు. అయితే అన్నీ చేసి, సంపద, జ్ఞానం ప్రపంచానికిచ్చి అవమానాలు పొందితే ఎట్లా
ఉంటుందో అనుభవంలోకి రావడం ` దాని కోసం పెనుగులాడటం  ద్వారా ఇక్కడ నిలబడి ` ఈ పుస్తకాన్ని ఇందులోని జ్వరతీవ్రతను ముట్టుకోవడం ద్వారా ` ఈ నాలుగు మాటలు రాయ ప్రయత్నించాను.
                ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతి స్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోడం. రెండోది వాయిలెంటు రియాక్షన్‌. ఇంతదూరం నడిచి కూడా ` గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు ` తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు ` మేధావిగా గుర్తింపు పొందవచ్చు ` శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి  సంబంధించిన సమస్య. లొంగిపోవడం ` పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడి సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం....  అయినా పోరాటం మనిషి తనంతట తాను ఎంచుకునేది కాదు. అది అనివార్యంగా రుద్దబడేది. అత్యంత విషాదం ప్రపంచంలో ఇదే. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మనిషి యుద్ధం బయట ఉండగలడు? అనూహ్య ప్రదేశమైన అబూజమహడ్‌ ` ఇప్పటికీ కులం, మతం, స్వంత ఆస్తి తెలియని ఆదివాసుల మీద ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వ సైన్యం ఆధునిక ఆయుధాలతో మానవరహిత యుద్ధ విమానాలతో దిగుతోంది. మూలవాసుల ఆస్తుల్ని, దేశాల సరిహద్దుల్ని చెరిపేసి కొల్లగొట్టబడే ` ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద గొప్ప దోపిడి సన్నివేశంలో ` ప్రతిదీ ఒక పేలే తుపాకే ` అది కొండ
చిలువలా నోరు తెరుచుకున్న రోడ్డు కావచ్చు. కుప్పతెప్పలుగా విస్తరించే నెట్‌వర్కులు, మీడియా మాయాజాలం కావచ్చు. అది స్వైన్‌ ఫ్లూ కావచ్చు ` ఎయిడ్స్‌ కావచ్చు ` కార్చిచ్చులా గుప్పుమనే మరేదైనా కావచ్చును.......
                భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు, అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ` వేలసంస్థలు ` నెట్‌వర్కులు ` టీవీలు ` ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికావారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది.
                అదిగో అలాంటి సన్నివేశంలో, సందర్భంలో పోరాడే ప్రజల పక్షాన నిలబడి ` లోపలి, బయటి వైరుధ్యాలను మనతో పంచుకుంటున్నాడు..... అలాంటి జ్వరతీవ్రతగల గోపిని ఆలింగనం చేసుకుంటూ......


అల్లం రాజయ్య
మంచిర్యాల , 10 – 04 - 2012  

భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు:

నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం 

- డా. గోపీనాథ్ 

        వెల : రూ. 100

మొదటి ముద్రణ : సెప్టెంబర్‌ 2013

ప్రతులకు, వివరాలకు :  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ ` 500 006.
ఫోన్‌ : 23521849

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌