Thursday, September 27, 2012

నిర్జన వారధి - కొండపల్లి కోటేశ్వరమ్మ ...


ఇవీ...నేను అనుకున్నవి 

నేను ఒక గొప్ప వ్యక్తినీ, రచయిత్రినీ కాకపోయినప్పటికీ 'నీ జీవితం ఓ కావ్యం లాంటిది. అది పదిమందికీ తెలియడం అవసరం' అని చెపుతుండేవాళ్ళు కొంతమంది పెద్దలూ, మిత్రులూ. 'సామాన్యుని సాహసమెట్టిదో...' చరిత్రలో నమోదు కావాలని మహీధర రామమోహనరావు, చేకూరి రామారావు, స్మైల్‌ వంటివాళ్ళు, పరకాల పట్టాభి రామారావు, మానికొండ సూర్యావతి వంటి మిత్రులు నన్ను ఆత్మకథ రాయమని ప్రోత్సహిస్తుండే వాళ్ళు. 

జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది. తడిసిన ఆ అక్షరాలను అర్థవంతంగా కాగితం మీద పెట్టడం నా వల్ల అవుతుందా అనుకున్నాను. అందుకే ఇన్నేళ్ళుగా ఆ ప్రయత్నం చేయలేదు. 

నా మనవరాళ్ళు అనురాధ, సుధ, నన్ను అమ్మమ్మా అని పిలిచే మరో మనవరాలు వసంత (వేమన వసంతలక్ష్మి) 'నీ ఒంట్లో శక్తి తగ్గకముందే నీ జీవితాన్ని కథగా రాయి. ముందు తరాలకు తెలియకుండా దాన్ని మాసిపోనివ్వొద్ద'ని మరీ మరీ చెప్పారు. 

అయినా నా శక్తీ, నా కంటిచూపూ అందుకు సహకరిస్తాయా అని సందేహించాను. 

నీ మిత్రులు ఎందుకు రాయమన్నారో ఆలోచిస్తేనూ, విూరు ఆనాడు ఎందుకు ఉద్యమించారో గుర్తుచేసుకుంటేనూ నీ కన్నీరే కథగా ప్రవహిస్తుంది ప్రారంభించమన్నారు వాళ్ళు. 

అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో అనురాధ, అనురాధ మిత్రులు వాసుగారు, వసంత ఎంతో సహకరించారు. సుందరయ్యగారు, రాజేశ్వరరావు గారిలాంటి వ్యక్తులు నా జీవితంతో ఎంతగానో ముడిపడిపోయిన వ్యక్తులు కాబట్టి సహచర కామ్రేడ్స్‌ మీద రాసిన సంస్మరణ వ్యాసాలను కూడా ఇందులో అనుబంధంగా చేర్చాను. ప్రత్యేకించి అనురాధ అచ్చు ప్రతిని సిద్ధం చేయడంలో చాలా శ్రమ తీసుకుంది. 

స్త్రీ జనాభ్యుదయంపై ప్రేమాభిమానాలున్న ఓల్గాగారు అడగ్గానే ముందుమాట రాయడానికి ఒప్పుకున్నారు. నా కథను పాఠకులు లోతుగా ఆలోచించేటట్లుగా చారిత్రక ఉద్యమాల అవగాహనతో విశ్లేషించారు. 

ఈ పుస్తక ప్రయత్నం గురించి తెలిసి దాన్ని అచ్చువేయడానికి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ముందుకొచ్చారు. 'సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం మొత్తం నాలుగు ఉద్యమాలతో సంబంధం ఉన్న జీవితం మీది. కనుక దేన్నీ వదిలిపెట్టకుండా రాయమని' కొన్ని సూచనలిచ్చారు బుక్‌ ట్రస్ట్‌ 
గీత గారు. ఆ ప్రకారం మరికొన్ని అనుభవాలు గుర్తు తెచ్చుకుని రాశాను. మరికొన్నిటిని విమలగార్ని విశాఖపట్నం పంపి రికార్డు చేయించి ఇందులో చేర్చారు. 

ఇందరి సహకారంతో నా జీవిత కథ ఇవ్వాళ నా 92వ యేట పుస్తక రూపంలో రానుంది. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. 

నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘ శ్రేయస్సు కొరకు రాయబడిందను కుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందను కుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ళ నా బ్రతుకు వృథా కాలేదని తెలిసి తృప్తిపడతాను. 


- కొండపల్లి కోటేశ్వరమ్మ
15.8.2012
(నిర్జన వారధి పుస్తకంలోనుండి )

నిర్జన వారధి 

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 

పేజీలు  184 వెల: రూ. 100 /- 
ప్రతులకు:
హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, 
ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, 
గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

Now NIRJANA VAARADHI  is available to the international Telugu reader;
Here is the link to the book:


http://kinige.com/kbook.php?id=1196&name=Nirjana+Vaaradhi

Friday, September 21, 2012

ఆదివారం ఆవిష్కరించబోతున్న "నిర్జన వారధి" పుస్తక ముఖచిత్రం ...

ఆదివారం ఆవిష్కరించబోతున్న "నిర్జన వారధి" పుస్తక ముఖచిత్రం ...
Wednesday, September 12, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ 'నిర్జన వారధి' ఆవిష్కరణ సభ ... సెప్టెంబర్ 23 ఉదయం 10 -30 గంటలకు హిమాయత్ నగర్ ఉర్దూ హాల్ లో ...

ఆహ్వానం


తొంభైరెండు సంవత్సరాల కొండపల్లి కోటేశ్వరమ్మను గౌరవించుకోవడానికి ఇప్పుడొక సందర్భం వచ్చింది.

ఆమె రాసిన ఆత్మకథ 'నిర్జన వారధి' నుంచి కొన్ని భాగాలు చదివి, మాట్లాడేందుకు -

మల్లు స్వరాజ్యం,
 చేకూరి రామారావు, 
ఎ.బి.కె.ప్రసాద్‌, 
రమా మేల్కొటే,  
వోల్గా, 
విమల, 
గుడిపాటి, 
మంజరి 
మొదలైనవాళ్ళంతా వస్తున్నారు. 
మీరూ తప్పక రండి.

23 సెప్టెంబర్‌ 2012 ఆదివారం 
ఉదయం 10-30 గంటలకు
ఉర్దూహాల్‌, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌

-హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ఫోన్‌ నెం. 040 23521849

నిర్జీవంగా వున్న (కొండపల్లి) సీతారామయ్యను చూస్తే ఎన్నో జ్ఞాపకాలొచ్చాయి.... ఇన్ని సంవత్సరాల జీవితాన్ని ఉద్యమం కోసం, ప్రజల కోసం... ధారపోశాక చూడ్డానికి వాళ్ల పార్టీవాళ్ళెవరూ రాలేదెందుకని? తమ ఉద్యమనేత చనిపోతే విభేదించాడని వదిలేస్తారా? నన్ను... సీతారామయ్య తనకి అనుకూలంగా లేనని చెప్పి ఆనాడు వదిలేశాడు. ఇప్పుడు సీతారామయ్యను వాళ్లు వదిలేశారు. ఇంతేనా జీవితం?
- కొండపల్లి కోటేశ్వరమ్మ

కొండపల్లి కోటేశ్వరమ్మగారు మూడు ఉద్యమాల వారధి. మూడు ఉద్యమాలలోని స్త్రీల పోరాట పటిమకు, వేదనకు కూడా ప్రతినిధి. మూర్తీభవించిన ఉద్యమ రూపం. ఆమె జీవితం చదువుతుంటే ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనసు ఆర్థ్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో అంత సామాజికం, రాజకీయం...
-వోల్గా
(నిర్జన వారధి పుస్తకం ముందుమాట నుండి)
.

Sunday, September 9, 2012

సగటుజీవి కథ ...


బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ తన 'పథేర్‌ పాంచాలి' తర్వాత, రెండో భాగంగా 'అపరాజితో' రచించారు. 

ఈ రెండు నవలలనూ కలిపి విఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే మూడు చిత్రాలుగా రూపకల్పన చేశారు. 

నవలలోని కథానాయకుడు అపూ కష్టాలూ కన్నీళ్లూ అధిగమిస్తూ ప్రశాంతంగా జీవించాలని తపిస్తాడు. వీలైనంతవరకూ ఇతరులకు 
సాయపడాలన్నది అతని సంకల్పం. చిమ్మచీకట్లో చిరుపీదాన్ని వెతుక్కుంటూ ప్రస్థానం సాగిస్తాడు. పల్లెల నుంచి పట్నాలకు 
వలసలు, ఛిద్రమవుతున్న గ్రామీణ వ్యవస్థ పెరిగిపోతున్న పేదరికం, తరిగిపోతున్న మానవ సంబంధాలను స్పశిస్తూ ప్రతి పాత్రనూ 
హృద్యంగా మనముందుంచారు రచయిత. 

బెంగాలీ సాహిత్యాన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన నవల.

అపరాజితుడు
బెంగాలీ మూలం: బిభూతి భూషణ్‌ బందోపాధ్యాయ
అనువాదం: కాత్యాయని
పేజీలు: 197, వెల: రూ.100/-

ప్రతులకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌-500006

- కెవియల్లెన్‌
(ఈనాడు ఆదివారం 9-9-2012 సౌజన్యంతో)


Monday, September 3, 2012

అణువుపై ఒకింత అవగాహన...జీవశాస్త్ర విశేషాల సమాహారం ...


 అణువుపై ఒకింత అవగాహన

రచయితల ఊహల్లోని ఆలోచనలను అక్షరబద్ధం చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయినా శాస్త్ర సంబంధిత అంశాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ పరిమితి మూలంగా రచనలోని భావధారకు తరచూ బ్రేక్‌పడే అవకాశముంది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన ‘అణువుల శక్తి’లో ఈ పరిమితిని చాలా వరకూ అధిగమించారనే చెప్పాలి. ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రయోగం ప్రస్తావనతో పదార్థ లక్షణాలకు పరిచయం కల్పించడం... అక్కడి నుంచి క్రమేపీ గతంలోకి.. ఆ వెంటనే వర్తమానంలోకి తీసుకొస్తూ రచనను నడపడం హాయిగొలిపింది. పాఠ్యపుస్తకాల్లో కనిపించే గ్రాంధిక భాషను పక్కనబెట్టి వాడుక భాషలోనే అంశాలను వివరించేందుకు చేసిన ప్రయత్నం ఎన్నదగ్గది. అయితే వాడుకలో లేకపోవడం వల్లనో... స్థిరీకరించకపోవడం వల్లనో తెలియదు కానీ... రచయిత వాడిన కొన్ని పదాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కొత్త పదబంధాలను సృష్టించి ఉంటే శాస్త్ర సంబంధ దృగ్విషయా లకు తగిన తెలుగు అనువాదాలు లేకపోవడమన్న లోటును అధిగమించి ఉండవచ్చునన్న భావన కలుగుతుంది.

జీవశాస్త్ర విశేషాల సమాహారం
రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తన ముందుమాటలో చెప్పినట్లు సైన్స్ రచయితల బాధ్యతను గుర్తుచేసే సంకలనం ఇది. మార్కుల ప్రాతిపదికన చదువుకునే పాఠ్యపుస్తకాల మాదిరిగా కాకుండా సంక్లిష్టమైన అంశాలకూ సులభగ్రాహ్యంగా ఉందీ రచన. కాబట్టి విద్యార్థులు తరగతి గదుల్లోని చదువుకు మెరుగులు దిద్దేందుకూ ఉపయోగపడుతుంది. పరిణామ సిద్ధాంతాన్ని... మన ఆలోచనాసరళి, వచ్చే వ్యాధులకు ఉన్న జన్యుమూలాలను తెలిపేందుకు చేసిన ప్రయత్నమూ బాగుంది. సంకలనం మొత్తమ్మీద మూఢనమ్మకాలపై రచయితకు ఉన్న సహేతుక వ్యతిరేకత... వాటిని దనుమాడేందుకు చేసిన ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

అణువుల శక్తి, 
పే 192, వెల రూ. 100/-,
జీవశాస్త్ర విజ్ఞానం: సమాజం,
పే 175, వెల రూ 100/- /
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్/

ప్రతులకు:
 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

( సాక్షి దినపత్రిక 3 సెప్టెంబర్ 2012 సౌజన్యం తో )


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌