Saturday, December 30, 2017

పత్రికా స్వేచ్ఛ వర్సెస్‌ కర్ణాటక శాసనసభ- Gauri Lankesh
పత్రికా స్వేచ్ఛ వర్సెస్‌ కర్ణాటక శాసనసభ
( " కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు " పుస్తకం నుంచి )

కర్ణాటకలో శాసనసభ్యులు, జర్నలిస్టుల మధ్య వివాదాలకు సుదీర్ఘ చరిత్రే వుంది.  
అత్యంత విలువైన తమ 'పార్లమెంటరీ హక్కుల్ని' జర్నలిస్టులు ఉల్లంఘిస్తున్నారని శాసనసభ్యులు తరచూ ఆరోపిస్తుంటారు. 
తాజాగా వాళ్ళు రవి బెలెగరె, అనిల్‌ రాజు అనే ఇద్దరు స్థానిక చిన్నపత్రికల సంపాదకుల మీద విరుచుకుపడ్డారు. 
సభాహక్కుల కమిటీ చైర్మన్‌ కూడా అయిన శాసనసభా స్పీకర్‌ కె.బి. కోలివాడ్‌ వాళ్ళిద్దరికీ పది వేల రూపాయల జరిమానాతోపాటు ఒక ఏడాది జైలు శిక్ష కూడా విధించారు. 

కాంగ్రెస్‌ శాసన సభ్యులు బి.యం. నాగరాజ్‌, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యస్‌.ఆర్‌. విశ్వనాథ్‌లతో పాటు సాక్షాత్తూ శాసన సభాపతి అయిన కోలివాడ్‌ పరువుప్రతిష్టలకు సహితం  నష్టం కలిగించేలా వార్తలు రాశారనేది వాళ్ళిద్దరి మీద ఉన్న అభియోగం. తమ 'పవిత్ర' హక్కులకు భంగం కలిగిందని వారి వాదన.


ఆ ఇద్దరు సంపాదకులు తమ పత్రికల్లో ఏం రాశారు అన్నది ఇక్కడ అంత ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే, న్యాయకోవిదుల అభిప్రాయం ప్రకారం, వారు ప్రచురించిన అంశాలు పరువునష్టం కేసు కిందికి వస్తాయేగానీ, సభా హక్కుల ఉల్లంఘన కిందికి రావు. ఇక్కడ అసలు విషయం ఏమంటే వలస పాలకుల వారసత్వంగా మన ప్రజా ప్రతినిధులకు సంక్రమించిన 'సభా హక్కులు' ఇవి. శాసనకర్తల్ని న్యాయమూర్తులుగా మార్చి జర్నలిస్టులకు జైలు శిక్షలు విధించే అధికారం ఇస్తున్న ఇలాంటి కాలం చెల్లిన చట్టం ప్రజాస్వామిక వ్యవస్థలో వుండడానికి ఏ మాత్రం వీల్లేదు.

1980 వరకు కర్ణాటకలో పాత్రికేయం చాలా ప్రశాంతంగా, నిస్తేజంగా వుండేది. పాలకపక్షం మీద ఎప్పుడయినా ఒక విమర్శ చేయాల్సి వచ్చినా అది చాలా 'మర్యాద పూర్వకమైన' సంప్రదాయ భాషలో మాత్రమే ఉండేది. 'లంకేశ్‌ పత్రికె' వచ్చాకే ఈ పరిస్థితి మారింది. అనవసరపు మర్యాదలు వదిలేసి అది 'గుర్రాన్ని గుర్రం', 'గాడిదను గాడిద' అంటూ సూటిగా రాయడం మొదలెట్టింది. దాని సంపాదకుడు పి.లంకేశ్‌ ముఖ్యమంత్రి ఆర్‌. గుండూరావును 'గుమ్‌' అనీ, సీనియర్‌ మంత్రి యస్‌. బంగారప్పను 'బమ్‌' అనీ రాసే వార్తా కథనాలు పాఠకుల్ని గొప్పగా అలరించేవి.

ఆ కాలంలోనే - అంటే 1980లలో - కర్ణాటక అంతటా రైతాంగం అసంతప్తితో రగిలిపోతూ వుంది. దళితోద్యమం క్రమంగా వేళ్ళూనుకుంటోంది.  ప్రభుత్వ పాఠశాలల్లో కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదంతో మొదలయిన గోకక్‌ ఉద్యమానికి మద్దతు పెరుగుతూ వుంది. సుదీర్ఘ కాలంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ మీద ప్రజల్లో అసంతప్తి చాప కింది నీరులా వ్యాపిస్తూ వుంది. వీటన్నిటికీ 'లంకేశ్‌ పత్రికె' ఒక గొంతునిచ్చింది. 'పత్రికె' చేసే పదునైన విమర్శలు గుండూరావుకు మహా కోపాన్ని తెప్పించేవి. ఈ వ్యవహారం ఎందాకా వెళ్ళిందంటే, 1981లో ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ''జర్నలిస్టులందర్నీ కట్టకట్టి అరేబియా సముద్రంలో పడేయాలి'' అన్నారు.

గుండూరావు వారసునిగా వచ్చిన రామకష్ణ హెగ్డే ఒట్టి మాటలతో ఆగకుండా శాసనసభ్యుల హక్కుల పరిరక్షణ పేరిట ఏకంగా పత్రికా స్వేచ్ఛ గొంతు నులిమేందుకు  ప్రయత్నించారు. ప్రధాన స్రవంతి మీడియా ఆయన్ని 'సిసలైన మిస్టర్‌ క్లీన్‌', 'కాబోయే ప్రధాని' అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుండగా. ఆయన గుట్టును రట్టు చేసింది 'పత్రికె'నే.  రెవజీతు హౌసింగ్‌ 
(1988), ఎన్‌.ఆర్‌.ఐ హౌసింగ్‌ అసోసియేషన్‌ (1989), సారా బాట్లింగ్‌ కాంట్రాక్టు (1984) మొదలైన కుంభకోణాలన్నిటినీ నిర్భయంగా బయటపెట్టింది 'లంకేశ్‌ పత్రికె'.

 పత్రికా స్వేచ్ఛను క్రోడీకరిస్తున్నామనే ముసుగులో హెగ్డే కర్ణాటక లెజిస్లేచర్‌ (అధికారాలు, హక్కులు, మినహాయింపులు) బిల్లు,1988 ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

అందులో పాత్రికేయులకు అత్యంత కఠిన శిక్షలు వేయాలని ప్రతిపాదించడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈలోగా ప్రభుత్వం టెలిఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తడంతో హెగ్డే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన తరువాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఎస్‌.ఆర్‌ బొమ్మై ఆ బిల్లును నిశ్శబ్దంగా సమాధి చేయడంతో పత్రికా రంగం ఊపిరి పీల్చుకుంది.

జనతా పార్టీకే చెందిన మరో ముఖ్యమంత్రి జె. హెచ్‌ పటేల్‌ కూడా ఒక సందర్భంలో 'సభాహక్కుల' కొరడాను ఝుళిపించడానికి ప్రయత్నించారు. మహిళా శాసనసభ్యులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదని 1997లో 'పత్రికె' ఒక కవర్‌ పేజీ కథనం ప్రచురించింది. (నిజంగా కూడా అదేమంత మంచి కథనం కాదు.) దానిపై అన్ని పార్టీలకు చెందిన మహిళా శాసనసభ్యులు శాసనసభలో కన్నీళ్ళు కారుస్తూ లంకేశ్‌ను సంజాయిషీ అడగాలని డిమాండ్‌ చేశారు. అప్పటికే 'పత్రికె' విమర్శల సెగను స్వయంగా చవిచూసిన ముఖ్యమంత్రి పటేల్‌, ఇతర మంత్రులు, శాసనసభ్యులు వారు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుకు మద్దతు పలికారు.

సభలో ఆనాడు భిన్నంగా స్పందించిన ఏకైక సభ్యుడు  స్వతంత్ర అభ్యర్ధి అయిన వటల్‌ నాగరాజ్‌. తనకు వ్యతిరేకంగా ఒక కథనాన్ని ప్రచురించినందుకు 1980లో లంకేశ్‌ మీద భౌతికదాడి చేసిన చరిత్ర అతనికి వుంది. అయినా 'పత్రికె' కథనాన్ని పరువునష్టంగా భావించాలే తప్ప శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘన కిందికి రాదని ఆయన వాదించాడు. ఈ వ్యవహారం 
శాసనసభలో కొన్ని రోజులు పెద్ద దుమారాన్నే రేపినప్పటికీ అప్పటి స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఆ వేడి చల్లారే వరకూ దాన్ని పక్కన పెట్టారు. ఆ తరువాత అదే నిశ్శబ్దంగా చనిపోయింది. 

కర్ణాటక శాసన సభ్యుల ఆగ్రహానికీ, దాడులకూ గురైంది లంకేశ్‌, ఆయన ప్రచురణలు మాత్రమే కావు. సుప్రసిధ్ధ పాత్రికేయుడు టి.జె.ఎస్‌. జార్జ్‌ను కూడా నిండు శాసనసభలో తూలనాడారు. అప్పటి నుండి ఇప్పటి వరకు - ఈ వ్యాసకర్తతో సహా -  ప్రముఖ దిన, వార పత్రికల సంపాదకులు అనేకమందికి సభాహక్కుల సంఘం ముందు హాజరవ్వాలని తాఖీదులు వచ్చాయి. శాసనసభ్యుల్ని ఏకవచనంలో సంబోధించడం, సభ బయట వాళ్ల కార్యకలాపాలను విమర్శించడం, వాళ్ల అధికార దుర్వినియోగాన్ని బయటపెట్టడం  వంటివన్నీ పాత్రికేయుల పరిధిలోని అంశాలు కావనే గట్టి అభిప్రాయం సభాసంఘానికి వుండేది అనిపిస్తుంది. 'ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రతినిధులు' కావడాన తాము ఇతరులకన్నా 'మరింత సమానులు' అని వాళ్ళు గట్టిగా నమ్మేవాళ్ళు. ఎక్కువభాగం ఫిర్యాదులు మందలింపులతోనో, (బలవంతపు) క్షమాపణల ప్రచురణతోనో పరిష్కారం అయినప్పటికీ పత్రికలను వేధించాలనే ధోరణి మాత్రం వారిలో పోలేదు.

2012 లో భారతీయ జనతా పార్టీకి చెందిన జగదీశ్‌ షెట్టర్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక సంపాదకుడ్ని శాసనసభకు క్షమాపణలు చెప్పించడంలో ఇద్దరు శాసనసభ్యులు  కతకత్యులయ్యారు.  బెలగావి నుండి ప్రచురితమయ్యే మరాఠీ దినపత్రిక 'తరుణ్‌ భారత్‌' తమ మీద నిరాధార ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రచురించిందని బిజెపి శాసనసభ్యుడు అభయ్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ శాసనసభ్యుడు శ్యామ్‌ ఘటగె ఆరోపించారు. అప్పటి సభాపతి కె.జి. బోపయ్య వాళ్ళ ఫిర్యాదుల్ని సభా హక్కుల సంఘానికి పంపించగా. ఆ కమిటీ 'తరుణ్‌ భారత్‌' సంపాదకుడైన కిరణ్‌ ఠాకూర్‌ను దోషిగా భావించింది. సభకు పిలిపించి, తాత్కాలికంగా నిర్మించిన ఒక బోనులో నిలబెట్టింది. ''ఈ సభా గౌరవాన్ని  కించపరిచే వ్యాఖ్యానాలు, కథనాలు వేటినీ నా ప్రతిక ఇదివరకెన్నడూ ప్రచురించలేదు. జరిగిన దానికి చింతిస్తున్నాను'' అంటూ ఆయన చేత ఒక ప్రకటన చేయించింది. సహచరుడికి పబ్లిక్‌లో అంతటి అవమానం జరిగినప్పటికీ విచిత్రంగా కర్ణాటకలోని అతని మీడియా 
సోదరులు మౌనంగా వుండిపోయారు.   

కన్నడలో 24ఞ7 వార్తా ఛానళ్ళు పెరిగాక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. అర్నవ్‌ గోస్వామికి స్థానిక క్లోన్‌లు చాలామంది పుట్టుకొచ్చారు. టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్ళు వారి అభిప్రాయానికి ఏ మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా పెద్ద గొంతుతో విరుచుకుపడిపోతుంటారు. ఆ స్వీయప్రకటిత జాతీయవాది కంటే మరింత ఎక్కువ దేశభక్తిని 
వొలకబోస్తుంటారు. నిమిషనిమిషానికి వేసే 'బ్రేకింగ్‌ న్యూస్‌' లను అతిశయోక్తులతో నింపేస్తుంటారు.

టీవీ ఛానళ్ల ప్రసారాలను ఖండించడానికి ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్‌, బిజెపి, జనతా దళ్‌ (సెక్యులర్‌)లకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు. తమను ''తక్కువచేసి చూపెడుతున్నారు'', ''వాస్తవాలను వక్రీకరిస్తున్నారు'', ''తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తున్నారు'' అనేవి వారి ప్రధాన ఆరోపణలు. ఒకసారి బిజెపి ఎమ్మెల్యే సురేష్‌ గౌడ ఓ టోల్‌ గేట్‌ బూత్‌ లో సిబ్బంది మీద దాడి చేసి సిసిటివి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. వాటి ప్రసారాల గురించి ఆయన శాసనసభలో ఫిర్యాదు చేస్తూ టీవీ ప్రసారాల్లో తనను 'రౌడీ సురేష్‌ గౌడ' అని పేర్కొన్నారని ఆవేదన వెళ్ళగక్కాడు. ''టీవీల వాళ్ళు రౌడీ, గూండా వంటి పదాలను చాలా అలవోకగా వాడేస్తున్నారు. చివరకు ప్రజాప్రతినిధుల్ని కూడా అలా సంభోదిస్తున్నారు'' అని ఆయన నిండు సభలో బాధపడిపోయాడు.

ఆ తర్వాత మీడియా ప్రసారాల నియంత్రణ కోసం నియమ నిబంధనలను రూపొందించడానికి ఒక అఖిలపక్ష సభా సంఘాన్ని కోలివాడ్‌ ప్రకటించారు. దానితో మీడియా సోదరులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విచిత్రం ఏమంటే మీడియాకు మార్గదర్శకాలను రూపొందించాలని సభలో గట్టిగా పట్టుబట్టిన బిజెపి శాసనసభ్యులు సభా సంఘంలో సభ్యులుగా వుండడానికి మాత్రం ఇష్టపడలేదు. పత్రికా స్వేచ్ఛను అణిచివేయడం తమ పార్టీ విధానం కాదంటూ తప్పుకున్నారు. నాలుగు వైపుల నుండి తీవ్ర విమర్శలు రావడంతో ఈ సభాసంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది.

రవి బెలెగరె, అనిల్‌ రాజులకు శాసనసభ శిక్షలు విధించడంతో ఈ వివాదం ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చింది. నిజానికి బెలెగరె పాత్రికేయ శైలి అందరికీ నచ్చేలా వుండదనేది అందరికీ తెలిసిన విషయమే. అనిల్‌ రాజు గురించి గానీ, అతని 'యలహంక వాయిస్‌' పత్రిక గురించి గానీ ఎవరికీ పెద్దగా ఏమీ తెలీదనే చెప్పాలి. 

ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమంటే శాసనసభ్యులు న్యాయమూర్తుల స్థానంలో కూర్చొని జర్నలిస్టుల మీద తీర్పులు చెప్పడం ఏ మాత్రం సరైందికాదు. ఒకవేళ వాళ్ళు తమ పరువుకు నష్టం కలిగిందని భావిస్తే ఇతర పౌరులలాగ నేర శిక్షాస్మతి (సిఆర్‌ పిసి)లోని వివిధ సెక్షన్ల కింద న్యాయ పరిష్కారం కోసం ప్రయత్నించవచ్చు. కాలం చెల్లిన ఒక చట్టాన్ని అడ్డుపెట్టుకుని విమర్శకుల్ని శిక్షించడం కన్నా రాజ్యాంగ పరిధిలో వాళ్లు చేయగల సరైన పని అదే.

 (ద వైర్‌ వెబ్‌ మ్యాగజైన్‌, 16 జూన్‌ 2017)

అనువాదం : ఎ.ఎమ్‌ యజ్దానీ (డానీ)


(గౌరి లంకేశ్‌ హత్యానంతరం 'ద వైర్‌ వెబ్‌ మ్యాగజైన్‌' 5 సెప్టెంబరు 2017న ఈ వ్యాసాన్ని మరోసారి ప్రచురించింది.)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com


2 comments:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌