Wednesday, December 27, 2017

జైలులో సంబరాలు - గౌరి లంకేశ్
జైలులో సంబరాలు 

(కొలిమి రవ్వలు గౌరి లంకేశ్ రచనలు పుస్తకం నుంచి )

మత సామరస్యం కర్ణాటక సంస్కృతి మాత్రమే కాదు, అది ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల ఆశయం కూడా అని ఇప్పుడు రుజువైంది. లేకపోతే, డిసెంబర్‌ 7వ తేది ఆదివారం, రాష్ట్రం నలుమూలల నుండి అనేక సంస్థలు కలిసి చిక్కమగళూరులో జరిపిన సామరస్య సదస్సుకూ, అందులో పాలుపంచుకున్నందుకు జైలు పాలైనవారికీ రాష్ట్రమంతటా ఇంత మద్దతు లభించి ఉండేదే కాదు.

ఆ సదస్సు, దాని తరువాత రెండు రోజులు జైలులో ఉండడం - నేనెప్పటికీ మరువలేని అనుభవాలు. మా ఊరేగింపును జిల్లా అధికారులు అడ్డుకుని వందలాది మందిని ఆరెస్ట్‌ చేసినపుడు మేమందరం 'కట్టే కట్టుత్తేవ, నావు కట్టే కట్టుతేవ, ఒడెద మనసుగళ, కండ కనసుగళ కట్టే కట్టుతేవ' (కట్టి తీరుతాం, మేము కట్టి తీరుతాం, పగిలిన మనసులను తిరిగి కట్టి తీరుతాం, కన్న కలలను నెరవేర్చుకుని తీరుతాం) అని ఏకకంఠంతో పాడుతూ జైలుకి వెళ్ళిన క్షణాలు ఎటువంటి రోమాంచిత క్షణాలంటే ఆ రోజులు గుర్తొస్తే ఇవాళ్టికి కూడా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి.

మా అందరినీ కిక్కిరిసిన బస్సుల్లో చిక్కమగళూరులో అప్పుడే కొత్తగా కట్టిన జైలుకు తీసుకువెళ్లారు. నినాదాలు చేస్తూ, కరపత్రాల్ని కిటికీల్లో నుంచి విసిరేస్తూ, తెల్ల జెండాలని ఊపుతూ వెళుతుండగా నాలో చిలిపి ఆలోచన వచ్చింది. అదేమిటంటే, ఏ ప్రభుత్వమైతే మా ప్రదర్శనని అడ్డుకున్నదో, ఆ ప్రభుత్వమే బస్సులలో మమ్మల్ని స్వయంగా ఊరంతా తిప్పి మా ఊరేగింపుకు అవకాశం కల్పించిందని. మేం కాలినడకన వెళితే అంత మంది జనం పట్టించుకునేవారు కాదేమో!

అది పేరుకే కొత్త జైలు. అందులో ఏ సౌకర్యాలూ లేవు. 250 ఖైదీలు పట్టే ఆ జైలులో వెయ్యిమందిని గొర్రెల మందల్లా తోసారు. అక్కడ తాగు నీరు గాని, మహిళలకి బాత్‌రూమ్‌లు గాని ఏ సదుపాయమూ లేదు. తాగు నీటి కోసం ధర్నా, తిండి కోసం ధర్నా, పరుపులు దుప్పట్ల కోసం ధర్నా ... ఇలా అన్నిటికీ గొడవ చేసి ఇప్పించుకోవలసి వచ్చింది.

చివరికి  'స్వచ్ఛ చిక్కమగళూరు' అని లేబుల్‌ అంటించిన చెత్త తీసుకెళ్ళే బ్యారల్‌లలో తాగు నీరు వచ్చింది. మూడు వందల మందికి సరిపడా తిండి మాత్రమే ఇచ్చారు. పరుపులు అడిగితే మామూలు గోనెపట్టలు, పల్చటి దుప్పట్లు వచ్చాయి.

అయినా అవేవీ మా ఉత్సాహాన్ని తగ్గించలేదు, మా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. మా పోరాటంపై మాకున్న నమ్మకాన్ని సడలించలేదు. పైగా ఆ రెండు రోజుల జైలు జీవితం మమ్మల్నింకా దగ్గర చేసింది, మా పోరాటం కొనసాగించడానికి ప్రేరణ ఇచ్చింది.  జైలులో కష్టాలు పడుతున్నామేమోనని ఆదుర్దాగా ఫోన్‌ చేసిన కె. రామదాసు గారితో, భాను ముష్తాక్‌ గారితో నేను ''లేదు, లేదు, ఇక్కడే కష్టమూ లేదు. పైపెచ్చు ఎంత అద్భుతమైన అనుభవమంటే, మీరు కూడా ఇక్కడుంటే బాగుండేది. ఇక్కడి విశేషాలు వింటే మీరు కచ్చితంగా ఈర్ష్యపడతారు'' అన్నాను.

నిజంగానే ఆ జైలు ఒక మినీ కర్ణాటకలాగా ఉంది. ఖైదీలలో యువతీయువకులు, ప్రగతిశీల ఆలోచనాపరులు, కమ్యూనిస్టులు, ముస్లింలు, రకరకాల కళాకారులు,

ఉద్యమకారులు, పాత్రికేయులు, అధ్యాపకులు, మహిళలు, రైతు సంఘాల వారు, రాజకీయ నాయకులు అన్ని రకాలవారూ ఉన్నారు.

తమాషా ఏమిటంటే, భజరంగదళ్‌ నిర్వహించే దత్తజయంతిలో పాల్గొనటానికి వచ్చి, ఎలాగో మావాళ్ళ బండిలో ఎక్కిన కొందరు కాషాయ దళం సానుభూతిపరులు కూడా మాతో పాటు జైలు పాలయ్యారు. అక్కడ మాతో రెండు రోజులు గడిపిన తరువాత వాళ్ళు పూర్తిగా సామరస్యం వైపు మారినట్టు కనిపించారు. మేమందరం ఒకరికొకరు పూర్తి అపరిచితులం. అయినా ఒక గాఢమైన ఐక్యత మమ్మల్ని కలిపి ఉంచింది. ఎక్కడా ఎలాంటి అనర్థాలూ జరగలేదు.

మమ్మల్ని బంధించిన ఆదివారం రాత్రే 'పత్రికె' అచ్చుకి వెళ్ళవలసి ఉంది. జైలులోనే కాలమ్‌ రాసినా దాన్ని బెంగళూరుకు ఫాక్స్‌ చేయడం అసాధ్యం. పైపెచ్చు నాకు సహాయంగా ఉండటానికి వచ్చిన మా హసన్‌ రిపోర్టర్‌ చంద్రచూడ్‌ కూడా నాతోపాటు జైల్లోనే

ఉన్నాడు. దాంతో నా కాలమ్‌ను నేను మొబైల్‌లో చదివి చెప్పవలసి వచ్చింది. నేను అలా చెపుతుండగానే  సాయంత్రం సుమారు ఆరుగంటలకు సీనియర్‌ పోలీసు అధికారి సుభాష్‌ భరణి గారు అక్కడికి వచ్చారు. ''ఇవాళ మీ సంచిక పూర్తి చేయాల్సిన రోజు కదా?  ఎలాగూ అందర్నీ ఈ రాత్రికే విడుదల చేయబోతున్నాం కాబట్టి కావాలంటే ఇప్పుడే మీరు విడుదలై వెళ్ళిపోవచ్చు'' అన్నారు.

''అవసరం లేదండి ఇవాళ నేను మా ఆఫీసుతో టచ్‌లో ఉండాలంతే. కానీ నా మొబైల్‌ బ్యాటరీ అయిపోవస్తోంది. నేను దిగిన హోటల్‌ నుంచి నా మొబైల్‌ చార్జర్‌ తెప్పించగలిగితే చాలు'' అన్నాను. భరణిగారు ఒప్పుకున్నారు. కాని పని మాత్రం అవలేదు. రాజు ఆహ్వానించినా, ద్వారపాలకులు అడ్డుపడ్డట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. జైలుకి కాపలాగా ఉన్న పోలీసులు నా మొబైల్‌ చార్జర్‌ తెప్పించలేదు. ''కావాలంటే మీరు విడుదలై వెళ్ళిపోవచ్చు, కాని తిరిగి రాకూడదు'' అని షరతు పెట్టారు. ఆల్‌ ఇండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఏఐవైఎఫ్‌) కార్యకర్తలు, మత సామరస్య వేదికలోని యువకులు కూడా నన్ను వెళ్ళమనే చెప్పారు. అయితే అందరినీ విడుదల చేసేదాకా నేను వెళ్ళేది లేదని పట్టుబట్టాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న భరణిగారే వైర్‌లెస్‌ ద్వారా పోలీసులకు ఆదేశమిచ్చి హోటల్‌ నుంచి నా సూట్‌కేస్‌ తెప్పించే ఏర్పాటు చేశారు. అలా నా పని అయింది. కాని జైల్లో వంద కంటే ఎక్కువ మొబైల్‌లు ఉన్నాయి. వాటన్నిట్నీ చార్జ్‌ చేసుకుంటే అందరికీ బయటి ప్రపంచంతో సంపర్కం ఉంటుందన్న ఒకే ఒక్క కారణంగా మరుసటిరోజు జైలు అధికారులు విద్యుత్‌ సరఫరాను ఆపేశారు.

ఆ రెండు రోజులు మాకు తోడుగా నిలిచింది చిక్కమగళూరు ముస్లింలే. నిజానికి సూఫీ సంప్రదాయానికి చెందిన బాబాబుడన్‌గిరి దర్గాతో చిక్కమగళూరు ముస్లింలకి చెప్పుకోదగ్గ అనుబంధమేమీ లేదు. వాళ్లెవరూ అక్కడ నమాజు చేయరు. అందుకే వాళ్ళందరూ ఈ వివాదంతో తమకు సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు ఇంతకాలం.  అయితే ఈ మధ్యకాలంలో కాషాయ దళం రెచ్చిపోవడం చూసి, చిక్కమగళూరులో మతకలహాలంటూ జరిగితే తామే బలి పశువులమవుతామని వాళ్లకు అర్థమయ్యింది. అందుకే మాకు మద్దతుగా నిలిచారు.

మా సమావేశం జరగటానికి ముందురోజే చిక్కమగళూరులోని అన్ని మసీదుల్లో ''ప్రగతిశీలుర సామరస్య సమావేశం విజయవంతం కావాలి'' అని ప్రార్థనలు చేశారు. సమావేశానికి వస్తున్న వెయ్యి మందిని బంధించారని తెలియగానే స్థానిక ముస్లిం నాయకులు మా ఆహారం కోసం అప్పటికప్పుడు నలభై వేల రూపాయల విరాళాలు సేకరించారు. ప్రభుత్వం మాకు చెత్తబుట్టల్లో నీళ్ళు ఇస్తే, వాళ్ళు మాకు బిస్లరీ బాటిళ్ళు ఇచ్చారు. ఆహారం సరిపోకపోతే, వాళ్ళే అందరికీ ఆహారం సరఫరా చేశారు. ఎముకలు కొరికే చలికాలం కావడంతో వందలకొలదీ స్వెటర్‌లు పంచారు. కాఫీ, టీలే కాదు, సిగరెట్‌, బీడీలు కూడా పంపించారు.

మాకే అవసరం వచ్చినా చూసుకోవడానికి జైలు గేటు బయటే కొంత మంది ముస్లిం యువకులను నిలబెట్టారు. వీటన్నిటికీ నాయకత్వం వహించిన యూసఫ్‌ హాజీకి మేం ఎల్లకాలం రుణపడి ఉంటాం. పాటలు, నృత్యాలు, చర్చల్లో లీనమైన మాకు ఆ రెండు రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు. నేను తీసుకువెళ్ళిన (అప్పుడే విడుదలైన) గాబ్రియల్‌ గార్షియా మార్క్వెజ్‌ ఆత్మకథలో ఒక్క పేజీ కూడా చదవడం వీలుకాలేదు.

జైలులో ఒక సెల్‌లో కూర్చుని నేను కాలమ్‌ రాసుకోవడం చూసి కన్నీళ్ళు పెట్టుకున్న మా 'పత్రికె' శివమొగ్గ పాఠకుడు; 'బాబా-దత్తా ఏక్‌ హై' అని మేమందరం నినాదాలు చేస్తుంటే 'లారా దత్తా ఏక్‌ హై' అని అరిచిన ఒక తుంటరి, ఇంకెక్కడా ఖాళీ లేకపోవడంతో నేను నిద్రపోతుండగా నా సెల్‌లోకి చడీచప్పుడూ కాకుండా వచ్చి నమాజు చేసుకున్న ముస్లిం యువకులు; 'కులం వద్దు, మతం వద్దు' అని ఎవరో నినాదాలు చేస్తుంటే, ''అవన్నీ వదిలిపెట్టే ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు  కావాల్సింది తిండి. అది కావాలని అరవండి'' అని నవ్వుల అలల్ని ఎగిసిపడేలా చేసిన ఒక యువకుడు; మరుసటి రోజు పరీక్ష ఉందని ఆందోళన పడుతున్న విద్యార్ధులు ... ఇలా ఎన్నో జ్ఞాపకాలు. వేటినీ మరచిపోలేను.

అలాగే ఆ జైలు ప్రాంగణంలో పరుచుకున్న చల్లని వెన్నెలా, అక్కడక్కడ మంట వేసుకుని చలికాచుకుంటూ రాత్రంతా కూర్చున్న జనం... విస్మరించలేని దృశ్యాలు.

ఆ రెండు రోజులు మాతో ఉన్న యువతీయువకుల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా పునర్జన్మ పొందినంత ఉత్సాహం నాలో నిండుతుంది. అక్కడ కొత్త స్నేహాలు, ఆత్మీయతలు ఏర్పడ్డాయి. నిజమైన అర్థంలో అదొక సామరస్య సమావేశమే అయ్యింది. ఇది నా ఒక్కదాని భావనే కాదు, జైల్లో ఉన్న వందలాదిమంది అనుభవం కూడా ఇదే అనటంలో నాకు ఏ సందేహమూ లేదు.

(లంకేశ్‌ పత్రికె, 24 డిసెంబర్‌ 2003)
అనువాదం : కె . ఆదిత్య
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
3 comments:

 1. http://telanganasamacharam.online/

  ReplyDelete
 2. cell 9030387789 www.guntur-nonveg-tiffins.webs.com We serve in Guntur Daily Non Veg Tiffins DOSA-PAYA IDLY-CHICKEN CURRY raagi sangati FISH pulusu SP Non Veg Tiffins
  Guntur MUTTON PAYA in hyderabadi style FREE DOOR DELIVERY within 150 km from Guntur City by SREE POLAMAMBA NON VEG TIFFINS Guntur www.muttonpayainguntur.webs.com

  ReplyDelete
 3. 😱 OMG. HAVE YOU SEEN WORLD'S BEST

  BUSGAMES

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌