Friday, December 15, 2017

భాషా మూలాలు - ఇంగ్లీష్‌ మేఘాలు - గౌరి లంకేశ్

భాషా మూలాలు - ఇంగ్లీష్‌ మేఘాలు 
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)

చాలామంది 'బెంగుళూరు మిర్రర్‌' పాఠకుల లాగే నేను కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకున్నాను.

దాని ఫలితంగా (నా మాతభాష కన్నడ అయినప్పటికీ) నేను ఇంగ్లీష్‌లోనే ఆలోచిస్తూ, ఇంగ్లీష్‌లోనే కలలు కంటూ, ఇంగ్లీష్‌లోనే బతుకుతూ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ పెరిగాను.

ఇంగ్లీష్‌ నన్ను ఎనిడ్‌ బ్లైటన్‌, పి.జి వోడ్‌హౌస్‌, షేక్‌స్పియర్‌ లాంటి ఎందరెందరి రచయితలతోనో ప్రేమలో పడేలా చేసింది. ఇప్పటికీ నేను ప్రపంచంలో జరుగుతున్న చాలా విషయాలను ఇంగ్లీష్‌ వార్తా పత్రికలు, న్యూస్‌ చానెల్స్‌ ద్వారానే తెలుసుకుంటున్నాను. ఈమధ్య అయితే రకరకాల వెబ్‌సైట్ల నుంచి, బ్లాగ్స్‌ నుంచి కూడా తెలుసుకుంటున్నాను.

అయినప్పటికీ, ప్రాథమిక విద్యాబోధన మాతభాషలో జరగాలనే దానికే నా ఓటు. అబ్బా... మరో కన్నడ ఛాందసురాలా అని నిట్టూర్చి నా వాదనను మీరు తీసిపారేసే ముందు దయచేసి నేను చెప్పేది కాస్త వినండి.

కన్నడ, ఇంగ్లీష్‌ భాషలు రెండూ తెలిసి, రెండిట్లోను పని చేసిన అనుభవంతో నేను ఏం అనుకున్నానంటే మాతభాషలో నేను మరింత పాండిత్యం సంపాదించుకుని, ఇంగ్లీష్‌ని ఒక అదనపు భాషగా చదువుకుని ఉంటే నేను రెండు భాషా ప్రపంచాల్లోనూ మరింత ఉన్నతిని సాధించి ఉండేదాన్నని.

భాషనేది వ్యక్తీకరణకు ఒక వాహిక లేదా మంచి ఉద్యోగాన్ని సాధించి పెట్టే ఒక సాధనం మాత్రమే కాదని ముందు అర్థం చేసుకుందాం. భాష అంటే జీవితం. అది మన అస్తిత్వాన్నీ, చరిత్రనీ, సంస్కతీ సంప్రదాయాలను, మొత్తంగా సమాజపు ఆత్మనూ ప్రతిఫలిస్తుంది.

ఒక ఉదాహరణ చెపుతాను.Rain, Rain, go away, come again another day, little johny wants to play (వానమ్మా వానమ్మా వెళ్ళమ్మా! ఇంకోరోజు మళ్ళీ రావమ్మా! బుజ్జిగాడ్ని ఆడుకోనియ్యమ్మా)  అనేది ఇంగ్లీష్‌ మీడియం పిల్లలు చదువుకునే రైమ్స్‌లో ఒకటి.

కన్నడ మీడియంలో చదివే పిల్లలు నేర్చుకునే రైమ్‌ దీనికి పూర్తి భిన్నమైన అర్థంలో ఉంటుంది. 'హుయ్యో హుయ్యో మలేరాయ, బాలే తోటక్కి నీరిల్లా' (వానమ్మా వానమ్మా కుండపోతగా కురువమ్మా! ఎండిపోయిన మా అరటి తోటల్ని తడుపమ్మా)

మొదటిది బ్రిటిష్‌ మూలాలు కలిగి అక్కడి వాతావరణ పరిస్థితులను సూచిస్తుంది. అది మన దేశానికి ఏ మాత్రం పొసగని పాట. కాని కన్నడ రైమ్‌ అలాంటిది కాదు. పూర్తిగా స్థానికం. మన వ్యవసాయానికి వర్షం ఎంత ముఖ్యమో చెపుతుంది. మనం అరటి పండిస్తామని కూడా చెపుతుంది. ఇదంతా పిల్లలకు జ్ఞానమే కదా!

ఇక ఇతర దేశాల్లో విద్యావిధానం ఎలా ఉందో చూద్దాం. నేడు ఆర్థికంగా అందరికన్నా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనాలో, ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా విద్యాబోధన మాతభాషలోనే జరుగుతోంది.  అయితే మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారు విద్యార్థులకు ఇంగ్లీష్‌, ఇతర యూరోపియన్‌ భాషలను నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. జపాన్‌, కొరియా, ఫ్రాన్స్‌, జర్మనీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ దేశాలన్నిట్లోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరూ వాళ్ళ విద్యార్థులకు సైన్స్‌, గణితం, చరిత్ర, సాంఘిక శాస్త్రం మాతభాషలో నేర్పగలుగుతున్నప్పుడు మన ఉపాధ్యాయులు ఆ పని ఎందుకు చెయ్యలేరు? వాళ్లను ఎవరూ క్లిష్టమైన, కొరుకుడు పడని సిద్ధాంతాలను, సూత్రీకరణలను బోధించమని అడగటం లేదు కదా! వాళ్లు చేయాల్సిందల్లా  ఆయా సబ్జెక్టులలో పిల్లలకి ప్రాథమిక జ్ఞానాన్ని కలిగించడం మాత్రమే.


ప్రఖ్యాత కెన్యన్‌ రచయితా, అమెరికన్‌ యూనివర్సిటీలలో 'ఇంగ్లీష్‌ అండ్‌ కంపారిటివ్‌ లిటరేచర్‌' కోర్సును బోధించే ప్రొఫెసర్‌ గూగీ-వా-థియాంగో ఏమన్నారంటే, ''భాష మన అస్తిత్వం. మన ఆత్మ. జ్ఞాపకాలను నెమరు వేసుకునే మాధ్యమం. కాలమాన పరిస్థితులకు మనల్ని కలిపే వారధి. మన కలలకి పునాది''. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మాతృభాషను ఎలా విస్మరించగలం?

ఇంగ్లీష్‌లో చదువుకోవటం ద్వారా ఉన్నత స్థానాలను చేరుకోగలమనేది చాలామంది నమ్మకం. అందుకే వారు బోధనా మీడియం ఇంగ్లీష్‌లో ఉండాలని కోరుకుంటుంటారు. జ్ఞానపీఠ్‌ అవార్డు పొందిన ఎనమండుగురు కన్నడ రచయితలలో ఐదుగురు ఇంగ్లీష్‌ భాష, సాహిత్యాలలో విశిష్ట జ్ఞానం కలిగినవారు. అయినప్పటికీ వాళ్ళు తమ మాతభాష కన్నడాన్నే రచనా భాషగా ఎంచుకున్నారు.

ఇంగ్లీష్‌ భాష పట్ల మోజుతోటి చాలామంది తల్లిదండ్రులు (మా అమ్మ లాగే) తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివించడానికే ఇష్టపడుతున్నారు. ఇది నిజంగా విషాదం. వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే పిల్లలు ప్రాథమిక విద్యను  మాతభాషలో చదువుకుంటే విషయాలను ఆకళింపు చేసుకోవటం వాళ్లకు చాలా సులువు అవుతుందని. ఎన్నో పరిశోధనలు చెపుతున్నాయి ఈ విషయాన్ని.

ఇంకా చెప్పాలంటే మాతృభాషలో నేర్చుకునే చాలా నైపుణ్యాలను పిల్లలు ఆ తర్వాత నేర్చుకునే భాషలోకి వెంట తీసుకెళ్లగలుగుతారని కూడా ఈ పరిశోధనలు చెపుతున్నాయి. ఉదాహరణకు ఒక పిల్ల లేదా పిల్లవాడు కన్నడ భాషలో (మాతభాషలో) నైపుణ్యం సాధిస్తే ఇంగ్లీష్‌ చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు ఆ నైపుణ్యాన్ని దానికి అన్వయించు కోగలుగుతుంది లేదా గలుగుతాడు. దీని అర్థం ఇంగ్లీష్‌ను అదనపు భాషగా నేర్పితే  పిల్లలు దాన్ని కూడా సులభంగా ఆకళింపు చేసుకోగలుగుతారని. ఇక సమస్య ఎక్కడుంది?

ఈ రోజుల్లో ఇంగ్లీష్‌ రావటం చాలా అవసరమని నేనూ ఒప్పుకుంటాను.
కానీ, దానికే ప్రాధాన్యం ఇచ్చి, మన మాతభాషలను విస్మరిస్తే మనం మన వేర్లను తెగనరుక్కున్న వాళ్లమవుతాం. మూలాలు తెలియని మనుషుల దేశాన్ని సష్టించుకున్న వాళ్లమవుతాం. అందుకే, మనం మన పిల్లల్ని ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకోనిస్తే - ఇంగ్లీష్‌తో సహా - వాళ్లు ఈ భూమి మీద స్థిరంగా నిలబడి రెండు చేతులూ చాపి ఆకాశాన్ని అందుకోగలుగుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎంత అద్భుతంగా ఉంటుంది అది!


(బెంగుళూరు మిర్రర్‌, 6 ఏప్రిల్‌ 2015)

అనువాదం : బి. కృష్ణకుమారి

..........................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి

అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌