Monday, April 5, 2010

వ్యభిచారం కూడా ఒక వృత్తేనా? "ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పై రంగనాయకమ్మ గారి విమర్శ

ఆంద్ర జ్యోతి 5 ఏప్రిల్ 2010 వివిధ లో "ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పుస్తకం పై రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ ను మా బ్లాగు వీక్షకుల కోసం ఇక్కడ తిరిగి పొందు పరుస్తున్నాం .
ఆంద్ర జ్యోతి వారికి కృతజ్ఞతలతో.



వ్యభిచారం కూడా ఒక వృత్తేనా?

ఈ మధ్య నేను చదివిన పుస్తకాల్లో 'సెక్స్‌ వర్కర్‌ ఆత్మ కథ' కూడా ఒకటి. తనను సెక్స్‌ వర్కర్‌గా చెప్పుకున్న నళినీ జమీలా మలయాళీ స్త్రీ (కేరళ). తన ఆత్మకథని ప్రచురించుకున్న కాలంలో ఆమె వయసు 52.

పుస్తకం రాసిపెట్టే పని ఇతరులు చేశారు. కానీ పుస్తకంలో ఆభిప్రాయాలన్నీ ఆమెవే. రాసిన వాళ్ళు చేర్చిన అభిప్రాయాలన్నీ ఆమె ఏకీభవించినవే. నళిని. తన పుస్తకంలో చివరికి తేల్చిన విషయం. 'ఎవరికి తోచిన వృత్తి వాళ్లు చేసుకుంటున్నట్టు, మేము వ్యభిచారం వృత్తి చేసుకుంటున్నాం. మా పనిని కూడా సమాజం. ఒక వృత్తిగా గుర్తించాలి. అన్ని వృత్తులతో పాటే మా వృత్తిని. కూడా సమాన గౌరవంతో చూడాలి'. ఇదీ పుస్తకం సారాంశం.

మానవ సమాజంలో-ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, మతం కన్నా, వైద్యం లేని జబ్బుల కన్నా, అన్ని రకాల దురంతాల కన్న్నా, అతి క్రూరమైన - అతి నీచమైన దురంతం-వ్యభిచారం. సమాజంలో నిరు పేదతనమూ, పురుషాధిక్యతా అనేవి ఏ దశలో ప్రారంభమయ్యామో ఆ దశలో ప్రారంభమైంది వ్యభిచారం. ఇది, పురుషుల కోసమే. స్త్రీలకు ఇది జుగుప్సాకరమైన దురంతం. కానీ ఈ నళిని. వ్యభిచారాన్ని స్త్రీల కోసం కూడా అవసరమైన విధానంగా కనిపెట్టింది. 'సెక్స్‌ అనేది కేవలం మగవాళ్ల అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ, అందరూ భావిస్తూ వుంటారు' అంటూ ఆమె వాపోయింది.

మగవాళ్లు విటులుగా తయారైనట్టే, ఆడవాళ్లు వేశ్యలుగా తయారవడం, వారి ఆనందానికి చక్కని మార్గమనే సూచన ఇస్తుంది ఈ పుస్తకం. ఈ సూచనని కనిపెట్టడంలోనూ. ప్రకటించడంలోనూ, నళిని పాత్ర ఒక్కటే కాదు. కొందరు ఫెమినిస్టుల పాత్ర కూడా వుంది. ప్రతి వ్యభిచారిణి జీవితంలోనూ తప్పకుండా ఏదో ఒక విషాదగాధ వుంటుంది. ముఖ్యంగా బీదరికం వుంటుంది. నళిని ప్రారంభ చరిత్ర కూడా అలాంటిదే. తాగుబోతూ,తిరుగుబోతూ గూండాగిరీ గల మగవాడితో సంసారం ప్రారంభించి. తను కూడా తాగుడు నేర్చి తాగుడు తెగులుతో భర్త మూడేళ్ళకే పోగా. ఇద్దరు పిల్లల పోషణ కోసం కూలి డబ్బులు చాలక, క్రమంగా వ్యభిచార ఆదాయ మార్గం చేపట్టింది నళిని.

కూలి పనికి వచ్చే ఆదాయం రెండు పూటలా తినడానికి సరిపోయేదిగా ఉంటే. ఆమె తన దారి మార్చుకునేది కాదు. ఆ తర్వాత కూడా అప్పుడో మగాణ్ణి. ఇప్పుడో మగాణ్ణి భర్తలుగా నమ్మి. ఆ కాలాల్లో వ్యభిచారం కట్టిపెట్టి. కొత్త భర్తల పాత భార్యలు బైట పడగా ఎక్కడా స్థిరపడ లేక, ఇక వ్యభిచారాన్నే శాశ్వితాధారంగా చేసుకుంది. పేద స్త్రీలందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అలా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం. ధనిక కూటుంబాల స్త్రీలలో, వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే.

వ్యభిచార స్త్రీలకు పోలీసుల నించి ఎదురయ్యే కేసులూ, అనారోగ్య పరిస్థితులూ, గూండాల దాడులూ- వంటి సమస్యల్లో, వారిని ఆదుకోవడానికి 'జ్వాలాముఖి' అనే ఫెమినిస్టు సంస్కర్తల సంఘం వుందని తెలిసి, అందులో సభ్యురాలిగా చేరిన తర్వాతే నళినికి. 'వ్యభిచారం చక్కని వృత్తి' అనే విశ్వాసం కలిగింది. ఆ సంఘం ద్వారా ఆ అవగాహన ఏర్పడిన తర్వాతే రాసిన తన ఆత్మకథలో నళిని. తనని 'సెక్స్‌ వర్కర్‌గానూ, విటుల్ని తన 'క్లయింట్లు' గానూ. ఆ సంబంధాల్ని అవగాహనతో ఏర్పడిన ప్రేమ సంబంధాలు గానూ, అదంతా సమాజం పట్టించుకోనక్కర లేని వ్యక్తుల వ్యక్తిగత విషయంగానూ వివరించింది.

వ్యభిచార స్త్రీలని పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టడం గురించి నళిని మంచి ప్రశ్నలే వేస్తుంది- 'మాది నేరం అయితే. మా దగ్గరికి వచ్చే పురుషులది నేరం కాదా? వాళ్ళని పట్టించుకోరెందుకు? అని, కానీ పోలీసుల దాడుల్లో దొరికిపోయినప్పుడు పురుషులమీద కూడా అరెస్టులూ కేసులూ ఉండడం పత్రికల్లో చూస్తాం. 'వ్యభిచారానికి లైసెన్స్‌' పద్ధతిని ఆమె ఒప్పుకోదు. అది నీచమైన మార్గం- అని కాదు. లైసెన్సుల్ని పోలీసుల నుంచీ. డాక్టర్ల నుంచీ తీసుకోవాంటే అది మళ్ళీ అనేక ఇబ్బందులు తెచ్చి పెడుతుందని ఆమెకు తెలుసు. 'సెక్స్‌ వర్క్‌ని ఒక నేరంగా చూడడం మానెయ్యాలనేది మా డిమాండ్‌, అంటుంది నళిని.

'స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రతి లైంగిక సంబంధమూ పెళ్ళితో ముగియాల్సిందేనా? జీవితాంతమూ ఆ సంబంధం అలా కొనసాగడానికి అవకాశం ఉండదా?' అంటుంది. అంటే, పెళ్ళిళ్ళు వేరే స్త్రీలతో చేసుకోండి. అది వేరు. ఆ తర్వాత కూడా వ్యభిచారం సాగడాని కేం?- అని అర్థం.

ఈ విజ్ఞానం అంతా తనకు, జ్వాలాముఖి సంస్థలో చేరిన తర్వాతే అబ్బినట్టు చెప్పుకుంటుంది. వ్యభిచార సంబంధాలు జీవితాంతమూ సాగకూడదా?- అని ఒక పక్క చెపుతూ. సెక్స్‌ని అమ్మడమూ-కొనడమూ శాశ్విత సత్యాలు కావు. పరిస్థితులే నిర్ణయిస్తాయి అంటుంది ఇంకోచోట. సెక్స్‌ని అమ్మే- కొనే పరిస్థితులు ఎప్పటికైనా బాగుపడాలని ఆమె అభిప్రాయం కాదు.ఆ పరిస్థితులు మారకూడదన్నదే ఆమె వాంఛితం. ఒకసారి. ఒక టీవీ ఇంటర్వ్యూలో టీవీ వాళ్ళు ఆమెని 'ఈ వృత్తి నిర్మూలనకు మీ సంఘం ద్వారా మీరేం చెయ్యదల్చుకున్నారు?' అని అడిగితే. 'ఈ వృత్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని జవాబు చెప్పింది. అంటే, 'సెక్స్‌ ని అమ్మే- కొనే పరిస్థితులేవీ మారనక్కరలేదని. 'వ్యభిచార స్త్రీలకు పునరావాసం' అనే దానికి ఆమె పూర్తిగా వ్యతిరేకం. ఆ పునరావాస పద్ధతుల్లో లోపాలు వుంటే. వాటిని విమర్శించడం కాదు. అసలు పునరావాసం అనవసరం. వృత్తి మానేస్తేనే మర్యాద దొరకడం కాదు. వృత్తి చేసినా తమకు మర్యాద ఇవ్వాలి.

కుటుంబ స్త్రీలకు లేని ఎన్నో స్వేచ్ఛలు. భర్తలు లేని వ్యభిచారిణులకు వుంటాయిని ఆమె వాదం. భర్తకు వండి వార్చటం. అతని మీద ఆధారపడడం మాకు అక్కర లేదు. అతని ఆస్తిపాస్తుల్లో వాటా ఇమ్మని దేవిరించటం మాకు వుండదు అంటుంది. కుటుంబాల్లో స్త్రీలు, వంటలు చేసేది. భర్తల కోసమే కాదు. తమకోసమూ. పిల్లల కోసమూ కూడా. స్త్రీ భర్త నుంచి స్వేచ్ఛని నిలబెట్టుకోవలసింది. తిరుగుబోతు పురుషుల ద్వారా సంపాదించే డబ్బుతో కాదు. ఈ నళిని తన క్లయింట్ల ద్వారా తను ఎలాంటి అవమానాలు పడిందో. ఎంత జుగుప్సాకరమైన ఘట్టాల్లో నించి ఎంత ప్రాణభయంతో బైట పడిందో చెపతూనే, మానాభిమానాలకు చోటులేని ఆ బతుకులోనే. స్వేచ్ఛ వుంటుందని చెపుతుంది.

'ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో, సెక్స్‌ సంబంధంలోకి వెళ్ళదలుచుకుంటే, దానివల్ల మిగిలిన సమాజానికి జరిగే హాని ఏమీ లేనప్పుడు ఆ విషయాన్నొక నేరంగా పరిగణించనక్కర్లేదనేది నా వాదన' అంటుంది. తన వాదనలన్నీ చాలా సరైనవని ఆమె నమ్ముతుంది. క్లయింటుతో' పరస్పర అవగాహన' అంటే, 'డబ్బు బేరం' కుదరడం. అది సెటిలైపోతే, మిగతా విషయాలతో సమాజానికి హాని ఉండదు. తన క్లయింట్లు వేరే స్త్రీలకు భర్తలైనా, ఆ భర్తలు జీవితాంతమూ వ్యభిచారిణులతో కూడా చక్కని అవగాహనతో గడపవచ్చు భార్యల జీవితాలు దుఖ్ఖసాగరాల్లో మునిగి పోయినా. తిరుగుబోతు పురుషులవల్ల. సమాజం నిండా తండ్రులు లేని బిడ్డలు తయారైనా. సమాజానికి హాని వుండదు.

'మాకు కావలసింది. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడమే తప్ప, జాలీ. దయా కాదు' అంటుంది. ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటే. 'వ్యభిచారం కూడా ఒకవృత్తే' అని అర్థం చేసుకోవాలి. 'బ్రతుకు దెరువుకోసం రాళ్ళ తట్టలు మోసినట్టూ, పారిశుద్ధ్యం పనులు చేసినట్టూ మేము ఈ వృత్తిని చేపట్టాం' అంటుంది ఆడ సెక్స్‌ వర్కర్లతో పాటు మగ సెక్స్‌ వర్కర్ల వృత్తిని కూడా ప్రస్తావించింది.

టీచర్లు విద్యాబోధన చేసి డబ్బు తీసుకుంటారు. మధుర గాయకుడు జేసుదాసు పాటలు పాడి డబ్బు తీసుకుంటాడు. ఆ పాటలు విని అందరూ ఆనందిస్తారు. సెక్స్‌ వర్కర్ల వృత్తిని కూడా అలాగే అర్థం చేసుకోమని నా కోరిక అంటుంది. ఈ కోరిక, దొంగలకూ, హంతకులకూ కూడా వుండవచ్చు.'దొంగతనాలు మా వృత్తి' అని దొంగలూ, 'హత్యలు మా వృత్తి' అని కిరాయి హతకులూ గర్వం గా చెప్పుకోవచ్చు. 'మా వృత్తులకు మర్యాద ఇవ్వండి' అని డిమాండ్‌ చేయవచ్చు. ఈమె వాదనల ప్రకరం నేరాలన్నీ వేరువేరు వృత్తులే అవ్వాలి. ఇటువంటి అస్తవ్యస్తపు వాదనలు ఎన్నో. ఈ వాదన ప్రకరం. వ్యభిచారిణుల పిల్లలందరూ. 'మా అమ్మ సెక్స్‌ వర్కర్‌గా పని చేస్తోంది. ఫలానా కంపెనీలో' అని నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి. తన కూతురు తనని అలాగే చక్కగా అర్థం చేసుకుందని నళిని ఎంతో ముచ్చటగా చెప్పుకుంటుంది.

వ్యభిచారాన్ని ఒక చక్కని వృత్తిగా బోధించే సంఘసంస్కర్తల చేతుల్లో పడకముందు ఈమె, తన వ్యభిచారాన్ని రహస్యంగా దాచుకోవాలనే తాపత్రయ పడింది. కానీ, కొత్త జ్ఞానంవల్ల, క్రమంగా వ్యభిచారిణులందరికీ ధైర్యాన్ని నూరిపోసే కార్యకర్తగా ఎదిగింది. ఆ ధైర్యంతోనే తన చరిత్రని సాహన చరిత్రగా చిత్రించుకుంది. కానీ, ఆ ఫెమినిస్టుల్లో కూడా కొందరి మీద ఈమె చాలా అసంతృప్తి పడింది. 'జయశ్రీ లాంటి కొద్దిమంది తప్ప, సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్‌ వర్కర్లకు గుర్తింపు నివ్వడానికి ఇష్టపడడం లేదు. సెక్స్‌ అనేది మగవాళ్ల అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ. అందరూ భావిస్తూ వుంటారు. చాలామంది ఫెనిమిస్టుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా లేదు' అని ఆ ఫెనిమిస్టుల మీద అసంతృప్తి ప్రకటించి వాళ్ల పరువు కాపాడింది. 'ఆడ వాళ్ళ అవసరం గురించి ఆడవాళ్ళకు ఈమె చాలా నేర్పబోయింది. గానీ అసలు ఆ విషయం అనేక ప్రశ్నలు సృష్టించింది. తన అవసరం కోసమే తను ఆరకంగా చేస్తున్నానని ఆమె ఆర్థమా? అది తన ఆవసరమే అయితే, దానికి డబ్బు ఎందుకు తీసుకోవాలి? జవాబు లేదు.

వ్యభిచారం అనేది. కుట్టు పనీ. నేత పనీ. వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికీ కావాలి. కానీ. సెక్సు అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు. ఇంత చిన్న జ్ఞానం, ఈమెకు, వికృత మార్గాలు కనిపెట్టే రకపు ఫెనిమిస్టులు ద్వారా అందలేదు.

నిజానికి, వ్యభిచారిణి అయినా, తన నిస్సహాయ చరిత్రని చెప్పి'మా జీవితాల వంటి నీచమైన జీవితం ఏ స్త్రీకి సంభవించకూడదు. ప్రపంచం ఏ నాటికైనా వ్యభిచారం అనే రోత మాటని మరిచి పోవాలి' అనే ఆశతో ముగిస్తే, ఆ రెండు మాటలే ఉత్తమ సందేశంగానూ, ఆమె పూర్తిగా నిర్దోషిగానూ అవుతుంది.

15 comments:

  1. వ్యాసం బాగుంది. వ్యభిచారాన్ని ఏ రకంగా వృత్తి అనుకోవాలి? భర్యాభర్తల మధ్య శృంగారం వేరు, సెక్స్ ని అమ్మకపు సరుకుగా మార్చే వ్యభిచారం వేరు. ముక్కూమొహం తెలియనివాళ్ళకి శరీరాన్ని అర్పించే వృత్తి ఒక వృత్తా?

    ReplyDelete
  2. ప్రశ్నించే జ్ఞానం ఉన్నా సరే మన సమాజం మూసగా సాగిపోతూ ఉంటుంది. అందుకే సామాజిక కట్టుబాట్లు
    వాస్తవాలను మరుగున పడేస్తూ ఉంటాయి. ఇక్కడే ప్రశ్నించే తత్వం ఉపయోగపడుతుంది. రంగనాయకమ్మ గారు
    ఎప్పటి నుంచో చేస్తున్నది ఇదే. ప్రతి విషయాన్ని ప్రశ్నించుకుంటూ పోతూ వాస్తవికతకు దగ్గరగా సమస్య
    మూలాలను కనుగునే ప్రయత్నం రంగనాయకమ్మ గారు మాత్రమే చేయగలరు. వ్యభిచారం కూడా వృత్తి గా
    చెప్పుకునే స్థాయి ఈ సమాజం వాళ్లను దిగజార్చేలా చేసింది. శరీరాన్ని డబ్బులకు అమ్ముకోవడమంటే అంతకంటే
    నీచం ఉండదేమో. ఓ సమాజిక అంశానికి చక్కటి విశ్లేషణనను అందించిన రంగనాయకమ్మగారు అభినందనీయులు. వ్యభిచారం ఎప్పటికీ ఓ వృత్తి కానేరాదు. పడుపు వృత్తిని ఎంజాయ్ చేస్తున్న వారు మాత్రమే
    ఆ మాటలు చెప్పగలరు.

    అనంతోజు ఫణికుమార్

    ReplyDelete
  3. వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేసేవాళ్ళు తమ కుటుంబానికి చెందిన స్త్రీలని వేశ్యలుగా పంపించడానికి ఒప్పుకోరు. ఎందుకు అని అడిగితే మన కుటుంబ సభ్యులు కొన్ని పనులు చెయ్యడం మనకి నచ్చదు, అంతమాత్రాన అవి అపవిత్రమైన పనులు అయిపోవు అని అంటారు. ద్వంద్వ నీతి అంటే ఇదే.

    ReplyDelete
  4. శారీరక శ్రమ లేని పని ఏదీ కూడా వృత్తికాదనేది నిర్వివాదాంశం.అంతేకాదు..
    శ్రమ, తద్వారా సమాజానికి ఒక ఉత్పత్తి లేదా ఒక ప్రయోజనాన్ని అందజేయడం వృత్తి యొక్క ప్రధాన లక్షణం. వ్యభిచారం ఒక వృత్తి అనుకుంటే...సమాజ గుర్తింపులేని ఒక తరం ఉత్పత్తి అయితే, వివాహేతర సంబంధాలను ఒక ప్రయోజనంగా అనుకోవాలి. వీధిబాలలను సమర్ధించడం సహేతుకం కాదు. ఆత్మకధలో తనకేమి కావాలో తనకే స్పష్టతలేకుండా ఉందనిపిస్తుంది.

    ReplyDelete
  5. ఇదొక ఆత్మకథ. సుద్దులు బోధించే నీతికథ కాదు. ఆ జ్ఞాతిలేకుండా రంగనాయకమ్మగారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది.

    ReplyDelete
  6. రంగనాయకమ్మ గారిని ఉంది అని ఏక వచనంతో సంబోధించడం బాగాలేదు. ఆ ఆత్మకథలో స్పష్టత లేదని నాకు కూడా అనిపిస్తోంది. ఆ పుస్తకంపై రివ్యూలు వ్రాసినవాళ్ళు కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. రివ్యూలు వ్రాసినవాళ్ళలో ఒకరైన రాజిరెడ్డి గారితో నేను మాట్లాడినవి గుర్తున్నాయి.

    ReplyDelete
  7. @చెరసాల శర్మ: మరొక్కసారి నా వ్యాఖ్యను చదువుకోండి. "చేసినట్టుంది" అనేది ‘జడ్జిమెంటుకు’ సంబంధించిన క్రియ, రంగనాయకమ్మగారి గౌరవానికి కాదు. ఏకవచనంతో సంబోధించాలి అనుకునుంటే "గారు" తగిలించేవాడినే కాదు.

    ReplyDelete
  8. కత్తి మహేష్‌ కుమార్‌ గారూ,

    మీ తెలుగు వ్యాకరణం తప్పు. చాలా తప్పు.
    "ఆ జ్ఞాతిలేకుండా రంగనాయకమ్మగారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది" అన్నది మీ వాక్యం.
    ఇందులో "రంగనాయకమ్మగారు" అన్నది కర్త.
    "జడ్జిమెంటు" కర్మ.
    "చేసిపారేసినట్టుంది" అన్నది క్రియ.
    క్రియ ఎప్పుడూ కర్మతో కనెక్టు అయి వుండదు. క్రియ ఎప్పుడూ కర్త తోనే కనెక్టు అయి వుంటుంది.
    ఇక్కడ "చేసిపారెయ్యడం" అన్నది క్రియ. ఒక క్రియకి కర్తని బట్టి కొన్ని రూపాలు వుంటాయి.
    నిజానికి "చేసి పారెయ్యడం" అన్నది రెండు పదాలు. అందులో "చేసి" అన్నది క్రియా విశేషణం. "పారెయ్యడం" అన్నది మాత్రమే క్రియ. సులభం కోసం "చేసిపారెయ్యడం" అన్న పదాన్ని ఒక క్రియగానే తీసుకుంటున్నాను.
    మీరు వాడిన క్రియ "చేసిపారేసినట్టుంది", నిజానికి "చేసి పారేసినట్టు వుంది" అని రాయాలి. ఇక్కడ "చేసి", "పారేసినట్టు" అన్నవి క్రియా విశేషణాలుగా వుంటాయి. "వుంది" అన్నది మాత్రమే అసలు క్రియ.
    "కత్తి మహేష్ కుమార్‌ గారు చేసిపారేశారు" అన్నది ఒకటి. ఇక్కడ కర్త మర్యాద పూర్వకంగా వుంది. అప్పుడు క్రియలో కూడా ఆ మర్యాద చిహ్నం ఉండాలి.
    "కత్తి మహేష్ కుమార్‌ చేసిపారేశాడు" అన్నది ఒకటి. ఇక్కడ కర్తలో మర్యాద పూర్వక చిహ్నం లేదు. అందుకని క్రియకి కూడా ఉండనక్కరలేదు. "కత్తి మహేష్‌ కుమార్‌ చేసిపారేశారు" అని రాస్తే, "గారు" అనే పదం మర్యాద చిహ్నంగా తగిలించకపోయినా, అది ఉందనే అర్థం క్రియని బట్టి. ఒక వాక్యానికి ఎప్పుడూ క్రియే చాలా ముఖ్యం. "కత్తి మహేష్ కుమార్ గారు చేసిపారేశాడు" అన్న దాంట్లో క్రియలో మర్యాద చిహ్నం లేదు. కర్తలో మాత్రమే వుంది.క్రియ విషయంలో అది అమర్యాదకరంగానే లెక్క. ఇక్కడ అన్ని రూపాల గురించీ చెప్పడం లేదు.

    ఒక బాషలో రాస్తున్నప్పుడు ఆ భాష వ్యాకరణం తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే తెలిసో, తెలియకో అమర్యాదకర పదాలు వచ్చేస్తూ వుంటాయి.

    ReplyDelete
  9. బాబూ కత్తి గారూ, తమరు ఆ ఆత్మకధ చదివారా అసలు? లేకపోతే ఈ విమర్శనాత్మక వ్యాసం మాత్రమే చదివి, తమరి పైపైన అభిప్రాయాలు వెళ్లబుచ్చేస్తున్నారా? చదివితే, ఇందులో సుద్దులు లేవు అని దృతరాష్ట్రుడిలాగా అనరు తమరు. కనీసం ఈ వ్యాసం శ్రద్ధగా చదివినా, ఆ ఆత్మకధలో ఎటువంటి సుద్దులు వెళ్ళబుచ్చారో అర్థం అవుతాయి. ఒక రచయిత్రి మీద విషాన్ని కక్కటానికి, చేతికి ఏది వస్తే అది రాయనవసరం లేదు.

    ReplyDelete
  10. kamala గారూ,
    కత్తి మహేష్ కుమార్ గారి వాక్యంలో వ్యాకరణ దోషం గురించి మీ విచికిత్స చూశాను. మీ వ్యాఖ్య చదివాక ఓ సందేహం వచ్చింది.
    ఆయన వాక్యం- "ఆ జ్ఞాతి లేకుండా రంగనాయకమ్మ గారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది".

    ‘చేసిపారేసినట్టుంది’ అనటంలో వ్యంగ్యం ఉందని తెలుస్తూనే ఉంది. ‘చేసిపారేసినట్టున్నారు’ అని రాసివుంటే స్పష్టంగా ఉండేది.
    కానీ మహేష్ గారు రాసిన వాక్యాల్లాంటివి కూడా తెలుగులో సాధారణమే. ‘కమల గారు ఆ పాటను పాడుకుంటున్నట్టుంది’,‘ప్రసాద్ గారు తన గతాన్ని మర్చిపోయినట్టుంది’, 'రావు గారు పాత సంగతుల్లో మునిగిపోయినట్టుంది’... లాంటి వాక్య నిర్మాణాలు కూడా లేకపోలేదు.
    ఇలాంటి వాక్యాల్లో ‘గారు’ లేకపోతే గౌరవ సూచన లేదని అనుకోవచ్చు. కానీ ‘గారు’ రాశాక కూడా గౌరవ సూచన లేదనుకోవచ్చా?

    ReplyDelete
  11. కత్తి మహేశ్ కుమార్ గారూ,
    రంగనాయకమ్మగారు తన వ్యాసం ఆఖరి పేరాలో చెప్పినట్టు - ఈ ఆత్మ కథ రాసినావిడ తన కథ మాత్రం చెప్పి ఊరుకోలేదు. వ్యభిచారం మీద తన అభిప్రాయాలు కూడా చెప్పింది. సమాజంలో వ్యభిచారం కూడా ఒక వృత్తేననీ, అదలాగే కొనసాగాలనీ ఇంకా ఇలాంటి అభిప్రాయాలు చెప్పింది. వీటిని సుద్దులు కాక ఇంకేమంటారు? - భూషణ్, హొసూరు, తమిళనాడు.

    ReplyDelete
  12. @భూషణ్: ఆత్మకథలో అదిరాసిన వ్యక్తి అనుభవాలతోపాటూ, అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి. అంతమాత్రానా అవి అందరూ ఆచరించాలనే ఆశయం ఉందనే అపవాదు సరైనదికాదనే నా వాదన.ఉదాహరణకు హిట్లర్ తన ఆత్మకథలో తాను నమ్మింది రాశాడు. దాంతో మనం విబేధించొచ్చు. కానీ అలా రాయడమే తప్పంటే ఎలా?

    అయినా, వేశ్యవృత్తి భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన వృత్తి. కాబట్టి అది వృత్తా కాదా అనే ప్ర్రశ్నే ఉత్పన్నంకాదు. వ్యభిచారం అనే పదం నైతికతకు సంబంధించింది. వృత్తికి కాదు.కాబట్టి సెక్స్ వర్కర్లను వ్యభిచారులు అనడం ఎంతవరకూ సమంజసమో నాకు తెలీదు. కానీ నైతికత ప్రాతిపదికన ఆ fair trade ని అవమానపరిచేలా మాట్లాడటం ఎంతవరకూ సమంజమో నాకైతే ప్రశ్నార్థకమే.

    వేశ్యవృత్తి చట్టవ్యతిరేకం కాదు. పబ్లిక్ గా విటుల్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యడం నేరం. వ్యవస్థీకృత బ్రోతల్స్ చట్టవ్యతిరేకం.ఔనన్నా కాదన్నా సమాజంలో వ్యభిచారం ఉంది. ఉంటుంది. గౌవమైన కుటుంబాలలో మాత్రం వ్యభిచరించడం లేదా! ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.

    ReplyDelete
  13. చెరసాల శర్మ గారూ,
    చాలా మధ్యతరగతి కుటుంబాలకు పారిశుధ్య పని చేయటం ఇష్టం ఉండదు. అలా అని పాకీ పని ఒక వృత్తి కాకుండా పోదు. ఇంకా మాట్లాడితే పాకీ వాళ్ళు లేకుండా రోడ్లు గబ్బు కొడతాయి.
    అలానే మధ్య తరగతి అయిష్టమైన నిర్బంధ వివాహాలలో చిక్కుకొని విలవిల్లాడే జనాలకు వేశ్యావృత్తి ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిదేమో. వాళ్ళు లేక పోతే సమాజం ఇంకా కంపుకొడుతూ ఉండేదేమో. కాబట్టీ వెశ్యా వృత్తిని తక్కువ చేయటం సరైనది కాదు. మన మధ్య తరగతి విలువలని దాటి చూడగలిగితే దానిలోనూ అనేక విషయాలు వృత్తిపరమైనవి ఉంటాయి.
    ఇక కొత్త వాళ్ళతో సెక్స్ చేయటం గురించి...ఓ పదేళ్ళ కిందటి దాకా మన వివాహ వ్యవస్థ ముక్కూ మొహం తెలియని వాళ్ళకి పెళ్ళి చేసి వాళ్ళని ఒక గది లోకి తోసి సెక్స్ చేసుకొనమనలేదా? ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో అదే తంతు.
    జనాలందరికీ సంతృప్తికరమైన వివాహజీవితాలుండి, వాళ్ళకి వేశ్యల వద్దకు వెళ్ళాలనిపించక పోతే, అది సంతోషించతగ్గ విషయం.మహా కవి గురజాడ లాంటి వ్యక్తి సమాజ ద్వంద్వ నీతిని చూపటానికి ఒక వేస్య పాత్రను ఎంచుకొన్నారు. వేస్యలకు రంకు ఉండదు. వాళ్ళు డబ్బు తీసుకొంటారు కాబట్టీ. సమాజం లో వేశ్యలు కాని వారు ఎంత మంది రంకు చెయ్యరు? సగం వళ్ళు కనపడేటట్లు బట్టలు వేసుకొనే గొప్పింటి బిడ్డలను ఏమనాలి. వాళ్ళను ఎవరైన కామెంట్ చేస్తే వారి స్వేచ్చకు భంగం కలిగింది అంటారు.
    ఐరోప దేశాల్లో చాలా మంది వెశ్యలు వాలంటరీ గానే ఆ వృత్తిలోకి దిగుతారట. దాని లోని కష్ట నష్టాల గురించి ఒక బ్లాగు చదివాను. మన దేశం లో దాంట్లోకి తోయబడే వారే ఎక్కువ.సామ్యవాద వ్యవస్థ లో ఎవరైనా ఒక వృత్తిని ఎంచ్కునే స్వాతంత్ర్యం ఉంటుంది కదా..?
    ఈ విషయం లో కత్తి మహేష్ గారు క్లారిటీ తో మాట్లాడారనిపిస్తుంది.

    ReplyDelete
  14. ఆంధ్రుడు గారు. పాకీ పని గురించి కెనడాలో ఉన్న నా స్నేహితురాలుతో మాట్లాడినప్పుడు ఎవరి లెట్రిన్లు వాళ్ళే కడుక్కోవాలి అని ఆమె అంది. మన అశుద్ధం కడుక్కోవడం మనకే నామోషీ. అందుకే పాకీ వృత్తి ఉంది. మేము బాగా ఉన్నవాళ్ళమే కానీ మేము బాత్ రూమ్ ని గానీ, లెట్రిన్ ని గానీ పని మనిషి చేత కడిగించలేదు.

    ReplyDelete
  15. vaesyaa vrutthi gurunchi inni abhipraayaalu vaaammmo

    intha varaku vyabhichaari vaddaku velle avasaramu raaledu.

    ika pai raakoodadhu.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌