Thursday, July 30, 2015

జైల్లో పుట్టిన కవితలు

నది పుట్టిన గొంతుక 
( జైలు కవితలు )
- బొజ్జా తారకం 


"గంగ హిమాలయాల్లో పుట్టింది
గోదావరి త్రైంబకంలో పుట్టింది
ఈ కవిత జైల్లో పుట్టింది
గంగ, గోదావరి ప్రవహించి, ప్రవహించి సముద్రంలో కలిశాయి
గోదావరి సముద్రంలో కలిసిన చోట పుట్టాను నేను
ఈ కవిత జనసంద్రంలో కలుస్తుందని ఆశిస్తున్నాను"

...
1975 జూన్‌ ఇరవై ఆరో తారీఖున అత్యవసర సరిస్థితి ప్రకటించారు. కొన్ని వేల మందిని జైళ్ళలో నింపారు. దేశం అంతా భయం ఆవరించింది. నాకు తెలిసిన వాళ్ళు చాల మంది అరెస్టయ్యారు. 'ఇందిరాగాంధీ విధానాలు వ్యతిరేకిస్తున్నారు' అనుకున్న వాళ్ళను అరెస్టు చేశారు. రాజకీయ కార్యకర్తలకు ఎలానూ తప్పదు; రచయితలను కూడా అరెస్ట్‌ చేశారు. ''ప్రజలతో ఇప్పటికే చాల సంబంధాలు పెంచుకున్నాడు, అంతేకాదు ఇతను రచయిత కూడా'' అని పోలీసులు నా గురించి రిపోర్టులు పంపిస్తున్నారు ఎప్పటి నుంచో.

... ... ...

నిజామాబాద్‌ జైలు చాలా ఎత్తైన కొండమీద ఉంది. పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాలి. దేవాలయాన్ని నిజాం ప్రభుత్వం జైలుగా మార్చిందంటారు. ఎవర్నో ఒకర్ని బంధించడానికే రెండూను. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాసినందుకు దాశరథిని ఇదే జైల్లో ఉంచారు. రచయితగా నేను రెండోవాడిని.

... ... ...

భారత రక్షణ చట్టం క్రింద మమ్మల్ని అరెస్టు చేశారు; కాబట్టి బెయిలు కోసం దరఖాస్తు పెట్టాము. కోర్టు బెయిలు ఇచ్చింది. బెయిలు ఆర్డరు కంటే ముందుగానే పోలీసు వ్యాన్‌లు వచ్చాయి జైలుకు. జైలంతా తెలిసిపోయింది మళ్ళీ అరెస్టు చేస్తారని. నాతో మరో ఇద్దర్ని విడుదల చేయమని కోర్టు ఆర్డర్‌. ముగ్గురమూ కిందికి దిగి వచ్చాం. పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సరిగ్గా మెట్ల దగ్గర ఉన్నాడు...చుట్టూ సాయుధులైన పోలీసులు...వాళ్ళిద్దర్నీ ఏమీ అనలేదు. నన్నొక్కణ్ణే అరెస్టు చేశారు... ఈసారి ఆంతరంగిక భద్రతా చట్టం క్రింద.

పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు...కందికుప్ప నుంచి నాన్న వచ్చారు.
ఆ రాత్రే తీసుకువచ్చారు చెంచల్‌గూడా సెంట్రల్‌ జైలుకు. జ్వరంలోనే తీసుకు వచ్చారు. రాత్రి ఒంటిగంటకు బస్‌లో ప్రయాణం. నాకు రెండు వైపులా తుపాకీలతో పోలీసులు. అరెస్టు అయిన వ్యక్తి కంటే చూసేవాళ్ళు హడలిపోవాలి...
అక్కడ దాదాపు సంవత్సరం ఉన్నాను. డిటెన్యూలు రెండు వందల మందిపైగా. వారందరితో జైలు జీవితం చాల గొప్ప అనుభవం.
... ... ...

ఒకరోజు ఎందుకో హఠాత్తుగా 'నీతో చెప్పనే లేదు' అన్న వాక్యాలు వచ్చాయి... వ్రాశాను...ఆ తర్వాత...ఏదో ఆలోచన ఉబికి వచ్చేది...వాక్యాలు తొణికి వచ్చేవి... వ్రాసు కుంటూ వెళ్ళిపోయాను. మిత్రులకు చదివి వినిపిస్తుండే వాడిని. మెచ్చుకొనేవారు. శివుని త్రిశూలంలా ఉండేవి పువ్వులు ఒక చెట్టుకి...ఆ చెట్టు కింద కూర్చుని చదువుకొనేవాణ్ణి. అక్కడే కూర్చుని వ్రాసుకుంటూ ఉండేవాడిని.
ఆ నిర్బంధంలో పుట్టుకొచ్చిన కవితలివి

నది పుట్టిన గొంతుక
( జైలు కవితలు )

- బొజ్జా తారకం

ధర    :    రూ. 60/-
మొదటి ముద్రణ    :    మార్చి 1983,  జనపద ప్రచురణలు - 2
పునర్ముద్రణ    :    2015

ప్రతులకు, వివరాలకు    :హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500 006.

 ఫోన్‌ : 040 23521849
ఇ మెయిల్ ఐడి : hyderabadbooktrust@gmail.com

Wednesday, July 29, 2015

చరిత్ర రచనపై బాలగోపాల్‌

చరిత్ర రచనపై

బాలగోపాల్‌


బాలగోపాల్‌ రాసిన 'ప్రాచీన భారతదేశ చరిత్ర : డి.డి. కోశాంబి పరిచయం' తెలుగు పాఠకులకు సుపరిచితమే. 1986 నుండి ఎన్నో పునర్ముద్రణలు పొందింది  ఆ పుస్తకం. దానికి ముందు, తర్వాత చరిత్రపై బాలగోపాల్‌ రాసిన  పది వ్యాసాలను కలిపి ఇప్పుడు మరో పుస్తకం తీసుకొస్తున్నాం. 


ఇందులో సగం వ్యాసాలు వివిధ పుస్తకాలపై సమీక్షలుగా రాసినవి. రెండు నేరుగా బుక్‌లెట్స్‌ రూపంలో వచ్చినవి.

ఒకటి హిస్టరీ కాంగ్రెస్‌లో ఆధునిక ఆంధ్రదేశ చరిత్రపై ఇచ్చిన అధ్యక్షోపన్యాసం. పాతికేళ్ళలో (1981-2007) అక్కడక్కడా వచ్చిన ఈ వ్యాసాలు 'చరిత్ర' కంటే చరిత్ర రచనా పద్ధతిని ఎక్కువగా చర్చించినందువల్ల ('భారత కార్మిక ఉద్యమ చరిత్ర' వ్యాసం మినహా) ఈ పుస్తకానికి దాన్నే శీర్షికగా పెట్టాం.

    ఈ వ్యాసాలలో కనీసం రెండు మూడు శతాబ్దాలకు చెందిన అనేక పేర్లు, సంఘటనల ప్రస్తావన ఉన్నందువల్ల పాఠకుల సౌలభ్యం కోసం ఫుట్‌నోట్లు ఇచ్చాం. ఎంత ప్రయత్నించినా కొందరి గురించి, కొన్నిటి గురించి పూర్తి సమాచారం దొరకలేదు. ఎవరైనా ఇవ్వగలిగితే తర్వాతి ముద్రణలో చేరుస్తాం. ఈ విషయంలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి సవరించుకుంటాం. 


మన్నం బ్రహ్మయ్య, వేమన వసంతలక్ష్మి చేసిన ఈ పనిలో స్వాతి వడ్లమూడి, చిట్టిబాబు పడవల, జిలుకర శ్రీనివాస్‌,  మోతుకూరు నరహరి సహకారం కూడా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు.

- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
చరిత్ర రచనపై బాలగోపాల్‌

227 పేజీలు  

ధర   :    రూ. 130/-

తొలి ముద్రణ    :    జూలై 2015

కవర్‌ డిజైన్‌    :     అనంత్‌   

ప్రతులకు, వివరాలకు    :   

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ,  ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006.        
ఫోన్‌ : 040- 23521849
ఇ మెయిల్ ఐడి : hyderabadbooktrust@gmail.com   

Friday, July 17, 2015

HYDERABAD BOOK TRUST NEW BOOK NALLAJATHI NIPPU KANIKKA

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌