Friday, December 22, 2017

సత్యసాయిబాబా : స్వర్గం వేచి ఉంటుందిలే! - గౌరి లంకేశ్

సత్యసాయిబాబా : స్వర్గం వేచి ఉంటుందిలే!
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" 
పుస్తకం నుంచి )

సాయిబాబాకు సంబంధించిన ఏ విషయమూ స్పష్టంగా ఉండదు.
అన్నిటి చుట్టూ వివాదాలు ముసిరి ఉంటాయి.
ఆయన తాను చెప్పుకుంటున్నట్లు నిజంగా షిర్డీ సాయిబాబా అవతారమా?
లేక ఇంద్రజాలికుడు పి.సి. సర్కార్‌ జూనియర్‌ 'సండే' పత్రికలో రాసినట్లు మంచి హస్తలాఘవం గల గారడీవాడు మాత్రమేనా?
లేక భక్తులు భావిస్తున్నట్లు మానవాతీతుడైన దైవదూతా?
లేక ఒక అమెరికన్‌ భక్తుడు తన పుస్తకంలో రాసినట్లు కేవలం సందర్శకులను మురిపించే వ్యక్తా?

గత వారం జరిగిన సంఘటనను అతనిపై హత్యా ప్రయత్నంగా చూడాలా, లేదా అనేది కూడా వివాదాస్పద అంశమే.
పుట్టపర్తి ఆశ్రమ నిర్వాహకులు ఈ సంఘటనపై నోరు విప్పడం లేదు.
ఇక స్వామి తన సహజ నిర్వికార భంగిమలోకి తిరిగి వెళ్ళిపోయారు.
కేసును విచారిస్తున్న పోలీసు అధికారుల్లో కొందరు మాత్రమే ఇది నిజంగా హత్యా యత్నమేనా అని సందేహించడం మొదలుపెట్టారు.

కొన్ని వాస్తవాలు మాత్రం స్పష్టంగానే వున్నాయి.
ఆదివారం (జూన్‌ 6, 1993) రాత్రి పదిగంటలకు నలుగురు సాయిబాబా భక్తులు పుట్టపర్తి ఆశ్రమం లోపల ఆయన నివాసముండే మందిరానికి వెళ్ళారు. సాయిబాబాని కలవాలనుకుంటున్నట్లు అక్కడున్న వారికి చెప్పారు. ఆ నలుగురూ ఆశ్రమంలో నివసిస్తున్నవారే. అక్కడ వుండే ఇతర భక్తులకు తెలిసిన వారే. వాళ్ళ పేర్లు సురేష్‌ శాంతారాం ప్రభు (35), జగన్నాథం (40), సురేష్‌ కుమార్‌ (33), సాయిరామ్‌ (25).

అందరికీ తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు స్వామికి ఒక టెలిగ్రామ్‌ ఇవ్వడానికి వచ్చామని చెప్పినప్పుడు నిజానికి ఎవరూ అంతగా కలవరపడాల్సిన పనిలేదు. కాని వారు మందిరం లోపలికి వెళ్ళడానికి భక్తులు అనుమతించలేదు, పైగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆశ్రమ వర్గాల కథనం ప్రకారం అప్పుడు ఆ నలుగురూ అక్కడున్న భక్తులపై కత్తులతో దాడి చేశారు.

సాయిబాబా వక్తిగత సిబ్బందిలో ఒకరైన రాధాకృష్ణ, సాయికుమార్‌ అనే ఒక విద్యార్థి ఈ కత్తిపోట్ల వల్ల మరణించారు.
కత్తిపోట్లకు గురైన మరో ఇద్దరు ఆసుపత్రిలో వున్నారు.
అధికార వర్గాల కథనం ప్రకారం ఈ గొడవ జరిగేటప్పుడు తన పడకగదిలో వున్న సాయిబాబా వెంటనే అక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూసుకున్నారు. ఆ భవనంలోనే గదికి ఆనుకుని వున్న మరో భాగంలోకి వెళ్ళి లోపలి నుంచి తలుపులను గడపెట్టుకుని, మెట్ల ద్వారా కిందకి దిగి గరాజ్‌లోకి వెళ్ళారు. అంతేకాదు అలారం, సైరన్‌ మోగే ఏర్పాటు కూడా చేసినట్టున్నారు. సైరన్‌ మోగగానే ఆశ్రమం అంతా ఒక్కసారిగా విద్యుద్దీపాలు వెలిగాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ రక్షణ ఏర్పాట్లను చూసి గందరగోళపడ్డ ఆ నలుగురు సాయిబాబా నివాసంలోని ముందుగదిలోకి వెళ్ళి లోపల గడి వేసుకుని తమని తాము బంధించేసుకున్నారు. బయటికి రమ్మని ఎందరు అభ్యర్ధించినా వాళ్లు తలుపు తియ్యలేదు.

ఆ తర్వాత ఏమైందన్నది కొంతవరకూ అంతు చిక్కని వ్యవహారంగానే మిగిలి పోయింది.
ఒక కథనం ప్రకారం పోలీసులు ముందుగది తలుపులు కొంతభాగం పగలగొట్టి లోపలికి ఎడాపెడా కాల్పులు జరపడం వల్లనే ఆ నలుగురూ చనిపోయారనేది. ఆ ప్రాంతపు పోలీసు అధికారి కె.ఎన్‌. గంగాధర్‌ కథనం ప్రకారం - దాడులకు పాల్పడ్డ ఆ నలుగురినీ భయపెట్టి లొంగదీసుకోవాలన్న ఉద్దేశంతో 'సాహసికులైన' పోలీసు అధికారులు తలుపులు పగులగొట్టి ముందుగదిలోకి వెళ్ళారు. కాని ఆ నలుగురు కత్తులతో పోలీసులపై దాడికి దిగారు. అందువల్ల 'సాహసికులైన' పోలీసులు వారిని కాల్చి చంపాల్సి వచ్చింది.

కాని ఆ నలుగురూ 'దాడి'కి పాల్పడాలనుకోవడం వెనక ఉద్దేశం ఏమై ఉంటుందో చెప్పడానికి ఎవరూ సుముఖంగా లేరు.
పోనీ తమ ఉద్దేశమేమిటో చెప్పడానికి హంతకులుగా ఆరోపించబడుతున్న ఆ నలుగురు బతికి లేరు.
ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి కూడా సాయిబాబా వ్యక్తిగత గురువు కదా!

అందుకే ఆ హోదాకు తగినట్లుగా ఈ ఘటనపై అధికార యంత్రాంగం అతి వేగంగా, అత్యంత చురుకుగా స్పందించింది. అగ్రస్థానాల్లో ఉన్నవాళ్ళు స్వయానా రంగంలోకి దిగారు. కశ్మీర్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో రగులుతున్న సమస్యలను పక్కన పెట్టి మరీ సాక్షాత్తు భారతదేశ హోం మంత్రి ఎస్‌.బి. చవాన్‌ (ఆయన కూడా బాబా భక్తుడే) దగ్గరుండి స్వయంగా నేరవిచారణను పర్యవేక్షించడానికి ఆగమేఘాల మీద పుట్టపర్తికి చేరుకున్నారు.

స్వామి భద్రత పట్ల ఆందోళన పడుతున్న ప్రధాని నరసింహారావే చవాన్‌ని పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ గతంలో ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడు 'విదేశీ హస్తం' బూచిని ఎక్కువగా చూపిస్తూ వచ్చేది. ఈ మధ్య దాని స్థానంలో 'బి.జె.పి హస్తాన్ని' ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ కేసులోనూ 'బి.జె.పి హస్తం' ఉందంది కాంగ్రెస్‌. ఈలోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ కమిషనర్‌ హెచ్‌.జె. దొరను పుట్టపర్తికి పంపించింది. ఆధారాల కోసం అని చెప్పారు కాని ఆయన్ని అక్కడికి పంపించడం వెనక ఉన్న అసలు ఉద్దేశం వేరని కొద్దిరోజుల్లోనే స్పష్టమైంది. ఆర్‌.ఎస్‌.ఎస్‌ లేదా వి.హెచ్‌.పికి ఈ సంఘటనతో ఏదన్నా సంబంధం ఉందేమో పరిశీలించడానికే ఆయన్ని అక్కడికి పంపారట. అప్పటివరకూ నోరు విప్పని బాబా భక్తులు హెచ్‌.జె. దొర అక్కడికి వెళ్ళారో లేదో మాట్లాడడం ప్రారంభించారు. ఆ నలుగురికీ వి.హెచ్‌.పి ప్రధాన కార్యదర్శి అశోక్‌ సింఘాల్‌ తెలుసని,  సింఘాల్‌ గత ఫిబ్రవరిలో ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆయన్ని కలిశారని చెప్పారు.

దివ్య శక్తులు, ఎందరో భక్తులు ఉన్న స్వామిని ఆర్‌.ఎస్‌.ఎస్‌ లేదా వి.హెచ్‌.పి ఎందుకు చంపాలనుకుందో వెంటనే ఎవరికీ అంతుపట్టలేదు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఆ వాదననే కొనసాగిస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ ఈ సంఘటనను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని కోపగించుకున్న బి.జె.పి అసలు అక్కడేం జరిగిందో తేల్చేందుకు పూర్తిస్థాయి విచారణ జరపమని పట్టుబట్టింది. అప్పుడు గాని కాంగ్రెస్‌ వెనక్కి తగ్గలేదు.

ఈలోగా ఒకవైపు ఎస్‌.బి. చవాన్‌ సాయిబాబాతో అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడారు. మరోవైపు పుట్టపర్తి కాంప్లెక్స్‌లో ఒక్కొక్కటి ఏభై కేజీల బరువు ఉన్న మూడు ల్యాండ్‌మైన్లు దొరికాయని పోలీసులు చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం 'వృత్తి శిక్షణా కేంద్రం' పరిసరాల్లో ఈ ల్యాండ్‌మైన్లు దొరికాయి. ఇప్పుడు విరివిగా వాడుతున్న పేలుడు పదార్థమైన ఆర్‌.డి.ఎక్స్‌తో తయారైన  ల్యాండ్‌మైన్లట అవి. బొంబాయి నుంచి కొందరు ఏజెంట్ల ద్వారా ఈ ఆర్‌.డి.ఎక్స్‌ సరఫరా అయిందని పోలీసులు చెప్పారు. ఈ కొత్త సమాచారం మరింత గందరగోళాన్ని సృష్టించింది. వి.హెచ్‌.పికి ఆగర్భ శత్రువులైన వాళ్ళు కూడా ఇప్పటివరకు వాళ్ళ దగ్గర ఆర్‌.డి.ఎక్స్‌ ఉంటుందని, లేదా వినియోగిస్తారని అనలేదు. మరి ఏ ఆధారంతో అధికారులు సంఘపరివార్‌ను ఇందులోకి లాక్కొచ్చారు? మరోవైపు ఇందులో ఇతర మతాల వారి ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే సాయిబాబా ఒక విధంగా చెప్పాలంటే హిందూ మత నాయకుడు కాబట్టి.

ఇలా ఇప్పటికే పరస్పర విరుద్ధమైన ఊహలు, వాదనలు నడుస్తుండగా మరో కొత్త సిద్ధాంతం పుట్టుకొచ్చింది. పుట్టపర్తి ఆశ్రమ వ్యవహారాలపై ఆధిపత్యం కోసం లోపలి శక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణల ఫలితమే ఈ ఘటన అని దాని సారాంశం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పలు దేశాల్లో కార్యకలాపాలు సాగించే సాయిబాబా ఆశ్రమం కూడా - ముక్తానంద కార్పొరేషన్‌ (ముక్తానంద స్వామి వారసుడు ఒక భక్తురాలిని లైంగికంగా లోబరుచుకున్న తర్వాత ఆ ఆశ్రమంలో చీలికలొచ్చాయి)  లేదా హరేకృష్ణ ఉద్యమం (దాని నిర్వాహకుడు అభయ్‌ చరణ్‌ డే - ప్రభుపాద అనేవారు - మరణించిన తర్వాత ఆ ఉద్యమం ముక్కచెక్కలైంది) దిశగా వెళుతోందని.

ఇక్కడ సాయిబాబా జీవితం గురించి కొంచెం తెలుసుకుందాం. సాయిబాబా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో 1926 నవంబర్‌ 23న ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. చిన్న వయసు నుంచే దివ్య శక్తులను ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఉరవకొండలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థిగా

ఉన్నప్పుడే ఆయన తరచూ గాలిలో నుంచి పెన్సిళ్ళు, పళ్ళు, తీపి పదార్థాలను సృష్టించి తన స్నేహితులకు ఇచ్చేవారు. ఒకసారి తేలు కుట్టిందని, ఆ తర్వాతే ఆయనలోని 'దివ్య'శక్తులు వెలికివచ్చాయని చెపుతారు. కొన్నాళ్లకు బాబా బడికి వెళ్ళడం మానేశారు. 'అద్భుతాలు' చేసి చూపించడంతో పాటు షిర్డి సాయి అవతారాన్నని చెప్పుకోవడం ప్రారంభించారు.

పుట్టపర్తి ఆశ్రమంలో నివాసముంటున్న శివశంకర్‌ లాంటి భక్తులకైతే ఆయన సాక్షాత్తు శివుని స్వరూపమే. ప్రార్థనల అనంతరం సాయిబాబా తన నోటి నుంచి శివలింగాలను బయటికి తేగలుగుతున్నది అందువల్లనేనన్నది వారి విశ్వాసం.

అధికారం, సంపద మెండుగా గల పెద్దలు అనేకమంది ఆయన భక్తులవ్వడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ, మాజీ రాష్ట్రపతి ఆర్‌. వెంకట్రామన్‌, హోంమంత్రి ఎస్‌.బి.చవాన్‌, బి.జె.పి నాయకులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస ఈ జాబితాలోని కొందరు. ఇంకా భీమ్‌సేన్‌ జోషి, రవిశంకర్‌, ఎమ్‌.ఎస్‌. సుబ్బులక్ష్మి, అనూప్‌ జలోట, ఒకప్పుడు బీటిల్స్‌లో ఉన్న జార్జి హారిసన్‌ వంటి సంగీతకారులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. క్రికెట్‌ క్రీడాకారుడు సునీల్‌ గవాస్కర్‌, మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్‌. భగవతి, భారత వైమానిక దళాధిపతి ఎన్‌.సి సూరి, అపోలో ఆసుపత్రుల అధిపతి సి. ప్రతాపరెడ్డి కూడా తమకొచ్చే సమస్యల నుంచి బయటపడడానికి సాయిబాబా మీద ఆధారపడుతున్న వారే.

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుట్టపర్తి వెళ్ళి బాబా నడుపుతున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి వచ్చారు. అదీ ఎప్పుడు? రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటుతో కునారిల్లుతున్న  సమయంలో ఆయన దర్జాగా ఈ విరాళం ఇచ్చి వచ్చారు. కర్ణాటకకు చెందిన అనేకమంది పేదలు అక్కడికి వెళ్ళి వైద్య సేవలు పొందుతున్నారని, అందుకే ఇచ్చానని బంగారప్ప చెప్పారు. అయినా ప్రధాని నరసింహారావు తోటి భక్తుడైన బంగారప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేశారు! కాని ఇలాంటి వైఫల్యాలేవీ (భక్తులు కోరుకున్నవి జరగకపోవడం) బాబాపై భక్తులకున్న నమ్మకాన్ని తగ్గించలేకపోయాయి. ఇప్పటికీ పలు దేశాల నుంచి గణనీయంగా భక్తులు పుట్టపర్తికి వస్తూనే ఉన్నారు.

మహేష్‌ యోగి, చంద్రస్వామి లాంటి స్వాముల్లా కాకుండా సాయిబాబా వీలైనంత వరకు ప్రసార మాధ్యమాలకు దూరంగా ఉంటారు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడరు. 'దర్శనం' ఇచ్చినపుడు కూడా చాలా అరుదుగానే మాట్లాడతారు. భక్తుల చేతిమీద తట్టడం, అప్పుడప్పుడు తన చేతిని గిరగిరా తిప్పి విభూతిని బయటకి తీసి ఇవ్వడం, ఎప్పుడన్నా హఠాత్తుగా గాలిలో నుంచి గుప్పిళ్ల కొద్దీ తీపి బిళ్ళలను 'సృష్టించి' భక్తులకు ఇవ్వడం లాంటివి మాత్రమే చేసేవారు. అంతర్జాతీయ స్థాయిలో వేలాది మంది భక్తులు, అనుయాయులు ఉన్నా సాయిబాబా విదేశాలకు వెళ్ళింది మాత్రం ఒక్కసారే. ఉగాండాకు వెళ్ళి ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దేశం లోపల కూడా  ముంబయి, మద్రాసు, బెంగుళూరులకు మాత్రమే వెళ్ళేవారు. గత నాలుగేళ్ళుగా కొడైకెనాల్‌కు కూడా వెళుతున్నారు. అక్కడ వేసవిలో జరిగే ఆధ్యాత్మిక శిబిరాల్లో పాల్గొన్నవారికి 'దర్శన' భాగ్యం కలిగిస్తుంటారు. నిజానికి బాబాకు ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. పుట్టపర్తిలోనే విమానాశ్రయం ఉంది కనుక భక్తులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. అయితే అంత దూరం వచ్చినా వారు బాబాను కచ్చితంగా చూడగలరన్న నమ్మకం ఉండదు.

సాయిబాబా చుట్టూ అనేక వివాదాలు ఉన్నా అన్నిటికంటే అప్రియమైన వివాదం మట్టుకు ఆయనకు, టాల్‌ బ్రూక్‌ అనే ఒక అమెరికన్‌ భక్తుడికి మధ్య ఉన్న సంబంధం గురించిన వివాదం. టాల్‌ బ్రూక్‌ పుట్టపర్తిలోను, బెంగుళూరు శివార్లలోని వైట్‌ ఫీల్డ్‌లోను  సాయిబాబా ఆశ్రమాలలో కొంతకాలం ఉన్నారు. అప్పటి తన అనుభవాలను ఆయన ఒక పుస్తకంగా రాశారు. దాని పేరు 'లార్డ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌'. అందులో సాయిబాబా సామ్రాజ్యంలోని కొన్ని చీకటి వ్యవహారాలను బయటపెట్టారు. సాయిబాబా లైంగికంగా తనకు దగ్గరవడానికిి ప్రయత్నించారని, అప్పటినుంచి ఆయనపై భ్రమలు తొలగిపోవడం మొదలైందని బ్రూక్‌ రాశారు. ఒక రోజు దర్శనం అయిపోయిన తర్వాత ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తానని, అక్కడే ఉండిపొమ్మని బాబా బ్రూక్‌ని అడిగారట. తను చేసిన పాపాలన్నిటినీ ఏకరువు పెట్టిన తర్వాత బాబా లేచి వచ్చి బ్రూక్‌ని గట్టిగా కౌగలించుకున్నారట. ''బాబా కౌగిలి మరింత బిగుస్తోంది. నా మనస్సు లోలోపలి నుంచి ఏదో ఆలోచన తొలుచుకొస్తోంది. పూర్తిగా బయటికి రాకముందే దాన్ని తొక్కిపెట్టాను. ఈ లోపల స్వామి మరింత దీర్ఘంగా గాఢంగా ఊపిరి పీలుస్తున్నారు. ఆయన తన కటి భాగాన్ని నాకు తాకిస్తూ ఎందుకు ఊపుతున్నట్లు?'' అని బ్రూక్‌ ఆ పుస్తకంలో తన అనుభవాన్ని వర్ణించారు.

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాబట్టి అప్పుడే దానిపై ఒక నిర్ధారణకు రాకూడదని నిర్ణయించుకున్నారట బ్రూక్‌. కొన్ని రోజుల తర్వాత మరోసారి బాబా నుంచి ప్రత్యేక ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఈసారి అనుభవం బ్రూక్‌ని విపరీతంగా కలవరపరిచింది. ''నన్ను నొక్కిపెడుతున్న ఆయన కటిభాగం ఉన్నట్టుండి ఆగింది. హఠాత్తుగా ఒక చెయ్యి నా ప్యాంట్‌ జిప్‌ లాగి లోపలికి వెళ్ళింది. నేను నిశ్చేష్టుడనయ్యాను. 'నేను సత్యాన్వేషణ కోసం ఇక్కడికి వచ్చిన మాట నిజమే కాని దాని కోసం ఇంతటి చిక్కుదారుల్లో ఇరుక్కోవడం అవసరమా? బాబా తన గురించి చెప్పుకునేదంతా నిజమే అయితే మరి ఇంతటి అపవిత్రమైన చర్యకు ఆయన ఎలా పూనుకుంటున్నారు?' ఇలా ఆలోచిస్తూ తొణక్కుండా అలానే నిలబడడానికి ప్రయత్నించాను. ఆయన చెయ్యి లోపల ఇంకా నొక్కుతుండగానే ఆయన పృష్ట భాగంలో కదలికలు మళ్ళీ మొదలయ్యాయి. నేను మరింత బిగుసుకుపోయాను. నా నుంచి ఎలాంటి స్పందనా లేదు. బాబాలో ఉద్రేకం పెరిగింది. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వేగం పెరిగింది. కొద్దిసేపటికి నా పాలిట అగ్ని పరీక్ష లాంటి ఆ ఘట్టం ముగిసింది. 'చాలా సంతోషం, ఇక వెళ్ళిరా' అని చెప్పి బాబా నన్ను పంపించారు'' అని రాసారు బ్రూక్‌.

ఇంత జరిగినా బాబాపై అంధవిశ్వాసం బ్రూక్‌ని కొంతకాలం అక్కడే ఉండేలా చేసింది. తనకొక్కడికే కాదు, ఇంకా అనేక మంది భక్తులకు కూడా బాబా ఇలాంటి అనుభవాలనే ప్రసాదించారని తెలుసుకున్నాక మాత్రం నిర్ణయం మార్చుకున్నారు బ్రూక్‌. తమను పరిశుద్ధం చేయడానికే బాబా అలా చేస్తున్నారని, ఇది ఆయనపై తమ భక్తికి ఆయన పెడుతున్న పరీక్ష అని భక్తులు భావించారు. అందుకే ఎలాంటి అభ్యంతరం తెలపకుండా మౌనంగా ఉండిపోయారు. బ్రూక్‌ హృదయం మాత్రం కకావికలమైంది. ఇదంతా తను చెప్పినా ఎవరూ నమ్మరని ఆయనకి అనిపించిందట. చివరకు ఏదైతే అదయింది కాగితం మీద పెట్టాలని బ్రూక్‌ నిర్ణయించుకున్నారు.

'లార్డ్‌ ఆఫ్‌ ది ఎయిర్‌' పుస్తకంలో బ్రూక్‌ రాసిన సంఘటనలన్నీ అతని బుర్రలో పుట్టుకొచ్చిన వెర్రి మొర్రి ఊహలని కొట్టి పడేశారు బాబా భక్తులు. అయితే బాబా ఆశ్రమంలో యధేచ్ఛగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న వదంతులు పుట్టుకు రావడానికి మాత్రం అది దోహదపడింది. ఇలాంటి వేధింపులకు గురవడం వల్లనే బాబా నడుపుతున్న విద్యాసంస్థల్లో చదువుకుంటున్న అనేకమంది టీనేజ్‌ అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న గుసగుసలు కూడా వినిపించాయి. కాని వాటిని బలపరిచే ఎలాంటి ఆధారాలు బయటికి రాకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు వాటిని తేలికగానే అణచి వెయ్యగలిగారు.

బాబాను హత్య చేయడానికి నిజంగానే ఆ నలుగురు ప్రయత్నించి ఉంటే కనుక అందుకు ఈ రకం వేధింపులు కారణం అయి ఉండొచ్చన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే ఎందుకోగాని ఇది హిందూ మతోన్మాదుల పనే అన్న అభిప్రాయాన్ని నమ్మడానికే ఎక్కువమంది మొగ్గు చూపారు. వాళ్లు అలా నమ్మడానికొక కారణం ఉంది. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో సాయిబాబా హిందూ మతోన్మాదుల వాదనతో ఎన్నడూ  ఏకీభవించలేదు. పైగా భిన్నమైన అభిప్రాయాన్ని ప్రకటిస్తూ వచ్చారు. 1990లో పుట్టపర్తిలో తన జన్మదిన వేడుకలు జరిగిన సందర్భంలో రాజకీయ అంశాలపై తాను సాధారణంగా పాటించే మౌనాన్ని వీడి ''ప్రతి ఒక్కరి హృదయంలో రాముడున్నపుడు ప్రత్యేకంగా ఒక మందిరం ఎందుకు?'' అన్నారట. ఈ వ్యాఖ్యలే ఆయన పేరును హిందూ మతోన్మాదుల హిట్‌లిస్ట్‌లో చేర్చి ఉండవచ్చని కొందరు నమ్ముతున్నారు. అందువల్లే బహుశా ఆయన ఈ మధ్యకాలంలో పెద్దగా ప్రచారంలోకి రాకుండా జాగ్రత్తగా ఉన్నారేమో! కావాలనే ఆయన తనని తాను దేశంలోని రాజకీయ పరిస్థితులకు ఎప్పుడూ దూరంగా ఉంచుకున్నట్లు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది.

ఇప్పుడు హత్యాప్రయత్నం ఆయన్ని మళ్ళీ తెర మీదకి గుంజుకొచ్చింది. ఈ సందర్భంగా వస్తున్న వార్తలేవీ ఆయనకు అనుకూలంగా లేవు. ఆశ్రమంలోని భక్తుల మధ్య ముఠా కక్షలు, కుమ్ములాటలు తీవ్రమయ్యాయని, వాటి ఫలితమే ఈ హింసాత్మక సంఘటనలని వివిధ ప్రసార మాధ్యమాల్లో కథనాలు వచ్చాయి. బాబాకు దగ్గరగా ఉండే అనుయాయుల బృందంలో తమకు చోటు లేకుండా చేశారన్న దుగ్ధతోనే వారు హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారని ఆ కథనాలు పేర్కొన్నాయి. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాల్లో మీడియా ఉండగానే హఠాత్తుగా పుట్టపర్తి ఆశ్రమం చుట్టూ ఒక కనిపించని ఇనప తెరను దించేశారు. అక్కడి నుంచి ఒక్క రహస్యం కూడా బయటకు పొక్కకుండా కట్టుదిట్టం చేశారు. సాక్షాత్తు హోంమంత్రి చవాన్‌ లాంటివారే స్వయంగా రంగంలోకి దిగి, ఆశ్రమ 'పరువు' ప్రతిష్టలకు మరింత భంగం కలగకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టాక బాబాపై హత్యాయత్నం గురించిన పూర్తి వివరాలు ఇక బయటకి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. సాయిబాబాకు సంబంధించినంత వరకూ సత్యం ఎందుకో ఎప్పుడూ అంతు చిక్కకుండానే ఉంది.

మహిమలు కలవాడా? గారడీ చేసేవాడా??

ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి సర్కార్‌ జూనియర్‌కు, సత్యసాయిబాబాకు మధ్య జరిగిన సమావేశం ఇప్పటికే చాలా ప్రఖ్యాతి గడించింది. దాని గురించి ఇప్పటికీ కథలు కథలు చెప్పుకుంటుంటారు. పి.సి. సర్కార్‌ కథనం ప్రకారం... ఆయన సాయిబాబాను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారు. కాని సాయిబాబా అందుకు ఒప్పుకోలేదు. చివరకు పశ్చిమబెంగాల్‌కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకునని అబద్ధం చెప్పి బాబాను కలుస్తానని అడిగారు. సాయిబాబా అంగీకరించారు. బాబా 'దర్శనం' అయ్యాక పి.సి. సర్కార్‌ ఆయనను తనకు ఏదైనా బహుమతి ఇమ్మని కోరారు. బాబా ఆయనను అక్కడే కాసేపు వేచి ఉండమని చెప్పి పక్కగదిలోకి వెళ్ళారు. బహుశా ఏదో ఒక వస్తువునో, తినుబండారాన్నో తన చొక్కా చేతిభాగంలో దాచుకుని రావడం కోసం కావచ్చు. ఈ లోపు పి.సి సర్కార్‌ తనున్న గదిలో ఒక పళ్ళెం నిండా పదార్థాలు ఉండడం చూశారు. ఒకటి తీసుకుని తన దుస్తుల్లోపల దాచుకున్నారు.

కొద్దిసేపట్లోనే సాయిబాబా తిరిగి వచ్చారు. రాగానే గాలిలో నుంచి సందేష్‌ అనే బెంగాలీ తీపి పదార్థాన్ని తీసి పి.సి సర్కార్‌కి ఇచ్చారు. తనకి సందేష్‌ ఇష్టం లేదని చెప్పి పి.సి సర్కార్‌ దాన్ని మాయం చేసి, రసగుల్లాగా మార్చి సాయిబాబాకే తిరిగి ఇచ్చారు. ఈ చర్యను ఊహించని సాయిబాబా నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని పి.సి సర్కార్‌ని బయటికి గెంటేశారు.

''ఆయనేం దివ్యశక్తులున్న వాడు కాదు. కనీసం మంచి ఇంద్రజాలకుడు కూడా కాదు. అందుకు అవసరమైన నేర్పరితనం కూడా ఏ మాత్రం లేదాయన దగ్గర. ఇంద్రజాలకులకు చెడ్డపేరు తెస్తున్నారు. సాయిబాబా ఇంకా బాగా సాధన చెయ్యాలి''  అని సర్కార్‌ ఈ మధ్య చాలా ఎగతాళిగా అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పి.సి సర్కార్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అదేమిటంటే- గత సంవత్సరం నవంబర్‌లో సాయిబాబా హైదరాబాద్‌లో ఒక కళ్యాణ మండపాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. ప్రధాని పి.వి. నరసింహారావు కూడా హాజరైన ఆ కార్యక్రమంలో సభికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ సాయిబాబా ఒక బంగారు గొలుసును గాలిలోనుంచి సృష్టించారు.

అయితే పాపం సాయిబాబాకు రోజులు బాగున్నట్లు లేవు! ఆ కార్యక్రమాన్ని ఆ రోజు దూరదర్శన్‌ దృశ్యీకరిస్తోంది. కెమెరాలు అబద్ధం చెప్పవు కదా! ఆ వీడియోను చూసినపుడు సాయిబాబా శిష్యుల్లో ఒకరు ముందుగా ఆయనకు బంగారు గొలుసు తెచ్చి ఇవ్వడం స్పష్టంగా కనిపించింది. కొద్ది నిమిషాల తర్వాత ఆ గొలుసునే ఆయన సభికుల ముందు గాలిలో నుంచి తీసి ఇచ్చినట్టు చేశారు. అదే కెమెరాకంట్లో పడింది. అయితే ఆయన శిష్యగణం చూస్తూ ఊరుకుంటారా? కొన్నాళ్ళు హైదరాబాద్‌ దూరదర్శన్‌ కేంద్రంలో  చక్కర్లు చేసిన ఆ టేపు ఆ తర్వాత ఒకరోజు టక్కున మాయమైంది.

ఒకపక్క ఇలాంటి హాస్యాస్పదమైన వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నా, మరో వైపు ఆయనకున్న దివ్యశక్తుల గురించిన కథల ప్రచారమూ కొనసాగుతూనే వుంది. రక్షణ శాఖకు శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పని చేసిన ఎస్‌. భగవంతం కొడుకుకి సంబంధించిన కథ ఒకటి ఒకప్పుడు బాగా ప్రచారంలో ఉండేది. అదేమిటంటే ఆయనకు బుద్ధిమాంద్యం గల ఒక కొడుకు ఉన్నాడు. ఆ పిల్లవాడిని సాయిబాబా దగ్గరికి తీసుకెళ్ళాడు తండ్రి. సాయిబాబా చేతిని గాల్లో తిప్పి విభూతిని 'సృష్టించి' ఆ బాలుడి వీపు మీద రాశారు. మరోసారి చేయి పైకెత్తి గాలిలో నుంచి ఒక పొడుగాటి సూదిని సృష్టించి ఆ బాలుడి వెన్నులో గుచ్చి ఏవో ద్రవాన్ని బయటకు తీశారు. మరోసారి గాలిలో నుంచే దూది, గాజు గుడ్డ తెప్పించి ఆ పిల్లవాడికి కట్టు కట్టారు. వెంటనే అతనికి నయమైపోయిందని చెప్పారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ భగవంతం తన జీవితం చివరి దశలో సాయిబాబాను ఒక నకిలీ స్వామి అని కొట్టి పడేశారు. తన భ్రమలు తొలిగిపోవడానికి గల కారణాలేమిటో మాత్రం ఆయన ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. కాని బాబాతో సంబంధాలనైతే పూర్తిగా తెంచేసుకున్నారు.

మిగిలిన భక్తులు మాత్రం సాయిబాబా మహిమ కలవారనే ఇప్పటికీ నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. భక్తులకు వచ్చే ఎలాంటి జబ్బునైనా ఆయన నయం చేయగలరని, తన అస్వస్థతలకు కూడా చికిత్స చేసుకోగలరని వాళ్ళు దృఢంగా నమ్ముతున్నారు. ఉదాహరణకు గురుపూర్ణిమ నాడు ఒక అతిపెద్ద సమూహం ముందు సాయిబాబా తనకొచ్చిన పక్షవాతాన్ని నయం చేసుకుని చూపించారని చెపుతారు. గోవాలోని ఒక డాక్టర్‌ దీనితో తీవ్రంగా విభేదించారు. ఆ డాక్టర్‌ గతంలో సాయిబాబాకి అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ చేశారు. ఆ సమయంలో బాబా తన శిష్యులతో తను మరో శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయడం వలన వారికి 'దర్శనం' ఇవ్వలేకపోతున్నానని చెబుతుంటే విని నివ్వెరపోయానని ఆ డాక్టర్‌ చెప్పారు. కొన్నేళ్ల క్రితం సాయిబాబాకు గుండెపోటు వచ్చి చికిత్స చేయించుకున్నారని కూడా చెపుతారు. కాని దాని గురించిన సమాచారాన్ని బయటికి రానివ్వలేదు.

సాయిబాబాపై ఇటీవల జరిగిన 'హత్యాప్రయత్నం' సంఘటన విమర్శకులకు ఆయనపై సంధించడానికి మరిన్ని శస్త్రాలను అందించింది. అనేక దశాబ్దాలుగా సాయిబాబాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న హేతువాద ఉద్యమకారుడు హెచ్‌. నరసింహయ్య ''మేము ఇన్నాళ్ళుగా సాయిబాబా గురించి చెబుతూ వస్తున్నవి సరైనవేనని ఇటీవల పుట్టపర్తిలో జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆయన ఏ దైవశక్తులూ లేని మన లాంటి సాధారణ మానవుడేనని తేలింది. తన మీద దాడి జరగబోతోందని కనీసం ఊహించను కూడా ఊహించలేకపోయాడు. హత్యాప్రయత్నం చేయడానికి లోపలికి వచ్చినవారిని ఆయన తన దివ్యశక్తులను ఉపయోగించి వశపరుచుకునైనా ఉండాల్సింది. లేదా అచేతనులనైనా చేసి ఉండాల్సింది. అలా కాకుండా ఆ పరిస్థితుల్లో నేను ఏం చేసే వాడినో కచ్చితంగా సాయిబాబా కూడా అదే చేశారు. అక్కడి నుంచి పారిపోయారు. పుట్టపర్తి ఆశ్రమంలో ఒక సైన్‌బోర్డు మీద 'నేను ఇక్కడుండగా మీకు భయం ఎందుకు' అని రాసి ఉంటుంది. కాని తనకే నిలువెల్లా భయం ఉందని ఆయన చర్యలే తెలిపాయి'' అని హేళన చేశారు.

సాయిబాబా హేతువాదులతో సంవాదం చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధపడలేదు. తనకు అనుకూలమైన పరిసరాల్లో తప్పిస్తే వేరే వేదికలపై తన దివ్యశక్తులను ప్రదర్శించేందుకు కూడా ఎప్పుడూ సిద్ధపడలేదు. కాని ఒక భక్తుడితో మాత్రం సాయిబాబా ఇలా చెప్పారట, ''నన్ను అల్పమైన ఇంద్రజాలకుడితో పోల్చండి. నాకు అనంతమైన దివ్య శక్తులు ఉన్నాయి. భూమిని ఆకాశంగాను, ఆకాశాన్ని భూమిగాను మార్చెయ్యగల శక్తి నాకుంది. కాని అలా చెయ్యాల్సిన అవసరం ఏముంది? అందుకే చేయడం లేదు.''

('సండే' వారపత్రిక, 20-26 జూన్‌ 1993)

అనువాదం : వి.వి. జ్యోతి

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి


అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌