Friday, May 31, 2013

సమాజం విజ్ఞాన శాస్త్రం - డి.డి.కొశాంబి- పునర్ముద్రణ ...

పాఠకుల ఆదరణ రీత్యా డి.డి.కొశాంబి రచన ''సమాజం విజ్ఞాన శాస్త్రం'' ను పునర్ముద్రించాం.

ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఇండియా వంటి ఉష్ణమండల దేశంలో సౌరశక్తి ఎంత అనువుగా ఉంటుందో తెలియజెప్పిన మొదటి తరానికి చెందినవాడు డి.డి.కొశాంబి.

తౌకగా లభించే శక్తి మనకు అపారంగా అందుబాటులో ఉండగా ప్రమాదకరమైన 'అణుశక్తి' వెంటపడటం వేలంవెర్రి అన్నారాయన.

శాస్త్ర విజ్ఞానానికి విభిన్న సామాజిక అంశాలకు మధ్య అనుసంధానం సాధించడంకోసం ప్రయత్నించిన, శాస్త్రాన్ని సాధారణ ప్రజా సమస్యల కోసం వినియోగించడం ఎలాగో వివరించిన ప్రజా ప్రేమికుడు డి.డి.కొశాంబి. సామాజిక పురోగమన క్రమంలో విజ్ఞానశాస్త్రం అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చిత్రించారాయన.

మతపర మూఢ విశ్వాసాలను శాస్త్రీయంగా అధిగమించేందుకు ఆయన చేసిన సూచనలు ఎంతో విశిష్టమైనవి. శాస్త్రానికీ సమాజానికీ మధ్య ఉన్న, ఉండవలసిన సంబంధాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన ఐదు వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం.
తప్పక చదవండి.



సమాజం విజ్ఞానశాస్త్రం

డి.డి.కొశాంబి

వెల; రూ. 30/-

Friday, May 24, 2013

భారత రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు? .

భారత రాజ్యాంగం
దేశానికి మూల స్తంభం

- గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌

భారత రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన రాజకీయ చరిత్రే ఈ పుస్తకం. భారత రాజ్యాంగ రచన నేపథ్యాన్ని, రాజ్యాంగ నిర్ణయ సభ సభ్యుల కృషిని ఇది సోదాహరణగా వివరిస్తుంది. సాధారణ పాఠకుడు భారతీయ జీవనం తాలూకు రాజకీయ మూలాలను, ప్రేరణలను అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది. అదే సమయంలో భారతీయ వ్యవహారాలను అధ్యయనం చేసేవారికి, చరిత్ర, రాజనీతి, న్యాయ శాస్త్ర విద్యార్థులకు రాజ్యాంగ నిర్ణయ సభ పనితీరు గురించిన మౌలిక సమాచారాన్ని అందిస్తుంది.

గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ (1927 - ) భారత రాజ్యాంగంపై సాధికారాత కలిగిన ప్రపంచ ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు. జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్‌, కె.ఎం.మున్షీ, బి.ఎన్‌.రావు మొదలైనవారి సహకారంతో అత్యంత కీలకమైన రాజ్యాంగ నిర్ణయ సభ డాక్యుమెంట్లను పరిశీలించి, ఎందరో రాజ్యంగ రచయితలను ఇంటర్వ్యూ చేసి, విస్తృతంగా పరిశోధించి ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. ఆక్స్‌ఫర్డ్‌ యునివర్సిటీ ప్రెస్‌ వారు దీనిని 1966లో ప్రచురించారు. 1972లో తొలి భారతీయ ముద్రణ వెలువడింది. ఆతరువాత 17సార్లు పునర్ముద్రణలు పొంది సంచలన విజయం సాధించింది. ఇప్పుడు నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాయి.

గ్రాన్‌విన్‌ ఆస్టిన్‌ భారతీయ ముద్రణకు రాసిన తన ముందు మాటలో ఇలా అన్నారు:

''ఒకసారి వెనుదిరిగి యాభై ఏళ్ల గతాన్ని పరిశీలించినప్పుడు- జాతి లక్ష్యాలను నిర్దేశించడంలో, వాటికి కావలసిన పాలనా వ్యవస్థలను అందించడంలో రాజ్యాంగ రచయితలు సాధించిన విజయం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజ్యాంగం భారత జాతికి అద్భుతమైన సేవచేసింది. జరుగబోయే ప్రతీ సంఘటనను రాజ్యాంగ రచయితలు ముందే ఊహించి వుండకపోవచ్చు. వాస్తవానికి వాళ్లు అట్లా ఊహించాలని ఆశించడం కూడా సమంజసం కాదు. రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న కాలంలోని ఆదర్శవాదం, ఆనాడు దేశం ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల కారణంగానే వారు కొన్ని భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేయలేకపోయారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఇతర పరిణామాలను ఊహించినప్పటికీ వాటిని వారు రాజ్యాంగంలో పొందుపరచలేకపోయారు.

నిజానికి ప్రతి సమస్యకూ పరిష్కారమార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. తమ కెదురయ్యే సమస్యలకు రాజ్యాంగ సూత్రాల పరిధిలో, తమదైన పద్ధతిలో పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన బాధ్యత భావి నేతలమీదే వుంటుంది.''
...

''..... భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఒక ఆధునికీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూలసూత్రాలో ప్రస్తుత, భవిష్యత్‌ సమస్యలకు పరిష్కార మార్గాలు వున్నాయని రచయిత చెప్పారు. రాజ్యాంగం సరిగా పనిచేయలేదనడం కేవలం అపోహమాత్రమే అని వాదించారు.

    మేధావులూ; న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యార్థులూ, వర్తమాన భారతదేశం ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నవాళ్లూ తప్పక చదవాల్సిన రచన ఇది.

    గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌ ఒక స్వతంత్ర చరిత్రకారుడు. వాషింగ్‌టన్‌ డిసిలో నివసిస్తున్నారు. గతంలో ఆయన ''వర్కింగ్‌ ఎ డెమాక్రాటిక్‌ కాన్‌స్టిట్యూషన్‌ : ఎ హిస్టరీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఎక్స్‌పీరియన్స్‌'' అనే పుస్తకాన్ని వెలువరించారు.
    వస్తువుకు తగినట్టు ఈ రచనా సంవిధానం ఒకవిధమైన హుందాతనంతోకూడి వుంది. శైలి ప్రశంసనీయంగా వుంది.''

...........................................................................................................................- ది ఎకనమిస్ట్‌





భారత రాజ్యాంగం
దేశానికి మూలస్తంభం
గ్రాన్‌విల్‌ ఆస్టిన్‌


ఆంగ్లమూలం:  The Indian Constitution ; Cornerstone of a Nation By Granville Austin,
Oxford University Ptress

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

483 పేజీలు, వెల: రూ.250/-


ప్రచురణ కర్తలు:
నేషనల్‌ ట్రాన్స్‌లేషన్‌ మిషన్‌,
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌,
మానస గంగోత్రి, మైసూరు - 570006
www.ntm.org.in


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
e mail: hyderabadbooktrust@gmail.com
Phone No. 040 2352 1849

ISBN: 978-81-907377-3-9


.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌