Sunday, April 10, 2011

ప్రాంతీయత సార్వజనీనతల సమ్మేళనం ''బషీర్‌ కథలు'' - 2, డా. కిన్నెర శ్రీదేవి ( 'మిసిమి' మాసపత్రిక ) ...

స్వాతంత్య్రం తర్వాత భారతీయ సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులన్నిటినీ సానుకూలంగా చూసే అవకాశం లేదు. వీటిలో కొన్ని సమాజ పురోగమనానికి కాకుండా తిరోగమనం వైపుకి నడిపించేవి కూడా వున్నాయి. ఉదాహరణకు వ్యక్తులకు నైతిక మద్దతు, ప్రోత్సాహం ఇచ్చిన సంస్కరణోద్యమం- స్వాతంత్య్రోద్యమం తర్వాత తిరోగమనం వైపు కదిలింది. సాంస్కృతిక రంగంలో వస్తున్న మార్పులు కూడా ప్రగతికాముకంగా లేవు. స్వాతంత్య్రానికి ముందే అమలులో వున్న ఫ్యూడల్‌ సామాజిక వ్యవస్థ స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. స్వాతంత్య్రం తర్వాత రూపుదిద్దుకున్న సామాజిక వ్యవస్థ మరింత అమానవీయంగా మిగిలింది. ఆర్థికరంగంలో వచ్చిన తీవ్రమైన మార్పులు వ్యక్తుల జీవితాలలోకి అనేక సమస్యలనూ సంక్లిష్టతలనూ తీసుకువచ్చాయి. ధనిక వర్గాల జీవిత ప్రమాణాలలో మార్పులు వచ్చాయి. సామాన్యుల జీవితాలలో మాత్రం ఈ మార్పులు ఉపద్రవంగా పరిణమించాయి. గ్రామీణ పేదలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి తీవ్ర సంఘర్షణకు లోనవ్వాల్సి వచ్చింది. వాళ్లు తమ జీవితాలలో అంతులేని పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతిమంగా, మనుషుల మధ్య వున్న సామాజిక సంబంధాలు, వ్యాపార సంబంధాలుగా మారిపోయాయి. ఈ దారుణమైన సంబంధాలన్నింటినీ బషీర్‌ కథలు హృదయాన్ని ద్రవింపజేసే స్థాయిలో చాలా విశ్లేషణాత్కంగా ప్రతిబింబించారు. మనుషుల మధ్య సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన వైనాన్ని, అందులో వున్న దారుణాన్ని ''పాత్తుమ్మా మేక'' బహిర్గతం చేసింది. అందులో తల్లీ కొడుకుల మధ్య జరిగే సంభాషణ ఎప్పుడూ డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. తన దగ్గరికి ఎప్పుడు వెళ్లినా డబ్బు అడగడానికే వెళుతుంది. తల్లీ కొడుకుల సబంబంధాలలో కూడా డబ్బు కీలకమైన పాత్ర పోషించడంలోని అమానుషాన్ని ఈ రచన ప్రతిబింబిస్తుంది. ''నీ జేబులో ఒక్క రూపాయుంటే ఇవ్వు, అయితే ఎవ్వరితోనూ ఈ విషయం చెప్పకు'' అంటుంది.
''నిన్నే కదా ఇచ్చింది.'' అంటాడు కొడుకు.

ఇలా నిరంతరం తల్లి డబ్బు కోసం మాత్రమే రావటం కొడుకులో అసహనానికి కారణమవుతుంది. ఒక ఉద్రేక పూరితమైన సందర్భంలో తల్లితో ఇలా అంటాడు:
''ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో లేకపోతే నేనే ఇల్లు వదిలి పోతా''. కుటుంబంలో అందరికీ అతని డబ్బు కావాలి. కొంత మంది అతని డబ్బుకు తామే వారసులని భావిస్తుంటారు. కుటుంబాలలోని వ్యక్తుల మధ్య డబ్బు నిర్వహిస్తున్న, నిర్వహించబోతున్న దారుణమైన పాత్రను చాలా ముందుగానే పసిగట్టి దాన్ని కాల్పనిక సాహిత్యంలో విశ్లేషించగలిగాడు బషీర్‌.

బషీర్‌ కథల్లో దారిద్య్రం దాని ఫలితంగా జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలు, ఆ వైఫల్యాలకుండే పర్యవసానాలు ప్రధాన వస్తువులు. ఒక ప్రత్యేకమైన హాస్యం దాన్ని వెంటాడివుండే వ్యంగ్యం బషీర్‌ రచనా శైలితో విడదీయరాని అంశాలు. నిజానికి బషీర్‌ హాస్యం వెనుక అంతులేని విషాదం వుంది. బషీర్‌ చాలా సందర్భాలలో హాస్యాన్ని తగినంతగా వాడుకోలేకపోయానని వాపోయిన సన్నివేశాలు కూడా వున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వలస పాలన అమలులో వున్న కాలంలో తను స్వేచ్ఛాపూరితంగా రచన చేయలేకపోయాననీ, అసలు తనకలాంటి అనుకూలమైన వాతావరణం లేదని ఒక ఇంటర్వ్యూలో బషీర్‌ అభిప్రాయపడినాడు. (ఇండియన్‌ లిటరేచర్‌, సాహిత్య అకాడమీ జర్నల్‌ మే-జూన్‌2008). అదే ఇంటర్వ్యూలో తాను కోపంతో రగిలిపోతూ వుండటం వలన ''పాత్తుమ్మా మేక'' అనే హాస్యస్ఫోరక రచన చేశానని చెప్పారు. ఆ రచన ఉత్తమ పురుషలో నడుస్తుంది. అందుకే ఆయన చిత్రించిన జీవితం ఆద్యంతం ఆర్థిక సంక్షోభాన్ని గురించే అయినప్పటికీ అందులో ఎక్కడా కూడా ఆర్థిక అంశాల ప్రస్తావన లేనే లేదు. అ లాగే యుద్ధాల ప్రసక్తిగానీ, వాటి ప్రభావాల గురించిన చర్చగానీ, అంతెందుకు అసలు స్వతంత్ర ఉద్యమాన్ని గురించిన ప్రసక్తిగానీ కనపడదు. అయితే ఈ అంశాలను పాత్రల అంతఃచేతనను వర్ణించే క్రమంలో చిత్రించటం జరిగింది. దాదాపు అన్ని పాత్రల పై ప్రభావాల భారాన్ని మోస్తూ, వాటి గురించి మాట్లాడవలసి వచ్చిన సందర్భాలలో ఎటువంటి సంకోచం లేకుండా విశదపరచడం కనిపిస్తుంది.

ఉదాహరణకి ఇదే కథలో కథకుడి సోదరుడు అబ్దుల్‌ ఖాదర్‌ కూడా ఇతన్ని డబ్బులు అడుగుతాడు. అయితే అతను విభిన్నమైన కారణాలు చూపిస్తాడు. అతని చెల్లెలు కూడా అతన్నించి డబ్బే ఆశిస్తుంది. వాళ్లందరి దృష్టిలో అతడు డబ్బులిచ్చే ఒక యంత్రం లేక సాధనం. అతన్ని వాళ్ళెప్పుడూ కూడా తన రక్త సంబంధీకుడుగా చూడరు. వాళ్లతనితో జరిపే సంభాషణలన్నీ ఏదోరకంగా డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. మనుషుల మధ్య సంబంధాలను డబ్బులు నిర్దేశించటమనేది ఇవ్వాళ ఉన్నంత దారుణంగా బషీర్‌ కాలంలో ఉండి ఉండే ఆస్కారం లేదు. బషీర్‌ కథలు చదువుతుంటే, అతడు తన కాలాన్ని దాటి ఎంత లోతుగా భవిష్యత్తును పరిశీలించగలిగాడో తెలుస్తుంది. అసలు బషీర్‌ కథలన్నీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలలో డబ్బుపట్ల వుండే ఆకాంక్షను బహిర్గతం చేస్తాయి. చాలా లోతుగా ఎటువంటి సంకోచాలు లేకుండా మానవ కార్యకలాపాలను డబ్బు నిర్వహించే పాత్రను బషీర్‌ విశ్లేషించి ముఖ్యంగా నిర్దిష్ట సందర్భాలను సృష్టించడం ద్వారా విమర్శకు గురిచేస్తాడు. ఎటువంటి రచయితైనా భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగేందుకు అవసరమైన విశ్లేషణా పరికరాలను ఇవ్వగలిగారు. బషీర్‌లో అటువంటి శక్తి గణనీయంగా వుంది. అందువలననే తానున్న సమాజం తీసుకోబోతున్న మార్పులను, ఎదుర్కోబోతున్న పర్యవసానాలను ముందుగానే పసిగట్టి, వాటిని కాల్పనిక సాహిత్య రూపంలో వ్యక్తం చేశాడు. తద్వారా తానున్న సమాజాన్ని చైతన్యవంతం చేసే కృషికి పూనుకున్నాడు. ఏ రచయితైనా కేవలం సామాజిక వాస్తవికతను ప్రతిబింబించడం ద్వారా గొప్ప రచయిత కాలేడు. అంతకంటే ముఖ్యంగా ఆ రచయిత తానున్న సమాజం ఎదుర్కోబోతున్న ప్రమాదాలను పసిగట్టి విశ్లేషించగలిగినప్పుడే ఆ రచయిత శక్తి సామర్థ్యాలు అవగతమవుతాయి. ఈవిధంగా చూసినప్పుడు బషీర్‌ తన కాలం కంటే చాలా ముందున్నాడన్న విషయం స్పష్టమవుతుంది. బషీర్‌ పై పనిని అత్యంత కళాత్మకంగా చేయగలిగాడు. తాను ప్రదర్శించగలిగిన వస్తురూప సమతౌల్యత వల్లే గొప్ప రచయితగా కీర్తించబడుతున్నాడు.

''పాత్తుమ్మా మేక'' గురించి మాట్లాడుతూ బషీర్‌ అందులోని కథ మూఢనమ్మకాలలో జీవిస్తూ వున్న ముస్లిం కుటుంబాలకు సంబంధించిందని అన్నాడు. సమాజంలో కొనసాగుతూ వున్న జాతి, మత, జెండర్‌ సంబంధిత వ్యత్యాసాలను, తరతరాలుగా అవి కొనసాగుతున్న తీరును ప్రశ్నించే పనికి పూనుకున్నాడు. బషీర్‌ ఎక్కుపెట్టిన ఈ విమర్శ ఒక నిర్దిష్ట మతంపైనేనని, ఆ మతాన్ని విమర్శించేందుకు ఆ  కాలంలో ఎవరూ సాహసించలేని సందర్భంలో బషీర్‌ రచన చేశాడని తెలిసినప్పుడు బషీర్‌ ప్రతిభ తెలుస్తుంది. ''పాత్తుమ్మా మేక''తో పాటు మిగతా కథల్లోని ఏ పాత్ర కూడా పాఠకుల తిరస్కరణకు గురికాదు. పాత్తుమ్మాలోని నిరాశా నిస్పృహలకు ఆమె తండ్రి ఎంతగా కారణమో పాఠకులకు స్పష్టంగానే అవగతమతుంది. అయితే, ఆ పాత్ర పట్ల పాఠకులు ఎటువంటి ద్వేషాన్ని పెంచుకోరు. ఎందుకంటే, ఆ తండ్రి పాత్ర ప్రవర్తనకు కారణం అతడున్న స్థితి. అ లాంటి స్థితిలో ఎవరూ కూడా అ లాకాక మరో రకంగా ప్రవర్తించలేరనే విషయాన్ని పాఠకులు అంగీకరించేట్లుగా బషీర్‌ చిత్రిస్తాడు.

''పాత్తుమ్మా మేక'' ప్రారంభంలోనే కథకుడు తాను ప్రపంచమంతా తిరిగి విసిగి పోయిగాని ఇక ఇంటి దగ్గిరే వుండి ప్రశాంత జీవితాన్ని గడపాలనుకుంటాడు. తన ఇంటి చుట్టూ ఆవరించివున్న చెట్లు, పూలతోటల మధ్య తన బంధువులతోనూ, తన ఆత్మీయులతోనూ గడపాలనుకుంటాడు. అయితే తానుండాలనుకున్న ఇల్లు అద్దెకిచ్చేశారని తెలుసుకొని తాను వంచింపబడినాడని తెలుసుకొని బాధపడతాడు. తన స్వప్నం మొత్తం ధ్వంసం అయిందని చింతిస్తాడు. ఈ కథలో బషీర్‌ తన కాలపు వైయక్తిక, సామాజిక అచేతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగాడు.

ఉత్తమ పురుషులో సాగే కథను ఎక్కువ సందర్భాలలో రచయిత యొక్క  ప్రాపంచిక దృక్పథాన్ని వ్యక్తం చేస్తాయి. చాలా కథలను బషీర్‌ ఉత్తమ పురుషులోనే రాశాడు. కొన్ని కథలలో తానే కథకుడుగా వుంటాడు. అందువలన తన ప్రాపంచిక దృక్పథాన్ని గురించి పాఠకులకు నిర్దిష్టమైన  అవగాహన కలుగుతుంది. ''పాత్తుమ్మా మేక''లో కూడా రచయితను కథకుణ్ణి వేరుచేయటం సాధ్యం కాదు. బషీర్‌ తన కథలలో పాత్రలన్నింటిని రోజువారీ జీవితం నుంచి గ్రహించాడు. అంత మాత్రం చేత అవి మూసలు కావు. తన పాత్రలను రక్తమాంసాలతో సజీవ వ్యక్తులలాగా మలిచాడు. ఆ పాత్రలన్నీ మనుషులకు వుండే అన్ని అనుభూతుల సమాహారంగా కనిపిస్తాయి. సాహిత్యం వాస్తవికతను ప్రవచించినప్పటికీ అది అర్థంలో ప్రతిబింబంలాగా వుండదు. సాహిత్య ప్రతిఫలనంలో కళ ఒక కొత్తరూపాన్ని పొందుతుంది. ఇది సాధారణ వాస్తవికత నుంచి భిన్నంగా వుంటుంది. దీనిపట్ల బషీర్‌కు పూర్తి స్థాయి అవగాహన వుంది. అందువలననే అతని కథలు చాలా సాదాసీదా అంశాలుగా అసాధారణాంశాలుగా కనిపిస్తాయి. ఈ అసాధారణ అంశం బషీర్‌ కథలను పాఠకులకు దగ్గర చేస్తుంది.

పరిచిత ప్రాంతాలను వాటి భౌగోళిక స్వరూపాలను బషీర్‌ తన కథలలో నిరంతరం ప్రస్తావిస్తుంటారు. అందువలననే ఎర్నాకులం, ఎడపాల్‌ రైల్వేస్టేషన్‌, కాలికట్‌ సబ్‌ జైల్‌, వైకం, తలయార పెరంబో లాంటి ప్రాంతాలు బషీర్‌ కథల్లో పునర్నింపబడుతూ వుంటాయి. సాహిత్యం ఎంత విశ్వజనీన మైనప్పటికీ సారాంశంలో అది అత్యంత ప్రాంతీయంగా వుంటుంది. అ లా వున్నప్పుడు మాత్రమే అది పాఠకుల్ని కదిలించగలుగుతుంది. ప్రపంచంలో గొప్ప సాహిత్యం అనదగిన దాన్ని దేనిని పరిశీలించినా ఈ విషయమే స్పష్టమవుతుంది. బషీర్‌ కూడా తన కథల్లో ఈ ప్రాంతీయతను విశ్వజనీనతతో మేళవించి చిత్రించాడు. ఉదాహరణకు తన చాలా కథలలో 'లైకమ్‌' అనే ప్రాంతాన్ని తిరిగి సృష్టించాడు. ఆ ప్రాంతంలోని సాధారణ ప్రజలు, వారి దారిద్య్రం, వాళ్ల ఆత్మిక సంక్షోభాలన్నీ కూడా ఆయన కథలలో ప్రతిఫలించాయి. ఆర్థిక సమస్యల వలన చెదిరిపోయిన మనసుల జీవితాల చిత్రీకరణ ఆయన కథలలో అడుగడుగునా కనిపిస్తుంది. తాను చిత్రించిన జీవితంలో వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా తాను అనుభవించిందే కావటం వలన ఆ చిత్రీకరణ అందరికీ ఆమోదకరంగానూ, అంగీకారయోగ్యంగానూ కనిపిస్తుంది.

బషీర్‌ కథలలో సార్వత్రిక అంశాలతో పాటు  యదార్థ అంశాలు కలిసి వుండటం వలన అవి మిగతా భాషలలోకి అనువదింపబడినప్పుడు కూడా ఆయా భాషలలోని పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. జీవితాన్ని దాని యదార్థ స్థితిలో పరిశీలించి, సృజనాత్మకంగా విశ్లేషించి చిత్రించటం వలననే వాటిని అనువాదాలలో ఎటువంటి అపసవ్యత లేకుండా తీసుకురావడానటికి వీలు కలిగింది. ఎటువంటి భావోద్వేగాలకు లోనుగాకుండా జీవితాన్ని దాని మొరటు రూపంలో పరిశీలించి ఆ తర్వాత చిత్రీకరణకు పూనుకోవటం వలన ఆ కథలపై  ఆయన స్వతంత్ర ముద్రతో పాటు విశిష్టమైన విశ్లేషణకూడా కనిపిస్తుంది. ఆయన తన కథలలో జీవితాన్ని కొంత సానపట్టి చిత్రించినప్పటికీ అందులో ఎటువంటి కృత్రిమత్వం కనిపించకపోవటం గమనార్హం.

ఏ రచయితకయినా తాను చిత్రిస్తున్న జీవితం పట్ల గౌరవం నమ్మకం కూడా వుండాలి. ఆ జీవితాన్ని జీవిస్తున్న పాత్రల పట్ల గౌరవం కూడా వుండాలి. ఈ లక్షణాలన్నీ బషీర్‌లో పుష్కలంగా వుండటం వలన ఆయన ఆధునిక భారత చరిత్రలో ఒక ప్రముఖుడిగా నిలబడగలిగాడు.

బషీర్‌కు తాను చిత్రించిన స్త్రీ పాత్రల పట్ల అచంచలమైన గౌరవం వుంది. (లవ్‌ లెటర్‌) ''ప్రేమలేఖ'', ''బంగారు ఉంగరం'' లాంటి కథలను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. ''ప్రేమలేఖ'' కథలో చాలా సందర్భాలలో బషీర్‌ స్త్రీలను ''ఖాళీ బుర్రలు'' అని హేళనగా ప్రస్తావిస్తుంటాడు. అయితే ఈ ప్రస్తావనలన్నీ సారమ్మ పాత్ర సృష్టిలో ఆయన చూపించిన నైపుణ్యం ఆ పాత్రకిచ్చిన వ్యక్తిత్వం మేధస్సు తార్కి జ్ఞానం, ప్రేమ లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు బషీర్‌కు స్త్రీలపట్ల వున్న గౌరవం స్పష్టమవుతుంది. ''బంగారు ఉంగరం'' కథలో కూడా భర్త తన భార్యను పనికిమాలినదని, తెలివి తక్కువదని అంటూ వుంటాడు. అయితే కథలో చాలా సందర్భాలలో ఆమె మేధస్సు ముందు భర్త ఓడిపోతూ వుంటాడు. నిజానికి బషీర్‌ స్త్రీ పాత్రల రూపకల్పనలో వాటికి నిర్థిష్టమైన వ్యక్తిత్వాన్ని ఇవ్వటంలో తన కాలం కంటే ముందే వున్నాడు. స్త్రీ పురుష సంబంధాల గురించి ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం గురించి లోతైన అవగాహన వుంది. అతని పాత్రలన్నీ సంప్రదాయ ముస్లిం కుటుంబాలనుంచి వచ్చినటువంటివి. ఇవి అప్పుడప్పుడు 'బాలెన్స్‌' కోల్పోతుంటాయి. అయితే, కుటుంబ సంబంధాలను నిలుపుకొనేందుకు , అవి తమను తాము సరిదిద్దు కుంటుంటాయి. బషీర్‌ రాసిన 'అమ్మ' లాంటి కథలో కూడా ఈ విషయాలను గమనించవచ్చు. ఈ కథ స్వతంత్య్రోద్యమంలో పాల్గొనటానికి వెళ్లిన తన కొడుకు పట్ల తల్లికున్న ప్రేమను వ్యక్తం చేయటమేకాక ఆ కొడుకు కోసం ఆమె ఎదురు చూపుల్ని చిత్రించే క్రమంలో కథకుడు చాలా ఉచ్ఛస్థితికెళ్లి చిత్రించటం కనిపిస్తుంది. ''గోడలు'' అనే కథ బషీర్‌ రాసిన ఉత్తమ కథలలో ఒకటి. ప్రేమ అనే భావనను బషీర్‌ ఈ కథలో చాలా విస్తృతమైన అర్థంలో చూపిస్తాడు. నిజానికి ఎప్పుడూ కలవని ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడ్డ ప్రేమను చిత్రించిన కథ అదే కావచ్చు. ఈ ప్రేమికులు కలువకుండానే విడిపోయిన తర్వాత కూడా ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను కాపాడుకోవడం అనేది గమనించదగిన అంశం. ఈ ప్రేమికులిద్దరు ఒక పెద్ద గోడ చేత విడదీయబడ్డ ఇద్దరు ఖైదీలని తెలిసినప్పుడు, ఈ కవి పట్ల పాఠకులలో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. తాము ప్రేమలో వున్నామన్న భావాన్ని కాపాడుకోడానికి తాము జైలు నుంచి బయటకు వెళ్లి స్వేచ్ఛగా వుండే అవకాశాన్ని కోల్పోవటానికి సిద్ధమవుతారు. ప్రేమలేని స్థితిలో స్వేచ్ఛ వారికి అవసరంగా అనిపించదు. కథకుడు ఈ కథలో గోడను ఒక రూపకంగా చూపించారు. ప్రతి రూపకానికి బహుళార్థాలుంటాయి. అ లాగే ఈ కథకు కూడా.

ఈ లక్షణాల వల్లనే బషీర్‌ కథలలో, ఈ కతకి విశేషమైన పేరు వచ్చింది. పై పరిశీలన తర్వాత కథ వస్తు రూపాలలో, పాత్ర చిత్రీకరణలో ప్రాంతీయతను ప్రతిబింబించడంలో వ్యక్తుల జీవితాలను నడిపిస్తున్న ఆర్థిక అంశాల విశ్లేషణలో వ్యక్తిలోని ఔన్నత్యాన్ని పెంచటంలో ప్రేమకున్న ప్రాధాన్యతను ప్రతిబింబించడంలో బషీర్‌ చూపించిన ప్రతిభ అతన్ని ప్రపంచ కథా సాహిత్యంలో ఏ కథా రచయితకు తీసిపోని స్థాయిలో నిలబెట్టగలిగింది.

- డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి,
  ( 'మిసిమి' మాస పత్రిక, ఏప్రిల్‌ 2011 సౌజన్యంతో )
బషీర్‌ కథలు
290 పేజీలు, వెల: రూ.100
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

Friday, April 8, 2011

ప్రాంతీయత సార్వజనీనతల సమ్మేళనం ''బషీర్‌ కథలు'' -1, డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి, ( 'మిసిమి' మాసపత్రిక ) ...


ప్రతి భాషలోనూ మాస్టర్‌ రైటర్స్‌ అనదగిన వాళ్లుంటారు. వాళ్లు తమ రచనాశక్తితో ఆయా భాషా సాహిత్యాలపురోభివృద్ధికి కారణమవుతారు. మళయాళ సాహిత్యంలో వైకం మహమ్మద్‌ బషీర్‌ అటువంటి మాస్టర్‌
రైటర్‌. బషీర్‌ తన రచనలతో మళయాళీ సాహిత్య ప్రపంచాన్నే కాక మిగతా భారతీయ భాషా సాహిత్యాలనుకూడా ప్రభావితం చేయగలిగారు. నిజానికి ఏ భాషా సాహిత్యంలోనైనా బషీర్‌లాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తారు. ఎందుకంటే, వీళ్లు స్థలకాలాలకు, వాటి పరిమితులకు పరిమితమై ఆలోచించకుండా భావుకతతో వాటిని దాటి సృజనాత్మకంగా రాయగలుగుతారు. వాళ్ల రచనల సారానికి (ఎస్సెన్స్‌) వారిఅస్తిత్వ సారానికి మధ్య ఎటువంటి వ్యత్యాసం వుండదు. దాని ఫలితంగా వాళ్ల రచనలు ప్రత్యేకంగావుండటమే కాకుండా నిర్దిష్టంగా కూడా వుంటాయి.

బషీర్‌ కాల్పనిక సాహిత్యంలో అన్ని రూపాలలోనూ రచన చేసినప్పటికీ, ప్రముఖంగా సాహిత్యలోకం ఆయనను కథా రచయితగానే గుర్తించింది. బషీర్‌ కథలు మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావాన్ని, రెండవప్రపంచ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను వాటి నేపధ్యంలో ప్రదర్శిస్తాయి. అదే సందర్భంలో ఆ రెండుప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభాలు, కష్టాలు ఆయన కథల్లో ప్రతిఫలిస్తాయి. ఆకాల సామాజిక సందర్భాలను అన్ని రూపాలలో ఆయన కథలు చిత్రిస్తాయి. ఆ రకంగా, ఆయన కథలుమానవ సంకట స్థితిని దాని సూక్ష్మ్ర రూపాలలోకి వెళ్లి కూడా ప్రతిఫలింపజేయటం జరుగుతుంది. ఒకమేదావి అయిన కథా రచయితగా ఆయన సామాజిక సన్నివేశాలలో వుండే కఠోర వాస్తవాలను వాటిసున్నితమైన కఠోరమైన రూపాలను పట్టుకొని కథలలో చిత్రిస్తారు. ఆయన కథలు ఆ రచయిత భావనాప్రపంచాన్ని ప్రాపంచిక దృక్పథాన్ని చాలా స్పష్టంగా ఎటువంటి జంకు లేకుండా ప్రదర్శిస్తాయి. ఆయన ఒకవ్యక్తిగా తన రోజువారీ జీవితంలో పరిశీలించిన ప్రజలనే పాత్రలుగా మలచుకుంటారు. నిజానికి, ఆయన
సృష్టించిన పాత్రలన్నీ ఆయనతో పరిచయమున్న వాళ్లను నమూనాలుగా స్వీకరించి సృష్టించినవి.

బషీర్‌ ఒకానొక అరుదైన తాత్విక దృక్కోణంలోంచి తన అనుభవాలను పరిశీలించి వాటికి కథారూపం ఇచ్చారు. వైయక్తికమైన అంశాలను చారిత్రకమైనవిగా తాత్కాలికమైన విషయాలను శాశ్వతమైనవిగాచూస్తూ  అ ల్ప విషయాలను కూడా ఉదాత్తమైన అంశాలుగా ఆయన చూడగలిగాడు. ఆ దృష్టే ఆయన కథల్లో నిరంతరం వెన్నంటి వుంది. బషీర్‌ సాధరణమైన, ఎటువంటి విద్యలేని కేరళలోని పేద ముస్లిం కుటుంబాలలోని సంక్షోభాన్ని, ఆధునికతలోకి ప్రవేశించలేక తమ మత సంబంధమైన పునాదులను పెకిలించుకోలేక సంక్షోభంలో ఉన్న స్థితిని కథలుగా మలిచారు. ఆ పాత్రల జీవితాలను అనివార్యంగా ఆవరించుకొన్న విషాదాన్ని అవి ఆమోదించి జీవిస్తూ వుండటం కూడా కనిపిస్తుంది. ఆయన పాత్రలు తమ చుట్టూ వున్న వ్యక్తులపట్ల గాఢమైన ప్రేమతో వుంటాయి. ఈ ప్రేమ పశు పక్ష్యాదుల పట్ల కూడా విస్తరించింది.

పాశ్చాత్య ప్రపంచ ప్రజల మీద వారి ఆత్మిక సాంఘిక జీవితాల మీద రెండు ప్రపంచ యుద్ధాలు విపరీతమైనప్రభావాన్ని చూపి,చాయి. మొదట ఆ యుద్ధాలు ఆర్థిక స్థితిగతుల్ని ధ్వంసం చేస్తే ఆ తరువాత వాళ్ల మనో ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేశాయి. శతాబ్దాలుగా వాళ్ళను నడిపిస్తున్న విలువల పట్ల నమ్మకం పోయింది.వాళ్ల సామాజిక అంత:చేతనాన్ని, మూర్తిమత్వాన్ని రూపుదిద్దిన సంస్కృతి పట్ల కూడా వారికి విశ్వాసం సన్నగిల్లింది. మనిషి తాను ఒంటరివాడిననే భావనకు లోనై క్రమంగా జీవితంపట్ల నిస్పృహతో కూడిన వైఖరిని ఏర్పరచుకున్నాడు. అయితే, అటువంటి అసంబంద్ధ సందర్భం మనిషికి తన అస్తిత్వాన్ని, దాని అర్థాన్ని గురించి లోతుగా ఆలోచించుకోవటానికి ఆస్కారాన్ని కూడా కల్పించింది. ఆ కాలంలో భారతదేశంలో కూడా యుద్ధ పరోక్ష ప్రభావాల వల్ల అటువంటి వాతావరణమే, ఆ తరహా నైరాశ్మమే అలముకొని వుంది. తమ అస్తిత్వాలను గురించిన సగటు మనిషి ఆందోళన, అందుగురించిన లోతైన
ఆలోచన మొదలైన అంశాలే చాలామంది కాల్పనిక సాహిత్యకారులకి వస్తువులయ్యాయి. బషీర్‌ లాంటి వాళ్లు ఆ కోవకు చెందిన వాళ్లే. బషీర్‌ తన సమకాలీన ప్రజల సమస్యలను, సంకట స్థితిని, అత్యంత సానుభూతితో అర్థం చేసుకొని వాటికి కథారూపం ఇచ్చారు.

మానవ స్వభావాన్ని మొరటు వర్గీకరణలోంచి కాకుండా తాత్వికంగా అర్థచేసుకోగలిగిన ఏ రచయితలోనైనా క్షమాగుణం అనేది అనివార్యంగా వుంటుంది. ఈ క్షమాగుణమే బషీర్‌ లాంటి వాళ్లను కథా సాహిత్యం వైపు
నడిపించింది. తన చుట్టూ వున్న మనుషుల పరిమితుల్ని, అసంపూర్ణత్వాన్ని ఆయన అర్థంచేసుకొని, ఆ
అవగాహనలోంచే ఇవాళ వాళ్లను కథాలోకంలో పాత్రల లాగా ప్రవేశపెట్టి క్షమించారు. సాదాసీదా రచయితలకు ఇటువంటి లక్షణం అసాధ్యం. వాళ్లు తాము సృష్టించే పాత్రల పరిమితుల్ని అవి చేసే పొరపాట్లను తప్పులను విద్వేషంతో చూసి చిత్రిస్తారు. ఫలితంగా, ఆ పాత్రలు సజీవత్వాన్ని సంతరించుకోకపోగా, ఆ రచన కేవలం జీవితాన్ని వాఖ్యానించేదిగానూ, అసమగ్రంగానూ మిగులుతుంది.

బషీర్‌ కథలు ప్రధానంగా ముస్లిం కుటుంబాల జీవితాలను వస్తువుగా స్వీకరించినప్పుడు అవి కేవలం వారికి
మాత్రమే పరిమితమై వుండక మిగతా సామాజిక బృందాలను కూడా కదిలించగలిగాయి. అత్యంత దయనీయమైన  దారిద్య్రాన్ని అనుభవిస్తూ, మానసిక ప్రపంచంలో అనేక గాయాలకు గురైన  ముస్లింలు ఆయన కథా సాహిత్యంలో పాత్రలుగా మనకు పరిచితమౌతారు.

బషీర్‌ ప్రముఖ రచనలలో ఒకటి ''పాత్తుమ్మ మేక''. ఆ కథలో ప్రధాన పాత్ర అంతర్ముఖుడైన కథకుడు. అతను భావనా ప్రపంచంలోనే సంచరిస్తూ వుంటాడు. అసలు ఆ పాత్రను పరిచయం చేయటంలోనే ఈ విషయాన్ని నిర్థారించటం జరుగుతుంది. ఈ పాత్రను సాధారణ పద్ధతిలో కాకుండా కథ నడిచే క్రమంలో పరిచయం చేయటం జరిగింది. నిజానికి వాశ్లేషించే క్రమంలోనే ప్రధాన పాత్రను కథకుడు రంగం మీదకు తీసుకవస్తాడు. ఆ తరువాత ఆ పాత్ర వివిధ సందర్భాలలో తనను తాను ఆవిష్కరించుకుంటూ ఎదుగుతుంది.  కథ ప్రధానంగా కథకుడి దృక్కోణంలోనుంచే నడుస్తుంది. సోమర్‌సెట్‌ మామ్‌ లాంటి చేయి తిరిగిన కథకులు యదార్థ జీవిత సన్నివేశాల నుంచి పాత్రలను స్వీకరించటం అత్యవసరమని భావించారు. అప్పుడు మాత్రమే సాహిత్యానికి కొంత విశ్వజనీన లక్షణం ఏర్పడుతుందని కూడా ఆయన భావించారు. బషీర్‌ రాసిన అనేక కథలలో సరిగ్గా ఈ లక్షణమే కనిపిస్తుంది.

వ్యక్తిక,ి సమాజానికి వున్న సంబంధం గతితార్కికమైనదని కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. వక్తి సమాజంలోనే వికసిస్తాడు. సమాజం ఒక రకంగా వ్యక్తి స్థూల రూపం. సమాజం కూడా వ్యక్తి నుంచే రూపొందుతుంది. ఏ వ్యక్తీ తాను జీవిస్తున్న సంస్కృతీ సంప్రదాయం ప్రభావాల నుంచి తప్పించుకోలేడు. ఈ సంస్కృతీ సంప్రదాయాల వలనే వ్యక్తులకు కొన్ని సార్వత్రిక లక్షణాలుంటాయి. ఈ సార్వత్రిక లక్షణాల వలన మిగతా సమాజం నుంచి తనను తాను వేరుగా ప్రతిష్టించుకోగలుగుతాడు. సమాజాన్ని మార్చగలిగే వ్యక్తి తనను తాను మార్చుకోగలుగుతాడు. ఈ లక్షణాలన్నింటినీ బషీర్‌ తన కాల్పనిక సాహిత్యంలో విరుద్ధ స్వభావాలూ ప్రవృత్తులూ వున్న పాత్రల ద్వారా చిత్రించాడు.

- డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి,
   'మిసిమి' మాస పత్రిక, ఏప్రిల్‌ 2011 సౌజన్యంతో

...................................................................(ఇంకా వుంది)

బషీర్‌ కథలు
290 పేజీలు, వెల: రూ.100
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌