'దేశభక్తి కన్నా ఉన్నతమైంది మానవత్వం'
జెఎన్‌యూ ప్రాంగణంలో ఫిబ్రవరి 9, 2016న కన్హయ్య కుమార్ చేసిన ఉత్తేజపూరితమైన ఉపన్యాసం నన్ను అతని అభిమానిని చేసింది. ఈ యువకుడి హృదయం, మేధస్సు సరైన స్థానంలో ఉన్నాయని నాకనిపించింది. ఎందుకంటే మన దేశం ఎలాంటి స్థితిలో ఉండాల్సిందో అతను మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తు చేసింది.
ఒక నెలన్నర తరువాత, ఈ ఉదయం అదే క్యాంపస్‌లో ఉమర్ ఖలీద్ తన ఆలోచనలను పంచుకుంటు న్నప్పుడు నాకు రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత 'ఎక్కడ హృదయం భయరహితంగా ఉంటుందో' గుర్తుకు వచ్చింది. ఆ కవిత 'ఎక్కడైతే మేధస్సు స్వేచ్ఛాయుతంగా ఉంటుందో, ఎక్కడైతే సమాజం కులం, సమూహాలు, లింగ ప్రాతిపదికలపై శకలాలు శకలాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడైతే ప్రజలు అత్యున్నతంగా జీవించగలరో, ఎక్కడైతే ప్రతి ఒక్కరూ నిటారుగా తలెత్తుకుని జీవించగలరో అటువంటి దేశంగా భారతదేశం' ఉండాలని మాట్లాడుతుంది. ఉమర్ ఖాలిద్ విశ్వకవి ఊహించిన ఇండియాలో ఒక సభ్యుడు కాదగ్గవాడని నాకు అనిపించింది.
యువకులందరూ కన్హయ్య, ఉమర్‌లలా తయారు కావాలని నా కోరిక.
కన్హయ్య ఒక చిన్న గ్రామంలోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. బడిలో, కాలేజీలో చదువుకున్నంత కాలం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు.
అయినా ఏటా వేలాది మంది విద్యార్థులు ప్రవేశం దొరకక నిరాశపడే జెఎన్‌యు వంటి సంస్థలో సీటు సంపాదించు కోగలిగేంత తెలివైన వాడు కాగలిగాడు.
ఉమర్ ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన వాడయినప్పటికీ, మతం సంకెళ్లను తెంచుకున్నవాడు.
తన దేశంలోని ఆదివాసుల దుస్థితి గురించి అధ్యయనం చేయడం కోసం విదేశాలకు వెళ్లే అవకాశాన్ని, ఒక అమెరికన్ విశ్వవిద్యాలయం ఇవ్వజూపిన స్కాలర్‌షిప్‌ను వదులుకున్నవాడు.
అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా క్యాంపస్‌కు తిరిగివచ్చిన గుండెనిబ్బరం అతనిది. అంతేకాదు, భయంతో జీవించదలుచుకోలేదని, మౌనంగానూ ఉండబోనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు.
వీళ్లిద్దరూ వామపక్ష సంఘాల్లో సభ్యులు.
నాస్తికులమని ప్రకటించుకున్నవారు.
అయినప్పటికీ ఎ.బి.వి.పి, బి.జె.పి ఎం.పి మహేష్ గిరి, జేఎన్‌యూ వైస్‌ఛాన్సలర్ జగదీశ్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సి, కొందరు టెలివిజన్ యాంకర్లు వాళ్లు 'అల్లా హో అక్బర్, ఇన్షా అల్లా' లాంటి నినాదాలు ఇస్తున్నట్టు మార్ఫింగ్ చేసిన వీడియోలను చూపిస్తే గుడ్డిగా నమ్మారు.
ఈ విద్యార్థులను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి, జె.ఎన్.యును ప్రమాదకర శక్తుల జన్మభూమిగా ముద్రవేయడానికి వాళ్లకు ఆ వీడియోలు చాలు.
బుద్ధి ఉన్న వాళ్లు ఎవరైనా కాస్త ఆగి ''ఏంటి? కమ్యూనిస్టులు నిర్వహిస్తున్న నిరసన సభలో అల్లాహో అక్బర్, ఇన్షా అల్లా లేమిటి'' అని అనుకోవాలి. వాళ్లు ఆ మాత్రం ఓపిక పట్టగలిగి ఉంటే, ఇప్పుడు వాళ్లు ఎదుర్కొంటున్న ఈ అవహేళనలకు గురికాకుండా ఉండగలిగేవాళ్లు.
కన్హయ్య, ఉమర్‌లకు వ్యతిరేకంగా చేసిన రాజద్రోహ నేరారోపణలు పేకమేడల్లా కూలిపోవడంతో తన అవమాన భారపు ముఖాన్ని బి.జె.పి జాతీయ జెండా చాటున దాచుకునేందుకు పూనుకుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనూ మన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని తాఖీదులు జారీ చేసింది. సంఘ వ్యతిరేక శక్తుల పుట్టుకకు మూలం అని కాషాయ దళాలు ఏ జేఎన్‌యూ గురించి అయితే ఆరోపిస్తూ ఉన్నాయో, ఆ జేఎన్‌యూలో చాలా సంవత్సరాల నుంచే జాతీయ జెండా ఎగురుతున్న విషయం వాళ్లు గమనించినట్టు లేరు. ఎంత హాస్యాస్పదం!
విషాదం ఏమిటంటే, అదే హిందుత్వ శక్తులు జాతీయ జెండాను తమ మతతత్వ కార్యకలాపాలకు, చట్టరాహిత్య పనులకు ఒక ముసుగుగా ఉపయోగించుకోవడం.
ఉదాహరణకు ఇటీవల కొంతమంది న్యాయవాదులు సుప్రీంకోర్ట్టు ఆవరణలోనే సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ జనం మీద భౌతికదాడికి పాల్పడ్డారు. వాళ్ల చర్యను అందరూ ఖండించినప్పుడు వాళ్లు ఆ మువ్వన్నె జెండానే పైకెత్తి పట్టుకుని నిరసన ప్రదర్శన చేసారు.
నాగపూర్‌లోని తమ కేంద్ర కార్యాలయం పైన 50 ఏళ్లకు పైగా జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు నిరాకరిస్తూ వచ్చిన ఆర్.ఎస్.ఎస్ ఇప్పుడు ముస్లింలు తమ దేశభక్తిని రుజువు చేసుకోవడానికి అన్ని మసీదులపైనా జాతీయ పతాకాన్ని ఎగరేయాలని అంటున్నది.
హుబ్లీలోని ఏ గుడిపైనా జాతీయ జెండా ఎగరకపోయినా అక్కడి ఈద్గా మైదానంలో బలవంతంగానైనా సరే జాతీయ జెండాను ఎగరవేయించేందుకు కొన్ని దశాబ్దాల క్రితం బి.జె.పి జాతీయ స్థాయిలో ఒక ప్రచారాన్ని నిర్వహించింది.
కన్హయ్య, ఉమర్ వంటి వారికి జాతీయ పతాకాన్ని ఎగరవేయడంలో దేశభక్తి లేదు. దాని బదులు సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ, అణిచివేతకు గురైన అట్టడుగు ప్రజల స్థితిని మెరుగుపరచడం పట్ల శ్రద్ధ వహించడంలో వారి దేశభక్తి ఉంది.
ఒకవైపు 'భారత్ మాతాకీ జై' అని అరుస్తూ మరోవైపు భిన్నాభిప్రాయాలు గల వ్యక్తుల తల్లులను, అక్కచెల్లెళ్లను రేప్ చేస్తామని బెదిరించే వారికి భిన్నంగా వీరి దేశభక్తి స్త్రీలను గౌరవించడంలో ఉంది.
వారికి దేశభక్తి అంటే ప్రతి ఒక్కరి పైనా హిందుత్వాన్ని రుద్దడం కాదు; భారతదేశంలో ఉన్న అన్ని మతాలను, భాషలను, సంస్కృతులను, ఇతర భిన్నత్వాలను పరిరక్షించడం. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాకి దాసోహం అవడం కాదు దేశభక్తి; గాంధీ, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, పెరియార్ వంటి వ్యక్తుల భావాలకు విస్తృత ప్రచారం కల్పించడం వారికి దేశభక్తి.
ఈ దేశ ప్రజల గురించి ఆలోచిస్తున్న కన్హయ్య, ఉమర్‌లే నా దృష్టిలో నిజమైన దేశభక్తులు.
జెండా ఏ ప్రజలకయితే ప్రాతినిధ్యం వహిస్తోందో ఆ ప్రజలను పట్టించుకోని వాళ్లది అదేం దేశభక్తి? జేఎన్‌టీయూలో విద్యార్థులకు వ్యతిరేకంగా ఆర్.ఎస్.ఎస్ నడిపిస్తున్న ప్రహసనం ఇంకా కొనసాగుతుండగానే ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మ, విదూషకుడు రెండూ అని రుజువు చేసుకున్న బస్సీ ఈ రోజు తమ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే బాధ్యత విద్యార్థుల మీదనే ఉందన్నాడు.
మన దేశ చట్టం ప్రకారం ఒక వ్యక్తి నేరస్తుడిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణింపబడతాడనే విషయం అతను మరిచిపోయినట్టున్నాడు. విద్యార్థులు సంఘ విద్రోహకులని రుజువు చేయడంలో బస్సీ విఫలమయ్యాడు కాబట్టి ఇప్పుడు విద్యార్థులే తాము దేశభక్తియుత భారతీయులం అని రుజువు చేసుకోవాలా?
ఠాగూర్ మరో కోటేషన్‌తో దీన్ని ముగిస్తాను.
''దేశభక్తి అన్నది మన చివరి ఆధ్యాత్మిక ఆశ్రయం కాకూడదు. నా ఆశ్రయం మానవత్వమే. వజ్రాల వెలకు నేను గాజు వస్తువుల్ని కొనను. నేను జీవించి ఉన్నంత వరకు మానవత్వంపై దేశభక్తిది పైచేయి అయ్యేందుకు అనుమతించను''.
(బెంగుళూరు మిర్రర్, 22 ఫిబ్రవరి 2016)
అనువాదం : ఎం.విమల
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు
ఇంగ్లీష్ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి, కె.సజయ, ప్రభాకర్ మందార, పి.సత్యవతి, కాత్యాయని, ఉణుదుర్తి సుధాకర్, కె. సురేష్, కె.ఆదిత్య, సుధాకిరణ్, కల్యాణి ఎస్.జె., బి. కృష్ణకుమారి, కీర్తి చెరుకూరి, కె. సుధ, మృణాళిని, రాహుల్ మాగంటి, కె. అనురాధ, శ్యామసుందరి, జి. లక్ష్మీ నరసయ్య, ఎన్. శ్రీనివాసరావు, వినోదిని, ఎం.విమల, ఎ. సునీత, కొండవీటి సత్యవతి, బి. విజయభారతి, రమాసుందరి బత్తుల, ఎ.ఎమ్. యజ్దానీ (డానీ), ఎన్. వేణుగోపాల్, శోభాదేవి, కె. లలిత, ఆలూరి విజయలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి
230 పేజీలు , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment