Saturday, May 30, 2009

వేమన్న వాదం ... సంకలనం, వ్యాఖ్యానం : డా.ఎన్‌. గోపి



...వేమన్న వాదం ...

నిజానికి వేమన పద్యాలకు వ్యాఖ్యానం అవసరం లేదు.

కానీ సరళ సుందరమైన వేమన పద్యాల్లో కూడా ఆలోచిస్తేగానీ తట్టని అర్థాలు బోలెడన్ని కనిపిస్తాయి. ఇప్పటికే వేమన పద్యాలకు చాలా వ్యాఖ్యానాలు వచ్చినా వేమన్న వేదననూ, అసమానతలమీద అంతులేని కోపాన్నీ, భావోద్వేగాన్నీ, వాటికి నేపథ్యంలో వున్న నాటి సంఘాన్నీ పక్కకి నెట్టి చిలుక పలుకుల్లాగా వేమన్న కేవలం నీతిసూత్రాలు వల్లించాడన్నట్టుగా వెలసిన తాత్పర్యాలే ఎక్కువ.

వీటిలో కూడా బ్రౌనే కొంత నయం.
మూలం మీది గౌరవంతో ఎందరినో విచారించి, ఎంతో పరిశ్రమతో లఘు వ్యాఖ్యలతో సహా ఇంగ్లీషులోకి అనువదించాడు. కానీ బ్రౌన్‌కు కూడా వేమన్న భాషా, తేటగా చెప్పే పద్ధతీ పట్టినంతగా వేమన భావాలూ, వాదాలూ పట్టలేదు. దీనికి బ్రౌన్‌ను తప్పుపట్ట నవసరం లేదు. ఆయనది ప్రధానంగా భాషా దృష్టి.

వేమన్నను అతని కాలంనాటి సామాజిక సన్నివేశంలో చూడాలనే ఆ లోచన మనకింకా సరిగ్గా కుదురుకోలేదు. వేమన పద్యాలు అప్పటి కాల పరిస్థితులకు ప్రతిస్పందనలుగా, ప్రతీఘాతాలుగా వెలువడ్డాయనే దృష్టితో చూస్తే వేమన పద్యాలు మనకు కొత్త వెలుగుల్తో కనిపిస్తాయి.
అటువంటి ప్రయత్నంలో ఒక చిన్న ప్రారంభమే ''వేమన్న వాదం''.

(- డా.ఎన్‌.గోపి, 'వేమన పద్యాల నేపథ్యం' నుంచి)

... ... ...

తెలుగు పాఠకుల్లో విజ్ఞాన చైతన్యాలను కలిగించటం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానాశయాలు. అందునుగుణంగా ''వేమన్న వాదం'' మొదటి ముద్రణతో పాఠకులతో పరిచయం ఏర్పరచుకున్నాం. మా ప్రయత్నాన్ని పాఠకలోకం హర్షించినందుకు ఎంతో ఆనందిస్తున్నాం.

సంవత్సరం తిరకక్కుండానే ''వేమన్న వాదం'' సాధారణ ప్రతులన్నీ అమ్ముడయిపోయినాయి. అంతేకాక ఈ పుస్తకాన్ని చదివిన వారు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టును అభినందిస్తూ ఉత్తరాలు రాశారు.

తెలుగువారిని అవాస్తవిక భ్రమల్లో ముంచెత్తే కాల్పనిక సాహిత్యం కొంతకాలం నుంచీ తెలుగునాట స్వైరవిహారం చేస్తున్నది. ఇది చాలక ఇటీవల మంత్ర తంత్రాలతో, గడుసుదయ్యాల కథలతో కుహనా శాస్త్రీయ ధోరణిలో మూర్ఖ విశ్వాసాలకు కొత్తవేషం వేసే సాహిత్య మొకటి బయలుదేరింది.

వీటి తాకిడిని తట్టుకొని వేమన్నవాదంతో మొదలైన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలు పాఠకుల్లోకి చొచ్చుకుపోవటం మాకు ప్రత్యేకంగా సంతృప్తి కలిగించే విషయం. కొన్ని పరిమితులకు లోబడిఅయినా ''వేమన్న వాదం'' ఈ అశాస్త్రీయ భావాలను ఎదుర్కోగలదని మా విశ్వాసం.
అందువల్ల వేమన్న వాదం అవసరం ఇంకా వుంది.
ఈ పుస్తకం రెండో ముద్రణ తీసుకురాగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాం.

(- చేకూరి రామారావు, 'రెండో ముద్రణ సందర్భంలో' నుంచి)

... ... ... ...

భూమి నాదియన్న భూమి పక్కున నవ్వు
ధనము నాదియన్న ధనము నవ్వు
కదనభీతు జూచి కాలుండు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ

చిత్తశుద్ధి గలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినురవేమ


వేమన్న వాదం
వ్యాఖ్యాత : డాక్టర్‌ ఎన్‌. గోపి


ప్రథమ ముద్రణ: జులై 1980
పునర్ముద్రణ: 1981, 1984, 1987, 1992, 1998, 2003

88 పేజీలు, వెల : రూ.25


ప్రతులకు, వివరాలకు:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500067
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

.....................................

Wednesday, May 27, 2009

అమ్ముడుపోతున్న వ్యవసాయం ... బలిపీఠంపై భారత ఆహార భద్రత ...దేవీందర్‌ శర్మ ...



అమ్ముడుపోతున్న వ్యవసాయం
బలిపీఠంపై భారత ఆహార భద్రత
- దేవీందర్‌ శర్మ ...



ప్రపంచ వాణిజ్య సంస్థ తాలూకు వ్యవసాయ ఒప్పందం నేపథ్యంలో మన దేశం యాభైఏళ్లపాటు చెమటోడ్చి సాధించుకున్న ఆహార భద్రతనూ, స్వయం సమృద్ధినీ స్వేచ్ఛా వాణిజ్యం ఏవిధంగా ధ్వంసం చేయబోతోందో వివరిస్తుందీ వ్యాసం.

ప్రస్తుతం మన వ్యవసాయ విధానం ఒక అగమ్యగోచర స్థితిలో వుంది. హరిత విప్లవం తన ఊపును కోల్పోవడం వల్ల పంట దిగుబడులు స్తంభించడమేకాక తగ్గుముఖం పడుతున్నాయి. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆహారోత్పత్తి పెరగక పోవడానికి నేడు దేశంలో కొనసాగుతున్న నిరాశాజనకమైన ఆర్థిక విధానాలే కారణం.

సాంద్ర వ్యవసాయంలో ఉత్పన్నమయ్యే సమస్యలను సరళీకృత విధానాలు తీవ్రం చేశాయి. వ్యవసాయ విధానాల ప్రధాన దృష్టి ఆగ్రోప్రాసెసింగ్‌, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు మొదలైనవాటి మీదకు మళ్లడంతో వ్యవసాయ ఉత్పత్తికీ-ఆహారం అందుబాటుకీ మధ్య వుండే అవినాభావ సంబంధం అ లక్ష్యానికి గురైంది.

ఒకవైపు దేశంలో ఆకలి దప్పులు పెరిగిపోతోంటే మరోవైపు అనేక సారవంతమైన నేలల్లో పండిన ఆహార ధాన్యాలను, మాంసకత్తులను ప్రజల ఆకలిని తీర్చేందుకు కాకుండా విదేశీ మార్కెట్ల కోసం పనికొచ్చే చిరుతిండ్లు, మద్యపానం వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయం పారిశ్రామికీకరణ చెందుతున్న కొద్దీ చిన్న సన్నకారు రైతులు తమ భూముల్ని కోల్పోతున్నారు. భూమిలేని రైతు కూలీలుగా, పట్టణ ప్రాంతపు నిరుపేదలుగా మారిపోతున్నారు. ప్రత్యేకించి మెట్ట ప్రాంత వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎరువులూ పురుగుమందుల విషవలయంలో రైతులు విలవిలాడుతున్నారు. దీనికి తో'డు గిట్టుబాటు ధరలు రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

వాణిజ్యానికి సంబంధించిన మేధోపరమైన సంపద హక్కుల (టిఆర్‌ఐపిఎస్‌)పై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం మన దేశ వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థను కొద్దిపాటి బహుళ జాతి సంస్థలు హైజాక్‌ చేయడానికి అవకాశం కల్పిస్తున్నది. భవిష్యత్‌ చిత్రపటం మరింత భీతిగొల్పుతున్నది.

ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1.స్వయం సమృద్ధివైపు 2. భారత వ్యవసాయానికి ప్రమాద ఘంటికలు 3.వ్యవసాయ ఒప్పందం. 4. తిండిగింజలకు బదులు గులాబీలు, 5. నూనెగింజల విప్లవాన్ని కాలదన్నడం 5. ఆహార అభద్రతకు అంకురార్పణ.



అమ్ముడుపోతున్న వ్యవసాయం
బలిపీఠంపై భారత ఆహార భద్రత
- దేవీందర్‌ శర్మ


ఆంగ్ల మూలం: Selling Out: The Cost of Free Trade for Food Security in India, Devider Sharma; The Ecological Foundation, New Delhi, 2000 CopyRight: 2000, UK Food Group

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార

పుస్తక సంపాదకుడు: యం. కోదండరామ్‌రెడ్డి
ప్రథమ ముద్రణ: డిసెంబర్‌ 2000
32 పేజీలు, వెల: రూ.12


..................

Friday, May 22, 2009

పెరియార్‌ జీవితం - ఉద్యమం... వి.ఎస్‌. నైపాల్‌



పెరియార్‌ జీవితం - ఉద్యమం
- వి.ఎస్‌. నైపాల్‌


పెరియార్‌ గురించీ, ఆయన చేపట్టిన విలక్షణమైన ఉద్యమం గురించీ తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం కొంతవరకు దోహదం చేస్తుంది. నిజానికి ఇది వి.ఎస్‌. నైపాల్‌ రాసిన ''ఇండియా: ఎ మిలియన్‌ మ్యూటినీస్‌ నౌ'' అన్న బృహత్‌గ్రంథంలోని ఒక చిన్న అధ్యాయం. భారతదేశ పర్యటనలో భాగంగా 1988లో మద్రాసులో అనేకమంది పెరియార్‌ అనుయాయుల్ని, డిఎంకె ప్రతినిధులను కలుసుకుని ఆయన తన అనుభవాలను గ్రంథస్తం చేశారు.

పెరియార్‌ 1879లో అంటే గాంధీ పుట్టిన పదేళ్ల తరువాత జన్మించాడు. ఆయన రాజకీయ జీవితం 1919లో ప్రారంభమై 1973లో చనిపోయే వరకూ సుదీర్ఘకాలం కొనసాగింది. గాంధీ పూర్తిగా శాఖాహారి. పెరియార్‌ మాంసాహారి. భోజనప్రియుడు. పొట్టేలు మాంసం, ఎద్దు మాంసం, పంది మాంసం ఇష్టపడేవాడు. ఆయనకు తిండి విషయంలో ఎట్లాంటి నియమాలూ వుండేవి కావు. గాంధీ ఆస్తికుడు. పెరియార్‌ నాస్తికుడు.

గాంధీకి పూర్తి భిన్నంగా కనిపించినప్పటికీ, గాంధీని ఆయన అన్నివిషయాల్లో గట్టిగా వ్యతిరేకించినప్పటికీ లక్ష్య సాధనకు కృషి చేయడంలో, చెప్పింది స్వయంగా ఆచరించడంలో, దైనందిక వ్యవహార శైలిలో పెరియార్‌ గాంధీ ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు. పెరియార్‌లో భోజన ప్రియత్వం, మాంసాహార అ లవాటు, మొండితనం వంటి లక్షణాలు ఎన్ని వున్నా ఒక విధమైన నిర్మలత్వం కూడా కనిపిస్తుంది. ఆ నిర్మలత్వమే పెరియార్‌కు ''యాంటీ గాంధీ'' రూపాన్నిచ్చింది అంటారు నైపాల్‌.

పెరియార్‌ బ్రాహ్మణేతరుల దేవాలయ ప్రవేశ హక్కు కోసం పోరాడారు. స్వాభిమాన ఉద్యమాన్ని నిర్వహించాడు. నాస్తికత్వాన్ని ప్రచారం చేశారు. విగ్రహారాధనను, మూఢనమ్మకాలను నిరసించాడు, కుల నిర్మూలనకు పాటుపడ్డాడు, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నిర్వహించాడు. హోటళ్ల ముందరి బోర్డుల్లో శాఖాహారానికి పర్యాయపదంగా ''బ్రాహ్మణ'' అన్న పదాన్ని, మాంసాహారానికి పర్యాయపదంగా ''మిలిటరీ'' అన్న పదాన్ని వాడడాన్ని నిరసించి ఆ పదాలను తొలగింపజేశాడు. వినూత్న స్ఫూర్తితో ద్రవిడ ఉద్యమం నిర్మించాడు.

డెబ్బై ఏళ్ల వృద్ధాప్యంలో పెరియార్‌ ముఫ్ఫై ఏళ్ల మణ్యమ్మాయ్‌ అనే మహిళను ద్వితీయ వివాహం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. దానిమూలంగా ఎందరో ఆయనకు దూరమైపోయారు.చివరికి ద్రవిడ స్వాభిమాన ఉద్యమంలో చీలికకు కూడా దారితీసింది. మణ్యమ్మాయ్‌ తల్లిదండ్రులు పెరియార్‌ అభిమానులు. వెల్లూరుకు వెళ్లినప్పుడు ఆయన ఎక్కువగా వారి ఇంట్లోనే బస చేసేవారు. మణ్యమ్మాయ్‌ టీచర్‌ ట్రెనింగ్‌ పూర్తిచేసింది. తల్లిదండ్రులు పెళ్లి చేసుకొమ్మని ఎంత బలవంతపెట్టినా ఒప్పుకునేది కాదు. చివరికి పాతికేళ్ల వయసులో ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయి మరో టీచరు ఇంట్లో ఆశ్రయం తీసుకుంది. ఆమెను పెరియార్‌ తన కార్యదర్శిగా నియమించుకున్నాడు. ఆమె ఆయనకు ఒక నర్స్‌గా కూడా సపర్యలు చేసేది. దాదాపు ఆరేళ్ల తరువాత వారిరువురూ వివాహం చేసుకున్నారు. పెరియార్‌ వద్ద కోట్ల ఆస్తి వుండేది. ఆ ఆస్తి తన బంధువుల పాలు కాకుండా పూర్తిగా తన ఉద్యమానికే ఉపయోగపడాలనేది ఆయన కోరికనీ, అందుకే ఆయన మణ్యమ్మాయ్‌ని పెళ్లి చేసుకున్నాడని ప్రతీతి.

''ప్రపంచం ఇంకా గాఢాంధకారంలోనే వుంది
కులాన్ని నమ్మే జనానికి ఇంకా నూకలు పుడుతూనే వున్నాయి
మతం ద్వారా ప్రజల్ని బెదిరించే వ్యక్తులు ఇంకా బలిసిపోతూనే వున్నారు
ఈ జిత్తులమారి మోసాలకు అంతమెప్పుడు?
కులం, మతం అంతరించిపోనంతకాలం...
స్వేచ్ఛా స్వాతంత్య్రాలను దయ్యాలు మాత్రమే అనుభవిస్తాయి!''


- భారతీ దాసమ్‌ (పెరియార్‌ స్వాభిమాన ఉద్యమంలో ఒక విధంగా ఆస్థాన కవి)

వి. ఎస్. నైపాల్ (సర్ విద్యాధర్ సూరజ్ ప్రసాద్ నైపాల్) 1932 లో ట్రినిడాడ్ లో జన్మించారు. అనేక కాల్పనిక, కాల్పానికేతర రచనలను వెలువరించారు. ఇటీవలి అయన రచనల్లో An Area of Darkness, India : Wounded Civilization, India: A Million Mutinies Now , Beyond Belief: Islamic Excursions ప్రముఖ మైనవి. In a Free State అన్న నవలకు 1971 లో బుకర్ ప్రైజ్ లభించింది. 2001 లో నోబెల్ ప్రైజ్ కూడా ఆయనను వరించింది.


పెరియార్‌ జీవితం - ఉద్యమం
-వి.ఎస్‌.నైపాల్‌
ఆంగ్ల మూలం : India: A Million Mutinies Now, V.S.Naipaul, Minerva, India 1991.

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార


ప్రథమ ముద్రణ: 1999
26 పేజీలు, వెల: రూ.15/-
............................

Saturday, May 16, 2009

ఎయిడ్స్‌ గురించిన అన్ని విషయాలు ... తెలుసుకోవాలని వుండీ అడిగేందుకు మొహమాటం వేస్తే ...



ఎయిడ్స్‌ గురించిన అన్ని విషయాలు

హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ మన దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తూ పోతోంది.
పాతిక, ముఫ్పై సంవత్సరాలలోపు వాళ్ళే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
మన దేశంలో ఎయిడ్స్‌ ప్రబలంగా వున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో వుంది.

నిరక్షరాస్యత, ఆరోగ్య సౌకర్యాల కొరత, ఆర్థిక దారిద్య్రం, సమాచార దారిద్య్రం, సెక్స్‌ గురించి బహిరంగంగా చర్చించుకోవడమే మహాపాపంగా భావించే సంస్కృతి, రకరకాల మూఢనమ్మకాల కారణంగా అనేక మందికి హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ గురించిన నిజాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పరీక్షా విధానాలు, చికిత్స వంటివేమీ స్పష్టంగా తెలియకుండా పోతున్నాయి.

ఒకప్పుడు అమెరికా తదితర దేశాలను గడగడలాడించిన ఈ వ్యాధి ఇప్పుడు అక్కడ నియంత్రణలో వుండడానికి కారణం అక్కడి ప్రజల్లో అవగాహన పెరగడం, తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటుండమే!

ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజా చైతన్య మొక్కటే మార్గం.
ప్రజలందరిలో ఈ వ్యాధి గురించిన అవగాహన పెరిగితే ఈ మహమ్మారిన పడేవారి సంఖ్య కచ్చితంగా తగ్గిపోతుంది.

ఈ దృష్ట్యానే ''ఎయిడ్స్‌ గురించిన అన్ని విషయాలు'' అన్న చిరు పుస్తకాన్ని ప్రజలందరికీ అందుబాటులో వుండేలా తక్కువ వెలతో తీసుకురావడం జరిగింది.
నిజానికి ఈ పుస్తకం లోగడ మేం ప్రచురించిన '' మనకు డాక్టర్‌ లేని చోట - ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం'' (వెల.రూ.220) అన్న పెద్ద పుస్తకంలోని ఒక అధ్యాయం.

ఇందులో సుఖవ్యాధులు, హైచ్‌ఐవి/ఎయిడ్స్‌ అంటే ఏమిటి, వాటి వ్యాప్తి, నివారణ, పరీక్షలు, సంరక్షణ వంటి అంశాలను చర్చించడం జరిగింది.
ఈ వ్యాధి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే లోగడ మేం ప్రచురించిన ఈ కింది పుస్తకాలను చదవండి:
1. ఎయిడ్స్‌పై పోరాటానికి ఆధునిక కామసూత్రం
2. హెచ్‌ఐవి ఆరోగ్యం మనమూ మన సమాజం
3. నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు
4. జబ్బుల గురించి మాట్లాడుకుందాం: తొలియవ్వనంలో వచ్చే శారీరక మార్పులు-కలవరపరిచే సెక్స్‌ సందేహాలు - సమాధానాలు.

ఎయిడ్స్‌ గురించిన అన్ని విషయాలు
తెలుసుకోవాలని వుండి-అడిగేందుకు మొహమాటం వేస్తే..


మూలపుస్తకం: మనకు డాక్టర్‌ లేని చోట: ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం
ఆంగ్ల మూలం: Where Women Have No Doctor, Hesperian Foundation, USA, 1997

తెలుగు అనువాదం: డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి
వెల: రూ.20
…………….

Thursday, May 14, 2009

హిందూ మతతత్వ సంస్థల అసలు స్వరూపాన్నీ, ముస్లింల గురించి ప్రచార మవుతున్న అపోహలనూ వివరిస్తుంది ఈ పుస్తకం...



మతతత్వ రాజకీయాలు
రామ్‌ పునియానీ
తెలుగు అనువాదం : కాత్యయని ..


భారతదేశంలో ప్రధాన స్రవంతి రాజకీయాలన్నీ
జాతి, మతాల పునాదుల మీద ఏర్పడి వున్నాయనీ -
స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలు అనే ప్రజాస్వామ్య విలువలనూ, సామాజిక న్యాయాన్నీ
అథోగతిలోకి నెడుతున్నాయనీ మనకు తెలుసు.

1886లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం అనంతరం భారతదేశంలో మతతత్వ రాజకీయాలు (హిందూ, ముస్లిం) మొదటిసారిగా రంగం మీదకు వచ్చాయి.
రాజులూ, నవాబులూ, జమీందార్లూ, జాగీర్దార్లూ ఏకమై
బ్రిటీష్‌ పాలకులకు అనుకూలంగా పనిచేసే యునైటెడ్‌ ఇండియన్‌ పేట్రియాటిక్‌ అసోసియేషన్‌ను స్థాపించారు.

దానినుండి కొన్నాళ్ల తరువాత పరస్పర వ్యతిరేకమైన రెండు మతతత్వ సంస్థలు ఆవిర్భవించాయి.
ఒకటి ఇస్లాం మత ప్రాతిపదిక వుండే ముస్లిం లీగ్‌ ..
రెండు హిందూ మత పునాదిపై ఏర్పడిన హిందూ మహా సభ , ఆర్‌ఎస్‌ఎస్‌.
... ... ...

బాబ్రీ మసీదు విధ్వంస చర్య భారత సమాజంలో ఒక ప్రధానమైన మలుపు.
ఆరోజును హిందూ మతోన్మాదులు తమ విజయోత్సవదినంగా జరుపుకున్నారు.
ముస్లిం ఛాందసవాద, మతతత్వ శక్తుల ధోరణి షాబానో కేసు సందర్భంలో స్పష్టమయింది...
ఈ మతతత్వ శక్తులు ముస్లిం ప్రజలను తమ పట్టులోకి లాక్కోవడానికి చూస్తూ వున్నాయి.
అయితే సంఘ్‌ పరివార్‌ శక్తులు హిందూ మతతత్వ రాజకీయాల్లో సాధించిన గుణాత్మక, పరిణామాత్మక అంశాలతో పోల్చి చూసినప్పుడు, ముస్లిం మతతత్వ సంస్థలు వెనుకబడి వున్నాయని చెప్పక తప్పదు.

సంఘ్‌ పరివార్‌ కన్నా ముస్లిం మతతత్వం తక్కువ స్థాయిలోనే వున్నప్పటికీ రెండింటి మీదా సమానంగానే వ్యతిరేకత ప్రకటించాల్సిన అవసరముంది.
... ... ...

దేశంలో ముస్లిం ప్రజానీకం మీద జరుగుతున్న హింస గుజరాత్‌ మారణకాండతో ఉన్మాద స్థితికి చేరుకున్నది.
అయినా ఇప్పటికీ హిందూ మతోన్మాద శక్తులు తమ దుర్మార్గాలకు రకరకాల సమర్థనలు వెతుకుతూనే వున్నాయి.
దేశ రక్షణ పేరిటా, జాతీయతావాదం పేరిటా ముస్లిం వ్యతిరేకతను రోజురోజుకూ ఇంకా రెచ్చగొడుతూనే వున్నాయి.

ఆ ప్రయత్నాలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో,
హిందూ మతతత్వ సంస్థల అసలు స్వరూపం ఏమిటో
రామ్‌ పునియానీ యీ పుస్తకంలో బట్టబయలు చేశారు.
ముస్లింల గురించి ప్రచార మవుతున్న అపోహలనూ, వాటికి సమాధానాలనూ
సరళమైన శైలిలో, బొమ్మలతో సహా వివరిస్తుంది ఈ పుస్తకం.
..............

మీకు తెలుసా?
1. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులెవరు?
2. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి ఎవరు?
3. శివాజీ భవనానికి ఎదురుగా వుండి, ఆయన ప్రతిరోజూ దర్శించే జగదీశ్వరాలయం ఆవరణలో ఏ కట్డడాన్ని నిర్మించాడు?

జవాబులు:
1. దౌలత్‌ ఖాన్‌, సిద్ధిమీ శ్రీ అనే ఇద్దరు ముస్లింలు!
2. మదానీ మెహ్తర్‌ ... ఈయన కూడా ముస్లిమే!
3. తన ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన మసీదును కట్టించాడు!

మీకు తెలుసా?
1. అ లహాబాద్‌ లోని సోమేశ్వరనాథ్‌ ఆలయానికి స్థలాన్నీ, నిధులనూ యిచ్చిందెవరు?
2. ఉజ్జయని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్‌, శత్రుంజయ జైన్‌ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకూ ఉదారంగా నిధులను యిచ్చిన రాజెవరు?
3. గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఏం జరిగింది?

జవాబులు:
1. ఔరంగజేబు!
2. ఔరంగజేబు!
3. ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు ఔరంగజేబు!

మీకు తెలుసా?

1. బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు ఎవరు?
2. దేవోత్పతన నాయక్‌ అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీ పాలకుడెవరు?
3. దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించిన భారతీయ గ్రంథం ఏది?

జవాబులు:
1. టిప్పు సుల్తాన్‌ !
2. కాశ్మీరు రాజు హర్ష దేవుడు !
3. కల్హణుడు రాసిన రాజతరంగిణి!

ఇట్లాంటి ఇంకా ఎన్నో విశేషాల కోసం చదవండి:

మతతత్వ రాజకీయాలు
-రామ్‌ పునియానీ

ఆంగ్ల మూలం:Communal Politics, RamPuniani, Sahamat, New Delhi,2001
తెలుగు అనువాదం : కాత్యాయని


ప్రథమ ముద్రణ: 2003
96 పేజీలు, వెల : రూ.10

...................................

Monday, May 11, 2009

ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం: మొల్ల, వేమన, పోతులూరి, ముద్దు నర్సింహం, త్రిపురనేని, జాషువా రచనలపై పరిశీలన ...



ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం
- కంచ ఐలయ్య ...


ఉత్పత్తి కులాల నుండి వచ్చిన రచయితలు దాదాపు 17వ శతాబ్దం నుండి రచనా రంగంలో ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఈ చిన్న పుస్తకం చెబుతుంది. మొల్ల నుండి గుర్రం జాషువా వరకు సూద్ర, ఓబీసీ, దళిత రచయితలు బ్రాహ్మణిజంతో తలపడేందుకు ఎటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ల కులాల ప్రత్యేకతను కాపాడుకునేందుకు , వాటిలోని అభివృద్ధి లక్షణాలను సమాజం ముందుంచేందుకు ఎటువంటి ఎత్తుగడలు వేశారు అనే అంశాలను, వారి వారసత్వాన్ని ఉత్పత్తి కులాల రచయితలకు చూపించే ప్రయత్నం చేస్తుందిది.

దళిత బహుజనుల స్పష్టమైన ముద్ర కలిగిన కావ్య సంపుటిని 16 వ శతాబ్ధంలో తొలిసారిగా మొల్ల అనే కుమ్మరి మహిళ రచించింది. అది '' మొల్ల రామాయణం '' గా ప్రసిద్ధిచెందింది. కవియిత్రి మొల్ల కాకతీయ సామ్రాజ్యవారసురాలు. ప్రస్తుత వరంగల్‌ సమీప ప్రాంతంలో ఆమె నివసించేది. కొంతమంది నెల్లు ప్రాంత వాసురాలని చెబుతారు. స్త్రీలకు అందునా సూద్ర స్త్రీలకు చదువుకునేందుకు ఎట్లాంటి అవకాశాలు లేని ఆ రోజుల్లో స్వయంగా చదువు నేర్చుకుని మొల్ల కావ్యం రాసే స్థాయికి చేరుకోవడం నిజంగా అబ్బురపరిచే విషయమే.

మొల్ల తరువాత సూద్ర కవుల్లో ప్రముఖుడు వేమన.
కాపు (రెడి)్డ కులస్థుడైన వేమన '' విశ్వదాభి రామ వినుర వేమ '' అంటూ ఆటవెలదిలో రాసిన పద్యాలు17వ శతాబ్దంలో దళిత బహుజనులను ఉర్రూతలూపాయి. సరళమైన వాడుక భాషలో చేసిన వేమన రచనలన్నీ దైవత్వ రహితంగా, లౌకికత్వాన్ని ప్రతిబింబేచివిగా, మూఢనమ్మకాలనూ మూర్ఖ ఆచారాలను చీల్చిచెండాడేవిగా వుండేవి.

పోతులూరి వీరబ్రహ్మం, సిద్దయ్యల ప్రవచనాలు, రచనలు కుల రహిత సమాజ నిర్మాణానికి నాంది పలికాయి. వడ్రంగి కులానికి చెందిన పోతులూరి మొదట్లో తన కుల వృత్తినే చేసేవాడు. దూదేకుల ముస్లిం అయిన సిద్దయ్యను తన శిష్యుడిగా చేసుకుని ఎంతో దూరదృష్టిని ప్రదర్శిచాడు. బ్రాహ్మణాధిక్యతను ఎదిరించాడు.
కాపు కులంలో జన్మించిన ముద్దు నర్సింహం (1800-1858) హితసూచిని అనే తొలి తెలుగు వచన గ్రంథాన్ని రచించారు. మానవాళి అభవృద్ధికి విద్య ఎంతో అవసరమని అది చాటి చెబుతుంది.

ఒక ధనిక “కమ్మ” కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి (1887-1943) సూద్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ, బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యంతో అనేక రచనలు చేశారు. ఆయన రచించిన శంభూక వధ నాటకం ఆరోజుల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇక గుర్రం జాషువా అయితే దళితుల ఆశాజ్యోతిగా వెలుగొందారు. కర్మ సిద్ధాంతం దళితులను కట్టి పడేసిందని అదే దళితుల కొంప ముంచిందని, దానిపై దళితులు తిరుగుబాటు చెయ్యాలని పురికొల్పారు. 'గబ్బిలం' కావ్యం ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది.

తెలుగు సాహిత్యంలో మరుగున పడ్డ మహోన్నతుల గురించి చిత్రిస్తూ తెలుగు సాహిత్య చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరాన్ని చాటి చెబుతుందీ పుస్తకం.

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తాత్వికుడిగా, రాజకీయ శాస్త్రవేత్తగా, ఉస్మానియా యునివర్సిటీలో రాజనీతి శాబస్త విభాగాధిపతిగా సుప్రసిద్ధులు. వారు '' నేను హిందువు నెట్లయిత ? '' , '' మనతత్వం '' , '' దేవుడి రాజకీయతత్వం - బ్రాహ్మణత్వంపై బుద్ధుడి తిరుగుబాటు '' వంటి పలు పుస్తకాలు రాశారు.



ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం:
మొల్ల, వేమన, పోతులూరి, ముద్దు నర్సింహం, త్రిపురనేని, జాషువా రచనలపై పరిశీలన ...

- కంచ ఐలయ్య ...


ఆంగ్ల మూలం : Telugu Nationalism: The Unknown Vision

తెలుగు అనువాదం: సఫ్దర్‌ అహ్మద్‌

40 పేజీలు, వెల: రూ.10

............................

Saturday, May 9, 2009

దళిత రాజకీయాలు - రామ్‌ పునియానీ - తెలుగు అనువాదం: కాత్యాయని


... దళిత రాజకీయాలు ...

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో యీ నాటికీ కులం పేరిట అవమానాలూ, అత్యాచారాలూ జరుగుతూనే వున్నాయి.
మనుధర్మం కొత్త కొత్త రూపాలలో అమలవుతూనే వుంది.

దళితుల సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి.
దళితుల రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందాయి.
పరిస్థితి మాత్రం యధాతథంగానే వుంది!

భారతదేశంలో వర్ణ వ్యవస్థ పుట్టుక గురించి హిదూత్వవాదులు చేస్తున్న అసంబద్ధమైన వాదనలను ఈ పుస్తకం బట్టబయలుచేస్తుంది.
అంబేడ్కర్‌ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం దళితుల కిచ్చిన హక్కుల్ని రాజ్యం ఎలా కాలరాస్తోందో వివరిస్తుంది.
వీటితోబాటు దళిత మేధావుల్లో కొందరికి దళిత విముక్తి పట్ల వున్న అపోహలు, దళిత ఉద్యమం ముందున్న సవాళ్లనూ కూడా ఈ పుస్తకం చర్చిస్తుంది.

రామ్‌పునియానీ మతతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ మతతత్వం తాలూకు అసలు నిజాలు బట్టబయలు చేస్తున్నారు.
సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ మతతత్వానికి వ్యతిరేకంగా మేధావుల, లౌకికవాదుల మద్దతును కూడగడుతున్నారు.
ఆయన ప్రస్తుతం ముంబాయి ఐ.ఐ.టిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

కాత్యాయని అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు.
పలు నవలలు రాశారు. అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
ప్రస్తుతం ''చూపు'' పత్రిక సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.

ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు:
1) దళితుల మీద అత్యాచారాలు 2) అస్పృశ్యత 3) వర్ణ వ్యవస్థ-చారిత్రక మూలాలు 4) దళితులు, హిందూమతం, హిందూత్వవాదం 5) సామాజిక పరివర్తన కోసం పోరాటాలు 6) దళితులకు రిజర్వేషన్లు 7) భారత రాజ్యాంగ నిర్మాణం 8) దళిత ఉద్యమం ముందున్న సవాళ్లు-పోరాట మార్గాలు 9) భోపాల్‌ డిక్లరేషన్‌ 10) జాతి-కులం 11) జ్తోతిష్యమూ - ఖగోళ శాస్త్రం, విశ్వాసం, హేతువాదం 12) కులమూ-వర్గమూ: హేతుబద్ధత-విశ్వాసం.


దళిత రాజకీయాలు
- రామ్‌ పునియానీ

ఆంగ్లమూలం: Quest for Social Justice, Unpublished Manuscript, Ram Puniyani
తెలుగు అనువాదం: కాత్యాయని

ముఖచిత్రం : కాళ్ల
ప్రథమ ముద్రణ: జూన్‌ 2004

88 పేజీలు: వెల: రూ.10

.................................

Thursday, May 7, 2009

సత్యహరిశ్చంద్రుని కథలో స్లోపాయిజన్‌ లాంటి సందేశాలు !


పురాణాలు - కుల వ్యవస్థ
సత్య హరిశ్చంద్రుడు
-డాక్టర్‌ విజయ భారతి


హేతువాద దృష్టితో పురాణాలను పరిశీలించినట్లయితే ఎన్నో ఆసక్తికరమైన వాస్తవాలు బయటపడతాయి.
ఇందుకు హరిశ్చంద్రుని వృత్తాంతం ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు.
పురాణాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడిన షట్చక్రవర్తులలో హరిశ్చంద్రుడు మొట్టమొదటివాడు.
త్రేతా యుగానికి చెందిన ఈ రాజు ప్రభావం మన సమాజం మీద ఇప్పటికీ బలంగా వుంది.
హరిశ్చంద్రోపాఖ్యానం, ''కాటి కాపరి'' ఏక పాత్రాభినయం ప్రేక్షకులను ఇప్పటికీ అ లరిస్తూనేవున్నాయి.

హరిశ్చంద్రుని కథ పైకి సత్యవ్రతాన్ని చాటేదిగా కనిపించినప్పటికీ దాని అసలు లక్ష్యం వర్ణ వ్యవస్థ పునాదులను పటిష్ట పరచడం, పాతివ్రత్యం పేరిట స్త్రీలను అణచివేయడం.

హరిశ్చంద్రోపాఖ్యానంలో అంతర్లీనంగా వుండే ఈ సందేశాలు స్లో పాయిజన్‌ వంటివి.

వరుణుడి కరుణతో పుత్ర సంతానాన్ని పొంది వరుణుడు పెట్టిన షరతును ఉల్లంఘించినప్పుడే హరిశ్చంద్రుని సత్యవ్రతం బట్టబయలవుతుంది.
హరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోయింది కూడా కుల దురహంకార ప్రదర్శన మూలంగానే తప్ప అన్యధా కాదు.

విశ్వామిత్రుడి పెంపుడు కూతుళ్లైన మాతంగ (మాల మాదిగ) కన్యలను పెళ్లి చేసుకొమ్మనే ఒత్తిడి వచ్చినప్పుడు హరిశ్చంద్రుడు అహంభావంతో రాజ్యాన్నైనా వదులుకుంటాను గానీ నీచ కుల కాంతలను పెళ్లాడను అని చిక్కుల్లో పడిపోతాడు.

ఆ తరువాత బాకీ తీర్చేందుకు భార్యాబిడ్డల్ని వ్యక్తిగత ఆస్తిలాగా అమ్మేస్తాడు.
నక్షత్రకుడు తనని ఓ ఛండాలుడికి అమ్మబోయినప్పుడు ఇంత బతుకు బతికి నీచ కులస్తుడికి దాస్యుడ్ని కావడమా అని ఎంతగానో గించుకుంటాడు.

ఈవిధంగా కులవ్యవస్థ వికృత రూపం, సత్యవ్రతంలోని డొల్లతనం, స్త్రీల దైన్య స్థితిగతులు పలు సందర్భాల్లో బయటపడతాయి. మార్కెండేయ పురాణం, స్కంధ పురాణం, హరిశ్చంద్రోపాఖ్యానాలను ప్రామాణికంగా చేసుకుని డాక్టర్‌ విజయభారతి గారు హరిశ్చంద్రుని కథను మరో కొత్త కోణంలో విశ్లేషిస్తున్నారు.

డాక్టర్‌ విజయభారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్‌, ఫూలే జీవిత చరిత్రలు ముఖ్యమైనవి. లోగడ వీరు రచించిన ''వ్యవస్థను కాపాడిన రాముడు'', ''పురాణాలు-కుల వ్యవస్థ: దశావతారాలు'', ''షట్చక్రవర్తులు'' పుస్తకాలను ఈ బ్లాగులో పరిచయం చేయడం జరిగింది.

పురాణాలు - కుల వ్యవస్థ
సత్య హరిశ్చంద్రుడు
-డాక్టర్‌ విజయ భారతి

38 పేజీలు, వెల: రూ.15/-


..............................

Wednesday, May 6, 2009

అతడు ''సాహిత్యాన్ని'' జయించాడు.



అతడు ''సాహిత్యాన్ని'' జయించాడు.
- షేర్‌ షా
(సాక్షి 03 మే 2009 ఆదివారం సంచిక)


కేశవరెడ్డి గొప్ప రచయితగా చలామణీ అవుతున్నాడా?
నిజంగానే గొప్పవాడా?
అన్న 'చర్చ' ఇప్పుడు అవసరం లేదు.
''అతడు అడవిని జయించాడు'' మాత్రం నిస్సందేహంగా గొప్ప రచన.
ఇందులో వున్న కథావస్తువు సామాన్యం
కథా నాయకుడు సామాన్యుడు.
పైగా ముసలివాడు. పైగా పందులను మేపుకునేవాడు.
మరి ఈ నవలికను అసామాన్యం చేసినవేమిటి? ........

డాక్టర్‌ కేశవరెడ్డి నవల '' అతడు అడవిని జయించాడు '' పై సాక్షి దిన పత్రిక
సమీక్ష పూర్తిగా ఈ దిగువ లింకులో చదవండి:

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=26655&Categoryid=10&subcatid=42



,...........,

Saturday, May 2, 2009

తెలుగు పాఠక ప్రపంచానికి … ఆర్టిస్ట్ అన్వర్ ని “వేదన”



ఎగిరే క్లాస్ రూం
ఎరిక్ కేస్టనర్ నవల


సుప్రసిద్ధ జర్మన్ రచయిత ఎరిక్ కేస్టనర్ ఈ పిల్లల పుస్తకాన్ని 75 ఏళ్ల క్రితం రాసారు.

బి.వి. సింగరాచార్య 40 ఏళ్ల కిందటే దీనిని నేరుగా జర్మన్ నుంచి తెలుగు లోకి అనువదించారు.

పాఠశాల విద్యార్ధుల మధ్య కనిపించే స్నేహ మాధుర్యాన్ని అద్భుతంగా చిత్రించిన,
బాల్యాన్ని మరచిపోకండి అనే ఉదాత్తమైన సందేశాన్నిచ్చిన ఈ అరుదైన పుస్తకం ఇప్పుడు ఎక్కడా లభించడం లేదు.

ఈ పుస్తకం మీది మక్కువతో …దీనిని ఈ తరం పాఠకులకు అందించాలన్న తపన తో ప్రముఖ చిత్ర కారుడు అన్వర్ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ని ఒప్పించి మరీ పునర్ముద్రణ చేయించారు:

కనుమరుగైన ఈ పుస్తకం ప్రతి తనకు లభించిన వైనాన్ని ఆయన తన బ్లాగు (దిస్ ఈజ్ అన్వర్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కాం) లో పొందుపరిచారు.

ఆసక్తి కరమైన ఆ టపాని ఈ దిగువ లింకు లో చదవండి.
http://thisisanwar.blogspot.com/2009/04/blog-post_30.html

గమనిక :
ఈ పుస్తకం తో సహా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన ఎ పుస్తకాన్నైనా
ప్రపంచం లో ఎక్కడ వున్నవారైన ఎ వి కే ఎఫ్ (Appajosyula-Vishnubhotla-Kandalam Foundation of America Inc. - A not -for-profit foundation)

వారి నుంచి సులువుగా తెప్పించు కోవచ్చు.
వారి చిరునామా :
http://www.avkf.org/BookLink/book_link_index.php

Friday, May 1, 2009

బ్రాహ్మణత్వం పై కంచ ఐలయ్య విమర్శ



నేను హిందువు నెట్లయిత ? ( పుస్తక సమీక్ష )
(విప్లవ తరంగం డాట్ నెట్ సౌజన్యం తో )
http://viplavatarangam.net/?p=10


కంచ ఐలయ్య గారు పశువులు కాసే కురుమ (కురుబ) కులానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగారు. అతని తల్లి తండ్రులకి కులం పేరు తెలుసు కానీ మతం పేరు తెలియదు. ఒక ప్రాంతంలో రెండు వేర్వేరు మతాల వాళ్ళు ఉండి వాళ్ళు రెండు వేర్వేరు ప్రార్ధనా స్థలాలకి వెళ్ళి ప్రార్ధనలు చేస్తేనే అక్కడి ప్రజలందరికీ తమ మతం పేరు తెలుస్తుంది, వేర్వేరు మత ఐడెంటిటీలు మెయింటెయిన్ చేస్తారు. కంచ ఐలయ్య గారి తల్లి తండ్రులకి మతం గురించి తెలియకపోయినా కులం కట్టుబాట్లు మధ్యనే జీవించారు. కంచ ఐలయ్య గారు చిన్నప్పుడు ఆ వాతావరణంలోనే పెరిగారు. ఆ వాతావరణంలో తాను చూసిన వెనుకబడిన కులాల వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు గురించి ఈ పుస్తకంలో వివరంగా వ్రాసారు.
ఈ పుస్తకంలో ఐలయ్య గారు బ్రాహ్మణత్వం పై తన శైలిలో విమర్శలు చేశారు. హిందూ పురాణాలు, స్మృతులు శూద్రులని ఏ విధంగా కించపరిచే విధంగా ఉన్నాయో హిందూ మత గ్రంథాలలోని వ్రాతల ఆధారంగా విమర్శిస్తూ వ్రాశారు. ఇతను హిందూ మత గ్రంథాలలోని పొంతన లేని అంశాలని బయట పెట్టారు, హిందూ మతాన్ని స్త్రీవాద కోణంలో కూడా విమర్శించారు. హిందువులు సరస్వతిని చదువుల తల్లిగా భావిస్తారు కానీ ఒకప్పుడు హిందువులలో బ్రాహ్మణ స్త్రీలకి కూడా చదువుకునే అవకాశం ఉండేది కాదు. శూద్ర స్త్రీలలో ఈ మధ్యే చదువుకునే వారి సంఖ్య పెరిగింది. బ్రాహ్మణ స్త్రీలకి కూడా అన్యాయం చేసిన బ్రాహ్మణులు శూద్రులకి ఏమి న్యాయం చెయ్యగలరు? అని కూడా ప్రశ్నించి బ్రాహ్మణుల పై విరుచుకు పడ్డారు.
ఈ పుస్తకం చదివితే బ్రాహ్మణులకి కోపం రావచ్చు. ఈ విషయం కంచ ఐలయ్య గారికి కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా కులం కట్టుబాట్లు బలంగా కనిపిస్తున్నాయి. కుల వివక్ష లేని ఆరోగ్యకరమైన సమాజం రావాలనే ఆశతో కంచ ఐలయ్య గారు ఈ పుస్తకం వ్రాశారు. హిందువులు దళితులు కూడా తమ మతం వారేనని చెప్పుకుంటారు. అయినా వీళ్ళు దళితులని అంటరానివాళ్ళ గానే చూస్తారు. దళితులని వెలివేసిన వాళ్ళని చూసినట్టు చూసినా దళితులు వేరే మతంలోకి మారడానికి అగ్రకుల హిందువులు ఒప్పుకోరు, దళితులు హిందువులు గానే ఉండాలంటారు. హిందూ మతం దిగువ కులాలవారికి అన్యాయమే చేసింది కనుక కంచ ఐలయ్య గారు తాను హిందువుని కాను అనే చెప్పుకుంటున్నారు.
ఈ పుస్తకాన్ని 1996లో కంచ ఐలయ్య గారు ఆంగ్లంలో “Why I am not a Hindu” పేరుతో రచించారు. 2000 సంవత్సరంలో తెలుగులోకి అనువదించి “హైదరాబాద్ బుక్ ట్రస్ట్” ద్వారా ప్రచురించారు.

(విప్లవ తరంగం లో వచ్చిన ఈ పుస్తక సమీక్ష గురించి తన కామెంట్ లో ప్రస్తావించిన ప్రవీణ్ గారికి కృతఙ్ఞతలు.
ఇదే పుస్తకం పై ఆంధ్ర భూమి ఎడిటర్ ఎం వి ఆర శాస్త్రి చేసిన సుదీర్ఘ విమర్శను ఆంగ్లం లో ఈ కింది లింకు లో చదవ వచ్చు. ఈ లింకు గురించి తన కామెంట్ ద్వారా తెలియ జేసిన జయహో గారికి ధన్యవాదాలు)


http://vaidikdharm.org/Documents/Why%20I%20am%20not%20a%20hindu-Critic.pdf

From http://en.wikipedia.org/wiki/Kancha_Ilaiah#cite_note-4

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌