Sunday, December 17, 2017

కుల రాజకీయాలు - ఒక ఆత్మహత్య - గౌరీ లంకేశ్


కుల రాజకీయాలు - ఒక ఆత్మహత్య 

(రోహిత్ వేముల గురించి బెంగళూర్ మిర్రర్ పత్రిక 19 జనవరి 2016 నాటి సంచికలో గౌరి లంకేశ్ రాసిన వ్యాసం. " కొలిమి రవ్వలు -  గౌరి లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి )

నేను ఈ వ్యాసం రాస్తుండగా కూడా దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు రోహిత్‌ వేముల మరణం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ రోహిత్‌?
26 ఏళ్ల  రోహిత్‌ ఎంతో తెలివైన, ఉత్సాహవంతుడైన యువకుడు. గుంటూరు లాంటి పట్టణంలో నివసించే ఒక పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రెండు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్స్‌ సాధించేంత తెలివితేటలు అతనికి ఉన్నాయి. తన ఫేస్బుక్‌ పోస్టులను గమనిస్తే సిగరెట్లు, బీరు, స్నేహితులతో సరదాగా గడపడం అతనికి ఇష్టమని తెలుస్తుంది. అతను సామాజిక స్పహతో కూడా ఉండేవాడని అతని పోస్టులు చూస్తే తెలుస్తుంది.

ఉదాహరణకి రెండేళ్ళ క్రితం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ''ఎక్కడైతే సమానత్వం వుంటుందో... ఒకరి పట్ల ఒకరికి కరుణ, ప్రేమ వుంటాయో... ఎక్కడైతే మత ఘర్షణలు వుండవో... ఎక్కడైతే కుల మతాల కతీతమైన ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు చిన్నపిల్లల మొహాల్లో కనిపిస్తుందో... అలాంటి సమాజాన్ని మనమంతా కోరుకుందాం'' అని  రాసాడు.

ఈ మధ్య జరిగిన ఎం.ఎం కల్బుర్గి హత్యను కూడా ఖండించాడు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ''నేను గొడ్డు మాంసం తింటాను.. నన్ను అడగడానికి మీరెవరు..?'' అనడాన్ని అభినందించాడు.
సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె మాటల్ని ఉటంకించాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన 'బీఫ్‌ ఫెస్టివల్‌' కు మద్దతు ప్రకటించాడు.
పఠాన్‌కోట్‌లో మరణించిన భారత సైనికులకు సంతాపం తెలిపాడు.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే రోహిత్‌ సమానత్వాన్ని నమ్మే ఒక ఉదారవాది, సున్నిత మనస్కుడు అని నాకు అర్థమైంది. ఒక పోస్ట్‌లో తనను తాను 'ప్రొ-లైఫ్‌ అంబేద్కర్‌వాది'నని ప్రకటించుకున్న ఈ యువకుడు మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?

ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ యూనివర్సిటీలో మాత్రమే వామపక్ష రాజకీయాలది పై చేయిగా వుండగా దేశంలోని మిగతా అన్ని విద్యా సంస్థల్లో మతతత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. వాళ్ళ ప్రధాన లక్ష్యం యువతను తమ మతతత్వ రాజకీయాలలోకి ఆకర్షించడం మాత్రమే అయినా ఆ పని కొన్నిసార్లు దారుణ హత్యలకు దారి తీసింది.

ఉదాహరణకు భోపాల్‌లో 2006 లో ప్రొఫెసర్‌ హెచ్‌.ఎస్‌ సబర్వాల్‌ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ూదీహూ) గూండాల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు.
'ఇండియా టుడే' వెబ్‌సైట్‌ ప్రకారం : 2009 లో ఇండోర్‌లో ఒక కాలేజి ప్రిన్సిపాల్‌ని ఎ.బి.వి.పి వాళ్ళు చుట్టుముట్టి బెదిరించగా ఆమె గుండె పోటుకు గురైంది.
2010 లో ఎ.బి.వి.పి గూండాలు గుజరాత్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ పరిమళ్‌ త్రివేది ఇంట్లోకి దూసుకెళ్లి ఆయన మీద దాడిచేశారు.
2011 లో ఉజ్జయినిలో ఎ.బి.వి.పి దుండగులు తన సహోద్యోగిని కొడుతుండగా చూసి ప్రొఫెసర్‌ సుందర్‌ సింగ్‌ ఠాకూర్‌ షాక్‌కు గురై మరణించాడు.
మన కర్ణాటక రాష్ట్రంలో సైతం 2005 లో నక్సల్‌ సానుభూతిపరుడనే ఆరోపణపై ప్రొఫెసర్‌ వి.ఎస్‌. శ్రీధరను ఎ.బి.వి.పి గూండాలు కొట్టారు.
ఈ మధ్య కాలంలోనే కొందరు దళిత బహుజన విద్యార్థులు ఈ కాషాయ మూకల దాడులను అడ్డుకోవటం మొదలుపెట్టారు. అంబేద్కర్‌, పెరియార్‌, నారాయణ గురు, జ్యోతిబా ఫూలే మొదలైన సంఘ సంస్కర్తల రచనలతో ప్రభావితులై దళిత బహుజన విద్యార్థులు వివిధ కార్యక్రమాలు చేపట్టడం కాషాయ మూకలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 

ప్రతిష్టాత్మక మద్రాసు ఐ.ఐ.టి విద్యార్థులు పోయినేడాది 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' ఏర్పాటు చేసుకుని మతతత్వానికి, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తే వెంటనే ఎవరో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మ్రృతి ఇరానీకి ఆకాశరామన్న ఉత్తరం రాసి ఫిర్యాదు చేశారు. వెనువెంటనే స్టడీ సర్కిల్‌ గుర్తింపును రద్దు చేశారు.

ఇప్పుడు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంతు వచ్చింది. పోయిన ఏడాది యాకుబ్‌ మెమన్‌ ఉరి తీయబడ్డపుడు ఉరిశిక్షలను వ్యతిరేకించే అంబేద్కర్‌ విద్యార్థి సంఘం (ఎ.ఎస్‌.ఎ) దానిపై నిరసన తెలిపింది.

ఈ సంఘంలో రోహిత్‌ వేముల క్రియాశీల సభ్యుడు.

ఢిల్లీ యూనివర్సిటీలో 'ముజఫర్‌నగర్‌ బాకీ హై' ప్రదర్శన ఎ.బి.వి.పి చేత బలవంతంగా నిలిపి వేయబడినపుడు కూడా ఎ.ఎస్‌.ఎ దాన్ని ఖండించింది. ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఎ.ఎస్‌.ఎ జరిపిన ప్రదర్శనపై హైదరాబాద్‌ యూనివర్సిటీ ఎ.బి.వి.పి  ప్రెసిడెంట్‌ సుశీల్‌ కుమార్‌ ''ఎ.ఎస్‌.ఎ గూండాలు దౌర్జన్యం గురించి మాట్లాడడం  హాస్యాస్పదంగా వుంది'' అని ఫేస్‌బుక్‌లో పెట్టాడు. అంబేద్కర్‌ వాదులందర్నీ గూండాలు అంటున్నాడని కోపం తెచ్చుకున్న ఎ.ఎస్‌.ఎ సభ్యులు సుశీల్‌ కుమార్‌ క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. వాళ్ల సంఖ్యాబలం చూసి కాబోలు సుశీల్‌ కుమార్‌ తన వ్యాఖ్యను ఫేస్‌బుక్‌ నుంచి తీసేసాడు.

అయితే దళిత విద్యార్థులకు, కాషాయ వాదులకు మధ్య ఏర్పడ్డ ఘర్షణ అక్కడితో ముగిసిపోలేదు. ఎ.ఎస్‌.ఎ సభ్యులు తనపై భౌతిక దాడి చేసారని తర్వాత రోజు సుశీల్‌ కుమార్‌ ఆరోపించాడు. బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు, కొందరు ఆర్‌.ఎస్‌.ఎస్‌, ఎ.బి.వి.పి సభ్యులు సుశీల్‌ కుమార్‌పై భౌతిక దాడి చేసినందుకు ఎ.ఎస్‌.ఎ పై చర్యలు తీసుకోవాలని వైస్‌ చాన్సలర్‌ మీద ఒత్తిడి తెచ్చారు.
సికింద్రాబాద్‌  ఎం.పి. బండారు దత్తాత్రేయ ''యూనివర్సిటీ కుల తత్వ, ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల స్థావరంగా మారిందం''టూ ఎ.ఎస్‌.ఎ సభ్యుల మీద చర్య తీసుకోవాలని స్మ్రృతి ఇరానీకి ఉత్తరం రాసారు. దీని మీద ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. ఎ.ఎస్‌.ఎ సభ్యులు సుశీల్‌ కుమార్‌ మీద దాడి చేసినట్లు గట్టి ఆధారాలేమీ దొరకలేదని అభిప్రాయపడి కూడా రోహిత్‌తో సహా ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేయాల్సిందిగా కమిటీ సిఫార్సు చేసింది. 

తన విద్యా జీవితం ముగింపుకొస్తున్న ఆ పరిస్థితిలో కూడా రోహిత్‌ ''సామాజిక అసమానతలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నా గొంతు నులమడానికి ప్రయత్నిస్తున్న నా స్నేహితులకి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నా. ప్రియమైన స్నేహితులారా! దూది పరుపులతో నిప్పు కణికని ఆర్పే ప్రయత్నం ఎప్పుడూ చేయవద్దు. మరింత మండుతుంది. మనుషుల్ని వెలి వేసే సిద్ధాంతాలకు, మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా నేను చేస్తున్న ఈ పోరాటాన్ని, గోపరాజు రామచంద్రరావు (గోరా), నరేంద్ర దబోల్కర్‌ లాంటి వారు వేసిన దారుల వెంట ప్రయాణం చేస్తూ, కొనసాగిస్తూనే వుంటాను'' అని రాసుకున్నాడు.

ఆధారాలు లేనప్పటికీ ఐదుగురు విద్యార్థులను సస్పెండ్‌ చేయటం మీద ఎ.ఎస్‌.ఎ అభ్యంతరం తెలపటం వలన వి.సి తన నిర్ణయాన్ని రద్దు చేసుకొని తాజా పరిశీలన కోసం ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయటానికి అంగీకరించాడు. రెండు వారాల తర్వాత మోదీ ప్రభుత్వం కొత్త వి.సిగా పొదిలి అప్పారావును నియమించింది. అప్పారావు కొత్త కమిటీని నియమించాడో లేదో  ఎవరికీ తెలియదు, ఎ.ఎస్‌.ఎ సభ్యులతో సహా అందరికీ తెలిసింది ఏమిటంటే డిసెంబర్‌ 20 న ఆ ఐదుగురు ఎ.ఎస్‌.ఎ సభ్యులూ వారి హాస్టల్‌ గదుల నుంచి ఉన్న పళంగా గెంటివేయబడ్డారని. అంతేకాదు, ఐదుగురు క్యాంపస్‌లోని ఏ కామన్‌ప్లేస్‌లకూ వెళ్లకూడదని ఆంక్షలు జారీ చేసారని.
మరో రకంగా చెప్పాలంటే వాళ్ళని 'అంటరాని వాళ్ళ'ని చేసి యూనివర్సిటీ వెలి వేసింది. ఈ విధమైన 'వెలి'కి వ్యతిరేకంగానే రోహిత్‌ లాంటి యువత మొదటి నుండి పోరాటం చేస్తున్నది. రోహిత్‌ అంతకుముందు పెట్టిన ఒక పోస్టుల్లో ''నేను చేస్తున్న యుద్ధం ఎంత పెద్దదో నాకు తెలుసు'' అన్నప్పటికీ ఇంత చదువుకొని, ఇన్ని మెట్లు ఎక్కి వచ్చాక కూడా మరోసారి కిందకు విసిరేయబడటం భరించలేకపోయినట్టున్నాడు. 

కుల సమస్య లేదన్నట్లుగా మనం ఎంత నటించాలని ప్రయత్నించినా, రోహిత్‌ వేముల మరణం కుల రాజకీయాల ఫలితమేనని గుర్తించక తప్పదు.

మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకపోతే మరెంతోమంది రోహిత్‌ వేములలు సమానత్వం కోసం చేస్తున్న తమతమ పోరాటాలను విరమించాల్సి వస్తుంది.


(బెంగుళూరు మిర్రర్‌, 19 జనవరి 2016)

అనువాదం : ఎం. వినోదిని
.................................................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి

అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Saturday, December 16, 2017

నా చెల్లెలు రేవతి ఆత్మకథ - గౌరి లంకేశ్

నా చెల్లెలు రేవతి ఆత్మకథ
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)ఆమె పేరు రేవతి. తెల్లగా, అందంగా ఉండే రేవతిని నేను అయిదారేళ్ళ కింద మొదటిసారి కలిసాను. ఆకుపచ్చ అంచున్న లేత పసుపు రంగు కాటన్‌ చీర కట్టుకుని ఉంది. తల చక్కగా దువ్వుకుని ముడి వేసుకుని ఉంది. నుదుట కుంకుమ, చెవికి కమ్మలు, మెడలో గొలుసు, చేతులకు గాజులు అన్నీ పెట్టుకుని అచ్చమైన మధ్యతరగతి గృహిణిలా కనిపించింది.

రేవతి తన సహోద్యోగినే ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నాకు చాలా ఏళ్ళ ముందు నుంచి ఆమె భర్త కూడా తెలుసు. కాని ఏమైందో ఏమో ఆ తర్వాత వాళ్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఆమె నుండి విడిపోవడానికి నిశ్చయించుకున్నాడతను.

నాకు అతను ముందు నుంచే తెలుసు కాబట్టి ''ఏదో ఒకటి చేసి, నన్ను వదిలిపెట్టి వెళ్లకుండా ఆయన్ని ఒప్పించండి'' అని రేవతి నన్నడిగింది. ఇతరుల దాంపత్య సమస్యల్లో జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు. అంతేకాదు, అతను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు గనుక, బలవంతంగా కలిసుండడం కూడా సమస్యకి పరిష్కారం కాదు అని  నాకు తెలుసు. ''నేను నీకెలా సాయం చేసేది రేవతి? అది నీకూ అతనికీ సంబంధించిన విషయం కదా'' అని నా నిస్సహాయతని వ్యక్తం చేశాను.

వాళ్ళిద్దరూ 'సాధారణ' దంపతులు కాదు. రేవతి హిజ్రా. అతను బైసెక్సువల్‌. అదెలా ఉన్నా, చివరికి వాళ్ళిద్దరు విడిపోయారు. అయితే ఇద్దరూ ఈ రోజుకీ నా స్నేహితులే.

పోయిన ఏడాది రేవతి రాసిన ఆత్మకథని పెంగ్విన్‌ సంస్థ 'ద ట్రూత్‌ అబౌట్‌ మి'  పేరుతో ఇంగ్లీష్‌లో ప్రచురించింది. దాన్ని కన్నడలో తీసుకురావాలనుకున్నాను కాని ఈలోపే వేరే సంస్థవారు ఆ పుస్తకం వెయ్యదలుచుకుని రేవతిని అడిగితే ఆమె ఒప్పుకుంది.

''అక్కా, నువ్వు ముందే నన్నెందుకు ఆడగలేదు, ఇప్పుడు వేరేవాళ్ళకి ఊ చెప్పాను. ఏం చేయాలిప్పుడు?'' అని రేవతి దిగులుపడింది. దానికి నేను ''పర్వాలేదు, వదిలెయ్‌. నీ ఆత్మకథ వీలైనన్ని భాషలలో వచ్చి, హిజ్రాల  సాధకబాధకాలు ఎక్కువ మందికి తెలిస్తే చాలు'' అని చెప్పాను.

అయితే ఎందుకో ఆ సంస్థకి రేవతి పుస్తకం వెయ్యడం వీలవ్వలేదు. అప్పుడు తమిళనాడులో ఉంటున్న రేవతి ఒక రోజు ఫోన్‌ చేసి ''అక్కా, నా ఆత్మకథ మీరే వేస్తారా'' అని అడిగింది. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. రెండు వారాల తరువాత, ఆమెకి చాలా ఆప్తురాలైన కవయిత్రి దు. సరస్వతితో రేవతి మా ఆఫీసుకు వచ్చింది. ఆమె ఆత్మకథని సరస్వతే కన్నడలోకి అనువదించాలని అందరం నిర్ణయించాం. డెడ్‌లైన్‌ పెట్టుకున్నాం. చాలా చక్కగా అనువాదం పూర్తి చేసి, మొత్తం రేవతికి చదివి వినిపించిన తరువాత రెండు రోజుల క్రితం నాకు పంపించింది సరస్వతి.

ఇప్పటికే దాదాపు ముప్పావు భాగం చదవడం పూర్తి చేసాను. చదువుతున్నంతసేపు చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను, నవ్వుకున్నాను, దిగులుపడ్డాను, నిట్టూర్చాను. నిజంగానే రేవతిది దుర్భర జీవితం. దాన్ని ఆమె వివరించిన పద్ధతి అద్భుతంగా ఉంది. హృదయాన్ని తాకేలా ఉంది. చదివిన ప్రతి ఒక్కరిలో హిజ్రాల జీవితం పట్ల తప్పక సహానుభూతి కలుగుతుంది.

తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో సాధారణ కుటుంబంలో దొరస్వామిగా పుట్టిన రేవతి జీవితదృష్టి అపూర్వమైనది. ఎన్నో బాధల మధ్య కూడా తనతనాన్ని కాపాడుకోవాలనే పట్టుదల, కష్టాలలోనూ స్వాభిమానంతో బతకాలనే ఆశ, తల్లి, తండ్రి, అన్నలు నిందించినా నావాళ్ళే కదా అని వాళ్ళ మీద ప్రేమ నిలుపుకోగల హృదయవైశాల్యం, పేదరికపు సెగలో కూడా చిన్నచిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కునే ఔదార్యం...

బతుంటేనే పోరాటమని అంటారు. కానీ రేవతి జీవితం నిరంతర పోరాటం.

పురుష శరీరంతో పుట్టిన స్త్రీనని రేవతికి చిన్నప్పుడే అర్థమవుతుంది. అప్పటినుంచి ఆమె జీవిత గమనం మారిపోతుంది. తనని తాను తెలుసుకోవడానికీ, తనలాగే ఉండే హిజ్రాలని కలుసుకోవడానికీ ఒక రోజు రేవతి ఇంట్లోంచి పారిపోతుంది. అప్పుడామెకి పదహారు పదహేడు ఏళ్ళ వయస్సు. చేతిలో డబ్బు లేదు, తమిళం తప్ప వేరే భాష రాదు. అయినా ఎక్కడో ఢిల్లీలో ఉన్న హిజ్రా గురువుని చూడటానికి వెళుతుంది. అక్కడ మిగతా హిజ్రాలతో కలిసి, చప్పట్లు చరుస్తూ, బిచ్చమెత్తుకుని బతుకుతుంది. ఇంట్లోవాళ్ళకి ఆమె ఢిల్లీలో ఉందని తెలిసి ఉపాయంగా ఆమెని వెనక్కి తీసుకొస్తారు. ఇంటికొచ్చిన రేవతిని చావబాది, పొడుగ్గా పెంచుకున్న జుట్టుని బలవంతంగా కత్తిరించి ఆమెని 'సరి' చెయ్యటానికి ప్రయత్నిస్తారు.

మరోసారి ఇంటినుంచి తప్పించుకొని రేవతి ముంబయి వెళుతుంది. అక్కడ ఆమె గురువు ధనసహాయం చేయడం వల్ల లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంటుంది. తన లైంగిక వాంఛలు తృప్తిపరుచుకోవడం కోసం సెక్స్‌వర్కర్‌ అవుతుంది.

అయితే  అయినవాళ్ళని చూడాలని మనసు లాగుతూ ఉంటుంది. శస్త్రచికిత్స తరువాత 'ఆడదాన్నయిపోయాను' కాబట్టి, అన్నలు తనను ఇక ఏమీ చేయలేరనుకుని, ఇంటికి తిరిగి వెళుతుంది. కానీ, అక్కడ ఆమెకి మళ్ళీ అవే తిట్లు, వేధింపులు, నిర్లక్ష్యం ఎదురవుతాయి. అన్నలు పెట్టే బాధలు తట్టుకోలేక మళ్ళీ ఇంటి నుంచి వచ్చేస్తుంది. ఈ సారి బెంగుళూరికి. అక్కడ ఒక మసాజ్‌ సెంటర్‌ (సానా)లో చేరి జీవనం సాగించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో, బెంగుళూరులో లైంగిక అల్పసంఖ్యాకుల కోసం 'సంగమ' అనే సంస్థ ప్రారంభమవడంతో రేవతి ఆ సంస్థలో చేరి హిజ్రా, ఇతర లైంగిక అల్పసంఖ్యాకుల హక్కుల ఉద్యమాల్లో భాగమవుతుంది.

వాళ్ళ ఒక నిరసనలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడే నాకు రేవతి పరిచయమయ్యింది.

రేవతి మొన్న ఫోన్‌ చేసి ''అక్కా, పుస్తకమెప్పుడు రెడీ అవుతుంది? ఆవిష్కరణకి ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నావు?'' అని అడిగింది. ''ఇంకా ప్రూఫ్‌ చూస్తున్నాను. లేఅవుట్‌ అయినాక, మళ్ళీ ఒకసారి ప్రూఫ్‌ చూడాలి రేవతి. అది సరే, ఆవిష్కరణకి ఎవర్ని పిలుద్దామని అనుకుంటున్నావు?'' అన్నాను.

''అక్కా, ఇది హిజ్రాల సమావేశం మాత్రమే కాకూడదు. నా జీవితానికీ, అణచివేతకు గురైన ఇతరుల జీవితానికీ ఏమీ  తేడా లేదు కాబట్టి అన్ని రకాల అణచివేతలకు గురైనవాళ్లను కూడా పిలిస్తే బాగుంటుంది'' అంది.

''నువ్వన్నది నిజమే ఆలోచిద్దాం'' అన్నాను.

ఫోన్‌ పెట్టేసే ముందు ''మిమ్మల్ని అక్కా అని పిలవడం మీకేమీ ఇబ్బందిగా లేదుగా?'' అని అడిగింది.

''ఇబ్బంది ఎందుకు? నువ్వు నన్ను అక్కా అంటేనే నాకిష్టం'' అన్నాను. నా చిన్న చెల్లెలు రేవతి పుస్తకం 'బదుకు బయలు: ఒక హిజ్రా ఆత్మకథ'ని త్వరలోనే విడుదల చెయ్యబోతున్నాం. అది నిజంగా హృదయాన్ని తాకే జీవనగాథ.


గౌరి లంకేశ్‌ పత్రికె,13 ఏఫ్రిల్‌ 2011

అనువాదం : కె. ఆదిత్య
............................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు

ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి

అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

...................................................................
ఒక హిజ్రా ఆత్మ కథ :
http://hyderabadbooktrust.blogspot.in/2014/10/truth-about-me-hijra-life-story.html

Friday, December 15, 2017

భాషా మూలాలు - ఇంగ్లీష్‌ మేఘాలు - గౌరి లంకేశ్

భాషా మూలాలు - ఇంగ్లీష్‌ మేఘాలు 
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)

చాలామంది 'బెంగుళూరు మిర్రర్‌' పాఠకుల లాగే నేను కూడా ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకున్నాను.

దాని ఫలితంగా (నా మాతభాష కన్నడ అయినప్పటికీ) నేను ఇంగ్లీష్‌లోనే ఆలోచిస్తూ, ఇంగ్లీష్‌లోనే కలలు కంటూ, ఇంగ్లీష్‌లోనే బతుకుతూ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ పెరిగాను.

ఇంగ్లీష్‌ నన్ను ఎనిడ్‌ బ్లైటన్‌, పి.జి వోడ్‌హౌస్‌, షేక్‌స్పియర్‌ లాంటి ఎందరెందరి రచయితలతోనో ప్రేమలో పడేలా చేసింది. ఇప్పటికీ నేను ప్రపంచంలో జరుగుతున్న చాలా విషయాలను ఇంగ్లీష్‌ వార్తా పత్రికలు, న్యూస్‌ చానెల్స్‌ ద్వారానే తెలుసుకుంటున్నాను. ఈమధ్య అయితే రకరకాల వెబ్‌సైట్ల నుంచి, బ్లాగ్స్‌ నుంచి కూడా తెలుసుకుంటున్నాను.

అయినప్పటికీ, ప్రాథమిక విద్యాబోధన మాతభాషలో జరగాలనే దానికే నా ఓటు. అబ్బా... మరో కన్నడ ఛాందసురాలా అని నిట్టూర్చి నా వాదనను మీరు తీసిపారేసే ముందు దయచేసి నేను చెప్పేది కాస్త వినండి.

కన్నడ, ఇంగ్లీష్‌ భాషలు రెండూ తెలిసి, రెండిట్లోను పని చేసిన అనుభవంతో నేను ఏం అనుకున్నానంటే మాతభాషలో నేను మరింత పాండిత్యం సంపాదించుకుని, ఇంగ్లీష్‌ని ఒక అదనపు భాషగా చదువుకుని ఉంటే నేను రెండు భాషా ప్రపంచాల్లోనూ మరింత ఉన్నతిని సాధించి ఉండేదాన్నని.

భాషనేది వ్యక్తీకరణకు ఒక వాహిక లేదా మంచి ఉద్యోగాన్ని సాధించి పెట్టే ఒక సాధనం మాత్రమే కాదని ముందు అర్థం చేసుకుందాం. భాష అంటే జీవితం. అది మన అస్తిత్వాన్నీ, చరిత్రనీ, సంస్కతీ సంప్రదాయాలను, మొత్తంగా సమాజపు ఆత్మనూ ప్రతిఫలిస్తుంది.

ఒక ఉదాహరణ చెపుతాను.Rain, Rain, go away, come again another day, little johny wants to play (వానమ్మా వానమ్మా వెళ్ళమ్మా! ఇంకోరోజు మళ్ళీ రావమ్మా! బుజ్జిగాడ్ని ఆడుకోనియ్యమ్మా)  అనేది ఇంగ్లీష్‌ మీడియం పిల్లలు చదువుకునే రైమ్స్‌లో ఒకటి.

కన్నడ మీడియంలో చదివే పిల్లలు నేర్చుకునే రైమ్‌ దీనికి పూర్తి భిన్నమైన అర్థంలో ఉంటుంది. 'హుయ్యో హుయ్యో మలేరాయ, బాలే తోటక్కి నీరిల్లా' (వానమ్మా వానమ్మా కుండపోతగా కురువమ్మా! ఎండిపోయిన మా అరటి తోటల్ని తడుపమ్మా)

మొదటిది బ్రిటిష్‌ మూలాలు కలిగి అక్కడి వాతావరణ పరిస్థితులను సూచిస్తుంది. అది మన దేశానికి ఏ మాత్రం పొసగని పాట. కాని కన్నడ రైమ్‌ అలాంటిది కాదు. పూర్తిగా స్థానికం. మన వ్యవసాయానికి వర్షం ఎంత ముఖ్యమో చెపుతుంది. మనం అరటి పండిస్తామని కూడా చెపుతుంది. ఇదంతా పిల్లలకు జ్ఞానమే కదా!

ఇక ఇతర దేశాల్లో విద్యావిధానం ఎలా ఉందో చూద్దాం. నేడు ఆర్థికంగా అందరికన్నా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనాలో, ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా విద్యాబోధన మాతభాషలోనే జరుగుతోంది.  అయితే మార్కెట్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారు విద్యార్థులకు ఇంగ్లీష్‌, ఇతర యూరోపియన్‌ భాషలను నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. జపాన్‌, కొరియా, ఫ్రాన్స్‌, జర్మనీలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ దేశాలన్నిట్లోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులందరూ వాళ్ళ విద్యార్థులకు సైన్స్‌, గణితం, చరిత్ర, సాంఘిక శాస్త్రం మాతభాషలో నేర్పగలుగుతున్నప్పుడు మన ఉపాధ్యాయులు ఆ పని ఎందుకు చెయ్యలేరు? వాళ్లను ఎవరూ క్లిష్టమైన, కొరుకుడు పడని సిద్ధాంతాలను, సూత్రీకరణలను బోధించమని అడగటం లేదు కదా! వాళ్లు చేయాల్సిందల్లా  ఆయా సబ్జెక్టులలో పిల్లలకి ప్రాథమిక జ్ఞానాన్ని కలిగించడం మాత్రమే.


ప్రఖ్యాత కెన్యన్‌ రచయితా, అమెరికన్‌ యూనివర్సిటీలలో 'ఇంగ్లీష్‌ అండ్‌ కంపారిటివ్‌ లిటరేచర్‌' కోర్సును బోధించే ప్రొఫెసర్‌ గూగీ-వా-థియాంగో ఏమన్నారంటే, ''భాష మన అస్తిత్వం. మన ఆత్మ. జ్ఞాపకాలను నెమరు వేసుకునే మాధ్యమం. కాలమాన పరిస్థితులకు మనల్ని కలిపే వారధి. మన కలలకి పునాది''. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మాతృభాషను ఎలా విస్మరించగలం?

ఇంగ్లీష్‌లో చదువుకోవటం ద్వారా ఉన్నత స్థానాలను చేరుకోగలమనేది చాలామంది నమ్మకం. అందుకే వారు బోధనా మీడియం ఇంగ్లీష్‌లో ఉండాలని కోరుకుంటుంటారు. జ్ఞానపీఠ్‌ అవార్డు పొందిన ఎనమండుగురు కన్నడ రచయితలలో ఐదుగురు ఇంగ్లీష్‌ భాష, సాహిత్యాలలో విశిష్ట జ్ఞానం కలిగినవారు. అయినప్పటికీ వాళ్ళు తమ మాతభాష కన్నడాన్నే రచనా భాషగా ఎంచుకున్నారు.

ఇంగ్లీష్‌ భాష పట్ల మోజుతోటి చాలామంది తల్లిదండ్రులు (మా అమ్మ లాగే) తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో చదివించడానికే ఇష్టపడుతున్నారు. ఇది నిజంగా విషాదం. వాళ్లకి తెలియని విషయం ఏమిటంటే పిల్లలు ప్రాథమిక విద్యను  మాతభాషలో చదువుకుంటే విషయాలను ఆకళింపు చేసుకోవటం వాళ్లకు చాలా సులువు అవుతుందని. ఎన్నో పరిశోధనలు చెపుతున్నాయి ఈ విషయాన్ని.

ఇంకా చెప్పాలంటే మాతృభాషలో నేర్చుకునే చాలా నైపుణ్యాలను పిల్లలు ఆ తర్వాత నేర్చుకునే భాషలోకి వెంట తీసుకెళ్లగలుగుతారని కూడా ఈ పరిశోధనలు చెపుతున్నాయి. ఉదాహరణకు ఒక పిల్ల లేదా పిల్లవాడు కన్నడ భాషలో (మాతభాషలో) నైపుణ్యం సాధిస్తే ఇంగ్లీష్‌ చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు ఆ నైపుణ్యాన్ని దానికి అన్వయించు కోగలుగుతుంది లేదా గలుగుతాడు. దీని అర్థం ఇంగ్లీష్‌ను అదనపు భాషగా నేర్పితే  పిల్లలు దాన్ని కూడా సులభంగా ఆకళింపు చేసుకోగలుగుతారని. ఇక సమస్య ఎక్కడుంది?

ఈ రోజుల్లో ఇంగ్లీష్‌ రావటం చాలా అవసరమని నేనూ ఒప్పుకుంటాను.
కానీ, దానికే ప్రాధాన్యం ఇచ్చి, మన మాతభాషలను విస్మరిస్తే మనం మన వేర్లను తెగనరుక్కున్న వాళ్లమవుతాం. మూలాలు తెలియని మనుషుల దేశాన్ని సష్టించుకున్న వాళ్లమవుతాం. అందుకే, మనం మన పిల్లల్ని ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో చదువుకోనిస్తే - ఇంగ్లీష్‌తో సహా - వాళ్లు ఈ భూమి మీద స్థిరంగా నిలబడి రెండు చేతులూ చాపి ఆకాశాన్ని అందుకోగలుగుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎంత అద్భుతంగా ఉంటుంది అది!


(బెంగుళూరు మిర్రర్‌, 6 ఏప్రిల్‌ 2015)

అనువాదం : బి. కృష్ణకుమారి

..........................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి

అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Thursday, December 14, 2017

'సొంత దేశం'లోనే దేవుడు చచ్చిపోతున్నాడు - గౌరి లంకేశ్

'సొంత దేశం'లోనే  దేవుడు చచ్చిపోతున్నాడు
 ("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)

'మాది దేవుడికే ఇష్టమైన ప్రదేశం' అని వర్ణించుకునే కేరళ రాష్ట్రంలో ఇటీవల దేవుడి పేరుమీద అనేక మరణాలు సంభవించడం చూస్తున్నాం.

భారత దేశంలోనే అతి పెద్ద పుణ్య క్షేత్రాలలో ఒకటైన కేరళలోని శబరిమలలో ఇప్పటివరకు మూడు పెద్ద దుర్ఘటనలు జరిగాయి. 2016 ఏప్రిల్‌ 10 న పుట్టింగల్‌లో జరిగినట్లే, 1952లో బాణాసంచా ప్రదర్శనలో మందుగుండు సామాగ్రి పేలి 62 మంది చనిపోయారు. 1999 లో మకరజ్యోతి చూడటానికి వెళ్లిన భక్తుల తొక్కిసలాటలో మరో 52 మంది చనిపోయారు. అంత పెద్ద దుర్ఘటనలు జరిగిన తరువాత కూడా 2011 లో మరొక సారి అదే శబరిమలలో మళ్లీ తొక్కిసలాట జరిగి 102 మంది చనిపోయారు.

పుట్టింగల్‌ దేవి ఆలయానికి వెళ్లే భక్తులు ఎలాగైతే బాణాసంచా పేలిస్తేనే కీడు తొలుగుతుందని నమ్ముతారో శబరిమల కెళ్లే భక్తులు కూడా మకరజ్యోతిని దర్శిస్తేనే తమ ఆత్మ ప్రక్షాళనం జరిగి దేవుని ఆశీస్సులు అందుతాయని నమ్ముతారు.

రెండూ నిజం కాదు.

పుట్టింగల్‌ ఆలయంలో జరిగే బాణాసంచా పేలుడు కార్యక్రమం నిజానికి వివిధ రాజకీయ పార్టీల, కుల సమూహాల నాయకుల బల ప్రదర్శనకి ఒక వేదిక. అక్కడ పేల్చే బాణాసంచా ఏటా 6000 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్నపరిశ్రమ నుండి వస్తోంది. అలాగే 'దివ్య' మకర జ్యోతి అనేది కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగులు, అయ్యప్ప దేవాలయాన్ని నిర్వహించే ట్రావెన్కోర్‌ దేవస్థానం సభ్యులు కలిసి చేసే పెద్ద మోసం. ఇవి అందరికీ తెలిసిన విషయాలే అయినా 'దివ్య దర్శనం',

        'కీడు' లాంటి  అంధ విశ్వాసాలు ఇంత కాలం కొనసాగటానికి  కారణమేంటి? హేతుబద్ధమైన ఆలోచన కంటే, ఇటువంటి మూఢనమ్మకాలే 'దైవ పరిశ్రమ'ని పెంచి పోషించటానికి సహాయ పడతాయి కనుకే వీటిని ఇంకా ఇంకా కొనసాగిస్తున్నారు.

మరి ఇందులో ప్రభుత్వం పాత్ర ఏమిటి?

దేశ ప్రజల్లో మూఢ భక్తిని అంతమొందించి, విజ్ఞాన స్ఫూర్తిని పెంపొందించాలని చెప్పే రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన మన ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తోంది?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం అయ్యప్ప సిండ్రోమ్‌ను ఆవరించి వున్న ఆర్థిక అంశాలను పరిశీలించాలి.
ప్రతి సంవత్సరం, దాదాపు రెండు నుండి రెండున్నర కోట్ల మంది భక్తులు శబరిమలకి వస్తారు. రకరకాల రుసుముల ద్వారా వారి నుండి ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. ట్రావెన్కోర్‌ దేవస్థానం భక్తుల దాన ధర్మాల నుండి మరో 200 కోట్లు సంపాదిస్తుంది. వీరిద్దరూ కాక అక్కడ హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు, అనేక వ్యాపారాల వాళ్లు ప్రతి సంవత్సరం అయ్యప్ప సీజన్‌లో (నవంబరు-జనవరి మధ్య) బాగానే సంపాదించుకుంటారు. ప్రాణాలు,

తెలివి రెండూ పోగొట్టుకుంటున్న భక్తులు తప్ప మిగతా అందరికీ లాభం ఉంటోంది కనకే ఎవరికీ హేతుబద్ధ ఆలోచనని పెంచాలనే ఆసక్తి లేదు. లౌకికం పేరు చెప్పుకుని పరిపాలించే కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో అయినా, వీర నాస్తిక వాదులమని చెప్పుకునే కమ్యూనిస్టు ఫ్రంట్‌ ప్రభుత్వంలో అయినా అయ్యప్ప ప్రభావం మాత్రం పెరుగుతూనే
వుంటుంది. ఇటువంటి ధోరణులు క్రైస్తవ, ఇస్లాం మతాలకు చెందిన పవిత్ర స్థలాలతో సహా ఎన్నో పవిత్ర స్థలాలలో చూడొచ్చు.

పుట్టింగల్‌ దుర్ఘటనపై ఇప్పటి కాంగ్రెసు ముఖ్యమంత్రి ఊమెన్‌ చాండీ ప్రకటించినట్లే, 1999 లో అప్పటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి ఇ.కె. నయనార్‌ కూడా శబరిమలలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించారు. కానీ దాని వల్ల ఏం ప్రయోజనం కలిగింది? జస్టిస్‌ చంద్రశేఖర మీనన్‌ ఆధ్వర్యంలోని ఆ న్యాయ కమిషన్‌ 'దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల భద్రత గురించి పట్టించుకోనందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషి'గా పరిగణించినప్పటికీ, కేరళ ప్రభుత్వం మాత్రం భక్తుల ప్రాణాలను రక్షించటానికి ఏ రకమైన చర్యలూ తీసుకోలేదు. పుట్టింగల్‌ దుర్ఘటనపై వేసిన విచారణ నివేదికకి కూడా ఇదే గతి పడుతుందని చెప్పటానికి పెద్ద దివ్యదష్టి అవసరం లేదు. ఇంకొక దుర్ఘటన జరిగినప్పుడు ఇంకొక న్యాయ విచారణకు ఆదేశిస్తారు.
         ఈ కథ ఇలా నడుస్తూనే ఉంటుంది.

ఇక ప్రజల భక్తి చుట్టూ రాజకీయ నాయకులు ఆడే ఆటలు చూద్దాం.
నాలుగు దశాబ్దాల కిందటి వరకు అయ్యప్ప పిచ్చి కేరళకి మాత్రమే పరిమితమయి ఉండేది. 1970ల నుండి మకరజ్యోతి గురించి బయట ప్రచారం, చెప్పుకోవటం మొదలైంది. 'జ్యోతి' కథతో ప్రభావితులయిన అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, రాజ్‌కుమార్‌, వారి కొడుకులు, కార్లు, షేవింగ్‌ క్రీముల గురించి ప్రచారం చేసినట్లే 'అయ్యప్ప మాల' గురించి కూడా అంతే అలవోకగా ప్రచారం చేసి పెట్టారు. త్వరలోనే అయ్యప్పకి ఉత్తర భారత దేశంలో కూడా ప్రజాదరణ పెరిగింది.
కేరళలోని హేతువాదులు దీన్ని చూసి ఆందోళన చెందారు. 1980 లలో ఒక అధ్యయనం జరిపి, మకర జ్యోతి మోసమని చెప్పటానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సంపాదించారు. వాళ్లు ఆ సాక్ష్యాలను బయట పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కర్తలు ఇద్దరూ మౌనం వహించారు. ఎట్టకేలకు 2008 లో పరిస్థితులు వారిని నిజాన్ని ఒప్పుకునేట్లు చేశాయి. అంటే, అన్ని సంవత్సరాల పాటు, అమాయక ప్రజలు మకరజ్యోతి అంటే దైవ దర్శనం అని నమ్మి దాన్ని చూడటానికి ప్రాణాల్ని పణంగా పెట్టి శబరిమలకు వస్తున్నారని తెలిసి కూడా, ఆ భక్తిని సొమ్ము చేసుకోవటానికి ఏ ఆధారం లేని ఆ నమ్మకాన్ని వారిద్దరూ అలాగే కొనసాగనిచ్చారు.

పుట్టింగల్‌ విషయానికొస్తే స్థానిక అధికారులు గుడిలోపల బాణాసంచా కాల్చటానికి అనుమతి నిరాకరించినప్పటికీ, రాజకీయ నాయకులు మొదట దాన్ని హిందూ వ్యతిరేక నిర్ణయంగా దూషించారు. ఆ తరువాత బాణాసంచా కాల్చటం హిందువుల మతాచారమని వాదించారు. ఆ తరువాత ఏ చట్టమూ తమను అడ్డుకోలేదని ప్రకటించారు.
ఎందుని వారికి ఆ ధీమా? ఎందుకంటే, ఇవన్నీ తరువాతి ఎన్నికల్లో తమకు ఓట్లు తెచ్చి పెడతాయని వారికి తెలుసు కాబట్టి.

ప్రజల ప్రాణాల కంటే మూఢ భక్తిని పెంపొందించి ఎన్నికల్లో గెలుపొందడం ముఖ్యమైంది కాబట్టే, దేవుడు తన సొంత రాష్ట్రంలో కూడా పదే పదే మరణించాల్సి వస్తోంది.


(బెంగుళూరు మిర్రర్‌, 11 ఏప్రిల్‌ 2016)

అనువాదం : ఎ. సునీత
.........................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com


Wednesday, December 13, 2017

కూర్గ్‌ : ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష - గౌరి లంకేశ్

కూర్గ్‌ : ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష   -  గౌరి లంకేశ్ 
("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)

కూర్గ్‌.
దేశం దృష్టిలో ఇదొక అపురూపమైన ప్రాంతం.
ఇక్కడి దట్టమైన అడవులు, వరి పొలాలు, తోటలు అన్నీ పోస్ట్‌కార్డు ఫోటోల్లో ఎక్కదగ్గంత అందంగా ఉంటాయి.
కాని చుట్టూరా పర్వత శ్రేణులున్న ఈ చిన్న కర్ణాటక జిల్లా ఇకముందు ప్రశాంతంగా వుండే పరిస్థితి కనిపించడం లేదు.

కూర్గులు (లేదా కొడవలు) ఈ ప్రాంత మూలవాసులు. వారిదో విలక్షణ జాతి. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వాళ్లు ఇకముందు బోడోలు, జార్ఖండ్‌ వాసులు, కశ్మీరీలు అనుసరిస్తున్న బాటలో నడుస్తారేమో అన్న భయాలను రేకెత్తిస్తున్నాయి.

వినడానికి కొంత అతిశయోక్తిగా అనిపించవచ్చునేమో కానీ, కొత్తగా ఏర్పడిన 'కొడగు ఏకీకరణ రంగ' (కెఇఆర్‌) అనే సంస్థ ఈ మధ్య కర్ణాటక నుంచి కూర్గ్‌ (కొడగు) ప్రాంతాన్ని విభజించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. కెఇఆర్‌ కొన్ని సంస్థల కలయికతో ఏర్పడిన ఒక సమాఖ్య. ఇందులో కళా సాంస్కృతిక బృందాలు కూడా వున్నాయి. అవన్నీ ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు.


కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం కూర్గుల జీవన విధానానికి హాని కలిగిస్తుందన్న భయమే ఈ ప్రత్యేక రాష్ట్ర పిలుపునకు మూలకారణం. 1990 డిసెంబర్‌లో  'కూర్గుల ఆధీనంలో వున్న జమ్మా (జీaఎఎa)  భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సంక్షేమ చర్యలలో భాగంగా పేద ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటోంది' అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు ఆ భూములను కూర్గులకు కాలవ్యవధి ప్రాతిపదికన ఇనాం భూములలాగా మంజూరు చేశారు తప్ప వారికి ఆ భూముల మీద ఎలాంటి యాజమాన్య హక్కునూ ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దాని వలన జమ్మా భూములపై ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు తమకు ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

కాని కూర్గులు ఈ వాదనతో విభేదిస్తున్నారు. వాళ్ల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాంతాన్ని ఏలిన దొడ్డవీరరాజా తన సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా 18వ శతాబ్దంలోనే జమ్మా (అంటే జన్మహక్కు) భూములపై కూర్గుల హక్కును స్థిరపరిచారు. ఆ భూములపై 'సూర్యచంద్రులు వున్నంతవరకు' చెల్లుబాటయ్యేలా తమకు ఆయన ఆస్తి హక్కును ప్రసాదించారని వారంటారు.

బంగారప్ప తీసుకున్న నిర్ణయం కూర్గులపై కేవలం ఆర్థిక ప్రభావాన్ని మాత్రమే కాదు, అంతకంటే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని కొడగు ఏకీకరణ రంగ భావిస్తోంది. ముఖ్యమంత్రి కూర్గుల మనోభావాలను కూడా గాయపరిచారు. జమ్మా వ్యవస్థ కూర్గ్‌ సంస్కృతిలో అంతర్భాగం. కూర్గులను కలిపి ఉంచేది జమ్మా భూములే. దాదాపు రెండున్నర లక్షల ఎకరాల జమ్మా భూములు వ్యక్తుల పేరిట కాకుండా కుటుంబాల పేరిట ఉంటాయనేది మరిచిపోకూడదు. ఒక్కో చోట ఒక్కో కమతం మీద వంద కుటుంబాలు ఆధారపడి బతుకుతుంటాయి. అంతేకాదు జమ్మా భూముల్లోనే ఉమ్మడి కుటుంబానికి చెందిన ఇల్లు (అందరు మళ్లీ మళ్లీ కలుసుకునే చోటు), పూర్వీకుల సమాధులు (వారిని పూజించేవారికి ఇవి చాలా ముఖ్యమైనవి) వుంటాయి. ''నాకున్న ఏడెకరాల పొలం పదిమంది సభ్యులతో కూడిన నా కుటుంబం బతకడానికి బొటాబొటిగా సరిపోతుంది. అయినా బంగారప్ప నా పొలాన్ని తీసేసుకుందామని చూస్తున్నాడు. మేం ఈ పొలానికి ఎప్పట్నించో పన్నులు కూడా కడుతున్నాం'' అని చెప్పాడు బాధితుల్లో ఒకరైన హెచ్‌.కెంపన్న.

ఇప్పుడు కూర్గుల జీవితాల్లో బహుశా అన్నిటికంటే ఎక్కువ భావోద్వేగాలతో కూడిన సమస్య ఈ భూ వివాదమే. అయినా అదొక్కటే  వారి ఆగ్రహానికి కారణం కాదు. 1956లో కర్ణాటక రాష్ట్రంలో విలీనమైన నాటి నుంచీ తమ జిల్లాను అసలు పట్టించుకోవడమే లేదని లేదా నామమాత్రంగా మాత్రమే పట్టించుకున్నారని వాళ్ల భావన. కూర్గ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చిన కొడగు ఏకీకరణ రంగ అధ్యక్షులు మోనప్ప ''గత అనేక సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. అభ్యర్థనలను సమర్పించీ సమర్పించీ మేం అలసిపోయాం. వాటి వల్ల మాకు ఎలాంటి ప్రయోజనమూ ఒనగూడలేదు'' అన్నారు. (మోనప్ప కూర్గుల ప్రయోజనాల కోసం పాటుపడే 'అఖిల కొడవ సమాజ' అనే మరో శక్తివంతమైన సంస్థకు కూడా అధ్యక్షులు.)

తమ ప్రాంతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ తమకు కొద్దిపాటి ప్రయోజనాలను కూడా కల్పించకపోవడమనేది అనేక ఇతర అంశాలతో పాటు కూర్గులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. కాఫీ తోటలు, ఏలకుల సాగు, కమలా పళ్ల పెంపకం మొదలైన వాటి వల్ల కూర్గ్‌ నుంచి ప్రభుత్వానికి లభించే వార్షిక ఆదాయం 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువే అంటారు మోనప్ప. ఇందులో విదేశీ మారక ద్రవ్యం కూడా గణనీయంగా ఉందని చెపుతూ ''గత సంవత్సరం ప్రభుత్వం ఈ ప్రాంతానికి ముష్టి ఇచ్చినట్లు 30 కోట్ల రూపాయలను విదిల్చింది. అందులో 18 కోట్ల రూపాయలు ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలకే సరిపోయింది'' అన్నారు మోనప్ప.

తమ ప్రాంతానికి నదీ జలాల్లో దక్కాల్సిన వాటా సైతం దక్కడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. ''మేం కావేరీ నదిని ఆరాధిస్తాం. కానీ అందులోని నీళ్లు మాత్రం మాకు రావు. ఇప్పటివరకు దానిమీద కట్టిన ప్రాజెక్టులన్నీ ఇతర ప్రాంతాలకే ప్రయోజనాన్ని కలిగించాయి. ఈ జిల్లాకు ఎంతో అవసరమైన ఒక చిన్న ఎత్తిపోతల పథకానికి 6 కోట్ల రూపాయలను కేటాయించాలన్న మా అభ్యర్థనని సైతం ప్రభుత్వం ఇంతవరకు ఆమోదించలేదు'' అని కెఇఆర్‌ నాయకుడొకరు వాపోయారు.

ఈ జిల్లాకు 'బయటి వ్యక్తులు' పెద్దఎత్తున తరలి రావడం గురించి కూడా కూర్గులు చాలాకాలం నుండి ఫిర్యాదు చేస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుంచి, ముఖ్యంగా కేరళ నుంచి అనేకమంది వచ్చి కూర్గ్‌లో స్థిరపడ్డారు. అలా వచ్చిన వాళ్లు తమ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా, వాణిజ్యాన్ని, ప్రత్యేకించి కలప వ్యాపారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడంపై వారు కలవరపడుతున్నారు. ''ఇవాళ కూర్గ్‌లో కొడగుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది'' అని అల్లారణ్య మండ్యెప అనే ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి వ్యంగ్యంగా అన్నారు.

వీటన్నిటి వలన గత కొన్ని సంవత్సరాలుగా వలస వచ్చినవారికీ, స్థానిక కూర్గులకూ మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.  తమ ఉద్యమం ఏ సమాజానికీ, ఏ సమూహానికీ వ్యతిరేకం కాదని కొడగు ఏకీకరణ రంగ చెబుతున్నప్పటికీ 'బయటి వ్యక్తుల సమస్య' కూర్గులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందనేది స్పష్టమే. 17 మార్చి (1991) లోపల తీర్చాలంటూ ప్రభుత్వానికి కెఇఆర్‌ ఒక కోర్కెల పత్రాన్ని సమర్పించింది. (ఆ పత్రంలో ఇతర డిమాండ్లతో పాటు రెవెన్యూ భూములను క్రమబద్ధీకరించాలని, అక్రమంగా చెట్లను నరికివేయడాన్నీ, కలపను దొంగతనంగా బయటికి తరలించడాన్నీ అరికట్టాలని, కాఫీ పండించేవారిపై పన్నులు తగ్గించాలని, తోటలకు విద్యుత్‌ సరఫరా పెంచాలనే డిమాండ్లు కూడా వున్నాయి.)

ప్రభుత్వం గనక తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 17 మార్చి నుంచి శాంతియుతంగానే ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే రీతిలో ఉద్యమం చేస్తామని ప్రకటించింది. ''కూర్గులకు ఆమోదయోగ్యంకాని చట్టాలను ధిక్కరించడం మీద దృష్టిని కేంద్రీకరిస్తాం'' అని మోనప్ప అన్నారు. దీనికి ఎంతమేరకు ప్రజా మద్దతు లభిస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదు. కాని కొడగు ఏకీకరణ రంగకు మాత్రం ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణే ఉందని చెప్పాలి.  రెండు నెలల క్రితం జనవరి 17న జిల్లా కేంద్రమైన మెర్కరాలోని పాతకోట ప్రాంతంలో వారు ఒక భారీ ఊరేగింపును నిర్వహించి ప్రభుత్వానికి భూమి శిస్తు కట్టవద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. అలాగే చట్టాన్ని ధిక్కరిస్తూ కాఫీ అమ్మకాలకు కూడా ఏర్పాట్లు చేశారు. కూర్గ్‌ ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయాల మీద రూపొందించిన వీధి నాటకాలను ప్రదర్శించడంతో పాటు అదే అంశంపై వీడియో క్యాసెట్లను బహిరంగంగా ప్రదర్శించారు. అమ్మారు.

కొడగు ఏకీకరణ రంగ ఇప్పటివరకు సాధించింది ఏమిటంటే ప్రజలకు తమ జిల్లా దుస్థితి గురించి బాగా అవగాహన కల్పించడం. తత్ఫలితంగా ఇవాళ ఊదా, ఆకుపచ్చ రంగులతో కూడిన ఆ సంస్థ జెండాలు అనేక కూర్గ్‌ల ఇళ్ల మీద రెపరెపలాడుతుండటాన్ని చూడొచ్చు. మార్చి 17 తరువాత కెఇఆర్‌ ఏం చేయబోతోందనేదే బహుశా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కువగా కలవరపరుస్తున్న అంశం కావచ్చు. తమ ఆశయ సాధన కోసం ఆయుధాలు పట్టే సమస్యే లేదని మోనప్ప నొక్కి చెప్పినప్పటికీ కొంతమందికి ఆయన మితవాద పోకడలు నచ్చడం లేదనే అభిప్రాయం ఉంది. ''జమ్మా భూముల మీద తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు మేం బంగారప్పకి రెండు నెలల గడువు ఇచ్చాం. స్పందన రాలేదనుకోండి మార్చి 17 తరువాత హింస చోటు చేసుకుంటే మమ్మల్ని తప్పు పట్టొద్దు'' అన్నారు వారిలో ఒకరు. చాలామంది కూర్గుల వద్ద తుపాకులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మాటల వల్ల సహజంగానే ఆందోళన కలుగుతుంది.

జిల్లా డిప్యూటీ కమిషనర్‌ హెచ్‌. భాస్కర్‌ చెప్పినదాని ప్రకారం జమ్మా భూముల యజమానుల వద్దే దాదాపు పదివేల తుపాకీ లైసెన్సులు ఉన్నాయి. ఒక్కొక్క లైసెన్సు కింద వారు మూడేసి తుపాకులు ఉంచుకోవచ్చు. కొడగు ఏకీకరణ రంగ అంచనా ప్రకారం కూర్గుల వద్ద ఆయుధాలు దాదాపు 1,80,000 వరకు వున్నాయి. భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకుంటే ఆ ఆయుధాలు ఆవేశపరులైన యువకుల చేతుల్లోకి పోవచ్చనే భయం వుంది. ఇప్పటికే 'కొడగు లిబరేషన్‌ ఫ్రంట్‌' పేరుతో ఒక మిలిటెంట్‌ సంస్థ ఏర్పాటయిందన్న ధృవీకరించబడని వార్త ఒకటి ఆందోళన కలిగిస్తోంది.

అయితే కూర్గ్‌లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల గురించి కర్ణాటక రాజకీయ నాయకులు మాత్రం ఏమీ ఆందోళన చెందుతున్నట్టు లేరు. కూర్గ్‌ జిల్లాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులూ (అందరూ కాంగ్రెస్‌-ఐ పార్టీవారు) ఇప్పటిదాకా కొడగు ఏకీకరణ రంగ గురించి గాని, దాని కార్యకలాపాల గురించి గాని నోరు మెదపలేదు. ఈ జిల్లాకు సంబంధించిన శాసన మండలి సభ్యుడు ఎ.కె. సుబ్బయ్య ''ఈ గొడవ చేస్తున్న వాళ్లంతా కూర్గ్‌ రాజకీయాలతో సంబంధం లేనివాళ్లే. వాళ్లనసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు'' అన్నారు. వారి ఉద్యమం మిలిటెంట్‌ రూపం తీసుకునే అవకాశం లేదని చెబుతూ ''అలాంటి పనులు కూర్గులు చేయలేరు. ఈ వైఖరి తీసుకోవడం వల్ల ఏదో ఒరుగుతుందని కెఇఆర్‌ గనక భావిస్తున్నట్టయితే, వాళ్లు దారుణంగా పొరబడుతున్నట్టే'' అన్నారు.

కొడగు ఏకీకరణ రంగ డిమాండ్లపై బంగారప్ప ఇంతవరకు స్పందించనప్పటికీ, రాష్ట్ర మంత్రి టి. ఎన్‌. నరసింహారెడ్డి (కూర్గ్‌ ప్రాంత పరిశీలకుడు) మాత్రం తమ ప్రభుత్వం ఒత్తిళ్లకు తలవంచదని అన్నారు. ''ఆందోళనలు చేస్తామన్న బెదిరింపులకు మేం లొంగం. చట్ట వ్యతిరేక చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం'' అని కూడా అన్నారు. మొత్తం మీద ప్రభుత్వం ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం కాదనీ, దక్షిణ భారతంలో మరో బోడోలాండ్‌ లేదా జార్ఖండ్‌ ఏర్పడుతుందని భయపెట్టే వాళ్లది తెలివితక్కువతనం అని, వాళ్లు అతిగా ఊహించుకుని భయపడుతున్నారని భావిస్తున్నట్టు అనిపిస్తోంది. వాళ్ల భావన నిజమే కావచ్చు కానీ, కుర్చీలో కూర్చుని కూర్గుల గొడవలు వాటంతట అవే సద్దుమణుగుతాయని అనుకోవడం కూడా తెలివైన పని కాదని రేపు రుజువు కావచ్చు.

('సండే' వారపత్రిక, 24-30 మార్చి 1991 )
 అనువాదం : ప్రభాకర్‌ మందార

.............................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Tuesday, December 12, 2017

'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి' -గౌరి లంకేశ్


'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి'
("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం)
ఆ సంఘటన 2003 లోనో, 2004 లోనో జరిగింది. దావణగేరె జిల్లాలో ఉన్న మలెబెన్నూర్‌ అనే చిన్న పట్టణంలో కొందరు లింగాయత్‌ యువకులు మైనారిటీ మతానికి చెందిన ఇద్దరు స్త్రీలపై 'జై రామ్‌' అని నినాదాలు చేస్తూ అత్యాచారం జరిపారు. దానిపై పెద్ద గొడవే జరిగింది. ఘర్షణలు, దోపిడీలు కూడా జరిగాయి. మలెబెన్నూరు మా అమ్మ తరఫు బంధువుల ఊరికి దగ్గర ఉన్న పట్టణం కావడంతో ఈ సంఘటన నన్ను మరింత కలవరపరిచింది.

మలెబెన్నూరులో కొన్ని తరాలుగా హిందువులు, ముస్లింలు ఎంతో సామరస్యంగా జీవిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికే దావణగేరెలోని ఒక లింగాయత మఠంలో ప్రసంగించమని నాకు ఆహ్వానం వచ్చింది. అంతకుముందు వరకు నేను లింగాయత మఠాలకు వెళ్లేదాన్ని కాను గానీ, ఆ రోజున వాళ్లకు కొన్ని విషయాలు చెప్పాలనిపించి వెళ్లాను. నా ప్రసంగంలో బసవణ్ణ వచనం ఒకటి ఉటంకించాను.

'సంపన్నులు శివుడికి ఆలయం నిర్మిస్తారు
పేదవాడిని; నేనేం చెయ్యగలను?
నా కాళ్లే స్తంభాలు
నా శరీరమే ఆలయం
నా శిరస్సే స్వర్ణ గోపుర శిఖరం
విను, నదీ సంగమ దేవా
నిశ్చలమైనవి కూలి పోతాయి; చలన శీలమైనవి నిలబడతాయి.'

ఆ తర్వాత వారిని అడిగాను ''మీ లింగాయత మతాన్ని స్థాపించిన బసవణ్ణ ఆలయ నిర్మాణాన్ని, విగ్రహారాధనను వ్యతిరేకించాడు కదా! మరి మీరెందుకు ఒక కాల్పనిక దేవుడికి గుడి కట్టాలనుకునే వాళ్లతో స్నేహం చేస్తున్నారు?'' అని. అంతే, వెంటనే సభ భగ్గుమంది. నన్ను ప్రసంగం పూర్తిచెయ్యనివ్వలేదు. స్థానిక లింగాయతులు ఎంత అలజడి సృష్టించారంటే  పోలీసులు నాకు భద్రత కల్పించాల్సి వచ్చింది.

నా అదృష్టం బాగుండి డా|| ఎం.ఎం. కల్బుర్గి కూడా ఆ రోజు దావణగేరెలోనే ఉన్నారు. పైగా నేనున్న హోటల్‌లోనే ఉన్నారు. మఠంలో జరిగిన విషయమంతా తెలిసి ఆయన నా కోసం కబురు పంపారు. నేను ఆయన్ని కలిసింది ఆ ఒక్కసారే. ఆయన చాలా పెద్దమనిషి. మంచి పండితుడు కూడా. ఎన్నో శాసనాలను, వచనాలనూ ఉల్లేఖిస్తూ, లింగాయతులు ఎలా హిందువులు కారో ఆయన నాకు వివరంగా చెప్పారు. 'మీరు చెప్పిందంతా నిజమే. మీ ఆలోచనలను చెప్పడానికి ఎప్పుడూ భయపడవద్దు' అని  నన్ను ప్రోత్సహించారు కూడా.

కల్బుర్గి దారుణ హత్యకు కారణాలు ఇంకా తెలియాల్సే వుంది. అయితే ఆయన మరణం పట్ల మితవాదుల ఆనందం చూస్తుంటే, మెజారిటీ ప్రజల నమ్మకాలకు విరుద్ధంగా మాట్లాడ్డం ఎంత ప్రమాదకరమో తెలుస్తోంది.

మా పొరుగువాళ్లతో పోలిస్తే భిన్న రకాల ఆలోచనల పట్ల మా కన్నడిగులు చాలా ఉదారంగా, సహనంగా ఉంటారని చెప్పుకోవడం మాకిష్టం. కానీ దురదృష్టవశాత్తు, గత తొమ్మిది శతాబ్దాలలో, పరిస్థితులలో పెద్దగా మార్పురాలేదు. ఈ విషయం కల్బుర్గి మరణానంతరం ఆదివారం నాడు జరిగిన సమావేశంలో ఒక అట్టమీద రాసిన మాటలద్వారా నాకు కొట్టొచ్చినట్టు అర్థమైంది. అందులో ఇలా ఉంది:

'నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి'

పన్నెండవ శతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైక జీవనానికి మించింది లేదని నమ్మి కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేసాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, 'తక్కువ కులస్థుల'తో మమేకమై జీవించాడు. ఒక 'వచనం'లో ఆయన, తను మదర చెన్నయ్య అనే సేవకుడికీ, కక్కయ్య వద్ద చర్మకార వృత్తి చేసే పనిపిల్లకు పుట్టిన వాడినని చెప్పుకునేంతగా సాహసం కూడా చేశాడు.

బసవణ్ణ, మిగతా వచనకారులు అందరూ కలిసి అన్ని కులాలు, వర్గాలవారిని ఆకర్షించగల ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించగలిగారు. 'లింగాయత ధర్మ'గా ప్రసిద్ధి చెందిన వారి సరికొత్త సమూహంలో చేరిన వాళ్లు గతంలోని తమ కుల అస్తిత్వాలను వదిలిపెట్టి, అందరినీ సమానులుగా భావించడం ప్రారంభించారు. అయితే బసవణ్ణకు అసలు పరీక్ష వివాహం రూపంలో ఎదురైంది.

బసవణ్ణ గట్టి మద్దతుదార్లలో హరలయ్య అనే చెప్పులు కుట్టేవాడు, మధువరస అనే సంపన్న బ్రాహ్మణుడు ఉండేవారు. వీళ్లిద్దరూ తాము బసవణ్ణ సమసమాజాన్ని మనసా, కర్మణా నమ్ముతామని నిరూపించదలచుకుని హరలయ్య కుమారుడు శీలవంతుడికి, మధువరస కుమార్తె లావణ్యకు వివాహం నిశ్చయించారు. సహజంగానే బసవణ్ణ ఈ వివాహానికి సమ్మతించి నూతన వధూవరులను ఆశీర్వదించాడు.

అయితే ఒక బ్రాహ్మణ యువతికీ, ఒక అస్పృశ్య యువకుడికీ మధ్య వివాహాన్ని అక్కడి పురోహిత వర్గం సహించలేకపోయింది. వారు దాన్ని వ్యతిరేకిస్తూ రాజు బిజ్జలుడికి ఫిర్యాదు చేసారు. బిజ్జలుడు స్వయంగా మంగలి కులానికి చెందిన వాడైనప్పటికీ ఉన్నత కులాల వారి ఒత్తిడికి తట్టుకోలేక వారిని చాలా క్రూరంగా శిక్షించాడు. వరుడైన శీలవంతుడి కళ్లు ఊడబెరకమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత అతన్ని, అతని తండ్రి హరలయ్యను, మధువరసను  ఏనుగుల కాళ్లకు కట్టేసి, ప్రాణాలు పోయేవరకూ వీధుల్లో ఈడ్చుకెళ్లమన్నాడు. 

అంతటితో ఆగక, బిజ్జలుడి సైన్యం మొత్తం అందరు లింగాయతుల మీద విరుచుకుపడింది. వేలాదిమందిని చంపేయడంతో, మిగిలిన వాళ్లు తలో దిక్కూ పారిపోయారు. వాళ్లు స్థాపించదలచిన కుల రహిత, వర్గ రహిత సమాజానికి మిగిలిన సాక్ష్యమల్లా వాళ్లు రచించిన వచనాలు మాత్రమే. వాటిని రక్షించడం కోసం లింగాయతులు వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని కొన్ని చొప్పున భద్రపరిచారు. అవన్నీ ఒక చోటికి సేకరించబడింది 20వ శతాబ్దిలోనే. 900 ఏళ్ల క్రితం రాసిన లక్షలాది వచనాల్లో ఇప్పుడు ఇరవై వేలు మాత్రమే లభిస్తున్నాయి. ఇక బసవణ్ణ విషయానికి వస్తే ఈ సంఘటనకు అతను విచలితుడై నిస్పృహతో కల్యాళికి తరలిపోయాడు.

ఈ రోజున లింగాయతులు తమ మతం ఎటువంటి ఆదర్శప్రాయమైన సిద్ధాంతాల పునాదులపై ఏర్పడిందో పూర్తిగా మరచిపోయారు. వాళ్లు కూడా మిగతా వారిలాగా ఆలయదర్శనాలు చేసుకుంటూ, విగ్రహారాధకులుగా మారిపోయారు. అంతకంటే దారుణంగా బసవణ్ణ ఏ పురోహిత వర్గాన్నయితే వ్యతిరేకించాడో ఆ వర్గానికే సైద్ధాంతిక బానిసలుగా మారిపోయారు.

'వచన' సాహిత్యోద్యమాన్నీ, కన్నడ భాష సాంస్కృతిక చరిత్రనూ అధ్యయనం చేసిన కల్బుర్గి వంటి పండితుడు వాళ్లకు 'ఇది మీ మతం కాదు' అని చెప్పడానికి ప్రయత్నిస్తే, అతన్ని మతద్రోహిగా ముద్రవేసి, అసంఖ్యాకంగా కేసులు పెట్టి వేధించారు. చివరకు ఆయన హత్యకు గురయ్యాక, 'హైందవమతాన్ని వెక్కిరిస్తే ఇలాగే కుక్క చావు ఛస్తావు' అని కేరింతలు కొట్టారు. వాళ్లు మరిచిపోతున్నదేమిటంటే, కల్బుర్గిలాగే బసవణ్ణ కూడా అన్ని వందల సంవత్సరాల క్రితం తన అభిప్రాయాలను నిస్సంకోచంగా చెప్పివుండకపోతే, అసలు లింగాయతులే ఉండేవారు కారని.

కల్బుర్గి మరణం వల్ల ఎవరికి ఎలాంటి భౌతిక ప్రయోజనం ఉంటుందో తెలీదు కానీ బసవణ్ణ, కల్బుర్గి వంటి సంస్కర్తల స్వరాలను పాశవికంగా, శాశ్వతంగా నొక్కేసాక మితవాద ఫాసిస్టు శక్తులు సైద్ధాంతికంగా చాలా లాభపడతారనేది స్పష్టం.
అయితే ఆలోచనలకు ఎప్పటికీ మరణం ఉండదు.

బెంగుళూరు మిర్రర్‌, 31 ఆగస్టు 2015
అనువాదం : మృణాళిని
....................................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని,   ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,    కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి


230 పేజీలు  , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com

Sunday, December 10, 2017

మతం, రాజకీయాలు : ఒక నగ్న సత్యం - గౌరీ లంకేశ్

మతం, రాజకీయాలు  : ఒక నగ్న సత్యం
("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం)

జైన ముని తరుణ్‌ సాగర్‌ 2016 ఆగస్టు 26న హర్యానా అసెంబ్లీలో నగ్నంగా నిలబడి మాట్లాడడం గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా మాట్లాడి ఉన్నారు. అతను తన మత సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడు కనక అతని నగ్నత్వం గురించి అగౌరవంగా, అసంబద్ధంగా వ్యాఖ్యలు చేయకూడదని నేను గట్టిగా అనుకొంటున్నాను.  రాజ్యాంగం ప్రకారం అతనికి ఆ హక్కు ఉంది. 

అయితే నేను రెండు విషయాలలో అతనితో విభేదిస్తున్నాను. ఒకటి - అతని ఉపన్యాసంలోని  విషయాన్ని. రెండు - అతను మతాన్ని రాజ్యాంగం కంటే పై స్థానంలో కూర్చోబెట్టడాన్ని. 
ఆడ పిండాల నిర్మూలనకూ, లైంగిక వివకక్షూ వ్యతిరేకంగా ఈ ముని తన 'కడ్వే ప్రవచన్‌' (మొరటు ప్రవచనం) లో ప్రతిపాదించిన పరిష్కారం మెచ్చుకోదగ్గదే కానీ ఆడ పిండాల హత్యల నివారణ ఎందుకు అవసరమో ఆయన చెప్పే కారణం పూర్తిగా పురుషాధిపత్య భావజాలం కంపు కొడుతుంది. 

గౌరవనీయమైన ముని గారూ!
  అత్యాచారాలు స్త్రీ, పురుష నిష్పత్తి తేడాల వలన జరగవు. 
ఆ పాశవిక నేరానికి కారణాలు వేరెక్కడో ఉన్నాయి.

ముని తరుణ్‌ సాగర్‌ ఇంకా ఇలా అన్నారు:  ''రాజకీయాల నియంత్రణకు ధర్మం తప్పనిసరి. రాజకీయాలు భార్య అయితే ధర్మం భర్త అవుతాడు. 
భార్యను రక్షించటం భర్త కర్తవ్యం. భర్త నిర్దేశించిన క్రమశిక్షణను ఆచరించటం భార్య విధి. రాజకీయాల మీద ధర్మానికి (మతానికి) నియంత్రణ లేకపోతే అది అదుపు లేని ఏనుగులాగా తయారవుతుంది.'' 
''మనం 14వ శతాబ్దంలో జీవిస్తున్నామనే భావన కలుగుతోంది'' అని మీరు ఏదైతే అన్నారో మునీజీ,... దురదృష్టవశాత్తూ మీ ఈ వ్యాఖ్యలు కూడా అదే లైంగిక వివక్షకు నిదర్శనాలుగా అనిపిస్తున్నాయి నాకు. 

అసెంబ్లీలో మునిగారి కుర్చీ ముఖ్యమంత్రి కంటే, స్పీకర్‌ కంటే ఎత్తయిన స్థానంలో ఉందని చెపుతున్నారు. గవర్నరు కుర్చీ కూడా ఆయన కుర్చీ కంటే కిందే ఉందట. 
'భార్య' రాజకీయాలను 'భర్త' ధర్మం నియంత్రించాలనే మునిగారి అభిప్రాయం లాగానే అన్ని పార్టీలకు చెందిన హర్యానా రాజకీయ నాయకులు లౌకిక రాజ్యాంగం కంటే మతమే గొప్పదని భావిస్తున్నట్టున్నారు. 
అందుకే రాజ్యాంగం పట్ల హర్యానా అసెంబ్లీ చూపించిన ఈ అగౌరవానికి  హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఒక్కదాన్నే నిందిస్తే లాభం లేదు. ఈ రకమైన ఆలోచనా విధానం 69 ఏళ్ళుగా మన దేశానికి శాపంగా ఉంటూనే వచ్చింది.

మనందరికీ తెలుసు, 1951లో బాబు రాజేంద్ర ప్రసాద్‌ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కాశీలో 201 మంది బ్రాహ్మణుల కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాడు. 

         అలా చేయడం ద్వారా రాజ్యాంగం కంటే బ్రాహ్మణుల స్థాయి ఉన్నతమైందని చాటాడు మన తొలి రాష్ట్రపతి. 
ఈ ఘటన గురించి చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే ప్రఖ్యాత సంస్కత పండితుడు, 'మహాబ్రాహ్మణ' (విశ్వామిత్ర ఋషి జీవితం మీద ఆధారపడి రాసిన) నవలా రచయిత అయిన ఒక వ్యక్తి కూడా ఆ రోజు బెనారస్‌లోనే ఉన్నారని. ఆయన తనకు కూడా ఆ గౌరవం (రాష్ట్రపతి చేత కాళ్లు కడిగించే  గౌరవం) చేయబోతున్నారని తెలుసుకొని, రాష్ట్రపతి పదవిని తక్కువ చేయకూడదని భావించి ఆ క్రతువు నుండి ఆయన వైదొలగారు. 

ఆయన ఎవరో కాదు. శాస్త్రిగారి నరసింహ శాస్త్రి. కానీ దేవుడి నిరసనను ఆ కార్యక్రమ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్లు శుభ్రంగా ఆయన స్థానంలో మరో స్థానిక బ్రాహ్మణున్ని కూర్చోబెట్టి రాష్ట్రపతి చేత అతని కాళ్ళు కడిగించారు.

సోషలిస్టు రామ్‌ మనోహర లోహియాకు ఈ విషయం తెలిసినపుడు ఆయన  ''ఈ పేద సంస్కత పండితుడు (శాస్త్రిగారి నరసింహ శాస్త్రి) తీసుకొన్న నిర్ణయం ఎంతో ప్రశంసనీయమైనది'' అన్నారు. 'కులం- లైంగిక వివక్ష' శీర్షికతో రాసిన ఒక వ్యాసంలో ''భారత గణతంత్ర రాష్ట్రపతి పవిత్ర బెనారస్‌ నగరంలో రెండువందల మంది బ్రాహ్మణుల కాళ్లు బహిరంగంగా కడిగాడు. ఇంకొకరి కాళ్లు బహిరంగంగా కడగటమంత నీచం యింకొకటి ఉండదు'' అని విమర్శించారు.   
  
బి.ఆర్‌.అంబేద్కర్‌ కూడా రాజేంద్ర ప్రసాద్‌ చేసిన ఈ పనిని విమర్శించారు. ఇవ్వాళ భారతీయులను ''రెండు విభిన్న సిద్ధాంతాలు పాలిస్తునాయి. వారి రాజకీయ ఆదర్శాలేమో 'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల'ను ప్రవచించే రాజ్యాంగ ప్రవేశికలోనూ, వారి సామాజిక ఆదర్శాలేమో పై వాటిని తిరస్కరించే మతంలోనూ ఉన్నాయి'' అన్నారు.

అంత తీక్షణమైన విమర్శ కూడా రాజేంద్ర ప్రసాద్‌ను కదిలించలేదు. ఒక సంవత్సరం తరువాత వల్ల భాయ్‌ పటేల్‌తో కలిసి ఆయన సోమనాథ్‌ దేవాలయం ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సౌరాష్ట్రం ఆ ఆధునీకరణ కార్యక్రమానికి  ఏకంగా 25 లక్షల రూపాయలు కేటాయించింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పుడే కొత్తగా స్వాతంత్య్రం పొంది, తన కాళ్ల మీద తను నిలబడటానికి భారతదేశం ఎన్నో అవస్థలు పడుతున్న సమయం అది.

మరి మన 'ఘనమైన సెక్యులరిస్టు' నెహ్రూ సంగతేమిటి? 

ఆ కాలంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పరిశోధన చేసిన ఇంద్రజిత్‌ రాయ్‌ అనే వ్యక్తి నెహ్రూ గురించి  ఒక వ్యాసంలో ఇలా రాశాడు: 'స్వయం ప్రకటిత అభ్యుదయవాదులకు ఎంతో ఆప్తుడైన ఇంగ్లండ్‌లో చదివి వచ్చిన నెహ్రూగారు మత జ్ఞానులకు వాడే 'పండిత్‌' అనే పదంతో తనను సన్మానించినపుడు ఏ మాత్రం సిగ్గు పడలేదు. అంతేకాదు, తన 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా' పుస్తకంలో (87వ పేజీలో) బ్రాహ్మణ కులం చేసిన ప్రజాసేవ పట్ల, ప్రజల మంచి కోసం వారు చేసిన వ్యక్తిగత త్యాగాల పట్ల ఆయన తన ఆరాధనను ఏ మాత్రం  దాచుకోలేదు. 

పురాతన కాలంలో రాజుల పట్టాభిషేకంలో పూజారులు నిర్వహించే మతకర్మల పద్ధతినే అనుసరిస్తూ శంఖారావాలు మోగుతున్నపుడే ఆయన నేతృత్వంలోనే స్వతంత్ర భారతదేశం 'విధితో ఒడంబడిక' (tryst with destiny) చేసుకుందని కూడా మనం గుర్తుంచుకోవాలి.

మన లౌకిక రాజ్యాంగం మతాన్నీ, రాజకీయాలనూ  వేరు చేస్తుంది కానీ ఆచరణలో మాత్రం మతం అన్ని రాజకీయ నిర్ణయాలలోను కేంద్ర పాత్రను పోషిస్తోంది. 

- అసెంబ్లీ సమావేశాలకు మంచి రోజు చూస్తున్నారు ! 
- ప్రభుత్వ భవనాల శంకుస్థాపనలకు కూడా వాస్తు చూస్తున్నారు !
- కొబ్బరికాయ కొట్టి నౌకలను నీళ్లలోకి వదులుతున్నారు !
- జలాశయాలకు 'తాంబూలాలు' సమర్పిస్తున్నారు !
 - ప్రభుత్వ కార్యక్రమాలు మొదలు పెట్టేటపుడు నేపథ్యంలో మతపరమైన శ్లోకాలు వినిపిస్తున్నారు !

ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి???
రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉండాల్సిన కోర్టుల ప్రాంగణాలలో సైతం తప్పనిసరిగా గుడి కనిపిస్తోంది.

మన రాజకీయ 'భార్య' తన ధార్మిక 'భర్త' వేసిన సంకెళ్ల నుండి ఎప్పుడు విముక్తి చెంది మన దేశాన్ని నిజమైన లౌకిక రాజ్యంగా మారుస్తుందా అని ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగిందేమీ కనబడడం లేదు.

 బెంగుళూరు మిర్రర్‌, 29 ఆగస్టు 2016
అనువాదం : రమాసుందరి
.......................................................................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని,   ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,    కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి


230 పేజీలు  , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com

Friday, December 8, 2017

నేను ఫూలన్‌ దేవిని

                                                             
                                                               'నా సాహస కార్యాల్ని కొనియాడు
                                                                నా వీర గాథల్ని గానం చెయ్యి
                                                                నా తప్పిదాల్ని మన్నించు
                                                                నాపై శాంతి వర్షం కురిపించు
-ఫూలన్‌దేవి చేసిన ప్రార్థన ఇది. ఆమె స్వయంగా చెప్పిన తన యదార్థ జీవిత గాథే ఈ పుస్తకం.
యావద్దేశ చరిత్రలోనే ఓ గొప్ప మహిళా బందిపోటుగా, లివింగ్‌ లెజెండ్‌గా పేరు గాంచింది. చంబల్‌లోయలో పసిపిల్లగా వున్నప్పుడే కులవ్యవస్థ దౌష్ట్యాన్నీ, బీదల భూమి హక్కులు కాలరాయబడటాన్నీ, తనకంటే ఎంతో పెద్దవాడైన వ్యక్తితో పెద్దలు చేసిన పెళ్ళి వల్ల ఎదురైన చేదు అనుభవాలని ఫూలన్‌దేవి చవిచూసింది. ఒక బీద నిమ్నకుల స్త్రీకి జరుగుతున్న అవమానాన్ని చూసి సహించలేకపోయినందు వల్ల ఆ బందిపోట్ల ముఠాకి తనే నాయకత్వం వహించవలసి వచ్చింది. 1983లోప్రభుత్వానికి లొంగిపోయిన పిదప దినదినగండంలా గడచిన జైలు రోజులు, కందిరీగల్లా చుట్టుముట్టిన కోర్టు కేసులు, 'సమాజ్‌వాది పార్టీ'లో రంగప్రవేశం చేయడం, చివరికి దేశ రాజధానిలోనే 2001 జులై 25న హత్యకు గురికావడం తదితర పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా సంచలన చర్చ రేపాయి.
ఒక స్త్రీ బందిపోటుగా ఎలా రూపాంతరం చెందింది అనే అంశానికి సంబంధించిన అసాధారణ జీవిత చిత్రణని పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం. ఇందులో ఫూలన్‌దేవి జీవితంతో పాటు వర్తమాన భారతదేశపు స్థితిగతులు ఎలా వున్నాయి? భారతదేశం తన గ్రామాల్లో తను ఎలాంటి బతుకును గడుపుతోంది? పోలీసు, న్యాయం, కార్యనిర్వాహక, శాసనసభ తదితర రాజ్య వ్యవస్థలు ఏ విధంగా విఫలమవుతున్నాయి... మొదలైన అంశాల విశ్లేషణ కూడా వుంది.
పుస్తక సంపాదకురాలు : కె.లలిత
 పేజీలు. 324  , ధర: రూ. 275/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849Email ID : hyderabadbooktrust@gmail.com

బాబా బుడన్‌గిరి లో నేను చూసింది - గౌరీ లంకేశ్

బాబా బుడన్‌గిరి లో నేను చూసింది - గౌరీ లంకేశ్ 

("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం)
 
చిక్కమగళూరులో, బాబాబుడన్‌గిరిలో మత సామరస్య సభలు
జరుపుకుని,  కాషాయదళం కర్ణాటకని మరో గుజరాత్‌గా, బాబాబుడన్‌గిరిని మరో అయోధ్యగా మార్చడాన్ని నిలువరిద్దాం రండని మేం పిలుపునిచ్చిన ఈ రెండు వారాల్లో ఎన్నెన్ని విచిత్రమైన విషయాలు జరిగాయో చెప్పలేను.
ఎక్కడనుండి మొదలుపెట్టాలో కూడా తెలియడం లేదు. మత సమైక్యతకి చిహ్నమైన బాబాబుడన్‌గిరి పరిరక్షణకు మద్దతు తెలిపిన రచయిత గిరీశ్‌ కర్నాడ్‌ గారు ఒక రోజు నాకు ఫోన్‌ చేసి: ''డిసెంబర్‌ 7,8 తేదీల్లో అక్కడ మతసామరస్య సమావేశం జరిపే ముందే మనం కొందరం కలిసి అక్కడికి వెళ్ళి వాస్తవ స్థితిగతులను పరిశీలించి వద్దామా?'' అని అడిగారు.
''బ్యూటిఫుల్‌ ఐడియా, వెళదాం పదండి'' అన్నాను. కర్నాడ్‌, డా.కె. మరుళసిద్దప్ప, జి.కె.గోవిందరావు, శూద్ర శ్రీనివాస్‌, ప్రొ.వి.ఎస్‌. శ్రీధర, నేను ఒక టాటా క్వాలిస్‌ ఎక్కి చిక్కమగళూరుకి  బయలుదేరి వెళ్లాం.
దారిలో బాబాబుడన్‌గిరి వైశిష్ట్యం, ప్రస్తుతం కాషాయదళం అక్కడ వ్యాపింపజేస్తున్న విష వాతావరణం గురించి మాట్లాడుకున్నాం. ఈ యేడు భజరంగదళ మర్కటాలు బాబాబుడన్‌గిరిలో అశాంతిని సష్టించడానికి సన్నద్ధమవుతున్నారన్నది రహస్యమేమీ కాదు.
పోయిన ఏడు భజరంగదళ్‌ ఇచ్చిన నినాదాలే అందుకు సాక్ష్యం. అప్పుడక్కడ తీసిన ఫోటోలను శ్రీధర గారు చూపించారు. ఆ ఫోటోలలో ఒక చోట భజరంగ్‌దళ్‌ వాళ్లు రాసిన నినాదం ఇలా ఉంది: ''స్నేహానికి బద్ధులం, కాని సంహారానికీ సిద్ధం.''
ఇది చదివి కర్నాడ్‌ గారికి కోపమొచ్చింది. ''ఎవర్ని సంహరిస్తారట వీళ్ళు? ఇందులో వాడిన పదాలు చూడండి. 'కండబలం', 'నెత్తురుటేరులు', 'శత్రుసంహారం'. ఇది కన్నడ భాషేనా?'' అని గర్జించారు.
''మన సంస్క తిని నిర్మించింది బసవణ్ణ, షరీఫ్‌, కనకదాస, కువెంపులు. 'మతానికి మూలం దయ.' అదే మన కర్ణాటక మతం. కాని ఈ భజరంగదళ్‌ వాళ్ళకి తెలిసింది తొగాడియా-మోదీ లాంటి వాళ్ళ భాష మాత్రమే'' అని విమర్శించారు మరుళసిద్దప్పగారు.
భజరంగదళ్‌ చేస్తున్న డిమాండ్లు కూడా ఆ ఫోటోల్లో కనిపించాయి. అవి ''దత్తపీఠం దగ్గర శాశ్వత పూజాకార్యక్రమాలు, విగ్రహప్రతిష్ఠ, అర్చకుడి నియామకం, దత్తపీఠం చుట్టూరా ఉన్న గోరీల నిర్మూలన, మొత్తం క్షేత్రాన్ని హిందూ క్షేత్రంగా ప్రకటించడం.'' ఈ యేడు కూడా భజరంగదళ్‌ వాటినే డిమాండ్‌ చేసింది. భారతీయ జనతా పార్టీ వాటికి సంపూర్ణ మద్దతు తెలిపింది.
కానీ భజరంగదళ్‌ చేసిన ప్రతి డిమాండూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి విరుద్ధంగా ఉంది. వీటిల్లో ఏ ఒక్కదానికి ప్రభుత్వం ఒప్పుకున్నా కోర్టు ధిక్కారం అవుతుంది. బిజెపి మూర్ఖ శిఖామణులకి ఆ విషయం తెలియపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు!
బాబాబుడన్‌గిరిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ తీర్పు ప్రకారం, 1975 జూన్‌ వరకూ ఏ ఆచారాలు పాటించారో వాటిని మాత్రమే అక్కడ కొనసాగించవచ్చు, కొత్త ఆచారాలకి అవకాశం ఇవ్వరాదు. ఇప్పటిదాకా అక్కడ అనుసరిస్తున్న ఆచారాల పట్టికను కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది.

హిందూ దేవస్థానాల్లో కానవచ్చే చాలా ఆచారాలను అక్కడ పాటిస్తారు. అవి:
1. పాదుకలకి పుష్పార్చన
2. నందాదీపాన్ని వెలిగించడం
3. భక్తులకి తీర్థం ఇవ్వడం
4. కొబ్బరికాయలు కొట్టడం
5. హిందూ మఠాధిపతులను గౌరవించడం
6. భక్తులను నెమలీకతో ఆశీర్వదించడం
1975లో ఈ తీర్పు ఇచ్చినపుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ ఆచారాలలోని మత సామరస్య స్వభావాన్ని అరుదైనదిగా కొనియాడారు కూడా. రామ్‌-రహీంల గురించి మాట్లాడేవన్నీ ఎక్కువగా పడికట్టు మాటలుగా ఉంటున్న ఈ కాలంలో, ఆ సిద్ధాంతాన్ని నిజంగా అనుసరించడం గొప్ప విషయమని మెచ్చుకున్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా మెచ్చుకోవలసింది ఈ క్షేత్ర పాలనా వ్యవహారాలు చూసే శాఖాద్రి గారి వైఖరిని అని న్యాయమూర్తులన్నారు. ఎందుకంటే స్వయంగా ముస్లిం అయినా ఈ పుణ్యస్థలం ముస్లింలకి మాత్రమే పరిమితం కాదు, హిందువులకి కూడా చెందుతుందని ఆయన చెప్పడం నిజంగా శ్లాఘనీయమన్నారు. అలాగే అక్కడ పాదుకలు, నందాదీపాల సంప్రదాయం ఉన్నాగాని, ఈ వివాదంలో అర్జీదారులైన హిందువులు ఆ స్థలాన్ని తమది మాత్రమే అని చెప్పకపోవడాన్ని కూడా కోర్టు ప్రశంసించింది.
వందల సంవత్సరాలుగా ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నా ముస్లింలెప్పుడూ ఈ స్థలం తమకు మాత్రమే పరిమితమనలేదని, కాని వక్ఫ్‌ బోర్డ్‌ మాత్రం ఆ స్థలంపై అధికారం చెలాయించాలని చూస్తోదని కోర్టు అంది.
కుల మతాల మధ్య కలహాల వలన ప్రపంచమే ఛిద్రమైపోతున్న నేటి సందర్భంలో ఈ గురు దత్తాత్రేయ బాబాబుడన్‌స్వామి దర్గా నిజమైన లౌకిక భావానికి అద్భుత ఉదాహరణగా నిలిచిందని న్యాయమూర్తులన్నారు.
ఇటువంటి చోట బిజెపి లాంటి సంప్రదాయ హిందూ పార్టీ, దాని అనుబంధ సంస్థ భజరంగదళ్‌ అర్చకుడి నియామకాన్ని (అతడు బ్రాహ్మణుడే అవుతాడని వేరే చెప్పనక్కరలేదు), సమాధుల నిర్మూలనను కోరడం మహా దుర్మార్గం. దాన్ని 'హిందూ పుణ్యక్షేత్రంగా' ప్రకటించాలని వారి కోరిక.
కర్నాడ్‌ గారు ''ఈ దత్తజయంతి, దత్తమాల, ఇవేవీ మన సంస్క తి కాదు. వీటి ఆచరణ వెనుక ఉన్నది మతం కాదు. మతం పేరుతో జరుగుతున్న రాజకీయం. నాథ పరంపరకు చెందిన దత్తాత్రేయుడు కులవ్యవస్థని తిరస్కరించినవాడు. అలాంటి ఆయన్ని బ్రాహ్మణీకరించడం వెనక ఉన్న కుట్ర ఏమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు''  అన్నారు.
ఈ 'గురు దత్తాత్రేయ బాబాబుడన్‌గిరిస్వామి దర్గా'కి చాలా చరిత్రే ఉంది.
అరేబియా నుండి చంద్రద్రోణ పర్వతానికి వచ్చిన దాదా హయత్‌ అనే సూఫీ ఇక్కడి సేనాపతుల పీడనకు గురౌతున్న శూద్రులకీ, దళితులకీ సహాయంచేసి వారి మన్ననలను పొందాడు. దాదా హయత్‌ చూపిన ప్రేమ, దయ, సహనంతో ప్రభావితులై కొందరు ఇస్లాం మతంలో చేరితే, ఇంకొందరు తమ మతాన్ని వదిలిపెట్టకుండానే దాదా హయత్‌ని దత్తాత్రేయుడి అవతారంగా భావించి ఆయనకి భక్తులయ్యారు. దీనికి ఒక కారణం ఉంది. హిందూ పురాణాల్లో విష్ణువు దత్తాత్రేయ అవతారం దాల్చి ప్రజల్ని దాస్య విముక్తుల్ని చేశాడని ఉంది.
అందుకే హిందూ భక్తులు దాదా హయత్‌లో దత్తాత్రేయుడిని చూసి ఆయనకి ఆ పేరు పెట్టుకున్నారు.
ముస్లిం సూఫీ సాధువులకు అలాంటి హిందూపేర్లు పెట్టడం అప్పట్లో సర్వసాధారణమే.
ఉదాహరణకు బీజాపూర్‌ సూఫీసాధువు ఖ్వాజా అమీనుద్దీన్‌ అల్లాని హిందువులు బ్రహ్మానందాయికె స్వామి అనీ, తింతిణే సాధువు మొయిద్దీన్‌ని మునియప్ప అనీ పిలుచుకునేవారు.
కాలక్రమంలో దాదా హయత్‌, దత్తాత్రేయుడు రెండు పేర్లూ ఒకటై 'గురు దత్తాత్రేయ బాబాబుడన్‌గిరిస్వామి' దర్గా అనే పేరు వచ్చింది.
ఈ దర్గా భూమి దస్తావేజుల్లో శాఖాద్రి 'జగద్గురు' అనే పేరుతో నమోదై ఉన్నాడు. శతాబ్దాలుగా ఈ దర్గాని హిందూ, ముస్లిం రాజులిద్దరూ సేవించుకున్నారు.
రాణి చెన్నమ్మ ఎన్నో నిధులు సమకూర్చింది.
హైదర్‌ అలీ కొన్ని పల్లెల్నే దర్గా పోషణ కోసం ఇచ్చాడు.
టిప్పు సుల్తాన్‌ వందల ఎకరాల భూమిని ధారాదత్తం చేసాడు.
మూడవ శ్రీకష్ణరాజ ఒడయార్‌ దర్గాకి అనేకసార్లు వచ్చి, మతసంబంధమైన విషయాల్లో ఇక్కడి పీర్ల నుండి సలహాలు పొందేవాడు.
మైసూరు మహారాజైతే 16 హిందూ ధర్మాధికారులతోపాటు శ్రీ గురు దత్తాత్రేయ బాబాబుడన్‌స్వామి జగద్గురువులకి కూడా విశేష సదుపాయాలను కల్పించాడు. వేరే ముస్లిం మతాధికారి ఎవరికీ అటువంటి గౌరవం దక్కలేదు.
ఇటువంటి చోట
కాషాయదళానికి నేడు
 హోమం,
యాగం,
యజ్ఞం,
పూజా పునస్కారం
వంటి నిష్ప్రయోజనకరమైన ఆచారాలు కావలసివచ్చాయి!

లంకేశ్‌ పత్రికె, 3 డిసెంబర్‌ 2003
కన్నడ నుంచి తెలుగు సేత : కె. ఆదిత్య
.............................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని, ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,   కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి

230 పేజీలు  , ధర: రూ. 150/-

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006

ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌