Sunday, December 10, 2017

మతం, రాజకీయాలు : ఒక నగ్న సత్యం - గౌరీ లంకేశ్

మతం, రాజకీయాలు  : ఒక నగ్న సత్యం
("కొలిమి రవ్వలు  - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఒక వ్యాసం)

జైన ముని తరుణ్‌ సాగర్‌ 2016 ఆగస్టు 26న హర్యానా అసెంబ్లీలో నగ్నంగా నిలబడి మాట్లాడడం గురించి ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా మాట్లాడి ఉన్నారు. అతను తన మత సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడు కనక అతని నగ్నత్వం గురించి అగౌరవంగా, అసంబద్ధంగా వ్యాఖ్యలు చేయకూడదని నేను గట్టిగా అనుకొంటున్నాను.  రాజ్యాంగం ప్రకారం అతనికి ఆ హక్కు ఉంది. 

అయితే నేను రెండు విషయాలలో అతనితో విభేదిస్తున్నాను. ఒకటి - అతని ఉపన్యాసంలోని  విషయాన్ని. రెండు - అతను మతాన్ని రాజ్యాంగం కంటే పై స్థానంలో కూర్చోబెట్టడాన్ని. 
ఆడ పిండాల నిర్మూలనకూ, లైంగిక వివకక్షూ వ్యతిరేకంగా ఈ ముని తన 'కడ్వే ప్రవచన్‌' (మొరటు ప్రవచనం) లో ప్రతిపాదించిన పరిష్కారం మెచ్చుకోదగ్గదే కానీ ఆడ పిండాల హత్యల నివారణ ఎందుకు అవసరమో ఆయన చెప్పే కారణం పూర్తిగా పురుషాధిపత్య భావజాలం కంపు కొడుతుంది. 

గౌరవనీయమైన ముని గారూ!
  అత్యాచారాలు స్త్రీ, పురుష నిష్పత్తి తేడాల వలన జరగవు. 
ఆ పాశవిక నేరానికి కారణాలు వేరెక్కడో ఉన్నాయి.

ముని తరుణ్‌ సాగర్‌ ఇంకా ఇలా అన్నారు:  ''రాజకీయాల నియంత్రణకు ధర్మం తప్పనిసరి. రాజకీయాలు భార్య అయితే ధర్మం భర్త అవుతాడు. 
భార్యను రక్షించటం భర్త కర్తవ్యం. భర్త నిర్దేశించిన క్రమశిక్షణను ఆచరించటం భార్య విధి. రాజకీయాల మీద ధర్మానికి (మతానికి) నియంత్రణ లేకపోతే అది అదుపు లేని ఏనుగులాగా తయారవుతుంది.'' 
''మనం 14వ శతాబ్దంలో జీవిస్తున్నామనే భావన కలుగుతోంది'' అని మీరు ఏదైతే అన్నారో మునీజీ,... దురదృష్టవశాత్తూ మీ ఈ వ్యాఖ్యలు కూడా అదే లైంగిక వివక్షకు నిదర్శనాలుగా అనిపిస్తున్నాయి నాకు. 

అసెంబ్లీలో మునిగారి కుర్చీ ముఖ్యమంత్రి కంటే, స్పీకర్‌ కంటే ఎత్తయిన స్థానంలో ఉందని చెపుతున్నారు. గవర్నరు కుర్చీ కూడా ఆయన కుర్చీ కంటే కిందే ఉందట. 
'భార్య' రాజకీయాలను 'భర్త' ధర్మం నియంత్రించాలనే మునిగారి అభిప్రాయం లాగానే అన్ని పార్టీలకు చెందిన హర్యానా రాజకీయ నాయకులు లౌకిక రాజ్యాంగం కంటే మతమే గొప్పదని భావిస్తున్నట్టున్నారు. 
అందుకే రాజ్యాంగం పట్ల హర్యానా అసెంబ్లీ చూపించిన ఈ అగౌరవానికి  హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఒక్కదాన్నే నిందిస్తే లాభం లేదు. ఈ రకమైన ఆలోచనా విధానం 69 ఏళ్ళుగా మన దేశానికి శాపంగా ఉంటూనే వచ్చింది.

మనందరికీ తెలుసు, 1951లో బాబు రాజేంద్ర ప్రసాద్‌ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కాశీలో 201 మంది బ్రాహ్మణుల కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాడు. 

         అలా చేయడం ద్వారా రాజ్యాంగం కంటే బ్రాహ్మణుల స్థాయి ఉన్నతమైందని చాటాడు మన తొలి రాష్ట్రపతి. 
ఈ ఘటన గురించి చాలామందికి తెలియని ఒక విషయం ఏమిటంటే ప్రఖ్యాత సంస్కత పండితుడు, 'మహాబ్రాహ్మణ' (విశ్వామిత్ర ఋషి జీవితం మీద ఆధారపడి రాసిన) నవలా రచయిత అయిన ఒక వ్యక్తి కూడా ఆ రోజు బెనారస్‌లోనే ఉన్నారని. ఆయన తనకు కూడా ఆ గౌరవం (రాష్ట్రపతి చేత కాళ్లు కడిగించే  గౌరవం) చేయబోతున్నారని తెలుసుకొని, రాష్ట్రపతి పదవిని తక్కువ చేయకూడదని భావించి ఆ క్రతువు నుండి ఆయన వైదొలగారు. 

ఆయన ఎవరో కాదు. శాస్త్రిగారి నరసింహ శాస్త్రి. కానీ దేవుడి నిరసనను ఆ కార్యక్రమ నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్లు శుభ్రంగా ఆయన స్థానంలో మరో స్థానిక బ్రాహ్మణున్ని కూర్చోబెట్టి రాష్ట్రపతి చేత అతని కాళ్ళు కడిగించారు.

సోషలిస్టు రామ్‌ మనోహర లోహియాకు ఈ విషయం తెలిసినపుడు ఆయన  ''ఈ పేద సంస్కత పండితుడు (శాస్త్రిగారి నరసింహ శాస్త్రి) తీసుకొన్న నిర్ణయం ఎంతో ప్రశంసనీయమైనది'' అన్నారు. 'కులం- లైంగిక వివక్ష' శీర్షికతో రాసిన ఒక వ్యాసంలో ''భారత గణతంత్ర రాష్ట్రపతి పవిత్ర బెనారస్‌ నగరంలో రెండువందల మంది బ్రాహ్మణుల కాళ్లు బహిరంగంగా కడిగాడు. ఇంకొకరి కాళ్లు బహిరంగంగా కడగటమంత నీచం యింకొకటి ఉండదు'' అని విమర్శించారు.   
  
బి.ఆర్‌.అంబేద్కర్‌ కూడా రాజేంద్ర ప్రసాద్‌ చేసిన ఈ పనిని విమర్శించారు. ఇవ్వాళ భారతీయులను ''రెండు విభిన్న సిద్ధాంతాలు పాలిస్తునాయి. వారి రాజకీయ ఆదర్శాలేమో 'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల'ను ప్రవచించే రాజ్యాంగ ప్రవేశికలోనూ, వారి సామాజిక ఆదర్శాలేమో పై వాటిని తిరస్కరించే మతంలోనూ ఉన్నాయి'' అన్నారు.

అంత తీక్షణమైన విమర్శ కూడా రాజేంద్ర ప్రసాద్‌ను కదిలించలేదు. ఒక సంవత్సరం తరువాత వల్ల భాయ్‌ పటేల్‌తో కలిసి ఆయన సోమనాథ్‌ దేవాలయం ఆధునీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సౌరాష్ట్రం ఆ ఆధునీకరణ కార్యక్రమానికి  ఏకంగా 25 లక్షల రూపాయలు కేటాయించింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పుడే కొత్తగా స్వాతంత్య్రం పొంది, తన కాళ్ల మీద తను నిలబడటానికి భారతదేశం ఎన్నో అవస్థలు పడుతున్న సమయం అది.

మరి మన 'ఘనమైన సెక్యులరిస్టు' నెహ్రూ సంగతేమిటి? 

ఆ కాలంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పరిశోధన చేసిన ఇంద్రజిత్‌ రాయ్‌ అనే వ్యక్తి నెహ్రూ గురించి  ఒక వ్యాసంలో ఇలా రాశాడు: 'స్వయం ప్రకటిత అభ్యుదయవాదులకు ఎంతో ఆప్తుడైన ఇంగ్లండ్‌లో చదివి వచ్చిన నెహ్రూగారు మత జ్ఞానులకు వాడే 'పండిత్‌' అనే పదంతో తనను సన్మానించినపుడు ఏ మాత్రం సిగ్గు పడలేదు. అంతేకాదు, తన 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా' పుస్తకంలో (87వ పేజీలో) బ్రాహ్మణ కులం చేసిన ప్రజాసేవ పట్ల, ప్రజల మంచి కోసం వారు చేసిన వ్యక్తిగత త్యాగాల పట్ల ఆయన తన ఆరాధనను ఏ మాత్రం  దాచుకోలేదు. 

పురాతన కాలంలో రాజుల పట్టాభిషేకంలో పూజారులు నిర్వహించే మతకర్మల పద్ధతినే అనుసరిస్తూ శంఖారావాలు మోగుతున్నపుడే ఆయన నేతృత్వంలోనే స్వతంత్ర భారతదేశం 'విధితో ఒడంబడిక' (tryst with destiny) చేసుకుందని కూడా మనం గుర్తుంచుకోవాలి.

మన లౌకిక రాజ్యాంగం మతాన్నీ, రాజకీయాలనూ  వేరు చేస్తుంది కానీ ఆచరణలో మాత్రం మతం అన్ని రాజకీయ నిర్ణయాలలోను కేంద్ర పాత్రను పోషిస్తోంది. 

- అసెంబ్లీ సమావేశాలకు మంచి రోజు చూస్తున్నారు ! 
- ప్రభుత్వ భవనాల శంకుస్థాపనలకు కూడా వాస్తు చూస్తున్నారు !
- కొబ్బరికాయ కొట్టి నౌకలను నీళ్లలోకి వదులుతున్నారు !
- జలాశయాలకు 'తాంబూలాలు' సమర్పిస్తున్నారు !
 - ప్రభుత్వ కార్యక్రమాలు మొదలు పెట్టేటపుడు నేపథ్యంలో మతపరమైన శ్లోకాలు వినిపిస్తున్నారు !

ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి???
రాజ్యాంగానికి మాత్రమే కట్టుబడి ఉండాల్సిన కోర్టుల ప్రాంగణాలలో సైతం తప్పనిసరిగా గుడి కనిపిస్తోంది.

మన రాజకీయ 'భార్య' తన ధార్మిక 'భర్త' వేసిన సంకెళ్ల నుండి ఎప్పుడు విముక్తి చెంది మన దేశాన్ని నిజమైన లౌకిక రాజ్యంగా మారుస్తుందా అని ఎదురు చూడడం తప్ప మనం చేయగలిగిందేమీ కనబడడం లేదు.

 బెంగుళూరు మిర్రర్‌, 29 ఆగస్టు 2016
అనువాదం : రమాసుందరి
.......................................................................................................................................

కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని,   ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,    కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి


230 పేజీలు  , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌