
ది ఫౌండేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ వారు వెలువరించిన డ్రగ్ సప్లై అండ్ యూజ్- టువర్డ్స్ ఎ రేషనల్ పాలసీ ఇన్ ఇండియా అనే అధ్యయన పత్రానికి తెలుగు అనువాదం ఇది. ముందుమాట, మూడు భాగాలు కలిపి వంద పేజీల పుస్తకం.
భారత దేశంలో మందుల విషాదం అనే మొదటి భాగంలో మందుల తయారీ వినిమయం, వినియోగం, ప్రభుత్వ అ లసత్వం ప్రజల జీవితాలతో కంపెనీల చెలగాటం, అనవసర మందుల వాడకం, డాక్టర్ల అజ్ఞానం, రోగుల అజ్ఞానం, పేదరికం, నిస్సహాయత ... వగైరా ఎన్నో వివరాలతో సహా ఈ భాగంలో చాలా విలువైన సమాచారం వుంది. ఆయుర్వేదం పేరుతో మోసాలు, క్రాస్ ప్రాక్టీసింగ్ (ఎలాంటి అర్హతలు లేకున్నా) రెండు వైద్య విధానాలతో చికిత్స చేసే డాక్టర్లు వైద్యం చేయడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. హేతు విరుద్ధమైన మందుల తయారీ ద్వారా వనరులు ఎలా వృధా అవుతున్నాయో తెలుస్తుంది. వి.పి.ఫోర్టే కేసు వివరాలు చదివితే పసలేని భారతీయ మందుల పర్యవేక్షణా నియంత్రణా విధానాల నీడలో లాభాలే ద్యేయమైన మందుల కంపెనీల ప్రజాద్రోహ వైఖరులు తెలుస్తాయి. న్యాయవ్యవస్థ వాటికి ఎలా సహకరిస్తోందో అవగతమవుతుంది. కొండను ముక్కుతో రుద్దే పోరాటాన్ని ప్రజాసంఘాలు ఎలా నిర్వహించాయో కూడా బోధపడుతుంది.
రెండో భాగంలో సతారా జిల్లా (మహారాష్ట్ర)లోని మందుల సరఫరా వినియోగం తాలూకు అధ్యయన వివరాలున్నాయి. ఎంతో శ్రమకోర్చి రచయిత డాక్టర్ల ప్రిస్కిప్షన్లను సేకరించి విశ్లేషించినందుకు అభినందించాలి.
మూడో భాగంలో వాడకూడని మందుల తాలూకు జాబితాలు, వివరాలు, వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలు, నిషేధించిన మందుల వివరాలు ఉన్నాయి. చివరగా రోగులు, సమాజ సేవా తత్పరులు ఏం చేయాలో సూచించారు.
ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు తమ సామాజిక నిబద్ధతనూ, సేవా దృక్పథాన్నీ చాటుకున్నారు. ప్రభుత్వ వైద్య సేవా విభాగాల వారు, ఆరోగ్య కేంద్రాల్లోనూ, ఆస్పత్రుల్లోనూ వుండే మెడికల్, పారా మెడికల్ సిబ్బంది దీన్ని చదివితే మంచిది. అధ్యయన శిబిరాలు పెట్టి బోధించాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే నిరక్షరాస్యులు, పేదవారు, గ్రామీణులు దీన్ని చదవలేరు కదా! మన దేశంలో ఏటా 50 లక్షల మంది అతిసార వ్యాదితోనే చనిపోతున్నారు. ఏటా 40 వేల మంది పిల్లలు విటమిన్-ఏ లోపంతో బాధపడుతున్నారు. ఇందువల్ల వారు అంధులవుతున్నారు. పౌష్టికాహారం అందుబాటులో సరైన విద్య కావాలి.
మనదేశ వనరులు కొరగాని మంచుకొండల కోసం కరిగిపోతున్నాయి. దేశ రక్షణ, సమగ్రత కోసం ప్రజల్ని పావులుగా వాడుకుంటూ, పేద సైనికుల్ని బలిపెడుతూ, మధ్యతరగతి మిధ్యా (దేశభక్తి) వేషాల మంటల్లో చలికాచుకునే నేతలు, అదే దేశభక్తి ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం వంటి సామాజిక న్యాయాల కోసం పాటుపడరు. రాజకీయ నాయకులకు అధికార దాహమే కాని, ప్రజల మనుగడ అక్కర్లేదు. సామాజిక స్పృహ మాటెలా వున్నా వైయక్తిక ప్రయోజనాల కోసమైనా దీన్ని చదవవచ్చు. ... నిశితంగా చదవాల్సిన, చదివించాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని చదివించేది కాలక్షేపం కోసం ఎంతమాత్రం కాదని గ్రహించాలి. సామాజిక బాధ్యత, ప్రయోజనాలను గుర్తుకు తెచ్చుకోవడానికే అన్న విషయం తెలుసుకోవాలి.
- కస్తూరి (ఆదివారం ఆంధ్రజ్యోతి 19-12-2008)
భారతదేశంలో మదుల విషాదం
సరైన మందుల విధానం కోసం
- అనంత ఫడ్కే
ఆంగ్ల మూలం : Drug Supply and Use: Towards a Rational Policy in India. Dr.Anan Phadke, sage, New Delhi, 1998 copyright The Foundation for Research in Community Health,1998
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
96 పేజీలు, వెల: రూ.25
No comments:
Post a Comment