Wednesday, November 5, 2008

అయ్యంకాళి (1863-1941) ... ఒక దళిత యోధుని సమరగాథ - మూలం: చెందరాశేరి, తెలుగు కూర్పు: అ ల్లం నారాయణ


అయ్యంకాళి మన దేశంలో జరిగిన మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సమ్మెకు నాయకత్వం వహించిన దళిత నేత.

విశేషం ఏమిటంటే ఆ సమ్మె కూలీ రేట్లు పెంచమని డిమాండ్‌ చేస్తూ చేసిందికాదు. అణగదొక్కబడుతున్న దళితుల పిల్లలను పాఠశాలల్లో చేర్చుకోవాలన్న డిమాండ్‌తో చేసింది!

నిరక్షరాస్యుడైన అయ్యంకాళి తన జాతి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక పోరాటాలు చేశాడు.
పురవీధుల్లో, రహదారుల్లో అంటరానివాళ్లు నడవటానికి కూడా వీల్లేదని నిషేధించిన ఆ కాలంలో తాను ముందుండి దళితులందరినీ ముందుకు నడిపించి, ఉద్యమించి విజయం సాధించాడు.

ఆరోజుల్లో కేరళలో అంటరాని కులాల స్త్రీలు రవికెలు వేసుకోడానికి వీల్లేదు.
వక్షస్థలం కప్పుకోడానికి వాళ్లు పూసలదండలు మాత్రమే వేసుకోవాలి.
అట్లాంటి దుర్మార్గపు ఆంక్షలను రూపుమాపడానికి అయ్యంకాళి మరో ఉద్యమం నిర్వహించాడు.
దళిత స్త్రీలను చైతన్యపరచి వేలాది మందితో సమావేశం నిర్వహించి వారంతా ఆ దుస్సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ పూసలదండలను తెంపి వేసి రవికెలు ధరించేలా చేశాడు. దళిత స్త్రీలు రవికెలు వేసుకున్నా సహించలేని సవర్ణులు వారిమీద దాడి చేస్తే స్త్రీలంతా ఉవ్వెత్తున వారిపై ఎదురుదాడి చేసి తరిమికొట్టారు.

అయ్యంకాళి జీవితమంతా ఇట్లాంటి పోరాటాల సమాహారమే.
కేరళలో అది పోరాటాల యుగంగా చెప్పుకోవచ్చు.
శ్రీనారాయణగురు కూడా తలపెట్టని మార్పును అయ్యంకాళి తీసుకువచ్చాడు.
1924లో జరిగిన వైకోం సత్యాగ్రహం గురించి మనకు చెప్పారు. కానీ 1907లోనే దళితుల దేవాలయ ప్రవేశం కోసం అయ్యంకాళి చేసిన పోరాటం గురించి ఎవరూ చెప్పలేదంటే అంటరానివారికి చరిత్రకారులు కూడా ఎంత అన్యాయం చేసారో తెలుస్తుంది.
అంటరానితనం, వివక్ష, అడుగడుగునా అణచివేత, స్వేచ్ఛారాహిత్యం రాజ్యమేలుతున్న రోజుల్లో ఒక చదువురాని, పేద అట్టడుగు స్థాయినుంచి వచ్చిన నిమ్నకులస్తుడు భూస్వామ్య వ్యవస్థకు, అగ్రవర్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి నిలబడగలగడం సామాన్యమైన విషయం కాదు.

అయ్యంకాళి జీవితం ఒక మహాకావ్యం.
ఉద్విగ్న భరిత పోరాటం.
ఉత్తేజకరమైన సందేశం.
హక్కులు సాధించుకోవటానికి ఒక ఆయుధం.


అయ్యంకాళి (1863-1940)
ఒక దళిత యేధుని సమరగాథ

మూలం: చెందరాశేరి
తెలుగు కూర్పు: అ ల్లం నారాయణ

84 పేజీలు, వెల: రూ.20

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌