Saturday, November 8, 2008

సంగతి ... దళిత స్త్రీల వేదనల, ఆలోచనల సమాహారం ... రచన: బామ



పురుషాధిక్య సమాజంలో అణచివేతకు గురవుతున్న స్త్రీల, ప్రత్యేకించి దళిత మహిళల జీవితాలను, వారి కష్టాలూ కన్నీళ్లూ ఉల్లాసాలూ ఉద్వేగాలను, వారి అస్తిత్వ పోరాటాలను, మానసిక సంఘర్షణలను ప్రతిబింబించే ఈ పుస్తకం విలక్షణమైన భాషా నుడికారాలతో పాఠకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తుంది.

రచయిత్రి బామ మాటల్లోనే చెప్పాలంటే...

మనం ఇష్టపడ్డా, ఇష్టపడకపోయినా చాలా సంగతులు మన చెవుల్ని కొరుకుతుంటాయి. కొన్నింటిని ఆసక్తిగా, జాగ్రత్తగా వింటాం. మరికొన్నింటిని గాలికొదిలేస్తాం. పురుషాధిక్య సమాజంలో దళిత మహిళల సమస్యలకు సబంధించిన, అణచివేతకు గురవుతున్న వారి హక్కులకు సంబంధించిన సంగతులు మనందరికీ తెలిసినవే. కులదురహంకారం వల్ల అణచివేతకు గురవుతున్న చాలామంది ఆడవాళ్లు దారుణంగా తొక్కివేయబడుతున్న దళిత స్త్రీల సంగతులను మరింత అడుక్కు తొక్కేసి మరచిపోతుంటారు.

ఈ పుస్తకంలో దళిత స్త్రీల ఏడుపులూ కష్టాలే కాక వారి ఆనందాలు, హాస్యాలు, పరాచికాలు, కొట్లాటలు, సంస్కృతిని కూడా ఆవిష్కరించడం జరిగింది.

భారమైన రోజువారీ జీవితంతో సతమతమవుతూ, ఏటికి ఎదురీదుతూ కూడా దళిత స్త్రీలు ఆత్మ స్థైర్యాన్ని కూడగట్టుకుంటూ దుర్భరమైన సమస్యలను సైతం సెన్సాఫ్‌ హ్యూమర్‌తో ఎదుర్కొంటుంటారు.
వారి ఆత్మ విశ్వాసం, ఆత్మాభిమానం, నిజాయితీగా, సహజంగా బతకాలనే వారి కోరిక, వారి శ్రమైక జీవన సౌందర్యం మొదలైన వాటిని లోకానికి చాటాలన్న ప్రగాఢమైన కాంక్షకు ప్రతిరూపమే ఈ పుస్తకం.

ప్రత్యేకించి దళిత స్త్రీలు తమ జీవితాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని చదివి మరింత ఉత్తేజం పొంది నూతన సమాజ నిర్మాణానికి కృషిచేస్తారనీ, దళిత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారన్న ఆశతో, నమ్మకంతో ఈ సంగతి మీ ముందుకొచ్చింది.

సంగతి (నవల)
- బామ
తమిళ మూలం : సముదాయ చిందనై, మధురై, తమిళనాడు.

తెలుగు అనువాదం : జూపాక సుభద్ర
ముఖచిత్రం: కాళ్ల

82 పేజీలు, రూ.25

1 comment:

  1. ఈ అనువాదం జూపాక సుభద్రగారు చేశారా! కొన్ని సార్లు రచన గుర్తుండిపోతుంది. కానీ అనువాదకుల్ని మర్చిపోతాం. బామ అన్న పేరే నా బుర్రలో ఉండిపోయింది. సుభద్రగారికి అభినందనలు. బామను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చదువుతున్నారని విన్నాను.

    -రవి

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌