Thursday, October 30, 2008

చూపులేని పిల్లలకు సహాయం ... దృష్టి సమస్యలు గల పిల్లలకు కుటుంబ, సమాజ మద్దతు



హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ వారు గతంలో రూపొందించిన ... వైద్యుడు లేని చోట (వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌), మనకు డాక్టర్‌ లేని చోట ... ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం ( వేర్‌ వుమెన్‌ హావ్‌ నో డాక్టర్‌) ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. దృష్టి సమస్యలు గల పిల్లలకు కుటుంబ, సమాజ మద్దతును సమీకరించే కృషిలో భాగంగా సామాజిక నిబద్ధతతో వారు వెలువరించిన మరో విశిష్ట పుస్తకమే ఇది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం అంధత్వానికి, దృష్టి సమస్యలకు దారిద్య్రమే మూలకారణం. అంటే అత్యధిక శాతం అంధత్వం నివారించసాధ్యమైనదే. ప్రపంచ వ్యాప్తంగా దారిద్య్ర నిర్మూలన, ఆరోగ్య చికిత్సా సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా చాలా వరకు అంధత్వాన్ని తగ్గించడం, నివారించడం సాధ్యమవుతుంది. అందువల్ల అంధత్వాన్ని ఒక సామాజిక అంశంగా పరిగణించాలి. అంధ బాలలు ఎవరో కాదు. మన పిల్లలే. మన భవిష్యత్తు, మన సమాజ భవిష్యత్తు వారిపై ఎంతగానో ఆధారపడివుంటుంది.

దృష్టి లోపం కలిగి బాగా చూడలేని పిల్లల, తల్లితండ్రుల, సంరక్షకుల అవగాహనను పెంపొందించడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇది కేవలం వారి బాధ్యత మాత్రమే కాకూడదు. తమ పిల్లల అవసరాలు, మంచి చెడ్డలు చూసుకొనే విషయంలో అంధత్వాన్ని ఒక సామాజిక అంశంగా పరిగణించడం వల్ల దృష్టిలోపం కలిగిన పిల్లల తల్లితండ్రుల భారాన్ని కొంతమేరకు తగ్గించేందుకు వీలేర్పడుతుంది. అంధ బాలలకు మన ప్రేమ, సంరక్షణ, శ్రద్ధ మరింత ఎక్కువగా కావాలి. వారిని అభివృద్ధిపరచి, ప్రగతిపథంవైపు నడిచే విధంగా కృషి చేసేనట్లయితే అందరి జీవితాలు, మొత్తం సమాజ స్థితి మెరుగుపడుతుంది.

మెరుగైన విద్యా విధానం, ఆరోగ్య సంరక్షణ, భద్రమైన రహదారులు, పరిసరాలు, సంక్షేమ కార్యక్రమాలు మొదలైన వాటిలో ప్రజలు, సమాజం పెద్ద ఎత్తున మమేకమై కృషి చేసినట్టయితే ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుంది. మీరు మీ స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి వుండటం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ద్వారా ఒక మెరుగైన సమాజాన్ని, సామాజిక న్యాయం, మానవత్వం కలిగిన ప్రపంచాన్ని సృష్టించేందుకు దోహదపడగలుగుతారు.

ఈ పుస్తకంలో సూచించిన అంశాలు తల్లితండ్రులకు, సంరక్షకులకు, ఉపాధ్యాయులకు, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవారికి, పునరావాస కార్యకర్తలకు, ఇతరులకు ఎంతగానో తోడ్పడతాయి. దృష్టి సమస్యలు గల పిల్లలలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ప్రగతిపథంలో ఆత్మవిశ్వాసంతో నడిపించేందుకు దోహదపడతాయి.

చూపులేని పిల్లలకు సహాయం
దృష్టి సమస్యలు గల పిల్లలకు కుటుంబం మరియు సమాజం యొక్క మద్దతు
- శాండీ నీమన్‌, నమిత జాకబ్‌
ఆంగ్ల మూలం: Helping Children Who Are Blind, Hesperian Foundation,USA
తెలుగు : రాణి
188 పేజీలు, వెల: రూ.130

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌