Sunday, November 2, 2008

వెలకట్టలేని విలువైన పుస్తకం ... మనకు డాక్టర్‌ లేని చోట ... ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం


గుంటూరులో డాక్టర్‌ కోదండ రామయ్య గారి హాస్పిటల్‌ వరండాలో నా మూడేళ్ల కొడుకు చందూని వళ్లో పెట్టుకుని కూర్చున్నా. డిగ్రీ పరీక్షలు రాశానప్పుడే.
ఆ థైరాయిడ్‌ పేషంట్‌ని తీసుకురమ్మని డాక్టర్‌గారు పిలిచారంటూ నర్స్‌ వచ్చి చెప్పింది.
నాకు అర్థం కాలేదు.
మా అబ్బాయికి జబ్బు కాదు. నేను ఓ బంధువు అనారోగ్యంగా వుంటే చూడ్డానికి వచ్చాను అంతే అని చెప్పాను.
అయినా ఆవిడ వినకుండా వీడికి జబ్బుందని డాక్టర్‌గారు రమ్మంటున్నారని నన్ను లోనికి లాక్కెళ్లింది.
నేను పిల్లవాడిని డాక్టర్‌ ఎదురుగా కూర్చోబెట్టి తెల్లమొహం వేసుకుని నిలబడ్డాను. వాడిని పరీక్ష చేశాక డాక్టర్‌ నా వయసు, చదువు గురించి అడిగారు.
వాడు పొట్టిగా వున్నాడు ఎందుకు చూసుకోలేదు, వాడి జుట్టు వూడిపోతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదు, వాడు తెల్లగా పాలిపోయి నీరసంగా వున్నా తెలుసుకోలేని మొద్దువి నువ్వేం తల్లివి అన్నారాయన.

వాడిని కన్నప్పుడు నా వయసు పదిహేడేళ్లు!
ఆస్పత్రికి తీసుకుపోయే స్థోమతలేక, నాటు మంత్రసాని చికిత్సలతో నేను చచ్చిబతికాను. కనేముందు వరకూ వంటలొండుతూ, గొడ్డు చాకిరీ చేసే కోడళ్లున్న పల్లెటూరి ఇంటి గృహిణిని నేను. అక్కడ స్త్రీల ఆరోగ్యం గురించి, పిల్లల ఆరోగ్యం గురించిన ఆలోచనలేలేవు.
పిల్లవాడు ఏడిస్తే ఓదార్చడం చాతకాక, ఇద్దరం ఏడుస్తూ వుండేవాళ్లం.
వాడికి జబ్బని నాకు తెలియలేదని డాక్టర్‌గారికి చెప్పాను.
వాడికి థైరాయిడ్‌ పెరగడం లేదనీ, ఎప్పటికీ వాడు ఆ మూడడుగుల ఎత్తే వుంటాడనీ, వాడు బతికినా నీకే కష్టమనీ, అయినా మందులు వాడి చూడమన్నారు డాక్టర్‌ గారు.
నాలాటి పనికిమాలిన తల్లులకు పిల్లలెందుకుంటారో అని విచారపడ్డారు. అప్పటినుంచి పిల్లవాడికి పదేళ్లపాటు తనే ట్రీట్‌మెంట్‌ యిచ్చారు.
వాడిని కిందకు దించాలన్నా నాకు భయం వేసేది. ఆ పదేళ్ల కాలం నేను అనుభవించిన క్షోభ వర్ణనాతీతం.
ఇప్పుడు వాడు బ్యాంకు ఉద్యోగి.

మా పల్లెలో మరీ ముంచుకొస్తే తప్ప ఆడవాళ్లు ముందుగా ఆస్పత్రికి పోవటం నేనెరుగను. లోపలవచ్చే జబ్బులగురించి చెప్పుకోవటం కూడా సిగ్గే.
సంపాదించి పోషించే మగాళ్లకి తలనొప్పివచ్చినా ఇంట్లో పెద్ద హడావిడిగా వుంటుంది. కానీ ఆడవాళ్ల విషయంలో వాళ్లకే కాదు, అసలు ఎవరికీ పట్టింపు వుండనే వుండదక్కడ.

వైద్యుడులేని చోట ... అనే పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ గీత పంపారు. ఆ పుస్తకాన్ని నేను అపురూపంగా అందుకున్నాను. ఇంక మా ఊళ్లో ఆడవాళ్లకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఆ పుస్తకం తిరగేసి కారణాలు వెతికేవాళ్లం. పోనీ అవన్నీ పాతరోజులనుకుందాం. మొన్నీ మధ్య హైదరాబాద్‌లోని జీడిమెట్ల దగ్గర్లో ఓ స్లమ్‌ ఏరియాలో స్త్రీల ఆరోగ్యం గురించి జరిగిన ఒక వర్క్‌ షాప్‌కి వెళ్లాను. మాటల సందర్భంలో అక్కడ అందరికీ ఐదారుగురికి తక్కువకాకుండా పిల్లలున్నట్టు తెలిసింది. దాదాపు అందరికీ ఇన్‌ఫెక్షన్‌ వుందని చెప్పారు. గంటల తరబడి ప్రశ్నలడిగిన తరువాత తేలిందేమంటే వాళ్లు బైటవున్నప్పుడు బట్ట మార్చుకోరు, శుభ్రత పాటించరు. ఎందుకు? నీళ్లు లేవు కాబట్టి! కష్టపడి మోసుకొచ్చే నీళ్లు మగవాళ్ల స్నానానికి, ఇంటి పనులకు సరిపోతే వీళ్లవరకు వచ్చేసరికి ఓపికలేక సరిపెట్టుకుంటారు. జబ్బులకు మూలం అది.

మీటింగులొద్దు, ఉపన్యాసాలొద్దు ముందు అందరికీ నీళ్లిమ్మని ముఖ్యమంత్రిని ఎవరడుగుతారు? ఇంటినంతా చక్కదిద్దే ఆడవాళ్లకి తమ గురించిన శ్రద్ధ లేకపోవడం గురించి, వాళ్లపట్ల ఇంట్లోవాళ్లకి బాధ్యత లేకపోవడం గురించి ఎంతగా చెపితే అర్థమవుతుంది?
ఈ ఆలోచనలకు, చర్చలకు ఇది సమయం కాదని, ఇదిగో పరిష్కారం అంటూ వచ్చింది ... మనకు డాక్టర్‌ లేని చోట ... పుస్తకం. ఈ పుస్తకం కొని చదవటం కాదు, ఎందరిచేతో చదివించాలి. మారుమూల పల్లెలకు వెళ్లాలి.

ఐదొందలకు పైగా పేజీలున్న ఈ పుస్తకంలో, సులభంగా అర్థం చేసుకొనేందుకు వీలుగా వందలాది బొమ్మలున్నాయి. స్త్రీల శరీరంలో వచ్చే మార్పుల గురించి, జబ్బుల గురించి, జాగ్రత్తల గురించి వివరిస్తుందీ పుస్తకం. వొట్టి వైద్యం గురించే కాదు సామాజికంగా ఆర్థికంగా స్త్రీల పరిస్థితి ఏమిటో చెపుతుంది. స్త్రీలకు వచ్చే జబ్బులకూ వాటికీ వున్న సంబంధాన్ని బయటపెడుతుంది. స్త్రీలు సమూహంగా ఏం చేయవచ్చో సలహాలు ఇస్తుంది. ఇలాటి పుస్తకాలు ఇంకా రావాలి. వయోజన విద్యా కేంద్రాల్లో, గ్రామీణ గ్రంథాలయాల్లో ఈ పుస్తకం వుంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.

- సి. సుజాత (ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రిక-20-8-1999)

మనకు డాక్టర్‌ లేని చోట
ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం
- ఎ.ఆగస్ట్‌ బర్న్స్‌, రాని లోవిచ్‌, జేన్‌ మాక్స్‌వెల్‌, క్యాథరిన్‌ షాపీరో

ఆంగ్ల మూలం: Where Women Have No Doctor, Hesperian Foundation, USA

తెలుగు అనువాదం : డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి

582 పేజీలు, సాదా ప్రతి వెల: రూ.220, మేలుప్రతి: రూ.300

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌