Friday, November 21, 2008

మన తత్వం ... దళిత బహుజన తాత్వికత ... కంచ ఐలయ్య



నేను హిందువు నెట్లయిత? (వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ?) అనే పుస్తకంద్వారా భారత దేశంలోని అసమానతలకు అణచివేతకు, దోపిడీకి... ముఖ్యంగా కులం, వర్గం ప్రాతిపదికగా జరిగే దోపిడీకి పరిష్కారం దళితీకరణలోనే వుందని ప్రతిపాదించి దేశవ్యాప్త చర్చకు తెరలేపారు కంచ ఐలయ్య.

ఆ చర్చకు కొసాగింపుగా అసలు దళితీకరణ అంటే ఏమిటి, దానిని సాధించడానికి ఏం చేయాలి అనే మౌలిక ప్రశ్నలకు సమాధానంగా దళిత బహుజన తాత్వికతను వివరిస్తూ ఆయనే రాసిన పలు వ్యాసాల సంకలనమే ఈ మనతత్వం.

మన సమాజంలో రెండు తత్వాలున్నాయనీ ఒకటి దళిత బహుజన తత్వం కాగా రెండవది బ్రాహ్మణీయ తత్వ మనీ మొదటిది అణచివేతకూ, దోపిడీకికీ, పతనానికీ లోనైన మెజారిటీ ప్రజల తత్వమైతే ...రెండవది ఆదిపత్యం, అణచివేత, దోపిడీ, రాపిడీలను కొనాగిస్తూ పబ్బం గడుపుకునే మైనారిటీ ప్రజల తత్వమని అంటారాయన.

ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధంలో 28 వారాలపాటు వెలువడిన ఈ వ్యాసాలు అచ్చవుతున్న రోజుల్లోనే పెద్ద దుమారాన్ని లేపాయి.

ఈ దేశంలో బ్రిటిష్‌ పాలనా కాలంలో విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాక దళిత బహుజన తాత్వికతను రాసిన అగ్ర కుల ఉపాధ్యాయులు ఎవరూ లేరు. విద్యను ఉత్పత్తి పనితో, ఉత్పత్తి కుల జీవన విధానంతో ముడేసి నేర్పాలని అగ్రకుల మేధావులెవరూ భావించలేదు. మన విద్య అంతా బ్రాహ్మణవాద సాహిత్యంతో నిండుకొని వుంది. అది ఉత్పత్తి కులాల వారిని చాలా అవమానాలకు గురిచేసింది. బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌, పెరియార్‌ ఇ.వి. రామస్వామి నాయకర్‌ వంటి తత్వవేత్తలు రాసిన రచనలకు నిన్నమొన్నటి వరకు విశ్వవిద్యాలయాల్లో స్థానం వుండేదికాదు. ఇప్పుడిప్పుడే వారి తాత్వికతకు కొంత చోటు లభిస్తోంది. వారి దారిలో నడుస్తూనే తను ఈ వ్యాసాలు రాసినట్టు ఆయన చెబుతారు.

ఇందులోని అధ్యాయాలు: 1. మనతత్వం: ఆధ్యాత్మిక భౌతికవాదం - భౌతిక ఆధ్యాత్మిక వాదం, 2. మన చరిత్ర తత్వం 3. మన ఆస్తి తత్వం 4. మన రాజ్య తత్వం 5. మన చట్ట తత్వం.

మన పాట

చేప పిల్లల కోడి పిల్లల
గొర్రె పిల్లల జింక పిల్లల
కాయగడ్డల ఆకుకూరల
పండు ఫలముల పాలుపెరుగుల
తిండి తత్వం నేర్పినోళ్లం !

రాళ్లు రాకి నిప్పు జేసి
చర్మ మొలిచి తోలు జేసి
మట్టి పిసికి కుండ జేసి
నూలు వడికి బట్ట నేసి
ప్రాణ రక్షణ జేసినోళ్లం !

ఆవులకు ఈన నేర్పి
కోడెలకు దున్న నేర్పి
బంజర్లకు పంట నేర్పి
తాడిచెట్లకు పార నేర్పి
వ్యవసాయం చేసినోళ్లం !

ఆటపాటల ఆనందం
పూలతోటల అందచందం
వర్రె వాగుల నీటి బంధం
చెట్టు చేమల స్నేహ బంధం
ఉగ్గుపాలతో నేర్చినోళ్లం !

అండ పిండాల అనుబంధం
పశుపక్షుల జీవబంధం
తల్లిపిల్లల ప్రేమబంధం
సాలు సాలుకు సంబంధం
తత్వరీతులు తెలిసినోళ్లం !!




మన తత్వం
(దళిత బహుజన తాత్వికత)

- కంచ ఐలయ్య

64 పేజీలు, వెల: రూ.15

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌