
బౌద్ధ మతం ఆవిర్భవించిన కాలం నుండీ, వలసవాద సంక్షోభ కాలంలో పునరుజ్జీవనం పొందిన కాలం దాకా అది పీడితుల పక్షాన నిలబడే మతంగానే వుంది.
బుద్ధుడి వ్యక్తిత్వమూ, ఉపదేశమూ కూడా మానవ సంబంధాల్లోని ద్వంద్వ ప్రవృత్తినీ, అసమానతలనూ వ్యతిరేకించేవే.
వర్ణ ధర్మానికీ, కులభేదాలకూ వ్యతిరేకంగా బుద్ధుడు చేసిన తిరుగుబాటు విప్లవాత్మకమైనది. ఆయన హేతువాదిగా నిలిచి పూజారివర్గాన్నీ, మూఢ సంప్రదాయాలనూ నిరసించాడు. నైతిక విషయాల్లో స్పష్టతనూ, ఆలోచనల్లో, ఆచరణలో పారదర్శకతనూ, పీడితుల పక్షాన నిలబడాల్సిన అవసరాన్నీ ఉపదేశించాడు. బౌద్ధంలోని ఈ ఆధిపత్య వ్యతిరేక స్వభావం వల్ల అది నిమ్న కులాలను ఆకర్షించగలగింది.
..... ..... ....
బౌద్ధ ధర్మాన్ని పీడితకులాల విముక్తి సిద్ధాంతంగా అంగీకరిస్తూ 1956లో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆధ్వర్యలో వేలాది మంది దళితులు బౌద్ధాన్ని స్వీకరించటం మనకు తెలుసు.
కానీ అంతకన్నా అర్థశతాబ్దం ముందుగానే తమిళనాడులో పరయాలు నిర్మించిన సఖ్య బౌద్ధ ఉద్యమాన్ని గురించి చరిత్రలో లభిస్తున్న వివరాలు చాలా తక్కువ, ఆ ఉద్యమ నిర్మాత పండిత అయోతీదాస్ (1845-1914) సామాజిక, సాహిత్య రంగాల్లో చేసిన అద్భుతమైన కృషి కూడా ప్రధాన స్రవంతి చరిత్రకారుల దృష్టిని అంతగా ఆకర్షించలేదు.
పరయాల బౌద్ధ ఉద్యమాన్ని మత మార్పిడిగా అయోతీదాస్ ఎంత మాత్రమూ అంగీకరించడు. అది కేవలం మరుగున పడిన పరయాల ఆస్తిత్వాన్ని తిరిగి ప్రకటించటమేనని ఆయన వాదన. పీడిత జాతుల విముక్తి పోరాటాలెప్పుడూ వాళ్ల అస్తిత్వపు పునాదిపై నిలబడి చెయ్యాలేతప్ప ఆధిపత్య మతాల్లోకి శరణార్థులుగా వెళ్లటం ద్వారా కాదని చెప్పిన విలక్షణమైన తత్వవేత్త పండిత అయోతీదాస్.
ఆయన తదనంతర కాలంలో పెరియార్, అంబేడ్కర్‌లు నడిపిన ఉద్యమాలకు సఖ్య బౌద్ధఉద్యమం స్ఫూర్తిదాయకంగా పనిచేసింది. పరయాల విముక్తిపోరాటంగా ప్రారంభమై, సమగ్రమైన కులనిర్మూలనా దృక్పథంతో విస్తరించిన ప్రజా ఉద్యమం సఖ్య బౌద్ధం.
ఆ ఉద్యమాన్నీ, ఉద్యమ నిర్మాత పండిత అయోతీదాస్‌నూ ఈ పుస్తకం మనకు సంక్షిప్తంగా పరిచయం చేస్తుంది.
తమిళ బౌద్ధ - దళిత ఉద్యమ నిర్మాత
పండిత అయోతీదాస్
-జి. ఎలోసియస్, వి.గీత, ఎస్.వి.రాజాదురై
ఆంగ్ల మూలం: రెలిజియన్ యాజ్ ఎమాన్సిపేటరీ ఐనండెంటిటీ- జి. ఎలోసియస్; టువర్డ్స్ ఎ నాన్ బ్రాహ్మిన్ మిలీనియం - వి.గీత, ఎస్.వి.రాజాదురై.
తెలుగు కూర్పు : కాత్యాయని
48 పేజీలు, వెల: రూ.15
No comments:
Post a Comment