ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి (ఆదిమకాలం నుండి భూస్వామ్య దశ వరకు) దామోదర్ ధర్మానంద్ కొశాంబి (1907-1966) చూపించిన చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ పుస్తకం.
మన చరిత్రకారులలో ఆధునిక దృక్పథం గల వారందరూ కోశాంబిని ఆద్యునిగా భావిస్తారు. చరిత్ర పరిశోధనా పద్ధతిలోనూ, సిద్ధాంత దృక్పథంలోనూ శాస్త్రీయ ప్రమాణాలను నెలకొల్పిన వ్యక్తిగానే గాక, వలసత్వం, శృతిమించిన దేశభక్తి, సంప్రదాయకత, అగ్రవర్ణ ఆధిక్యత, విశృంఖలమైన ఊహాతత్పరత మొదలైన అనేక అవలక్షణాల నుండి మన దేశ చరిత్రను రక్షించిన వ్యక్తిగా ఆయనను గౌరవిస్తారు.
ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి, ఆ ఉత్పత్తిపై ఆదారపడిన స్థిర వ్యవసాయ గ్రామాల ఆవిర్భావం, దాని నుండి భూస్వామ్య వ్యవస్థకు పునాది ఏర్పడడం అనే ఆర్థిక క్రమం మన ప్రాచీన చరిత్రకు మూలం అని కోశాంబి భావించాడు. ఆ చోదక క్రమాన్ని మన దేశ నైసర్గిక స్వభావానికి జోడించి సామాజిక, సాంస్కృతికరంగాలను విశ్లేషించాడు. పురావస్తు ఆధారాలను పట్టించుకోకుండా కేవలం ప్రాచీన సాహిత్యాన్ని ఆధారం చేసుకుని ఊహాగానాలు చేసే చరిత్రకారులను కోశాంబి విమర్శిస్తాడు.
శాస్త్రీయంగా ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయదల్చుకున్న ఎవ్వరైనా కోశాంబి ప్రతిపాదించిన భౌతిక చోదక క్రమాన్ని ప్రాతిపదికగా తీసుకోక తప్పదు.
ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. పద్ధతి - సిద్ధాంతం
2. ఆహార సేకరణ - ఆహార ఉత్పత్తి
3. సింధూ నాగరికత - ఆర్యులు
4. వ్యవసాయక వర్గ సమాజం - వర్ణ వ్యవస్థ
5. మహాభారతం - బుద్ధుడు
6. ఉత్తరాపథం - దక్షిణాపథం
7. వ్యవసాయ విస్తరణ - స్వయంపోషక గ్రామాలు
8. సామంతస్వామ్యం - గ్రామీణ భూస్వామ్యం
ముందుమాటలో రచయిత రాసిన చివరిమాట:
... నా మాటకొస్తే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. కోశాంబి భగవద్గీత మీద రాసిన వ్యాసాన్ని 1976లో మొట్టమొదటిసారి చదివి నేను మార్క్సిస్టునయ్యాను. ఆ రుణం ఈ రూపంలో తీర్చుకొవాలన్న కోరిక కలిగి మూడేళ్లయింది. ఇప్పటికి తీరింది.
ప్రాచీన భారతదేశ చరిత్ర
డి.డి.కోశాంబి పరిచయం
- కె. బాలగోపాల్
ప్రథమ ముద్రణ: 1986
పునర్ముద్రణలు: 1992, 1995, 2000, 2007
150 పేజీలు, వెల: రూ.32
No comments:
Post a Comment