అడవి తల్లి
సి.కె.జాను అసంపూర్తి ఆత్మకథ
ప్రపంచంలోని పది ఉత్తమ సందర్శనీయ స్థలాలలో ఒకటిగా ప్రచారం పొంది, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి ప్రదేశంగా ప్రస్తుతించబడి, ప్రజల కనీస జీవన ప్రమాణాలను - అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా సాధించిన రాష్ట్రంగా ప్రశంసలు పొందిన కేరళ రాష్ట్రం అభివృద్ధి పథంలో శరవేగంతో దూసుకుపోతోందని అందరూ అనుకోవచ్చు. ప్రజల జీవన నాణ్యతను గణనీయంగా పెంచిన ఘనత ప్రభుత్వ విధానాలకూ, నాయకుల భవిష్యదృష్టికీ చెందవచ్చు. కేరళ పౌర సమాజంలో ఎక్కువగా చర్చలూ, వాద వివాదాలూ జరుగుతూ వుంటాయి. వాటికి ఆ సమాజం విలువ యిస్తుంది. అయితే, ఇవేవీ సమాజపు అంచులలో నివసిస్తున్న గిరిజనులని మాత్రం స్పృశించలేదు.
కేరళలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1975లో భూమిలేని గిరిజనుల శాతం 57 కాగా, 1976 కల్లా అది 61 శాతానికి పెరిగింది. గిరిజనులు ఎంత వేగంగా తమ భూములను కోల్పోతున్నారో ఈ లెక్కల్ని బట్టి గ్రహించవచ్చు. 1957లో కమ్యూనిస్టులు తెచ్చిన భూసంస్కరణల చట్టం కూడా దీనిని ఆపలేకపోయింది.
దిగుమతి వ్యవసాయ కూలీలు, మామూలు వ్యవసాయ కూలీలతో సమానం కాలేకపోవడం అటుంచి, వీరు రెండు రకాల బానిసత్వానికి గురైపోయారు. ఒక బానిసత్వం పూర్వం నుంచీ కొనసాగుతున్నది కాగా రెండవది వలసలవారు తెచ్చినది.
ఈ బంజరు భూములలో నుంచే, ఒక గిరిజన యువతి తన లక్ష్య సాధనకి బాటలు వేసుకున్నది. ఆమె పేరు జాను. శతాబ్దాల మౌనం ఆమె కంఠంలో గూడుకట్టుకుని వున్నది. స్కూలుకు వెళ్లినప్పుడే ఇంటిపేరు చెప్పే అవసరం వస్తుంది. జాను అసలు స్కూలుకే వెళ్లలేదు. రిజిస్టర్లు నింపడానికి మాత్రమే అక్షరాస్యత శిక్షకురాలిగా చెక్కోట్‌లో పనిచేసిన ఒకామె జాను పేరు ముందు చెక్కోట్ కరియన్ అనే ఇంటిపేరును తగిలించింది. ఆవిధంగా ఆమె సి.కె. జానుగా కేరళ ప్రధాన స్రవంతిలో తన స్థానాన్ని ఆక్రమించింది.
.... ....
మా ప్రాంతంలో ఎవరూ పాఠశాలకి పోయి చదువుకోవడం వినలేదు. మమ్మల్ని చేర్పించడానికి కూడా ఎవరూ రాలేదు. ఎవరైనా కొత్తవాళ్లు మా ప్రాంతానికి వస్తే, మేం అడవిలోకి పారిపోయేవాళ్లం. అడవి గురించి మాకు తెలిసినట్లు ఎవరికీ తెలీదు. అడవి మా కన్నతల్లి. అంతకన్నా కూడా ఎక్కువే. ఎందుకంటే ఆమె మమ్మల్నెప్పుడూ విడిచిపెట్టదు. ఆరోజుల్లో మేం ఒంటికి ఒకే ఒక్క గుడ్డముక్క (చేలా) చుట్టుకునేవాళ్లం.
ఇంట్లో మేం అయిదుగురం పిల్లలం. మా నాన్న పేరు కరియన్. అమ్మ పేరు వెళ్లాచి. మా నాన్న తరువాత పెళ్లి చేసుకున్నావిడ పేరు కొళుంబి. నాకు రెండేళ్లప్పుడు మా నాన్న మమ్మల్ని విడిచి వెళ్లిపోయాడు. మాకోసం మా అమ్మ చాలా కష్టపడవలసి వచ్చేది.
హిందువులకు మల్లే మాకు దేవుళ్లూ, దేవతలూ లేరు. క్యాలెండర్ బొమ్మల్లో లాగ తెల్లగా పుష్టిగా వుండే దేవుళ్ల గురించి మేం ఎప్పుడూ వినలేదు. త్రిశిలేరిలో మా గుడిసె ముందు ఒక పెద్ద చెట్టుండేది. దాని కింద ఒక రాయి వుండేది. మేం ఆ రాయిని కొలిచేవాళ్లం. మా పూర్వీకులంతా అక్కడే వున్నారని మా నమ్మకం.... ....
.... జాను చెప్పగా భాస్కరన్ మళయాళంలో రాసిన కథనానికి ఆంగ్లానువాదం ఎన్. రవిశంకర్. ...
తన బాల్యం గురించి, అడవిలో జీవితం గురించి, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా తనలో కలిగిన రాజకీయ చైతన్యం గురించి, క్రమంగా పార్టీపై ఆమెకు గల భ్రమలు తొలగిపోవడం గురించి, పార్టీ నుంచి వైదొలగడం గురించి, పార్టీ గిరిజనుల్ని వంచించడం పట్ల ఆమెకు కలిగిన ఆవేదన గురించి, ఎంతో ఆర్తితో, నిజాయితీతో నిష్కపటంగా ఆమె చెప్పిన కథనం యిది. ఆమె అభిప్రాయాలకూ, నమ్మకాలకూ, మొక్కవోని ధైర్య సాహసాలకూ దర్పణం ఈ అసంపూర్తి ఆత్మకథ.
అడవి తల్లి
సి.కె.జాను
తెలుగు అనువాదం : పి. సత్యవతి
"అసంపూర్తి" ఆత్మకథ అంటే?
ReplyDeleteసుజాత గారూ
ReplyDeleteఇది అసంపూర్తి ఆత్మకథే. ఎందుకంటే ఆదివాసీల భూపోరాటం
ఉధృతంగా సాగుతున్న సమయంలో జాను దీనిని రాశారు.
అప్పటికి ఆమె వయసు మూడుపదులే.
రాజకీయంగా చూస్తే అది చాలా చిన్నవయసే కదా.
అందుకే తన ఆత్మకథను భాగాలుగా విభజించవలసి వచ్చింది.