Friday, August 1, 2008

రేపటి కల ...బ్లాక్‌ బాయ్‌...రిచర్డ్‌ రైట్‌


రేపటి కల

...బ్లాక్‌ బాయ్‌...

రిచర్డ్‌ రైట్‌

ఇరవైయవ శతాబ్దపు ప్రథమార్థంలో అమెరికాలోని నల్లజాతి ప్రజల జీవన పరిస్థితుల్ని రిచర్డ్‌ రైట్‌ యీ రచనలో చిత్రించాడు. ఇది ఆయన ఆత్మకథ బ్లాక్‌ బాయ్‌ కి సంక్షిప్తానువాదం.

రిచర్డ్‌ రైట్‌ 1908లో మిసిసిపీ ప్రాంతపు రాక్సీలో పుట్టాడు. చిన్నతనంలోనే తండ్రికి దూరమవటమూ, తల్లి తీవ్రమైన ఆనారోగ్యాం పాలవటమూ రైట్‌ భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చాయి. నిరంతరం వెంటాడే ఆకలీ, అవమానాలూ, అభద్రతా ఆయన జీవితాన్ని ఆటుపోట్లకు గురిచేశాయి. ఈ సమస్యలు రైట్‌వి మాత్రమే కావు - దక్షిణ అమెరికాలోని నల్లజాతి ప్రజలందరివీనూ. తనతోటి యువకులంతా దొంగలుగా, నేరస్థులుగా, వ్యసనపరులుగా మారుతున్న పరిస్థితుల్లో తనను తాను నిలబెట్టుకోవటానికి సాహిత్యం మీదున్న అభిరుచి ఆయనకొక ఆధారమైంది. దాన్ని జీవితాంతమూ నిలుపుకుంటూ, తన అక్షరాలను పీడితులచేతి ఆయుధాలుగా మలచటం రిచర్డ్‌ రైట్‌ ప్రత్యేకత. ఆయనకా దృక్పథాన్నిచ్చినవి మార్క్సిస్టు సిద్ధాంతమూ, కమ్యూనిస్టుపార్టీ సాహచర్యమూ.

1927లో రిచర్డ్‌ రైట్‌, తను పుట్టిపెరిగిన దక్షణాదినుంచి ఉత్తర ప్రాంతానికి వెళ్లిపోయాడు. ఇది ఆయన చిరకాల స్వప్నం. దాన్ని నిజం చేసుకునేందుకు పస్తులున్నాడు. దొంగతనాలు చేశాడు, అబద్ధాలాడాడు. స్వేచ్ఛగా, నిర్భయంగా జీవిచాలన్న కాంక్ష ఆయనతో యివన్నీ చేయించింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తను ఊహించినంత ప్రజాస్వామిక పరిస్థితులు లేవని చికాగోలో జీవితం మొదలుపెట్టాకే అర్థమయింది.

జాన్‌ రీడ్‌ క్లబ్బులో సభ్యత్వమూ, వామపక్ష సాహిత్య అధ్యయనమూ కొత్త దృక్పథాన్నిచ్చాయి. ఒక వ్యక్తిగా తను కోరుకుంటున్న విముక్తి, నల్లజాతి ప్రజలందరి విముక్తితోనూ, మరింత విస్తృతార్థంలో - తెల్లజాతి పేదలతో సహా, పీడితులందరి విముక్తితోనూ ముడిపడి వుందన్న అవగాహన ఏర్పడింది. ఐతే, అమెరికన్‌ నాగరికతలోని అంతరాలూ, అవలక్షణాలూ ఆ దేశంలోని కమ్యూనిస్టు పార్టీని కూడా ఆక్రమించటాన్ని చూసి రైట్‌ దిగ్బ్రాంతిచెందాడు. నల్లజాతి కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ స్వతంత్ర వ్యక్తిత్వమూ, సృజనాత్మకతా కొరవతున్నాయని ఆందోళన పడ్డాడు.

ఈ రచనలో రిచర్డ్‌ రైట్‌ కమ్యూనిస్టుల మీద చేసిన విమర్శలు నిర్దిష్టంగా 1930ల లోని అమెరికన్‌ కమ్యూనిస్టుపార్టీకి మాత్రమే వర్తిస్తాయి. కానీ, మార్క్సిస్టు మూల సూత్రాల ప్రత్యేక అన్వయం మీదా, పార్టీకి - ప్రజా సంఘాలకూ వుండాల్సిన సంబంధం మీదా ఇలాంటి చర్చలు రైట్‌కు ముందూ, వెనకా కూడా ఎన్నోసార్లు జరిగినవే. ఆయన తన విమర్శల్లో ఎక్కడా సంయమనాన్నీ, బాధ్యతనూ కోల్పోలేదు. తీవ్రమైన నిర్బంధ పరిస్థితుల్లో వున్న సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీ అమలు చేసిన ఎత్తుగడల్ని ఆ ఇబ్బందులు లేని అమెరికన్‌ కమ్యూనిస్టు పార్టీ మక్కికి మక్కిగా అనుకరిస్తోందని రైట్‌ ఎత్తి చూపాడు. తద్వారా ప్రజా సంఘాల మీదా, కింది స్థాయి కార్యకర్తల మీదా పార్టీ నాయకులు పెత్తనం చేస్తున్నారని విమర్శించాడు. ఈ విమర్శల ఫలితంగా ఆయన మీద విప్లవ ద్రోహిగా ముద్ర పడింది. పార్టీ నిర్మాణం నుండి బయటికి పోవాల్సి వచ్చినా తనకూ, తన నల్లజాతి ప్రజలకూ విముక్తినివ్వగలిగేది మార్క్సిజమేనన్న దృఢ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే రిచర్డ్‌ రైట్‌ ఈ రచనను ముగించాడు.

బ్లాక్‌ బాయ్‌ పేరుతో ఇప్పుడు మనకు దొరుకుతున్న ఈ ఆత్మకథకు రచయిత మొదట పెట్టిన పేరు అమెరికన్‌ హంగర్‌. అందులో మళ్లీ రెండు విభాగాలున్నాయి. దక్షిణాదిలో గడిపిన జీవితాన్ని చిత్రించిన భాగం సదరన్‌ నైట్‌. చికాలో లోని అనుభవాలను వర్ణించిన విభాగం ది హారర్‌ అండ్‌ ది గ్లోరీ. 1945లో హార్పర్‌ బ్రదర్స్‌ అనే ప్రచురణ సంస్థ ఇందులోని మొదటి భాగాన్ని బ్లాక్‌ బాయ్‌ పేరిట ప్రచురించింది. రెండవ భాగం 1977లో హార్పర్‌అండ్‌కో సంస్థ ద్వారా అమెరికన్‌ హంగర్‌ పేరుతో ప్రచురితమయింది. ఆ తర్వాత 1991లో లైబ్రరీ ఆఫ్‌ అమెరికా, 1993లో హార్పర్‌ పెరెనియల్‌లు రిచర్డ్‌ రైట్‌ అత్మకథ మొత్తాన్ని బ్లాక్‌ బాయ్‌ గా ప్రచురించాయి.

మూలంలో ఈ పుస్తకం దాదాపు 400 పేజీలుంది. ప్రథాన కథకు అంతగా అవసరం కాని కొన్ని భాగాలనూ, సుదీర్ఘమైన కొన్ని వర్ణనలనూ సంక్షిప్తీకరించి హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఈ పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చింది.

1931లో ఓ నీగ్రో పత్రికలో రాసిన సూపర్‌స్టిషన్‌ అనే కథతో రిచర్డ్‌ రైట్‌ రచనా వ్యాసంగం మొదలైంది. కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తూ వుండిన న్యూ మాసెస్‌, ఇంటర్నేషనల్‌ లిటరేచర్‌ పత్రికల్లో ఎన్నో కవితలూ, వ్యాసాలూ రాశాడు. పార్టీ పత్రిక డైలీ వర్కర్‌ కు ఉపసంపాదకుడిగానూ, లీగ్‌ ఆఫ్‌ అమెరికన్‌ రైటర్స్‌ సంస్థ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశాడు. నల్లజాతి ప్రజల ప్రత్యేక సమస్యల మీదా, ప్రజా ఉద్యమాల మీదా పెరుగుతున్న ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు న్యూ ఛాలెంజ్‌ అనే పత్రికను కొంతకాలం నిర్వహించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రమేయానికి నిరసనగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన అమెరికన్‌ పీస్‌ మొబిలైజేషన్‌ అనే సంఘానికి ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించాడు.

1940లో రాసిన నేటివ్‌ సన్‌ నవలను నల్లజాతి ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఆ నవల మూడు వారాల్లో 2,15,000 కాపీలు అమ్ముడై సంచలనం సృష్టించింది. అమెరికన్‌ పౌర సమాజంలోనూ, న్యాయ వ్యవస్థలోనూ, పాతుకుపోయిన వర్ణ వివక్షను తీవ్రంగా విమర్శించిన ఈ నవలను అ లబామా, బర్మింగ్‌ హామ్‌లలో నిషేధించారు. ట్వెల్వ్‌ మిలియన్‌ బ్లాక్‌ వాయిసెస్‌ అనేె రచన వర్ణ విద్వేషాలను రెచ్చ గొడుతోందని కేసు పెట్టారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం నుండి బయటకు వచ్చాక కూడా ఎంతోకాలం వరకూ ఆయన మీద ఎఫ్‌బిఐ వేధింపులు కొనసాగుతూనే వచ్చాయి. రైట్‌ రచనలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ఎన్నో పురస్కారాలను పొందాయి.

రిచర్డ్‌ రైట్‌ రచనలన్నిటిలోనూ ఆయన ప్రత్యక్షానుభవాలూ, అద్భుతమైన సాహితీ శిల్పమూ కలగలిసి వుంటాయి. తన కాలంలోని నల్లజాతి అమెరికన్ల సమస్యలనూ, పోరాటాలనూ అక్షరబద్ధం చెయ్యటానికి తన జీవితాన్నీ, సృజన శక్తులనూ వెచ్చించిన రైట్‌ 1960లో మరణించాడు.

అమెరికన్‌ సమాజాన్ని మొత్తంగా మానవీకరించే ఒక విముక్తి మార్గం దొరికితేతప్ప తనకూ, తనజాతి ప్రజలకూ విముక్తి లభించదని రైట్‌ గాఢంగా నమ్మాడు. అందుకోసం ఆయన సాగించిన అన్వేషణే ఈ ఆత్మకథగా రూపుదిద్దుకుంది.

కాత్యాయని అనువాదకురాలగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలు, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. చూపు పత్రిక సంపాదకురాలుగా వ్యవహరిస్తున్నారు.


రేపటి కల

ఆంగ్ల మూలం : బ్లాక్‌ బాయ్‌

రచన : రిచర్డ్‌ రైట్‌

తెలుగు అనువాదం : కాత్యాయని

180 పేజీలు వెల: రూ.50

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌