తిరగబడ్డ తెలంగాణ
దొరలను దించాం - నిజాంను కూల్చాం
తెలంగాణ పోరు
తెలంగాణ సాయుధ పోరాటాన్ని విభిన్నమైన దృక్కోణంలో విశ్లేషించే పరిశోధనాత్మక రచన ... తిరగబడ్డ తెలంగాణ. భూస్వాముల, దొరల, నిజాం పాలకుల దోపిడీకి గురయిన సాధారణ ప్రజలు ఆ అణచివేతను ఎంతో కాలం సహించలేకపోయారు. బాంచెన్, కాల్మొక్త అని పడున్నవారే ఆ అసమానతలపై తిరగబడ్డారు. ఆ పీడిత ప్రజల చైతన్యాన్ని ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమక్రమానికి ఉపయోగించుకున్నాయి. కులాలు, వర్గాలు, వృత్తుల వారీగా ప్రజల చైతన్యక్రమాన్ని పేర్కొంటూ, అట్టడుగు వర్గాల పోరాట తీరును ఇందులో విశ్లేషించారు రచయిత. అగెనెస్ట్ దొర అండ్ నిజాం, పీపుల్స్ మూమెంట్ ఇన్ తెలంగాణ పేరుతో ఇనుకొండ తిరుమలి రాసిన పుస్తకానికి తెలుగు అనువాదమిది.
- వెంకట్ (ఈనాడు ఆదివారం 3 ఆగస్ట్ 2008)
దొరలకు - నిజాంకు వ్యతిరేకంగా:
భారతదేశంలో సాగిన ప్రజోద్యమాలన్నింటిలోనూ తెలంగాణ ఉద్యమం ఎంతో విలక్షణమైనది. జాతీయోద్యమంతో ఎలాంటి సంబంధం లేకుండా వర్గ భాగస్వామ్య దృష్ట్యా, పోరాట రూపం రీత్యా ఇది విభిన్నమైన ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకుంది. ఈ పోరాటంలోని ప్రత్యేకత ఏమిటంటే ఉద్యమకారులు దుర్మార్గమైన దొరల వ్యవస్థను సమూలంగా పెకిలించివేయాలని నిర్ణయించుకోవడం.
చాలామంది అభివర్ణిస్తున్నట్టు ఈ పోరాటం కేవలం భూమికోసమో, భుక్తికోసమో సాగింది కాదు. ఇది దోపిడీ నీతికి, దొరల పెత్తనానికి, వారి సంస్కృతికి, సామాజిక విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. దొరల రాజ్యం స్థానంలో ప్రజారాజ్యాన్ని స్థాపించేందుకు సాగిన పోరాటం. ఉద్యమ ఆవిర్భావం వెనుక ఉన్న చారిత్రక, సామాజిక కారణాలను పరిశోధకుడు ఆసక్తికరంగా వివరించారు.
పందొమ్మిదో శతాబ్ది చివర్లో ప్రవేశపెట్టిన నూతన భూ రెవెన్యూ విధానాలు ఈ ప్రాంతంలో వ్యవస్థీకృత మార్పులను తీసుకొచ్చాయి. అవే వ్యవసాయిక గ్రామీణ సమాజంలో తీవ్రమైన ఘర్షణలకు నాంది పలికాయి. వీటి ఫలితంగా పుట్టుకొచ్చిన కొత్త భూస్వాములు దొరలుగా అవతారమెత్తి భూమి, శ్రమ విషయంలో స్వేచ్ఛా మార్కెట్ అనేవి లేకుండా అడ్డుపడ్డారు. తమకు నిరంతర చాకిరి అందుబాటులో వుండే విధంగా శ్రమదోపిడీకి పాల్పడ్డారు. కులం ఆధారంగా అధికార హెచ్చుతగ్గులను నిర్ణయించి ఆర్థిక వ్యవస్థనూ, సమాజాన్నీ, ప్రజా జీవితాన్నీ నియంత్రించేవారు. సాంస్కృతిక పెత్తనాన్ని చెలాయించేవారు. వారు ఈ కొత్త పెత్తనానికి, సంస్కృతికి ప్రతీకలుగా నిలవడమేకాకుండా గ్రామాల్లో నిజాం అధికార వ్యవస్థకు కొమ్ముకాసేవారు. అందుకే ప్రజలు ఉద్యమ సమయంలో దొరలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిదానిమీద అంటే భూమి, శ్రమ, మార్కెట్లు, దుక్కిదున్నే పశువులు, గ్రామీణ నీటి వనరలు, బంజరు భూములు, ఊరుమ్మడి స్థలాలు, చెట్లు చేమలు, స్త్రీలు, పిల్లలు అందరి మీదా, అన్నింటి మీదా దొరల పెత్తనం పెరగడమే 1940లనాటి ఉద్యమాన్ని ప్రేరేపించింది.
ఉదార జాతీయ వాదులు 1930లో స్థాపించుకున్న ఆంధ్రమహాసభ రాడికల్ వ్యవసాయిక కార్యక్రమాల ఫలితంగా 1942 నాటికి వామపక్ష వేదికగా మారిపోయింది. 1944 నాటికి కమ్యూనిస్టులు నిర్వహణపరంగా దానిని తమ చేతుల్లోకి తీసుకుని సంఘాల పేరిట ఆంధ్ర మహాసభ శాఖలను గ్రామ గ్రామానికి విస్తరించారు. దొరలు, ప్రభుత్వాధికారులు ప్రజల మీద సాగిస్తున్న దురాగతాలను ఖండిస్తూ రాజకీయ సభల్లో విరివిగా ఉపన్యాసాలిచ్చారు. ప్రజారాజ్య స్థాపన కోసం భూస్వాములకు వ్యతిరేకంగా సాగే తమ పోరాట సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
పోరాటంలో రైతుల పాత్ర అత్యంత కీలకమైనది. 1939లో టెనెన్సీ కమిటీని నియమించిన పిదప భూస్వాములు పెద్ద ఎత్తున మఖ్తా వ్యవసాయదార్లను పొలాల్లోంచి వెళ్లగొట్టడంతో ఒక్కసారిగా రైతు పోరాటాలు పెల్లుబికాయి. పోరాటంలో రైతుల భాగస్వామ్యానికి కమ్యూనిస్టులు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజా ఉద్యమం గ్రామాల్లో వేళ్లూనుకొనడంతో భూస్వాములు తమ పెత్తనాన్ని, స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు రజాకార్లతో చేతులు కలిపారు. ప్రజల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వ బలగాలు, రజాకార్లు ఒక్కటయ్యారు. గ్రామాల మీద నిరంతర దాడులు నిర్వహించేందుకు వాళ్లు శిబిరాలను ఏర్పాటుచేసుకున్నారు. రజాకార్ల దాడులతో ప్రజలు మరింతగా రాటుదేలారు. వారిలో ఐక్యత బలపడింది. సంఘ రాజ్యం కోసం పోరాడేవాళ్లు గ్రామీణ పోరాటాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు గ్రామీణ దళాలను, ప్రాంతీయ దళాలను ఏర్పాటు చేశారు. ఆ పోరాటం దుర్మార్గమైన దొరల పెత్తనాన్ని/ నిజాం రాజ్యాన్ని కూల్చే రాజకీయ పోరాటంగా పరిణితి చెందింది. పోరాట కాలంలో ఏర్పడ్డ అపూర్వ ఐక్యత ప్రధాన శత్రువు లొంగి పోయిన తర్వాత బలహీనపడటం మొదలయింది. సంపన్న రైతాంగ వర్గాలు గ్రామీణ కమిటీలపై పట్టు బిగించాయి. పోరాటాన్ని తమకు అనుకూలంగా, తమ ప్రయోజనాలనే తీర్చేలా మలిచేందుకు వాళ్లు ప్రయత్నించారు. అ లా వాళ్లు కమ్యూనిస్టుల భూపంపిణీ కార్యక్రమాన్ని హైజాక్ చేసి, పార్టీ నాయకత్వ స్థానాల్ని ఆక్రమించుకుని అసలు ఉద్యమ లక్ష్యాలను నీరుగార్చారు.
తెలంగాణా ప్రజా ఉద్యమంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే - ఆ కాలంలో అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ మతపరమైన ఘర్షణలు తీవ్రంగా జరుగుతున్నప్పటికీ ఉద్యమం ఏమాత్రం మతపర ప్రభావానికి గురికాకపోవడం. ఉద్యమానికి సంబంధించినంత వరకు మరో కీలకమైన అంశం కులాలు - కులాల ఆధునీకరణ. అగ్రకులాల నుండి నాయకులు ఎదిగిన తీరును ఒకవైపు, ఇతర కులస్తులలో కుల చైతన్యాన్ని ఆధునీకరించుకోకపోవడం వల్ల కింది కులాలకు చెందిన వారు ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ తమ నాయకులను సృష్టించుకోలేకపోయారని తెలిపిన విధానం బాగుంది.
తెలంగాణా ప్రజా పోరాటంపై వచ్చిన నవలలు, కమ్యూనిస్టుల రాతలు కొంత పాక్షిక దృష్టితో, అతిశయోక్తులతో వచ్చాయని తెలిపిన రచయిత - చారిత్రక దృష్టితో, తగిన ఆధారాలో రూపొందించిన ఈ పరిశోధనా గ్రంథాన్ని ప్రామాణికంగా తీర్చిదిద్దడంలో చేసిన కృషిని అభినందించకుండా వుండలేం.
- కె.పి అశోక్ కుమార్ (వార్త దినపత్రిక 1 జూన్ 2008)
తిరగబడ్డ తెలంగాణ: దొరలను దించాం - నిజాంను కూల్చాం
ఆంగ్లమూలం: ఎగెనెస్ట్ దొర అండ్ నిజాం: పీపుల్స్ మూమెంట్ ఇన్ తెలంగాణ
రచన : ఇనుకొండ తిరుమలి
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
No comments:
Post a Comment